ఆమెను మళ్లీ చూడండి!

Kandukuri Ramesh
-కందుకూరి రమేష్ బాబు 
~
ఒక్కోసారి ఛాయా చిత్రణం చేస్తూ ఉన్నప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది.
మొన్న బతుకమ్మ పండుగ సందర్భంగా పూవులు అమ్మే వాళ్లను చిత్రిస్తూ ఉన్నప్పుడు ఈ సంకటమే కలిగింది.
చిత్రమే.
కానీ చిత్రమైంది.
చూశారా?
ఆమె స్వయంగా పూవులు అమ్ముతోంది.
కానీ, ఆమెను ఒక ఛాయగా చేసి చూసుకుంటే ఆమె స్వయంగా ఒక పుష్ఫంగా వికసించడం విశేషం.
నిజానికి ఆమె యవ్వనవతి కాదు. ముదిమి దాటిన వ్యక్తే.
కానీ, ఆమెను వ్యక్తం చేసే ఈ ఇమేజీ నాకు అవ్యక్తంగా దోబూచులాడే ప్రకృతి కాదు.
వ్యక్తమే. వ్యక్తే!
ప్రకృతికాంత వ్యక్తిత్వమే.
సృష్టి, స్థితి, లయలను తానే నడిపే వ్యక్తిత్వం అనిపిస్తుంది.
ఆమెను మళ్లీ చూడండి.
అందం, సౌకుమార్యం, విశ్వాసం.
చూడండి.
ఆమె సబ్జెక్టు – విషయం.
ఆమె కాంపోజిషన్ – సమ్మేళనం.
ఆమెనే లైటింగ్ – వెలుగు నీడలే కాదు, సప్తవర్ణ శోభ కూడా.
చూడండి.
ఆమె ప్రతి కదలికా చూడండి.
ఆమె తనను తాను ఒద్దికగా దాచుకునే తీరూ గమనించండి.
ప్రకృతికాంత ఎంత అందంగా సహజంగా నన్ను ధరిస్తోందో అనిపిస్తుంది!
అవును మరి. లేకపోతే ఈ చిత్రం ఎలా వస్తుంది మరి?
నిజం.
అందుకే వ్యక్తులను చిత్రిస్తున్నప్పుడు నాకే సందేహమూ లేదు.
వారు విడివిడి అంశం కాదు, సమస్తాంశం.
వ్యక్తి అంటే వ్యక్తమయ్యే ప్రకృతే!
కానీ, మనుషులు పరిపరి విధాలు.
ఎవరి అన్వేషణ వారిది.
చాలా ఏళ్లక్రితం Nude in Nature అని రాజన్ బాబు గారు స్త్రీని ప్రకృతిలో చిత్రించి అబ్బుర పరిచారు.
తనని నగ్న ఛాయలు చేసి ప్రకృతిని దర్శింపజేయ ప్రయత్నిస్తారు.
కానీ, ప్రకృతియే స్త్రీ అయి పుష్ఫించినప్పుడు
ఆమె అచ్చాదనగా ధరించే ప్రతి వలువల్లోనూ పుష్ఫాలే దర్శనమిచ్చినప్పుడు
మళ్లీ నగ్నత్వం అవసరం ఏ పాటి? అనిపిస్తుంది నా వరకు నాకు.
అందుకే ఆమెను నా దృష్టితో కాదు, తన దృష్టితో చూపుతున్నాను.
ఎలా నలుగురికీ కనపడాలనుకుందో అలా చూపడం.
అసలు మనకు కావాల్సింది కాదు,
తనకు ఇవ్వదగింది అసలైన ప్రకృతి కదా అనిపిస్తుంది నాకు.
పురుష దృక్పథం కాదు,
స్త్రీ దృక్పథం ప్రధానం అనిపిస్తుంది కూడానూ.
అందుకే Nature in Women చేయాలనిపిస్తుంది.
ఒక సిరీస్ గా ఇలా వందలు, వేలు, లక్షలు చేయవచ్చు.
కానీ, ఒక సూక్ష్మదర్శిని చాలు కదా అని ఈ ఇమేజీ.
ఇందులో చూస్తున్నకొద్దీ మీకు ప్రకృతి గోచరిస్తుంది.
చిత్రం
లేదా దృశ్యాదృశ్యం.
అవును.
ప్రకృతి తన బాడీ లాంగ్వేజ్ ను, ఈస్తటిక్స్ ను స్త్రీలలో వ్యక్తం చేసి ‘జాక్కుంటుందా’ అనిపిస్తుంది.
లేదా మొత్తం ప్రకృతిని అర్థం చేసుకునేంతటి ‘ఫ్రేం’ పురుషుడికి లేదనే కాబోలు,
ఆమె లో అన్నింటినీ చూసి గ్రహించుమా! అన్న సందేశాన్ని ఇస్తుందా అనిపిస్తుంది.
చూడండి.
బాల్యం, యవ్వనం, వార్థక్యం.
గాజులు, మట్టెలు, తల్లికొంగూ…అన్నీ.
మీకిక్కడ కనపడకపోతే ప్రకృతిలోకి వెళ్లండి.
లేదంటే స్త్రీ దగ్గర ఆగండి.
దర్శించండి.
వికసించండి.
*

మీ మాటలు

  1. అవును.. మళ్ళీ చూస్తె దృశ్యమె మారి పోయింది రాశి పోసిన ప్రకృతిలా….

  2. అవును మళ్ళీ చూస్తె దృశ్యమె మారి పోయింది రాశి పోసిన ప్రకృతిలా….

  3. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    వ్యక్తి అంటే వ్యక్తమయ్యే ప్రకృతే!

  4. Jayashree Naidu says:

    ఎంత నాజూకు గా చెప్పారు మీరు రమేశ్ గారు… సుపర్బ్

Leave a Reply to పిన్నమనేని మృత్యుంజయరావు Cancel reply

*