‘కంచె’లు తొలగి.. చిగురంత ఆశ!

– బుద్ధి యజ్ఞమూర్తి
~
తెలుగు చిత్రసీమలో క్రిష్ ఒక విభిన్న దర్శకుడు. ఇవాళ్టి టాప్ డైరెక్టర్లలో అత్యధికులు మూస కథలు, భావావేశ సన్నివేశాలు, వినోదం, వందమందిని ఒక్కడే అలవోకగా చిత్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నవాళ్లే. వాళ్ళ సినిమాలు కేవలం కాలక్షేపం బఠాణీలే. అవి ప్రేక్షకుల అభిరుచుల్ని ఏమాత్రం పెంపొందించకపోగా, మరింత నష్టాన్ని కలగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఆఖరుకి తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ విశ్వవ్యాప్తం చేసిందని ఎక్కువమంది గర్వపడుతున్నా, నా దృష్టిలో ఆ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచిని కాస్త కూడా పెంచే రకం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆడియెన్స్‌ను అది మెస్మరైజ్ చేస్తే చేసుండవచ్చు. కానీ వస్తుపరంగా అది ఏమాత్రమూ ఉత్తమ స్థాయి సినిమా కానే కాదు.
రాజమౌళికి జనాన్ని ఎట్లా మెప్పించి, వాళ్ల డబ్బు కొల్లగొట్టాలనేదే ప్రధానం. దానివల్ల వాళ్ల ఆలోచనలు వికసిస్తాయా, వాళ్లలో మానసిక చైతన్యం కలుగుతుందా.. అనేది ఆయనకు పూర్తిగా అప్రధానం. ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి. అవన్నీ భావావేశాలు, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు, భీబత్సాలతో నిండివుండేవే. సరిగ్గా క్రిష్ ఇందుకు పూర్తి విరుద్ధ దర్శకుడు. తొలి అడుగు ‘గమ్యం’ నుంచి, ఇప్పటి ‘కంచె’ దాకా అతడి సినిమాలు మానవ సంబంధాలపై అల్లినవే. వివిధ పరిస్థితుల్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎలా స్పందిస్తుంటారు అనే విషయాల్ని కమర్షియల్ పరిధిలోనే వీలైనంత వాస్తవికంగా చూపించే సినిమాలే. ‘కంచె’ ముందు ఆయన హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తీస్తున్నప్పుడు నేను అసంతృప్తి చెందాను.
ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన సినిమాను హిందీలో తీయడంలో ఆయన ప్రతిభ ఏముంది? అసలు ఎందుకు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడా? అనేది ఆ అసంతృప్తికి కారణం. ఆ సినిమా సమాజంలోని.. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అవినీతిపై ఓ వ్యక్తి సాగించిన సమరం. కానీ అందులో వాస్తవికత కంటే, నాటకీయత పాలే ఎక్కువ. అంటే క్రిష్ స్కూల్‌కు భిన్నమైన అంశం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నేను సంతోషించాను. అవును నిజం. అది ఆడుంటే, క్రిష్ ఆ స్కూల్లోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి కదా. అలా జరగలేదు. ఫలితమే ‘కంచె’. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఉదయం మీడియాకు వేసిన 8.45 గంటల షోకు వెళ్లాను. ఇంటర్వెల్ పడింది. క్రిష్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను. యుద్ధ నేపథ్య చిత్రాలు తెలుగులో ఆడవనేది నాకున్న నమ్మకం.
మనవాళ్లు అట్లాంటి వాటికి కనెక్ట్ కారు. క్రిష్ ఈ సినిమాతో ఎంత పెద్ద సాహసం చేశాడంటే, తను తీసుకున్న నేపథ్యం కారణంగా విదేశీ పాత్రల్ని కీలక పాత్రలుగా చూపించాడు. జర్మన్, బ్రిటీష్ పాత్రలుగా అవి మనకు కనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మినహా మిగతా సినిమా అంతా ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉంది. వాటితో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరనేది అప్పటిదాకా నాకున్న అభిప్రాయం. చాలామంది సహచర మీడియా మిత్రులు ‘ఏందీ సినిమా? నాకైతే అర్థం కాలేదు. క్రిష్‌కు డబ్బులెక్కువయ్యాయా?’ అని కూడా అనడం విన్నాను. నలుగురైదుగురు నా వద్ద కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘సెకండాఫ్ కూడా చూసి మాట్లాడండి’ అన్నాను. సినిమా అంతా అయ్యాక నేనెవరి అభిప్రాయం కోసం ఆగలేదు. అప్పుడైనా వాళ్ల నుంచి భిన్నమైన అభిప్రాయం వస్తుందని అనుకోను. నా మనసు నిండుగా ఉన్నట్లనిపించింది.
మనుషుల మధ్య, వాళ్ల మనసుల మధ్య.. హోదాలు, అంతస్థులు, కులాలు ఎట్లా అడ్డు’కంచె’లవుతున్నాయో, అలాంటి ‘కంచె’ల కారణంగానే ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఎంత బాగా తీశాడనుకున్నా. మనుషుల మధ్య ‘కంచె’ కారణంగా రెండు భిన్న నేపథ్యాలున్న ప్రేమికుల జీవితాలు ఎలా విషాదమయమయ్యాయో హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఇక్కడ కూడా ఆయన ఫార్ములాకు భిన్నంగానే వెళ్లాడు. హీరో హీరోయిన్లు చనిపోతే.. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కన్నెత్తి చూస్తారా?.. అయినా క్రిష్ తెగించాడు. ‘కంచె’ల వల్ల జరుగుతున్న అనర్ధం తెలియాలంటే విషాదాంతమే సరైందనుకున్నాడు. అప్పుడే కదా.. అందులోని నొప్పి తెలిసేది. కథలో ఎవరైతే ప్రేమికులకు ప్రధాన అడ్డంకిగా నిలిచాడో, ఆ వ్యక్తి (హీరోయిన్ అన్న) చివరకు ఊళ్లమధ్య లేసిన ‘కంచె’లను తీసేయమనడం కథకు సరైన ముగింపు.
ఈ సినిమా ఆడితే.. ప్రేక్షకులు ఎదిగినట్లేననేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వినోదం కోసమే సినిమాలు చూస్తున్నవాళ్లు ఎక్కువ. యువత కోరుకుంటోంది అదే. అలాంటప్పుడు ‘కంచె’లాంటి సీరియస్ సినిమా ఎవరికి కావాలి? వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కంచె’ల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా? అందువల్ల ‘కంచె’ విషయంలో నాది అత్యాశ అవుతుందనే అనుకున్నా. కానీ.. సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసి ఎంత ఆనందమేసిందో? మొత్తంగా ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయనే నమ్మకం కలుగుతోంది.
ఒకవేళ పోయినా అతి తక్కువ మొత్తంలోనే పోవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇది సంకేతమా? మూస ‘బ్రూస్‌లీ’కి పరాభవం ఎదురై, కొత్త ‘కంచె’కు ఊహించిన దానికంటే ఆదరణ లభించడం జనం మారుతున్నారనడానికి నిదర్శనమా? చెప్పలేం. కానీ ఒక ఆశ కలుగుతోంది. కొత్తకు మార్గాలు తెరుచుకుంటున్నాయని ఆశ కలుగుతోంది. ‘కంచె’ ఆడితే కొత్త భావాలు, కొత్త వస్తువులతో తెలుగు సినిమాలు వస్తాయనే ఆశ కలుగుతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ వంటి సినిమాలు తీసిన క్రిష్ వంటి దర్శకుల అవసరం ఇవాళ తెలుగు సినిమాకు ఎంతైనా ఉంది. ఫార్ములా కంచెలు దాటుకొని కొత్త ప్రయోగాలతో, కొత్త నిర్వచనాలతో తెలుగు సినిమాకు అర్థంచెప్పే క్రిష్‌కు తోడుగా అనేకమంది దర్శకులు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
*

మీ మాటలు

  1. Good review
    well done!

  2. buchireddy gangula says:

    మీరు చెప్పింది నిజం sir.
    krish… very.good.director.
    చాల కాలం నుంచి హీరో కోసం కథ — హీరో డామినేషన్ —హీరో చెప్పిన వాళ్ళే
    అ సినిమాలో ఉండాలి —-(actors..hero-ins.-మ్యూజిక్ director.–అంతా )
    అ తిరు పోయి డైరెక్టర్ ల కు importance…పెరిగినప్పుడే మార్పు రాక పోదు
    మార్పు అవసరం —
    ——————————————–బుచ్చి రెడ్డి గంగుల ————————

  3. anuradha yalamarthy says:

    సినిమా గురించి బాగా చెప్పారు .ఆ సినిమా చూడలేదు కాని మీది చదివాక చూడాలనిపిస్తోంది .కీప్ ఇట్ అప్.

  4. రివ్యూ చూశాక నాకూ సినిమా చూడాలనిస్తోంది. ఇదివరకు ’1942 లో ఒక గ్రామం’ చూశాను. మెలోడ్రామా ఎక్కువై జనాన్ని ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలకు కమర్షియల్ హంగులు ఉండాలేమో..

    • వాస్తవికతకు ఎంతోకొంత నాటకీయత జోడించకపోతే అది డాక్యుమెంటరీ అవుతుంది కానీ సినిమా కాదు. సామాజిక దృష్టికి వ్యాపార దృష్టిని జోడిస్తేనే అది జనం వద్దకు వెళ్తుంది.

  5. చందు - తులసి says:

    తెలుగు సినిమాను మార్చడానికి సర్వ విధాలా
    ప్రయాసపడుతున్న దర్శకుడు క్రిష్. నాకున్న కంప్లయింట్ ఏంటంటే..చాలా కొత్త కథ చెప్పటానికి ప్రయత్నిస్తారు..కానీ చివరలో తడబడతాడు. వేదంలో కానీ ముఖ్యంగా రానా సినిమాలో ముగింపు కానీ నిరాశ కలిగిస్తాయి. అలాగే డైలాగ్ లు..నాటకంలా ఉంటాయి. ఒకటి రెండు సార్లు ఓకే కానీ..సినిమా అంతా ఐతే ఇబ్బంది.
    కంచె లాంటి ప్రయత్నం అభినందనీయం. క్రిష్ లాంటి దర్శకుణ్ని ఎంకరేజ్ చేయాలి.

  6. తులసి గారూ.. క్రిష్ సినిమాలన్నీ పూర్తిగా నాటకీయ సంభాషణలతో ఉంటాయన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి నాటకీయంగా ఉంటాయనడాన్ని నేను అంగీకరిస్తాను. మీ కంప్లైంట్ బహుశా ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకి సంబంధించిందని అనుకుంటాను. అందులో కథానాయకుడి పాత్రే నాటకాల రాయుడి పాత్ర. అందువల్ల ఆ పాత్ర డైలాగులు నాటకీయంగా ఉండటమనేది వాస్తవిక చిత్రణే కదా. ఇకపోతే క్రిష్‌లాంటి దర్శకులు కావాలని నేను చెప్పిన దాన్ని బలపరిచినందుకు సంతోషం.

  7. చక్కటి విశ్లేషణ మూర్తిగారూ.తెలుగు సినిమా ఏ స్థితిలో ఉందో నిర్మొహమాటంగా చెప్పారు.తెలుగు సినిమా చాలా కంచెల్ని దాటవలసి ఉంది.అభినందనలతో
    శివ్

  8. తహిరో says:

    యజ్ఞమూర్తి …గారూ , మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను :) మీరన్నది నిజమే .. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది అనడానికి “కంచె ” ఒక నిదర్శనం. నేను ఫేస్ బుక్ లో రాసుకున్న నా అభిప్రాయం ఇది.
    రొడ్డ కొట్టుడు తెలుగు సినిమాలనుండి, వెకిలి “హాస్యం” నుండి కొంత ఉపశమనం క్రిష్ “కంచె”. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి కథని తెర కెక్కించడం ఒక సాహసమే. కథను జ్ఞాపకాల రూపంలో ముందు నుండి వెనక్కీ వెనకనిండి ముందుకీ చూపించే ప్రక్రియ క్రిష్ కు “గమ్యం” నుండే అలవాటు . కథ కంటే యుద్ధ సన్నివేశాలు ఎక్కువ అయ్యాయేమో కొంత అనిపించింది . షావుకారు జానకి వెండితెర మీద 65 ఏళ్ళుగా నటిస్తూనే ఉండడం “గ్రేట్ ” . బహుశా ఇన్నేళ్ళు వెండితెరను ఏలిన తారలు ప్రపంచంలో లేరేమో ! తెరమీద ఆమెను చూడగానే వొళ్ళు పులకరించింది. వరుణ్ తేజ్ ఇంకా నటనలో “పుటం ” పెట్టుకోవాలి . అదేంటొ తెలుగు చిత్రాల్లో హీరో ల కంటే విలన్లే “హాండ్సం ” గా అందంగా ఉంటారు . 60 ఏళ్ళ నాటి ఆర్ . నాగేశ్వర్ రావు నుండి ఇప్పటి సుబ్బరాజు, అజయ్ లాంటి వాళ్ళ వరకూ :) ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు .
    మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 70 ఏళ్ళ నాటి కట్టూ , బొట్టూ … ఆహార్యం విషయంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడు. చూస్తుంటే రెండవ ప్రపంచ యుద్ధం తో పాటూ సినిమా కథ 2015 లో జరిగినట్టు ఉంది. శ్రీ శ్రీ ని , చలం ని వాడుకోవడం క్రిష్ కు ఉన్న మంచి సాహిత్య పరిచయాన్ని చెబుతుంది. ఏదేమయినా మంచి ప్రయత్నం. భిన్నమయిన కథతో వచ్చిన క్రిష్ ను అభినందించకుండా ఎలా ఉండగలం !
    అదీ సంగతి యజ్ఞమూర్తి గారూ :)

  9. తహిరో గారూ.. పాత తరం తారలపై మీకున్న అభిమానం మీ స్పందనలో బాగా కనిపించింది. సినిమాలో జానకిగారి హావభావాలు కళ్లముందు ఇంకా నిలిచే ఉన్నాయి. గొప్ప నటి. వరుణ్‌తేజ్‌తో ఈ స్థాయి నటననైనా రాబట్టిన క్రెడిట్ డైరెక్టర్ క్రిష్‌దే. తొలి సినిమా ‘ముకుంద’తో పోలిస్తే అతని నటన బాగా మెరుగయ్యిందని మీరూ ఒప్పుకుంటారు. 2015లోనూ కథ నడిచినట్లు అనిపించిందని మీరు చెప్పింది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ గురించేననుకుంటా. అయితే అది నెగ్లిజిబుల్ అనేది నా ఉద్దేశం. మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply to తహిరో Cancel reply

*