కాండీడ్

candid

వీధిలో కనిపించిన ఆ భీకరాకారాన్ని చూడగానే కాండీడ్ కు భయానికి బదులు జాలి తన్నుకొచ్చింది. జేమ్స్ ఇచ్చిన రెండు నాణేలను అతనికిచ్చేశాడు. బిచ్చగాడు తేరిపార చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. చేతుల్ని కాండీడ్ భుజంపై వేసి వాలిపోయాడు. కాండీడ్ భయంతో వెనకడుగు వేశాడు.

‘అంటే, నువ్వు నీ గురువైన పాంగ్లాస్ నే గుర్తుపట్టలేదన్నమాట!’ గొల్లుమన్నాడు కురూపి.

‘అంటే, మీరు పాంగ్లాసా? మా గురువుగారా? ఇంత దారుణ స్థితిలోనా! ఈ దురవస్థ మీకెలా ఘటిల్లింది? ఎంతో సుందరమైన భవంతుల్లోంచి, ఏ శక్తి మిమ్మల్ని బయటకు నెట్టింది? ప్రకృతి చెక్కిన సుందరకళాఖండం, కన్యారత్నం క్యూనెగొండ్ కు ఏమైంది?’ ప్రశ్నలతో ముంచెత్తాడు శిష్యుడు.

‘మాట పెగలడం లేదు.. నిల్చోలేకపోతున్నా..’ ఆయాసంతో గొణిగాడు తత్వవేత్త.

కాండీడ్ వెంటనే గురువును జేమ్స్ ఇంటికి తీసుకెళ్లి పశువుల పాకలో కూర్చోబెట్టి కాసింత రొట్టెముక్క ఇచ్చాడు.  కాస్త తేరుకోగానే మళ్లీ ప్రియురాలి భోగట్టా విచారించాడు.

‘ఆమె చనిపోయింది..’ చెప్పాడు పాంగ్లాస్.

ఆ మాట వినీ వినగానే కాండీడ్ మూర్ఛపోయాడు. పాంగ్లాస్ పాక అంతా వెతికి కంపుకొట్టే వెనిగర్ పట్టుకొచ్చి శిష్యుడికి స్పృహ తెప్పించాడు.

కాండీడ్ కళ్లు తెరిచి వలపోత మొదలుపెట్టాడు. ‘చచ్చిపోయిందా? నా క్యూనెగొండ్ చచ్చిపోయిందా? అయ్యో! అయ్యయ్యో..! ఆ అతిలోకసుందరి ఇక లేదా? ఏ జబ్బుతో పోయింది? కాదు కాదు, జబ్బుతో కాదు. ఆ సుందర ప్రాసాదం నుంచి నన్ను తన తండ్రి బూటుకాలితో తన్నితగలేయడాన్ని తట్టుకోలేకే గుండెపగిలి చచ్చిపోయింది కదూ?’

‘అందుక్కాదులేవోయ్! బల్గర్ సైనికులు ఆ అబలను ఘోరాతిఘోరంగా చెరిచి, చీరేసి చంపేశారు. జమీందారు ఆమెను కాపాడబోగా ఆయన తలను బద్దలుకొట్టేశారు. జమీందారిణిని ముక్కలుముక్కలుగా నరికేశారు. జమీందారు కొడుకునూ హతమార్చారు. ఇక కోటను మాత్రం వదిలేస్తారా? రాయిపైన రాయి ఎక్కడా మిగల్లేదు. ఒక బాతు లేదు, ఒక గొర్రె లేదు.. ఒక చెట్టు లేదు, ఒక చేమ లేదు. అంతా సర్వనాశం చేశారు. ఇది తగిన ప్రతీకారమేలే. పక్కనున్న బల్గర్ల జమీలో అబర్లు కూడా ఇలాంటి ఘాతుకాలే చేశార్లే..’

అంతా విని కాండీడ్ మళ్లీ మూర్ఛపోయాడు. కాసేపయ్యాక ఈసారి గురువు సాయం లేకుండానే తనంతట తానే తెప్పరిల్లుకున్నాడు. తనను జమీందారు కోటలోంచి తరిమేశాక పడ్డ కష్టాలను ఏకరవు పెట్టాడు. కార్యకారణ సంబంధం లోతుపాతుల్లోకి వెళ్లాడు. పాంగ్లాస్ దుస్థితికి దారితీసిన కారణమేమై ఉంటుందా అని విచారించాడు.

‘ఇదంతా ప్రేమ వల్ల జరిగిందనుకుంటాను. ప్రేమ.. మానవజాతికి ఊరటనిచ్చే ప్రేమ..! అనంతవిశ్వాన్ని పొత్తిళ్లపాపను కాపాడినట్టు కాపాడే ప్రేమ.. సమస్త ప్రాణికోటి ఆత్మ.. దయాపరిపూర్ణ ప్రేమ..!’

‘ఆ..ఆ..! ఆ ప్రేమ రుచేమిటో నాకు తెలుసులెండి.. హృదయ సామ్రాజ్యాలను ఏలే పరమాత్మలాంటి ఆ ప్రేమ గురించి. అది నాకు ప్రసాదించినదల్లా ఒకే ఒక ముద్దు, ముడ్డిమీద ఇరవై తన్నులు. అయితే మరి.., అంత సౌందర్యభరితమైన కారణం మీ విషయంలో మాత్రం ఇంత అసహ్యకరమైన కార్యాన్నెలా ఉత్పత్తి చేసిందో నాకర్థం కావడం లేదు!’ తల పంకించాడు కాండీడ్.

పాంగ్లాస్ సమాధానం మొదలుపెట్టాడు.

4chap

‘బాబూ, కాండీడ్! మన జమీందారిణి పరిచారికల్లోని పకెట్ అనే ముద్దుగుమ్మ నీకు గుర్తుది కదూ..! ఆమె బాహుబంధాల్లో స్వర్గసుఖాలు అనుభవించే నాయనా, నరకానికంటే దారుణమైన ఈ హీనస్థితిలో పడ్డాను. ఆమెకు సుఖవ్యాధి ఉండేది. ఆమె దానివల్లే చనిపోయి ఉండొచ్చు. ఆమెకు ఆ జబ్బును ఫ్రాన్సిస్కన్ సన్యాసి కానుకగా ఇచ్చాడు. అతనికది ఓ ముసలి జమీందారిణి పుణ్యం వల్ల సంక్రమించింది. ఆమెకది ఓ అశ్వదళ నాయకుడి నుంచి సోకింది. అతనికి దాన్ని ఓ సంస్థానాధీశుడి పెళ్లాం అంటించింది. ఆమెకది ఓ కుర్ర నౌకరు నుంచి అంటుకుంది. ఆ నౌకరుకు దాన్ని ఓ జెస్యూట్ అంటించాడు. ఆ జెస్యూట్ కు అది చిన్నతనంలో క్రిస్టఫర్ కొలంబస్ సహచరుల్లో ఒకరి నుంచి సోకింది. ఇక నావరకు వస్తే, నా వల్ల అది ఎవరికీ అంటుకునే ప్రసక్తే లేదు, నేనెలాగూ చచ్చిపోతున్నానుగా..’

‘అబ్బో.. ఎంత గొప్ప వంశవృక్షం! మూలంలో ఉన్నది దుష్టగ్రహం కాదూ?’

‘కాదు, కాదు! అక్కడున్నది ఈ లోకం తప్పించుకోజాలనిది. ఈ మన మంచిలోకంలో తప్పనిసరిగా ఉండవలసినదీనూ. జననమార్గాలను విషపూరితం చేసి వంశాలను నిర్వంశాలను చేసే, సృష్టిధర్మానికే  విరుద్ధమైన ఈ భయంకర రోగాన్ని కొలంబస్ పశ్చిమ ఇండియా దీవులకు వెళ్లి తగిలించుకునిరాకపోయి ఉన్నట్టయితే మనకు చాక్లెట్ రుచి తెలిసేదా? మన మిఠాయిలకు రంగుల సొబగు(కోషినీల్) అబ్బేదా? ఈ జాడ్యం మన మత వివాదాల్లా ఇప్పటివరకైతే మన ఖండంలోని దేశాలకే పరిమితమవడం గమనించాలి. తురుష్కులు, భారతీయులు, పర్షియన్లు, చైనీయులు, సియామీలు, జపనీయులు దీన్నింకా చవిచూసి ఎరగరు. అయితే కారణబలం వల్ల కొన్ని శతాబ్దాల్లో వాళ్లకూ దీని రుచేమిటో తెలుస్తుందిలే. ఈలోగా ఇది ఇప్పటికే మనలో, మరీ ముఖ్యంగా మన రాజ్యాల భవితవ్యం తేల్చే సేవాతత్పరులైన సుశిక్షిత దినభత్యం సైనికుల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. చెరో ముప్పైవేల బలగముండే పటాలాలు యుద్ధానికి దిగితే, చెరో పక్షంలో ఇరవై వేల మందికి సవాయి రోగం ఉండితీరుతుందని ఢంకా బజాయించి చెప్పొచ్చు..’ గురువు అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు.

 

‘చాలా చిత్రంగా ఉందే! సరిసరి. మీ మాటలు ఇకముందూ తీరిగ్గా వింటానుగాని, ముందు మీ జబ్బు నయం కావాలి’ శిష్యుడు కర్తవ్యం గుర్తు చేశాడు.

 

‘ఎలాగబ్బా? నా దగ్గర చిల్లిగవ్వ లేదే. ఎలా బాగవుతుంది? డబ్బు పుచ్చుకోకుండా జబ్బు నయం చేసే వైద్యుడెవడూ ఈ సువిశాల ప్రపంచంలో లేడు కదా!’

 

కాండీడ్ కు దారి కనిపించింది. నేరుగా జేమ్స్ వద్దకు పరిగెత్తిపోయి కాళ్లు పట్టుకున్నాడు. తన గురువుకు వాటిల్లిన దురవస్థను కళ్లకు కట్టినట్టు వివరించి, ఆదుకోమని అర్థించాడు. ఆ జాలిగుండె పెద్దమనిషి తటపటాయింపు లేకుండా.. పాంగ్లాస్ ను పశువుల పాకలోంచి ఇంట్లోకి తీసుకొచ్చి, సొంతఖర్చుతో వైద్యం చేయించాడు. చికిత్స ముగిసేసరికి ఒక కన్ను, ఒక చెవి ఆనవాళ్లే లేకుండా పోతేపోయాయిగాని, రోగమంతా బాగైంది. పాంగ్లాస్ ఇదివరకట్లాగే బాగా రాయగలుగుతున్నాడు. గణితంలో పాండిత్యమూ ఇసుమంత తగ్గలేదు. వ్యాపార ఖాతాలను చక్కగా  అర్థం చేసుకుంటున్నాడు. జేమ్స్ అతణ్ని తన గణకుడిగా నియమించుకున్నాడు. రెండు నెలల తర్వాత జేమ్స్ వ్యాపారంపై లిస్బన్ కు సొంత ఓడలో బయల్దేరాడు. ఆ ఇద్దరు తత్వవేత్తలనూ వెంటబెట్టుకెళ్లాడు. పాంగ్లాస్ ప్రయాణం పొడవునా.. అంతా మన మంచికే, ఇప్పుడున్న పరిస్థితి ఉన్నదానికంటే మెరుగ్గా ఉండజాలదన్న తన సిద్ధాంతాన్ని కొత్త యజమానికి కూలంకషంగా వివరించాడు. అయితే జేమ్స్ అతని వాదనతో ఏమాత్రం ఏకీభవించలేకపోయాడు.

‘మనుషులు తోడేళ్లలా పుట్టకపోయినా, తోడేళ్లలా మారారు కనక, వాళ్ల స్వభావం కలుషితమైపోయింది. దేవుడు వాళ్లకు ఏనుగుల్లాంటి ఫిరంగులను, తుపాకులను ఇవ్వలేదు. అయినా వాళ్లు వాటిని తయారు చేసుకుని ఒకళ్లనొకళ్లు దుంపనాశనం చేసుకుంటున్నారు. దివాలాలను, రుణదాతల నోళ్లలో మన్నుకొట్టి దివాలాకోరుల కొమ్ముకాసే చట్టాలను ఈ కోవలోకే చేరుస్తా..’ అన్నాడు జేమ్స్.

‘ఉదాహరణలకేంలే, చాలానే ఉంటాయి. అయితే వ్యక్తిగత కష్టనష్టాలు లోకకల్యాణానికి ఉపయోగపడతాయి కనక, అలాంటివి తప్పనిసరి. అలాంటి దురదృష్టాలు ఎంత ఎక్కువైతే లోకానికి అంత మేలు జరుగుతుంది’ వెనక్కి తగ్గకుండా గట్టిగా వాదించాడు ఒంటికంటి పండితుడు.

అతడలా కార్యకారణ సిద్ధాంతాన్ని సాకల్యంగా సాగదీస్తుండగా ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్నాయి. నాలుగు దిక్కుల నుంచీ హోరుమంటూ పెనుగాలులు మొదలయ్యాయి. లిస్బన్ రేవు కనుచూపుమేరలో ఉండగా ఓడ భయంకరమైన తుపానులో చిక్కుకుంది.

 

5వ అధ్యాయం

5chap

తుపాను ధాటికి ఓడ అల్లల్లాడిపోయింది. ఆ ఊపులకు సగం మంది ప్రయాణికులు భయంతో వణుకుతూ  సగం చచ్చిపోయారు. అసలు ఏం జరుగుతోందో కూడా వాళ్లకు తెలియడం లేదు. మిగతా సగం మంది పెడబొబ్బలు పెడుతూ ప్రార్థనలు మొదలుపెట్టారు. తెరచాపలు చిరిగిపోయాయి. కొయ్యలు విరిగిపడ్డాయి. ఓడలో నీరు చేరుతోంది. అందరూ ఏదో ఒకటి చేయగలిగే వాళ్లే అయినా ఆ భయోత్పాతంలో ఏం చెయ్యాలో చెప్పేవాడెవడూ లేడు, వినేవాడు అంతకన్నా లేడు. జేమ్స్ ఓడ పైభాగంలో నిల్చుని ఓడను కాపాడ్డానికి శాయశక్తులా సాయం చేస్తున్నాడు. ఈ విపత్తులో దిక్కుతెలియని ఓ సరంగు పిచ్చి ఆవేశంతో ఊగిపోతూ అతణ్ని చావమోదాడు. జేమ్స్ కిందపడిపోయాడు. దెబ్బకొట్టే ఊపులో సరంగు పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ఆ పడ్డంలోనూ విరిగిన తెరచాప దూలంపై పడిపోయి మునుగుతూ, తేలుతూ ఉండిపోయాడు. జాలిగుండె జేమ్స్ ఆ సరంగు కొట్టిన దెబ్బను మరచిపోయి అతణ్ని అతికష్టంతో ఓడపైకి లాగాడు. అయితే సరిగ్గా అప్పుడే ఓడ ఒరగడంతో తానూ నీళ్లలో పడిపోయాడు. సరంగు తన ప్రాణదాతవైపు కన్నెత్తికూడా చూడకుండా తన సంగతి తాను చూసుకోసాగాడు. మునిగిపోతున్న తన శ్రేయోభిలాషిని కాపాడ్డానికి కాండీడ్ నీటిలోకి దూకబోయాడు. అయితే గొప్ప తత్వవేత్తయిన పాంగ్లాస్ వద్దని గట్టిగా వారించాడు. లిస్బన్ ఓడరేవు ఆ అనబాప్తీస్ముడు జలసమాధి కావడానికే సృష్టించబడిందని వాదించాడు. దీన్ని మౌలిక సూత్రాల సాయంతో మరింతగా వివరిస్తుండగా, ఓడ రెండు ముక్కలైంది. పాంగ్లాస్, కాండీడ్, ఆ దుర్మార్గపు సరంగు తప్ప మిగిలినవాళ్లందరూ మునిగిపోయారు. సరంగు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. గురుశిష్యులు ఓ చెక్కబల్లను దొరకబుచ్చుకుని దానిపై తీరం చేరుకున్నారు.

కాస్త సత్తువ చిక్కాక లిస్బన్ వైపు నడిచారు. ఆ తుపాను బీభత్సం తర్వాత ఆకలితో మాడి చావకుండా వాళ్ల దగ్గర కాసిని డబ్బులున్నాయి. ఆ ధీమాతో ముందుకుసాగారు. తమ శ్రేయోభిలాషి మరణానికి భోరున విలపిస్తూ నగరంలోకి అడుగుపెట్టీపెట్టగానే కాళ్ల కింద భూమి కంపించిపోయింది. కడలి ఉప్పొంగి రేవును ముంచెత్తింది. లంగరు వేసిన ఓడలు ముక్కచెక్కలయ్యాయి. మంటలు, బూడిదతో సుడిగాలులు చెలరేగి వీధులను, కూడళ్లను కబళించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పునాదులు కదలిపోయాయి. ఆడామగా, పిల్లాజెల్లా కలిపి ముప్పైవేల మంది శిథిలాల కింద చితికి అసువులు బాశారు.

ఆ ఉత్పాతంలో సరంగు సంబరంతో గట్టిగా ఈల వేశాడు.. ‘ఇంకేం, ఇక్కడ బోలెడు విలువైన వస్తువులు దొరుకుతాయి..’ అంటూ.

‘ఈ మొత్తం ఘటనకు కారణమేమై ఉంటుందబ్బా?’ పాంగ్లాస్ తర్కంలో పడిపోయాడు.

‘యుగాంతం కాబోలు..’ శిష్యుడు అందుకున్నాడు.

సరంగు క్షణమాలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి శిథిలాల్లోకి చొరబడి డబ్బుకోసం వెతికాడు. కాసిని డబ్బులు దొరగ్గానే మద్యం కొట్టుకు పరిగెత్తిపోయి పీకల్దాకా తాగొచ్చి గుర్రుకొట్టి నిద్రపోయాడు. లేవగానే అక్కడ కనిపించిన ఓ ఆడమనిషిని డబ్బుతో లోబరుచుకుని ఆ శిథిలాల, పీనుగుల మధ్యే కామకేళికి ఉపక్రమించాడు.

పాంగ్లాస్ అతణ్ని అంగీ పట్టుకుని పైకి లాగాడు.

‘మిత్రమా.. ఇది మంచి పని కాదు సుమా!  విశ్వజనీన కార్యకారణ సిద్ధాంతాన్ని నువ్వు దారుణంగా  ఉల్లంఘిస్తున్నావు. పాపానికి ఒడిగడుతున్నావు. సమయ సందర్భాల విషయంలో విచక్షణ కోల్పోతున్నావు..’ అని హెచ్చరించాడు.

‘ఛత్.. ఏమిటీ పిచ్చి వాగుడు! నేను సరంగును. బటేవియాలో పుట్టాను. జపాన్ వెళ్లిన నాలుగుసార్లూ శిలువపై కాళ్లు మోపాను. నీ మెట్టవేదాంతాన్ని చెప్పుకోవడానికి మరెవర్నయినా వెతుక్కోపో..’ కసిరాడు కామాతురుడు.

మరోపక్క.. విరిగిపడుతున్న ఇళ్ల రాళ్లు తగిలి కాండీడ్ గాయపడ్డాడు. నడివీధిలో శిథిలాల నడుమ కూరుకుపోయాడు.

‘భగవంతుడా… నొప్పి! కాస్త ద్రాక్షసారా, తైలమూ తెచ్చిచ్చి పుణ్యం కట్టుకోండి, చచ్చిపోతున్నా..’ గురువును వేడుకున్నాడు.

‘బాబూ.. కాండీడ్! ఇదేం కొత్త భూకంపం కాదు నాయనా. నిరుడు అమెరికాలోని లిమా పట్టణం కూడా దీన్ని చవిచూసింది. కార్యకారణాలు అక్కడా ఇక్కడా ఒకటే. లిమా నుంచి లిస్బన్ వరకు భూగర్భంలో గంధకపు గొట్టం ఉండి తీరాలి.. ’

‘గొట్టం లేదు, నా బొంద లేదు! అబ్బబ్బ.. నొప్పి భరించలేక నేను చస్తుంటే, మీ వెధవ గోలేమిటి? దయచేసి, ముందు కాస్త సారా, తైలమూ తీసుకొద్దురూ..’

‘అలా అనకు! గంధకపు గొట్టం ఉందని పక్కాగా రుజువైపోయింది.. ’ గురువు మీమాంసను సాగదీయబోయాడు.

క్షతగాత్రుడు స్పృహతప్పాడు. పాంగ్లాస్ దగ్గర్లోని కుళాయి నుంచి దోసిళ్లతో నీళ్లు పట్టుకొచ్చి శిష్యుడికి తాగించాడు. కాండీడ్ కాస్త తేరుకున్నాడు.

మర్నాడు ఇద్దరూ శిథిలాల్లో చక్కర్లు కొడుతుండగా కాస్త తిండి దొరికింది. తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. తర్వాత భూకంపంలో చావుతప్పి కన్నులొట్టబోయిన క్షతగాత్రులకు మిగతా వాళ్లతో కలసి సాయం చేశారు. గురుశిష్యుల సాయం పొందిన కొందరు వాళ్లిద్దరికి అలాంటి విపత్తులో వీలైనంత మంచి విందు ఇచ్చారు. విందు విషాదంగా సాగింది. అందరూ రొట్టెముక్కల్ని కన్నీళ్లలో తడిపేసుకుంటూ తిన్నారు. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అలాగే జరుగుతుందని, భిన్నంగా జరగడానికి వీల్లేదని పాంగ్లాస్ అందర్నీ ఓదార్చాడు.

‘అంతా మనమంచికే. లిస్బన్లో అగ్నిపర్వతం ఉంటే  ఇంకోచోట ఉండడానికి అస్సలు వీల్లేదు. అంతా మనమంచికే కనక ప్రతీదీ ఉన్న దానికి భిన్నంగా ఉండడం అసాధ్యం.’

పాంగ్లాస్ కు దగ్గర్లో నల్లబట్టలేసుకుని కూర్చున్న పొట్టి మనిషి ఈ వాదనను శ్రద్ధగా ఆలకించాడు. అతడు నాస్తికుల గురించి, దైవదూషణకు పాల్పడేవాళ్ల గురించి మతవిచారణ విభాగానికి ఉప్పందించే గూఢచారి.

‘అయితే, మొత్తానికి మీకు పాపంలో బొత్తిగా నమ్మకం లేనట్టుంది. అంతా మన మంచికే అయితే మరి మనిషి పాపాలతో పతనం కావడం, శిక్షింపబడడం.. ఇవన్నీ ఎందుకంటారు?’ వినయంగా అడిగాడు అతడు.

‘అయ్యా..! మనిషి ఉత్తమలోకాలకు వెళ్లడానికి పాపం, పతనం, శిక్ష తప్పనిసరి’ అంతే వినయంగా బదులిచ్చాడు తత్వవేత్త.

‘అయితే మీకు మనిషి స్వతంత్రేచ్ఛపై నమ్మకం లేదా?’

‘ప్రభువులు మన్నించాలి! మనం స్వతంత్రంగా ఉండాలంటే స్వేచ్ఛ ఎంతైనా అవసరం. నిర్ణాయక స్వేచ్ఛ అనేది.. ’

పాంగ్లాస్ మాట పూర్తిచేయకముందే ఆ పొట్టి మనిషి తనకు సారా పోస్తున్న సేవకుడికి సైగ చేశాడు.

(సశేషం)

మీ మాటలు

  1. చందు - తులసి says:

    ఏదో ప్రమాదం పొంచుకొచ్చేలా ఉంది. కథనం చాలా వేగంగా సాగుతోంది. మోహన్ గారూ థాంక్యూ..

  2. కె.కె. రామయ్య says:

    సవాయి (సిఫిలిస్) రోగం పుట్టుక, పురోగతి పై గురువు పాంగ్లాస్ అనర్గళ భాషణం; ‘విశ్వజనీన’ కార్యకారణ సిద్ధాంతo ( అంతా మనమంచికే మెట్టవేదాంతo) పై గురువు పాంగ్లాస్, శిష్యుడు కాండీడ్ ల సంభాషణ, వ్యాపారనిమిత్తం లిస్బన్ బయలుదేరిన ఓడ తుపాను బీభత్సం కు గురికావటం … అద్భుతంగా రాస్తున్నారు మోహన్ గారు.

మీ మాటలు

*