అక్షరాల పడవ మీద ఊరేగే ఆకాశం ఈ ‘కవిత్వం’ గ్రూప్!

-భవాని ఫణి

~

 

bhavani-phani.అక్కడ ప్రతీ భావావేశం సెలయేటి నీటిలా గలగలా ప్రవహిస్తుంది . అక్కడ ప్రతీ ఆలోచనా రెక్కలు విప్పార్చుకుని స్వేచ్ఛగా రివ్వు రివ్వున ఎగురుతుంది . అక్కడ సర్రియలిజం  నిజజీవితంలోకి సర్రున దూసుకొస్తుంది. అక్కడ పదాల్లోంచి సజీవ పదార్థం పుట్టుకొస్తుంది . రాశి పోసిన మంచి ముత్యాల వంటి, హేమంత తుషారపు తునకల వంటి విలువైన, స్వచ్ఛమైన కవిత్వం అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుంటుంది . అదే కవిత్వం గ్రూప్.
‘కవిత్వం’ అనే పేరుతో, ‘కవిత..కవిత..కవిత’ అనే సింపుల్ ట్యాగ్ లైన్ తో  ఎటువంటి భేషజాలూ లేని హుందాతనంతో, ఏడాది క్రితం ‘తిలక్ స్వీ’ అనే కవిత్వ ప్రేమికుడి ద్వారా  ఈ గ్రూప్, ఫేస్బుక్ లో ప్రాణం పోసుకుంది . ఆ యువకుడు ఒక మంచి ఆశయంతో అప్పట్లో ఏర్పరిచిన ఈ డొంక దారి, అనుభవజ్ఞులైన, రసజ్ఞులైన అనేకమంది కవుల ప్రోత్సాహంతో, సలహాలతో, సూచనలతో ఇప్పుడు రహదారిగా రూపుదిద్దుకుంది . ఈనాటి నవ యువ కవుల కవిత్వ ప్రయాణానికి అనువైన మార్గమైంది .  రాకెట్లా ఆది నుండీ అత్యంత వేగవంతమైన గమనాన్ని ప్రారంభించిన ఈ గ్రూప్, ఇప్పటికీ అంతే తీవ్రమైన వేగంతో దిగంతాల అంచుల్ని వెతుక్కుంటూ అనంతం వైపుకి సాగిపోతూనే ఉంది . గ్రూప్ లో ఉండే స్నేహపూర్వకమైన ,ఆహ్లాదకరమైన అనుకూల వాతావరణం వల్లనేమో , రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ,హెచ్చార్కె గారు , శ్రీధర్ నామాడి గారు, ఎం ఎస్ నాయుడు గారు,అరణ్య కృష్ణ గారు, కుప్పిలి పద్మ గారు వంటి మహామహులంతా వచ్చి ఇక్కడ తమ తమ కవితల్ని ప్రకటించారు. ప్రకటిస్తున్నారు . ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ యువ కవుల్ని ఉత్సాహపరుస్తున్నారు.
గ్రూప్ అభివృద్ధికి తన భుజాన్ని బోటుగా నిలబెట్టిన గౌతమి (నిశీధి) గారు కూడా అభినందనీయురాలు . ఇంకా గ్రూప్ ని అనుక్షణం గమనిస్తూ , తాము అందివ్వగల సహాయ సహకారాల్ని అందిస్తున్న సహృదయులు మరెందరో ఉన్నారు. వీరందరి నిస్వార్థ సేవకు కారణం, వారికి కవిత్వంపై గల అవ్యాజమైన అనురాగమే. ఇప్పుడు ఈ గ్రూప్, కవిత్వానికి ఒక మెరుగైన వేదికగా మారింది . కొత్తగా రాయడం మొదలుపెట్టిన వారిని ఉత్సాహపరిచే ఉత్ప్రేరకమైంది .కవిత్వం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తీ ఈ గ్రూప్ ని తమదిగా భావించి ఆదరిస్తున్నారు . కవిత్వం గ్రూప్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ మంచి కవిత్వాన్ని అందిస్తున్న  సాయి పద్మ,శారద శివపురపు , మమత కొడిదెల, అన్వీక్ష నీలం, వాణి, ఇండస్ మార్టిన్ , ఛీ ఛీ, సత్య గోపి , మిథిల్, వినీల్ కాంతి కుమార్ , విజయ్ కుమార్ ఎస్వీకె , నరేష్ కుమార్ , సుభాషిణి పోరెడ్డి ,లాస్య ప్రియ , స్వాతి రెడ్డి, సిద్దార్థ కట్టా, నవీన్ కుమార్ , కిరణ్ పాలెపు, రవీందర్ విలాసాగరం….. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందఱో ఇటువంటి యువ కవుల, కవయిత్రుల  కృషి, ప్రతిభ ప్రశంసార్హమైనవి.  .
ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో , కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే దారుల్ని వెతుకుతూ ఎన్నో నవ్య నూతనమైన శీర్షికల్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది ఈ గ్రూప్. అలా మొదలుపెట్టిన “ప్రశ్నలూ-జవాబులూ” శీర్షిక అద్భుతమైన విజయాన్ని సాధించి , పాఠకుల నుండి గొప్ప ఆదరణ పొంది ఎందరికో ఉపయోగకరంగా, మార్గదర్శకంగా నిలిచింది . ఆ శీర్షికని నిర్వహించిన అరణ్య కృష్ణ గారు , హెచ్చార్కె గారు , ఇప్పుడు నిర్వహిస్తున్న నారాయణస్వామి వెంకటయోగి గారు  తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, వారి వారి అపారమైన అనుభవాన్నీ, బోలెడంత ఓర్పునీ చమురుగా చేసి ఈ కవిత్వ మార్గాన కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తున్నారు. ఎన్నో హృదయాల్ని కాంతిభరితం చేస్తున్నారు . మరో కొత్త ప్రయోగం కవితాంత్యాక్షరి కూడా అందరి మనసుల్నీ ఆకట్టుకుంటోంది .అంతేకాక, ఇంచుమించుగా కవిత్వం గ్రూప్ తో పాటుగానే ఊపిరి పోసుకున్న “కవిత్వం పోయెట్రీ పేజ్” కూడా ఇప్పటికే రెండువేలకి పైగా అభిమానుల్ని సంపాదించుకుంది.
మరింతమందికి  కవిత్వ లేఖనంపై ఆసక్తి కలిగించడం , మరికొందరు అనుభవజ్ఞుల సూచనలు ,సలహాలు ఈ కవిత్వ ప్రయాణానికి ఉపయోగపడేలా చెయ్యడం  ద్వారా తెలుగు భాషకీ , కవిత్వానికీ ఎంతో కొంత సేవ చేసే అదృష్టాన్ని పొందాలన్న కోరిక మాత్రమే ఈ ఆర్టికల్ రాయడం వెనకనున్న స్వార్థం.  విజయవంతంగా ఏడాది సమయాన్ని పూర్తి చేసుకుని, మొదటి పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా కవిత్వం గ్రూప్ నీ, గ్రూప్ సభ్యుల్నీ అభినందిస్తూ , కవిత్వానికి మరింత ఆదరణ లభించే విధంగా కృషి చేయమని వారిని సవినయంగా కోరుతూ ఇదిగో కవిత్వం గ్రూప్ లింక్ ఇక్కడ
 
ఆర్టికల్ పూర్తి పాఠం యు ట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ 

మీ మాటలు

 1. విలాసాగరం రవీందర్ says:

  సాహితీ స్రవంతి లో ఫేస్బుక్ వేదిక గా కవిత్వం గ్రూపు ఒక గొప్ప పాత్ర పోషిస్తోంది… కొత్త కవులకు వరం. మంచి వ్యాసం

  • kiran palepu says:

   ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే నేను ఎప్పుడూ ఎదో రాస్తూ చెరిపేస్తూ , మళ్ళీ రాస్తూ చించి పారేసేవాడ్ని
   ఎందుకంటే నేను రాసిన రాతలలో తప్పులు తెలియవు రాసింది బాగుంది అని కితాబు ఇచ్చే వారులేకపోవడం వలన.
   కవిత్వం గ్రూపు లో చేరిన తర్వాత నా రాతలలో నాణ్యత , స్పష్టత , అనేది తెలిసొచ్చింది యువ కవులకు ఇదొక
   చక్కని వేదిక .కాలేజే రోజుల్లో ప్రేమలేఖలు రాసే నేను సమాజానికి ఈ పోయెట్రీ ద్వారా ఎంతోకొంత సేవ చేయాలన్న నా ఆశ ,
   తిలక్ అన్న స్థాపించిన ఈ వేదిక ద్వారా నేరవేరబోతున్నందుకు చాలా థాంక్స్…ఇంకో విషయం ఏమంటే మాలో ఇంత కవితా జ్ఞానం ఉందన్న విషయం కవిత్వం గ్రూపులో చేరినంతవరకు తెలియదు ప్రొఫెషనల్ గా రాయలేకపోయిన మేము రాస్తున్న వాటిలో
   లోపాలను కొన్ని సలహాలను అందిస్తున్న గ్రూపు పెద్దలకు మరొక్క సారి ధన్యవాదములు.
   kiranpalepu

  • నిజమండి ధన్యవాదాలు

  • ధన్యవాదాలు రవీందర్ గారు

 2. బ్రెయిన్ డెడ్ says:

  సారంగ ఓపెన్ చేయగానే కవిత్వం గ్రూప్ అంటూ ఒక ఆర్టికల్ మెరుస్తూ , ఆసాంతం చదివించేలా మురిపించి ఒక వావ్ ఫీలింగ్ . తిలక్ గారు కవిత్వం గ్రూప్ పెడదాం అని చెప్పగానే , అప్పటికే కవిత్వం పేరా నడుస్తున్న పాలిటిక్స్ కి విసిగిపోయి చక్కగా మనసారా కవిత్వం రాసుకోవడం చదువుకోవడం మానేసి మనం కూడా ఆ ఊబిలో దిగడమా హే హతవిధీ వద్దేమో అన్నది నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ . కాని అప్పుడున్న ( అదేమిటో మన తెలుగు తెగులు , మిగిలిన భాషలు నాకు రావు కాబట్టి అదృష్టవశాత్తు అక్కడ కూడా ఇలానే ఉంటుందో లేదో తెలియదు ) ఎప్పుడూ ఉండిపోయే పరిస్థితులు నిజానికి ఒక మంచి పనే చేసాయి అనిపిస్తుంది ఇపుడు కవిత్వం గ్రూప్ ని చూస్తుంటే . కాని రచయితలు దిశానిర్దేశం మానేసి దిక్కులు వెతుక్కుంటూ తిరిగే పని మాత్రం ఇంకో కవికి రాకూడదు ఎప్పటికి అన్న స్టబ్బర్న్ తెగింపు తో ఈ సాగరాన్ని ఎదురు నిలిచినందుకు నిలబడే శక్తి ఇచ్చినందుకు వ్యక్తులకి వాళ్ళ గొప్ప వ్యక్తిత్వాలకి పెద్ద హాగ్ . థాంక్స్ భవాని గారు మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు .

  • మంచి గ్రూప్ ని నిర్వహిస్తున్నందుకు మరోసారి అభినందనలు నిశీధి గారు

 3. మంచి ప్రయత్నం. ముందుకుపదండి. తోడునడుస్తాం

 4. కవిత్వం గ్రూపుకి ముందున్న గ్రూపుల్లో బ్లాక్ దెబ్బలు , భావ ఖండనలు , అహంభావ మిళిత విమర్శలు , సృజన భంగం , ముఖస్తుతి సొంత డబ్బా మొదలగు చాంతాడు బారు సమస్యల వలయాల్లో పడుతూ లేస్తూ మింగలేక కక్కలేక ముక్కుతూ కవితలు రాసే పరిస్తితిని అనుభవించి విసిగి వేసారిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అడ్మిన్స్ తిలక్ అండ్ నిశీధిలకు కూడా అనుభవమే అనుకుంటా ఆన్ లైన్ నిరంకుశత్వం.. ఇంకా ఎందరికో.. వాటన్నిటికీ ముగింపుగా భావ స్వేచ్ఛకే ప్రధాన పీఠం వేస్తూ ప్రారంభమయిన ఓ వేదికే కవిత్వం గ్రూప్..ఆంక్షల స్థానే , స్వేచ్ఛ స్థాయి ఎక్కువైపోయి అంతకు తగ్గ భావ శ్రమను పెంపొందించుకునే దిశగా నేడు గ్రూప్లో వ్రాస్తున్న వారందరూ కలపు జూలును విదుల్చుతున్నారు.. కవిత్వపరంగా ఆశించిన స్వేచ్ఛస్థాయిని అందుకోడమే కాక , అంతకుమించిన ఆదరణ కూడా పొంది ముందుకెళ్తున్నందుకు ఆనందంగా ఉంది.. కంగ్రాట్స్ అడ్మిన్స్ అండ్ మెంబర్స్..గ్రూప్ గురించి ఇంత చక్కగా తమ ఉద్దేశాన్ని,అభిమానాన్ని తెలియజేసిన భవానీ గారికి ధన్యవాదాలు.

 5. lasya priya says:

  కవిత్వం గ్రూప్ అప్పుడే కలం పట్టిన వాళ్లందరికి (నాలాంటి) ఒక ఫ్లాట్ పామ్ కల్పిస్తోంది ..అక్కడ కవిత్వం ఏరులై పొంగి ప్రవహిస్తోంది . కవిత్వం అక్కడ తనకు తానే మాట్లాడుకుంటుంది. … .సజీవంగా నిలుస్తుంది. ఎంతో సృజనాత్మకమైన కవితలు కదిలిస్తాయి మనని. అసలు రాస్తున్నామనే స్పృహ ఉండదు… కొత్తవాళ్ళకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. స్వేచ్చ ఉంటుంది . పెద్దల సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చక్కని గ్రూప్ ని అందించిన గౌతమీ గారికి తిలక్ గారికి అభినందనలు..గ్రూప్ గురించి అద్భుతమైన తమ అభిప్రాయాన్ని …అభిమానాన్ని అందించిన భవానీ గారికి నమస్సులు…/\…

 6. ప్రతివారం సారంగ వచ్చే ఉదయం పూట అన్ని పేజిల్ని ఒకసారి తిరగేసే నేను ఇవాళ ఈ పేజిని మర్చిపోవడం నా మీద నాకే కోపంగా ఉంది కాస్త. కవిత్వం గ్రూప్‌లో ఎప్పటికపుడు వెళ్తూ వస్తూండడం చేసినా ఇలా పుట్టినరోజుని గుర్తుపెట్టుకోలేదు. ఎంతో ఉత్సాహంగా, ఏదేనీ అడ్డంకి వచ్చినా ఎంతో నేర్పుతో, కవిత్వం రాసే అందరికి స్వేఛ్ఛనిచ్చే అడ్మిన్స్ వుండడం ఈ గ్రూప్ యొక్క అతిపెద్ద విజయం. తిలక్ అన్నయ్య, గౌతమి గారు అడ్మిన్లుగా చక్కగా నడిపిస్తున్నారు. అలాగే గ్రూప్‌లో ఎప్పటికపుడు తమ అనుభవాన్నిచ్చి తమని తాము ఎంతో ప్రేమగా వర్షించుకుంటున్న కవులెందరో వున్నారు. వయసులో, కవిత్వీకరించడంలోను పెద్దవాళ్ళైన అందరికి ధన్యవాదలు. భవాణి గారు ఈ మీ వ్యాసంతో ఇవాళ్టి రోజు ఎంతో ఆనందంగా వుంది.

 7. mithil kumar says:

  బహుశ ఒకే పోస్ట్ మళ్ళి మళ్ళి చదువుకోవడం ఈ మద్య కాలంలో ఇదేనేమో …. కాసింత కొత్త సంతోషాన్ని చవిచుస్తున్న భావన ….ఈ కవిత్వపు విత్తుని నాటిన తిలక్ అన్నకి ,నీరు పోస్తున్న నిశి గారికి అభినందనలు ….ఈ ఆర్టికల్ అందించిన భవాని ఫణి గారికి కృతజ్ఞతలు

 8. Aranya Krishna says:

  చాలా బాగుంది. అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చ, ఆసక్తికరమైన శీర్షికల నిర్వహణ, కవులకు అవకాశం ఇస్తున్నట్లు కాకుండా వారిని ఓనప్ చేసుకుంటూ వ్యవహరించే తీరు… కవిత్వం గ్రూపు బలాలు. ఈ బలాల్ని మరింత పటిష్ఠం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తిలక్, నిశీలకు అభినందనలు.

 9. తిలక్ బొమ్మరాజు says:

  చాలా సంతోషంగా వుంది మీ అందరి స్పందనా చూస్తుంటే.మీ అందరి సహకారం యెప్పుడు యిలానే వుండాలని కోరుకుంటున్నాను .మంచి ఆర్టికల్ రాసిన భవాని ఫణి గారికి ధన్యవాదములు/\

 10. Indus Martin says:

  కవిత్వం – అడ్డొచ్చిన కంచెల్ని తోసుకుంటూ వెలుగు దిక్కుగా ఎదిగే దేవదారు మొక్కల వనం . బూజునుచీల్చుకుంటూ భూత్ బంగ్లాలోకి కాగడాని మోసుకొస్తున్న ఒక చిట్టి చేయి. పలకమీదిహద్దుల్ని వుమ్మేసి చెరిపేస్తున్న బడిపిల్లల గుంపు! జయహో శ్వేచ్చా కవిత్వం !

 11. చక్కనైన సాహితీ సమూహానికి చిక్కని ప్రశంస మీ వ్యాసం.

 12. సాహిత్య సాగర్ says:

  డొక్కలో డోలు వాయిoచుకుంటూ ,పక్కలోకి పూలు తెచ్చిన గరీబ్ ని
  లెక్కలు ఎక్కాలు అడిగితే .. పాపం మనసు చిన్నబుచ్చు కోదు

  కొలతలు .. వేలితులు కాక … కొంగోత్తదనాన్ని కలగలిపి

  విమర్సనాస్త్రాలను విరిచి వినూతనత్వాన్ని మలిచే
  సమర్ధవంతమైన వేదిక కావలి

  ఓ పురుషుడా నువ్వు మారావా
  ఓ స్త్రీ నువ్వు మార్చావా
  అంటూ వివక్షను రెచ్చగొట్టే వ్యాసాలకు చోటివ్వకుండా
  మరో మార్గాన్ని అన్వేషించడమే నిజమైన మార్పు
  ….
  నమ్మకం , ధైర్యం , ప్రోత్సాహం , ప్రేమ …దొరుకుతాయనీ
  మీ పడవ నేను కుడా ఎక్కుతున్న …
  చిల్లులు పొడుచుకుంటూ … నడిమధ్యలో ముంచెయద్దు
  నేను స్వేచాజీవిని రెక్కలు కట్టుకొని ఎగిరిపోతా
  ….
  అందరికి నమస్కారం నాపేరు సాహిత్య సాగర్

  మీ మజిలీలో తోటి ప్రయానికుడిని

 13. Indus Martin says:

  వెల్కమ్ అబోర్డ్ సాహిత్య సాగర్

 14. Kuppili Padma says:

  అనేక భావోద్వేగాలు కలసి ప్రయాణిస్తున్న వొక కవిత్వపు హృదయాలకి సారంగా అందించిన యీ పుష్పగుచ్ఛంకి కృతజ్ఞతలు. యీ కవిత్వ సామూహానికి వొక యేడాది నిండిందని ఆ పసితనాన్ని పండగ జరుపుకోవాలని గుర్తుంచుకొని యీ బహుమతిని యిచ్చిన భవానిఫణి గారికి కృతజ్ఞతలు. కవిత్వం గ్రూప్ లోని ప్రతివొక్కరికి అభినందనలు. పాఠకులకి అనేక కృతజ్ఞతలు. అందరిని ఆత్మీయంగా చూసుకొనే నిశీ గారికి ప్రేమైక నమస్సులు. మౌనం మాటాడుతున్నట్టుండే తిలక్ గారు మీకు అభినదనలు. యీ గ్రూప్ గురించి నేను చదివిన మొదటి ఆర్టికల్ యిది. యీ గ్రూప్ లో అప్పుడప్పుడు కవిత్వం రాసే అవకాశం యిచ్చిన నిశీధిగారికి, తిలక్ గారికి , రాసిన వెంటనే తమతమ అభిప్రాయాలు పంచుకునే కవులకి, పాఠకులకి అనేక కృతజ్ఞతలు. కొత్తవారిని అభినందించే చక్కని విలువని పాటిస్తున్న సారంగా యెడిటర్స్ కి పేరుపేరునా కృతజ్ఞతలు.

 15. కవిత్వం గ్రూప్ కు అభినందనలు,
  .. ముఖ్యంగా ఎచ్ అర్ కె గారి నెల, నారయణ స్వామి గారి నే నుండి చాలా విషయాలు తెలుసుకున్నాము వారికి ధన్య వాదాలు.

 16. కవిత్వమెంత బాగంటుంది . చ….కాపోతే ఒక్కొక్కరు ఇద్దరేసి, ముగ్గురేసి ఐ డీ లేసుకుని కొట్లాడేసుకుంటారేంటో ఈ గ్రూపులో . తప్పౌ మాట్లాడితే క్షమించండీ. కవి సంగమం కూడా మంచి కవిత్వముంది.

  ఇంకా మంచి కవిత్వం రాయండి. మా లాంటి కొత్త వాల్లను సంతొష పెట్టండి. సాహిత్యమంటే ఉత్సాహం వస్తుంది.

మీ మాటలు

*