హస్తినలో ఉత్తరాంధ్ర కథల జెండా!

ఫోటో: గంగా రెడ్డి

ఫోటో: గంగా రెడ్డి

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

~

devarakondaఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక యుగం  తొలినాళ్లలో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి, నీరుపోసిన వైతాళికులు ఉత్తరాంధ్ర సాహితీ వేత్తలే. అటు కళింగసీమలో వికాసవంతమైన కొండగాలులు పీల్చుకుంటూ,  జీవమిచ్చే  నాగావళి నది తరంగాలలో తేలుకుంటూ, విజయనగర కోట గుమ్మాలు దాటుకుంటూ యారాడకొండంత ఎత్తులో నిలబడి రోజురోజుకూ సరికొత్త చైతన్యం పుంజుకుని  విశాఖ సముద్రం సాక్షిగా  ముందుకు వస్తోంది  ఉత్తరాంధ్ర సాహిత్యం.

ఆధునిక తెలుగు కథకి ఆద్యురాలు బండారు అచ్చమాంబ కారైనట్టి ఉత్తరాంధ్ర లో ఆధునిక తెలుగు కథ కు 1910 లో వచ్చిన  గురజాడ వారి ‘దిద్దుబాటు”   శ్రీకారం చుట్టింది.

స్వాతంత్ర్యానంతర కాలంలో మానవ సంబందాలలోను, మానవ విలువలలోనూ జరుగుతున్న పరిణామాలను,  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు,ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ఉత్తరాంధ్ర కథలు ప్రతిభావంతంగా వెలుగులోకి తెచ్చాయి. తెలుగు కథ సాహిత్య వికాసంలో విశిష్టమైన పాత్ర  ఉత్తరాంధ్ర కథలది.

ప్రముఖ తెలుగు రచయిత చాసో గా అందరికీ సుపరిచితులు అయిన చాగంటి సోమయాజులు గారు తన కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధన స్వామ్య వ్యవస్థ  ప్రధానంగానే చూపెట్టరు. ఆ రకంగా గా కూడా అభ్యుదయ భావాలకు ఉత్తరాంధ్ర  సాహిత్య కారులు ఒకడుగు ముందే ఉన్నారు.

అలాగే పేదల బడుగుల సమస్యలనే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు ఉత్తరాంధ్ర, తెలుగు సాహిత్యానికి ఇచ్చిన మరో  గొప్ప రచయత. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు.  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ప్రత్యక్షంగా చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది . ఇదే మాట ఇక్కడ డిల్లీ లో ఒక సాహిత్య సభలో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో జడ్జి గౌరవనీయులు  శ్రీ యెన్.వి.రమణ గారు చెప్పారు. అలా చెప్పటమే కాక ఆ సభలో ఉన్న శ్రోతలందరికీ ఆరు సారా కధల పుస్తకాన్ని పంచిపెట్టారు. ఈ ఒరవడిలో కొన్ని  మంచి కధలు రాసి ఈ కుర్రాడు యెంతో గొప్ప రచయిత అవుతాడని అందరూ ఆశిస్తుండగా  అకాలంగా చనిపోయిన శ్రీరంగం రాజేశ్వరావు గురించి  తప్పక చెప్పుకోవాలి.

తెలుగు కథా  సాహిత్యం లో 1966 లో ప్రచురించిన తన యజ్ఞం కథ  ద్వారా ఇంకో ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారు తెలుగు సాహిత్యం మీద తమ ముద్రా వేసుకున్నారు. 1960 ల ఆఖరులలో  శ్రీకాకుళం లో  మొదలయిన నక్సల్బరి ఉద్యమం లోంచి అద్భుతమయిన కథకులు,  శ్రీపతి,  భూషణం,  అట్టాడ అప్పలనాయుడు,  యెన్.యెస్.ప్రకాశరావు తదితరుల కధలతో ఉత్తరాంధ్ర తెలుగు కథకు ఇంకో ఒరవడి, ఉద్యమ  ఒరవడి వచ్చింది.

తెలుగు కథకు హాస్య చతురత నేర్పిన భరాగో ,  వ్యంగ్యానికి ఒరవడులు చుట్టిన పతంజలి గార్లు ఉత్తరాంధ్రా వారే. పతంజలి గారి గోపాత్రుడు   అందరూ గొప్పగా చెప్పుకునే తెలుగు కథల్లో ఒకటి. ఇప్పటికీ ఈ ఒరవడి లో రాస్తున్న అనేక రచయితలున్నారు, ఉత్తరాంధ్ర లో.

సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత లు బలివాడ కాంతారావు, అంగర  సూర్యారావు,  రచయిత్రులు, ద్వివేదుల విశాలాక్షి ,రంగనాయకమ్మ, చాగంటి తులసి, కుప్పిలి పద్మలు ఉత్తరాంధ్ర కథ కు వన్నె తెచ్చారు.

ప్రస్తుత సామాజిక పరిస్థితుల  ఆధారంగా రాస్తున్న ఇప్పటి రచయిత(త్రు)లు బమ్మిడి జగదీష్, మల్లీశ్వరి గార్లు ఉత్తరాంధ్ర సాహిత్య వొరవడిని గట్టిగా నిలపెడుతున్నారు. వీళ్ళే కాక ఇంకా యెంతో మంది రచయితలకూ రచయిత్రులకీ ఉత్తరాంధ్ర నేపథ్య మే ఆధారమయింది.

ఉత్తరాంధ్ర తెలుగు కధ గురించి మాట్లాడినప్పుడు , శ్రీకాకుళం లో కాళీపట్నం మాస్టారు నెలకొల్పిన కథానిలయం గురించి తప్పక చెప్పుకోవాలి. కతా నిలయం లో  తెలుగు సాహిత్యం లో (ఒక్క ఉత్తరాంధ్ర సాహిత్యమే కాదు) ఉన్న అన్నీ రచనల వివరాలు పొందు పరిచారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశం లోనే చెప్పుకోదగ్గ గొప్ప సాహిత్య ఘటన .

ఇంత గొప్ప తెలుగు కథ  సాహిత్య సంపద గురించి డిల్లీలో ఉన్న తెలుగు మిత్రులకు తెలియచేయ,  డిల్లీ తెలుగు వారి సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆంధ్రా అసోసియేషన్ “ఉత్తరాంధ్ర తెలుగు కధ పరిణామం” పైన ఒక సదస్సు నవంబర్ 8, 2015  న డిల్లీ తమ భవనం లో జరుపుతోంది.

గమనిక: మా సదస్సును పరిచయడం కోసం కొంత మంది  ప్రముఖ రచయితలనే   గురించే రాసాను. నిజానికి ఉత్తరాంధ్ర  లో ఇంకా ఎంతో  మంది  పేరున్న రచయితలూ రచయిత్రులూ ఉన్నారు. వారి గురించి రాయక పోవడం నా తప్పే. సహృదయంతో మన్నించాలి.

 

ఆహ్వానం 

ఆంధ్రా అసోసియేషన్,  డిల్లీ

ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) తెలుగు కథ పరిణామం

(గురజాడ గారి దిద్దుబాటు (1910) నుంచి ఇప్పటిదాకా) సదస్సు కు మిమ్మల్నందరినీ సాదరం గా ఆహ్వానిస్తోంది

స్థలం : ఆంధ్ర అసోసియేషన్ భవనం (సాయి మందిరం పక్కన)

లోధి రోడ్,  న్యూ డిల్లీ

తేదీ: 8 నవంబర్ , 2015 (ఆదివారం)

సమయం : ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5.30 గం

ముఖ్య అతిథి : శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రత్యేక అతిథి : శ్రీ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు –సి ఐ సి

పాల్గొను రచయతలు: క్రీ వివిన మూర్తి, శ్రీ అట్టాడ అప్పలనాయుడు , శ్రీ గంటి గౌరి నాయుడు, డా.కె.యెన్.మల్లీశ్వరి, శ్రీ బమ్మిడి జగదీశ్వర రావు , శ్రీ ప్రసాద వర్మ, శ్రీ దుప్పల రవి కుమార్

కోటగీరి సత్యనారాయణ                                                 ఆర్.మణినాయుడు                     ప్రధాన కార్యదర్శి                                                     అధ్యక్షులు

మీ మాటలు

  1. Narayanaswamy says:

    Chala baagundi Subrahmanyam garoo mee prayatnam abhinandaneeyam – meeku hrudayapoorvaka abhinandanalu

  2. శుభాభినందనలు!

  3. Delhi (Devarakonda) Subrahmanyam says:

    నేను నా వ్యాసం ఆఖర్లో రాసినట్టు, చాల మంది ఉత్తరాంధ్ర సాహిత్యానికి, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అక్కడ జీవితాలను చూపెట్టిన వారిని, గంటేడ గౌరినాయుడు లాంటి వారిని, నా వ్యాసం లో చెప్పలేదు. అది ఖచ్చితంగా పొరపాటే. అలా ఇంకెన్నో పేర్లు నేను చెప్పలేకపోవడానికి కారణం నేను కేవలం సాహిత్యాభిలేషుడనే కావడం. 8 న జరగబోతున్న కార్యక్రమాల్లో గంటేడ గారు అక్కడ పల్లె వాతావరణం లో రాసిన కధల గురించి మాట్లాడుతున్నారు. అప్పల నాయుడు గారు వారి కీలకపత్రంలో నేను చెప్పలేకపోయిన వివరాలు చెపుతారు. అలాగే మిగతా రచయతలు అక్కడి కదా సాహిత్యం గురించి వివరాలు చెపుతారు.

  4. krishnarao says:

    మీ కృషి కొండంత దేవరా

  5. shanti prabodha says:

    అభినందనలు సుబ్రహ్మణ్యం గారూ.. మీకార్యక్రమ విశేషాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం

మీ మాటలు

*