ఇంకా భూమి కోలుకోనేలేదు!

 

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అవగాహన కలిగేది సినిమాల వల్లనే అనుకుంటా, నా మట్టుకూ!
చిన్నప్పుడెప్పుడో ‘కాశ్మీర్ కీ కలీ’ సినిమా పాటలు చూసినప్పుడనుకుంటా మొదటిసారి ఆ ప్రాంతం మీద ఆసక్తి కలిగి ఎక్కడా, ఏమిటీ అనే ప్రశ్నలు ఉదయించాయి.
తెల్లని పర్వత శ్రేణులూ, పచ్చని లోయలూ, సరస్సులూ, అన్నిటినీ మించిన కాశ్మీరీ అమ్మాయిల అందం, అమాయకత్వపు నవ్వు… ఇదేదో పెద్దయ్యాక పదే పదే వెళ్ళాల్సిన ప్రదేశం అని తీర్మానించుకున్న రోజులవి!

‘రోజా’ సినిమాతో ఆ ఆశలన్నీ పటాపంచలయ్యాయి, అది వేరే విషయం! అసలు కాశ్మీరు సంక్షోభంలో ఎవరి పాత్ర ఎంత అనే వాదోపవాదాలు పక్కన పెడితే కాలేజీ రోజుల్లో నా హాస్టల్ రూమ్మేట్, కాశ్మీరీ అమ్మాయి కళ్ళల్లో నిరంతరం కనిపించిన భయం ఇంకా గుర్తుంది.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో ఊరు వదిలి రావాల్సి వచ్చిందో చెప్పాలంటే ఒక పెద్ద కధ అవుతుంది, కానీ తను అన్న ఒక మాట ఎప్పటికీ గుర్తుంటుంది, ‘ఇప్పుడు ఎక్కడ ఉన్నా, క్షేమంగానే ఉన్నా కానీ ఏదో కార్నివాల్ లో తప్పిపోయినట్టు భయం, ఆందోళన! ఏదో ఒక రోజు మన ఊరుకి, మన వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతామనే ఆశ. ‘

ఆ మధ్యనెప్పుడో ఈ కింది చిట్టి గుల్జార్ కవిత చూడగానే మళ్ళీ ఆ అమ్మాయి ముఖం కళ్ళ ముందు నిలిచింది.

కాశ్మీరు నించి వచ్చిన పండిట్‌లు
తమ పేరుతో ఇంటికి ఉత్తరాలు రాస్తుంటారు
తాము వదిలివచ్చిన ఇంటికి కనీసం
ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారని!

gulzar

కాశ్మీరు లోయ

ఎంతో ఉదాశీనంగా ఉంటుంది ఈ లోయ
ఎవరో వేలితో బలవంతంగా గొంతుని నొక్కిపెట్టినట్టు

ఇది ఊపిరి తీసుకోవాలి, కానీ ఊపిరి అందనీయనట్టు!

మొక్కలు మొలవడానికి ఎంతో ఆలోచిస్తూ అనుమానపడుతుంటాయి
మొదట పెరిగిన తల అక్కడికక్కడే తీసివేయడుతుందని
మబ్బులు తలలు వంచుకుని వెళ్తుంటాయి, నపుంసకుల్లా

వాటికి తెలుసు రక్తపు మరకల్ని కడిగివేయడం తమకి చేతకాదని!

చుట్టూ పరిసరాల్లో పచ్చదనమే కానీ, గడ్డి మాత్రం ఇప్పుడు పచ్చగా లేదు
బుల్లెట్లు కురిసిన గాయాలనించి ఇంకా భూమి కోలుకోనేలేదు!
ఎప్పుడూ వచ్చే వలస పక్షులన్నీ
గాయపడిన గాలికి భయపడి వెనుతిరిగి పోయాయి
ఎంతో ఉదాశీనంగా ఉందీ లోయ.. ఇది కాశ్మీరు లోయ!
* *
మూలం:

Vaadii-E-Kashmiir

Badii udaas hain vaadii
Galaa dabaayaa huaa hain kisii ne ungalii se

Ye saans letii rahen, par ye saans le na sake!

Darakht ugate hain kuch soch-soch kar jaise
Jo sar uthaayegaa pahale vahii kalam hogaa
Jhukaa ke gardane aate hain abr, naagim hain

Ki dhoyen jaate nahii khoon ke nishaan un se!

Harii-Harii hain, majar ghaans ab harii bhii nahii
Jahaan pe goliyaan barsii, jamiin bharii bhii nahin
Vo migratory panchii jo karate the
Vo saare jakhmii hawaavon se dar ke laut gaye

Badii udaas hai vaadii – ye vaadii-E-Kashmiir!!

————————————-
చిత్రం: సత్యా సూఫీ

మీ మాటలు

  1. buchireddy gangula says:

    as.usual.—బాగుంది sir…
    —————————————–
    buchi.reddy.gangula.

  2. M .viswanadhareddy says:

    లోయలన్ని అలాగే వున్నాయి రక్తమోడుతూ
    కొన్ని శాలువాలు కొన్ని కుర్తాలు మేకప్పులతో వచ్చి కొన్ని కొత్త వాగ్దానాలు నటించి వెళుతుంటాయి లోయలేప్పుడు రక్తం ప్రవహించా దానికె గానీ మైదానాలు కావడానికి కాదని లోయలో జింకలకు ఏమితెలుసు

  3. అజిత్ కుమార్ says:

    మీరు పాపం కాశ్మీరీ పండిట్లమీద ప్రేమ చూపించారు. కానీ కొందరు లంక తమిళులంటే ఎవరో అన్నట్లుగా చూస్తున్నారు.

  4. నిషిగంధ says:

    ధన్యవాదాలు విశ్వనాధరెడ్డి గారు, అజిత్ కుమార్ గారు

  5. lasya priya says:

    “పరిసరాలలో పచ్చదనమే గాని గడ్డి పచ్చగా లేదు” …..అద్భుతంగా ఉందండి …. మూలం…. అనువాదం

మీ మాటలు

*