నువ్వూ – నేనూ

-శారద శివపురపు
 ~
sarada shivapurapu
నేనలా కబుర్లు చెప్తూనే ఉంటాను
నువు ఊ కొడుతూనే ఉంటావు
నవ్వుతూనే ఉంటావు
కోప్పడుతావు, ఇంతలోకే ప్రేమిస్తావు
ముద్దుపెడతావు, లాలిస్తావు
నా ధైర్యం నువ్వేననుకుంటాను
ఎంత బాగుంటుంది అలా అనుకోవటం
ఎప్పటికీ నా పక్కనే ఉన్నావని,
ఉంటావని అనుకోవటం….
అమరత్వపు ఆశలెప్పుడూ లేవు కానీ
జీవితపుటధ్యాయాలన్నీ కలిసి చదవాలన్న
కాంక్ష తీరకుండా, ఎందుకు నీకంత తొందర?????
నువు నాటిన విత్తుల్లోని మొలకల్లోనే
నీ నవ్వులు వెతుకాలేమో ఇక నేను
నువ్వతి ప్రియంగా చదివిన పుస్తకాల్లోని
అక్షరాలను ప్రేమించాలేమో ఇక నేను
నువ్వెంతో సున్నితంగా లాలించిన మొక్కలన్నీ
కృతజ్ఞతతో రోజు రోజుకీ ఎదుగుతుంటే
వాటి పచ్చదనంలోనే నీ వెచ్చదనం పొందాలేమో.
నీకసలు తెలియదు, తెలియనివ్వను,
ఒక క్షణం గురించి………
నేను నవ్వుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా,
ఆ ఒక్క క్షణం గురించి ఆలోచిస్తున్నానని
నీకస్సలు తెలియదు నేనలా ఆలోచిస్తున్నానని
నిన్ను, నన్నూ రెండు కాలాల్లోకి విసిరేసే
ఆ క్షణం………
మానవ ప్రయత్నం నీవెళ్ళడం ఆపలేదని తెలిసాక,
విధి లిఖితమో, దైవ సంకల్పమో, అనుకుంటూ
కలిసుండాలన్న మన కోర్కె కన్నా,
కలిసుంటామని చేసుకున్న ప్రమాణాలకన్నా,
అగ్నిసాక్షిగా కలిసి నడిచిన ఏడడుగుల కన్నా,
దీర్ఘాయుష్మాన్ భవా అనీ, సౌభాగ్యమస్తూఅనీ
దీవించిన పెద్దల నోటి మాట కన్నా,
బలమైనదేదో నీచేయి బలంగా పట్టుకుందని
కుండపోతగా వర్షించే మేఘాలేవో
నా జీవితాకాశంలో కమ్ముకుంటున్నాయని తెలిసాకా
నా కళ్ళల్లో కన్నీరింకితే ఆశ్చర్యమేముంది?
మన అందమైన జ్ఞాపకాల తడి మాత్రం
ఆరనివ్వననుకోవడం తప్ప నీకివ్వగలిగేదేముంది??
నాకనిపిస్తూంటుంది, నీకేం నువ్వు బాగానే ఉంటావని
ఏకాలమైనా, ఏ క్షణమైనా,
నా బెంగ, నా భయం, నీ మీద ప్రేమా
అన్నీ కలిసిపోయి, విడదీయలేనంతగా
ఏది ఏదో తెలియనంతగా
నే సతమతమవుతుంటాను,
ఎప్పుడో, ఆఒక్క క్షణంలో అంతా అయిపోతుందని
దట్టంగా కమ్ముకున్న మేఘం ఉరుములతో హెచ్చరిస్తుంటుంది
ఓ వాన చుక్క పయనం ముగించి సముద్రంలో కలిసిపోతుంది.
నిన్నూ నన్నూ వేరు చేసిన కాలం
రెండు కాలాలలోకి నిన్నూ నన్నూ విసిరే క్షణం
వికటాట్టహాసం చేస్తూంటుంది
దూరంగా ఓ ఒంటరి నౌక సముద్ర మధ్యంలో
కనపడని ఒడ్డు కోసం భయం భయంగా వెతుకుతుంటుంది
అప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉంటావు
నవ్వుతూ నవ్వుతూనే జ్ఞాపకంగా ఘనీభవిస్తావు
నాకుమాత్రం తెలియదా నువ్వెంత బాధపడుతున్నావో
నానుంచి దాచడానికెంత కష్టపడుతున్నావో
కొన్ని కొన్ని చిరు చేదు సంఘటనలు
జ్ఞాపకాలైనప్పుడు తీపిగా ఉంటాయనీ తెలుసు
అప్పుడు నీ కోపం చిరాకు నాకు విసుగనిపించవు
అన్నీ నవ్వు పుట్టిస్తాయి
అదేంటో నీ నవ్వే……….. ఏడుపు తెప్పిస్తుంది
నువు మాత్రం అలా కన్నర్పకుండా చూస్తుంటావు
నిశ్శబ్దంగా నవ్వుతుంటావు
నేనేడుస్తున్నానని కూడా చూడవు
ఇంకా, ఇంకా అందంగా….
నిర్వేదంగా…..
ఎటు చూసినా…… ఎవరికీ కనపడకుండా
ఎవ్వరికీ వినపడకుండా నాలో ప్రతిధ్వనిస్తుంటావు
నేను మాత్రం ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను
నీవున్న చోట నేను, నేనున్న చోట నువ్వుండచ్చుకదాని
ఓకన్నీటి చుక్క బతుకు వేడికి ఆవిరై నింగికెగసిపోతోంది
ఎవరి పయనం ఎక్కడ మొదలయి,
ఎక్కడ అంతమయినట్టో …..ఏమో…….
*

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    ఒక దశలో కవిత పూర్తయింది కదా ! ఇంకా ఎందుకు పోడిగిస్తున్నారని చిరాకు పడ్డాను . ఇదిగో ..
    “నేను మాత్రం ఎప్పుడూ ఒకటే కోరుకుంటానునీవున్న చోట నేను, నేనున్న చోట నువ్వుండచ్చుకదాని”
    ఈ భాగం ఇంత బాగా ఉన్నందుకు భలే సంతోషించాను … చాలా చాలా బావుంది శారద గారు . అభినందనలు.

  2. Sharada Sivapurapu says:

    ధన్యవాదాలు వనజ గారూ. కవిత ఏదో ఒక దశలొ పూర్తవుతున్దేమో కాని సహచరుడిని పోగొట్టుకున్న నా స్నేహితురాలి దుఖం తీరనిది అదీ మార్గ మధ్యంలోనే.

  3. వేదనాభరిత క్షణాల్ని మా గుండెలోకి వంపిన తీరు బా(ధ)గా ఉంది. ఇంకేమీ రాయలేను.

    • Sharada Sivapurapu says:

      ధన్యవాదాలు నరసన్ గారూ కవిత మీకు నచ్చినందుకు

  4. శారద గారూ కవిత ఆర్ద్రంగా ఉంది.మొదలైనప్పుడు
    విషాదం అనిపించలేదు. చివరికి విషాదమని అర్దమైంది.

  5. Sharada Sivapurapu says:

    ధన్యవాదాలు రజని గారూ

  6. అక్షరమక్షరంలోనూ ఆర్ద్రత …అందుకే అది శారదాశివపురపు కవిత ..!.

Leave a Reply to RAJANI Cancel reply

*