జీవితంలో బతకడం మహా కష్టం….

– కందుకూరి రమేష్ బాబు
~
Kandukuri Ramesh‘జీవితంలో బతకడం మహా కష్టమైతోంది’ అన్నాడాయన.
జీవితంలో బతకడం?!!
ఏమిటది?
+++
చదువుకున్న మనిషే.
మనలా మాట్లాడే మనిషే.
కానీ, తూలుతున్నాడు.
తాగాడనుకున్నాను. కానీ, తాగాడుగానీ అంతకన్నాఎక్కువ కాలి దెబ్బ నొప్పి.
అది తనని బాధపెట్టడం.
నిజమే.
అతడు అనుకోకుండా చెప్పకోసాగాడు.
తాగడం వల్లే కావచ్చు. ఫర్లేదు.
ఎప్పుడో ఒకసారి వినాలి. చెప్పనిస్తూ వినాలి.
తన కాలికి దెబ్బలు. పాదానికి ఒక కట్టు. స్లిప్పర్స్ లో కాలు నిలవడం లేదు. అయినా నడవాల్సి వస్తోంది.
ఆ దెబ్బను చూపిస్తూ ‘చాలా కష్టంగా ఉంది’ అంటూ చెప్పసాగాడాయన.
తను ఈ చిత్రంలోని మనిషి కాదు.
కానీ, ఇలాంటి చిత్రం పెట్టుకునే చెప్పాలి.
అవును మరి. స్ఫూర్తిదాతల విగ్రహాలకన్నా వ్యథార్థ జీవిత విగ్రహాలు మాట్లాడితే ఎవరు వింటారు?
కానీ, వినాలి.
ఆ చెప్పే అతడికి భుజాన కాగితాల సంచి లేదు.
బహుశా పని చేసుకుంటున్న మనిషి కాదనిపించింది.
ఎవరాయన?
రోడ్డున పడ్డ జీవితమా?
అలా అనుకుందాం కాసేపు.
అవును.
నగరంలో రోడ్డుమీది జీవితాలు చాలా.
అందులో అతడిదొకటి.
ఆ జీవితాలు బతకడంలోని బాధలు చాలా రకాలు.
అందులో ఒక రకం ఈ ఆందోళనకరమైన ప్రశ్న అది లేదా పంచుకున్న ఒక అసంబద్ధ సమాధానం.
‘జీవితంలో బతకడం మహా కష్టమైతోంది’
+++
అసలు విషయం చెప్పాడు.
ఎవరినైనా, ఏమైనా అడగాలంటే కష్టంగా ఉందని కూడా చెప్పాడాయన.
సహాయం చేయమనాలన్నా, ధర్మం అడగాలన్నా కష్టంగానే ఉందని చెప్పాడాయన.
‘మనిషిని మనిషి దోచుకుంటాడు’ అని చెప్పాడాయన.
దోచుకోవడం?
వివరించాడు.
‘అసలు జేబులో రూపాయితో రోడ్డుమీద పడుకోవడం ఎంత ఇదిగా ఉందో తెలుసా?’ అని ప్రశ్నించడాయన.
అప్పటికే నాతో అతడు మాట్లాడుతూ ఉంటే పాన్ షాప్ యజమానికి చిరాకేసి అతడిపై అరిచాడాయన.
‘చూశారు కదా. మనుషులతో మాట్లాడితే కూడా కష్టంగా ఉంది మనుషులకు’ అన్నాడాయన.
తానింకా ఇలా తన బాధను పంచుకున్నాడు.
‘ఎవడో పిచ్చివాడు రాత్రి నిద్రలేపుతాడు. జేబులో ఉన్నవన్నీ ఇవ్వమంటాడు. లేకపోతే చేతిలోని రాయిని చూపి బెదరగొడతాడు. అసలు రోడ్డుమీద బతకాలంటే కష్టంగా ఉంది’ అని మళ్లీ వాపోడాయన.
+++
నిజం.
రాత్రుల్లు పడుకుంటే ఎవరు నిద్ర లేపుతారో తెలియదు.
చంపేస్తానని అరిచి ఉన్నది లాగుకునే మనుషుల దేవులాట.
చిత్రమేమిటంటే ఇతడు అతడవుతాడు.
అతడు ఇతడవుతాడు.
ఉన్నప్పుడు ఇతడు నిద్రిస్తాడు.
లేనపుడు అతడు దోచుకుంటాడు.
ఒక రాత్రి ఇది. రాత్రులన్నీ ఇలాగే ఒకరితో ఒకరు.
అదే చెప్పాడాయన.
జీవితంలో జీవించడం నరకంగా మారిందని వివరించాడాయన.
ఈ రొడ్డుమీది బాధ మనకు అర్థం కాదు.
రోడ్డు లేదా ఫుట్ పాత్ మీద జీవితం మనకు అస్సలు అందదు.
అదంతా ఒకటే అనుకుంటాం.
అందరి కష్టాలు ఒకటే అనుకుంటాం.
కానీ, మనమెలా ఎవరి లోకంలో వాళ్లుంటామో వేరే వాళ్ల లోకాలపై అడ్వాన్స్ అవుతూ ఎలా ఆక్రమించుకుంటామో వాళ్లూ అలాగే ఉంటారని, చేస్తారని ఎందుకు నమ్మం!
నమ్మాలి.
ఇది మనందరి దృశ్యం.
దృశ్యాదృశ్యం.
ఇరవై ఏళ్లుగా రోడ్డుపై ఉన్నవాళ్ల జీవితం వేరు.
నాల్రోజుల కింద రైలు దిగి ఫుట్ పాత్ ను ఆశ్రయించిన వారి పరిస్థితీ వేరు.
తేడా ఉంది.
కానీ, ఒకటే అనిపిస్తుంది!
వాళ్లూ మనమూ వేరని అనుకుంటాం.
వాళ్లంతా ఒకటి. మనమంతా ఒకటి అనుకుంటాం.
కాదు.
కాదని చెబుతున్నాడాయన.
విగ్రహాలను పడగొడుతున్నాడాయన.
+++
నిజానికి తనలా ఒక ఫుట్ పాత్ డ్యుయలర్ మాట్లాడే భాషని మీరు వినాలి.
రోడ్డు మీది జీవన వ్యాకరణం. ఎంతో అందంగా ఉంటుందా భాష.
అందం అంటే వాస్తవం. సత్యం.
చక్కటి కవిత్వం పలుకుతుందా వ్యక్తీకరణ.
తాత్వికతా ధ్వనిస్తూ ఉంటుంది కూడా.
అందులో దుఃఖం ఉంటుంది. బాధా ఉంటుంది.
నిస్సహాయతా ఉంటుంది. కానీ, వినాలి.
నిద్రించే మన చేతని లాగి కొట్టే సుషుప్తి ఆయన.
విగ్రహం మాదిరిగా ఉండటం కాదు. వినాలి.
భద్ర జీవితంలో ఉన్న అభద్రత ఎలాంటిదో అభద్రత, భయాందోళనలకు గురయ్యే వీధి జీవితాల్లోనూ భద్రత అంతే అనుకుని మనందరం ఒకటే అన్న స్పృహతో మెలగాలి.
ఎంత చెట్టుకు అంత గాలి అనుకోకుండా అందరం ఒకే చెట్టు ఆకులం అనో, భూమిలో దాగిన వేళ్లమనో అనుకోగలగలి. లేకపోతే వాళ్లూ మనమూ వేరు వేరు.
తనవి రోడ్డు మీది వ్యక్తి ప్రేలాపనలే అవుతాయి అవి!
కానీ, మనవే అవి.
అతడు రాత్రి మాత్రమే ఇబ్బంది పడతాడు.
మనం పగలూ పడతాం.
కానీ, వాళ్లు వేరనుకుంటాం.
ఒక్కోసారి వాళ్లే నయం అనీ అనుకుని ఊరుకుంటాం.
కానీ, వినాలి. వింటే అసలు చిత్రం వేరని తెలుస్తుంది.
విగ్రహావిష్కరణ అంటే అదే.
నగర జీవితంలో ఎన్నో కూడలులు.
ఆ కూడలిలో ఒక విగ్రహం. ఆ విగ్రహం పక్కన సొమ్మసిల్లి నిద్రించే శరీరం.
అది ఏదో నిద్రలో కలవరిస్తుందనుకోవద్దు.
వినాలి.
విని, చెప్పాలి.
ప్రతి కూడలిలో ఒక జీవితం ఆ వ్యక్తి మాదిరి లేచి నిలబడి మాట్లాడుతుంటే స్వామి వివేకానందుడి ప్రసంగం మాదిరిగా మనం అమిత శ్రద్దతో వినాలి. జాతిని మేల్కొలిపే స్ఫూర్తిదాతల ప్రసంగాల మాదిరి వాళ్లను మాట్లాడనివ్వాలి.
అప్పుడు తెల్లవారాలె!
ఒకరు చెబుతుంటే ఒకరు వినడం. ఒకరు వింటుంటే మరొకరు మాట్లాడటం.
ఊహించండి. మీరు ఒక కాలిబాట మీద జీవించే మనిషితో ఒక గంట మాట్లాడటం.
అతడు మీ ‘జీవితంలోని బతకు ఎంత భారంగా మారిందో’ వినడం.
అది అద్భుత దృశ్యం.
అంతదాకా దృశ్యాదృశ్యమే. జీవితంలో బతకడం మహా కష్టం.
*

మీ మాటలు

  1. మీ ప్రతి దృశ్యం ఓ కావ్యం!
    చెవొగ్గి వినాలే కానీ ప్రతి జీవితం ఓ భారతం!

  2. THIRUPALU says:

    /జీవితంలో బతకడం మహా కష్టం/
    అద్బుతమైన శీర్షిక, చావు అన్న భయం లేక పోవొచ్చు. అయితే బ్రతకడం అంటే మహా భయం.

Leave a Reply to ప్రసాద్ చరసాల Cancel reply

*