కంచెలు తుంచే మనిషితనం!

 

-ఫణీంద్ర

~

phaniసిరివెన్నెల “కంచె” చిత్రానికి రాసిన రెండు అద్భుతమైన పాటలు పైకి యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తున్నట్టు కనిపించినా నిజానికవి నానాటికీ మనందరిలో కనుమరుగౌతున్న మనిషితనాన్ని తట్టిలేపడానికి పూరించిన చైతన్యశంఖాలు. ఇక్కడ “మనిషితనం” అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఓషో చెప్పిన ఓ కథ మనిషితనాన్ని చక్కగా విశదీకరిస్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున ఉన్నారు. ఇంతలో ఎవరో నదిలో మునిగిపోతూ – “రక్షించండి, రక్షించండి” అని అరిచారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి తలెత్తి చూశాడు. అతని విశ్వాసం ప్రకారం ప్రతి మనిషీ తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. పక్కవాడి కర్మలో మనం తలదూర్చడం కన్నా అవివేకం మరోటి లేదు. అంతా భగవదేచ్చ!  కాబట్టి ఇక్కడో మనిషి మునిగిపోతున్నాడంటే అదతని కర్మఫలమే! ఇందులో చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా ఆలోచించి అతను ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. రెండో మనిషీ ఈ అరుపులు వింటాడు. ఇతని నమ్మకం ప్రకారం మనిషి పోయాక స్వర్గ-నరకాలు అంటూ ఉంటాయి. పుణ్యకర్మలు చెయ్యడం వలన దేవుని కృపకి పాత్రులమవుతాం, స్వర్గం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడీ మునిగిపోతున్న మనిషిని రక్షించడమంటే స్వర్గప్రవేశాన్ని ఖాయం చేసుకోవడమే! ఇలా ఆలోచించి అతను వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కథలో నీతి ఏమిటంటే, మనం మనుషుల్లా స్పందించడం మరిచిపోయాం. ఏవో ఆలోచనలూ, సిద్ధాంతాలు, భావజాలాలూ తలలో నింపుకుని వాటి వలన మనుషులను రక్షించగలం, చంపగలం కూడా! ఇలా కాక మనిషిలా కరిగి, గుండెతో స్పందించే గుణం మనిషితనం అవుతుంది.

ఒక ఊరిలో రెండు వర్గాలు కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేక ఇంకేదో కారణం చేతనో విద్వేషంతో రగిలి తలలు తెగనరుక్కునే దాకా వస్తే, అది చూసిన మన స్పందన ఏమిటి?  ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పుందీ, గతంలో ఎవరు ఎక్కువ దారుణాలు చేశారు, ఏ శక్తులు ఎవరికి సహాయపడుతున్నాయి, అవి మంచివా చెడ్డవా – ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు గానీ స్పందించలేకపోతే మనలో మనిషితనం చచ్చిపోయినట్టే లెక్క! ఒక మనిషిలా కనుక స్పందిస్తే, మన గుండె ద్రవించాలి, మనసు తల్లడిల్లిపోవాలి.యుద్ధం పేరుతో ఓ మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఏమి సాధించడానికి? మృదువైన కోరికలూ, తీయని కలలలో తేలే మన హృదయ పావురాన్ని ఏ చీకటి బోయవాడు పాపపు బాణం వేసి నేలకూల్చాడు? హృదయాన్ని మరిచి, తెలివి మీరి, పగలతో సెగలతో రాక్షసులుగా మారిన మన మానవజాతిని చూసి పుడమి తల్లి గుండె తీవ్రమైన వేదనతో తల్లడిల్లిందే! ఆ తల్లి చేష్టలుడిగి నిస్సహయురాలై నిట్టూర్చిందే! ఆ తల్లి గుండెఘోషని చూస్తున్నామా, చూస్తే ఏమైనా చేస్తున్నామా? ఇంతటి మహా విషాద వృక్షాన్ని పెంచిన విషబీజాలేమిటి? పూలతోటల బదులు ముళ్ళచెట్లని పూయిస్తున్న ఆ ఆలోచనలేమిటి –

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం

మృదు లాలస స్వప్నాలస హృత్ కపోత పాతం

పృథు వ్యథార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం

నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం

ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?

ఈ మనసూ, హృదయస్పందనా, మనిషితనం లాంటివి వినడానికి బానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఒక మంచిని సాధించడానికి కొన్నిసార్లు దారుణాలు జరగక తప్పవని కొందరి భావన. ఉదాత్తమైన గమ్యం కోసం వక్రమార్గం పట్టినా ఫర్వాలేదు (The end justifies the means) అనే ఈ ఆలోచన చేసిన వినాశనానికి చరిత్రే సాక్ష్యం. తాను దుర్మార్గుణ్ణని విర్రవీగి విధ్వంసం సృష్టించిన వాడి కంటే, తానెంతో మంచివాణ్ణనీ, మహోన్నత ఆశయసాధనకే ప్రయత్నిస్తున్నాననీ నమ్మినవాడి వలన జరిగిన మారణహోమాలే ఎక్కువ! మనని మనం తగలబెట్టుకుంటే ఏ వెలుగూ రాదనీ, కత్తుల రెక్కలతో శాంతికపోతం ఎగరదనీ, నెత్తుటిజల్లులు ఏ పచ్చని బ్రతుకులూ పెంచవనీ ఇప్పటికైనా మనం నేర్వకపోతే మన భవిత అంధకారమే –

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?

ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?

ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?

ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు?

ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు

ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు

ప్రాణమే పణమై ఆడుతున్న జూదం

ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు

చావులో విజయం వెతుకు ఈ వినోదం

పొందదే ఎపుడూ మేలుకొలుపు మేలుకొలుపు!

 

ఒకప్పుడు ఎంత స్నేహం, సౌభ్రాతృత్వం వర్ధిల్లినా మనసులో మొలకెత్తే ఒక విషబీజం చాలు ఆ చెలిమిని అంతా మరిచిపోవడానికి. ప్రచండ సూర్యుణ్ణి సైతం మబ్బు కప్పేసినట్టు, ద్వేషం, పగా దట్టంగా అలముకున్నప్పుడు ఏ వెలుగురేఖలూ పొడచూపవు. అపార్థాల వలన చెదిరిన అనుబంధాలకీ, స్వార్థం వలన సమసిన స్నేహాలకీ, ద్వేషం వలన దగ్ధమైన పూదోటలకీ లెక్క లేదు. ఈ పగలసెగల వలన ఏర్పడిన ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలాల్సిందేనా –

 

అంతరాలు అంతమై అంతా ఆనందమై

కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా

చెలిమి చినుకు కరువై, పగల సెగలు నెలవై

ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా!

 

ఇలా గుండె రగిలిన వేదనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించి మనలోకి మనం తరచి చూడగలిగితే ఓ సత్యం బోధపడుతుంది. నేనూ, నా వాళ్ళు అని స్వార్థంతో గిరిగీసుకుని, నా వాళ్ళు కానివాళ్ళందరూ పరాయివాళ్ళనే అహంకారపు భావనే అన్ని సమస్యలకీ మూలకారణం అని. పక్కవాడు కూడా నాలాగే మనిషే, వాడికీ నాలాగే కన్నీళ్ళూ, కోపాలూ, ద్వేషాలూ, ప్రేమలూ ఉంటాయని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ స్వీయవినాశనానికి దారితీసే వైపరీత్యం నుంచి మనం బైటపడే వెసలుబాటు ఉంటుంది –

 

నీకు తెలియనిదా నేస్తమా?

చెంత చేరననే పంతమా?

నువ్వు నేననీ విడిగా లేమనీ

ఈ నా శ్వాసని నిన్ను నమ్మించనీ

sirivennela

మన హృదయస్పందనని పట్టుకుని, మనలోని మనిషితనాన్ని మేల్కొలిపి, నేనొక్కణ్ణీ వేరుకాదు మనమంతా ఒకటే అనే భావనని మొలకెత్తించగలిగినప్పుడు మనం యుద్ధం అనే సమస్యకి సామరస్యమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని దర్శించగలుగుతాం. మనమంతా మనుషులం, ఈ భూగోళం మనది! విద్వేషంతో పాలించే దేశాలూ, విధ్వంసంతో నిర్మించే స్వర్గాలు ఉండవు, ఉంటే అవి మనుషులవి కాబోవు అని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. యుద్ధం అంటే శత్రువుని సంహరించడం కాదు, మనలోని కర్కశత్వాన్ని అంతమొందించడం అని అర్థమైనప్పుడు మన ప్రతి అడుగూ ఒక మేలుకొలుపు అవుతుంది. సరిహద్దుల్ని చెరిపే సంకల్పం సిద్ధిస్తుంది –

 

విద్వేషం పాలించే దేశం ఉంటుందా?

విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?

ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?

అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా?

 

రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ

సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం!

 

ప్రేమ గురించి గొప్పగొప్ప కల్పనలు చెయ్యొచ్చు, ప్రేమే జీవితమనీ, ప్రేమే సమస్తమనీ ఆకాశానికెత్తెయ్యొచ్చు. ఇలా ఆలోచనల్లో భూమండలం మొత్తాన్ని ప్రేమించడం చాలా ఈజీ, కానీ మనకి నచ్చని మనిషి ఎదురుగా ఉంటే ప్రేమించడం చాలా కష్టం. యుద్ధంలో ఉండీ, చేతిలో ఆయుధం ఉండీ, ఎదురుగా ఉన్న శత్రువుని సంహరించగలిగే సామర్థ్యం ఉండీ, ఆ శత్రువూ సాటి మనిషే అని జాలి కలిగితే అప్పుడు మనం నిలువెత్తు ప్రేమకి నిదర్శనం అవుతాం. అలాంటి ప్రేమ బ్రహ్మాస్త్రం సైతం తాకలేని మనలోని అరిషడ్వర్గాలను నాశనం చెయ్యగలుగుతుంది. రాబందలు రెక్కల సడుల మధ్య సాగే మరుభూముల సేద్యం నుంచి మనని మరల్చి జీవనవేదాన్ని అందిస్తుంది.”రేపు” అనే పసిబిడ్డని గుండెకి పొదువుకుని తీపి కలలను పాలుగా పట్టే అమ్మతనానికి మనమంతా ప్రతినిధులమనీ, మనని మనమే నాశనం చేసుకునే ఈ ఉన్మాదం వలన భవితంతా ఆ పాలుదొరకని పసిబిడ్డడి ఏడ్పుల పాలౌతుందనీ గుర్తుచేస్తుంది –

 

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం!

రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?

సాధించేదేముంది ఈ వ్యర్థ వినోదం?

ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం!

రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం

ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం!

 

ఇదంతా పాసిఫిజమనీ, ఐడియలిజమనీ, దుర్మార్గం ఎప్పుడూ ఉంటుందనీ, యుద్ధం తప్పదనీ కొందరు వాదించొచ్చు. కావొచ్చు. అయితే ఈ అందమైన భూలోకం మనదనీ, మనందరం దానికి వారసులమనీ, ఒకరు ఎక్కువనే ఆధిపత్యం చెల్లదనీ మనమంతా నమ్మినప్పుడు, అరిష్టాలపై అంతా కలిసికట్టుగా చేసే యుద్దం యొక్క లక్షణం వేరేగా ఉంటుంది. అప్పుడది పంటకి పట్టిన చీడని నిర్మూలించే ఔషదం అవుతుంది, పచ్చదనాన్ని పెకిలించే ఉన్మాదం అవ్వదు. అప్పుడు లోకకళ్యాణాల పేరుతో కల్లోలాలు జరగవు, మానవ సంక్షేమం కోసం మారణహోమాలు జరగవు. అప్పుడు మనం భౌగోళికంగా ఖండాలుగా, దేశదేశాలుగా విడిపోయినా మానసికంగా అఖండమైన మానవత్వానికి ప్రతినిధులమవుతాం. మన చొక్కాపై ఏ జెండాని తగిలించుకున్నా మన గుండెల్లో ప్రేమజెండానే ఎగరేస్తూ ఉంటాం. ఈ సదాశయమే నిజమైన గెలుపు, లోకానికి అసలైన వెలుగు –

 

అందరికీ సొంతం అందాల లోకం

కొందరికే ఉందా పొందే అధికారం?

మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం

గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం!

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం

ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం

ఆ తలపే మన గెలుపని అందాం

 

“సిరివెన్నెల ఎంత అద్భుతంగా చెప్పారండీ! ఏం కవిత్వమండీ! నిజమే సుమండీ, లోకంలో హింసా ద్వేషం పెరిగిపోతున్నాయి! దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు!” అంటూ మనని మనమే మంచివాళ్ళ జాబితాలో వేసేసుకోకుండా, ఈ పాటని అద్దంగా వాడుకుని మనలోని లోపాలను మనం చూసుకోగలగాలి. ఎందుకంటే యుద్ధమంటే ఇరు దేశాల మధ్యో, ఇరు వర్గాల మధ్యో జరిగే మహాసంగ్రామమే కానక్కరలేదు. మన దైనందిన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాలలో జరిగే సంఘర్షణలనీ యుద్ధాలే. అరిషడ్వర్గాల సైన్యంతో చీకటి మనపై దాడి చేసే యుద్ధంలో, మన తెలివితో మనిషితనాన్ని వెలిగించుకోవాలి, ప్రేమని గెలిపించుకోవాలి. ఆ యుద్ధంలో ఈ పాటని రథంగా, సిరివెన్నెలని రథసారధిగా వినియోగిస్తే జయం మనదే!

అనుబంధం:

  1. కంచె చిత్రంలోని ఈ రెండు పాటలనీ యూట్యూబ్‌లో ఇక్కడ వినొచ్చు – భగభగమని & నీకు తెలియనిదా
  2. ఈ పాటల గురించి సిరివెన్నెలే స్వయంగా వివరించిన వీడియో – సిరివెన్నెల వివరణ

*

 

మీ మాటలు

  1. knvmvarma says:

    amdarikee upayoagapaDutumdi nice

  2. సిరివెన్నెల గారి పదాల్లోకి ఆకర్షింపబడకుండా ఉండటం అసాధ్యం . ఎన్ని సార్లు వింటే అన్ని సార్లూ కొత్త అర్థాలు స్ఫురించేలా రాయగలగడం ఆయనకి మాత్రమే చెల్లన్న విశ్వాసం నిజమంటూ కంచె పాటలు మరోసారి సాక్ష్యం చెప్పాయి . ఆయన పాటల గురించీ , మనిషి మరిచిపోతున్న మనిషితనం గురించీ అద్భుతంగా విశ్లేషించారు . ధన్యవాదాలు

    • Phanindra says:

      భవానీ గారూ, మీరనట్టు సిరివెన్నెల అద్భుతంగా రాసిన పాటకి నా స్పందన మాత్రమే ఇది. విశ్లేషణ కాదు! Glad that you liked it!

  3. ఫనీమ్ద్ర గారూ
    ఆ పాటలు మళ్లి జాగ్రత్తగా వినాలని ఉంది మీ సంవేదన చదివాక.అశాంతి పోవాలని,అసలైన ప్రేమ గురించి,అంతరాలు తొలగాలని మీరు మరొక్కసారి సమ్స్పన్దనతో విశ్లేషణ చేయడం చాలా అభినమ్దనీయమ్,ఆవశ్యకం కూడా.

    ధన్యవాదాలతో
    శివ్

    • Phanindra says:

      శివ గారు, మీ మాటలు నిజం. సిరివెన్నెల మనిషితనం అందరికీ చేరాలి. వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం!

  4. Chaalaa బాగా రాశారు. :)

Leave a Reply to Phanindra Cancel reply

*