దిక్సూచి

– బద్రి నర్సన్
~
narsan
గాంధీ, గాడ్సేలు మిగిల్చిన కాష్ఠాన్ని
వంతులవారిగా వారసులు
పొతం  చేస్తున్నారు,
జనాభా లెక్కలంటే దేశ పౌరులని మరచి
సుంతీలు యిన్ని, పిలకలిన్నేసని
దువ్వే కాళ్లకు కత్తులు కడుతున్నారు,
నోటి కాడి ముద్దపై పహారా కాస్తూ
ఆహార పట్టికల్ని జారీ చేస్తున్నారు
చెవుల్లో సీసం, నాలిక తెగ్గోతకై
రంగం సిధ్దం చేసేందుకు
మందీ మార్భలం మద్దతుకై
పాఠ్యాంశాలను కూల్చివేస్తున్నారు,
మూతికి ముంత ముడ్డికి తాటాకు
కట్టినా కనిపెట్టలేని నమూనాల కోసం
విదేశీ కంపెనీలకు ఆర్డర్లిస్తున్నారు,
నేలమీది జీవుల్లో నికృష్టులు వీరు
మనుషుల మధ్య నరమేధమే మతమైతే
మతం నాది కానేకాదు
ఇక సంస్కృతి సాంప్రదాయాల సవాలే లేదు
మండే గుండెతో కాలే కడుపుతో
మైదానంలోకి దిగినాక
చావో రేవో ఏదైనా
తల ఎత్తుకొనే
తరాలకు దిక్సూచి గానే.
       *

 

మీ మాటలు

  1. నిజాల్ని నిర్భయంగా చెప్పారు.

  2. బాగుంది. విషయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

  3. చందు - తులసి says:

    నర్సన్ గారూ…మీ కవిత చాలా బాగా ఉంది…
    అలాగే మీ కలానికి పదును ఎక్కువ..

    • థాంక్స్ … చందు గారు మీ కథలు బాగుంటాయి, నేటివిటి దగ్గరకు తీసుకుంటుంది.

  4. m.viswanadhareddy says:

    పాలకులు గుణ పాఠాలను గుర్తు పెట్టుకుంటే పాఠ్యాంశాలను పాడుచేయరు అధికారం అంధకారము ఒకటే అనిపిస్తుంది సార్

Leave a Reply to m.viswanadhareddy Cancel reply

*