“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

Mahadevi Varma Geethalu_18th Book_Title Text.p65

– జగద్ధాత్రి 

~

 

Jagathiబాధ నా సృజనకు మూలం అన్నాడు చలం. వేదన, విరహం , ఒంటరితనం , ధు:ఖం ఇవన్నీ బాధకి పర్యాయ పదాలే. ఈ బాధ ఆమె అక్షరాల్లో వేదనా గీతికలై అలపిస్తుంది మహా కవయిత్రి మహాదేవి వర్మ. ఇటీవల ఆమె గీతాలు  “మహాకవయిత్రీ మహాదేవి వర్మ గీతాలు” పేరిట తెలుగు లో కి అనువదించారు తెలుగు సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ చాగంటి తులసి. ప్రఖ్యాత రచయిత చాసో కుమార్తె గానే కాక తనకంటూ ఒక విశిష్టమైన స్థానం తెలుగు సాహిత్యం లో తన కథలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, కవిత్వం తో సంపాదించుకున్నారు తులసి గారు. ప్రగతి శీలక ధృక్పధం తో సాగే ఈమె రచనల్లో అంతటా అభ్యుదయ భావాలు , ఆచరణీయ మార్గాలే అగుపిస్తాయి. ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన కథలు “ఏష్ట్రే”, “ బామ్మ రూపాయి “ లాంటి కథల్లో తులసి వ్యక్తిత్వ గంభీరత మనకు అవగాహన అవుతుంది.

మహా కవయిత్రి మహాదేవి వర్మ గారి సాహిత్యం లో సౌందర్య భావన అనే అంశం మీద డాక్టర్ ఆదేశ్వర రావు గారి వద్ద తన పి హెచ్ డి చేశారు హింది లో తులసి. అభ్యుదయ భావాలు ఉన్న తులసి జీవితం లో ప్రగతి శీలక పాత్ర పోషించిన మహాదేవి వర్మ గురించి పరిశోధన చేయడం ముదావహం గానే అనిపిస్తుంది. అయితే వచన రచనలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులసి , అందునా కథ పట్ల చాలా మక్కువ గల తులసి మహాదేవి వర్మ కవితాత్మక సౌందర్య భావన పై పరిశోధన చేయడానికి కారణం వారి గురువైన ఆచార్య ఆదేశ్వర రావు గారు కూడా కవి కావడమే అని ఇటీవలే ఈ పుస్తక ఆవిష్కరణ నందు తులసి పేర్కున్నారు. అక్టోబర్ 15 న ఆంధ్ర విశ్వవిద్యాలయం హింది విభాగం లో లోక్ నాయక్ ఫౌండేషన్ వారి నిర్వహణ లో ఈ పుస్తకాన్ని ఆచార్య ఆదేశ్వర రావు గారు ఆవిష్కరించారు. సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఇటీవలే పరమపదించిన ఆచార్య బలశౌరి రెడ్డి గారు ఈ పుస్తకానికి అవతారిక నందించారు. ప్రముఖ సాహితీవేత్త కవి , చిత్రకారుడు శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ముందుమాట రాసారు. తాను కవయిత్రి గా కాక కథయిత్రిగానే ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని , ఐనా మహాదేవి వర్మ గీతాల భావనాలోకం కూడా తన భావ జాలం కాదని ఐనప్పటికీ  , ఆనాటి రోజుల్లో అంత చదువుకున్న , అంత ప్రఖ్యాత స్థాయి కెదిగిన , ప్రతిభావంతురాలు మహదేవి వర్మ గనుక ఆమె గీతాలు నేటి తెలుగు పాఠకులకు అందించడం అవసరమని భావించి అనువాదం చేశానని తులసి చెప్పేరు సభలో. తెలుగులో తులసి గారు చేసిన అనువాద గీతాలను కొన్ని స్వీయ సంగీత నిర్వహణ లో శ్రీమతి శశిరాణి ఆలపించి అలరించారు. ఇవి సభా వివరాలు.

చాగంటి తులసి –మహాదేవి వర్మ :  రచయిత్రిగా తెలుగు పాఠకులకు చిర పరిచితమైన తులసి గారు , వ్యక్తిగత పరిచయం ఉన్నవారు మన అందరికీ. ఆమె స్వభావం బట్టీ ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఏ రచనైనా తనని బాగా ఆకర్షిస్తేనే తప్ప , అందులో తాను  మమేకవగలిగితేనే తప్ప అనువాదం చెయ్యను అంటారు. మహాదేవి వర్మ గీతాలను ఆకళింపు చేసుకున్నాక వాటిని తెలుగు పాఠకులు , భవిష్యత్ తరాలు చదువుకోవాలి అని భావించి అదే ఆశయం తో వీటిని అనువదించారు. ఏ పని ఐనా మనస్ఫూర్తిగా చేసే తులసి ఈ అనువాదానికి పూనుకోవడం ముదావహం. ముప్పై మహాదేవి గీతాలను ఎంచుకుని వాటిని తెనిగించారు. వాస్తవానికి అనువాదం అనే కంటే అనుసృజన అనొచ్చు . ఎందుకంటే రాసినది మహా కవయిత్రి , మరొక భాష లో అందిస్తున్నది మరో రచయిత్రి కనుక అనువాదకురాలిగా కాక అనుసృజన కర్త గా తులసి ఈ గీతాలను ప్రతిభావంతంగానే కాదు హృద్యంగా అందించారు. ఎక్కడా మహాదేవి కవితాత్మ దెబ్బ తిన కుండా ఆమె రచించిన పద మాధుర్యాన్నీ, భావ మాధుర్యాన్నీ ఎక్కడా చెదర నివ్వకుండా అనువదించారు. మహాదేవి కేవలం కవయిత్రి మాత్రమే కాదు అద్భుతమైన చిత్రకారిణి కూడా. ఆమె చిత్రాలను కొన్నిటిని కూడా ఈ పుస్తకం లో తెలుగు పాఠకులకు అందించడం తులసి గారు  చేసిన మహత్కార్యం. అక్షరీకరించలేని భావనోద్విగ్నత కలిగినప్పుడు ఆ భావావేశం చిత్రంగా రూపు దిద్దుకునేది మహాదేవి చేతుల్లో. అలాంటి అపురూప చిత్రాలను ఈ పుస్తకం లో పొందు పరచడం లోని భావం మహాదేవి సమగ్రంగా అవగాహన పాఠకులకు కలగాలని అని తులసి చెప్పారు.

మహాదేవి వర్మ కవితా తత్వం: “ ప్రతి కవి రచన గతిశీలమైనది అవాలి. మరణించేది కాకూడదు. పాతబడిపోకూడదు. నదీ తీరాలు భిన్నమవ గలవు గాని నదిని గతిశీలమైన దానిగా చేయడానికి అన్ని  తీరాల దగ్గరా లోతు ఉంటుంది. అలా లేకపోతే అది నది కాలేదు.” అని చెప్పిన మహీయసి మహాదేవి వర్మ గారు కవిత్వం లో ఎంతో లోలోతుల స్థాయిలను చేరుకున్న రహస్య వాద (మార్మిక వాద) మహా కవయిత్రి.

“వెతికాను నిన్ను వెతలో /వెతుకుతాను వెతను నీలో!”

అని పాడే వెతల సామ్రాజ్ఞి మహాదేవి గారు అని తులసి గారు ముoదు మాటలోనే పరిచయం చేస్తారు. ఆమె కవిత్వమంతటా ఒక ఆర్తి తీరని వేదన పరుచుకునుంటుంది. వాస్తవానికి ఈ ఆవేదన ప్రతి సృజన కారునిలోనూ ఉంటుంది. ఈమె గీతాలలోని విషాదం , విరహం అమూర్తమైనవి. ఆమెను ఆధునిక మీరా అని పోల్చే వారట.  మీరా ఆరాధనకు కేంద్ర బిందువు సాక్షాత్ గోపాల మూర్తి . కానీ మహాదేవి ఆవేదన అమూర్తమైనది. నిజమే టాగోర్ గీతాంజలి  లో కనిపించే మధుర భక్తి , అదృశ్య అమూర్త ప్రేమమయుడైన ఆ ప్రియుడు దైవం , తాను ప్రేయసి అతని సహచరి , దాసి. ఇవి మనకి టాగోర్ భవాల్లో కనిపిస్తే , మహాదేవి లో అగుపించేది ఒక దివ్యానుభూతి. ఒక తాదాత్మ్యత , అపరిమితమైన ఆరాధనా, విరహం, అద్వైతం.

మహాదేవి భావ సౌందర్యానికి భాషా పటిమ తోడైన ఆమె గీతాలను తులసి గారు పుస్తకం లో ఒక పక్క హింది మూలం లోనూ , తెలుగు అనువాదాన్ని రెంటినీ ప్రచురించారు. ఇది చాలా మంచి విద్యాత్మకంగా ఉంది. ఎందుకంటే హిందీ సాహిత్య విద్యార్ధులకు, సాహిత్య పాఠకులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆమె గీతాన్ని హిందీ లో ను తెలుగు లోనూ ఒకేసారి చదవడానికి అవకాశం కల్పించారు తులసి.

అనువాదం అంటే కేవలం ఒక భాష నుండి మరో భాష లోకి పదాలను మార్చడం కాదు. అనువాదం ఎప్పుడు సఫలీకృతమవుతుందంటే అది అనువాదం అని అనిపించక పోవడమే. దీనికి ఎంతో కృషి చేస్తారు అనువాదకులు. ఈ క్రమం లో ఒక్కో చోట అనువాదకురాలి ప్రతిభా, ఆమె స్వేచ్ఛ కూడా కనిపిస్తాయి. అయితే ఇవి ఎలా ఉండాలంటే అసలు మూలం లోని భావం దెబ్బ తినకుండా ఉండాలి అలాంటి ప్రతిభా స్వేచ్ఛ తులసి గారు ఈ అనుసృజన లో కనబరిచారు. అది ప్రశంసనీయంగా కూడా ఉంది అనడంలో సందేహం లేదు. ఉదాహరణకి :

పాథోయ్-హీన్ జబ్ ఛోడ్ గయే సబ్ సప్నే , ఆఖ్యాంశేష్ రెహ్ గయే అంక్ హీ అప్నే / తబ్ ఉస్ అంచల్ల్ నే దే సంకేత్ బులాయా (ఇది హిందీ మూలం )

దీనికి అనువాదం : దారి బత్తెం లేకుండా వదిలేసాయి అన్ని కలలు/ కంచికి వెళ్లకుండా నా ఒడి లోనే ఉండిపోయాయి అన్ని కథలు / అదిగో అప్పుడు సైగ తో పిలిచాయి ఆ చేలాంచలాలు.

ఇక్కడ ‘దారి బత్తెం’, ‘కంచికి’  అనే పదాలు అనువాదకురాలు నేటివిటీ కో సం స్వేచ్ఛగా వాడారు. ఆ నానుడి హింది భాష లో ఉండదు. అయినా తెలుగు పాఠకులకు కవి భావాన్ని సరిగ్గా అందిస్తాయి మన తెలుగు నుడికారపు ఈ మాటలు. రచయిత కు తాను రాసిన భాష పై పట్టు ఉంటే చాలు కానీ అనువాదకులు రెండు పడవల మీదా సరిగా సమతౌల్యం తో పయనించాలి. అలాంటి సమతౌల్యత తులసి అనువాదం లో మనం చాలా  చోట్ల ద్యోతకమౌతుంది. రెండు భాషల నుడి కారాన్ని పట్టుకోగలగటమే ఆమె సాధించిన విజయం.

“ఆత్మకు ఆత్మదీపం అనురాగం” అంటాడు రూమి. దీపాన్ని ప్రతీకగా ఎక్కువగా ఉపయోగిస్తారు మహాదేవి.

ఎందరో కవుల కవిత్వం లో అగుపించే దీపం ప్రతీక మహాదేవి లో మరింత విలక్షణంగా దర్శన మిస్తుంది మనకు.

దీపం ఆమె దృష్టిలో ఆత్మ సమర్పణకు, అద్వైత భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆత్మ సంవేదనకు రూపంగా కనిపిస్తుంది , నడిపిస్తుంది.

మహాదేవి వర్మ గీతాల్లో అత్యంత పేరు పొందిన గీతం : “ మై నీర్ భరీ ధుఖ్ కీ బద్లీ!” దీని అనువాదం తెలుగు లో “నీరు నిండిన ధు:ఖ నీరదాన్ని నేను!” అంటూ సాగుతుంది ఈ గీతం ఇందులో ఒక మేఘంగా తన ధు:ఖాన్ని వేదనని వర్షిస్తుంది కవయిత్రి. ఈ కవిత షెల్లీ “క్లౌడ్” కవితను తలపింప చేస్తుంది.

 

I am the daughter of the earth and the sky

And the nursling of the sky

I pass through the pours of the ocean and shores

I change but I cannot die

Like a child from the womb

Like a ghost from the tomb

I arise and unbuild it again (from the poem Cloud by Shelley)

“ఏనాడూ ఏ అంతర్దిశా విస్తృత గగనాన / నాదిగా అవక పోవడం / పరిచయం నాది మరి ఇంతే , చరిత్ర మరి నాది ఇదే / పొంగిపొరలి ముసురుకు వచ్చా గత దినాన / రాలి నశించి పోయా ఈ దినాన!” (మహాదేవి గీతానికి తెలుగు అనువాదం)

ఛాయావాదీ, కవిత్వం హిందీలో , భావ వాద కవిత్వం తెలుగు లో ఇలా అప్పటి ఆంగ్ల రొమాంటిసిసం అన్నీ భాషల కవిత్వాలలో మనకు ప్రతిబింబిస్తుంది. ఈ కవిత్వాన్ని కేవలం వైయక్తిక కవిత్వమని కూడా విమర్శకులు విమర్శించారు. కానీ భావ కవిత్వం మొట్ట మొదటి సారిగా మనిషిని కేంద్ర బిందువుగా చేసుకుని , సకల మానవ భావనలకు అక్షరాన్నిచ్చింది . ఇది ఒక వ్యక్తి వేదన కాదు , సర్వ మానవ వేదననూ ఒక వ్యక్తి స్వరం లో గళం లో వినిపించడంగా అనిపిస్తుంది నాకు.  ఇందులోని తాత్వికత సాహిత్య పరిధులు దాటి పోతుంది. కాల్పనిక సాహిత్యం కాదిది , అనూహ్యమైన అందమైన ప్రతీకలతో ఆ పరాత్పరునికి నివేదించే జీవుని అనంత ఆవేదన. అందుకే ఎన్ని అన్నా ఇప్పటికీ  భావ కవిత్వ మెరుగు మాసి పోదు. ఎవరు ఆ కవిత చదివినా అది తన వేదనే అని తాధాత్మ్యం చెందించేదే భావ కవిత్వం.

మహాదేవి కేవలం భావ కావయిత్రి మాత్రమే కాదు ఆమె స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి, ఒక మహిళా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి , అన్నిటికీ మించి మంచి వక్త. ఆమె సాహిత్యోపన్యాసం వినడానికి జనం తండోపాతండాలుగా వచ్చేవారట. ఉన్నత విద్యావంతుల కుటుంబం లో జన్మించిన ఈమె పేరు ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ ఆలోచించని ఆచార పరాయణురాలు.  జ్ఞాన పీఠాన్ని ఆమె తిరస్కరిస్తే , అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆమెను పురస్కారాన్ని గ్రహించమని ఎంతో ప్రయాస తో ఒప్పించి ,ఆమెకు మార్గరేట్ థాచర్ చేత ఆ పురస్కారాన్ని ఇప్పించారు. ఇదీ ఆమె వ్యక్తిత్వ విశిష్టత.

సంపూర్ణ స్త్రీత్వం , భారతీయ సంస్కృతి నిండిన ఆమె కవిత్వం కేవలం స్త్రీని ఒక అబలగా నిస్సహాయురాలిగా చూపించదు. స్త్రీ వ్యక్తిత్వ విస్తృతిని  విశద పరుస్తుంది. ఆమె ఒక పరిశోధనాత్మక , పరిశీలనాత్మక , ఆత్మ గౌరవం నిండిన మహిళా మూర్తి. ఉత్కృష్టమైన తన సాధనతో ఇహ పరాలను శోధించిన తాత్విక మూర్తి.

“పునః వ్యాకులం నా ప్రాణం!/ బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని అవలోకిస్తాను నేనూ అవతల వేపు ఏముందో!/ యుగాలు కల్పాలు నడిచి వెళ్ళే / ఆ శూన్యమార్గపు ఆఖరి హద్దు ఏమిటో ?” అంటుందీ ధీశాలి వనిత.

ఇటువంటి కవయిత్రీమణి కవిత్వాన్ని అచ్చంగా మన తెలుగు లో మనకు అందించిన తులసి గారికి సకల సాహితీ జగతి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతోంది మనసారా. ఈ కవిత్వ గీతాలు నేటి రేపటి తరాల చదువరులకు సాహిత్య ప్రియులకు అందించాలన్న  తులసి గారి సంకల్పం నెరవేరినట్టే అనడం లో సందేహించక్కర్లేదు.

“రూపు రేఖల కట్టడుల యందు , /కఠిన హద్దుల బంధనముల యందు/ నిర్దయ ఘడియలందు బంధించబడింది జగత్తు;/ ఓ కన్నీటి కోమలీ ఎచ్చటకు వచ్చావు నీవు ఓ పరదేశినీ !” (మేలుకో మేలుకో ఓ సుకేశినీ గీతం నుండి)

ఇలా మనందరి మనసులు రంజింప జేసేందుకు మనందరి ఆవేదనకు అక్షర అద్దం పట్టేందుకు హిందీ నుండి తెలుగు లోనికి విచ్చేసేలా చేసేరు తులసి. చిరస్మరణీయంగా తెలుగు సాహిత్యం లో మిగిలే అనువాద రచన ఇది. ఇలాగే తన అనుభవం తోనూ, ఆదర్శ భావ జాలం తో అభ్యుదయ పథాన మనకు దారి దీపమై తులసి లాంటి సాహితీ వేత్తలు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. jagaddhatri says:

    చాగంటి తులసి గారి మహాదేవి వర్మ గీతాలు గూర్చి రత్నాల బాల కృష్ణ గారి వ్యాసం 21/2/2016 విశాలాంధ్ర లో వచ్చింది దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను చదువుకోవడానికి …ప్రేమతో జగతి

    http://54.243.62.7/literature/article-161436

మీ మాటలు

*