కాండీడ్-2

 

2

ఆ విధంగా భూతలస్వర్గం నుంచి తన్నితరిమేశాక కాండీడ్ తనెక్కడికి పోతున్నదీ తనకే తెలియకుండా తిరిగాడు. కడవలకొద్దీ కన్నీళ్లు కారుస్తూ స్వర్గంవైపు చూసేవాడు. అయితే ఆ చూపు మాటిమాటికి దారితప్పి జమీందార్ల కూతుళ్లుండే చక్కని భవనాల్లోకి చొచ్చుకెళ్లేది. ఓ రాత్రి అతడు పొలంలో నాగేటి చాల్లో పడకేశాడు. మంచు తుంపర్లతుంపర్లుగా కాకుండా ముద్దలుముద్దలుగా కురిసింది. చలికోతకు తోడు కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. పొద్దున మెలకువ వచ్చేసరికి ఒళ్లంతా బిరుసెక్కి చల్లగా, శవంలా అనిపించింది. కొనప్రాణాలతో కాళ్లీడ్చుకుంటూ దగ్గర్లోని వాల్డ్ బెర్గాఫ్ డిక్ డార్ఫ్ పట్టణానికి చేరుకున్నాడు. ఓ సత్రం ముందు దీనాతిదీనంగా ముఖం పెట్టుకుని నిల్చున్నాడు.

సత్రం దగ్గర ఏదో పనిపై తిరుగుతున్న ఇద్దరు నీలిబట్టల వాళ్లు అతణ్ని చూశారు.

‘కుర్రాడు కత్తిలా ఉన్నాడు. ఎత్తుకూడా సరిగ్గా సరిపోతుంది’ అన్నాడు వాళ్లలో ఒకడు పక్కవాడితో.

ఇద్దరూ కాండీడ్ వద్దకెళ్లి తమతోపాటు భోజనం చేయాలని వినయంగా ఆహ్వానించారు.

‘అయ్యలారా! మీ మర్యాద బావుంది. సంతోషం. కానీ భోజనానికి నా వాటా కింద ఇచ్చేందుకు నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదే.’

‘డబ్బా? ఆ సంగతి మరచిపొండి బాబూ. అసలు మీ వంటి రూపసులు, గొప్పవాళ్లు ఎప్పుడూ దేనికీ డబ్బులు చెల్లించకూడదు. సరేగాని, మీ ఎత్తు ఐదడుగులా ఐదంగుళాలు ఉంటుందా?’ ఒకడు అడిగాడు.

‘అవును. నా ఎత్తు కచ్చితంగా అంతేనండి’ వినయంగా తలవంచి చెప్పాడు కాండీడ్.

‘బావుంది, బావుంది. అయితే ఇక మాతో రండి. మీ వాటా కూడా మేమే చెల్లిస్తాం. మీలాంటి బుద్ధిమంతులకు డబ్బు కొరత రానిస్తామా? అసలు మనుషులు పుట్టిందే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి.’

‘మీరన్నది అక్షరాలా నిజం. మా గురువుగారు పాంగ్లాస్ కూడా నాకెప్పుడూ ఈ మాటే చెబుతుంటారు. మీ మర్యాదామన్ననా చూశాక, అంతా మన మంచికేనన్న వాదాన్ని మరింత గట్టిగా ఒప్పేసుకుంటున్నాను సుమీ.’

తర్వాత ఆ కొత్త నేస్తాలు కాండీడ్ కు కొన్ని షిల్లింగులు ఇస్తామని, తీసుకోవాలని బతిమాలారు. కాండీడ్ సంతోషంగా వాటిని పుచ్చుకుని, ముట్టినట్టు రసీదు రాసివ్వబోయాడు. అయితే వాళ్లు వద్దన్నారు. తర్వాత ముగ్గురూ తిండి బల్లముందు కూర్చున్నారు.

2chap

 

‘మీరు గాఢంగా ప్రేమిస్తున్నారనుకుంటా..’ కొత్త మిత్రుల్లో ఒకడు ముచ్చట పెట్టాడు.

‘ఔనౌను. నాకు క్యూనెగొండ్ అంటే చచ్చేంత ప్రేమ.’

‘ఆ సంగతి కాదు, మీరు మా బల్గర్ల రాజును గాఢంగా ప్రేమిస్తున్నారా అని?’

‘ప్రేమా? బల్గర్ల రాజుపైనా! ఆరి దేవుడోయ్.. అసలు నేనాయన్ను చూసే ఎరగనే?’

‘ఆయన రాజుల్లో మణిపూస. ఆయన ఆయురారోగ్యాల కోసం కాస్త మద్యం పుచ్చుకుందాం.’

‘సంతోషంగా..’ అంటూ అతిథి పానపాత్రను ఖాళీ చేశాడు.

‘ఇక చాలు! నువ్విప్పుడు మా రాజువైపు చేరినట్టే. ఆయన రక్షకుల్లో భాగమైనట్టే. బల్గర్లలో మరో వీరుడు అవతరించాడోచ్! కీర్తికాంత నీ కోసం ఎదురుచూస్తోంది ధీరుడా, ముందుకు సాగిపో..’ అన్నారు నీలిబట్టల వాళ్లు.

అలా స్తోత్రపాఠాలు వల్లిస్తూనే ఇద్దరూ కాండీడ్ చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి, దగ్గర్లోని సైనిక స్థావరానికి లాక్కెళ్లారు. అక్కడ ‘కుడి’, ‘ఎడమ’ తిప్పుళ్లు, కవాతు, ఆయుధాలు అందుకోవడం, గురిచూసి తుపాకీ కాల్చడం వగైరా సైనిక విద్యల్లో తర్ఫీదు ఇచ్చారు. తర్వాత దుడ్డుకర్రతో ముప్పైసార్లు బాదారు. మర్నాడు కవాతులో కాస్త మెరుగనిపించడంతో ఇరవై దెబ్బలే కొట్టారు. ఆ మర్నాడు ఇంకాస్త మెరుగనిపించడంతో పది దెబ్బలతో సరిపెట్టారు. తోటి జవాన్లు అతణ్ని ఏకసంతాగ్రాహి అనీ, గండరగండడనీ, అదనీ, ఇదనీ పొగడ్తలతో ముంచెత్తారు.

ఆ పొగడ్తలకు కాండీడ్ విస్తుపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు. తను వీరాధివీరుడనని చెబుతుంటే నమ్మలేకపోతున్నాడు. అయితే నమ్మకం కుదిరే క్రమంలో వసంత రుతువులో హాయిగొలిపే ఓ ఉషోదయాన అతనికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. మనిషికైనా, జంతువుకైనా తలచుకున్నప్పుడు కాలికి పని చెప్పే హక్కుంది కనక, తాను కూడా పటాలం నుంచి వెళ్లిపోవచ్చని భావించి కాలికి బుద్ధి చెప్పాడు. మహా అయితే ఆరు మైళ్లు పోయాడో లేదో ఆరడుగుల ఎత్తున్న నలుగురు సైనికులు అతణ్ని పట్టుకుని బంధించి, చీకటి కొట్లో పడేశారు. సైన్యాధికారులు నేరాన్ని విచారించారు. పటాలంలోని అందరితోనూ ముప్పయ్యారుసార్లు కొరడా దెబ్బలు తినడమో, లేకపోతే బుర్రలోకి ఒకేసారి పన్నెండు తూటాలు కాల్పించుకోవడమో ఏదో ఒకటి ఎంచుకోవడానికి మహాదయతో అనుమతించారు. మనిషి స్వేచ్ఛాజీవి అని, ఈ రెండింటిలో ఏదీ తనకు వద్దని అతడు గొంతుచించుకు వాదించినా ఫలితముండదు కనక ఏదో ఒకటి ఎంచుకోక తప్పలేదు. అతడు అలా భగవద్దత్తమైన స్వేచ్ఛ అనే వరాన్ని వాడుకుని కొరడా దెబ్బలనే కోరుకున్నాడు. శిక్ష మొదలైంది. రెండు వరసలకు మాత్రమే తట్టుకోగలిగాడు. పటాలంలోని ఒక్కొక్కరు రెండు దెబ్బలు కొట్టారు. పటాలంలో రెండువేల మంది ఉండడంతో సరిగ్గా నాలుగువేల దెబ్బలు పడ్డాయి. కాండీడ్ ఒళ్లు గుళ్లయింది. ఆపాదమస్తకం కండరాలన్నీ, నరాలన్నీ వాతలు తేలి ఉబ్బిపోయాయి.  మూడో వరస మొదలు కాబోతుండగా కాండీడ్ భీతిల్లిపోయి, దయచేసి తనకు శిరచ్ఛేదం చేయమని వేడుకున్నాడు. అతని కోరికను మన్నించారు. కళ్లకు గంతలు కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇంతలో బల్గర్ల రాజు అటుగా వచ్చాడు. ఖైదీ నేరమేంటో కనుక్కున్నాడు. రాజు వివేకవంతుడవడం వల్ల, లోకం పోకడ ఏమాత్రం తెలియని కాండీడ్ అనే యువ తత్వవేత్త తన సైన్యంలో ఉన్నాడని అదివరకే విని ఉండడం వల్ల… అన్ని కాలాల్లో, అన్ని పత్రికల్లో వేనోళ్ల కొనియాడదగిన కరుణాకటాక్షవీక్షణాన్ని అతనిపై ప్రసరింపజేసి క్షమాభిక్ష పెట్టాడు. తర్వాత చేయి తిరిగిన వైద్యుడొకడు.. డియోస్కోరిడిస్ సూచించిన లేపనాలతో, కాపడాలతో కాండీడ్ కు మూడు వారాలు చికిత్స చేశాడు. కాస్త నడవడానికి వీలుగా కాళ్లపై కొత్త చర్మం వచ్చింది. ఇంతలో బల్గర్ల రాజు అబర్ల రాజుతో కయ్యానికి కాలు దువ్వాడు.

 

3.

సుశిక్షితమైన రెండు సైనిక బలగాలు యుద్ధానికి దిగినప్పుడు రేగే ఆ కోలాహలం, అందచందాల సంగతే వేరు. కళ్లారా చూస్తేగానీ అనుభంలోకి కాదు. భేరీల, బాకాల, ఫిరంగి పేలుళ్ల, ఈలల, కేకల రణగొణ ధ్వనులు సృష్టించే ఆ ఒద్దికా, ఆకర్షణతో నరకం కూడా పోటీ పడలేదు. తొలి దాడిలో ఫిరంగులు పేల్చగా రెండువైపులా చెరో ఆరువేల మంది పరమపదించారు. తర్వాత తుపాకీ కాల్పుల్లో తొమ్మిది, పదివేల మంది దాకా ఎంతో అద్వితీయమైన ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. తుపాకీ కొనకత్తుల కారణబలం వల్ల ఇంకొన్ని వేల మంది నేలకొరిగారు. మొత్తం ముప్పైవేల మంది మృత్యువాతపడ్డారు. కాండీడ్ తత్వవేత్తలా వణికిపోతూ ఆ వీరోచిత ఊచకోత సాగుతున్నంతసేపూ బహు జాగ్రత్తగా దాక్కున్నాడు.

యుద్ధం ముగిశాక ఇద్దరు రాజులూ తమ తమ గుడారాల్లో విజయోత్సవాల్లో లీనమై ఉండగా కాండీడ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తన కార్యకారణ సిద్ధాంతానికి అనువైన చోటుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. శవాల గుట్టలపై నుంచి, చస్తున్నవాళ్లపై నుంచి దారి చేసుకుంటూ దగ్గర్లోని పల్లెకు వెళ్లాడు. అది అబర్ల రాజ్యం లోనిది. కాలిపోతున్న కొంపాగోడూ నుంచి వస్తున్న పొగ తప్ప మరేమీ లేదక్కడ. బల్గర్లు అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం దాన్ని భస్మీపటలం చేశారు. గాయాలతో అవిటివాళ్లయిన ముసలివాళ్లు.. గొంతులు తెగి, నెత్తురోడుతున్న రొమ్ములకు బిడ్డలను హత్తుకుని కన్నుమూసిన తమ ఆడవాళ్ల వంక నిస్సహాయంగా చూస్తూ కనిపించారు. బల్గర్ మహావీరుల కామవాంఛలు తీర్చిన కన్యలు అంగాలు చీరేయబడి, అంతిమ క్షణాల్లో ఎగశ్వాస తీస్తున్నారు. మంటల్లో ఘోరంగా కాలిపోయిన వాళ్లు తమకు త్వరగా చావు రావాలని వేడుకుంటున్నారు. నేలపై ఎటుచూసినా తెగిపోయిన కాళ్లు, చేతులు, మెదళ్లు పడున్నాయి.

కాండీడ్ ఆ భీతావహాన్ని చూడలేక గబగబా మరో పల్లెకు చేరుకున్నాడు. అది బల్గర్ల రాజ్యంలోనిది. అబర్ సైనికులు కూడా అంతర్జాతీయ న్యాయసూత్రాలను తూచ తప్పకుండా పాటించి పై పల్లెకు పట్టిన గతినే దీనికీ పట్టించారు. కాండీడ్ శవాల గుట్టలు, కూలిన కొంపలపై నుంచి వేగంగా సాగి రణభూమిని దాటేశాడు. అతని మూటలో కొద్దిగా తిండి ఉంది. మదిలో క్యూనెగొండ్ పదిలంగా ఉంది. హాలండ్ చేరుకునేసరికి ఉన్న తిండి కాస్తా అయిపోయింది. హాలండ్ వాసులందరూ సంపన్నులని, క్రైస్తవులని అదివరకెవరో అతనికి చెప్పారు. అందుకే వాళ్లు తనను బాగా ఆదరిస్తారని, క్యూనెగొండ్ వలపుచూపుల వలలో చిక్కి, తన్నులు తిని, గెంటేయకముందు థండర్ టెన్ ట్రాంక్ కోటలో తనకు దక్కిన సకల గౌరమర్యాదలన్నీ ఇక్కడా దక్కుతాయని గట్టిగా అనుకున్నాడు.

3chap

ఆ నమ్మకంతో కనిపించిన ప్రతి పెద్దమనిషినీ బిచ్చమడిగాడు. వాళ్లు దమ్మిడీ ఇవ్వలేదు. పైగా, ఇలా అడుక్కుంటూ తిరిగితే, బతుకు తెరువు నేర్పే కారాగారానికి పంపిస్తామని మందలించారు.

కాండీడ్ తర్వాత జనం గుమికూడిన చోటుకు వెళ్లాడు. ఓ వక్త దానధర్మాల గొప్పతనంపై గంటసేపట్నుంచి ఉపన్యాసం దంచుతున్నాడు. అతడు తన పెద్ద టోపీ చాటునుంచి కాండీడ్ ను కళ్లు చిట్లిస్తూ చూసి, ‘ఇక్కడ నీకేం పని? నేను చెబుతున్న ఈ మంచి విషయాన్ని నువ్వు సమర్థిస్తావా లేదా?’ అని గద్దిస్తూ అడిగాడు.

‘కారణం లేకుండా కార్యం ఉండదండి. ప్రతి ఒక్కటీ మన మంచి కోసమే, ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. నన్ను క్యూనెగొండ్ సమక్షం నుంచి తరిమేయడం, తర్వాత నేను పటాలంలో కొరడాల బారిన పడడం, ఇప్పుడిలా కాసింత రొట్టెముక్క కోసం చేతులు చాచి దేబిరించడం.. ఇదంతా నా ఖర్మ, దురదృష్టం. ఇదిలా కాకుండా మరోలా ఉండడానికి వీల్లేదు’ కాండీడ్ వినయంగా విడమరచి బదులిచ్చాడు.

‘బావుంది మిత్రమా! మరి, ఈ సంగతి చెప్పు. .. పోప్ క్రీస్తువ్యతిరేకి అంటే నీకేమన్నా అనుమానమా?’

‘అసలు అలాంటి వాదనొకటి ఉందని నేనింతవరకూ విననే లేదు. అయినా ఆయన క్రీస్తు వ్యతిరేకి అయితేనేం, కాకపోతేనేం, ఆ సంగతి నాకు శుద్ధ అనవసరం! నాకు ప్రస్తుతానికి కడుపు నింపుకోవడానికి కాసింత రొట్టెముక్క కావాలి, అంతే’ అన్నాడు ఆకలి బాధితుడు.

‘ఓరి మూర్ఖుడా! దుష్టుడా.. దుర్మార్గుడా! నీచుడా.. నికృష్టుడా! అయితే నీకు తిండి తినే అర్హత కూడా లేదుపో. వెంటనే ఇక్కణ్నుంచి వెళ్లిపో. ఇంకోసారి నా ఛాయలకే రావద్దు. వచ్చావా, చచ్చావే అనుకో..’ కేకలేశాడు వక్త.

కిటికీలోంచి తలను కొంగలా చాచి చూస్తున్న సదరు వక్త భార్యకు కూడా చిర్రెత్తుకొచ్చింది. పోస్ క్రీస్తు వ్యతిరేకా, కాదా అని తర్కించిన ఆ సంశయాత్ముడి నెత్తిపై ఆ మహా ఇల్లాలు కుండెడు కడుగునీళ్లు కుమ్మరించింది. అకటకటా! మతావేశం అతివలతో ఎన్ని ఘోరాలు చేయిస్తుందో కదా!

జేమ్స్ అనే అనబాప్తీస్ముడైన జాలిగుండె మనిషి ఈ క్రూరపరాభవాన్ని చూసి చలించిపోయాడు. సాటి మనిషికి, సోదరుడిలాంటి వాడికి, ఈకల్లేని రెండు కాళ్ల ఆత్మగత ప్రాణికి, బుద్ధిమంతుడికి జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. కాండీడ్ పై కరుణ పెల్లుబికింది. అతణ్ని ఓదార్చి ఇంటికి తీసుకెళ్లాడు. శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టాడు. కాస్త బీరు కూడా పోశాడు. దగ్గరుంచుకొమ్మని కొంత చిల్లర ఇచ్చాడు. తాను పర్షియన్ పట్టబట్టలు నేయిస్తుంటానని, ఆ పని కూడా నేర్పుతానని చెప్పాడు. ఆ అమిత దయాదాక్షిణ్యాలకు కాండీడ్  నిలువెల్లా కదలిపోయి కృతజ్ఞతా భారంతో జేమ్స్ కాళ్లపై పడిపోయాడు.

‘ఈ లోకంలోని ప్రతీదీ మన మంచికోసమే ఉందన్న మా గురువు పాంగ్లాస్ వాక్కు ముమ్మాటికీ నిజమని నమ్ముతున్నాను. నల్లకోటు తొడుక్కుని ఉపన్యాసం దంచిన ఆ పెద్దమనిషి, ఆయన ఇల్లాలి దుష్టత్వం, వాళ్లు చేసిన అవమానాలను మీ అపురూపమైన ఆదరణతో మరచిపోతున్నాను’ అన్నాడు.

మర్నాడు కాండీడ్ వీధిలోకి వెళ్లినప్పుడు ఒళ్లంతా గాయాల పక్కులున్న బిచ్చగాడు తారసపడ్డాడు. అతని కళ్లలో జీవం లేదు. ముక్కు కొన పుండుపడి ఊడిపోయింది. మూతి వంకర పోయింది. పళ్లు గారపట్టాయి. గొంతు పెగలడం లేదు. భయంకరంగా దగ్గుతున్నాడు. దగ్గుదగ్గుకు ఒక్కో పన్ను నేలపైన రాలి పడుతోంది.

 

(సశేషం)

మీ మాటలు

  1. చందు - తులసి says:

    విషాదం…వ్యంగ్యం.. కలిసిపోయిన ఒక రకమైన ధిక్కారం లాంటి వాల్టేర్ గారి ఆత్మను బలే పట్టుకున్నారు మోహన్ గారు. అనువాదమన్న అనుమానమే రాకుండా…బలే గా రాస్తున్నారు.

    • ధన్యవాదాలండి. కాండీడ్ లో రెండు వ్యాక్యాల మధ్య చదవాల్సిన చాలా ఉన్నాయి. అనువాదం కత్తిమీద సాము అంటారుగదా, వోల్టేర్ ఆత్మను అంతా కాకున్నాసాధ్యమైనంతమేరకు పట్టుకోవాలనే ఈ ప్రయత్నం.

  2. కె.కె. రామయ్య says:

    బల్గర్ల రాజు, అబర్ల రాజుతో కయ్యానికి కాలు దువ్వటం, యుద్ధంలో సైనిక బలగాల వీరోచిత ఊచకోత, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం పోరులో ఇరువర్గాల సైనికులు సృష్టించిన భీతావాహం, యుద్ధం ముగిశాక ఇద్దరు రాజులూ తమ తమ గుడారాల్లో విజయోత్సవాల్లో లీనమై పోవటం వణికించేలా చేసింది మోహన్ గారు. ఇది 18వ శతాబ్దంలో జరిగిందా లేక ఇంకా 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతున్నది కదా అని ఆలోచింప చేసింది.

    • అవునండి. మనిషిలో అవలక్షణాలున్నంతవరకు కాండీడ్ కు ప్రాసంగికత ఉంటుంది.

  3. అజిత్ కుమార్ says:

    “జేమ్స్ అనే అనబాప్తీస్ముడైన జాలిగుండె మనిషి ఈ క్రూరపరాభవాన్ని చూసి చలించిపోయాడు ” ఇందులో అనబాప్తీస్మడైన= ‘unbaptized ‘ అనే ఆంగ్లపదానికి తెలుగు అనువాదమా? అయితే ‘బాప్తీస్మముపొందని ‘ అని ఉండాలిగాదా…..

    • James is an anabaptist. Anabaptism is a movement within Christianity.

    • అజిత్ గారు ‘బాప్తీస్మముపొందని’ అని అనుంటేనే బావుండేదేమో. మీ సూచనకు ధన్యవాదాలు. నిజానికి కాండీడ్ ను ఒకసారి వివరణల్లోకి వెళ్లకుండా చదివి, తర్వాత వివరణలతో చదివితే బావుంటుందని అంటారు.
      నేను అధ్యాయాల వారీగా వివరణలు రాసుకుంటున్నాను. కాని అవి కూడా ప్రచురిస్తే కథను చదువుతున్నట్టు కాక ఏదో శాస్త్రవిషయాన్ని చదువుతున్నట్టు ఉంటుందేమోనని భావిస్తున్నాను. కామెంట్లలో ఇవ్వొచ్చనిపిస్తోంది.
      మచ్చుకు చూడండి..
      1వ అధ్యాయం
      వెస్ట్ ఫేలియా: పశ్చిమ జర్మనీలోని ఒక రాజ్యం. నిల్వచేసిన పందిమాంసానికి(ham) ప్రసిద్ధి. విషాదమైన, ఏవగింపు కలిగించే వెస్ట్ ఫేలియాలో ఉన్నానని వోల్టేర్ 1750లో ఓ లేఖలో రాశాడు. కాండీడ్: కల్లాకపటం లేని మనిషి అని అర్థం. లాటిన్ లోని కాండిడాస్ అనే పదం నుంచి వచ్చింది. ఆ పదానికి స్వచ్ఛమైన, అందమైన, తెల్లని అనే అర్థాలున్నాయి. అవిచ్ఛిన్న తరాలు: మూలంలో 71 క్వార్టరింగులు అని ఉంది. క్వార్టరింగ్ అనేది వంశవృక్షాల నిడివి కొలమానం. జమీందారు సోదరిది 72 క్వార్టరింగుల వంశం. పొరుగూరి పెద్దమనిషితో ప్రేమకలాపానికి అడ్డరాని అతని వంశవృక్షం పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. క్యూనెగొండ్: 11వ శతాబ్దికి చెందిన Holy Roman Emperor రెండో హెన్రీ భార్య పేరు. వీరి దాంపత్యం పవిత్రమైందని, క్యూనెగొండ్ తన కన్యత్వాన్ని కాపాడుకుందని అంటారు. 11వ శతాబ్దికే చెందిన కరింథియా డ్యూక్ మూడో గుయెల్ఫ్ సోదరి పేరూ క్యూనెగొండే. ఈ పేరు ప్రాచీనమైంది, కులీనులది కావడంతో వోల్టేర్ తన కథానాయికకు పెట్టి ఉండొచ్చు. క్యూనెగొండ్ భావి జీవితానికి, ఈ పేరు అభాస. పాంగ్లాస్: గ్రీకు భాషలోని ‘అంతా’, ‘భాష’ అనే పదాల కలయిక. అంతా మన మంచికే: జర్మన్ తత్వవేత్త గాట్ ఫ్రీడ్ విలియం లీబ్నిజ్(Gottfried Wilhelm Leibniz 1646-1716) ప్రతిపాదించిన ‘విధిరాత’ వంటి ఆశావాద సిద్ధాంతం(Optimism, Best of the possible world). దేవుడు సర్వశక్తిసంపన్నుడు కనక మన ప్రపంచాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్డాడని, లోకాల్లో ఇదే అత్యుత్తమలోకమని, ఇది ఉన్నదానికి భిన్నంగా ఉండజాలదని వాదించేవాడు. ఈ నవల అంతటా ఈ వాదంపై దాడి సాగుతూనే ఉంటుంది.

      2వ అధ్యాయం
      వాల్డ్ బెర్గాఫ్ డిక్ డార్ఫ్: ఆర్భాటంగా, పొడవుగా ఉంటే జర్మన్ పట్టణాల పేర్లపై విసురు. నీలిబట్టల వాళ్లు: ప్రష్యా సైనికులు. బల్గర్ల రాజుపై ప్రేమ: ప్రష్యా రాజు ఫ్రెడరిక్ ద గ్రేట్(1712-1786) స్వలింగ సంపర్కుడని ప్రతీతి. అతని సైన్యంలోనూ చాలామంది స్వలింగ సంపర్కులు ఉండేవాళ్లు. దీనిపై పరోక్ష ప్రస్తావన. ఫ్రెడరిక్ వోల్టేర్ కు కొన్నాళ్లు మిత్రుడు, కొన్నాళ్లు శత్రువు. అబర్లు: తార్తార్ జాతిలో ఒక తెగ. కాండీడ్ ఎత్తు: : ఫ్రెడరిక్ తన సైనికులందరూ ఒకే ఎత్తులో ఉండేలా నియామకాలు చేయించేవాడు. ఆరడుగుల ఎత్తున్నవాళ్లకు ప్రాధాన్యమిచ్చేవాడు. కాండీడ్ పలాయనం: కొన్ని సమాకాలీన ఉదంతాల ప్రస్తావన. ప్రష్యన్ సైన్యం నుంచి పారిపోయి పట్టుబడిన కోర్టిల్జ్ అనే ఫ్రెంచివాడిని వోల్టేర్ విడుదల చేయించాడు. లీబ్నిజ్ శిష్యుడైన వుల్ఫ్ అనే సైనికుడి ఉదంతం కూడా. అంతా విధిరాత ప్రకారం సాగుతుంది కనక సైన్యం నుంచి పారిపోవడం తప్పేమీ కాదన్న వుల్ఫ్ వాదన పెద్ద గొడవకు దారి తీసింది. వుల్ఫ్ ను ప్రష్యా నుంచి బహిష్కరించారు. డియోస్కోరిడిస్: 1వ శతాబ్దికి చెందిన గ్రీకు వైద్యుడు.

  4. అజిత్ కుమార్ says:

    పద్మ గార్కి మరియు పి.మోహన్ గార్కి ధన్యవాదములు

Leave a Reply to P Mohan Cancel reply

*