భోక్త 

~ ఇంద్రగంటి మాధవి 
 
*

Madhavi indragantiఅసలు తను కిందటేడాదే అనుకుంది ఇలా చేద్దామని. సౌదీ అరేబియా కొడుకు దగ్గరకి వెళ్లి,  పిల్లల బలవంతం మీద మరో రెండు నెలలు వైశాఖం వరకూ వుండిపోయినపుడు. దేశమంతా ముస్లిమ్లైనప్పుడు, తెలుగువాళ్ళే  కష్టం, అందులో ఇంకా మనవాళ్లే తద్దినానికి దొరకాలంటే మాటలా…   పాపం వాడు కూడా తన ప్రయత్నం తానూ చేసాడుగా.. జెద్దా నుంచి రియాదుకి ఫ్రెండ్ ని పిలిపిద్దామని టిక్కట్టు కూడా కొన్నాడుగా … ఆఖరి నిముషంలో అతను దుబాయిలో మీటింగుందని రానంటే వీడు మాత్రం ఏం చేస్తాడు… కోడలూ మనవలూ తామేదో తప్పు చేసేసినట్లు ఎంత ఇదయి పోయేరు…

వదినా, రేపు అన్నయ్య తిథికి మొన్నటి మాటు వొచ్చారే, వాళ్లని పంపిస్తాను. మంత్రం కానిచ్చి, భోంచేసి పోతారు. సరేనా ?
నువ్వు ముందు కూరలు తే… పొద్దెక్కి పొతే ఎండ…
తొందరగా చెప్పకపోతే వాడు వేరెక్కడైనా వొప్పుకుంటాడు మరి…

భోజనం చేసి బాంకుకీ వెళ్లాలి. ముందు మార్కెట్టుకెళ్లి రా…

లేటైతే మనిషి దొరకడం కష్టం. ఆనక మీ ఇష్టం…
భోక్తల సంగతి తరవాత చూద్దాం…
సరే. నేవచ్చే సరికి తయారు గా వుండండి. బాంకుకెళ్లచ్చు…
కదలక పొతే వొదిలేట్లు లేదని అయిష్టంగానే కదిలేడు. అరవై అయిదేళ్లు వుంటాయేమో. వెడల్పాటి జరీ అంచు గోధుమరంగు పంచె. కుంకుడు గింజంత బొట్టు. మెడలో బంగారంతో చుట్టిన రుద్రాక్షలు. ఎర్ర రాయి చెవిపోగులు. చిన్న పిలక. ధృడంగా చేపాటి మనిషి. నాలుగిళ్ల అవతలుంటాడు.
వంట చేస్తూ కూర తరుగుతోంది. మొన్నపొలం కొలతలు తీయించాలని కరణం రమ్మంటే తను వెళ్లింది. రైతు ముంజెలు దించి ఇస్తూ  చెప్పేడు. ఈ ఏడాదీ మక్తా సగంలో సగవే ఇయ్యగలనని. మూడేళ్ళ బట్టీ వానలు లేవు మరి. బోరు నీళ్లు సగానికే వొస్తున్నట్లున్నాయి, మిగతా చెక్క ఎండిపోయి నెర్రెలు తీసింది. బొంబాయికి డైరక్టు బస్సు పడిందిగా, కొడుకులిద్దరూ కూలికి పోయేరు. వొస్తే ఏడాదికోమాటు వొస్తారేమో. ఆఖరు కొడుకునీ  టౌన్లో ఇంటరు మానేసి బొంబాయి పొమ్మంటే పోనంటున్నాడు… డాక్టరీ చదువుతాట్ట…  తిండికే కష్టంగా వుంటే, ఇంట్లో ఆడదాని కళ్లజబ్బు సంగతెవరిక్కావాలి… తన కొడుకుల వయసు వాడు… డొక్కలెండి పోయి శవంలా వున్నాడు…ముక్క సంగతి దేవుడెరుగు. ఇంత పప్పు ముద్ద కూడా రోజూ పడుతున్నట్లు లేదు.
టౌన్ మార్కెట్ నించి  తెచ్చిన కూరలన్నీ కుప్ప పోసేడు.
కాళ్లు కడుక్కో, భోం చేద్దువు గాని…
వదినా, భోజనం తరవాత, ముందు బాంకుకి పదండి…
—-
మానేజరుతో నేను మాట్లాడతాను. నువ్విక్కడే కూర్చునుండు…
వయసు మళ్లినా మనిషి సన్నగా నిటారుగా ధీమాగా వుంది. జేగురు రంగు జరీ చీరలో నిండుగా కప్పుకుని. మెడలో సన్నపాటి గొలుసు, చేతులకి ఓ జత గాజులు, చెవులకి చిన్న కమ్మలు. కూడా పూలు కుట్టిన చిన్న గుడ్డ సంచీ.
అతనికి కొంచం ఆశ్చ్యర్యం.
నాకిపుడు అయిదు లక్షలు కావాలి. మిగతా ఎఫ్ డీ లు మార్చి ఆర్నెల్లకోసారి లక్ష వొచ్చేటట్లుగా తిప్పి వెయ్యండి…
అంత కాష్ ఒకేసారంటే కష్టం. రెండు రోజులవుతుంది. తెప్పిస్తాను. ఎందుకంత కాష్?
చెప్పిందావిడ.
ఇప్పుడో లక్ష కాష్ తీసుకోండి. మిగతాది డీడీ ఇయ్యచ్చు…
అంత డబ్బెందుకు? రేపటి కార్యానికి కిందటి మాటొచ్చిన కుర్రాళ్లని రమ్మంటానొదినా…
పట్టు పంచె కట్టి భోజనానికి కూర్చుని అపోశన పడుతున్నవాడల్లా ఆగి ఫోనందుకుని.
ముందు భోంచెయ్యి. నీకిష్టమని దుంపలు వేయించేను. ఉట్టిపప్పూ, పులుసూ…
ఈవిడకి అర్ధం అవదేంటి..  తనకేమో అవతల బోల్డన్ని పనులు. అసలే మినిస్టరు గారింటికి కూడా పోవాలి. ఏడాది పాటు వాళ్ల పౌరోహిత్యం గుత్తకి దొరికేలా వుంది. భూమి పూజనుంచీ బారసాలల వరకూ, అన్ని కార్యాలూ. అధమం అయిదు పది లక్షలైనా వొస్తాయి, దానాలవీ పోనూ. వొదినగారు ఎంతకీ తేల్చదు…
కూరలో ఉప్పు సరిపోయినా చప్పగా అనిపించింది.
అవతల వాళ్ళందరూ వేరే కర్మో కార్యవో దొరికి పోతే, మరోణ్ణి వెతకలేక మనకే ఇబ్బంది వదినా…
మన రైతుకీ, అతని తమ్ముడికీ  చెప్పేను. రేపు రమ్మనమని …
వాళ్లెలాగో వచ్చి సాయంత్రం తినిపోతారుగానీ, భోక్తలకింద ఆ కుర్రాళ్లని పిలుస్తున్నాను …
ఇంకెవరూ అక్కర్లేదు. వాళ్లే భోక్తలు…
ఏవిటీ???
శూద్రాళ్లు భోక్తలేంటి? మీకేవైనా మతిపోయిందా? మజ్జిగాన్నం తినకుండానే ఉత్తరాపోశన పట్టేస్తూ.
నేను కిందటేడాదే అనుకున్నాను…
అసలీవిడ రియాదునించి రాగానే అడగ వలసింది. అన్నయ్య తిథి ఎలాచేసేరని? టీ వీ ఛానెల్లో  కొత్తగా కుదిరిన ప్రవచనం పనుల్లో పడి.. వాడున్నాడుగదా చూసుకుంటాడనుకుంటే… ఈ ముసల్దాని వాలకం చూస్తోంటే ఆ తురక దేశంలో ఏ దారేపోయ్యే దానయ్యకో తిండి పెట్టి అదే తిథనిపించి వుంటుంది.  గద్దించేడు. స్వరం మారుతోంది-
ఏమని? ఏం చేసేరక్కడ??
డ్రైవర్నీ, ఇంట్లో పనివాణ్ణీ రమ్మన్నాను. సుష్టుగా తిని వెళ్లేరు. చెరో అయిదొందల రియాళ్లు దక్షిణా, తాంబూలం… ఇది జరిగి ఏడాదయింది. నేనేం జిర్రున చీదలేదు…పైనున్న మీఅన్నగారి సంగతి మనకి తెలీదు…
తను ఎప్పటిలానే కిందటేడాదీ చేసింది నాలుగు కూరలూ, పచ్చళ్లూ, పిండివంటలూ.  పాపం రోజూ వాళ్లకి టైమెక్కడిది. లేచింది మొదలు రాత్రి నడుం వాల్చే వరకు పనే పని. ఒకళ్లకి ఇళ్లల్లో చాకిరీ. ఇంకోళ్లకి ఊరంతా కార్లో తిప్పే తిరుగుడు. గుక్కెడు కాఫీ నీళ్లు తాగే సందు లేదు. పొద్దున్న ఇంత తిని బయలుదేరితే ఇంక రాత్రి పదకొండు దాటేకే నాలుగు వేళ్లూ లోపలికి వెళ్లడం. తిథి సెలవురోజు శుక్రవారం పడింది కాబట్టి సరిపోయింది. పెట్టినవన్నీ ఓపిగ్గా తిన్నారు. తననుకున్నది ఒకటే. ఎవరైతేనేం కడుపు నిండా తినడం కావాలి. ఆయన పేరు మీద. మనవాళ్లెవరు, పరాయివాళ్లెవరు…
హవ్వ! ఇంతా బతుకు బతికి మీ కిదేం పాడుబుద్ధొదినా? మీ  కొడుకుల వల్ల కాకపొతే నాతో చెప్పచ్చుగా?
నాకు ఎనభైయేళ్లు. కొడుకులు నలుగురు డాక్టర్లు, నలుగురు ప్రొఫెసర్లు! ఎనిమిది దేశాల్లో. నాకు నీ దయేం అక్కరలేదు…
ఎందుకు నువ్విలా నానా జాతుల్నీ శ్రార్ధానికి పిలిచేడవడం? ఎంత ధర్మభ్రష్టత్వం? ఈ మాత్రం తద్దినం నేను పెట్టలేనా?
కళ్లు ఎరుపెక్కేయి. ఆవేశం ఆగ్రహమైనప్పుడు ఏకవచనం లోకి దిగడానికి వయసూ వావీ వరసా అడ్డం రాలేదు. ఈవిషయం నలుగురిలోకీ వెళితే ఎంత సిగ్గుచేటు… తను టీవీల్లో, కొడుకులు పెద్ద మీటింగుల్లో ఉపన్యాసాల్లో కుదురుకుంటోంటే…  తనింట్లో వాళ్లకే వైదీకం మీద నమ్మకం లేదని జనానికి తెలిస్తే ఇంకేవైనా ఉందా? సందు చిక్కితే పెద్దింటి పౌరోహిత్యాలు  తన్నుకు పోవడానికి వందమంది రెడీ గా వున్నారు… ఇంట్లో పెట్టిన దేవీ పీఠం గతేంగాను? జాతకాలూ, ప్రశ్నలూ, కుంకం పూజలూ… ఎంతాదాయం?  తన కొడుకుల్నీ, ఇంటిదాన్నీ వెంటనే రమ్మనాలి. ముసలమ్మ తలకెక్కట్లేదు…  వెలుతురుగా వున్న వసారాలోనే కూర్చున్నా చీకటి చీకటి గా అనిపిస్తోంది.
ఫోనందుకున్న వెంటనే పెళ్లాం కొడుకులూ పరిగెత్తుకొచ్చేరు.
ఎవరిది ధర్మభ్రష్టత్వం? కిందటిమాటు తద్దినానికి పంపేవే, వాళ్లేం చేసేరో నాకు తెలీదనుకోకు! డబ్బులెక్కువొస్తున్నాయని, కరణం గారింట్లో తద్దినం భోజనం  చేసొచ్చి మనింట్లో తూతూ మంత్రంగా కానిచ్చేరు! కడుపునిండినవాడికి పెట్టేం ఫలితం?  అవతల వాడ్ని చూడు. నీ కొడుకుల యీడు వాడు. కంకాళం లా వున్నాడు…
వాడేదో నాలుగురాళ్లకాశ పడితే, ఏంటిట? వాళ్ల బావని పంపిస్తాను…
వాడి బావ సంగతెత్తకు. బళ్లో పంతులు గారింట్లో అపరానికి పోయి దానాలకి డబ్బులైపోతే రెండు గంటల కర్మ ఇరవై నిముషాల్లో ముగించేసేడు…
అయితే? అడ్డమైన వాళ్లనా పిలవడం??
అంతెందుకు? మొన్న నీ బామ్మర్ది  కొడుకులేం చేసేరో నీకు తెలీదా? చినకాపింట్లో పెళ్లికి గణపతి పూజ చేయించి సరిపెట్టేరు. కాపుకి తెలీదనేగా? ఇదంతా శిష్టాచారమా?
వొదినా! నువ్విలా చేస్తే పుట్టగతులుండవు, చెప్తున్నాను!
మళ్లీ పుట్టినప్పటి సంగతి దేవుడెరుగు. రైతు ఆ మందు చేలోకి బదులు గొంతులోకి పోసుకొంటే, నీకూ నాకూ ఇప్పుడే గింజలకి గతుండదు. పుట్టగతుల్ట… హు…
 ఆఖరిసారి చెప్తున్నానొదినా! నీ కొడుకులు దేశాంతరాలు పోయేరు. అలగాజనం తో అంటగాగితే .. ముసిల్దానివి. రేపొద్దున్న హరీ మంటే తీసుకుపోవడానిక్కూడా ఆ నలుగురు రారు!
ఎపుడూ చల్లగా వుండే పదిగదుల పాతకాలం రాతి మిద్దైనా ఇపుడతనికి ఉడికి పోతోంది.
పరవాలేదు. నేను పొతేనంటావా, టౌన్లో మెడికల్ కాలేజీలో ఇయ్యమని నా పిల్లలకి చెప్పేను. నీక్కూడా చివరిసారి చెప్తున్నాను. ఆ షావుకారుతో కల్సి మిత్తి మీద మిత్తి కట్టమనీ, శిస్తుగట్టమనీ మీ వతందార్ని పీక్కు తినడం ఆపు. వాడే బొంబాయో, బావో చూసుకుంటే నీ అయిదెకరాలూ నిన్ను పాతిపెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు…
పెద్దమ్మా, మీరిలా కులద్రోహం చేస్తే మా గతేంగాను?
ఇంకా ఊరుకుంటే లాభం లేదని కొడుకందుకున్నాడు.
పొండిరా! గిరాకీ తగ్గితే వేరే పని చేసుకోండి! ఆ వడ్డెరాళ్లు పోలా, ఊళ్లూ పూళ్లూ పట్టి… ఆచారం పేర్నఈ వెర్రిబాగుల్ని వందేళ్లు వెనక్కి తోలకండి…
భ్రష్టుదానా….
గొణుక్కుంటూ గుమ్మం కేసి నడిచేడు. వెనకాలే పెళ్ళాం పిల్లలూ.
తలుపులు దగ్గరగా జరిపి డబ్బు కట్టలుగా పెట్టుకుంటోందావిడ మర్నాటి కార్యం కోసం.
చెరో ముప్ఫై వేలూ సంభావన. వాళ్ల పొలం ఖర్చులకుంటాయి. నలభై వేలు రైతు కొడుక్కి మొదటేడాది డాక్టరీ సామాన్లకి. నాలుగు లక్షలు వాడి కాలేజీ ఫీజు. దరిమిలా పైచదువులకీ ఆస్పటలు పెట్టుకోడానికీ మిగతా ఎఫ్ డీ లు. కుర్రాడు నా దగ్గరుండి చదువు కుంటాడు… వాడి కోసం రాతి గోడకి పెద్దకిటికీ పెట్టడానికి వడ్డెరతన్ని వెతకాలి…

మీ మాటలు

 1. వనజ తాతినేని says:

  పెద్ద బ్లాస్టింగ్ జరిగినట్టుంది . సూపర్ అండీ !

 2. ఇంద్రగంటి మాధవి says:

  థాంక్స్ వనజ గారూ.

 3. Bhuvanachandra says:

  Chaalaabaagaa raasasru madhavi gaaru keep writing

  • Madhavi Indraganti says:

   చాలా ధన్యవాదాలు భువన చంద్రగారూ మీ ప్రోత్సాహానికి. నమస్తే.

 4. S. Narayanaswamy says:

  ఇంకా ఎక్కడి బ్రాహ్మణ్యం?

 5. A.V.R.J.Sarma says:

  పరాయి దేశాల్లో తద్దినాలు పెట్టడం ఎంత కష్టమో తెలిపిన విధానంతో బాటు దృక్పధంలో మార్పుని సూచించిna పద్ధతి బాగుంది. తమాషా వ్యంగ్య రచన.

  • Madhavi Indraganti says:

   ధనిక మధ్య వర్గాల్లో చదువుకున్న వాళ్ళల్లో కూడా మళ్ళీ పాత ఆచారాల పునరుజ్జీవనం అయినట్లుగా అనిపిస్తోంది నాకు. పాపభీతో విచ్చిన్నమైన సమాజాల్లో కల్చరల్ ఐడెంటిటీ కోసం సంఘర్షనో విస్పష్టంగా నాకు తెలీదు. ధన్యవాదాలు నారాయణ స్వామిగారూ.

  • Madhavi Indraganti says:

   చాలా థాంక్స్, వీలుచేసుకుని చదివినందుకు, మీకు కథ నచ్చినందుకు, శర్మ గారూ.

 6. మాధవి గారు తీసుకున్న వస్తువు నచ్చింది నాకు. మలిచిన తీరు కాస్త కష్టం గా ఉంది, సన్నివేశం, సంభాషణలు కలిపేసి రాసిన తీరు వలన మూడు సార్లు చదివితేనే కానీ పాఠకురాలిగా నా చిత్రం నాకు అందలేదు. కొన్నిమాటలు మా పడికట్టు కాదు కనుకాను. అయినా, చాలా బాగా వెలికి తెచ్చారు మారాల్సిన సాంప్రదాయాలు, వదలకపోయినా పట్టుకుని వేలాడకూడని తంతులు. బ్రాహ్మణ్యం, బ్రాహ్మణీకం మీద అవగాహన, గౌరవం ఉండేవి కానీ వాస్తవం లో నిజానికి మాది అవతలి బాధ; పెద్దవారికో, పండుగకో, పూజకో, క్రతువుకో పిలిస్తే పీల్చి వదులుతారు. ఇక్కడ అమెరికాలో మీరు వ్యాఖ్యలో వ్రాసిన “ధనిక మధ్య వర్గాల్లో చదువుకున్న వాళ్ళల్లో కూడా మళ్ళీ పాత ఆచారాల పునరుజ్జీవనం అయినట్లుగా అనిపిస్తోంది నాకు. పాపభీతో విచ్చిన్నమైన సమాజాల్లో కల్చరల్ ఐడెంటిటీ కోసం సంఘర్షనో విస్పష్టంగా నాకు తెలీదు” నిజమైంది. దళితుల్లో ఒక తీరు, పైవారిలో ఈ తీరు ఊర్లలో ఒక గజిబిజి ని ఉసికోలిపి వదులుతాయి.

 7. Madhavi Indraganti says:

  ఉష గారూ, నమస్తే. తీరిక చేసుకుని చదివినందుకు, మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా థాంక్స్. నాకు ఈ కథా ప్రక్రియ కొత్త. మీరన్నట్లుగానే మా ఇంట్లో వాళ్లూ అన్నారు. ‘బాపూ గజిబిజి కార్టూన్ లా ఉందనీ ఎట్సెట్రా గట్రా..’. ‘ఈమధ్యో ఫలానా పెద్దాయన విరామ చిహ్నాలకి విరామం ఇస్తే అందరూ ఆహా అన్నారుకదా,’ అని నేనంటే ‘అది ఫలానా ఆయన చేస్తే, నీలాంటి ఓనమాలు దిద్దే డిమ్కాలు చేస్తే ఓహో అనికూడా అనరు ఫో,’ అన్నారు. ఎనే వే.. ఈసారి జాగ్రత్త పడతాను.
  వైదీకవ్రుత్తికవతలి పార్శ్వాన్ని నేనిందులో స్పృశించ లేదు. కథా గమనానికి అడ్డు తగులుతుందనేమో. కానీ మీరన్నది చాలా నిజం. గడసరితనం లేకో, పనిరాకో ఏమో వైదీకం లో ఎదగ లేక ఇతర వృత్తుల్లో వొదగలేక యాతన పడుతున్న వాళ్లని చూసేన్నేను. ఇతరుల నమ్మకం డ్రైవింగ్ ఫోర్సు గా సాగే వృత్తి ఇదని నా కనిపిస్తుంది, ఇతర మతాలలో లాగే. కానీ చిక్కల్లా, corporatize అయే అధికాదాయ సమీకరణ ప్రక్రియలో జనాల చిన్న నమ్మకాన్ని మూఢ నమ్మకం గా మలిస్తేనే. అందుకనే మార్పు బాగా విశ్వసించే వర్గం నుంచి వస్తే ఎక్కువ మంచిదేమో . థాంక్స్ మరోసారి.

 8. చాలా బావుంది మాధవి గారూ… ఇంకా ఇలాంటి ఛాదస్తాలు ఉన్నాయంటారా? – అది ముఖ్యం కాదు గానీ కల్చర్ పేరుతో వృథా ఖర్చులు పెడుతూ వ్యవస్థని నాశనం చేస్తున్న పనులు చాలా జరుగుతున్నాయి సమాజంలో. అందరూ ఈవిడలా ఆలోచిస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయో అనిపించింది. అభినందనలు

 9. Madhavi Indraganti says:

  చాలా థాంక్స్ రాధ గారూ, మీ ప్రోత్సాహానికి అభిప్రాయం తెలిపినందుకు. జనాల్లో గుడ్డి నమ్మకాలు ముదిరి పోయినట్లనిపిస్తోంది. పుష్కరాలకి పరుగుల దగ్గరనుంచి, ధన్తేరాస్ గోల్డ్ రష్ వరకూ.

 10. కథ కొంచం గజిబిజి గానే ఉంది. రెండు సార్లు చదివితేనే కానీ అర్ధం కాలేదు. మీరు మీ కథ ద్వారా సందేశం ఇవ్వదల్చుకున్నట్లనిపించింది. వాస్తవికత కు కొంచం దూరం గా అనిపించింది. అన్నీ సారంగ కథల్లాగే మూస పోసినట్లు ఒక అగ్రకుల వర్గాన్నిదుర్మార్గులు గా చిత్రీకరించడం!! అంత డబ్బు, పిల్లలు విదేశాల్లో ఉన్న ఆవిడకి బక్క చిక్కిన రైతు పిల్లలని చూసి అప్పుడే జ్ఞానోదయం కలగటం ఏమిటి? నేను చూస్తున్న, పిల్లలు విదేశాల్లో ఉన్న తల్లితండ్రులు, ముందు గా వారి ఇంటి లో పని వారికి చాకిలెట్లు, బట్టలు కొని పట్టుకెళుతుంటారు. మీ కథ లో చిత్రీకరించినంత ఘోరంగా లేరేమోనండీ బ్రాహ్మలు!! ఏ వృత్తి వారైనా సరే వారు ఆ పని మనసు లేకుండా వక్ర బుద్ధి తో చేస్తే వారి వృత్తి లో ఎక్కువ కాలం రాణించరు. అది బ్రాహ్మలకి కూడా వర్తిస్తుంది. అవతల వారి యొక్క నమ్మకమే బ్రాహ్మణ వృత్తి కైనా ఏ వృత్తి కైనా!! అమెరికా కి వెళ్లి పౌరోహిత్యం చేసే వారు చాలా మటుకు వేదం చదువుకుని వెళ్తారు. ఆ చలికి ఇంట్లో బయటా అన్ని ఆచారాలు పాటించడమంటే మాటలు కాదు. వారు పుచ్చుకునే దక్షిణ అందరికీ కన్పిస్తుంది. వారు ఏ పూజ అయిన మనస్పూర్తి గా చేయడానికి వారు పడే కష్టం కనిపించదు. పూజలు చేయించటం అంటే తేలికైన విషయం కాదు. చాలా మట్టుకు తద్దినాలకి వచ్చే భోక్తలు బీద బ్రాహ్మలే ఉంటారు. మంత్రం చెప్పలేరు. కాబట్టి భుక్తి గడవటం కష్టమే అలాంటివారికి. ఇలాంటివారికి ఆర్థిక స్థోమతు ఉండదు, రిజర్వేషన్స్ ఉండవు. అటు వైదిక వృత్తి చేయలేక అటు మామూలు చదువులు చదవలేక చాలా బీదరికం లో ఉంటారు. మీరు మీ కథ లో చెప్పినట్లు కల్లి బొల్లి కబుర్లు చెప్పి లక్షలు సంపాదిస్తూ ఉండే బ్రాహ్మలు ఉండటం అరుదు. అలా ఉంటే అందరూ పూజలు చేయటం ఖచ్చితం గా మానేస్తారు. చాదస్తాలు ఉన్నాయి. కాదని చెప్పలేము. మనం చాదస్తాలు అనుకునేవి కొంత మందికి వ్యాపారం , ఒక్కోసారి జీవనాధారం కూడాను!! ఎవరు వ్యాపారం చేస్తున్నారో ఎవరు జీవనాధారం పొందుతున్నారో గమనించి ఆచరించాలి మనం. మన బొమ్మలకొలువు, వినాయక చవితి లాంటివి తీసుకోండి. బొమ్మలకొలువు లో మనం పెట్టే బొమ్మల వలన హస్త కళల వారికీ మనకి తెలియకుండానే ఒక ఆధారం ఇస్తున్నాం. వినాయక చవితి రోజున పత్రీ, తామర పూలు అమ్మే పల్లె వాసులని చూస్తాం. పత్రీ చాదస్తం, కొలువు చాదస్తం అనుకుంటే ఒకరి నోటి దగ్గర తిండి తీసిన వారం అవుతాము. పుట్టపర్తి బాబా గారు దేవుడు అని చాదస్త జనం అనుకోక పోతే పేదవారికి ఉచిత super speciality hospital ఉండేది కాదు, కలియుగ దైవం అని తిరుపతి వేంకటేశ్వర స్వామిని చాదస్తం గా స్మరించుకోకపోతే అంత మందికి జీవనోపాధి ఉండేది కాదు.

 11. చంద్రిక గారూ, మీ ఆలోచనలు ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

మీ మాటలు

*