వాన

artwork: srujan raj

artwork: srujan raj

-శైలజా చందు 
~
 sailaja  వినత వస్తానన్నది. ఆ కబురు అతనిలో ఆనందాన్నినింపింది.  ఆమె మెయిల్ అందుకున్న రోజంతా  ఉండి ఉండి పెదవులమీదకు చిరునవ్వొస్తూ ఉంది. ఆపుకోలేనంత సంతోషంగుండెలనిండా నిండి, అది పెదవులవరకూ పాకుతోంది.
దాదాపు రెండేళ్ళవుతోంది తనని చూసి.   మొట్టమొదటి సారి కలుసుకోబోతున్నట్లు అనిపిస్తోంది . దేవ్ కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. మధ్యాహ్నం నాలుగింటికేచీకటిపడుతున్నట్లనిపిస్తే ,  ఆకాశం వంక చూశాడు  వాన వచ్చేట్టు మబ్బు పట్టి ఉంది. కాసేపట్లో జడివాన కురుస్తుందని తెలుస్తోంది . కిటికీ బయట చెట్టు చినుకు కోసం ఎదురుచూస్తున్నట్టు ఆనందంగా ఊగిపోతోంది.
 ఇల్లంతా సర్ది ఉంచాడు. చికెన్ కూర వండాడు. అందులో ఆలూ ముక్కలు వినతకు ఇష్టం.
“దేవ్ , హాస్టల్ లో కుక్ కు  నువ్వు చేసినట్టు కుదరదు. బాగా మెత్తగా అయినా అయిపోతాయి. లేకపోతే గట్టిగా అయినా ఉంటాయి.”  అనేది కిచెన్ లో ప్లాట్ ఫాం మీద కూర్చుని.
ఆలూ ముక్కల్ని సంతృప్తిగా కదిపాడు.
భోజనం హాట్ బాక్స్ లో సర్దాడు.
హాల్లోకి వచ్చి కిటికీ దగ్గర నుంచున్నాడు.   కిటికీ బయట చెట్టు ,వర్షంలో తడుస్తూ పులకరించి పోతోంది. ఆమె కూడా, రావడం లో తుఫానుకు తక్కువేం కాదు.
 ఆమెకు ఎంతో మంది స్నేహితులు. ఎప్పుడూ అతను నిద్రపోయిన తర్వాతే ఇంటికి చేరుకునేది.  డూప్లికేట్ కీ తో తలుపు తీసి, మెల్లగా లోపలికి వచ్చి, సోఫాలో నిద్రపోతున్న అతన్ని సర్ప్రైజ్ చేసేది. ఆ బరువు, ఆ తియ్యని నారింజతొనల పరిమళం,  రుచి … ఊపిరాడడం లేదని చెప్పాలనిపించినా , వదలలేనంత ఇష్టంగా, సుఖంగా ఉండేవి. రాత్రి మూడో ,నాలుగోఅయ్యాక , అలసిపోయి సోఫాలో నిద్రపోయేది. అతను కాసేపు తన రీసెర్చ్ పని చేసుకుని ,ఇంటిపనులు కూడా పూర్తి చేసేవాడు. ఆమె లేచేసరికి పక్కనే టేబుల్ మీద  ఒక చీటీ ఉండేది.ఆమెకోసం వండిన వంట వివరాలు.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతనెప్పుడూ ఆ సోఫాలో నిద్రపోలేదు. అదంటే గౌరవం, అదంటే ప్రేమ. ఆ సోఫాలో ఇద్దరూ మౌనంగా చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న రుచులు.  వాటినిచెదరగొట్టడం ఇష్టం లేక. వాన విసురుగా వచ్చి అతన్ని తడిపెయ్యాలని గ్లాస్ విండోను తాకుతోంది. ఏవేవో జ్ఞాపకాలు మాత్రం జడివానలా తడిపేస్తున్నాయి.
******
యూనివర్సిటీలో అతను మెరిట్ విద్యార్థి. ప్రతి సబ్జెక్ట్ లోనూ గోల్డ్ మెడల్స్. అమ్మాయిలంతా అందమైన వాడని , అందుకే ఎవరివంకా చూడడనీ అనుకునేవాళ్ళు . వినత దగ్గరయేవరకూఅతనికి ఆడపిల్లలతో స్నేహం తెలియదు.
వినత తనంతట తనే వచ్చి పరిచయం పెంచుకుంది.
ఎన్నో కబుర్లు చెప్పేది.  అతని రూం లోనే పడినిద్రపోయేది. ఆమెకు ఇష్టమైన వంట చేసిపెట్టేవాడు.
“అందగాడివనీ యూనివర్సిటీలో అమ్మాయిలందరికీ నువ్వంటే క్రేజ్ తెలుసా? “
“నీతో పరిచయం చేసుకోవడం ఎంత కష్టమో అన్నారు మా హాస్టల్ గర్ల్స్. “
“పందెం కట్టాము. చివరకు నేనే గెలిచాను.”
“నీతో స్నేహం చేస్తున్నానని ఒకటే కుళ్ళుపడుతున్నారు.”
 అన్నీ చిరునవ్వుతో విన్నాడు.
“ నీ ఫ్లాట్ కు వచ్చాననీ, నువ్వు చికెన్ వండితే తిన్నానని చెప్తే నమ్మడం లేదు.”
“వచ్చే ఆదివారం వాళ్ళను కూడా పిలువు.”
ఆమాటకు అలిగి కూర్చుంది. అతను తనొక్కడికే దక్కాలంది. ఎర్రెర్రని బుగ్గలవెంట  కారిపోతున్న కన్నీళ్ళు చూడలేక చేత్తో తుడవబోయాడు. ఆ చేయి అలాగే పట్టుకుంది. దగ్గరైంది. పెళ్ళిచేసుకుందామంది.
వృత్తి  లోనే ఎక్కువ సంతోషం ఉంటుందని  చెప్పాడు.
తెలుసంది.
ఆమెతో ఎక్కువ సమయం గడపలేనేమోనన్నాడు.
ఫర్వాలేదంది.
కుదరదని ఆమెతో చెప్పలేక టైం కావాలన్నాడు.
 రీసెర్చ్ పనిలో అతని పగలూ రాత్రీ తెలిసేదికాదు.   డిపార్ట్ మెంట్ చీఫ్ గా అతనికి అవకాశం వచ్చినా వద్దన్నాడు. డిపార్ట్ మెంట్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెడితే, తన రీసెర్చ్కు అడ్డొస్తుందని.  రీసెర్చ్ సైంటిస్ట్ గానే ఉండిపోతానన్నాడు. అందరూ అతన్ని పిచ్చివాడన్నారు.  అనుభవం తక్కువైనా సరే, అతని స్నేహితుడు హెడ్ గా ప్రమోట్ చెయ్యబడ్డాడు.
అతని మంచిచెడ్డలు చూసేది కూడా ఆ స్నేహితుడే. ఓ రోజు అతనొచ్చాడు.
“దేవ్, నీతో ఒక విషయం మాట్లాడాలి.”
“నీ మీద అందరికీ  ఒక మంచి అభిప్రాయం ఉంది.”  కాసేపాగి, “ఆమె నీ ఫ్లాట్ కు రావడం, ఉండిపోవడం….  అది ..కొంచం..బాగా… లేదు. కానీ, ఇది నా అభిప్రాయం కాదు దేవ్” ఎలాచెప్పాలో తెలియక మిత్రుడు తడబడ్డాడు.
స్నేహితుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో..  అతనికి అర్థమైంది.
“రావద్దని ఎలా చెప్పను.”
“పోనీ రమ్మనే చెప్పు.. దేవ్”
 అర్థం కానట్టు చూశాడు.
“దేవ్…నీ జీవితం లోకి రమ్మను. ఎన్నాళ్ళుంటావిలా.” అన్నాడు మిత్రుడు చిరునవ్వుతో.
ఆ తర్వాత మూడువారాలకు అతని మిత్రుడైన చీఫ్ చేతులమీదగా పెళ్ళి అయింది.
ఆ మర్నాడు , అతని చేతుల్లో ఒదిగిపోతూ ‘కనిపించినంత బుద్ధిమంతుడివి కాదని’ చెప్పింది సిగ్గుపడుతూ.
ఆ మాట చెప్తూ ఆమె చూసిన చూపుకు, అతనికి తెలియని మత్తు కమ్మేసింది. అంతకు మునుపెన్నడూ ఎరగని గర్వమేదో తలకెక్కింది.  ఏ గోల్డ్ మెడల్ ఇవ్వలేనంత గర్వం.
ప్రతిసారీ, ఆమెను ఓడించి సంతోషపెట్టేవాడు. ఇంటిపనులేం రావు ఆమెకు. నిద్రపోయిందంటే పిడుగులు పడినా లేవని పసితనపు నిద్ర. ఆమె నిద్ర చెడగొట్టకుండా ఇంటిపనంతా చేసేవాడు.

 

       అతను పనిచేసే యూనివర్సిటీ చుట్టుపక్కల ,  ఎక్కువగా పశువుల మీద ఆధారపడి బతికే గ్రామాలున్నాయి. కొంతకాలం నుండీ పశువులకు జబ్బు వచ్చి త్వరత్వరగాచనిపోతుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది.  పరీక్షల కోసం రక్తపు శాంపిల్స్ వేరే ఊరికి పంపి  ఆ ఫలితాలకోసం ఎదురుచూసే సమయానికి జబ్బు బారిన పడ్డ పశువులుచనిపోతుండేవి.  పోనీ అన్ని పశువులకూ ఇవ్వాలంటే,  మందు చాలా ఖరీదెక్కువ. ఆ వ్యాధి విషయం లో పరిశోధన  కోసమని ప్రభుత్వం అతన్ని ప్రత్యేకంగా నియమించింది.
  అదే సమయంలో  ఆమెకు వేరే దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడి ఉద్యోగం వదిలి తనతో రమ్మంది. అక్కడకు వెళ్ళాక అతను కూడా పని వెతుక్కోవచ్చని చెప్పింది. అతనురాలేనన్నాడు. కోపంతో వెళ్ళింది.  కొన్నాళ్ళవరకు ఫోన్లో కోపంతోనే మాట్లాడేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె కోపం తెలిసేదికాదు.  ఎందుకంటే ఫోన్ కు జవాబివ్వడం మానేసింది.
అతను తన పరిశోధనల్లో మునిగిపోయాడు.
కొన్ని నెలల  తర్వాత ,  పది నిముషాల్లోనే  వ్యాధి నిర్థారణ చెయ్యగల పరీక్ష కనుకున్నాడు అది కూడా అతి తక్కువ ఖర్చులో. ఆ పరిశోధన వలన ఎన్నో పశువులు రక్షింపబడ్డాయి.ఎంతో ఖర్చు తగ్గింది. అతను చేసిన పరిశోధనకు ఆ సంవత్సరం ఉత్తమ పరిశోధనగా ప్రభుత్వం అవార్డ్ ప్రకటించింది.
ఆ  తర్వాత రోజు యూనివర్సిటీ తరఫునుండి అతనికి సన్మానం జరగనుంది. ఆమెకు మెయిల్ లో తెలియపరచి , వీలైతే రమ్మన్నాడు.
విషయం విన్న తర్వాత అభినందనలు చెప్తూ , తను వస్తున్నట్టు అతనికి జవాబిచ్చింది.
Kadha-Saranga-2-300x268
*********
మెసేజ్ వచ్చిన శబ్దంతో ఫోన్ తీసి చూశాడు.
ఫ్లైట్ రావడం లేటైందనీ, తను ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా యూనివర్సిటీకు వస్తానని, తనకోసం చూడకుండా అతన్ని ఫంక్షన్ కు వెళ్ళమని మెసేజ్ ఇచ్చింది.
స్టేజ్ మీద కూర్చున్న తర్వాత ఆమెకోసమే వెతుకుతున్నాడు. ఎవరెవరో వచ్చి అతని గురించి ఏవేవో మంచిమాటలు చెప్తున్నాడు. మనసులో గుబులు , అలజడి తుఫానులా కమ్ముకున్నాయి.  ఆమెను కలుసుకోబోయే క్షణాలు అందరిమధ్యా కాకుండా వంటరిగా అయితే బాగుండనిపించింది. ఎప్పటికో గులాబిరంగు చీరలో ఆమె కనిపించింది. గుండెల్లో ముసురుకమ్మిన గుబులంతటినీ తుడిచేసింది, ఆమె చిరునవ్వు.
ఆమె వైపు చూసిన చూపులో తన ప్రేమనంతా నింపాడు.  ఆమెకు మాత్రమే అర్థమయేట్లు ఆ నిశ్శబ్ద సంభాషణలో గుండెలోని ప్రేమంతా తెలియజేశాడు.  తెలియజేసిన తర్వాత గుండె బరువు తగ్గుతుందని అనుకున్నాడు కానీ,  ఆమె పట్ల రెట్టింపు ప్రేమతో మరింత బరువెక్కింది.
ఇద్దరూ ఇంటికి వెళ్ళే టైం కు బాగా రాత్రయింది. యూనివర్సిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన విందులో ఇద్దరూ ఏమీ తినలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టమైనవి తినిపించాడు.  ఆమె నోటికందించే ప్రతి ముద్దలోనూ, ప్రేమ కలిపి ముద్దు చేశాడు.
ఎన్నో రోజుల తర్వాత సోఫా కు బరువు తెలిసింది.
**********
ఆ తర్వాతిరోజు యూనివర్సిటీ కు సెలవు. అతను ఇంట్లోనే ఉన్నాడు.  ఎక్కువ రోజులుండడం కుదరదనీ , ఒక విషయం లో అతన్ని అభ్యర్థించడానికి వచ్చానని , అతను సరే అంటే త్వరగా వెళ్ళిపోవాలని చెప్పింది ఆమె.
ఆమెకేం కావాలో అడగమన్నాడు.
“మరి నేనేం అడిగినా ఇచ్చేయాలి.”  గారాంగా
తలవంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చెంప మీద చిన్న గా తట్టాడు. డన్ అన్నట్టు.
“తర్వాత కాదనకూడదు.”

కళ్ళతోనే  భరోసా ఇచ్చాడు.artwork: srujan raj

“దేవ్…నువ్వు మంచివాడివే. నాకే కష్టమూ కలిగించవు. ఏదడిగినా తీరుస్తావు.”  అతని వళ్ళో కూర్చుని చెప్తూ …చెప్తూ లేచి, సోఫా అంచున కూర్చుంది. “ఒట్టి ప్రొఫెషన్ తప్ప నీకింకోలోకం తెలియదు. పార్టీలకు రావు. ఎవరితోనూ కలవలేవు. నాప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళలేను. నీ లోకం లోకి అడుగుపెట్టలేను.”
“………”
“నీ దగ్గర నేను సుఖంగా లేనని చెప్పలేను. కానీ ఎన్నాళ్ళుండగలవు. రేపు ఇద్దరికీ వయసైపోతుంది. అప్పుడు ఎంత బోర్ కొడుతుంది? నువ్వెప్పుడూ నీ ఉద్యోగం లో గడిపెయ్యగలవు.నాకో..ఎలా గడపాలి నేను?”
అతను  మాట్లాడకుండా ఆమె వంకే చూస్తున్నాడు.
“నాకు తెలుసు నువ్వెంత మంచోడివో..ఏం చెయ్యను చెప్పు . జీవితమంతా స్వీట్లే తిని బతకలేంకదా..వెగటనిపిస్తుంది.  లైఫంతా బోర్ గా గడపలేను కదా?”
 అతనికి అర్థమయ్యేందుకు చెప్పుకు పోతోంది.
“ఏం కావాలో చెప్పు?” అడిగాడు.
“ఒకవేళ నేనడిగేది నీకిష్టం లేకపోతే?”
“నా ఇష్టం తో పనిలేదు. నాకు వీలైనదేదైనా సరే చేస్తాను.”
“డివోర్స్ ఇవ్వు దేవ్.”
ఆమె అడిగింది, అతను ఊహించాననుకున్నాడో, తన ఊహకే అందనిదో అతనికి వెంటనే అర్థం కాలేదు.
“నువ్వంటే ఇష్టం లేక అడగడం లేదు దేవ్. అదొక్కటే అర్థం చేసుకో” అంది.
అతను మౌనంగా ఉండడం చూసి “ఒట్టేశావు. కాదనన్నావు.”
“ఇప్పుడుమాత్రం కాదన్నానా? “ చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు.
గుండె తొణకలేదు. కానీ పెదవి వణికింది. చిరునవ్వుతో కప్పేశాడు.
ఆ సాయంత్రం ఆమె వెళ్ళిపోయింది. వర్షం కురుస్తూనే ఉంది.
ఆ రాత్రి హాల్లో పడుకోలేకపోయాడు. ఆ సోఫా నిండా ఎన్నో జ్ఞాపకాలు. లోపల అంతా ఖాళీగా ఉంది. నింపడానికేం లేదు. ఎన్నో సువాసనలు, మరచిపోలేని గత జన్మల వాసనలు. అవన్నీచుట్టుముట్టి దాడి చేస్తున్నాయి.  బెడ్ రూం లో కెళ్ళి మునగదీసుకుని పడుకున్నాడు. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.   పెడచెవిన పెట్టాడు. పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగాడు.
“బాధగా ఉందా?” లోపల్నుండి ఎవరో అడిగారు. సమాధానం చెప్పలేదు. నిద్రపోదామన్న ఆలోచనకూడా లేదు. కళ్ళుమూసుకున్నాడు. ఎప్పుడో ఒక రాత్రివేళ నిద్రపట్టింది. మరోఅరగంటకే నిజం చెళ్ళుమన్నట్టు లేపేసింది.  సగం నిద్ర , సగం మెలకువతో  నాలుగింటికి వరకు గడిపాడు.  తెల్లవారాక లేచి, స్నానం చేసి ఎప్పట్లా కాలేజికి రెడీ అయ్యాడు.
బయటికి వెళ్తూ వెళ్తూ, సోఫా వంక చూశాడు. గుండె బరువు మరింత పెరిగింది. కాలివేళ్ళలో ఒక వేలు ఇంకాలోపల ఉండగానే డోర్ లాగాడు.
తాళం లోపలే ఉందేమో తెలియదు.
 మెట్లు దిగి వెళ్తుంటే ఎదురు ఫ్లాట్ లో  ఉండే  ఆస్మా ఎదురుపడి “ ఎలా ఉన్నారు?” అంటూ పలకరించింది.
అతను మాట్లాడకుండా వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది. మెట్లమీద చితికిన వేలినుండి రక్తపు మరకలు. “ఆగండి భాయి సాబ్, కట్టుకడతాను” అంటూ లోపలికి వెళ్ళింది. బయటికి వచ్చిచూస్తే అతను దూరంగా వెళ్ళిపోతున్నాడు.
కాంపస్ లో  గుబురుగా ఉన్న పసుపు పూల చెట్ల మధ్య దారిలో నడుస్తున్నాడు. దారినిండా రాలిన పూలు, ఆకులు. తడి తడిగా ఉన్న సిమెంట్ కాలిబాట. తలొంచుకుని నడిచాడు.  ఛీఫ్గదిలోకి వెళ్ళాడు.
కొన్ని రోజులు సెలవు కావాలన్నాడు.
రెండేళ్ళ తర్వాత, ఆమె వచ్చిందని  ఛీఫ్ కి తెలుసు . స్నేహితుణ్ణి ఆట పట్టించేలా ఏదో కొంటె జోక్ వెయ్యబోయి ,
అతని వాలకం చూసి ఆగాడు.
“నువ్వు  మామూలుగానే ఉన్నావా దేవ్? ఆరోగ్యం బాగానే ఉందికదా” అన్నాడు.
బాగానే ఉందన్నట్టు తలూపాడు.
“నీకు కావలసినన్ని రోజులు తీసుకో..ఫర్వాలేదు.”
 బయటకు వెళ్ళేప్పుడు చూశాడు  అతని కాలికి చెప్పులు లేవని.
కార్ పార్క్ లో ఉన్న కార్ తీశాడు. కొండవేపు పోనిచ్చాడు. వాగుకు కొద్ది దూరంలో ఆపి , నడుచుకుంటూ వాగు దగ్గరకు నడిచాడు. ఫ్లాట్ నుండి చూస్తే  చిన్నగా ఉండే వాగు, దగ్గరగాచూస్తే చాలా పెద్దదిగా ఉంది.
కొద్ది దూరంలో తెల్లని గులకరాళ్ళు. శుభ్రమైన గులకరాళ్ళు. వాటిమీద కూర్చున్నాడు.
గుండెనిండా నల్లని మేఘాలు .
మేఘం వర్షించేట్లున్నాయి
 ఎక్కడినుండో ఒక చినుకు.
 వానచినుకు రాలి అతనిమీద పడింది.
అగ్నిలాంటి అశ్రుకణమొకటి జారింది. ఘనీభవించిన గుండెకరిగింది.  చినుకులు పెద్దవై వాగులో కలిసిపోతున్నాయి. .
వాగు విపరీతమైన వేగంగా పారుతోంది.  ఆలోచనలు ఎప్పుడూ లేనంత వేగంగా పరిగెడుతున్నాయి. వ్యర్థమైన పరుగు. ఎక్కడికో తెలియని పరుగు. లక్ష్యం లేని ఆలోచనలు. తన జీవితంఎటువెళ్ళాలి.  ఆమెను కోల్పోయిన తర్వాత ఒక బలమైన కోరిక కలిగింది . ఆమెను సుడిగాలిలా చుట్టుకోవాలనీ, మనసులో ప్రేమంతటితో ఆమెను కప్పేయాలనీ.
మెల్లగా వాగు పెద్దదవుతోంది. నీళ్ళు అతనికిందకు వస్తున్నాయి. అతని కారు తాళం , విప్పి పక్కన పెట్టిన కోటు నీళ్ళకు రెండూ కొట్టుకు పోతున్నాయి. అతనికి లేవాలనిపించలేదు.
స్నేహితుడు సమయానికి రాకపోతే అతనుకూడా ప్రవాహంలో భాగమై ఉండేవాడు.
కాసేపటికి  వర్షం తగ్గింది. నీళ్ళు తేటపడ్డాయి. వాగు ప్రవహిస్తూనే ఉంది.   దూరంగా పశువులు తిరుగుతూ పచ్చిక మేస్తున్నాయి. ఆకాశం నీలంగా ప్రకాశంగా ఉంది.
*****
“దేవ్, నీతో ఒక విషయం చెప్పాలి.”
…….

వినత నిన్న మెయిల్ ఇచ్చింది.

artwork: srujan raj

artwork: srujan raj

పేరు వినగానే  గుండె బరువెక్కి కళ్ళలోకి దూకబోయింది.
తమాయించుకుని  ఏమిటన్నట్టు చూశాడు.
“ఈ సంవత్సరపు రీసెర్చ్ అవార్డ్ కోసమని వచ్చిన అప్లై చేసిన వాళ్ళలో వాళ్ళబ్బాయి కూడా ఉన్నాడట. నేనొక్కణ్ణే ఇచ్చేది కాదుగదా, నువ్వూ సంతకం పెట్టాలని చెప్పాను. సో…నీకోసారి చెప్పమంది.”
పేరు , వివరాలు ఉన్న పేపర్ అతని ముందుంచాడు.
“ఆ అవార్డ్ ఎవరికివ్వాలో ఇదివరకే నిర్ణయమైపోయింది కదా?”
“నువ్వు తప్పకుండా హెల్ప్ చేస్తావనే ఉద్దేశంతో ఉంది వినత ఈ పని తప్పకుండా అయిపోతుందనే అనుకుంటోంది.  పేరు మార్చడానికి నాకైతే ఏ  అభ్యంతరం లేదు దేవ్. నువ్వుకూడాఎప్రూవ్ చేస్తే….”
“అలా ఎలా?  నచ్చిన వాళ్ళకివ్వడానికి, ఇదేమీ మన స్వంతం కాదు “
“వినత నిన్ను కాదన్నదని పగ తీర్చుకుంటున్నావా దేవ్?”
స్నేహితుడివంక మౌనంగా చూశాడు.
ఒక్కోసారి మాటలు పలకలేనంత పరుషంగా మౌనం మాట్లాడుతుంది.
“సారీ దేవ్.  సరే తనతో నీ నిర్ణయం చెప్తాను.”
*****
రెండు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసింది.
“దేవ్. ఇన్నాళ్ళూ చెప్పకూడదని అనుకున్నాను.  నీకు సంబంధం లేకుండా పెంచాలని అనుకున్నాను. ఈ చిన్నపని చేసిపెట్టు.”
చాలా సేపు మౌనంగా ఉన్న తర్వాత , కష్టం మీద పలికింది ఆమె గొంతు.
“నువ్వేం పరాయివాళ్ళకు చెయ్యడం లేదు. వాడు నీ బిడ్డే…”
ఎప్పుడో మరచిపోయిన గుండె బరువు మళ్ళీ తెలిసింది. నొప్పిగా అనిపించింది.
ఎంతోసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
చప్పుడు వినిపిస్తే బయటకు చూశాడు. జడివాన మొదలైంది. తెరిచి ఉన్న  కిటికీనుండి లోపలికి జల్లు పడుతోంది. టేబిల్ మీదున్న ముఖ్యమైన కాగితాలు తడుస్తాయని లేచి కిటికీ తలుపులు మూసేశాడు.
అప్పటికింకా ఆఫీసులోనే  ఉన్నాడతను. ఆమె చెప్పిన పేరు మీద ఉన్న అప్లికేషన్ మీద క్లిక్ చేసి  ఫోటో చూశాడు.
మసకబారిన  పెళ్ళినాటి ఫోటో గుర్తుకొచ్చింది.  అలాగే చూస్తూ ఉంటే మరింత మసకబారింది.
“ వాడెంతో కష్టపడ్డాడు. ఎన్నో ఆశలు  పెట్టుకున్నాడు .”
“అర్హత కలిగిన వారు వేరే ఉన్నారు. వారికి అన్యాయం చెయ్యలేను.”
“ అవార్డ్ రాకపోతే చాలా  బాధపడతాడు. నామీద కోపంతో… ”
 ఆమెను ఆపేశాడు.
“నాకు నీపట్ల కోపం లేదు, ప్రేమ తప్ప.”
“ ఉంటే,  ఈ చిన్న విషయానికి నో చెప్తావా? ”
“ఇది చేస్తేనే ప్రేమ. లేకపోతే కాదు.. ఇలా ఈక్వేషన్స్ లో ఇమిడేదాన్ని ప్రేమంటారా?”
“పోనీ నువ్వే చెప్పు, ఏమంటారో?”
“తనకు నేనెవరినో తెలుసా?”
“తండ్రి ఉన్నాడని తెలుసు కానీ, అది నువ్వని తెలియదు.”
“చెప్తావా?”
“ఏమని చెప్పను. మాకోసం చిన్న పని కూడా చెయ్యలేకపోయావని చెప్పనా?”
“చేసే పనిలో ఏదీ కలపలేక ,అన్నీ పోగొట్టుకున్నానని  చెప్పు. అతనికి అర్థం అవుతుంది.”
“ఇన్నాళ్ళూ నీగురించి, వాడికి చెప్పకపోవడం తప్పనిపించేది. ఇప్పుడా ఫీలింగ్ పోయింది. థాంక్స్.”
వర్షం పడుతూనే ఉంది. బయట చెట్లు తడుస్తూ ఉన్నాయి. అతనికి ఇంటికివెళ్ళే ఉద్దేశం లేదు. అయినా బయటకు వెళ్ళి వర్షం లో నుంచున్నాడు.
********
తర్వాత రోజు యూనివర్సిటీ కు సెలవిచ్చారు. తుఫాను కారణంగా, ఆవరణలో పడిపోయిన చెట్లను కూడా తొలిగించారు.

*

మీ మాటలు

  1. బాగుంది

  2. వనజ తాతినేని says:

    కథ బావుంది . ప్రేమంటే ఎప్పుడూ ఇస్తూ ఉండటమేనా !? ముగింపు చాలా నచ్చింది . ఆఖరి వాక్యం అనవసరమనిపించింది శైలజ గారు .

    • sailaja Chandu says:

      థాంక్యూ వనజ గారూ , మీరు చెప్పిన తర్వాత నాక్కూడా అది అనవసరమనిపించింది.

  3. Krishna Veni Chari says:

    >ఈక్వేషన్స్ లో ఇమిడేదాన్ని ప్రేమంటారా?”<
    చాలా బాగుంది శైలజగారూ.

  4. వినత లాంటి స్త్రీలు అంత ప్రేమకు అనర్హులు! వాళ్ళకు కావ్లసింది కొద్ది కాలం “కల్సి గడపటం”,సోఫా కి బరువు తెలిసేలా చేయడం మాత్రమే! జీవితం విలువ తెలీదు, ప్రేమ విలువ అంతకంటే తెలీదు, మనుషుల విలువ అంతకంటే తెలీదు. అందుకే ఏళ్ల తరబడి దూరంగా ఉండి కూడా, వచ్చినపుడు మాత్రం ఒక్క అనుభవంతో సంతృప్తి పొంది.. ఐస్ క్రీం అడిననత ఈజీగా విడాకులు అడిగి పారేసింది!

    • sailaja Chandu says:

      గిరిజ గారూ, కథ చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు

  5. “నువ్వేం పరాయివాళ్ళకు చెయ్యడం లేదు. వాడు నీ బిడ్డే…”
    >> సెంటిమెంట్ తో తొలి అస్త్రం
    “అలా ఎలా? నచ్చిన వాళ్ళకివ్వడానికి, ఇదేమీ మన స్వంతం కాదు “
    >> ఈ మాటలు ఏనాడైనా పత్యక్షంగా వినిపిస్తే అన్న వాళ్ళకు సన్మానం చేయాలని ఉంది.
    “వినత నిన్ను కాదన్నదని పగ తీర్చుకుంటున్నావా దేవ్?”
    >> నెత్తి మీద మంచితనం కిరీటం మోస్తున్న వాళ్ళపై బ్రహ్మాస్త్రమే ఇది.

    ఇక కథ విషయానికి వస్తే మొదటి నుండి మొండితనంతో పాటు స్వార్ధం అమ్మగారి స్వంతమైతే, తెలుసుకోలేని పిచ్చితనం అయ్యగారిది. ఇప్పటికైనా గొడవ వదిలింది అనుకుంటే సుఖం కదూ!.

    • Sailaja Chandu says:

      <>
      మనం ఆశించినట్లు వ్యక్తులుండరు. ఉండాల్సిన అవసరం కూడా లేదు.
      <>
      దేవ్ ది ఉదాత్తమైన ప్రేమ జ్యోతి గారూ. I think he deserves little respect.

      • sailaja Chandu says:

        ఇప్పటికైనా గొడవ వదిలింది అనుకుంటే సుఖం కదూ!.
        Few persons in this world will never learn from those who are able to think like this

    • sailaja Chandu says:

      <>
      వ్యక్తులు మనం ఆశించినట్లు ప్రవర్తించరు. అలా ప్రవర్తించాల్సిన అవసరం కూడా లేదు. ఆమెది స్వార్థమో ఏమో నాకైతే సహజమే ననిపించింది. ఆ కారణంగా ఆమెను అగౌరవపరచాలని కూడా అనిపించలేదు.
      <>
      దేవ్- మనిషి పట్లా, వృత్తిపట్లా అతని ప్రేమ చూస్తే అతనికి కొంచం గౌరవం అవసరమే జ్యోతిగారూ.

    • sailaja Chandu says:

      అలా ఎలా? నచ్చిన వాళ్ళకివ్వడానికి, ఇదేమీ మన స్వంతం కాదు “
      ఈ మాటలు ఏనాడైనా పత్యక్షంగా వినిపిస్తే అన్న వాళ్ళకు సన్మానం చేయాలని ఉంది.
      Jyothiagru, I know many people who said these lines. It is really unfortunate that you didn’t come across them.

  6. sailaja Chandu says:

    I am talking about these lines jyothi gaaru,you may not see
    స్వార్ధం అమ్మగారి స్వంతమైతే, తెలుసుకోలేని పిచ్చితనం అయ్యగారిది

    • sailaja Chandu says:

      అమ్మగారి, అయ్యగారి
      I feel sad for my characters that they have earned such a sarcasm!

  7. paresh n doshi says:

    కథ బాగుంది. ప్రేమను పొందడం అపురూపం అనుకుంటే దాన్ని నిలుపుకోవటం గొప్ప విషయం. నాకైతే ఇద్దరి మీదా జాలి కలిగింది, బాధ వేసింది. నాకు ఇది గుర్తుకొచ్చింది :
    WE WERE BORN IN A TIME WHEN IF SOMETHING WAS BROKEN WE WOULD FIX IT, NOT THROW IT AWAY.

    • Sailaja Chandu says:

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు పరేష్ గారు.

  8. పద్మవల్లి says:

    హ్మ్ (ఓ పేద్ద నిట్టూర్పు) .. నేరేషన్ బావుందండీ. చాన్నాళ్ళకి ఒక నచ్చిన కథ చదవగలిగాను. ఎవరిదీ తప్పూ అంటే చెప్పడం కష్టమే. అసలు తప్పుందా అనేదీ చెప్పడం కష్టమే. ఎవరి ప్రయారిటీలు వారికి ముఖ్యమయ్యాయి, కలిసి ఉండటం కన్నా. ఆఖరున ఆమె అలా కొడుకు గురించి అడగటం మాట్లాడటం నచ్చలేదు కానీ, ఎందుకు విడిపోవాలనుకుందో స్పష్టతతో చెప్పగలిగిన ఆమె అలా ప్రవర్తించకపోతే వింతగా ఉండేదేమో మరి.

    మనసులో ప్రేముండీ, దాన్ని చూపించడం కూడా చేతనయిన సున్నితమయిన మనిషిని చాలదనుకుని వెళ్ళిన ఆమె దురదృష్టమా, ఆమెలా ఆ ప్రేమని చంపుకోలేకపోయిన అతని దురదృష్టమా అంటే … తెలీదు. గుల్జార్ పాట గుర్తుకొచ్చింది “ఖోయా క్యా జో పాయా హీ నహీ”. పొందిందెప్పుడు గనకా పోగొట్టుకోడానికి??? ఆఖరున యూనివర్సిటీకి సెలవిచ్చారు అంటూ చెప్పకుండానే ఓ విషయాన్ని చెప్పారు కదా. ( స్ప్లెండిడ్). గుండె ఆ తుఫానులో చిగురాటాకులా ఒక్క క్షణం వణికింది. అన్నట్టు దేవ్ ని చూస్తుంటే మీ చందమామ కథ లోని హీరో గుర్తుకొచ్చాడు.

    • Sailaja Chandu says:

      పద్మా, నీ కామెంట్ చదివి ఆనందిస్తాను. థాంక్స్ చెప్పాలని అనిపించదు. ( అదికూడా ఓ రచనలా ఉంటుంది మరి )

  9. శైలజ గారూ, నా వ్యాఖ్యను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదని తెలిసింది. “మంచి కథ చదవమని” నా ఫ్రెండ్ కి లింక్ పంపిస్తే తను చూసి చెప్పింది. లేకపోతే నేను మళ్ళీ ఈ వైపుకే రాకపోదును. అయినా నా ఉద్దేశ్యం పూర్తిగా చెప్పి ఉండాల్సింది. నేను కోట్ చేసిన వాక్యాలకు నా అభిప్రాయాలను మరింత స్పష్టంగా వివరిస్తాను.

    “నువ్వేం పరాయివాళ్ళకు చెయ్యడం లేదు. వాడు నీ బిడ్డే…”
    >> సెంటిమెంట్ తో తొలి అస్త్రం.
    సొంత వాళ్ళు, పరాయి వాళ్ళు అనే తేడాతో అర్హత గురించి ఆలోచించక పోవడం సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నదే దానికి భిన్నంగా ఆలోచించేవాళ్ళ మీద ఈ ఆస్త్రాన్నే ప్రయోగిస్తారు. దాన్ని మీరు చక్కగా పట్టుకున్నారు.

    “అలా ఎలా? నచ్చిన వాళ్ళకివ్వడానికి, ఇదేమీ మన స్వంతం కాదు”
    >> ఈ మాటలు ఏనాడైనా పత్యక్షంగా వినిపిస్తే అన్న వాళ్ళకు సన్మానం చేయాలని ఉంది.
    అనర్ధాలు జరుగుతాయని తెలిసినా నచ్చినవాళ్ళకు పదవులు, ఉద్యోగాలు ఇవ్వడం మన చుట్టూ జరుగుతున్నదే. అలా కాక మీ కథలో నాయకునిలా ఆలోచించగలిగిన వారికి మనం జేజేలు పలకాలని అన్నాను. సమాజంలో అలా ఆలోచించేవారు నాకు చాలా మందే తారసపడ్డారండి. నా చుట్టూ ఉన్నారు, నన్ను అనుసరిస్తున్నారు కూడాను. అయితే వాళ్ళ అభిప్రాయాలను నలుగురిలో వ్యక్తం చేసి జరుగుతున్న అసమానతలకు అసమ్మతి పలకలేరు. మంచివాళ్ళు పాపం.

    “వినత నిన్ను కాదన్నదని పగ తీర్చుకుంటున్నావా దేవ్?”
    >> నెత్తి మీద మంచితనం కిరీటం మోస్తున్న వాళ్ళపై బ్రహ్మాస్త్రమే ఇది.
    అతని ఆలోచనా ధోరణి తెలిసిన అతని స్నేహితునిడే అతన్ని వెంటనే అర్ధంచేసుకోలేక ఆ మాటనేశాడు. ఇది కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇంత చక్కగా సమాజంలోని అవకతవకలను పట్టుకున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు.

    ముందుగా నాకు మీ కథలో ఈ వాక్యాలే నచ్చాయి. ఇంతవరకే రాసి కథ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదని ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ చివరి రెండు వాక్యాలూ యధాలాపంగా పెట్టాను. ముగింపు అర్ధం చేసుకోవడంలో కథ చివరి వాక్యం మిస్ లీడ్ చేసిందని చెప్పొచ్చు. గొడవ ఒదిలి పోయిందని రాయడంలో నా ఉద్దేశ్యం ఆవిడ సమస్య ఈయనను వదిలిందని. ఎంతకాలం ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రతిగా ఆవిడ ఈయన గురించి ఏమీ చేయక పోయినా, కనీసం మాట్లాడకపోయినా. రెండవ సారి చదివినప్పుడు కాని నాకు ముగింపు అర్ధం కాలేదు. మీ కథలోలాంటి వ్యక్తులతో మాకు ఒకప్పుడు సన్నిహిత పరిచయం ఉండేది. చివరకు విడిపోయారు కాని, తన భార్య విషయం ఎలా అర్ధం చేసుకోలేక పోయాడు ఈ పిచ్చిమారాజు అని ఎన్ని సార్లు అనుకున్నామో! ఇక్కడ పిచ్చిమారాజు అని ఎలా వాడానో అక్కడ అయ్యవారు అని అలానే వాడాను తప్ప వ్యంగ్యాస్త్రం వెయ్యాలని కాదు. వారి ఇద్దరి జీవితాలలోని ఒడిదుడుకులతో కథ నడిచిందే తప్ప సమాజపరంగా వారు కలిగించిన నష్టమేమీ లేదు కనుక అవి వ్యంగ్యాస్త్రాలు వేసేటువంటి పాత్రలూ కాదు.

    ఒక రచన చేయడం వెనుక కష్టం నాకు తెలుసు, ఒక చిన్న మాట ఎంతటి ప్రోత్సాహానిస్తుందో కూడా అనుభవమే. అందుకే చదివిన ప్రతి రచనకీ, ముఖ్యంగా నచ్చిన రచనలకు వ్యాఖ్య పెట్టి ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంటాను.

    • sailaja Chandu says:

      గొడవ ఒదిలి పోయిందని రాయడంలో నా ఉద్దేశ్యం ఆవిడ సమస్య ఈయనను వదిలిందని.

      సమస్య, గొడవ, వదిలిపోవడం…ఆవిడను మీరు సమస్యగా అనుకున్నారు కానీ, హీరో అనుకోలేదు. బయటినుండి చూసే వారికి వాళ్ళది గొడవలాగా అనిపిస్తుంది. వాళ్ళు ఇలా ఉండొచ్చుగా , అలా చెయ్యొచ్చుగా అని అనడానికి, కనీసం అనుకోడానికి మనకే హక్కూ ఉండదు. అవి వాళ్ళ జీవితాలు.

      ఎంతకాలం ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రతిగా ఆవిడ ఈయన గురించి ఏమీ చేయక పోయినా, కనీసం మాట్లాడకపోయినా

      ఎంతకాలమైనా ప్రేమిస్తాడు. ప్రేమించాడు. మీకూ, నాకూ ఉండే పారామీటర్స్ ను ఫాలో అవ్వడు. అందుకే మీకు వింతగా ఉండొచ్చు.

      వాళ్ళ జీవితాలకు వాళ్ళే రాజులు. మనకు బాగున్న రీతిలో ప్రవర్తించరు . మీరనుకున్నట్టో , నేననుకున్నట్టో ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఆ స్వేఛ్చా పరిధిని మనం దాటకూడదని చెప్పాలనుకున్నాను. అందుకే ‘అమ్మవారు, అయ్యగారు, పిచ్చి మారాజు’ లాంటి మాటలు ఎంత పాజిటివ్ సెన్స్ కలిగి ఉన్నా ఒప్పుకోలేదు.

  10. Vijaya Karra says:

    చక్కని కథ ! వివరించక ముందే నాకు జ్యోతిర్మయి గారి భావం అర్థం అయింది, అవే వాక్యాలు నచ్చటంతో సహా. అరే! శైలజ గారు తప్పుగా అర్థం చేసుకున్నారే అనుకున్నాను. రచయిత్రికి అభినందనలు!

  11. sailaja Chandu says:

    ఒక రచన చేయడం వెనుక కష్టం నాకు తెలుసు, ఒక చిన్న మాట ఎంతటి ప్రోత్సాహానిస్తుందో కూడా అనుభవమే. అందుకే చదివిన ప్రతి రచనకీ, ముఖ్యంగా నచ్చిన రచనలకు వ్యాఖ్య పెట్టి ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంటాను.

    రచన ఎప్పుడూ ఇష్టమే…. కష్టమనుకోలేదు.
    ప్రోత్సాహానికి థాంక్యూ వెరీ మచ్

  12. శైలజా !

    ఈ కథ లో ఒక విశేషం నాకు బాగా నచ్చింది ..అదేమిటంటే వాన ..కథలో అన్ని ముఖ్య సన్నివేశాలలో వాన పడుతోంది , ఎవరో అడిగారని వాన పడదు ,ఎవరో వెళ్లి పోయారనీ వర్షం ఆగదు.. ఎవరి ప్రమేయం లేకుండా ,ఎవరి కోసమో కాకుండా ,తనకి ఇష్టం వచ్చిన సమయంలో కురుస్తుంది వాన .. వాన మీద కోపగించుకో గలమా ? ప్రేమ కూడా అంతే, అంతా తీసుకునే వారు కొందరు , అన్నీ ఇచ్చే వాళ్ళు మరి కొందరు ..ఆ చెయ్యి ,ఈ చెయ్యి కలిసి సాగే జీవన యానం ..ఇలాగే ఉంటుంది . స్వార్ధం అని ఒకరు అనొచ్చు , తన జీవన మార్గం తను ఎంచుకుందని ఆమె వాదం , తండ్రివి కాబోతున్నావు అని చెప్పి జీవన దానం చేయమని అర్ధిమ్చే బేలత్వమ్ ఆమె లో లేదు ..చూసే వారికి ఆమె లో స్వార్ధం కనిపిస్తుంది ..స్వార్ధం గా జీవితమ్ బాగు చేసుకోవడం తప్పు కాదు కదా ! రీసెర్చ్ కే జీవితమ్ అంకితం చేసిన అతని దీ తప్పు లేదు , రెండు సమాంతర రేఖలు అంతవరకే ప్రయాణం చేయగలవు . క్లుప్తంగా రాసి ..మాకు కథని పూరిమ్చుకునే అవకాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు .మంచి కథ చదివిన తృప్తి నాది .

    వసంత లక్ష్మి

    • Sailaja Chandu says:

      వసంత లక్ష్మి గారూ, చదివినందుకు, వ్యాఖ్యానించినందుకు థాంక్సండీ.

  13. సుమబాల says:

    కథ కథలా లేదు…జీవితంలా ఉంది..శైలజగారూ మీరు ఇదివరకు రాసిన రచనలు కూడా చదివాను…చక్కగా చదివించే శైలి మీది. ఇద్దరిలో ఎవరిది తప్పు అని చర్చ జరుగుతున్నట్టుంది..కానీ ఎవరివైపు నుండి చూస్తే వారిదే రైట్..జీవితం ఇంద్రధనుస్సు లాంటిది…అన్ని వర్ణాలూ ఉంటాయి. ఉండాలి…కేవలం కొన్నింటికే పరిమితం అవుతామంటే మిగతా రంగులు మిస్ అవుతాయి. చివర్లో అతను రిగ్రేట్ అవ్వడానికి ఆ మిస్సింగే కారణమేమో..ఆమెకు అతని మీద ప్రేమ లేక కాదు కానీ జీవితం చాలా డిమాండ్ చేస్తుంది..ప్రాక్టికాలిటీ ఉంటుంది..అదే వినత ఫాలో అయ్యింది..నాకనిపించినంత వరకూ ఇదీ..ఏమంటారు?

    • Sailaja Chandu says:

      సుమబాల గారూ, మీ కామెంట్ తో నాక్కూడా ఓ క్లారిటీ వచ్చింది. థాంక్యూ.

  14. మీ రచనలు కౌముది లో చదువుతూ ఉండటం వల్లేమో నాకు ఈ కథ జీవితం లానే అనిపించింది .
    వినత తప్పు లేదు , దేవ్ తప్పు లేదు . ఇది అంతే . దేవ్ , వినత రెండు జీవితాలు ఒకటి కాదు.
    ఈక్వేషన్స్ తో నడిచే ప్రేమలు మన చుట్టూ బోలెడన్ని , ఈక్వేషన్స్ లో ఉన్నామన్న సంగతి కూడా తెలియదు .

    • Sailaja Chandu says:

      వెంకట్ గారూ, చదివినందుకు, కామెంట్ కూ థాంక్యూ.

  15. జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇది తప్పు ఇది కరెక్ట్ అని నిర్వచించలేం. ఎవరి ప్రయరిటిస్ వారివే. ఆమెపై ఎంత ప్రేమ ఉన్నా అతనికి తన రీసెర్చ్ ప్రయారిటి. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అతని జీవన విధానం నచ్చన తన దారిలో తను వెళ్ళిపోయింది. తనకేం కావాలో అంత కచ్చితంగా తెలిసిన వినత కొడుకు అవార్డు కోసం దేవ్ ని అడగటం మాత్రం నచ్చలేదు. వినతది స్వార్థం అనను, అతని ప్రేమను అర్థం చేసుకోలేక వెళ్ళిపోయింది అనే నెపం కూడా కాదు. ఒకవేళ ఉండిపోయి ఉంటే, రిసెర్చ్ లో మునిగిపోయిన దేవ్ తో త్యాగమయి అనే పేరైతే వచ్చేదేమో కానీ ఆమె సంతోషంగా ఉండేది కాదు. అసలు వినతది స్వార్థంమేమో అనే ఆలోచన మనకు ఎందుకు రావాలి? దేవ్ వినతతో ఎందుకు వెళ్ళకూడదు, మరి అది స్వార్థం కాదా అనే ఆలోచన ఎందుకు రాదు? వినత కోణంలోనుంచీ కొన్ని పాయింట్స్ రాసి ఉంటే ఇంకా బాగుండేదేమోనండి.
    ఆలోచనాత్మకమైన కధ.

    • Sailaja Chandu says:

      వినత కోణంలోనుంచీ కొన్ని పాయింట్స్ రాసి ఉంటే ఇంకా బాగుండేదేమోనండి.

      నిజమే. ఒప్పుకుంటాను. పబ్లిష్ అయిన తర్వాత కథ చదివుతుంటే నాక్కూడా అనిపించింది ప్రవీణా. నీ అభిప్రాయానికి థాంక్స్

  16. నీహారిక says:

    “చేసే పనిలో ఏదీ కలపలేక ,అన్నీ పోగొట్టుకున్నానని చెప్పు. అతనికి అర్థం అవుతుంది.”

    మగవాళ్ళందరూ ఒకేలా ఆలోచించాలి లేదా ఆలోచిస్తారు అన్న ధీమా కనపడుతోంది. మగవాళ్ళకి ఉన్న క్లారిటీ ఆడవాళ్ళకు ఉండడం లేదు. ఎప్పటికి వస్తుందో ?

  17. కథ బాగుంది మేడం.

    “ఇన్నాళ్ళూ నీగురించి, వాడికి చెప్పకపోవడం తప్పనిపించేది. ఇప్పుడా ఫీలింగ్ పోయింది. థాంక్స్.”

    కథలోని ఈ ఒక్క మాట వినత ను దోషిని చేసింది.

    “చేసే పనిలో ఏదీ కలపలేక ,అన్నీ పోగొట్టుకున్నానని చెప్పు. అతనికి అర్థం అవుతుంది.”

    ఇది ఇంకా బాగా రాసి ఉండొచ్చనిపించింది. కథలో చాలా ముఖ్యమైన మాటగా నేను ఫీలయ్యాను.

    • Sailaja Chandu says:

      శ్రీకర్ గారూ, థాంక్యూ.
      మీరు చెప్పింది నిజమే.
      మీరు చెప్పినట్లు నేను కూడా అదే ముఖ్యమైన వాక్యం అనుకున్నాను. ఆ వాక్యానికి ఆల్టర్నేటివ్స్ కొన్ని రాసి చివరికి ఇది ఉంచాను. ఇప్పుడు చూస్తే నాకూ నచ్చ లేదు.

  18. Sudha Rani says:

    శైలజ గారు మీ కథ చదవడం ఇదే మొదటిసారి.మీ శైలి చదివించేలా చేసింది.కథలోని వ్యక్తుల జీవితాలు బయట చాలామందితో సరిపోలుతాయని అన్పించిందండి.దేవ్ మొదటిసారి తనతో వెళ్ళడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు, కాని వినత మల్లి వచ్చి తన నిర్ణయం చెప్పి అతని korikento వినలేదు.నిజంగా ఒక మనిషితో సహచర్యం చేయాలంటే, వాళ్ళ లోటుపాట్లను భరించగలగాలి.తను ముందే వృత్తి లోనే సంతోషముందని ,ఎక్కువ సమయం గడపలేనని చెప్పాడు కదండీ.తానేంటో ముందే తెల్సి, నా ప్రపంచోలికి నువ్వు రాలేవు, నీ లోకంలోకి నేను రాలేను అని ఎలా అన్కోగల్గింది. కొంచెం వివరిస్తారా.

  19. Sasikala Volety says:

    కధ చాలా బాగుంది శైలజగారు. అతని మనసు ప్రేమకు వశం కానీ జీవితం మాత్రం కాదు. ఆమెది ముందు నుంచీ అవకాశవాదమే. ఆ రిలేషన్లో ఆమె కోల్పోయింది తక్కువే
    విడిపోదామనే ఆమె నిర్ణయం కూడా తప్పులేదు.ఆమెక్కూడా తన జీవితం ముఖ్యమే.కదా. ఆమె ప్రేమ అతన్ని తన ప్రాణాలు తృణప్రాయంగా చూసేట్టు ప్రేరేపించాయి. ఆఖరికి ప్రాణత్యాగమే చేసాడు.కానీ ప్రేమ కన్నా పరిశోధన ఎక్కువని నమ్మిన వ్యక్తి తన ప్రాధమికాలు మరిచిపోవడం ఆఖర్లో అతని సున్నిత హృదయాన్ని, మనోదౌర్బల్యాన్నీ సూచిస్తుంది. తనకో కొడుకు, వాడి ఉన్నతికి తను సాయం చెయ్యలేని స్థితికి మూల్యం అతని మరణం. అయితే ఇన్నాళ్ళూ అంత మెతకగా ఉన్న వ్యక్తి నోరిప్పి, కొంత పరుషంగా వినుత ని ఎదిరించి తన వాదన వినిపించి ఉంటే బాగుండేదేమో. ఏదయినా ముగుంపు మనసులో విషాద ఛాయల్ని నింపింది.

  20. Sailaja garu prema ante ento chalaa hrudyangaa cheppaaru kudos love j

  21. Nagajyothi Ramana says:

    కథ చాలా బావుంది ….ఏ రిసెర్చ్ ల వల్ల భర్త తనకు దూరం అయ్యాడో …మరి కొడుకు కూడా అదే పంథాలో కష్టపడేలా వినత ఎలా పెంచిందో అర్ధం కాలేదండీ ….అసలు భర్తకు దూరంగా ఎలాగూ తన బ్రతుకు తను బ్రతుకుతోంది …అప్పుడు తన బ్రతుకు లో తనకు ఏదీ అడ్డం కాలేదు కదా,…డివోర్స్ వల్ల సాధించింది ఏమిటో తెలియలేదు …..నాకెందుకో అవార్డు విషయం లో కూడా అప్పటికే నిర్ణయమయి పోయిన వ్యక్తిని కాదని, తనవాళ్ళకు ఇవ్వలేదనే నెపం దేవ్ కూ అంటగట్టబడినట్టే అనిపిస్తోంది …..పైగా తానేమిటో ,తన పనేమిటో అన్నట్టు ఉండే దేవ్ దగ్గరకు తనంతట తనే రావటం…ప్రేమను పంచటం , ఆ తరువాత తృణీకరించటం …ఇదంతా వినత లో నిలకడ లేని తనాన్ని సూచిస్తున్నట్టు అనిపించింది …. వినత ఉద్యోగం మానేసి రమ్మన్నప్పుడు దేవ్ వెళ్లకపోవటం ,దేవ్ రాలేకపోతే వినత ఆగలేకపోవటం….ఇద్దరికీ దాంపత్య జీవనం కన్నా ,వృత్తి ధర్మమే ఎక్కువన్న నైజం సూచిస్తున్నా …ఎందుకో పరిధి దాటి బైటకు రాలేని అశక్తత ఉన్నవాడిని … నైరాశ్యం ,తుఫాన్ లా కమ్మి తనలో చేర్చుకోవటం …కొంచెం బాధ గానే ఉంది ………

  22. కె.కె. రామయ్య says:

    ‘మనసులో గుబులు, తుఫానులా అలజడి కమ్ముకున్నాయి’. మంచి కథ చదివిన అనుభూతి కలిగింది.
    రచయిత్రికి అభినందనలు

Leave a Reply to Sailaja Chandu Cancel reply

*