పిలక తిరుగుడు పువ్వు: రాజ్యంపై పతంజలి లోచూపు

– ఎ . కె . ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎన్ కౌంటర్లు వుండవని కొండంత ఆశతో ఆలోచనలు చేసిన ప్రజాసంఘాల్లోని మేధావుల కన్నా తెల్లదొరలు పోయి దేశానికి స్వాతంత్ర్యం వస్తే కానిస్టేబుల్ తమ వూరినుంచీ బదిలీ అవుతాడా అని పిసరంత అనుమానంతో అమాయాకంగా ప్రశ్నించిన కన్యాశుల్కం నాటకంలోని జట్కా అబ్బీయే తెలివిమంతుడని యిటీవల నాకు చాలా బలంగా అనిపిస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్యంలో పాలకులు మారినంత మాత్రాన ‘రాజదండం’ మారదు; రాజ్యానికి వుండే సహజ సిద్ధమైన కవచకుండలాలు కత్తి కటారులూ మారవుకదా! కాకుంటే వొకప్పటి లాఠీ సంస్కృతి స్థానే యివ్వాళ గన్ కల్చర్ విశృంఖలంగా స్వైరవిహారం చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాలంటే ఆ మాత్రం ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోక తప్పదు.

నాలుగు స్తంభాల దొంగాటలో ప్రజాస్వామ్యం ముసుగు చీల్చి రాజ్యం క్రూర స్వభావాన్నీ కర్కశ స్వరూపాన్నీ వాస్తవికత పరిధిని దాటి చిత్రించిన సాహిత్యం మనకు చాలా తక్కువ. వాస్తవికత కూడా భౌతిక సంఘర్షణ చిత్రణ వరకే పరిమితమైంది. ఉపరి తలాన్ని దాటి రావిశాస్త్రి లాంటి వాళ్ళు అరుదుగా పునాదుల్ని స్పృశించారుగానీ దాని లోతుల్లోకి వెళ్లి విమర్శనాత్మకంగా విశ్లేషించి మూలాల్ని తాత్వికంగా ఆవిష్కరించిన రచయిత పతంజలి వొక్కడేనేమో! అందుకు అతను యెన్నుకొన్న మాధ్యమం వ్యంగ్యం. ఆ వ్యంగ్యం డొక్కలో చక్కలిగింతలు పెట్టదు; గుండెలో ములుకై గుచ్చుకుంటుంది. వ్యవస్థ మొత్తం సిగ్గుతో తలదించుకొనేలా చేస్తుంది. అప్పటికే అపరాధ భావనతో వున్న వాళ్ళలో అగ్గి రగులుకొల్పుతుంది.

రాజ్యానికి వున్న నానార్థాల్లో పోలీసు వొకటని చానాళ్లు నాకొక అపోహ వుండేది. ‘ఇదేమి రాజ్యం – పోలీసు రాజ్యం’ అని గోడమీది నినాదం చూసాకా కూడా రాజ్యానికి పోలీసు వొక అంగమనే భ్రమలోనే వుండిపోయా. ఆ రెండిటిదీ కుక్క తోకల లాంటి అంగాంగి సంబంధం కాదనీ, అవి రెండూ పర్యాయ పదాలనీ, పోలీసూ రాజ్యం వ్యస్త పదాలు కాదనీ సమస్త పదమనీ, ఆ సమాసం అభేదరూపకమనీ యిరవై ఏళ్ళ క్రితం (ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచిక 1995లో) కాకర్లపూడి నరసింహ యోగి పతంజలి రాసిన ‘పిలక తిరుగుడు పువ్వు’ కథ చదివాగ్గానీ అర్థం కాలేదు.
పతంజలి అవసరం లేకుండానే మన సినిమా వాళ్ళకి యీ విషయం యెప్పట్నుంచో బాగా తెల్సు. పోలీసు పాత్రలోని ఠీవీ గాంభీర్యం ఆధిపత్యం అధికార దర్పం శాసించే తత్త్వం వంటి అనేకానేక ‘ఉదాత్త’ లక్షణాలు నచ్చబట్టే నటులంతా జీవితకాలంలో యెప్పుడో వొకప్పుడు పోలీసుగా నటించి జన్మ సఫలం చేసుకొంటారు. వీళ్ళందరికీ మన జాతీయ చిహ్నంలో కనిపించే మూడు సింహాలేవి అన్నవిషయంలో అభిప్రాయ భేదాలుండొచ్చేమో గానీ కనిపించని నాలుగో సింహం మాత్రం పోలీసే. నిజానికి నాలుగు సింహాలూ పోలీసులే. పోలీసు న్యాయమే అంతిమ న్యాయం. కాదని అనుమానం వుంటే నాలాగే పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’ మరోసారి చదవండి.

న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదనీ న్యాయస్థానాల తీర్పుల్ని చట్టసభల్లో కూర్చొని శాసనాలు చేసేవాళ్ళు సైతం శిరసావహించాలనీ వెర్రి నమ్మకం మనబోటి సామాన్యులకి వుంటుంది. కానీ వాస్తవానికి ప్రజాస్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలన్న మాటే అబద్ధమనీ రాజ్యం వొంటి స్తంభపు మేడ అనీ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్య నిర్వాహక వ్యవస్థ మీడియా మొత్తంగా ఆ మేడలో సుఖాసీనుడైన పసిడిగలవాడి కాళ్ళ దగ్గర పడివుండే బానిసవ్యవస్థలనీ, ధనికస్వామికి కాపలా కుక్కలకన్నా లేదా పెరట్లో కట్టేసిన పెంపుడు జంతువులకన్నా హీనమనీ పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’కి ముందు నుంచే చెప్పినప్పటికీ యీ కథలో మాత్రం దాని విశ్వరూప దర్శనం చేయించాడు.

‘పిలక తిరుగుడు పువ్వు’ కథని విశ్లేషించడానికి నా దగ్గర పనిముట్లు లేవు. నిజానికి కథ దానికదే self explanatory – పరిపూర్ణం. వ్యాఖ్యలూ టీకా టిప్పణులూ అవసరం లేదు. కానీ ఆ కథ నాకిచ్చిన యెరుకని పదుగురితో పంచుకోవాలనే చాపల్యంతోనే యీ నాల్గు మాటలూ…

జ్ఞానం రాజద్రోహమనీ కుట్ర కేసుకి కారణం కావొచ్చనే హెచ్చరిక ఆ కథలోనే వున్నప్పటికీ పిలక తిరుగుడు పువ్వు వివిధ సందర్భాల్లో ప్రాసంగికంగా గుర్తొస్తూనే వుంటుంది. కారణం – రచయిత కథనంలో వాడిన అనుపమానమైన వ్యంగ్యం. సీరియస్ కథాంశాన్ని నాన్ సీరియస్ గా చెప్పడం అంత తేలికైన పని కాదు. నిజానికి వొక విధంగా చూస్తే యీ కథలో కథ లేదు. గోపాత్రుడు నవలకి పిలక తిరుగుడు పువ్వు కొనసాగింపు మాత్రమే. ఈ సీక్వెల్ శిల్పం కూడా తెలుగులో అరుదు. ఒక పాత కథనుంచీ దానికి కొనసాగింపుగా మరో కొత్త కథని సృష్టించడం మృత శిశువుకి జన్మనివ్వడం లాంటిదని విలియం గోల్డింగ్ మాట కేవలం ప్రయోగం కోసం రచనలు చేసే రచయితల విషయంలో నిజం కావొచ్చుగానీ కథా కళ మర్మం తెలిసిన పతంజలి విషయంలో మాత్రం కాదు.

భూమి గుండ్రంగా వుందా బల్లపరుపుగా వుందా అన్న వాదనతో మొదలైన ఆలమండ గ్రామస్తుల కథ కులాల విశ్వాసాల బోయినాల సంఘర్షణలో రాటుతేలి యుద్ధాన్ని తలపించే దొమ్మీగా పరిణమించి పోలీసు ప్రవేశంతో మున్సిఫ్ కోర్టుకొస్తుంది. మేజిస్ట్రేట్ గంగాధరం భూమి బల్లపరుపుగా వుందని తీర్పు చెప్తూ దానికి జీవితాన్ని అన్వయించి వుపపత్తి పూర్వకంగా వొక తర్క బద్ధమైన తత్త్వాన్ని ఆవిష్కరించి కేసు తేల్చేసాడు.

‘మన జ్ఞానానికి సార్థకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహనగానీ గురిగానీ లేదు. మన జ్ఞానానికీ, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ ఆచరణకీ పొందిక లేదు. భూమి బల్లపరుపుగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడుతుంది.’

మేజిస్ట్రేట్ చేసిన వ్యంగ్యంతో కూడిన వ్యధాభరితమైన సత్యావిష్కరణే గోపాత్రుడు నవలకి ముగింపు. అక్కడితో ఆ కథ అయిపోయింది.

patanjali

గంగాధరం తీర్పు సమాజంలో జీవితాలు అస్తవ్యస్తంగా అబద్ధాలమయంగా తయారయ్యాయి – ప్రజలు ‘ఇష్టారాజ్యం’ గా వ్యవరిస్తున్నారన్న అర్థం వచ్చేలా వుంది. మరిక దండధారి అయిన పోలీసు అస్తిత్వానికి అర్థం యేమిటి – పోలీసు రాజ్యం యేమైపోవాలి అన్న సిఐ అంతర్మథనంతో కొత్త కథ మొదలైంది. ‘చూపున్న పాట’లోని పోలీసే గోముఖం తొడుక్కొని యిక్కడ దర్శనమిస్తాడు.
పోలీసువారి ‘నమ్మకానికీ – ఆచరణకీ తేడా లేదే. విశ్వాసానికీ జీవితానికీ వ్యత్యాసం లేదే.’ చెప్పిందే చేస్తున్నారు. దండం దశగుణం భవేత్ అని నమ్మి తంతానొరే అని చెప్పి తంతున్నారు. కేసుకింత అని చెప్పి అబద్ధానికి తావులేకుండా అంతే తీసుకుంటున్నారు. అంతా ఖుల్లం ఖుల్లా. సర్వ సామాన్య వ్యవహారమే. బహిరంగ వ్యాపారమే. నిత్య కృత్యమే. మరిక ‘భూమే కాకుండా జీవితం కూడా బల్లపరుపుగా ఉన్నాదని చెప్పడానికి’ ఆస్కారం లేదే! భూమి గుండ్రంగానో బల్లపరుపుగానో లేదు పోలీసు లాఠీ లాగా లేదంటే టోపీ లాగా వుందని యింకా కాదంటే తుపాకీ తూటాలానో బాయ్ నెట్ లానో వుందని పోలీసు నమ్మకం. ‘నల్ల గౌనేసుకున్నోడి నమ్మకం తీర్పయిపోయి’ మిగిల్నోళ్ళ నమ్మకాలు అందునా పోలీస్ నమ్మకానికి విలువ లేకుండా పోవడంలో, ఆ తీర్పుని పోలీస్ కూడా అంగీకరించవలసి రావడంలో మిక్కిలి ‘డేంజరున్నాది’- అనుకొన్నాడు జామీ స్టేషన్ సిఐ.

తమ యేలుబడిలోని వొక చిన్న రాజ్యంలో ప్రజా జీవితం సవ్యంగా లేనందువల్లే యిటువంటి అపసవ్యమైన పిలక తిరుగుడు తీర్పుని ఎస్. కోట మాజిస్ట్రేట్ యిచ్చాడనీ అందుకు ఆ యిలాకా సిఐ బాధ్యత వహించి జీవితంలోకి తొంగి చూసినందుకు అతనికి బుద్ధి చెప్పాలనీ డి యస్పీ దొరగారు భావించడంతో ధర్మ కర్మాచరణ దీక్షా బద్ధులైన వారి పరోక్ష నేతృత్వంలో కనుసన్నల్లో పోలీస్ యాక్షన్ మొదలైంది. పోలీస్ పవరేంటో పిలక తిరుగుడు మున్సఫ్ మాజిస్ట్రేట్ కి ఘరానా పోలీస్ సిఐ తెలియ జెప్పడమే యీ కథ.

గోపాత్రుడు (1992) నవల చదవకపోయినా ‘పిలక తిరుగుడు పువ్వు’ దానికదే నిండైన కథగా రూపొందడానికి పతంజలి కథని యెత్తుకొన్న విధానమే గొప్పగా దోహదం చేసింది. పాత కథలోని ముగింపు – గంగాధరం తీర్పు. దాన్ని సమీక్షించడం, కొత్త కథకి ప్రస్తావనగా వుపయోగపడగల పోలీసు అధికారాన్ని బేరీజు వేసుకోవడం – యీ రెండు పనుల్నీ కథ యెత్తుగడ నెరవేర్చింది. న్యాయవ్యవస్థ పోలీసుపై ఆధిపత్యం నెరపి శాసించడమనేది గొప్ప ప్రమాదం – ఆ ప్రమాదం కొనసాగనివ్వడానికి వీల్లేదు అన్న సూచనకి ప్రస్తావనలోనే బీజాలు పడ్డాయి. దాన్నెలా సాధిస్తాడన్నదే మిగతా కథ అంతా.

రాజు తల్చుకొంటే దెబ్బలకి కొదవేముంది? పోలీసు తల్చుకొంటే చేయలేనిది ఏముంది? సవాలక్ష అభియోగాలూ బైండోవర్లూ మిస్సింగ్ లూ చిత్రహింసలూ లాకప్ డెత్ లూ ఎన్ కౌంటర్లూ రాజద్రోహం కుట్ర కేసులూ … యేదైనా సాధ్యమే. ఆలమండ దొమ్మీలో మేజిస్ట్రేటు యెవరికీ శిక్ష వెయ్య లేదు. ‘అందర్నీ వొగ్గీసినాడు’. సి ఐ వాళ్ళందరి మీదా వైనవైనాలుగా రికార్డు స్థాయిలో కుట్ర కేసులు బనాయించి కోర్టుకి హాజరు పరుస్తాడు. భూమి బల్లపరుపుగా వుందని తీర్పునిచ్చి – దాన్నిధిక్కరించి నందుకు కొందరికి శిక్ష కూడా విధించిన గంగాధారమే అన్ని కుట్రకేసుల్లోనూ ప్రథమ సాక్షి.

ఇప్పటి దాకా మంచుతెర చాటున దాగిన సూర్యబింబంలా దోబూచులాడిన రచయిత దృక్పథం ఇక్కడ నుంచీ బాహాటమైంది. ఎండ చురుకు చర్మం లోపలి పొరల్ని సైతం తాకుతుంది. పాలకుల చేతిలో ప్రజల్ని అదుపులో వుంచడానికి ప్రజాస్వామ్యంలో యిన్ని ఆయుధాలున్నాయా అని ఆశ్చర్యపోతాం. ఏలినవారు కుట్రకేసులు ఆడా మగా తేడా చూపకుండా మనుషుల మీదే కాదు వీరబొబ్బిలి లాంటి కుక్క మీద కూడా పెట్టినట్టు చెప్పడం హాస్యానికి కాదు; అధిక్షేపానికే అని పాఠకులకి అర్థం కావడానికి ఆట్టే సేపు పట్టదు.

గంగాధరానికే విషయంలోని గాంభీర్యం కాస్త ఆలస్యంగా బోధపడింది. కుట్ర కేసుల అంతరార్థం ఏఏపి చెప్తే గానీ తెలుసుకోలేడు. ‘ఏటిదంతా’ అని యుద్ధం చేయలేని అర్జునుడిలా అడుగుతాడు.
ఏఏపి వువాచ:
“విది పోలీసు మాయ … గవర్నమెంటోడి లీల …”
పద్దెనిమిది అధ్యాయాల్లో చెప్పాల్సిన సారం అంతా వొక్కముక్కలో తేల్చేశాడు. రచయిత ఏఏపిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని గాక అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్ అనడంలో చమత్కారం, పోలీస్ కీ గవర్నమెంట్ కీ అభేదాన్ని పాటించడంలో చాతుర్యం గమనించాలి.
‘కేసులు దాఖలు చేసినవారు: భారత ప్రభుత్వము తరపున వారి ఘనత వహించిన ప్రతినిధులు … సర్కిల్ ఇన్స్ పెక్టర్ వారు.’ ప్రభుత్వం అమూర్తం. దానికి నిండైన రూపం పోలీసు. ఈ విషయంలో సందేహానికి యిక తావు లేదు.
“ఒక్క కుట్ర కేసైనా నిలబడదు …” కక్షగా అన్నాడు గంగాధరం. మాయా వినోదం లీలా క్రీడల పరమార్థం అర్థం కావాలంటే ప్రభువులు విశ్వరూపం చూపించాల్సిందే! [జాక్ లండన్ ‘ఐరన్ హీల్’ (తెలుగు అను: ఉక్కు పాదం) నవల్లో తన పరిధిని మర్చిపోయి పేదల కష్టాలకి కారణాలు తెలుసుకొనే ప్రయత్నం చేసిన మతాధికారిని చర్చి పిచ్చివాడని ముద్ర వేసి బహిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో పౌరులకి మంచి జీవితాన్ని కోరుకొన్న న్యాయాధికారి గంగాధరంది కూడా దాదాపు అదే పరిస్థితి.] కుట్రకేసులు నిలబడతాయని పోలీసులు వాట్ని పెట్టరు. అల్లరిపెట్టడానికి పెడతారు. ఆ మనుషులు పెట్రేగిపోకుండా కొంతకాలమైనా కంట్రోల్ లో ఉండటానికి పెడతారు. పిరికివాళ్ళని జడిపించడానికి పెడతారు – అన్న ఏఏపి సోయి తెలివి కూడా అతనికి లేవు.

రాంనగర్, సికింద్రాబాద్, పార్వతీపురం … యెన్ని చూడలేదు మనం. కతలూ కవితలూ రాసుకొనేవాళ్ళూ పత్రికలూ పుస్తకాలూ అచ్చేసేవాళ్ళూ ‘చట్ట బద్ధముగా ఏర్పడిన భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను కుట్ర పూరితముగా కుత్సిత బుద్ధితో సాయుధముగా కూల్చివేస్తార’నా కేసులు పెట్టేది? దశాబ్దాలపాటు కేసులు నడుస్తాయి. కేసు కొట్టేసే లోపు కొందరు సైద్ధాంతికంగా దూరమౌతారు. కొందరు దాటుకుంటారు. కొందరు దాటిపోతారు. కొందరు జారిపోతారు. కొందరు లొంగిపోతారు. కాదంటే కొంతమందిని లేపేయొచ్చు. కొందరు వాళ్ళే లేచిపోతారు.
పాపం ఎస్ కోట మేజిస్ట్రేట్ లాంటి వారికి జీవితం గందరగోళంగా వుందన్న భోగట్టా తెలుసు, అందుకు కారణాలూ తెలుసు. కానీ దాన్ని చక్కదిద్దే దారులే తెలీవు. తెలిసినా వ్యవస్థ ఫ్రేములో బిగుసుకొని మాత్రమే బతకాల్సిన – బతగ్గల గంగాధరాలు ఏం చేయలేరు. చేయడానికి ప్రయత్నించినట్టు యే మాత్రం వాసన వచ్చినా పిలక కత్తిరించే యంత్రాంగం వుండనే వుంది.
ఆ యంత్రాంగానికొక రీతి వుంటుంది. రివాజు వుంటుంది. సంప్రదాయం వుంటుంది. ఆచారముంటుంది. హైరార్కీ వుంటుంది. క్రమశిక్షణ వుంటుంది. విశ్వాసం వుంటుంది. విధేయత వుంటుంది (పై పెచ్చు దానికి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ నూకాంబికాదేవి అనుగ్రహం కూడా తోడుంటుంది.) అంతిమంగా దానికొక పిలాసఫీ వుంటుంది. వాటన్నిటినీ ‘ఎక్సీడ్’ చేసి జీవితం గురించి ఆలోచించడం గంగాధరం చేసిన నేరం.
జీతాలు తీసుకొని పోలీసు వారి అభియోగాల్ని అనుసరించి వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల ప్రకారం కేసులు విచారించి ముందుగానే రచించి యిచ్చిన స్క్రీన్ ప్లే ప్రకారం పరిష్కారాలు చెబుతూ వొక వుద్యోగిగా తన పరిమితులు గుర్తెరిగి న్యాయాధికారిగా పాలకులు నిర్దేశించిన విద్యుక్తధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ సుఖంగా వుండక పరిధులు దాటి ప్రమేయాలు మీరి జీవితంలోకి తొంగి చూసినందుకు వొక వేళ కుట్ర కేసంటూ పెడితే మున్సఫ్ మాజిస్ట్రేట్ గంగాధరం మీద పెట్టాలని సెషన్స్ జడ్జి అభిప్రాయం.

‘ప్రజాజీవితం పోలీసువారి చేతుల్లో సుఖంగా, శాంతంగా, చల్లగా ఉందని, భూమి ఒకవేళ బల్లపరుపుగా ఉన్నా కూడా పోలీసువారు దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పిండిలా నలిపి, గుండ్రంగా చేయగలరనీ …’ సెషన్స్ జడ్జి అనుభవ పూర్వకంగా యేర్పరచుకొన్న నమ్మకం కూడా.

ఆ నమ్మకం చాలా బలమైందనీ తిరుగులేనిదనీ అండర్ కవర్ కాప్ ల్ని సూపర్ కాప్ ల్ని సృష్టిస్తోన్న పూరీ జగన్నాథ్ లు శీనూ వైట్లాలు త్రివిక్రం శ్రీనివాస్ లూ … నిర్ధారిస్తున్నారు. దొరతనం వారు ఆచరించి చూపిస్తున్నారు. పోలీసుల శక్తి సామర్ధ్యాల ముందు న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం పౌర హక్కులూ అన్నీ బలాదూరేనని తొడగొట్టి మరీ హెచ్చరిస్తున్నారు. కథలో ఆ హెచ్చరికని న్యాయాధిపతి నోట పలికించడమే గొప్ప ఐరనీ. మాట వుచ్చరించే వారి స్థాయిని బట్టీ విలువల్ని తొడుక్కొంటుంది.
కేసుల్ని దాఖలు చేయడానికి పోలీసువారు ఉపయోగించిన భాష న్యాయ పరిభాషా పాలక వర్గానికే ప్రత్యేకమైనవి. భాషకి వర్గ స్వభావం వుంటుంది. ఆయా వర్గాలకే పరిమితమైన విలక్షణమైన జార్గాన్ వుంటుంది. అత్యాధునిక యుగంలో సమస్త అవలక్షణాలతో రాచరిక వ్యవస్థ యింకా అమలౌతున్న రీతిని తెలియజెప్పడానికి పతంజలి ఆయా సందర్భాల్లో భాషని కూడా గొప్ప సాధనంగా స్వీకరించాడు.

పోలీసురాజ్యంలో న్యాయవ్యవస్థలోని వైకల్యాన్నీ బలహీనతనీ డొల్లతనాన్నీ బహిరంగ పరచడమే కథలో ప్రధానాంశమైనప్పటికీ మానవ ప్రవృత్తిలోని నైచ్యాన్ని ఆనుషంగికంగా విమర్శించే పని కూడా రచయిత వొక పూనికతో చేయడం గమనించాల్సిన విషయం.

పెట్టుబడుల విష పుత్రికలూ పాలకుల పెంపుడు జంతువులూ అయిన సువార్త దుర్వార్త కల్పన కంగాళీ లాంటి గబ్బు పట్టి పోయిన నేలబారు పత్రికల చౌకబారు జర్నలిస్టుల అనైతిక వర్తన గురించీ, స్ట్రింగర్లకీ కాంట్రిబ్యూటర్లకీ జీతాలైనా సరిగ్గా యివ్వని దగాకోరు పత్రికల యాజమాన్యాల దోపిడీ గురించీ, జలగల్లా డబ్బులు పీల్చి పార్టీలని దమ్ములగొండుల్లా పీక్కుతినే ప్లీడర్ల దందాల గురించీ, కండ బలంతోనో మంద బలంతోనో తమ మనోభావాల్ని మందిమీద రుద్దే అరాచక మూక క్షుద్ర రాజకీయాల గురించి కథలో పతంజలి చేసిన పరిశీలనలు ఆ వ్యవస్థల మీద అసహ్యం కలిగేలా చేస్తాయి. అయితే వస్త్వైక్యత దెబ్బ తినకుండా వాటిని కథలో యిమడ్చడంలో రచయిత ప్రతిభ కనపడుతుంది.

రాజుగారి బుల్లి గడ్డమ్మీదో పొడవాటి ముక్కు మీదో పజ్యాలు చెప్పుకొని అవార్డులూ సత్కారాలూ పొందకుండా గడ్డం కింద బొల్లి గురించో ముక్కుమీది మచ్చ గురించో యిలా కతలు రాసినందుకు పిలక పుచ్చుకొని కోర్టుకీడ్చి కుట్రకేసంటూ పెడితే రచయిత మీద పెట్టాలి. రచయితలు వీలయితే రెండు రెళ్ళు నాలుగు అంటూ యెక్కాల పుస్తకం రాసుకోవచ్చు. మహా అయితే అదొక గుణకారం అని నిర్వచించవచ్చు. కానీ అది కూడిక కూడా అని విప్పి చెప్పడం కన్నా మించిన రాజద్రోహం లేదు. జీవితంలోకి రాజకీయ విశ్వాసాల్లోకీ తొంగిచూసే తనది కాని బాధ్యత నెత్తికేసుకోవడమే రచయిత చేసిన నేరం అని పాఠకుడిగా నా నమ్మకం. రచయిత బోనులోనూ పాఠకుడు తీర్పరి స్థానంలోనూ వున్నప్పుడు పాఠకుడి జ్ఞానానికీ విశ్వాసానికీ యెక్కువ విలువుంటుంది గదా!
కమ్యూనిస్టు ప్రపంచంలో దేశాలకు సరిహద్దులుండవు; యుద్ధాలుండవు అదే కమ్యూనిజం అంతిమ ఫలితం అని చెప్పుకుంటాం. మరి రాజ్యం యేమౌతుంది – ఎటువంటి ఆధిపత్యాలు లేని రాజ్యాధికారం యెలా వుంటుంది – రాజ్యం అభావమయ్యే స్థితి సంభవిస్తుందా – సంభవిస్తే అది యెలా వుంటుంది?? పిలక తిరుగుడు కథ వొకటికి పదిసార్లు చదివినప్పుడల్లా యీ ప్రశ్నలు పదే పదే తొలుస్తుంటాయి. మానవీయ గుణాలు దయ, కరుణ, ప్రేమ, సమత్వ భావన లోపించిన రాజ్యమూ రాజ్యాధికారాలూ అవసరం లేదనీ మన తోటి వాళ్ళమీద మనకు మమకారం లేనప్పుడు భూమి బల్లపరుపుగానే వుంటుందనే గంగాధరం ముఖత: రచయిత బెంగటిల్లాడు. పరస్పర వైరుధ్యాలు లేకుండా మన సిద్ధాంతాలూ ఆచరణా వాదాలూ విలువలూ జ్ఞానం సత్యం సజావుగా సూటిగా యేకాత్మకంగా సాగినప్పుడు భూమి గుండ్రంగానే వుంటుంది. సమస్త ప్రజానీకానికీ సుఖంగా నివాసయోగ్యంగా వుంటుంది. ఆనంద ధామంగా వుంటుంది. జీవితం సవ్యంగా వుంటుంది. వికాసోన్ముఖంగానూ వుంటుంది. కథ ద్వారా పతంజలి పాఠకులతో పంచుకోదలచిన చూపు అదే – ఆశించిన ప్రయోజనం అదే.

*

మీ మాటలు

  1. Thirupalu says:

    //ఆ యంత్రాంగానికొక రీతి వుంటుంది. రివాజు వుంటుంది. సంప్రదాయం వుంటుంది. ఆచారముంటుంది. హైరార్కీ వుంటుంది. క్రమశిక్షణ వుంటుంది. విశ్వాసం వుంటుంది. విధేయత వుంటుంది (పై పెచ్చు దానికి శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ నూకాంబికాదేవి అనుగ్రహం కూడా తోడుంటుంది.) అంతిమంగా దానికొక పిలాసఫీ వుంటుంది. వాటన్నిటినీ ‘ఎక్సీడ్’ చేసి జీవితం గురించి ఆలోచించడం గంగాధరం చేసిన నేరం.//
    చాలా బాగుందండి. పతంజలి గారి కదా కంటే మీ వ్యాఖ్యానం అద్బుతంగా ఉంది. ఇక పై గంగా దారాలే కాదు ఆకలి అయిన వాడంతా నేరగాడే !

  2. K Niranjan says:

    రాజ్య స్వభావాన్ని బాగా ఎండగట్టిన నవల సారాంశాన్ని అంతే బాగా విశదీకరించి చెప్పిన వైనం ఎక్ష్చెల్లెన్త్ . అభినందనలు …..

  3. కథ చదివి ఏళ్ళైనా అదిప్పుడే చదివినంత తాజాగా వుండిపోయింది మెదళ్ళో!
    మీ వాఖ్యానం కథా శైలిలోనే అద్భుతంగా సాగింది.
    “రచయితలు వీలయితే రెండు రెళ్ళు నాలుగు అంటూ యెక్కాల పుస్తకం రాసుకోవచ్చు. మహా అయితే అదొక గుణకారం అని నిర్వచించవచ్చు. కానీ అది కూడిక కూడా అని విప్పి చెప్పడం కన్నా మించిన రాజద్రోహం లేదు.”
    రచయితలు ఈ పాట సారాంశము ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా వుంటాయి.

  4. buchireddy gangula says:

    అంతగా — గుర్తింపు లేక — ఏ అవార్డ్స్ రాక —వెళ్లి పోయారు

    గొప్ప రచయిత — కథలు — నవలలు —-వాస్తవానికి దగ్గరగా — కనిపిస్తున్నట్లూ —
    చూస్తునట్ట్లూ —- రాసిన పతంజలి గారు

    ఎప్పుడు చదివినా — నేటి దోపిడి వ్యవస్థ ను — నేతల తిరు ను కళ్ళకు కట్టినట్టుగా
    తోస్తుంది —–
    యిపుడు రొండు తెలుగు రాష్ట్రాల లో రాజులు పాలిస్తున్నారు —-రిమోట్ కంట్రోల్ — కంట్రోల్
    రాజకీయాలతో —- ఏలుతున్న ప్రభువులు —–
    ప్రజల వలన — ప్రజల చేత — ప్రజల ద్వారా — ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ — ప్రజాసామ్యం — కానీ అది నిజం కాదు

    ఒక ఫ్యామిలీ కోసం — ఒక ఫ్యామిలీ ద్వారా —- నడుస్తున్న రాజరికం — నేడు — తెలుగు
    రాష్ట్రాల లో ????
    ——————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  5. kurmanath says:

    చాలా బాగుంది, ప్రభాకర్ గారూ.
    రావి శాస్త్రి గారి ఒరవడిని పతంజలి గారు అందుకోవడమే కాకుండా, దాన్ని మరింత ముందుకి తీసుకెళ్ళారు. ఇలాటి విశ్లేషణల వల్ల ఆయన రచనల్ని మళ్ళీ చదివింపచేస్తాయి. ముఖ్యంగా, కొత్త తరం పాటకులకి చాల ఉపయోగం.

  6. చాలా బాగుంది. రాజకీయ నాయకుడూ, మీడియా, పోలీసూ, న్యాయవ్యవస్థ ఆడే నాటకంలో పతంజలి రాసిన్నాటికీ ఈనాటికీ కూడా పిలక తిరుగుడు పూలుగా న్యాయమూర్తులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా సుప్రీమ్ కోర్టువారు ప్రభుత్వాలకి వేస్తున్న మొట్టికాయలు చూస్తుంటే…. అవినీతి న్యాయమూర్తులు పెద్ద మినహాయింపే అయినా రాజ్యానికి పూర్తి స్థాయి అంగంగా న్యాయవ్యవస్థ మారే అవకాశం దాని స్వభావంలోనే తక్కువేమో. లోపలున్న రావిశాస్త్రి కంటే ఇది పతంజలికే ఎక్కువ అర్థం అయినట్టుంది. వీళ్ళ బుర్ర తిరుగుడు అణచడానికి న్యాయమూర్తుల నియామకాల్లో వేలూ కాలూ పెట్టేద్దామని రాజ్యం చూసింది గానీ గట్టిగానే ప్రతిఘటించింది న్యాయవ్యవస్థ ఈమధ్య.

    మీ పరిశీలన బాగుంది. కానీ అధికార దండం చేతుల్లో ఉండటంతో పోలీసువాడు రాజ్యానికి అందంగా అమిరి అతికిపోయాడు. అది అంగంగానే ఉంది తప్ప రాజ్యానికి అసలు రూపమే పోలీసా అన్నది అనుమానమే. అయినా అధికార దండం కమ్యూనిస్ట్ రాజ్యాలలో మాత్రం తక్కువ చేటు చేసిందా ?

    “రచయిత బోనులోనూ పాఠకుడు తీర్పరిగానూ ఉంటున్నప్పుడు పాఠకుడి జ్ఞానానికీ విశ్వాసానికీ ఎక్కువ విలువ ఉంటుంది కదా” అని ఇప్పటి పరిస్థితిని మాటల్లో చక్కగా పెట్టారు మీరు. అబినందనలు.

    • Dr. Rajendra Prasad Chimata. says:

      సుప్రీం కోర్టు వారుకూడా రాజ్యంలో భాగమే. పోలీసు వాడే రాజ్యం. మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామనే భ్రమ పోగొట్టడమే ఆ రచనల ఉద్దేశ్యం.అధికారం లోకి వెళ్ళేది డబ్బున్న వాడే. వాడు రాజ్యం చేసేది పోలీసు ద్వారానే. న్యాయస్థానాలు న్యాయం అంతా భ్రమ.

      • Lalitha P says:

        ప్రజాస్వామ్యం అంటే మందిస్వామ్యం అనికూడా చెప్తాడు పతంజలి ‘గోపాత్రుడు’లో. ప్రజాస్వామ్య భావనలోనే డొల్లతనం ఉంది. అయినా దానిగురించి మాట్లాడేటప్పుడు రాజ్యంచేసే అన్యాయాల్లో ఉండే హైరార్కీ గురించి మాట్లాడొచ్చు. డబ్బుతో కులంతో పార్లమెంట్ లో కూచున్నవాడు అందరికంటే బలవంతుడు. వీడి అన్యాయాన్ని ఎవరూ అడ్డు రాకుండా అమలు చేసేవాడు పోలీసు, డబ్బున్నవాడికి సేవ చేసేది లాయరు. అయినా కూడా గంగాధరాలు న్యాయవ్యవస్తలోనే ఉండటానికి కాస్త వీలుంది. పోలీసుల్లో మంత్రుల్లో ఉండే అవకాశం అసలు లేదు.

  7. c.n.s.yazulu says:

    చాల అద్భుతంగా రాసారు.పతంజలి గారిని అనుక్షణం గుర్తు చేసుకోవలసినంత భయంకర పరిస్థితుల్లో ఉన్నాం మనందర్మును.ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

  8. ఎ కె ప్రభాకర్ says:

    కమ్యూనిస్టు ప్రపంచంలో దేశాలకు సరిహద్దులుండవు; యుద్ధాలుండవు అదే కమ్యూనిజం అంతిమ ఫలితం అని చెప్పుకుంటాం. మరి రాజ్యం యేమౌతుంది – ఎటువంటి ఆధిపత్యాలు లేని రాజ్యాధికారం యెలా వుంటుంది – రాజ్యం అభావమయ్యే స్థితి సంభవిస్తుందా – సంభవిస్తే అది యెలా వుంటుంది?? పిలక తిరుగుడు కథ వొకటికి పదిసార్లు చదివినప్పుడల్లా యీ ప్రశ్నలు పదే పదే తొలుస్తుంటాయి.
    లలిత గారూ పతంజలి సాహిత్యం మనకిచ్చే ఎరుకలో ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి . మీ స్పందనకు ధన్యవాదాలు .
    ఎ.కె.ప్రభాకర్

    • సాహితి says:

      //కమ్యూనిస్టు ప్రపంచంలో దేశాలకు సరిహద్దులుండవు; యుద్ధాలుండవు అదే కమ్యూనిజం అంతిమ ఫలితం అని చెప్పుకుంటాం. మరి రాజ్యం యేమౌతుంది – ఎటువంటి ఆధిపత్యాలు లేని రాజ్యాధికారం యెలా వుంటుంది – రాజ్యం అభావమయ్యే స్థితి సంభవిస్తుందా – సంభవిస్తే అది యెలా వుంటుంది?? పిలక తిరుగుడు కథ వొకటికి పదిసార్లు చదివినప్పుడల్లా యీ ప్రశ్నలు పదే పదే తొలుస్తుంటాయి.//
      ప్రభాకర్ గారు, మీరు ఏమీ అనుకోక పోతే ………… ఒక స్పష్టత లేని దాని కోసం ఇంత ఆరాటాలు ప్రాణత్యాగాలు ఎందుకు? సోవియట్ యూనియన్ లో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నమనుకున్న సోషలిస్టు వ్యవస్థ గడ్డలు తన్ను కొని పోతే ఎం చేసారు? అన్నీ సందేహాలు! మరి జవాబులేమిటి ?
      నేను దీన్ని నెగిటివ్ దృక్పదం తో మాత్రం అడగటం లేదు.

      • అజిత్ కుమార్ says:

        కమ్యూనిష్టు ప్రపంచం ఏర్పాటుకు ప్రస్తుతం కమ్యూనిష్టులం అని చెప్పుకునేవారే తయారుగాలేరు. కమ్యూనిష్టు ప్రపంచంలో స్వంత ఆస్తి ఉండదు కనుక మొదటగా ఆస్తిమీద మమకారం వదులుకోవడానికి మనుషులు సిద్ధపడాలి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. అలా ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి ప్రజలు సిద్ధంకావడమే పార్టీ నిర్మాణమంటే. భావవాదాన్ని వొదులుకోగలిగినప్పుడు అది సాధ్యమౌతుంది. కనీసం కమ్యూనిష్టులం అని చెప్పుకునే వారినుండైనా భావవాదం తొలగించగలిగితే పార్టీనిర్మాణం సాధ్యమౌతుంది. అలాంటివారి నాయకత్వంలోరాజ్యం ప్రచ్చన్నంగా పనిచేస్తుంది. మొదట ఒక అపార్టమెంట్ కల్చర్ లాగా ప్రారంభమై క్రమేపి విస్తరిస్తుంది. అది త్వరలో సాధ్యము కావాలనే మీలాగే చాలామంది కోరుతున్నారు. సరైన నాయకత్వలోపం నేటి ప్రధాన సమస్య.కనుక వేచి చూడక తప్పదు.

      • ఎ కె ప్రభాకర్ says:

        మానవీయ గుణాలు దయ, కరుణ, ప్రేమ, సమత్వ భావన లోపించిన రాజ్యమూ రాజ్యాధికారాలూ అవసరం లేదనీ మన తోటి వాళ్ళమీద మనకు మమకారం లేనప్పుడు భూమి బల్లపరుపుగానే వుంటుందనే గంగాధరం ముఖత: రచయిత బెంగటిల్లాడు. పరస్పర వైరుధ్యాలు లేకుండా మన సిద్ధాంతాలూ ఆచరణా వాదాలూ విలువలూ జ్ఞానం సత్యం సజావుగా సూటిగా యేకాత్మకంగా సాగినప్పుడు భూమి గుండ్రంగానే వుంటుంది. సమస్త ప్రజానీకానికీ సుఖంగా నివాసయోగ్యంగా వుంటుంది. ఆనంద ధామంగా వుంటుంది. జీవితం సవ్యంగా వుంటుంది. వికాసోన్ముఖంగానూ వుంటుంది. కథ ద్వారా పతంజలి పాఠకులతో పంచుకోదలచిన చూపు అదే
        ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా చేసి …. వాటికి జవాబులు ఆలోచించే దిశలోకి నడిపించడమే సాహిత్యం ప్రయోజనం అనుకొన్నప్పుడు ఈ కథ ద్వారా పతంజలి దాన్ని సాధించాడనే నేను భావిస్తున్నాను . అంతిమ ఫలితాల కోసం నిరంతరం ఛైతన్య శీలంగా ఉండమనే గతితార్కిక భౌతికవాదం బోధిస్తుంది .
        మీ స్పందనకు థాంక్స్ సాహితి గారూ!

  9. చందు తులసి says:

    ప్రభాకర్ గారు మీ వివరణ బాగుంది…
    ఈ కథకు లింక్ ఇవ్వగలరా ఎవరైనా…?

  10. kurmanath says:

    I don’t think a link is available, Chandu Tulasi garu.

  11. చందు తులసి says:

    ఓకే కూర్మనాథ్ గారు.ఈ. పుస్తకం కోసం నెట్లో వెతకాలి

  12. ఎ కె ప్రభాకర్ says:

    పిలక తిరుగుడు పువ్వు కథ కథాసాహితి కథ 95 లో వుంది. రెండు దశాదబ్దాల కథ సంకలనంలో వుంది. పతంజలి సమగ్ర రచనల సంపుటిలో వుంది.

  13. buchireddy gangula says:

    తులసి గారు
    పతంజలి గారి —complete.sahityam.—part-1 and.part2–అంటూ 2 బుక్స్ మార్కెట్ లోకి
    వచ్చాయి —-
    ————————————
    buchi.reddy.gangula.

  14. ఎ కె ప్రభాకర్ says:

    అజిత్ కుమార్ గారి వివరణ పతంజలి చూపుని మరింత లోతుగా తెలుసుకోడానికి తోడ్పడుతుంది

  15. ఏకే ప్రభాకర్ గారూ, పతంజలి రాసిన ‘పిలక తిరుగుడు పువ్వు’ కథనూ, ఆ కథ ప్రత్యేకతనూ మీరు చాలా బాగా విశ్లేషించారు. అభినందనలు!
    .
    చందు తులసి గారూ, ఈ కథ లింకు గురించి అడిగారు కదా, ఇక్కడ ఇచ్చిన లింకులో దాన్ని మోహన్ బొమ్మలతో సహా చూసి, ఆనందిస్తూ చదువుకోవచ్చు- https://www.scribd.com/doc/287153069/pilaka-tirugudu-puvvu

  16. కె.కె. రామయ్య says:

    పతంజలి గారి ‘పిలక తిరుగుడు పువ్వు’ గురించి అద్భుతంగా విశ్లేషించిన ఏ.కే. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. చందు తులసి గారూ, కొద్దిగా ఖరీదైనా పతంజలి సాహితీ సర్వస్వం నవోదయ బుక్ హౌస్, కాచీగూడ నుండి కాని ( లేదూ క్రింద ఇవ్వబడిన వారి వెబ్ సైట్ లో ఆర్డర్ చెయ్యటం ద్వారా కానీ ), ఎమెస్కో నుండీ కాని తెప్పించుకోవచ్చు.

    http://www.telugubooks.in/products/patanjali-sahityam-1
    http://www.telugubooks.in/products/patanjali-sahityam-2

  17. చందు - తులసి says:

    ప్రభాకర్ గారూ..వేణు గారూ..బుచ్చిరెడ్డి గారూ..రామయ్య గారూ…అందరికీ ధన్యవాదాలు..

  18. ఎ కె ప్రభాకర్ says:

    వేణుగారు,
    కథకి లింక్ ఇచ్చినందుకు థాంక్స్ .

  19. chandolu chandrasekhar says:

    ఈ స్టొరీ చదివి ఇరవె, పాతిక ఇయర్స్ పైన అవినది , మంచికత
    మావూరు వాళ్ళు ,భూమి గుండ్రంగా వుందా టే కాదు మావూరు వాళ్ళు బల్లపరుపు గావుంటే
    మాకులం వాళ్ళు చెప్పిందే వాస్తవం మని చివరి వాస్తం తెలుసుకొనటానికి ఓ కమిటి వేయటం చివరి కి పోలిసువాడి లాటికర్ర వుందని చెప్పటం గుప్ప హాస్యం తో కూడి న కత గురుతు చేసినందుకు thx

Leave a Reply to buchireddy gangula Cancel reply

*