కలిసొచ్చిన రోజు  

 

కస్తూరి: వేశ్య

శర్మ: తార్పుడుకు సిద్ధపడ్డ విటుడు

 

కస్తూరి: పంతులు గారికి ఇవాళ నామీద దయకలిగింది.

శర్మ:    ఇదిగో, నేనసలే పుట్టెడు మొహమాటంతో వచ్చాను. నువ్వట్లా పెద్ద పెద్ద మాటలు విసిరి నన్ను బెదరగొట్టొద్దు.

కస్తూరి: అంతమాట ఎందుకులెండి? మెరక వీథి తాయారంటే మీకు అమిత ఇష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకని అలాగన్నాను.

శర్మ:    నిజమే కానీ, నీచపుముండ నిలుపుకోలేకపోయింది. కులపు వాళ్ళను మరిగి కూటిలో మన్నేసుకొంది.

కస్తూరి: ఐతే మీరిప్పుడు దాని కొంపకి పోవట్లేదన్నమాటేనా?

శర్మ:    ఒట్టు! నీతో నేనబద్దమాడతానా? కులపువాడు పొర్లి వెళ్ళిన పక్క మీద పడుకోవడం నీచం. అందుకే దాని గడప తొక్కడం మానేశాను. ఒక్క తాయారే కాదు, ఎక్కడ చూసినా ఇదే కర్మ. కులంవాడు ముందు, కిలంవాడు వెనక. సోమయాజు లుంచుకున్నశోభనాంగికి దాని మద్దెల కాడే మారుమగడు. ఆచారి తగులుకున్న సింహాచలానికి గజ్జెలు మోసేవాడు వలపుమగడు. పంతులుగారు పట్టుకున్న ఇందిరాస్యకి పిడేలు వాయించేవాడు చాటు మగడు. నాయుడు గారు నెత్తిన పెట్టుకొనే రత్తికి తిత్తికాడు తేరమగడు. షావుకారు సొమ్ముతో కొవ్వు పెంచిన మురహరికి తాళం వేసేవాడే ముద్దు మగడు. అది ఇది అనుకోవడం ఎందుకు, ఏ ఇంట్లో చూసినా, సానుల కిప్పుడు కులపు వాళ్ళే విటులు.

కస్తూరి: దీంట్లో తప్పెవరిదంటారు? సుబ్బిశెట్టి తెనాలి సుందరి ఇంట్లో పక్కలేసి దీపం పెడతాడు. పొట్టి పంతులు విరిబోణి మేళానికి పోయే ఊళ్లకు వెంటబడి పోతాడు. కామశాస్త్రులు పూలకనికి కూతుళ్ళకు విటుల్ని తార్చడానికి రేయింబవళ్ళు తిరుగుతాడు. స్వామినాయుడు తన సానిని లోకులకప్పగించి తాను వీథి వాకిట్లో పడుకుంటాడు. అలాంటి వాళ్ళే ఇట్లాంటి పాడు పనులు చేస్తుంటే, సానిముండలు ఎంత తప్పు చెయ్యడానికైనా వెనకాడరు.

శర్మ:    మరి నువ్వు అలా చెయ్యట్లేదే?

కస్తూరి: సరే నా మాట కేం లెండి. ఏదో నామీద దయతోటి నన్నిలా పొగుడుతున్నారు.

శర్మ:    ఒట్టు. ముఖస్తుతి మాటలు కాదు. నిజంగా నీలాంటి వాళ్ళు కోటి కొక్కళ్ళైనా ఉండటం వల్లే ప్రపంచం ఈ మాత్రమైనా నిలిచి ఉంది. అందుకే నిన్ను ఆకాశానికెత్తడానికి మంచి స్కీమొ కటి సిద్ధం చేశాను. నువ్వు ఊ అంటే చాలు.

కస్తూరి: ఏదో విశేషం లేకుండా మీరు రారని అనుకుంటూనే ఉన్నాను. చెప్పండి, ఏంటా స్కీము?

శర్మ:    జమీందారు రఘునాథరావు గారికి నాకు ప్రాణస్నేహం. ఒక కంచంలో తిని… అట్లా అన్న మాట.

కస్తూరి: అవును, విన్నాను.

శర్మ:    మరికేం! ఆ ఇన్ఫ్లుయన్సు తోటి నిన్ను బంగారు పిచికను చేద్దామనుకుంటున్నాను.

కస్తూరి: ఎలా?

శర్మ:    ఎలా ఏంటి? ఆయనకు నీకు అతుకు పెట్టి!

కస్తూరి: (తనలో) ఇతను ఎందుకొచ్చాడో ఇప్పుడు అర్థమైంది. విషయాన్ని జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.

శర్మ:    ఏంటాలోచిస్తున్నావు?

కస్తూరి: ఏం లేదు. అనుకున్నదొకటి, ఐనదొకటి.

శర్మ:    ఏమనుకున్నావు?

కస్తూరి: (విసుగ్గా) నేనేమనుకుంటే ఏం లెండి. అందని దానికోసం ఆశ పడకూడదు కదా!

శర్మ:    అంటే!?

కస్తూరి: అంటే లేదు, గింటే లేదు. ఆరాత్రి మీరా ఊరేగింపులోకి ఎందుకొచ్చారు?

శర్మ:    అందరెందుకొచ్చారో, నేనూ అందుకే!

కస్తూరి: ఔనా! ఆ సంగతి తెలిస్తే, అందర్నీ ఎట్లా చూశానో మిమ్మల్నీ అట్లానే చూసేదాన్ని కదా! (అని గిరుక్కున తిరిగి పోబోతుండగా శర్మ గభాలున లేచి చెయ్యి పట్టుకున్నాడు)

శర్మ:    వెళ్ళకు, వెళ్ళకు! వెళితే నామీద ఒట్టే! ఇప్పుడన్నమాటేంటి? ఐతే నన్ను స్పెషల్ గా చూశా వన్నమాట. నిజంగా నామీద నీకంత అభిమానమే ఉంటే, నీ కాళ్ళ మీద పడి ప్రాణాలు వది లెయ్యనా?

కస్తూరి: అమ్మో, అంతమాటొద్దు. బ్రతికుంటే, కంటి నిండా చూసుకొనైనా సంతోషిస్తాను.

శర్మ:    (సంతోషంతో) ఆహాహా! వన్సుమోర్! ఏన్టేంటీ? నామీద భ్రమా! ఆ బంగారు నోటితో ఆ ముద్దుల మాట మరొక్కసారి చెప్పు.

కస్తూరి: పొండి, మీకంతా నవ్వులాటగా ఉంది. నేనిక చెప్పను. (అని గోముగా పక్కకు తిరిగింది)

శర్మ:    (మళ్ళీ పట్టుకొని) ప్లీజ్, ఇటు చూడు, ఏదీ, ఆరాత్రి నన్ను చూసిన దగ్గర్నుంచీ…… చెప్పు మరి?

కస్తూరి: చెప్పటానికేముంది? అన్నం సహిస్తే ఒట్టు. నిద్ర పడితే ఒట్టు. ప్రతి క్షణం మిమ్మల్ని చూడా లనే తపన. చెప్పు కుంటే సిగ్గు. ఇంతకుముందెప్పుడూ ఇట్లా అనిపించలేదు.

శర్మ:    హాయ్ హాయ్ హాయ్ … అదృష్టమంటే నాది. ఏదీ ఒక ముద్దు పెట్టు. (కౌగిలించుకొని ముద్దాడి) ఇదిగో ఇప్పుడు నిజం చెప్తున్నా విను. నీకు నామీద నిన్నో మొన్నో కలిగింది కాని, నీమీద నాకు నిరుటినుండి వ్యామోహం ఉంది. డబ్బు లేక నీ ఇంట్లో కాలు పెట్టేందుకు జంకాను. కేవలం నిన్ను చూసి సంతోషపడొచ్చనే ఆశతో వెర్రికుక్కలాగా మీ ఇంటి దగ్గరే తిరిగే వాణ్ణి. నువ్వు మేళానికి వెళితే నేనూ వెనకే వచ్చి రోజులు గడిపేవాణ్ణి. ఇన్నాళ్ళకి దేవుడు నా మొర విన్నాడు.

కస్తూరి: చూశారా నేనెంత పిచ్చిదాన్నో! నిరుటినుండి మీరు లోలోపల దాచుకుంటే నా ప్రేమని నేను రెండు రోజులకే బయట పెట్టుకున్నాను.

శర్మ:    ఇదిగో, నవ్వకుండా నా మొహం వైపు తిన్నగా చూసి చెప్పు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిం చావా?

కస్తూరి: (చిరాకుగా) ఇదిగో ఇదే మీమొగాళ్ళతో చావు.

శర్మ:    కోప్పడకు! ఆ మాట మరొకసారి విని సంతోషిద్దామని తప్ప, నీమీద నమ్మకం లేక కాదు. ఏదీ ఒక సారి ఇటు చూడు. (కస్తూరి ఓరగా చూసి పక్కున నవ్వింది) చాలు. ఇప్పుడు మనం పరస్పరం అర్థమయ్యాం కాబట్టి నీదగ్గర ఇక దాచడానికేమీ లేదు. నా మెడికల్ ప్రాక్టీసులో వచ్చేది నా సిగరెట్లకే చాలదు. కనక నిన్ను భరించే శక్తి నాకు లేదు. అందుకే రఘునాధ రావు గారిని నీకతుకు పెట్టి, ఆయన ద్వారా నీకు డబ్బొచ్చేలా చేసేందుకు, ఆయన చాటున నీతో ఆనందించేందుకు నిర్ణయించుకొన్నాను. నువ్వు దీనికి యస్ అంటే నీకు నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టే లెక్క!

కస్తూరి: ఎస్సో గిస్సో నాకేం తెలియదు. నేనొట్టి అమాయకురాల్ని. తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు. నీళ్ళలో ముంచినా పాలలో ముంచినా మీదే భారం. మీమాటకు ఎప్పుడూ అడ్డు చెప్పను.

శర్మ:    అద్గదీ మాట! ఆమాట మీదుండు. నిన్ను ఆకాశానికెత్తే బాధ్యత నాది. ఈ రాత్రికి రఘునాధ రావుగారిని ఇక్కడికి తీసుకొస్తాను. ఆయనకీ కొంచెం మందు అలవాటుంది. సరే, నా సంగతి నువ్వు వినే ఉంటావు. నీకేమన్నా కొంచెం అలవాటుందా?

కస్తూరి: అంతగా లేదు కానీ, మీబోటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం తీసుకుంటాను.

శర్మ:    సరే ఇంకేంటి? సోడా విస్కీలు నేను పంపిస్తాను. నంజుకోడానికేమైనా సిద్ధం చేసి ఉంచు. నేను పోయిరానా మరి?

కస్తూరి: అయ్యో, అప్పుడే వెళ్తారా?

శర్మ:    పిచ్చిదానా, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా? తొమ్మిదయ్యేసరికి ఆయన్ని తీసుకొని వచ్చెయ్యనూ? ఒక్కటే మాట. ఆయాసం ఆయనది. అనుభవం మనది. అది గుర్తుపెట్టుకొని వ్యవహరించు.

కస్తూరి:         మీరంతగా చెప్పాలా? (ముద్దుపెడుతుంది)

మీ మాటలు

*