నేను సైతం…

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi బావా బాగున్నావా?

ఇక్కడ నేనూ చంద్రబాబునాయుడూ బాగున్నాం. మరి అక్కడ నువ్వూ ఒబామా బాగున్నారా? ఇక్కడ అమరావతి రాజధాని పదిలం. మరి అక్కడ రాజధాని వాషింగ్టన్ డీసీ పదిలమని భావిస్తాను.

బావా.. నీ దేశభక్తీ రాష్ట్రభక్తీ అపూర్వం. అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల వుండీ కూడా రాజధాని నిర్మాణం కోసం డాలర్ ఖర్చెట్టి నీవంతు ఆన్ లైన్లో ఆరు యిటుకలు పంపావు. నీ మెయిలు చదివాక నావొల్లూ వొంటి మీది రోమాలూ నిక్కబొడుచుకున్నాయనుకో. ఒక్క డాలరుకు ఆరిటుకలు. చౌకే బావా.. కారు చౌక! పది రూపాయలకు వొక యిటుక. మన లోకల్లో కూడా ఆ రేటుకి దొరకడం లేదు. మనలో మన మాట. తక్కువ పెట్టుబడి. ఎక్కువ లాభం. చరిత్ర నిర్మాణంలో నీదీ వొక యిటుక వుండడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. రాజధాని నిర్మాణంలో నువ్వు  వుండడం బాగుంది. బహు గొప్పగా గర్వంగా కూడా వుంది. కాని మాకు ఆ అదృష్టం లేదు..

బావా.. నిజమైన దసరా పండుగంటే యిదే. రాజధాని నిర్మాణం ప్రారంభించడానికి ప్రధానమంత్రి వస్తూ వస్తూ యేo తెచ్చారో తెలుసా? ప్రత్యేకహోదా తెచ్చి యిచ్చి రాజకీయం చెయ్యలేదు. రాజకీయ లబ్ది పొందాలనుకోలేదు. భక్తితో పార్లమెంటు ప్రాంగణంలోని మట్టి, యమునానది నీళ్ళూ తెచ్చి యిచ్చారు. ‘దేశమంటే మనుషులు కాదోయ్.. మట్టోయ్! మంచి నీళ్లోయ్..’ కవి వాక్కుని నిజం చేసారు. రుజువు చేసారు.

మరి మన ముఖ్యమంత్రిగారు యేoచేసారని అడుగు.. పవిత్రమైన పుణ్యస్థలాలనుండి నదులనుండి పుట్టమట్టి, నీళ్ళు తెప్పించారు. అటు అమృతసర్  మానససరోవరం నుండి.. యిటు జంజాంబావి ఆజ్మీర్ కడప దర్గా దాక. అంతేనా? పదహారు వేల గ్రామాల నుండి మన్నూ నీళ్ళూ కలశాలలో తెప్పించారు. దుర్గమ్మకి మొక్కారు. పూజలు చేయించారు. యజ్ఞయాగాలకీ వేదమంత్రాలకీ కొదవలేదు. హెలీకాఫ్టర్ యెక్కి నాయుడుగారు ఆకాశంలోంచి మన్నూ నీళ్ళూ ముప్పై మూడున్నర వేల యెకరాల్లో చిలకరిస్తుంటే వొళ్లు పులకరించిపోయింది బావా.. కాని మాకు ఆ అదృష్టం లేదు..

బావా.. పులిహోరా పొట్లాలు.. టీ కాఫీలు.. పచ్చళ్ళు ఫలహారాలు.. కాఫీలు మజ్జికలు.. దద్దోజనం చక్రపొంగలి.. పండగనుకో బావా.. లక్షలాది మంది.. ఆటపాటలు.. అదొక సందడనుకో.. మళ్ళీ మన కళ్ళతో మనం చూడలేమనుకో.. కాని మాకు ఆ అదృష్టం లేదు..

కుర్రోళ్ళు ఆరోజుకి పోలీసు వుద్యోగాలు చేసేసినారు. ముందు డ్యూటీ చేస్తే రేపు రిక్రూట్మెంటు జరిగినప్పుడు వెయిటేజీ యిస్తామంటే.. అందరూ లాఠీలు అందుకున్నారు. కాని మాకు ఆ అదృష్టం లేదు..

అన్నిటికీ అదృష్టం లేదు.. అదృష్టం లేదు.. అంటన్నాననా? ఔను బావా.. మన వూరు తీరు నీకు తెలియంది కాదు. పుట్టమట్టి కాకపోయినా గట్టుమట్టి అయినా కలశంలో పెట్టి పంపిద్దామని అనుకున్నాం. ఏదీ? ఎక్కడిదీ? గట్టూ పుట్టా యేదీ లేదు!? వూరు వూరులాగ లేదు. సెజ్జులకి కొంత.. థర్మల్ పవర్ ప్లాంటులకి కొంత.. కార్పోరేట్ కంపెనీలకి కొంత.. కెమికల్ కంపెనీలకి కొంత.. మందుల కంపెనీలకు కొంత.. కొంతా కొంతా అంతా యివ్వగా యేముంటాది సంత? ఒట్టు.. మన వూర్లో చస్తే కాల్చడానికి జాగా లేదు! పోయిన మనిషిని మట్టిలో కలపడానికి లేదు! మట్టి యెక్కడినుండి పంపేది?

మట్టి లేదు సరే, మంచి నీళ్ళో మరుగు నీళ్ళో పంపిద్దామంటే యేదీ? యెక్కడిదీ? మనకి తాగడానికే మన వూరిలో మంచి నీళ్ళు లేవు. ఉన్నదల్లా ఫ్లోరైడ్ నీళ్ళు.. పవర్ ప్లాంటుల సున్నపు బూడిద నీళ్ళు.. కెమికల్ ఫ్యాక్టరీలు వదిలిన బురద నీళ్ళు.. మందుల ఫ్యాక్టరీలు వదిలిన విషపు నీళ్ళు.. ఆ నీటిల చెయ్యెడితే నిప్పుల చెయ్యిట్టినట్టే.. మంటా దురదా.. బాబుగారికి అవి పంపడం బాగోదు కదా.. ఆయన గోక్కుంటూ కూర్చుంటే మన అమరావతి పరువు పోదా? పండగనాడూ పాత మొగుడే అన్నట్టు.. దసరా రోజూ మనూర్లో- చుట్టుపక్కల వూళ్ళల్లో- కిడ్నీ వ్యాదులతోటి రాలిపోయినోళ్ళు వోక్కరోజుకి ఆగనయినా ఆగకుండా రాలిపోయినారు..

ఈ పరిస్థితుల్లో రాజధానికి వెళ్ళలేకపోయాం గాని టీవీల్లో చూసాం. అప్పటికీ యిటుక పదిరూపాయలె కొందాం అని మన కుర్రాళ్ళతో అన్నాను. పదిరూపాయలకు పెగ్గు వొస్తోందని, మనిషికి నాలుగు పెగ్గులు పోసుకున్నారు. రాజధాని నిర్మాణంలో మనం భాగం కామా అని అడిగేశాను బావా.. ఈ పెగ్గూ గవర్నమెంటుదే.. ఈ పదీ పదీ వందా వెయ్యీ వెళ్ళేది గవర్నమెంటుకే.. రాజధాని నిర్మాణానికి రాల్లెత్తిన కూలీలం మనమే అని అన్నారు బావా.. ‘నా పెగ్గూ నా అమరావతీ’ అని నినాదాలు కూడా యిచ్చారు బావా.. అక్కడితో మనోళ్ళు ఆగలేదు బావా.. ‘మేకిన్ ఇండియా’ కింద రాజధాని నిర్మించాలని నానాగొడవ చేసారు తెలుసా బావా..

అలాక్కాదురా, లక్ష కోట్లతో రాజధాని నేను చెపితే యేమన్నారో తెలుసా బావా.. మనదేశ జనాభా యెంత అని అడిగినారు. నూట పద్దెనిమిది కోట్లు అన్నా. మన రాష్ట్ర జనాభా యెంత అని అడిగినారు. అయిదు కోట్లు అన్నాను. నువ్వు లెక్కేట్టినావా అన్నారు. తాగుబోతు యెదవలు అని తిట్నా. తప్పు దేశ భక్తులం.. రాష్ట్ర భక్తులం అన్నారు. ఈ దేశాన్ని పాలిచింది ఆలు కావచ్చును గాని పోషిస్తున్నది మేమే అన్నారు. ఒప్పుకోక చస్తానా? ఒప్పుకున్నాను. దేశ ప్రజలందరూ మనిషొక లక్ష యిస్తే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతాయి, యెంచక్కా కట్టీయొచ్చాన్నారు. అలాగే మన రాష్ట్రంలో వొక్కో కుటుంబం కాదు, వొక్కొక్కరూ వొక యిరవై లక్షలిస్తే యెంచక్కా లక్ష కోట్లు అవుతాయని, అప్పుడూ ప్రపంచ స్థాయి రాజధాని కట్టీయొచ్చాన్నారు.

యేo బావా.. పిడికెడు మట్టీ గుక్కెడు మంచినీళ్ళు యివ్వలేని వాళ్ళం లక్షలు యివ్వగలమా? అదేమాటని మనోల్లతోటి అన్నాను. ఏమన్నారో తెలుసునా? ‘ప్రపంచానికి రాజధానా? ప్రపంచ స్థాయి రాజధాని కట్టడానికి? మన రాష్ట్రానికి రాజధానా? మన రాజధాని మన స్థాయిలో వుండాలి!’ అన్నారు బావా.. ‘రాజధాని ఆకాశమెత్తు కడితే మాత్రం మనకేటి? కడుపు నిండుతుందా? కాలు నిండుతుందా?’ అని అడిగారు బావా..

నువ్వు ఫీలవకు బావా.. తాగుబోతుల మాటలు అస్సలు పట్టించుకోకు బావా.. నువ్వంటే బాగా చదువుకున్నోడివి బావా.. దేశభక్తీ రాష్ట్రభక్తీ రాజధాని భక్తీ వున్నోడివి.. అందుకే నీ పేరు చిరస్థాయిలో నిలబడిపోతోంది.. నీకు బావనైనందుకు నేను గర్విస్తున్నాను! నీకు బావగానే మరణిస్తాను!

జై బావ! జై జై బావ!

యిట్లు

మీ

 బావ

మీ మాటలు

  1. buchireddy gangula says:

    రావు గారు
    మీ బావ గారి కి హాయ్ చెప్పండి సర్
    సన్మానాలు — శాలువలు కప్పుతే —-ఏళ్ళ తరబడి తెలుగు సంగాల కు విరాళాలు
    కుమ్మరించే వాళ్ళు లేక పోలేదు —-plus.. family . పేరుతో తెలుగు సేవ అంటూ
    విరాళాలు సేకరించే వాళ్ళు ఉన్నారు —బాబు గారు usa. కు వచ్చి అడుగుతే
    డబ్బే — డబ్బు — అ రోజు కూడా రానుంది — బాబు గారు శాలువలు కప్పడం — వారితో
    బొమ్మలు దిగడం — అవి పత్రికల్లో —రావడం —— చూచుకొని మురిసి పోవడం —-

    అమెరికా లో బతుకమ్మ పండుగ ల లో మా ప్రవాస నేతలు ఉపన్యాసాలు కూడా
    యిస్తూ — గుర్తింపుల కోసం ఆరాటపడుతూ —–??? ఎన్ని వందల యిటుకలు అయినా
    పంపగలరు —డా లర్ మహత్యం ??? రాజకియెం ???
    —————————————————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  2. బజరా గారూ మంచి హాస్య వ్యంగ్య రచన . హాస్యం వ్యంగ్యం తో పాటుగా ఆలోచించే విధంగా ఉంది.

  3. ఇది చదివే అదృష్టం మాకుంది. కాని, చదివాక నవ్వాలో ఏడ్వాలొ డాలర్ బావనే అడగాలి..

  4. కె.కె. రామయ్య says:

    ‘రాజధాని ఆకాశమెత్తు కడితే మాత్రం మనకేటి? మన కడుపు నిండుతుందా? కాలు నిండుతుందా?’ అన్నమనోల్లను తలుచుకుని గర్విస్తున్నాను బావా.

  5. సుమనస్పతి says:

    వా, బాగున్నదే బావా!

  6. Wilson Sudhakar says:

    ఇండియాలో ఏ నదీ తీరను

  7. BL Narayana says:

    నిష్టురం అయిన నిజాన్ని వ్యంగంగా చక్కగా చెప్పారు థాంక్స్

  8. తహిరో says:

    ఇంతకీ నీ ఉత్తరం అమెరికా బావకు చేరిందా బమ్మిడీ :)
    బాగా నవ్వించావు . అమెరికా బావకు నువ్వూ బావవేనా … లేక ఏదన్నా చుట్టరికం కలుపుతున్నావా ? మామూలుగా వియ్యమొందుతే కదా ఈ వరస – నాకు తెలీకే అడిగా సుమీ !

  9. delhi subrahmanyam says:

    బజారా గారు, ఎంత ఆలోచనాపరమయిన వ్యంగ్యం గా రాసారండీ.అభిందనలు. మీ మాటలు వినాలని మేము డిల్లి లో నవంబర్ 8 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.

Leave a Reply to buchireddy gangula Cancel reply

*