చింతామణికీ నాకూ చెడిపోయింది…

 

భవానీశంకరం: వెళ్ళగొట్టబడిన విటుడు
సుబ్బిశెట్టి: కొత్త విటుడు

 

భవానీ: ఔరా, ఎంతపని చేసింది? నన్ను దేవేంద్రుణ్ణి చేస్తానంది. బిల్వమంగళుణ్ణి రప్పించుకోడానికి నా చేతనే తార్పుడుపని చేయించింది. కామశాస్త్రం చదువుకొనే మిషతో అతన్ని కొంగున కట్టేసుకుంది. చివరికి నన్నేమో కుక్కను కొట్టినట్టు వెళ్ళగొట్టింది. తెలివిగా బిల్వమంగళుడి దగ్గర డబ్బు కొట్టేసి నన్ను సుఖపెడుతుందనుకున్నాను గానీ, అతన్ని మరిగి నా గొంతు కోస్తుందనుకోలేదు. ఉన్న ఆస్తంతా దానికే హారతి కర్పూరం చేశాను. ఎప్పుడేది కావాలంటే అది తెచ్చిపెట్టాను. రాత్రింబగళ్ళు దాని ఇంటికుక్కలా కాపలా కాశాను. అదేం పిచ్చిపని చేసినా మెచ్చుకున్నాను. తిడితే నవ్వాను. ఇన్ని చేసినా దానికి కనికరం లేకుండా పోయింది. అయినా నాకీ ప్రాయశ్చిత్తం కావలసిందే! నలుగురూ నోట్లో గడ్డి పెడుతున్నా వేళాకోళం కింద తీసేశాను. వంశగౌరవాన్ని నాశనం చేశాను. కళకళలాడే నా భార్య మొహంలో నిరంతరం దైన్యం కనిపిం చేలా చేశాను. ఆ పాపం ఇప్పుడిలా కట్టికుడుపుతోంది.
ఆశ్చర్యం! ఆ బిల్వమంగళుడు ఇంతలో ఎంత మారిపోయాడు! పడుపుగత్తె మొహం చూడటానికి ఇష్టపడనివాడు వేశ్యతోడిదే లోకంగా గడుపుతున్నాడు. పట్టపగలే దాని కొంపకి పోతున్నాడు. దాని చేతినీళ్ళు తాగడానికి కూడా సందేహించట్లేదు. భార్య మాటను సైతం జవదాటని వాడు, తండ్రి మాటకు కూడా ఎదురు చెప్తున్నాడు. వ్యాపారం నిర్లక్ష్యం చేసి రాత్రింబగళ్ళు ఆటపాటల్తో గడిపేస్తున్నాడు. సరే, వాడి ఖర్మ ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. ఇప్పుడు నా గతేంటి? సానుల చేతిలో క్షౌరమై వెళ్ళగొట్టబడిన విటులందరికీ ఏది గతో నాకూ అదేగతి. దొంగలాగా దొడ్డిదారిన ఇంట్లోబడి నీవే దిక్కని పెళ్ళాం కాళ్ళ మీద పడి ఏడవడమే!
సుబ్బి: (ప్రవేశించి) అబ్బో పంతులుగారే! దండాలు, దండాలు! ఎక్కడా దరిశినాలే లేవు?
భవానీ: ఏం దర్శనాలు, ఏం లోకం? చింతామణికీ నాకూ చెడిపోయింది.
సుబ్బి: యిన్నానిన్నాను.
భవానీ: ఎవరు చెప్పారు?
సుబ్బి: యిప్పుడు మీరేగా చెప్పారు. అసలెందుకొచ్చినట్టు?
భవానీ: దానికిప్పుడు మోజంతా బిల్వమంగళుడి మీదుంది.
సుబ్బి: అవునవును. ఆయనక్కూడా అంతకంటే మోజుగా ఉంది. ఏటొడ్డున దానికోసం ఏడంతస్తుల మేడ కట్టిస్తాడంట.
భవానీ: అందుకే దానికి కళ్ళు నెత్తికెక్కాయి.
సుబ్బి: (తనలో) మంచిపనైంది. మా మిడిసిపడేవోడు. ఎప్పుడీడి కంటబడతానోనని ఏక వణికేవాణ్ణి. (పైకి) ఐతే మరి దానికి మీమీద తగని వలపని సెప్పేవోరుగా?
భవానీ: అందులో అబద్ధం లేదు. నేను కట్టుకోమన్న చీర కట్టుకునేది. పెట్టుకోమన్న సొమ్ము పెట్టు కొనేది. క్షణం కనబడక పోతే అన్నం కూడా ముట్టేది కాదు. ఒక్క నిమిషం మాట్లాడక పోయినా ఊరుకొనేది కాదు.
సుబ్బి: ఐతే మరి ఆ వొలుపంతా యిప్పుడేమైపోయినట్టు?
భవానీ: తల్లిముండ ఏదో పెట్టి దాని మతి విరిచేసింది.
సుబ్బి: (తనలో) ఎర్రిమొకం ఎంగళప్పెవరంటే యీడు. దానికి నామీద తప్ప దమ్మిడీ ఎత్తు వొలు పెవురిమీదా లేదు. ఈ రాశ్యం దాని తల్లే సెప్పింది కాబట్టి యిందులో యేవీ కల్తీ గూడా లేదన్నమాట. (పైకి) యెవారమెల్లా యేడిస్తే యేం? సివరకు శలామణి దాంది. మల్లా యెక్కడైనా మంచి కాతా అమిర్నట్టా?
భవానీ: అమ్మో, ఆ రొంపిలో మళ్ళీ అడుగు పెట్టడం కూడానా? దాని తల్లి దెయ్యంలాగా ఎప్పు డెందుకు విరుచుకు పడుద్దో అనే బెంగ, ఏపూట కాపూట ఏమి ఖర్చు నెత్తిన పడుద్దో అనే బెంగ, ఇంట్లో లేనప్పుడు తార్పుడు గత్తెలు కొత్త విటుల్ని లంకిస్తారేమోననే బెంగ, ఎప్పుడు ఊరి మీద పడి ఎవరి కంట పడి పోతుందో అనే బెంగ, మేళానికి పోయినప్పుడు ఎవడన్నా మోజుపడి తగులుకుంటాడేమో అనే బెంగ. సానిదానితో పొత్తంటే ఇన్ని బెంగలతో రేయిం బవళ్ళు కునారిల్లటమే గదా!
సుబ్బి: అబ్బో అబ్బో, ఏం బుద్ధి ఏం బుద్ధి! ఈ బుద్ధి మొదటే ఉంటే ఇంత గాశారవే లేక పోయేదిగా!
భవానీ: అందుకే నీకు గూడా నా గతి పట్టకముందే నిద్రనుండి మేల్కొమ్మని చెప్తున్నాను.
సుబ్బి: (తనలో) ఈ రాకడ నాకు తెల్సు. ఈ ఒడుపంతా ఆళ్ళ మీద నాకసయ్యం పుట్టిచ్చాలని. నేనీడి పాచికలో పడతానా? (పైకి) ఆ సందులో బాకీలు రావాల్సి అడావిడిగా ఎల్తున్నాను. ఆనకొచ్చి కల్సుకుంటాను. యిప్పటికి ఇడ్సిపెట్టండి.
*

మీ మాటలు

*