గమనమే గమ్యం – 22

 

olgaఆంధ్రప్రాంత నాయకుల సమావేశం గంభీరంగా జరుగుతోంది.

‘‘యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ప్రజా యుద్ధమని బలపరుస్తున్నాం . కానీ యుద్ధం అంటే నాశనం. నిర్మాణం కాదు. ఏదో ఒక నిర్మాణం చెయ్యకుండా ప్రజా నాశనాన్ని పట్టుకు కూచోటం సరికాదు. రైతులు నీళ్ళు లేక పంటలు పండక చచ్చిపోతున్నారు. కాలవన్నీ పూడిక పట్టిపోయాయి. వాళ్ళకు ఒట్టి ఉపన్యాసాలు తప్ప ఏమీ ఇవ్వలేమా?’’ శారద ఆవేదనగా అన్నది.

‘‘ఏం చెయ్యగలం? బందరు కాలవ పూడిపోయి రైతులకు నీళ్ళందటం లేదు. ప్రభుత్వాన్ని అడిగాం – అడిగితే కూలీలకు దొరకటం లేదు. ఐనా ఇప్పుడది ముఖ్యం కాదు అన్నారు. యుద్ధం రోజుల్లో ఆహారానికి కరువుండకూడదంటారు. పంటల గురించి పట్టించుకోరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యకూడదు గాబట్టి ఆందోళన కూడా చెయ్యం. ఇక నిర్మాణ కార్యక్రమం ఏం చేస్తాం’’ వెంకట్రావు నిస్పృహ గా మాట్లాడాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు . పదినిమిషాలు అలాగే గడిచాయి . రామకృష్ణయ్య మెల్లిగా అయినా ధృడం గా అన్నాడు .

‘‘నిర్మాణమే చేద్దాం. బందరు కాలవ పూడిక మనమే తీస్తే ’’ అందరి కనుబొమ్మలు పైకి లేచాయి శారదది తప్ప.

‘‘అద్భుతం – నిజంగా అద్భుతం. మనం ఆ పని చేద్దాం’’ అంది విప్పారిన ముఖంతో.

‘‘మనమా? ఎలా?’’

‘‘కూలి పనులు చేద్దామా?’’

‘‘మనమంటే ఎవరం? ఇక్కడ కూచున్న పదిహేను మందా?’’

‘‘డాక్టరు గారూ మీరు పార పట్టుకుంటారా? ’’

ప్రశ్నలు , నవ్వులు , వ్యంగ్య బాణాలూ శరపరంపరగా కురిసిన తరువాత శారద అంది.

‘‘అందరం కలిసి చేద్దాం. మనం పదిహేనుమందిమి కాదు. రైతు సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం అందరం కలిస్తే ఎంత సేపు – చెయ్యగలం . ఎంత పొడవుంటుంది పూడిక’’

‘‘బెజవాడ ఆనకట్ట నుంచి యనమలకుదురు దాకా నన్నా తియ్యాలనుకుంటాను. కనీసం నాలుగైదు మైళ్ళుంటుంది.’’ సుబ్బారావు గారికి బందరు కాలవ పుట్టు పూర్వోత్తరాలు బాగా తెలుసు .

‘‘ప్రజా సంఘాలన్నీ పని చేస్తే మరీ అసాధ్యం కాదనుకుంటా’’

‘‘రైతులకు మేలు జరుగుతుందంటే అందరూ వస్తారు ’’

‘‘ప్రభుత్వం చెయ్యాల్సిన పని మనమెందుకు చెయ్యాలి?’’

‘‘ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చెయ్యనిస్తుందా?’’

‘‘యుద్ధం రోజుల్లో ఉత్పత్తిని పెంచే ఏ పనినీ ప్రభుత్వం అడ్డుకోదు. ప్రభుత్వం చెయ్యని పని మనం ప్రజల కోసం చేస్తున్నాం గనుక ప్రజలలో మనమీద సానుభూతి కలుగుతుంది. ప్రజాయుద్ధం అంటున్నామని మనమీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తగ్గుతుంది’’.

‘‘ఒట్టి కబుర్లు కాదు కమ్యూనిస్టులు గట్టిగా పనిచేసి చూపిస్తారనే నమ్మకం కలుగుతుంది’’.

అందరిలో ఏదో తెలియని ఉత్సాహం కమ్ముకుంటోంది. నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రజా సంఘాల బాధ్యులకు ఉత్తర్వులు చేరుతున్నాయి. అందరిలో ఒక సంచలనం.

‘‘బందరు కాలవ పూడిక తీస్తారంట’’ మండుటెండలే మోసుకెళ్తున్నాయి ఆ వార్తను.

యువకులు , యువతులు మాత్రమే రావటం లేదు. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు. కాలవలో వారి స్వేద జలం ప్రవహించి పంటలు పండేలా ఉన్నాయి .

శారద, రామకృష్ణయ్య, మెల్లీ వంటి పెద్ద నాయకులు కూడా తట్టలతో మట్టి మొయ్యటం చూసిన సామాన్యుల ఉత్సాహానికి అంతు లేదు. జన సంద్రం ముందు కాలవ వినయంగా వంగింది. లొంగింది. కుంగింది.

ప్రతిరోజూ పని చేసిన వారికి మధ్యాహ్నం కడుపునిండా భోజనం తప్ప డబ్బేమీ ఇచ్చే పరిస్థితి లేదు.

భోజనానికి కరువు లేదు. పాటలు , నవ్వులు , దు:ఖాలు , దెబ్బలు , గాయాలు అన్నీ మట్టిలోనే –

మహిళా సంఘంలోని ఆడవాళ్ళకు అది అలవాటు లేని పని – ఐనా డాక్టరు గారు చేస్తుంటే మనం చెయ్యలేమా? ఐనా ఈ పని ఎవరిది? మనది. కోటేశ్వరమ్మ, రాజమ్మ పాటలు ఎత్తుకున్నారంటే కృష్ణానదే తుళ్ళి పడేది. అందరి గొంతులూ కలిస్తే ఆకాశం కిందికి దిగాలని చూసేది . ఈ పని చేసేవాళ్ళు చేస్తుంటే చూసేవా ళ్ళు ప్రవాహంలా వచ్చి పోతుండే వాళ్ళు. ఇంతపని స్వచ్ఛందంగా జరగటం వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. శ్రమదానం ఇంత పెద్ద ఎత్తున జరగటమూ చూడలేదు. సమూహంగా, సమిష్టిగా పని చెయ్యటంలో ఎంత ఆనందముంటుందో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నది ఏదో స్వప్నంగా ఉంది వాళ్ళకు. కానీ అది యదార్థం.

రెండు నెలల పాటు వందమంది పనిచేస్తే కాలవ జల ప్రవాహ యోగ్యమైంది. వానలు కురిస్తే చాలు , కృష్ణమ్మ కాస్త నాలుగు బారలు సాగితే చాలు కాలవ నిండుగా ప్రవహిస్తుంది. అవతల పంట పొలాలకు ఈ వార్త చేరి అదునుకు పదునెక్కి నిరీక్షిస్తున్నాయి .

‘‘కమ్యూనిస్టులంటే ఇదా’’ అనుకున్నారు కొందరు.

‘‘కమ్యూనిస్టులంటే ఇది ’’ అనుకున్నారు మరికొందరు.

ఆ రెండు నెలల కాలం ఆ పనిచేసిన వారి జీవితాల్లో మర్చిపోలేనిదయింది. దేశంలో కాలవన్నీ బాగుచేద్దాం. కొత్త కాలువలు తవ్వుదాం. నీటి కొరత లేకుండా చేద్దాం అనిపించింది అందరికీ.

అందరి కోసం పనిచెయ్యటంలోని ఆనందం, గర్వం, త్యాగ భావనతో మనసు నిండి కష్టమన్నదే తెలియలేదు.

‘‘నువ్వు కూడా రావోయ్‌’’ అని అన్నపూర్ణకు కబురంపింది శారద.

‘‘రాలేను. యుద్ధ కాలం లో ప్రబుత్వానికి సహకరించటం నాకు సమ్మతం కాదు. మీరు చేస్తున్న పని మంచిదే. కానీ చేస్తున్న సమయం, సందర్భం మాత్రం మంచివి కావు. నేనెంత మాత్రం ఈ పనిలో కలిసి రాను’’ అని సమాధానం పంపింది అన్నపూర్ణ. శారద నవ్వుకుంది. రైతులకు సహాయం చెయ్యటానికీ, పంట పండించేందుకు సమయానికి నీరివ్వటం కంటే మంచి సమయం ఏముంటుంది? కానీ రాజకీయాలు ఒకే సమయాన్ని ఎట్లా మార్చేస్తాయో గదా అనుకుంది. అన్నపూర్ణ దేశం కోసమే కాలువ తవ్వే పని నుంచి దూరంగా ఉంది. తనూ దేశం కోసమే కాలువ తవ్వే పనిలో మునిగిపోయింది. ఇద్దరం సమాంతర రేఖల్లా ప్రయాణిస్తున్నాం. గమ్యం ఒకటే – దేశ స్వాతంత్య్రం. అక్కడ కలుస్తాం. సమాంతర రేఖలన్నీ కలిసే చోటు దేశ స్వాతంత్రం. అన్నపూర్ణకు కాలువ తవ్వే దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తూ రాసిన న ఉత్తరాల్లో ఈ వాక్యాలు రాసింది శారద.

కృష్ణాజిల్లాలో మొదలైన ఈ పూడిక తీ స పని గోదావరి జిల్లాకూ పాకింది. అక్కడ కార్యకర్తలు బ్యాంకు కాలవ పూడిక తీశారు.

***

olga title

కృష్ణాజిల్లా కాటూరులో మహిళా సంఘం మహాసభ తలపెట్టినప్పటి నుంచీ శారదకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకకుండా ఉంది. కాటూరు కమ్యూనిస్టు గ్రామంగా అప్పటికే ప్రసిద్ధి పొందింది. అక్కడ మహిళా సంఘం సభలు జరిపితే ఎక్కడా ఏ ఆటంకమూ ఉండదు. ఆ ఊరి ప్రజలే కాదు యిరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా సహకరిస్తారు.

శారద, మెల్లీ, సూర్యావతి రాష్ట్ర నాయకులతో కలిసి కార్యక్రమమంతా నిర్ణయిస్తున్నారు. కావలసినవి చెబితే ఏర్పాట్లు చేసే యువ కార్యకర్తలకు లోటు లేదు.

ఆ రోజు శారదకు తమ్ముడు వరసయ్యే లక్ష్మీపతి నుంచి ఫోను వచ్చింది.

‘‘మీ సభలకు సరోజినీ నాయుడ గారిని ఆహ్వానించకూడదూ?’’ అంటూ

‘‘ఎందుకు కూడదోయ్‌ – ఆహ్వానించాలనే ఉంది గానీ ఎలా చెప్పు. ఆవిడ నా కంటే పెద్దావిడ. నువ్వు ఫోన్‌ చేసినట్లు ఆవిడకు ఫోన్‌ చేసి మా సభలకు కాటూరు రండి అని చెప్పలేను గదా! ఆవిడ ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు. వెళ్ళి పిలుద్దామంటే. పోనీ మా తరపున నువ్వు ఆహ్వానించకూడదటోయ్‌ – ఖర్చులన్నీ ఇస్తాం’’.

‘‘కాదక్కా – నువ్వే ఆహ్వానించు. ఆవిడ రేపు రాత్రి విజయవాడలో అరగంట ఆగుతారు. రైలు స్టేషన్ లో – విశాఖ నుండి సికింద్రాబాదు వెళ్తున్నారు. నువ్వు వెళ్ళి కలిసి ఆహ్వానించు. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు హరీన్‌ చెప్పాడట నీ గురించి. చాలా గౌరవంగా మాట్లాడింది నీ గురించి. నువ్వే వెళ్ళి అడిగితే కాదనదు’’.

‘‘మంచి మాట చెప్పావోయ్‌ – ఈ సారి మనింటికి వచ్చినపుడు నీకేం కావాలో అడుగు ఇస్తాను. రేపు రాత్రి ఆవిడను కలుసుకుంటానోయ్‌ ’’

శారద ఫోను పెట్టి వెంటనే పార్టీ ఆఫీసుకి వెళ్ళింది. అక్కడ నుంచి బెజవాడలో మహిళా సంఘంలో సభ్యులందరికీ కబురు వెళ్ళింది. మర్నాడు రాత్రి రైల్వే స్టేషన్ కి రావాలని . కొందరు ఊళ్ళో లేని వాళ్ళు తప్ప దాదాపు ముఖ్యులందరూ పాతికమంది దాకా వచ్చారు . అందరిలో ఉత్శాం ఉరకలేస్తోంది.

ఉప్పు సత్యాగ్రహం లో స్త్రీలు కాస్త వెనక్కు తగ్గండి అని గాంధీ అంటే వెంటనే ఆ మాటను ధిక్కరించి వెళ్ళి మొదటి దళం సత్యాగ్రహుల్లో ముందు నిలబడిన సరోజినీ దేవి అంటే ఇష్టం లేనిదెవరికీ – గాంధీతో సహా ఎవరితోనైన పరిహాసమాడగల చొరవ, సమయస్ఫూర్తీ, తన ఉపన్యాసాలతో జనాలను తట్టి లేపగల శక్తి, సున్నితమైన కవి హృదయం , త్యాగబుద్ధీ – సరోజినీ నాయుడు గురించి వినని వారెవరూ లేరు ఆ మహిళా సంఘంలో `

‘‘ఆమె రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, తన మేనత్త శారదాంబ వలే ఈ దేశంలో ఎన్నదగిన స్త్రీ. నాన్న ఆమెను చూశాడా? విన్నాడా? తెలియదు. తమ మధ్య ఆమె గురించి మాటలు జరగలేదా? తను మర్చిపోయిందా? ఇప్పుడు నాన్న ఉంటే నన్ను చూసి సంతోషించే వాడా? డాక్టరుగా, కమ్యూనిస్టుగా నాన్న కల, , తన కల కూడా నిజం చేసుకున్న తనను చూసి సంతోషించేవాడు. తండ్రి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి . తండ్రి తో పాటు రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మా గుర్తొచ్చింది. ఆవిడే తన భవిష్యత్తుకు అక్షరాభ్యాసం చేసింది. వీరేశలింగం తాతయ్య మాట తీసుకున్నాడు డాక్టర్‌ కావాలని – ఇవాళ ఎందుకు అందరూ గుర్తొస్తున్నారు – తన పక్కన ఇంతమంది ఆడవాళ్ళున్నారు . కాటూరులో వేలమంది వస్తారు. ఒక్కతే ప్రయాణం ప్రారంభించింది. సమూహంలో కలిసింది.

కోటీశ్వరమ్మ, సత్యవతి, రాజమ్మ వంటి వాళ్ళంత సరోజినీ నాయుడిని కలుస్తామనే సంతోషంతో తలమునకలవుతున్నారు.

రైలు వచ్చింది.

కంపార్టుమెంటులోకి అందరూ ఎక్కారు.

శారద వెళ్ళి సరోజినిదేవికి నమస్కారం చేసి తనను రాను పరిచయం చేసుకుంది నవ్వుతూ.

సరోజినిదేవి ఆనందంగా శారదను ఆలింగనం చేసుకుంది.

‘‘హరీన్‌ చెప్పాడు నీ గురించి – నీలాంటి వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళంత మహిళా సంఘం సభ్యులా ? ’’ అందరినీ ఆప్యాయంగా పలకరించింది.

సమయం ఎక్కువ లేదు. వచ్చిన పని చెప్పింది శారద.

‘‘తప్పకుండా వస్తాను. మంచి అవకాశం. ఒదులుకుంటాన ? నేనొక వారం రోజులు హైదరాబాదులోనే ఉంటాను. రెండురోజులాగి ఫోను చెయ్యి. ఏం లేదు. మర్చిపోతానేమోనని’’.

ఇద్దరూ దేశంలో మహిళా ఉద్యమం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుంటుండగానే సమయం లేదని గార్డు వచ్చి అందరినీ దిగమన్నాడు.

శారద ఆమెకు నమస్కరించింది.

అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ స్టేషను బైటకు వచ్చారు. శారద అందరూ జాగ్రత్తగా ఇళ్ళు చేరేలా జట్లుగా వారిని పంపి తను కూడా ఇంటికి వెళ్ళింది.

అందరూ నిద్ర పోతున్నారు. నటాషా నిద్రలో నవ్వుతోంది. పాపను మెల్లిగా ముద్దు పెట్టుకుంది.

ఇప్పుడిక నిద్ర రాదు . గర్భిణీ స్త్రీ ఆరోగ్యం గురించి తను రాస్తున్న పుస్తకం తీసింది.

ఈ పుస్తకం రాస్తున్నాని తెలిస్తే నాన్న ఎంత సంతోషించేవాడో. తగిన సమయం దొరకటం లేదు. త్వరగా పూర్తి చేయాలి. ప్రజల్లో ఎన్ని మూఢ నమ్మకాలు – వాళ్ళ శరీరాల   గురించి వాళ్ళకే మాత్రం తెలియదు. శరీరం విూదా మనసు విూదా అధికారం సంపాదించినపుడే మనకో వ్యక్తిత్వం వస్తుంది. అది స్త్రీలు సాధించాలనే ఈ పుస్తకం రాస్తోంది తను.

పది నిముషాల్లో వ్రాత లో మునిగిపోయింది. రెండు గంటల పాటు రాసి తృప్తి గా కలం మూసి వచ్చి పాప పక్కన పడుకుని నిద్రపోయింది.

***

మీ మాటలు

*