మాయమైనచేతులు

 

  • బండ్ల మాధవరావు

 

????????????????????????????????????

 

 

ఒక్కనొక ఉదయాన

నిద్రలేచి చూసుకొనేటప్పటికి

నా చేతులు అదృశ్యమైపోయాయి

పరమ సంభ్రమంగానూ ఆశ్చర్యంగానూ అనిపించింది

అప్పటివరకు అన్నం తినిపించిన చేతులు

నడిచే కాళ్లకు ఆసరా అయిన చేతులు

చేతులు లేకపోవడం మనిషి లేకపోవడంలాంటిదే కదా

చెయ్యడం అనే పదం చేతులనుండే కదా పుట్టింది

ఏ పనైనా చెయ్యడం చాతకాకపోతే

తలలేనోడా అని మానాన్న తిట్టినట్టుగా

ఇప్పుడు నేను

పని లేనోడినయ్యాను

పని – బతకడానికేనా

బతికించడానికి కూడా కదా

పనంటే మట్టి

మట్టినుంచు అన్నం

కాళ్ల కింద మట్టి పెళ్లగించబడ్డాక

అన్నం లేదు

అన్నం పెట్టే పనీ లేదు

నువ్వొక ఆకాశ హర్మ్యాన్ని

నా మట్టి తల పై నిలిపాక

నా చేతులు అదృశ్యమవ్వడం ప్రారంభించాయి

మట్టి పిసికిన చేతులు

దుక్కిదున్నిన చేతులు

వెదబెట్టిన చేతులు

కోతకోసిన చేతులు

సమస్తమైన పనిని

ఒడుపుగా చేసిన చేతులు

పని చేసి చేసి అలసిన చేతులు

మట్టినుండి దూరమై

క్రమంగా నాలోకి ముడుచుకుపోయాయి

నువ్వు భూతల స్వర్గపు మాయమాటల్ని

నా నేలతల్లి మీద వెదజల్లాక

మొలవాల్సిన అన్నం

తాలు గింజలై నిర్వీర్యమైపోయింది

మాటల మొక్కల కింద

పరుచుకొన్న పైపంచె మీద

కన్నీటి గింజలు రాలుతున్నాయి

మట్టిని వాడికి అప్పజెప్పాక

కనబడని చేతుల్ని

ముందుబెట్టుకు కూర్చున్నాను

పని లేకపోవడం లోని నరకం అనుభవంలోకి వచ్చింది.

*

painting: Mandira Bhaduri

మీ మాటలు

  1. ఎ కె ప్రభాకర్ says:

    పని నుంచీ పనిముట్టు నుంచీ
    దూరమై
    పని ముట్టుకోనప్పుడూ
    పనిముట్టు ముట్టనప్పుడూ
    చేతులూ చేతలూ శూన్యమైనట్టు
    మనిషి మాయమైనట్టూ…
    శ్రమ సంపదా పర్యాయపదాలని తెలియ చెప్పిన పోయెం.
    అభినందనలు మాధవా!

  2. చేతులు లేకపోవడం మనిషి లేకపోవడంలాంటిదే కదా???

    నిజమే సర్ చేతుల్ని మాయం చేస్తూ మనుషుల్ని మట్టిని దూరం చేస్తు వాడు వికటాట్టహాసం చేస్తున్నాడు. కాని మాయం అవుతున్న చేతులు తిరిగి కత్తులుగా మొలవాల్సిన సమయమిదే.. లేకపోతె కాంక్రీట్ అరణ్యమే మిగిలి మనిషి జాడ లేనిదవుతుంది లోకం..

    అభినందనలతో..

  3. VELDANDI SRIDHAR says:

    ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందడానికి, నాశనం కావడానికి కూడా చేతులే కారణమనిపిస్తుంది. నిజంగా చేతులు లేక పోతే అంతా శూన్యం! అయితే వున్న చేతులతో కూడా శూన్యాన్నే నిర్మిస్తున్నామా? మనిషి మాయమై, చేతులు మాయమై, చేతలు మాయమై, మట్టి మాయమై ఇపుడన్నీ మనిషిని మరుగుజ్జును చేసి ఎత్తయిన భవణాల వరుసలే కనిపిస్తున్నాయి… చాలా మంచి కవిత్వం. అభినందనలు మాధవరావుగారు…

  4. విలాసాగరం రవీందర్ says:

    చేతులు లేకపోవడం తల లేక పోవడంతో సమానం.
    పని లేక పోవడం నిజంగా నరకమే…
    మంచి కవిత మాధవరావు గారు

Leave a Reply to ఎ కె ప్రభాకర్ Cancel reply

*