గ్రీకు పెళ్లి కూతురు అన్వేషణలో…

స్లీమన్ కథ-15     

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికీ బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. తను పారిస్ లో మకాం పెట్టి, సర్బాన్ యూనివర్సిటీలో చేరడానికి డాక్టరేట్ తెచ్చుకోవాలన్న తపన కూడా ఒక ప్రధాన కారణం. అయితే దురదృష్టవశాత్తూ, సర్బాన్ యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అతను అతిథి విద్యార్థే తప్ప నిత్యవిద్యార్థి కాడు. కనుక, ఆ యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందే అవకాశం లేదు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ రాష్టాక్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఏ విషయం మీద సిద్ధాంతవ్యాసం సమర్పిస్తారని ఆ యూనివర్సిటీ అడిగినప్పుడు, తన జీవితకథనే ప్రాచీన గ్రీకుభాషలో రాసి సమర్పిస్తానని చెప్పాడు. విచిత్రం!-విశ్వవిద్యాలయాల చరిత్రలోనే అపూర్వం, అసాధారణం అయిన ఈ ప్రతిపాదనను ఆ యూనివర్సిటీ ఆమోదించింది.  ఆవిధంగా స్లీమన్ సొంతకథను రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

పారిస్ లోని తన అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటూ పురావస్తు విషయాల రచనతోనూ, ఆత్మకథా రచనతోనూ నవంబర్, డిసెంబర్ మాసాలు గడిపాడు. ఆ తర్వాత ట్రాయ్ తవ్వకాల వ్యవహారం అతని బుర్రను మళ్ళీ తొలవడం ప్రారంభించింది. అసలు పురావస్తు తవ్వకాల గురించి తనకు ఎంత తెలుసు? ఎక్కడ, ఎలా ప్రారంభించాలి? ఎంతమంది పనివాళ్లను పెట్టుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? బందిపోట్ల బెడదను ఎలా ఎదుర్కోవాలి? చివరికి…తవ్వకాలు జరిపేటప్పుడు ఎలాంటి టోపీ ధరించాలి?-ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు అతని ముందు వేళ్లాడాయి.

ఓ పందొమ్మిది ప్రశ్నలను దండగుచ్చుతూ, వెంటనే సమాధానం రాయమని అర్థిస్తూ 1868, డిసెంబర్ చివరిలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు:

 1. పని ప్రారంభించడానికి ఏది అనువైన సమయం?
 2. వసంతంరాగానే వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిదా?
 3. నాకు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో వసంతకాలంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉందా?
 4. నాతో ఏయే మందులు పట్టుకెళ్లాలి?
 5. ఇక్కడినుంచే ఓ నౌకరును తీసుకుని వెళ్లనా? లేక ఎథెన్స్ లోనే నమ్మకస్తుడు ఎవరైనా దొరుకుతాడా? టర్కిష్ మాట్లాడగలిగే నమ్మకస్తుడైన గ్రీకు అయితే మంచిదనుకుంటాను.
 6. ట్రాయ్ ప్రాంతంలోని అన్ని ఇళ్ళలో పురుగూపుట్రా ఎక్కువ కనుక, మార్సే (Marseille: ఫ్రాన్స్ లోని ఒక పురాతన రేవు పట్టణం)నుంచే ఓ గుడారాన్ని, ఇనపమంచాన్ని, దిండును తీసుకెళ్ళమంటారా?
 7. నాతో ఏయే పరికరాలు, అత్యవసరాలు పట్టుకుని వెళ్ళాలో దయచేసి వివరంగా రాయగలరు.
 8. పిస్టల్స్, బాకు, రైఫిల్ దగ్గరుంచుకోవాలా?
 9. కొండమీద తవ్వకాలు జరపడానికి ఆ స్థలయజమానులు అభ్యంతరం చెబుతారా?
 10. అవసరమైనంతమంది పనివాళ్లు దొరుకుతారా? వాళ్ళను ఎక్కడినుంచి తెచ్చుకోవాలి, ఎంత కూలి ఇవ్వాలి?
 11. ఎంతమందిని తీసుకోవాలి? గ్రీకులో, టర్కులో అయితే మంచిదా?
 12. ఆ కొండను తవ్వడానికి ఎంత సమయం పట్టచ్చని మీరు అనుకుంటున్నారు?
 13. ఎంత ఖర్చవుతుంది?
 14. మొదట ఓ సొరంగాన్ని తవ్వమని మీరు సూచించారు. అదంత ఆచరణయోగ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ పురాతన ఆలయాలు, ఇతర కట్టడాల శిథిలాలు ఉంటే అవి దెబ్బతినే ప్రమాదముంది.
 15. ఆ కొండ సహజంగా ఏర్పడింది కాదనీ, కృత్రిమమైనదనీ మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు?
 16. ఆ కొండ విస్తీర్ణం 700 చదరపు అడుగులు ఉంటుందని మీరు సూచించారు. ఫ్రెంచివాళ్ళ లెక్క ప్రకారం అది 26.5 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ అవుతుంది. మీ ఉద్దేశం, 700 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ ఉంటుందని చెప్పడం అనుకుంటున్నాను. ఫ్రెంచి లెక్కలో అప్పుడది 4,90,000 చదరపు అడుగులు అవుతుంది. కానీ నా పుస్తకంలో దాని పొడవు, వెడల్పులు 233 మీటర్లని రాశాను. అప్పుడది 54,000 చదరపు మీటర్లు అవుతుంది.
 17. ఆ కొండ మీద ఎంత ఎత్తున తవ్వాలి?
 18. కాన్ స్టాంట్ నోపిల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. అప్పుడు దర్దనెల్స్ లోని ఆ బ్యాంక్ శాఖ ద్వారా రుణం పొందే వెసులుబాటు నాకు ఉంటుంది.
 19. మండుటెండలో పని చేసేటప్పుడు ఎటువంటి టోపీ పెట్టుకుంటే మంచిది?

ఫ్రాంక్ కల్వర్ట్ వెంటనే ఎంతో ఓర్పుతో సమాధానం రాశాడు.  మెత్తని చురకలు వేస్తూనే జాగ్రత్తలు చెప్పాడు. ఆయన పురాతత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. నినవా(ప్రాచీన మెసొపొటేమియా నగరం. అసీరియన్ల రాజధాని. నేటి ఇరాక్ లో టైగ్రిస్ నది తూర్పుతీరంలో ఉంది)ను తవ్వి తీసిన ఆస్టెన్ హెన్రీ లయర్డ్(క్రీ.శ 1817-1894)ను విస్తృతంగా చదివినవాడు. కందకాలను ఎలా తవ్వాలో తన ఉత్తరంలో పూస గుచ్చినట్టు స్లీమన్ కు బోధించాడు. వసంతం ప్రారంభానికీ, వేసవికీ మధ్య తవ్వకాలను చేపడితే మంచిదన్నాడు. పనివాళ్లను ఎక్కడినుంచి తెచ్చుకోవాలో, ఎంత కూలి చెల్లించాలో కూడా రాశాడు. హిస్సాలిక్ కొండలో సగభాగం తన ఆస్తి అనీ, అక్కడ తవ్వకాలు జరపడానికి తన అనుమతి తప్పనిసరిగా ఉంటుందనీ మరోసారి గుర్తుచేశాడు. మిగిలిన సగభాగంలో తవ్వకాలు జరపాలనుకుంటే దాని యాజమానులను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూ, ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నానన్నాడు.  స్లీమన్ కు ఉన్న తేనీటి వ్యసనం గురించి తనకు తెలుసు కనుక; తేయాకును వెంట తీసుకుని వెడితే మంచిదనీ, అక్కడ కాఫీ, చక్కెర మాత్రం పుష్కలంగా దొరుకుతాయనీ రాశాడు. అవసరమైన సంబారాలన్నీ దర్దనెల్స్ నుంచి తీసుకువెళ్లచ్చన్నాడు. ఆపైన, ఆ ప్రాంతం పొడవు, వెడల్పులకు సంబంధించిన స్లీమన్ లెక్కలను సరిదిద్దాడు. పిస్టల్స్, బాకుల్లాంటి కాల్పనిక ఆయుధాలేవీ అవసరం లేదనీ, తుపాకులు వెంట ఉంటే చాలనీ అన్నాడు. ఇక వసతి విషయానికి వస్తే, సిప్లక్(టర్కీలో ఒక పట్టణం)లో ఇల్లు అద్దెకు తీసుకోమనీ, దానికి వెల్ల వేయిస్తే పురుగూ పుట్రా సమస్య ఉండదనీ సలహా ఇచ్చాడు. చివరిగా, టర్కులు ధరించే తెల్లని మజ్లిన్ తలపాగా మండుటెండ నుంచి తలకు మంచి రక్షణ ఇస్తుందన్నాడు.

కల్వర్ట్ లేఖలోని అంశాలను మననం చేసుకుంటూనే స్లీమన్ ఓసారి చుట్టం చూపుగా జర్మనీ వెళ్ళాడు. తను పచారీ కొట్టు నౌకరుగా పనిచేసిన పస్టెన్ బర్గ్ ను సందర్శించి, డాక్టరేట్ తీసుకోడానికి రాష్టాక్ వెళ్ళాడు. తన పుస్తకం ప్రచురణకర్తల చేతుల్లో ఉంది, ట్రాయ్ తవ్వకాలకు సమయం ఉంది కనుక, విడాకుల పని మీద ఇక ఇండియానాపోలిస్ కు వెళ్ళడమే తరవాయి అనుకుని అమెరికాకు ప్రయాణం కట్టాడు. వెంటనే విడాకులు లభిస్తాయని ఆశించాడు కానీ, తీరా వెళ్ళాక అదంత త్వరగా తెమిలే వ్యవహారంలా కనిపించలేదు. చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలను సూచించాడు కానీ, చట్టసభ వాటిని తిరస్కరించింది. హోటల్ జీవితంతో విసుగెత్తి ఇండియానాపోలిస్ లోని ఓ సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇంట్లో ఆఫ్రో-అమెరికన్ పనివాళ్లను, వంటమనిషిని పెట్టుకున్నాడు. అయిదుగురు న్యాయవాదులను నియమించుకున్నాడు. తన విడాకుల కేసును తనే వాదించుకుంటున్నాడా అన్నట్టుగా అందులో పూర్తిగా కూరుకుపోయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పరిచితులైన న్యాయనిపుణులకు సుదీర్ఘమైన ఉత్తరాలు రాశాడు.  జూన్ లోగా విడాకులు పొందే అవకాశం కనిపించడం లేదనీ, ట్రాయ్ తవ్వకాలను వచ్చే వసంతానికి వాయిదా వేయవలసిరావచ్చనీ ఏప్రిల్ 14న కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.

అవే రోజుల్లో అతనోసారి న్యూయార్క్ లో స్ట్రీట్ కార్ లో ప్రయాణం చేస్తుండగా, ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు పుస్తకాలు అమ్ముతూ కనిపించాడు. “రెండు సెంట్లకు ఒక పుస్తకం” అని అరుస్తూ, ప్రయాణికుల చేతుల్లో పుస్తకాలు పెట్టాడు.  “అయిదు సెంట్లకు మూడు పుస్తకాలు” అని వాళ్ళ చెవిలో చెబుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత అందరినుంచీ పుస్తకాలో, డబ్బులో వసూలు చేసుకున్నాడు. స్లీమన్ కు ముచ్చటేసి ఆ కుర్రాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏడాది క్రితం తండ్రి చనిపోయాడనీ, తల్లి జబ్బుమనిషి అనీ, తాము ఆరుగురు సంతానమనీ, కుటుంబానికి సాయంగా తనిలా పుస్తకాలు అమ్ముతున్నాననీ అతను చెప్పాడు. అయ్యో అనుకున్న స్లీమన్ అతని చేతిలో ఓ డాలర్ ఉంచబోతే, తిరస్కరించాడు. “నా దగ్గర మీరు అరవై పుస్తకాలు తీసుకుంటేనే మీ డబ్బు తీసుకుంటాను. నేను వ్యాపారిని, బిచ్చగాణ్ణి కాదు” అన్నాడు పౌరుషంగా. ముగ్ధుడైపోయిన స్లీమన్ అతనికి డాలరిచ్చి అరవై పుస్తకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత, “రేపు నీకు పట్టబోయే అదృష్టానికి ఈ డాలరే పెట్టుబడి కావాలని ఆశిస్తున్నాను. నువ్వు ఏదో ఒక రోజున గొప్ప ధనవంతుడివి కావాలనీ; నీలాంటి ఉత్తమపౌరుల కారణంగా ఆత్మగౌరవంతోనూ, వైభవంతోనూ వెలిగిపోయే ఈ ఘనతవహించిన దేశం, చరిత్రలోని మహోజ్వల సామ్రాజ్యాలను అన్నింటినీ మించిపోవాలనీ కోరుకుంటున్నాను” అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.

స్లీమన్ తనదైన పద్ధతిలో ఇండియానాపోలిస్ లో బిజీ అయిపోయాడు. అతని పిండి పదార్థాల ఫ్యాక్టరీ బాగా నడుస్తోంది. ఎప్పటిలా మనీ మార్కెట్ ను అధ్యయనం చేస్తున్నాడు. బ్రదర్స్ ష్రోడర్స్ కు సుదీర్ఘమైన వ్యాపార నివేదికలు పంపిస్తున్నాడు. తన అరబ్బీ పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.The Arabian Nights Entertainment  పై చిన్న పుస్తకం రాశాడు. ‘వివిధ భాషలను త్వరగా నేర్చుకోవడం ఎలా?’ అన్న అంశం మీద ఒక పెద్ద వ్యాసం రాసి పకిప్సీ(న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక నగరం)లో జరుగుతున్న అమెరికా భాషాశాస్త్రవేత్తల సదస్సుకు పంపించాడు. ట్రాయ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. నార్త్-వెస్ట్ పాసేజ్(ఉత్తర అట్లాంటిక్ ను ఆర్కిటిక్ సముద్రం మీదుగా పసిఫిక్ తో కలిపే మార్గం) మీదా, ఉత్తర ధృవాన్ని కనుగొనడం మీదా ఉత్సుకతను రంగరిస్తూ వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. వీటి అన్వేషకులకు ఆర్థికసాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఇవన్నీ అలా ఉండగా, విడాకుల కేసు నానుతూ ఉండగానే, ఎకతెరీనా స్థానంలో కొత్త వధువు కోసం తనూ అన్వేషణ మొదలుపెట్టాడు. అది కూడా అసాధారణ రీతిలో!

గ్రీకు అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. గ్రీకు భాషలోని శ్రావ్యత అతన్ని కట్టి పడేయడమే కాకుండా, ఆడవాళ్ళు మాట్లాడితే అది మరింత శ్రావ్యంగా అనిపించింది. అయితే గ్రీకు వధువును ఎలా వెతికి పట్టుకోవాలనేది ప్రశ్న.  స్వయంగా గ్రీస్ కు వెళ్ళి, క్షుణ్ణంగా గాలించి యోగ్యమైన వధువును గుర్తించడం ఒక మార్గం. అంతలో, అంతకన్నా తేలిక మార్గం అతనికి తట్టింది. ఫిబ్రవరిలో అతని గ్రీకుయాత్రా గ్రంథం తాలూకు బౌండ్ చేయని ప్రతులు కొన్ని అందాయి. రెండు ప్రతులను తన మిత్రుడు థియోక్లిటస్ విమ్పోస్ కు పంపిస్తూ, అందులో ఒకటి అతన్ని తీసుకోమనీ, రెండోది ఎథెన్స్ యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వమనీ కోరాడు. వాటిని బైండ్ చేయడానికి అయ్యే ఖర్చు కోసం 100 ఫ్రాంకులకు చెక్కును జతపరిచాడు. అందులో ఏమైనా మిగిలితే ఎథెన్స్ లోని బీదలకు వెచ్చించమని కోరాడు.

ఆ తర్వాత హఠాత్తుగా విషయానికి వచ్చాడు. దయచేసి ఒక గ్రీకు అమ్మాయి ఫోటో పంపగలరా అని అడిగాడు. ఆమె ఎవరైనా సరే, అందగత్తె అయితే చాలన్నాడు. ఫొటో స్టూడియోల అద్దాలపై ప్రదర్శించే ఫోటోలైతే మంచిదనీ, అప్పుడామె ఏ ఫ్రెంచ్ యువతో అయే ప్రమాదం తప్పుతుందనీ, ఫ్రెచ్ యువతులు ప్రమాదకారులన్న సంగతి అందరికీ తెలిసిందేననీ అన్నాడు. మొదట తటపటాయిస్తూనే ఈ విషయం ఎత్తుకున్నాడు కానీ, పోను పోను ధైర్యం చిక్కి తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాడు. దయచేసి విమ్పోస్ స్వయంగా తనకు ఓ గ్రీకు వధువును చూసి పెట్టాలన్నదే ఆ కోరిక. ఆమెకు ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే, ఆమె అందగత్తే కాక, పేద కుటుంబానికి చెందినదై ఉండాలి. నల్లని జుట్టు, మంచి చదువు, ప్రేమించగల హృదయంతో పాటు; హోమర్ మీద ఆసక్తి కలిగినదై ఉండాలి. విమ్పోస్ సోదరి అయితే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆమెకు పెళ్లైపోయింది. బహుశా ఓ అనాథనో, ఒక పండితుని కుమార్తెనో, ఎవరింట్లో నైనా పిల్లలకు చదువు చెబుతూ నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్న అమ్మాయినో గుర్తించడం కష్టం కాకపోవచ్చు. చివరగా, మనసు విప్పి మాట్లాడడానికి ప్రపంచంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారంటూ, ఎథెన్స్ లోని పేదల కోసమని చెప్పి మరో 100 ఫ్రాంకులకు చెక్కు జోడించాడు.

ఆ ఉత్తరానికి విమ్పోస్ కోపగించలేదు. వెంటనే ఎథెన్స్ కు వెళ్ళి ఫొటోలు సేకరించి స్లీమన్ కు పంపించాడు. వాటిలో ఒక ఫొటో స్లీమన్ ను ఆకట్టుకుంది. ఆమె పేరు సోఫియా ఎంగస్త్రోమెనస్. నల్లని జుట్టు, లేతగా ఉన్న కోలముఖం, పెద్ద కళ్ళు, దట్టమైన, ఒంపు తిరిగిన కనుబొమలు… అసాధారణమైన అందం ఉట్టిపడుతోంది. ఆ ముఖంలో గాంభీర్యం ఉంది కానీ, చిన్నపిల్లల తరహా చిరునవ్వుతో అది చటుక్కున కాంతిమంతమయ్యే చిన్నెలూ తొంగి చూస్తున్నాయి. స్లీమన్ ఆ ఫొటోకు పన్నెండు కాపీలు తయారు చేయించి ఒక కాపీని వెంటనే తండ్రికి పంపిస్తూ, దానికి ఒక ఉత్తరం జతపరిచాడు. ఈ ఫొటోలోని అమ్మాయి నీకు నచ్చుతుందనుకుంటున్నాననీ; అయితే, ఆమెలో చదువుసంధ్యలపట్ల ఉత్సాహం కనిపించకపోతే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాననీ అందులో రాశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లో తను ఎథెన్స్ కు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని జర్మనీకి తీసుకోస్తానని అన్నాడు.

కానీ విడాకుల కేసు ముందుకు సాగకపోవడంతో అతను జులైలో ఎథెన్స్ కు వెళ్లలేకపోయాడు. కాకపోతే, కేసు తనకు అనుకూలంగా పరిష్కారం కాదన్న భయం ఇప్పుడతనికి లేదు. మార్చిలో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. విడాకుల పత్రంపై సంతకాలు జరిగే రోజుకోసం ఓపికగా ఎదురుచూడడం మాత్రమే తనిప్పుడు చేయవలసింది. ఎట్టకేలకు జులై చివరిలో అతనికి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే న్యూయార్క్ కు వెళ్ళి, అందుబాటులో ఉన్న మొదటి ఓడలో గ్రీస్ కు బయలుదేరాడు.  సోఫియాను పెళ్లి చేసుకునే విషయంలో అప్పటికీ అతను ఒక నిర్ణయానికి రాలేదు. ఓడ లోంచే ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తూ, దేవుడు దయదలిస్తే గ్రీస్ లో తనకు వధువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అక్కడి అమ్మాయిలు ఈజిప్టు పిరమిడ్లలా అందంగా ఉంటారనీ అన్నాడు. తనను అలా పిరమిడ్ తో పోల్చడం సోఫియాకు నచ్చే అవకాశం లేదు.

అతను ఆగస్టులో, సెయింట్ మెలిటస్ ఫీస్టు రోజున గ్రీస్ చేరుకున్నాడు. ఎథెన్స్ కు వాయవ్యంగా మైలుదూరంలో కొలొనస్ అనే చిన్నపట్టణంలో ఎంగస్త్రోమెనస్ కుటుంబానికి ఒక తోట ఇల్లు, దానికి దగ్గరలో ఓ చిన్న చర్చి ఉన్నాయి. సెయింట్ మెలిటస్ ఆ చర్చికి పోషకుడు. కొలొనస్- గ్రీకు సంగీత, నాటక కర్త సోఫోక్లీస్ జన్మస్థలం కూడా. ఈడిపస్ అనూహ్యంగా అంతర్ధానమైన చోటు కూడా ఇదేనని చెబుతారు. “మంచు బిందువులతో తడిసి కొలొనస్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుందనీ, ద్రాక్షమద్యం రంగులో ఉన్న మొక్కల లోంచి స్వచ్చమైన గొంతుతో నైటింగేళ్ళ పాట వినిపిస్తూ ఉంటుం”దనీ సోఫోక్లీస్ వర్ణిస్తాడు.

థియోక్లిటస్ విమ్పోస్ తో కలసి కొలొనస్ లోని ఆ చర్చి దగ్గరికి స్లీమన్ వెళ్ళేసరికి అక్కడ అనూచానంగా వస్తున్న మెలిటస్ పండుగ జరుగుతోంది. అమ్మాయిలు పూలదండలు తీసుకుని చర్చికి వస్తూ కనిపించారు. ఇంతకన్నా పునీతమైన ప్రాంగణం, పవిత్రమైన రోజు ఉండదనుకుని స్లీమన్ సంతోషించాడు.

సోఫియా ఓ అనాథా కాదు, ఆమెకు ఎవరింట్లోనో పిల్లలకు చదువు చెప్పి నాలుగు రాళ్ళు తెచ్చుకోవలసిన అవసరమూ లేదు, ఆమె కుటుంబం పేదదని చెప్పడానికీ లేదు. ఆమె తండ్రి ఒక వస్త్రవ్యాపారి. ఎథెన్స్ లొ అతనికో దుకాణమూ, ఇల్లూ ఉన్నాయి. మంచి శారీరక దారుఢ్యంతో, గ్రీకుశిల్పంలా ఉన్న అతను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పతకం తెచ్చుకున్నాడు. స్లీమన్ వెళ్ళేసరికి సోఫియా చర్చిలోనే ఉంది. ఒక స్టూలు మీద నిలబడి పూలదండలు కడుతోంది. అంతలో “జర్మన్ వచ్చా”డని కేకలు వినిపించాయి. అంత త్వరగా వస్తాడని ఊహించని సోఫియా వెంటనే స్టూలు మీంచి దూకి దుస్తులు మార్చుకోడానికి ఇంట్లోకి పరుగెత్తింది.

(సశేషం)

 

 

 

మీ మాటలు

 1. అజిత్ కుమార్ says:

  స్లీమన్ ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, మేధావి, బహుభాషాకోవిదుడు, ప్రముఖ వ్యాపారవేత్త , దురలవాట్లు లేనివాడు… అటువంటి ఉత్తముణ్ణి తృణీకరించడానికి అతని భార్య ఎందుకు నిర్ణయించుకుందో ఎంత ఆలోచించినా నాకు సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. బహుశా స్త్రీల ఆలోచనలు వేరుగా వుంటాయేమో….

మీ మాటలు

*