గూడు 

 -ఇండస్ మార్టిన్
~
 IMG-20140111-WA009
ఏకుంజావుకు ఎమ్మెస్ సుబ్బలచ్చిమికి తోడు
కళ్ళాపీ కసువుల రాగమైన మాయమ్మ
బిల్లంగోడు బుడ్డోళ్ళు బీట్లో
పున్నీళ్ళకు నిమ్మకాయ బద్దలద్దుకునేతలికల్లా
ఇరిగిన నడువునెత్తుకుని
ఎసర్లు పొంగే పొయ్యిముందు కూలబడిద్ది
నోటిరోట్లో సూపుడేలు రోకలేసి
బూడిద కచ్చికని దంచి వూశాక
బియ్యంరమ్ములో బిరడావేసుకు దాక్కున
పెరడాలు బలంకాయను ఇప్పుతుంది
అరిచేతిలోని కొడవలి గాయాన్ని ఆవిషు గీతల్తో
కలుపుకుంటా కారిపోతున పాకాన్ని
ఈనబద్దతో గీకిన మాయమ్మ నాలిక
ఇంకా రుశన్నా సూడకముందే
పైటకొంగుకు యాలబడుతున్న నా
దిట్టి కళ్ళు చిక్కమై ఆయమ్మి మూతిని
బిగిచ్చి కడతాయి
మునగడదీసుకున్న పెట్టను నాయన
పేణవుండగానే పుటుక్కుమనిపిత్తే
బడిమాని కుండల్లో గుర్రాల్దోలుతున్న
నా ఈపిని గుక్కబెట్టి నాలుగుసార్లు ఏడిపిచ్చాక
ఆకరి మంటమీద తుకతుక మంటున్న  తునకలకీ
వుడుకుడుకు కొత్తన్నానికి వాటంకుదిరిద్దో లేదో అని
బొడ్డుగిన్నె ప్రయోగశాలలో ఉప్పు పరిశోధనలు చేస్తున్న
మాయమ్మ చెయ్యి నోటికాడికన్నా పోకముందే
వొరుసుకుంటా నిలబడ్డ నా యీసురుడొక్కలు
కందనగాయా గుడ్లశేర్లకు ఒంటిభాగానికొత్తాయి
మాసూళ్ళప్పుడు నాయన తూర్పారకు సాయంగా
పొద్దంతా పరవట గాలై మాబతుకుల్లోంచి
తాలూ తప్పలను రేగొట్టిన మాయమ్మ
మొబ్బుల్లో యాప్లీసుకాయని కాకులు మింగేయాలప్పటికి
ఇంటిముందు నుంచున్న పొసుప్పచ్చని గాదెను చూసి
పచ్చల కిరీటకం పెట్టుకున్న ఇక్టోరియా మారాణౌతుంది
ఇరుగు పొరుగోళ్లకు బడాయి చూపిచ్చేదానికి
చెంగుకు కట్టిన ముప్పావలాను
సాయిబు సోడాకి మారకమేస్తుంటే
ఈధినడిమజ్జన కంచాలాటలాడుతున్న నేను
ఇరుసుకుపడిపోయి చివరాకరి బొట్టుదాకా
సీసామూతికి అడ్డంపడ్డ గోలీనౌతాను
పెందలకాడే  ఇల్లెందుకు గుర్తొచ్చిందో మా అయ్యకి ..
పొంతలోనీళ్ళు తొరుపుతున్న మాయమ్మ
ముసిముసి నవ్వులకే తెలవాల
సుక్కల వాయిలు చీరకట్టుకుని
మాదాసోళ్ళ పెతాణంలో పంచిన ఆకొక్కల పక్కకి
గోడమీది సున్నంగీక్కుంటున్న ఆయమ్మి నోరు
పిసరంతన్నా పండనీకుండా ఎగబడ్డ
గూడకొంగ పిల్లనౌతాను
కడుపునపుట్టిన పాపానికి
కడుపులో ముద్దా
మొగుడితో ముద్దూ
మొత్తం నానవ్వులోనే వెతుక్కున్న
సల్లటి తల్లి మండ్రు మాణికెమ్మ ఆంత్రాలలో
మలమల మాడగొడుతున్న అల్సర్ అగ్గికి
ఇప్పుడు ముప్పొద్దులా జెలూసిల్ అమృతం
కొనిపెట్టగలుగుతున్న డాబుసరి డాబానీడనయ్యాను
*
పెరడాల్ : ఐరన్ టానిక్ 
ఆవిషు గీత: ఆయుష్షు రేఖ 
చిక్కం: పాలు కుడవకుండా దూడ మూతికి కట్టే వల 
బొడ్డుగిన్నె : క్రింద పీఠం తాపడం చేసిన కంచం (కంచుతో చేసింది)
పెతాణం / ప్రధానం : పెళ్ళికూతురును ఖాయంచేసుకోవడానికొచ్చి పెళ్ళికొడుకుతరుపువాళ్ళు సమర్పించే కోకా , రైకా, పూలూ, నగలూ.. వూరంతా పంచే తాంబూలం  (వుంకోసారి ఇవరంగా మాట్టాడుకుందారి. ఈపాలికి ఇట్టాకానీండి)
కంచాలాట : నేలమీద గుంతలు చేసి ఆడే గోళీకాయలాట 

మీ మాటలు

 1. బ్రెయిన్ డెడ్ says:

  ఏమిరాస్తున్నామో ఎందుకురాస్తున్నామో అర్ధాలు మారిపోతున్న కాలంలో మీరొక మెచ్యుర్డ్ పోయెట్ ఇండస్ గారు . ప్రతిపదాన్ని ప్రతిపాదాన్ని బాధ్యతగా రాయటం అందరికి సాధ్యంఅయిన art కాదు. మీకు అందులో phd వచ్చేసింది ఆల్రెడీ . చాలమంచి భావం , మొత్తం స్లో మోషన్లో ఆర్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ మీ ఈ కవిత చదువుతుంటే. . కుడోస్ .

 2. వస్తువు పరంగా చూసినా, భాష పరంగా చూసినా (మాండలికం వాడబడింది), అభివ్యక్తి పరంగా చూసినా మంచి విలువలున్న కవిత ఇది. కవితలో ఎన్నో చోట్ల పోలికలు చక్కగా రాణించాయి. ఇండస్ మార్టిన్ గారూ! మీకు అభినందనలు తెలుపకుండా ఉండలేను. కవిత బాగా ఉన్నా కామెంట్లు ఎక్కువగా రాకపోవడం ఆశ్చర్యకరం.

 3. Indus Martin says:

  ధన్యవాదాలు ఎలనాగ మరియూ బ్రెయిన్స్ గార్లు . మీ ఇద్దరి మాటలు చాలవా నా కడుపు మనసూ పొర్లిపోవడానికి?! కొండెక్కినట్టుంది !

 4. paresh n doshi says:

  అద్భుతమైన కవిత. గొప్ప పరిశీలనా దృష్టి, వాతావరణ చిత్రణ, పదబంధాలు, భాష, వొక తూకం, వొక సిమ్మెట్రీ . మా కళ్ళ ముందు మీ తల్లిదండ్రులని , నీ చిన్నప్పటి బుడ్డోడిని, ఇప్పటి దాబుసరితనాన్నీ నిలిపావు. (నామిని గుర్తొచ్చేలా ).
  “నా దిట్టి కళ్ళు చిక్కమై ఆయమ్మి మూతిని బిగిచ్చి కడతాయి”
  ఊరికే , అన్నం వుదికిండా లేదా చూస్తున్నా. బాగా వుదికింది.
  అన్నట్టు, పెరడాల్ ఎక్కడ వాడావ్?

 5. Indus Martin says:

  Paresh Doshi sir, I would like to thank u abundantly for spending time on my humble writings ! I would have long back packed up from this place but for the careful observations of a few poetry lovers like you! Yes, I agree with you fully! I started with some thing and ended it with some political sarcasm ! Thank u sir ! I will be more careful here after ( mmmmmm otherwise u have your whip in your hands ) !!!! Love u

 6. Indus Martin says:

  పరేష్ సర్ ధన్యవాదాలు , ముందు కామెంట్ పొరపాటున పోస్ట్ అయ్యింది.

మీ మాటలు

*