“మేం ఎవరనుకున్నావ్? కాకినాడ స్టుడెంట్స్…”

 

-వంగూరి చిట్టెన్ రాజు 

~

chitten rajuఒక ఏడాది విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తిచేసి 1962 లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి, అంటే మళ్ళీ ఇంట్లోనే ఉండి చదువుకోడానికి వెనక్కి వచ్చేశాను. నా లాగా వైజాగ్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్న మరొక స్టూడెంట్ యనమండ్ర సూర్య నారాయణ మూర్తి. అప్పటినుంచీ ఇప్పటి దాకా మేము ఇద్దరం ఆప్త మిత్రులమే!. ఇక్కడ చేరగానే నేను మొట్టమొదట గమనించిన విశేషం ఏమిటంటే వైజాగ్ లాగా కాకుండా ఈ కాలేజీ చాలా “స్త్ర్తిక్ట్” గా ఉండేది. ఎందుకో తెలియదు కానీ లెక్చరర్లు స్ట్యూడెంట్స్ ని “దూరంగా” పెట్టి హడలగొట్టే వారు. అంచేత వాళ్ళంటే  స్ట్యూడెంట్స్ కి గౌరవం కంటే భయం ఎక్కువగా ఉండేది. అసలు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ పుట్టుక విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. 1930 ల దాకా అటు కలకత్తా, ఇటు మద్రాసు లలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజ్ లు రెండే రెండు ఉండేవి.

అంచేత మొత్తం భారత దేశం తూర్పు కోస్తా తీరం మధ్యలో విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడదాం అనుకుని 1933 లోనే షుగర్ టెక్నాలజీ అనే పేరిట మొదటి ఇంజనీరింగ్ కోర్సులు ఆంధ్రా యూనివర్సిటీలో మొదలు పెట్టి   1946 లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పూర్తి స్థాయి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడే నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది. కానీ వైజాగ్ విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తగినన్ని భవనాలు లేకపోతే, కాకినాడ కి చెందిన అప్పటి యూనివర్శిటీ సెనేట్ మెంబరు, సుప్రసిద్ధ లాయరు, లక్కరాజు సుబ్బారావు గారు (మా తాత గారి  స్నేహితులు, దూరపు బంధువులు, దేవాలయం వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండే వారు) కాకినాడలో ఖాళీగా ఉన్న మిలిటరీ బేరక్స్ ఉన్న వందల ఎకరాల స్థలంలో తాత్కాలికంగా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చెయ్యడానికి ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన ఒప్పుకోక పొతే ఆంధ్ర ప్రాంతంలో అసలు కాలేజ్ లేకుండా పోయే ప్రమాదం ఉంది అని ఆయన తీవ్రంగా వాదించారు. కాబట్టి వైజాగ్ లో బిల్డింగులు కట్టేంత వరకూ ఇంజనీరింగ్ కాలేజ్ కొన్నాళ్ళు కాకినాడలో నడిపేందుకు అందరూ అంగీకరించారు. దాంతో దక్షిణ భారత దేశం మొత్తానికి మద్రాసు గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ తరువాత రెండోదిగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగ్ (Temporarily located at Kakinada) అనే పేరిట మొదలుపెట్టారు. ఉండేది.  మెల్ల, మెల్లగా విశాఖపట్నంలో ఉత్తరం వేపు ఉన్న యూనివర్శిటీ కొండలన్నీ చదును చేసి 1961 లో ఒక పెద్ద భవనం కట్టి షుగర్ టెక్నాలజీ పేరుని కెమికల్ టెక్నాలజీ గా మార్చి, ఇతర భవనాల నిర్మాణం మొదలు పెట్టినా, అప్పటికీ కాకినాడ కాలేజ్ బాగా నిలదొక్కుకుంది కాబట్టి దాన్ని తాత్కాలిక స్థాయి నుంచి శాశ్వత స్థాయికి మార్చడానికీ, అక్కడ వైజాగ్ లో మరొక ఇంజనీరింగ్ కాలేజ్ మొదలుపెట్టడానికీ  ఎక్కువ ఇబ్బందులు రాలేదు. అలా కాకినాడ లో ఇంజనీరింగ్ కాలేజ్ నెలకొల్పడానికి కారకులైన కీర్తి శేషులు లక్కరాజు సుబ్బా రావు గారి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను.

Lakkaraaju Subba Rao garu

నేను 1962 లో అక్కడ చేరినప్పుడు మా ప్రిన్సిపాల్ గారి పేరు దామోదరం గారు. ఆయన అరవ తెలుగులో తమాషాగా మాట్లాడే వారు. ఇంజనీరింగ్ మొదటి రెండేళ్ళు కామన్ క్లాసులే అయినా మూడో సంవత్సరంలో మార్కులని బట్టి, మా ఆసక్తికి బట్టీ బ్రాంచ్ సెలెక్షన్ ఇచ్చే వారు. అప్పట్లో మెకానికల్ ఇంజనీరింగ్, తరువాత అప్పుడే మొదలు పెట్టిన ఎలక్ట్రానిక్స్ , ఎలెక్ట్రికల్, ఆఖర్న సివిల్ స్టుడెంట్స్ కోరుకునే వారు. ఆ అనౌన్స్ మెంట్ చేసే పెద్ద మీటింగ్ లో మేం అందరం చచ్చేటంత సస్పెన్స్ లో ఉండగా దామోదరం గారు వచ్చి వరసగా పేర్లూ, వాళ్లకి ఇచ్చిన బ్రాంచ్ ప్రకటిస్తూ…నా పేరు దగ్గరకి రాగానే ఓ క్షణం ఆగి పోయారు…”హూ ఈజ్ దిస్ చిట్టయ్య …గెట్ అప్” అని క్లాసు చుట్టూ చూశారు. ఎవరూ లేచి నుంచోక పోవడంతో మళ్ళీ ఆ కాగితం చూసి “చిట్టాయ్ రాజు, నెంబర్ 441” అనగానే అది నేనే అని తెలిసి పోయి ఠపీమని లేచి నుంచున్నాను. ఆయన నన్ను ఎగా, దిగా చూసి….”ఏం పేరు, తమాషా గా ఉండాదే…తెలుంగా, కన్నడా’..అనేసి “మెకానికల్ తీసుకో” అన్నారు. ఆ విధంగా నేను నా జన్మంతా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది కానీ మా ఇంజనీరింగ్ కాలేజ్ చరిత్రలో లో మొట్ట మొదటి అమ్మాయి నాకంటే పదేళ్ళు సీనియర్ అయిన లక్ష్మీ మణి అనే ఆవిడ. ఆ తరువాత నాకు సీనియర్ క్లాసు లో భానుమతి అనే ఒకమ్మాయి నాకు మూడేళ్ళ జూనియర్ క్లాసులో మా తమ్ముడి క్లాస్ మేట్స్ ముగ్గురు అమ్మాయిలూ ..అంతే! అందుకే కేంపస్ మొత్తం మీద ఒక్క ఆడ పిల్ల కూడా లేక హాస్టళ్ళ లో ఉండే  కుర్రాళ్ళు అందరూ సాయంత్రం అయ్యే సరికి సినిమా రోడ్ కో మైన్ రోడ్డుకో వెళ్ళిపోయే వారు సిటీ బస్సులో.  ఆ బస్సులు రామదాసు మోటార్ కంపెనీ  వాళ్ళు నడిపే వారు. మొత్తం నాలుగు బస్సుల్లో రెండో నెంబర్ బస్ మా ఇంటి మీదుగా వెళ్ళేది.

నేను హాస్టల్ ఉండకుండా ఇంట్లో ఉండి చదువుకుంటున్న “డేస్కాలర్” ని కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ లో నా అనుభవాలు కేవలం క్లాసులకీ, పరీక్షలకే పరిమితం అయిపోయి, కాలేజ్ కార్యకలాపాలల్లో చాలా తక్కువ గా పాల్గొనే వాడిని. పైగా నాకు ఎప్పుడూ సాయంత్రం క్రికెట్ వ్యాపకం ఉండేది. అది కాస్త తగ్గాక నా స్నేహితులందరూ కూడా డే స్కాలర్లే కాబట్టి అందరం  సాయంత్రాలు కలిసి గడిపే వాళ్ళం. అందులో ఇళ్ళలో ఉండే వారు కొందరు అయితే, హాస్టల్ బదులు ఇద్దరు, ముగ్గురు కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండే వారు మరికొందరు. మా స్నేహ బృందంలో అతి ముఖ్యులు డి. గణపతి రావు (నేనూ, ఇతనూ పి.యు.సి. లో కూడా క్లాస్ మేట్స్), జి. వేంకటేశ్వర రావు, కె.వి.వి. గోపాల కృష్ణ, ఎన్. గోవింద రాజులు, జె.బి. వెంకట రత్నం, రాంబయ్యేశ్వర రావు, వి. సుందర రావు, ఎన్. సత్యానంద, త్రినాధం, కె. గంగాధరం, డి.వి. మోహన్, వై.ఎస్.ఎన్. మూర్తి  మొదలైన వారు.  వీళ్ళలో ఒకరిద్దరు తప్ప  ఇంచు మించు అందరితోటీ ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నాను. ఇందులో సత్యానంద కాలిఫోర్నియా లో ఉంటాడు…ఆ రోజుల్లోనూ ఇప్పుడూ అతని పేరు ఎన్.ఎస్. నందా యే. డి.వి మోహన్ అంటే ఇండియానా పోలిస్ లో ఉండే మోహన్ దేవరాజు. మిగిలిన వాళ్లందరూ ఇండియాలోనే ఉన్నారు.

వాళ్ళలో వై.ఎస్.ఎన్. మూర్తి తో వారం, పది రోజుల కొకసారి మాట్లాడుకుంటూ, చిన్నా, చితకా సమాజ సేవా కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం. ఒక సారి మాలో కొందరం కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ కి పిక్నిక్ వెళ్ళినప్పటి ఫోటోలు ఇక్కడ జతపరుస్తున్నాను. మా ఒకటి, రెండేళ్ళ సీనియర్స్ లో మాకు బంధుత్వం ఉన్న చింతలూరి సుందర వెంకట్రావు తో కుటుంబ స్నేహం ఉండేది. అతను చదువులోనూ, అన్ని ఆటలలోనూ పై స్థాయిలోనే ఉండి జోక్స్ చెప్తూ సరదాగా ఉండే వాడు. చదువుకునే రోజుల్లోనే మా చుట్టాలయిన జార్జ్ ప్రెస్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని దగ్గర నేను మిమిక్రీ చెయ్యడం నేర్చుకున్నాను. ఇప్పుడు వాషింగ్టన్ డి.సి లో వాళ్ళ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఇంకా బి.ఎస్.జి.కె, శాస్త్రి, పెంటా రామచంద్ర రావు,  దురిశేటి శేషగిరి రావు మొదలైన వాళ్ళందరితోటీ క్రికెట్ టీమ్ లో ఆడేవాడిని. ఇందులో శేషగిరి కాకినాడలో మా ఇంటి పక్కనే ఉండే సర్వలక్ష్మి ని పెళ్లి చేసుకుని లాస్ ఏంజెలెస్ లో ఉంటాడు. ఆ అమ్మాయి చాలా పేరున్న డాక్టర్. వాళ్ళింటికి నేను చాలా సార్లే వెళ్లాను. ఆ అమ్మాయి అన్నయ్య సోమయాజులు నాకు చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్. వాడూ కాలిఫోర్నియా లోనే ఉన్నాడు.

నా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువులో చదువుకన్నా ఎక్కువ నచ్చింది మా ఆఖరి రెండు సంవత్సరాలలోనూ స్టుడెంట్స్ అందరం వెళ్ళిన ఎడ్యుకేషనల్ టూర్స్. ఒక లెక్చరర్ గారి హయాంలో          ప్రత్యేకంగా ఒక రైలు కంపార్ట్ మెంట్ అద్దెకి తీసుకుని  నాలుగో ఏడు దక్షిణ భారత దేశం, ఐదో ఏడు ఉత్తర భారత దేశం లోనూ ఉన్న అనేక ఫేక్టరీలు, కొన్ని చూడ వలసిన ప్రదేశాలు చూసి రావడం నిజంగా ఇప్పటికీ చాలా మంచి అనుభవమే. నిక్కర్లూ, కావాలని కన్నాలు పెట్టుకున్న జీన్స్ పంట్లాలు వేసుకునే ఈ నాటి యువతీ యువకులతో పోల్చి చూసుకుంటే నాకు ఇప్పుడు నవ్వు వచ్చే విషయం ఏమిటంటే ఆ విజ్ఞాన యాత్రలకే కాదు, అందులో విహార యాత్రలకి వెళ్ళినప్పుడు కూడా మేం అందరం సూటూ, బూటూ ఖచ్చితంగా వేసుకునే వాళ్ళం. ఆ నాటి అలాంటి ఫోటోలు కొన్ని ఇక్కడ జతపరుస్తున్నాను.

KKD Eng.College friends 1

ఆ టూర్ లో భాగంగా మేము మద్రాసు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో దక్షిణ భారత దేశానికంతటికీ అత్యంత ఎత్తు అయిన మౌంట్ రోడ్ లో ఉన్న 14 అంతస్తుల ఎల్. ఐ.సి భవనం చూడడం ఒక ముఖ్యాంశం. మన ప్రగతికి చిహ్నంగా ఇప్పుడు ఆ బిల్డింగ్ కంటే ఎత్తు అయినవి ప్రతీ పల్లెటూరి లోనూ కూడా ఉన్నాయి. అప్పడు మద్రాసులో జరిగిన రెండు చిన్న తమాషాలు నాకు బాగా గుర్తున్నాయి. కొంత మంది మిత్రులం “ఎలాగా ఇక్కడి దాకా వచ్చాం కదా. ఏదో ఒక సినిమా షూటింగ్ చూసి తీరాలి” అని మా మేష్టారి పెర్మిషన్ తీసుకుని విజయా స్టూడియోస్ కి వెళ్లాం. అక్కడ గూర్ఖా వాడు ఆప గానే “మేం ఎవరనుకున్నావ్? కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టుడెంట్స్…” అని ఎంత దబాయించినా వాడు మమల్ని లోపలకి వెళ్ళనివ్వకుండా పెర్మిషన్ లెటర్ కావాలన్నాడు. కాస్త బతిమాల్తే “చక్రపాణి సారు ఫలానా చోట ఈ టైముకి ఇంట్లోనే ఉంటారు. వెళ్లి అడగండి” అని సలహా ఇచ్చాడు. సరే అని నలుగురం ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి భయం, భయంగా షూటింగ్ చూడ్దానికి పెర్మిషన్ అడిగాం. అయన నవ్వేసి “ఏంది…వంట పూర్తి ఐనాక రుచి చూడాల…కానీ వంట చేస్తా ఉండగా చూస్తే ఏం బావుంటాదీ..” అని నవ్వుతూ ఉత్తరం ఇచ్చారు.

కానీ బహుశా ఆ రోజున ఏ షూటింగూ లేనే లేక ఏదీ చూసిన గుర్తు నాకు లేదు. ఇక మరో చిన్న భాషా దోషం చమత్కారం ఏమిటంటే అరవం బొత్తిగా రాని నేనూ, మరో మిత్రుడూ ..ఎవరో గుర్తు లేదు….మద్రాసు లో సఫారి అనే సినిమా హాలు లో ఇంగ్లీషు సినిమా చూద్దాం అని బస్సు ఎక్కాం. యధాప్రకారం దిగాల్సిన చోటు దాటిపోయాక కండక్టర్ మమ్మల్ని కనిపెట్టి, రిక్షా మీద పొండి అని దింపేశాడు. సరే అని ఓ రిక్షా వాణ్ణి “సఫారి థియేటర్ కి వస్తావా?” అని అడిగాం. వాడు మమ్మల్ని ఎగా, దిగా చూసి “ఒండ్రుబా సార్” అన్నాడు. “వెధవ ఎక్కువ అడుగుతున్నట్టున్నాడ్రా” అని నా మిత్రుడు” నో. దటీజ్ టూ మచ్. రెండు రూపాయలిస్తాం. వస్తే రా. లేక పోతే లేదు” అన్నాడు. వాడు తలూపి, మమ్మల్ని ఎక్కించుకుని, సరిగ్గా పక్క సందులోంచి తిప్పి థియేటర్ దగ్గర దింపాడు. ఆ తరువాత తెలిసింది వాడు ఒక రూపాయి అడిగితే మేము  అతి తెలివికి పోయి రెండు రూపాయిలు ఇచ్చాం అని. అలాంటిదే మరో చేదు అనుభవం ఏమిటంటే ఓ నలుగురం కలిసి మెరీనా బీచ్ లో ఒక చిన్న టెంట్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లాం. తీరా చూస్తే అక్కడ అన్నీ ఫేషనబుల్ పదార్థాలే ..అంటే ఇడ్లీ, వడా లాంటివి కాకుండా కట్లెట్, సేండ్ విచ్ లాంటివి. అలాంటివి అలవాటు లేని మాకు మాలో ఇంగ్లీష్ మాంచి ఎక్సెంట్ తో దొరల్లాగా మాట్లాడుతూ అలాగే ఫీలై పోయే సుందర్రావుని సలహా అడిగాం. వాడు “ఓస్ ఇంతేనా” అని తల ఎగరేసి అందరికీ క్యుకుంబర్ సేండ్ విచెస్..ఒక్కోటి ఏకంగా నాలుగేసి రూపాయలు చొప్పున ఆర్డర్ చేశాడు. అవి ఏ నక్క దోస కాయ ముక్కలతో కూరినవో తెలియదు కానీ అంతా విపరీతమైన చేదు. తిన లేక, కక్క లేక అందరం నానా అవస్థా పడ్డాం. ఇప్పుడు అమెరికాలో నేను ఎప్పుడు సబ్ వే లో కానీ మరెక్కడైనా సేండ్ విచ్ లో క్యుకుంబర్ ముక్కలు వేసుకుంటే ఆ నాటి మెరీనా దోస కాయ రుచే గుర్తుకి వస్తుంది.

Main Building

ఆ నాటి పద్ధతి ప్రకారం ఏ డిపార్ట్ మెంట్ కి అయినా ఒకే ఒక హెడ్, ఆయన ఒక్కరిదే ప్రొఫెసర్ స్థాయి. మిగలిన వారు రీడర్, లెక్చరర్ అంతే. అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి ఉండేది కాదు. అలా మా మెకానికల్ ప్రొఫెసర్ గారు ఎస్.ఎల్. బాల సుబ్రమణ్యం గారు. ఆయన మా ఆఖరి సంవత్సరంలో (1965-66) లో ప్రిన్సిపాల్ అయ్యారు. ఎప్పుడూ ఏదో తన లోకంలోనే విహరిస్తూ ఉండే వారు. ఇతర లెక్చరర్లలో నాకు గుర్తున్న పేర్లు వేంకటేశ్వర రావు, ముత్తా సర్వా రాయుడు గారు (రాజకీయ నాయకులు, మా కుటుంబ సన్నిహితులు ముత్తా గోపాల కృష్ణ గారి అన్న గారు), సర్వే క్లాసులు చెప్పిన వేణుగోపాలాచారి గారు, ఫిజిక్స్ మేష్టారు మురళీ ధర రావు గారు, కెమిస్ట్రీ మేష్టారు దక్షణా మూర్తి గారు, ఎలక్రానిక్స్ ప్రొఫెసర్ గంటి గారు, ఎలెక్ట్రికల్ ప్రొఫెసర్ ముద్దు కృష్ణన్ గారు, ఎప్పుడూ నీరసంగా ఉండి అప్పటికి యాభై ఏళ్ల క్రితం రాసుకున్న కాయితాలు చూసి పాఠం చెప్పే తరుణయ్య గారు మొదలైన వారు.

ఇక్కడ మాకు సివిల్ సర్వే చెప్పిన వేణు గోపాలాచారి గారి రెండు జ్ఞాపకాలు ప్రస్తావించాలి. ఒకటేమో ..మేము సర్వే సామాగ్రి అంతా పట్టుకుని అయన ఇచ్చిన రోడ్డు సర్వే ఎసైన్ మెంట్ కోసం ఎక్కడా అమ్మాయిలూ లేని ఇంజనీరింగ్ కేంపస్ నుంచి బిల బిల లాడుతూ అమ్మాయిలూ తిరిగే పది మైళ్ళ దూరం లో ఉన్న పి.ఆర్. కాలేజ్ వేపు వెళ్ళిపోయే వాళ్ళం అప్పుడప్పుడు. ఆయన సైకిల్ మీద అక్కడికి వచ్చి, సర్వే దుర్భిణీ పి.ఆర్. కాలేజ్ గోడ మీద నుంచి లోపలి వేపు కేసి తిప్పేసి గాలిస్తున్న స్టూడెంట్ ని వెనకాల నుంచి ఠకీ మని మెడ పట్టి రోడ్డు కేసి తిప్పేసి…”అటు కాదు రాస్కెల్..ఇటు ఉంది రోడ్డు” అని చెడా, మడా తిట్టి మొత్తం బేచ్ అంతటికీ సున్నా మార్కులు వేసే వాడు. అయితే ఈయనకి ఒక ట్రాన్సిస్టర్ రేడియో ఉండేది. ఆ రోజుల్లో కాకినాడ నగరం మొత్తానికి అలాంటి పోర్టబుల్ ట్రాన్సిస్టర్ రేడియోలు ఉన్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును. అంచేత అది ప్రెస్టేజ్ సింబల్. అది చూపించుకోడానికి ఈయన రోజూ సాయంత్రం అటు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మైన్ రోడ్డు మీదుగా జగన్నాధ పురం బ్రిడ్జ్ దాకా ..అంటే మొత్తం కాకినాడ అంతా పది మైళ్ళ దూరం ఆ రేడియో భుజం మీద పెట్టుకుని  అటూ, ఇటూ సైకిల్ మీద తిరిగే వాడు. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు ఎంతైనా నవ్వు వస్తుంది.

మొత్తానికి నా వైజాగ్, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువు ఐదు సంవత్సరాలలోనూ చెప్పుకోదగ్గ సంఘటనలు ఎక్కువ లేవనే చెప్పాలి. ఆ ఐదు సంవత్సరాలలోనూ ఓ వేపు పంటలు సరిగ్గా పండకా, మరో వేపు పెళ్ళిళ్ళ ఖర్చులూ, మా సుబ్బన్నయ్య మణిపాల్ (కర్నాటక) లో మెడికల్ కాలేజ్ చదువూ వగైరా కారణాలకి మా నాన్న గారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. నా చదువు కి ఎక్కువ ఖర్చు కాక పోయినా ఈ కుటుంబ వాతావరణాన్ని ప్రతీ రోజూ గమనిస్తూ ఏమీ చెయ్య లేని పరిస్థితుల లోనే నా ఇంజనీరింగ్ పూర్తి చేశాను.  అలాగే మా తమ్ముడు కూడా మూడేళ్ళ తరువాత ఎలక్త్రానిక్స్ లో గ్రాడ్యుయేట్ అయ్యాడు.

కాలక్రమేణా సుమారు నాలుగు దశాబ్దాలు మా ఇంజనీరింగ్ కాలేజ్ తో ఎక్కడా సంబంధం లేక పోయినా, ఆ కాలేజ్ ని JNTU …Jawaharlal Nehru Technological University గా పెద్ద స్థాయి కి పెంపొందించనట్టు, బాగా పురోగమనం చెందుతున్నట్టు వింటూనే ఉన్నాను. అనుకోకుండా మిత్రులు తురగా చంద్ర శేఖర్, ముత్యాల భాస్కర రావుల ప్రోద్బలంతో మా కాలేజ్ 60th వార్శికోత్సవాలలో ప్రముఖంగా పాల్గొనడం జరిగింది. ఆ వివరాలు మరోసారి……..

*

 

 

 

 

మీ మాటలు

 1. అవును , సారంగ లో నేను చదివే ఆర్టికల్స లో ఇది కూడా ఒకటి .
  చాలా రోజుల తరువాత రాసారు . పుస్తకాలు ఎక్కువ చదివితే ఇదే సమస్య , మనం చెప్పిందే వేదం, మనమే గొప్ప , మనం జద్గిమేంట్ ఇచ్చేద్దాం అనే స్థితికి వచ్చేస్తారు జనాలు.
  బుచ్చిరెడ్డి గారు మీ కామెంట్ ఏ ఉద్దేశ్యం తో పెట్టారో తెలియదు , కాని రాసే వాళ్ళు తక్కువైపోతున్న ఈ రోజుల్లో మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి . ఆయన రాసే ఆర్టికల్ లో , ఏ వర్గాన్ని కించపరిచినట్టు లేదు.
  అప్పట్లో జనం ఎలా ఉండేవారు , ఎలా ఆలోచించేవారు , అప్పటి సామాజిక పరిస్తితులు ఎలా ఉండేవి అని కొంచెం లో కొంచెమైన ఆలోచన వస్తుంది .

 2. దీన్ని ఆయన స్వీయ చరిత్రని ఎందుకనుకోవాలి. అప్పటి సమాజపు చరిత్ర.
  రేదియో తగిలించుకొని సైకిలు మీద అటూ ఇటూ తిరిగి బడాయి పోవడం.
  సూటు-బూటుతో విహారయాత్రలు.
  అంత పెద్ద దక్షిణబారతానికి ఒకే ఒక ఇంజనిరుంగు కాలేజి. అది గిండి కాలేజి అని తెలుసుకోవడం.
  పద్నాలుగు అంతస్తుల భవనం అప్పట్లో చూడదగ్గ వింత కావడం.
  ఇంజనిరింగు చదివే ఆడపిల్లలు అరుదవడం.

  … ఇవన్నీ మన చరిత్ర తెలుసుకోవడమే గదా? ఎవరో ఒకరు రాయకుంటే ఎలా తెలుస్తుంది. ఇవన్నీ కూడా బుచ్చిబాబు, తిలకూ మాత్రమే రాయాలంటే ఎలా?

 3. amarendra dasari says:

  ఆత్మకథలు గొప్పవాళ్ళే రాసుకోవాలి అనడం రాజులూ మహారాజులే చరిత్ర రాసుకోవాలి అనడం లా ఉంది..

  autobiography of an unknown indian అన్న గొప్ప పుస్తకం గురించి విన్నారా రెడ్డి గారూ …

 4. నేను ఈ కాలమ్ కోసం చాలా ఎదురు చూస్తాను, చాలా విరామం తరువాత రాసారు. Thanks for your writings!

 5. Atchutram says:

  రాజుగారి అనుభవాలు చదువుతుంటే నాలాటి చాలామంది కి చదువుకునే రోజులు గుర్తువస్తున్నాయి, నేను ఈ కాలమ్ కోసం చాలా ఎదురు చూస్తాను, చాలా విరామం తరువాత రాసారు, ఇది చదువుతుంటే Kakinada వీధులలో తిరుగాడుతున్నట్లే వుంటుంది, కనీసం 1970’/1980′ సంవత్సరాలలో అక్కడ గడిపిన వారికైనా, నిజంగా ఇలాంటి ఫీచర్స్ మా లాంటి సామాన్య పాఠకులకు ఏంతో గొప్పగానే అనిపిస్తాయి. దానికి కొలమానాలు / పోలికలు anavasaram.

 6. చాలా నెలల తరువాత మళ్ళీ దర్శనం!
  చలువ కళ్ళద్దాల అరవైల లోకి తీసుకెళ్ళి పోయారు.
  ఫోటోలలో మీరెక్కడున్నారో మిగిలిన వారెవ్వరో తెలిపితే బాగుంటుంది.
  నాలాంటి అభిమానుల కోసం, అంతరాలు లేకుండా వ్రాయండీ ప్లీస్ !!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   పైన ఉన్న ఫోటోలో నేను అందరి కంటే ఎడం పక్క ఉన్న శాల్తీని. మధ్య సూటూ , బూటూ ఫోటో లో ఎడం పక్కనుంచి మూడో వాణ్ణి.

 7. chittibabu.p says:

  ఏదో సరదాకి ఆయన రాసుకుంటున్నారు
  అంతకంటే దాన్ని ఎక్కువగా తీసుకోనవసరం లేదెమో చూడండి .
  సాహిత్య ప్రమాణాలు , విలువలు దానికి ఆపాదించదం కుదరదెమో.
  పి ఆర్ కాలేజికి ఇంజినీరింగ్ కాలేజికి దూరం మూదు ,నాలుగు కిమీ లు (లేదా ఐదు) వుంటుందంతే. పది మైళ్ళు ( పదహారు కిమీలు) వుండదండి.
  జ్ణాపకాలు తీయగా మార్చాలంటే ఇలాంటి అత్యతిశయోక్తులు సాధారణ, సరదా రచయితలలో సాధారణమే.
  సారంగ అందరిని ఎకాంబిడేట్ చేస్తోంది. ముదావహం.

 8. chittibabulu.p says:

  పోతే ఆ కాలం నాటి కొన్ని నిజాలు (చారిత్రక సత్యాలు) తెలుస్తైలెండి.
  అదొక్కటి ప్రయోజనం .

 9. ayyagari venkata ramana says:

  నా పేరు అయ్యగారి వెంకట రమణ. నేను పుట్టినిది 1954. చదువు రాజమండ్రి ఇన్నీసుపేట రామకృష్ణ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతివరకు. మేము జూపూడి వెంకటేశ్వరరావు జమీన్దారు గారింట్లో అద్దెకు ఉండేవాళ్ళం. (ఆయన బావ మరది కం అల్లుడు శ్రీ. ముత్తా గోపాలకృష్ణ గారు. గోదావరి ఫెర్తిలిసెర్స్ ముత్తా గోపాలకృష్ణ గారు వేరు. ఈ యిద్దరిలో ఎవరు చిట్టెన్ రాజు గారి స్నేహితులో తెలియదు.) బ్యాంకు. ఫస్ట్ ఫారం నుండి ఫోర్త్ ఫారం వరకు రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో చదువుకున్నాను.
  రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 1960s రోజుల్లో BSc స్టూడెంట్స్ maths స్టూడెంట్స్ maths టెక్స్ట్ బుక్ లేకుండా,science స్టూడెంట్స్ వీనస్ పెన్సిల్ రబ్బరు లేకుండా క్లాసుకు వస్తే బయటకు పంపెయ్యడమే. సందేహంలేదు. స్టూడెంట్స్ కూడా వైట్ ప్యాంటు, వైట్ షర్టు వేసుకుని ” హల్లో! గురూ! లేదా గురూగారు! అంతో సంభోదనలతో ఉండేవారు. అపరిచితులైతే మాస్టారూ! అని సంబోదించు కొనేవారు.
  ఇంకొక విషయం ఎనమంద్ర సూర్యనారాయణ మూర్తి గారంటే బహుసా BE Hydrology చదువుకుని హైదరాబాద్ నల్లకుంటలొ పిల్లలకు వేదం నేర్పేవారు. చాలా పొడుగ్గా వుండేవారు. ఇంటి ప్లాన్లో వాస్తు సరిచేసేవారు. ఏమి తీసుకొనేవారు కాదు. 1990లొ నా ఇంటి ప్లాన్ తీసుకు వెళ్లి వాస్తు చూపించుకోన్నాను. బహుసా ఆయనే అని సందేహంతో కూడిన సంతోషం.
  ఇంకా డిగ్రీ 1972-75 రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BCom కొంత నైట్ కాలేజీ, కొంత డే కాలేజీ. కాలేజీ అడ్మిషన్ అప్పుడు చూసిన సాధారణ వ్యక్తీ తెల్ల బనీను, కాకీ నిక్కర్తో వరండాలో తిరుగుతుంటే ఎవరో అటెండర్ అనుకున్నాను. నేలమీద పడిన కాగిన్తముక్కను తీసి డస్ట్ బిన్ లో వేసి పడవేసిన వారిని ” ఇది సరస్వతి దేవి. కాలితో తోక్కకూడదు అని తిట్టడం చూసాను. ఆయనే శ్రీ. నడిముల్లా గారు ప్రిన్సిపాల్. binacular తో కాలేజీనుండి చూసి ఎవరైనా సిగరెట్ కాలుస్తే పరుగెత్తి పట్టుకుని ఫైన్ వేసేవారు. ఆయన హయాంలో కాలేజీలో క్రమశిక్షణ ఉందంటే, కాలేజీ వాతావరణం బాగుందంటే ఆయన గొప్పతనమే. ఆ మా విద్యార్ధులకు ఆయన చిరస్మరనీయులు.
  ఇదంతా నేను ఎలా వ్రాయగాలిగానంటే కేవలం చిట్టెన్ రాజు గారి అనుభవాలను నా అనుభవాలతో పోల్చుకుని ఉన్నది ఉన్నట్టు వ్రాసాను. ఆయన అనుభవాలు చారిత్మాతక నిజాలు. మీరు రాసిన అంతే! గతించిన చరిత్రను తిరగతోడుకుని ఇప్పుడు ఆనందిస్తున్నాము.అంతే!
  మానవతా విలువలు కలిగిఉన్న రోజులవి. మానవతా విలువల్ని కొనే రోజులివి.
  చిట్టి బాబులు గారు వ్రాసినట్లు కొన్ని నిజాలు తెలియాలి. ప్రయోజనం గురించి వస్తే మన మరణం కొద్ది రోజుల్లో ఉంది అంతే ప్రతి ఒక్కరు ఆత్మా విమర్శా చేసుకోవాల్సిన విషయం. ” మనవాళ్ళ ఎవరికి ప్రయోజనం అయ్యింది. దేసానికేమైన చేసామా? లేదా సమజానికేమైనా ఉపయోగపడ్డమా? అని. ఇన్నాళ్ళు మనం బ్రతికి ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు! నిస్సంకోచంగా చిరునవ్వుతో దేహం చాలించ వచ్చు. సమాధానం_మన ఇన్నాళ్ళూ బతికి నిష్ప్రయోజనం. ఎవరిని వుద్ధరించలేదు మన స్వార్ధానికి మనం బతికేసాం అనే నిజం అని అనిపించినా చాలు.
  చదవడం, వ్రాయడం మరచిపోయిన ఈ రోజుల్లో నా చేత వ్రాయించారు మీ తీపి అనుభవాలతో. చాలా మధురం. ధన్యవాదములతో.

మీ మాటలు

*