ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ…

స్లీమన్ కథ-12

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పందొమ్మిదో శతాబ్ది, అరవయ్యవ దశకం నాటి ఫ్రాన్స్ బూర్జివాయిజీకి లొంగిపోయి ఉంది. నెపోలియన్-3 గద్దె మీద ఉన్నాడు. జబ్బు మనిషి. మాట నత్తి. ఎక్కడికెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అతనికే తెలిసేది కాదు. ఎవరూ ఆయనను లెక్క చేసేవారు కాదు. చక్రవర్తినీ, ఆయన అందాల భార్య యుజినీని పరివేష్టించి ఉండే ఆస్థానసభ్యులు కూడా ప్రజలకుదూరంగా, ఎందుకూ పనికిరాని బాపతుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఫ్రాన్స్ నిద్రమత్తులో జోగుతున్నట్టు ఉండేది. వృద్ధిలోనూ, తెలివిలోనూ యూరప్ మొత్తంలోనే మొదటివరసలో ఉన్నారనుకునే ఫ్రెంచి ప్రజలు కాస్తా అప్పటికి సెడాన్ విధ్వంసం దిశగా క్రమంగా అడుగులేస్తున్నారు.

సర్బాన్ లో చదువు ప్రారంభించిన స్లీమన్ చెరువులో చేపలా ఫ్రాన్స్ జీవనసరళిలో కలసిపోయాడు. సంపన్నుడు కనుక తను కోరుకున్న విధంగా జీవించే వెసులుబాటు అతనికుంది. ఓ ఉంపుడుగత్తె, విలాసవంతమైన రెస్టారెంట్లు, ఉన్నతవర్గాలతో సావాసం… ఏవీ అతనికి అందని పండ్లు కావు. పండితుడిగా సాటి పండితుల్లో అంతే తేలిగ్గా కలసిపోగలడు. ఆపైన; అమెరికా, క్యూబా, జర్మనీ, రష్యాలలో భారీ పెట్టుబడులు ఉన్న వర్తకప్రముఖుడిగా పారిస్ లోనూ యధేచ్ఛగా ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుపుకోగలడు.

బోయిస్డ్ బొలోని అనే చోట కొన్ని ఇళ్ళు కొన్నాడు. వాటికి అవసరమైన మరమ్మతులు జరిపించడం, సదుపాయాలు కల్పించి అద్దె కివ్వడం ఇప్పుడతని వ్యాపకాల్లో ఒకటి. మరమ్మతులకు, ఫర్నిచర్ కు అయ్యే ఖర్చు చూసి గుండెలు బాదుకునేవాడు. నిన్నటివరకూ ప్రతిక్షణాన్నీ నగదుగా మార్చుకుంటూ తీరిక లేకుండా గడిపిన ఈ అంతర్జాతీయ వ్యాపారవేత్త ఇప్పుడు ఇళ్ల ఏజెంట్ గా మారి గంటల తరబడి వాల్ పేపర్ చర్చలతో కాలం దొర్లించడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. సంసారజీవితం నింపిన చేదు, దుర్భరమైన ఒంటరితనం అతన్ని దిక్కుతోచని స్థితికి నెట్టాయి. వ్యాపారాలు కట్టిపెట్టడమే తన సమస్యలన్నింటికీ పరిష్కారమనుకున్నాడు. ఐశ్వర్యం తెచ్చిపెట్టే సుఖాలను దోసిళ్లతో జుర్రుకుంటూ ఫ్రాన్స్ లో ఉల్లాసంగా గడపచ్చనుకున్నాడు. కానీ ఆ రెండు అంచనాలూ తప్పాయి. నిస్సారంగా రోజులు గడుస్తున్నాయి.

అయితే, రోజువారీ కార్యక్రమాలను పద్ధతిగా జరుపుకునే అలవాటులో మార్పులేదు. ఇన్ని గంటలు చదువుకీ, ఇన్ని గంటలు ఇళ్ల బాడుగ వ్యవహారాలకూ, ఇన్ని గంటలు విందు వినోదాలకు కేటాయించుకుంటున్నాడు. థియేటర్లకు, గుర్రప్పందేలకూ వెడుతున్నాడు. గొప్పింటి మహిళల ఇళ్లనుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటున్నాడు. తన లాంటి దేశదిమ్మరులందరికీ స్వర్గధామమైన పారిస్ లో ఎంతో కొంత ఓదార్పును పొందుతున్నాడు కానీ, మొత్తానికి అతని జీవితం చుక్కాని లేని నావ అయింది. తరచుగా సెయింట్ పీటర్స్ బర్గ్ వైపు గాలి మళ్ళుతోంది.

అన్నింటినీ మించి పిల్లల మీద బెంగపడుతున్నాడు. వాళ్ళు ఎకతెరీనా పెంపకంలో ఉన్న సంగతిని తలచుకున్నప్పుడల్లా కోపంతో రగిలిపోతున్నాడు. ఆమెకు ఉత్తరాలు రాస్తూ నయానా భయానా తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తానంటే డ్రెస్డన్ ఇంటికి మకాం మార్చేస్తాననీ, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాననీ రాశాడు. గుర్రపు బళ్ళు, గుర్రాలు, నగలు, పారిస్ లో లభించే అత్యంత ఖరీదైన దుస్తులతో సహా నువ్వు ఏది అడిగితే అది ఇస్తాననీ; నీ జీవితాన్ని నాతో పంచుకుంటే చాలనీ అన్నాడు. “నేనిప్పుడు పూర్తిగా పారిస్ వాసిని అయిపోయాను. కనుక డ్రెస్డన్ లో మనం చిలకా గోరింకల్లా సంతోషంగా గడప”చ్చని హామీ ఇచ్చాడు.

ఆమె ఎప్పుడో కానీ జవాబిచ్చేది కాదు. నీ మొహం చూడననీ, నీతో కాపురం చేయననీ, ఎట్టి పరిస్థితిలోనూ పిల్లలు నా కళ్ల ముందు ఉండాల్సిందేననీ ఓ ఉత్తరంలో ఖండితంగా చెప్పింది. దానికతను, “భార్యనుంచి కోరేది ఏదీ నీనుంచి కోరను. ఇద్దరం అన్నా, చెల్లెల్లా ఉందాం. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు నా కళ్ల ముందు ఉంటే చాలు. ఇప్పుడు నేనున్న అపార్ట్ మెంట్ అద్దెకిచ్చేసి, బోయిస్డ్ బొలోనిలో ఓ బ్రహ్మాండమైన భవంతిని కొంటాను. 40వేల ఫ్రాంకులు ఖర్చుపెట్టి దానిని అందంగా తీర్చిదిద్దుతాను. సెయింట్ పీటర్స్ బర్గ్ లో, డ్రెస్డన్ లో నేను కొన్న భవనాలు, ఇప్పుడు పారిస్ లో కొనబోతున్నదీ-అన్నీ నీవే. నీ ఆనందం కోసమే. నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు ఈ మూడింటి మధ్యా తిరుగుతూ ఉండచ్చు” అని రాశాడు.

ఈ ప్రలోభాలేవీ పనిచేయకపోవడంతో బెదిరింపులు అందుకున్నాడు. నీకూ, పిల్లలకూ పంపే డబ్బు ఆపేస్తానన్నాడు. “మరీ మూర్ఖంగా మతిలేకుండా ప్రవర్తిస్తూ నీకు నువ్వే చెరుపు చేసుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే నా ఆస్తి లోంచి పిల్లలకు కూడా చిల్లిగవ్వ ఇవ్వను. అందువల్ల రేపు వాళ్ళు అడుక్కుతినే పరిస్థితి వస్తే అందుకు నీదే బాధ్యత. మరీ తెగే దాకా లాగుతున్నావు. నీతో పూర్తిగా విసిగిపోయాను. ఇదే చివరి ఉత్తరం. జీవితంలో మళ్ళీ నీకు ఉత్తరం రాయను” అన్నాడు.

కానీ, మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులు, బెదిరింపులు…అన్నీ మామూలే. “నీ కోసం, పిల్లలకోసం నా జీవితాన్నే సంతోషంగా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. అయినాసరే మొండిగా బండగా ప్రవర్తిస్తున్నావు. పిల్లల పేర రాసిన లక్షల ఆస్తిని, ఇదిగో ఇప్పుడే రద్దు చేసేస్తున్నాను” అని రాశాడు. ఎకతెరీనాలో ఎలాంటి చలనమూ లేదు. ఆమెకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ పెద్ద ఇల్లు, అత నామె పేర రాసిన భారీ మొత్తాలు ఉన్నాయి. ఆపైన మంచి ఆస్తిపాస్తులున్న బంధువర్గం ఉంది.

బట్టతల, నెరిసిన జుట్టుతో అసలు వయసు కంటే పెద్దవాడిలా కనిపిస్తున్న స్లీమన్; లోపల ఇంత అశాంతినీ, ఒంటరితనాన్నీ మోస్తూనే పైకి మాత్రం ఓ విద్యార్థిలా బుద్ధిగా సర్బాన్ యూనివర్సిటీకి వెళ్ళొస్తున్నాడు. వ్యాపారం జోలికి ఇక వెళ్లకూడదని ఎన్నోసార్లు అనుకున్నాడు. అన్నిసార్లూ ఆ మాట తప్పుతూనే వచ్చాడు. రోజూ విధిగా లండన్ టైమ్స్ లోని ఫైనాన్షియల్ పేజీలు చదివేవాడు. మనీ మార్కెట్ ను అధ్యయనం చేసేవాడు. కొన్ని రకాల బాండ్లకు కాగితం డబ్బు రూపంలో చెల్లింపులు జరపాలని అమెరికా రాజకీయనాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు చదివాడు. అందువల్ల లక్షల డాలర్ల మేరకు లావాదేవీలు జరుగుతాయనీ, బంగారం విలువ విపరీతంగా పెరిగిపోతుందనీ, కాగితం డబ్బు చలామణిలోకి రావడంతో బాండ్ల చెల్లుబాటు పడిపోతుందనీ అనుకున్నాడు. అమెరికాలో తనకు భారీగా ఆస్తులు ఉన్నాయి కనుక వాటి విలువ ఎక్కడ తరిగిపోతుందో నని భయపడి వెంటనే అమెరికాకి ప్రయాణం కట్టాడు.

1868లో న్యూయార్క్ వెళ్ళి, అక్కడినుంచి వాషింగ్టన్ చేరుకున్న వెంటనే ఖజానా మంత్రిని కలసుకున్నాడు. బాండ్ల చెల్లుబాటును తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పడంతో ఊరట చెందాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ను మర్యాదపూర్వకంగా కలసుకున్నాడు. “జాన్సన్ చాలా సీదా సాదా మనిషి. ఆయనకు యాభై అయిదేళ్ళుంటాయి. క్యూబా గురించి కాంగ్రెస్ లో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం సంతోషం కలిగించిందని చెప్పాను. అమెరికావైపు క్యూబా మొగ్గు చూపుతోందనీ, అది అమెరికాలో విలీనమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ ఆయన చెప్పాడు” అని ఓ జర్మన్ మిత్రుడికి రాశాడు. క్యూబాలో తనకున్న భూములు సురక్షితంగా ఉంటాయన్న నమ్మకం అతనికి చిక్కింది.

వాషింగ్టన్ అతనికి నచ్చింది. కిందటిసారి వచ్చినప్పుడు న్యూయార్క్ ఎంతో బాగున్నట్టు అనిపించినా, ఇప్పుడు పారిస్ ను చూసిన కళ్ళతో చూశాక వీధులు ఇరుకిరుగ్గా ఉన్నాయనీ, వీధి దీపాల ఏర్పాటు సరిగా లేదనీ, మొత్తం న్యూయార్క్ నగరమే గంద్రగోళంగా ఉందనీ అనుకున్నాడు. నగరం అంతర్యుద్ధ ప్రభావం కింద ఇంకా నలుగుతూనే ఉన్నట్టు అనిపించింది. ఎంతోమంది యూరోపియన్లలానే దక్షిణాది రాష్ట్రాల దుస్థితికి జాలిపడ్డాడు. “ఇప్పటికీ ఇక్కడి ప్రజల్ని పరాజితులుగా చూస్తున్నారు. వాళ్ళు రాజకీయప్రాతినిధ్యం లేకుండా  సైనికపాలన కింద మగ్గిపోతున్నారు. డబ్బు లేదు, బ్యాంకులు లేవు, తమ బాగోగులు తాము చూసుకునేందుకు సాయపడే వ్యవస్థ ఒక్కటీ లేదు” అని రాశాడు.

ఆఫ్రో-అమెరికన్లపై అతనికి ఎంతో ఆసక్తీ, ఇష్టమూ కలిగాయి. కొన్నాళ్ళపాటు వాళ్ళ స్కూళ్లను సందర్శించాడు. చర్చిలకు వెళ్ళి మతప్రసంగాలు విన్నాడు. వాళ్ళ గుణగణాలను ఆకాశానికి ఎత్తుతూ డైరీలో పేజీలకు పేజీలు నింపేశాడు. అయితే, అంతే హఠాత్తుగా వారిపై ఆసక్తి తగ్గిపోయింది. ఆ స్థానాన్ని అమెరికా రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా ఆక్రమించుకుంది. మహా సరస్సు(Great Lakes)ల వరకూ విస్తరించిన అన్ని రైలు మార్గాలలోనూ ఓ డైరక్టర్ లా ప్రయాణం చేసి, వాటిని సునిశితంగా తనిఖీ చేశాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు అమెరికన్ రైల్వేలు నష్టాల మీద నడుస్తున్నాయనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం తప్పనుకున్నాడు. పెట్టుబడి మీద పది శాతం లాభం వస్తున్నట్టు గుర్తించి సంతోషించాడు.

డైరీలో ఇతర విషయాలు కూడా రాసుకున్నాడు. వాటిలో నీలిమందు ధర, ఎగుమతి అవుతున్న ఆహారధాన్యాల పరిమాణం, అప్పటికి ముప్పై ఏళ్ల చికాగో అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, ఇండియానాపొలిస్ లోని భవనాల సైజు, ప్రస్తుత మార్కెట్ రేట్లలో కలప విలువ మొదలైనవి ఉన్నాయి. మళ్ళీ తను వ్యాపారప్రపంచంలోకి వెడుతున్నట్టు అతనికి అనిపించింది. నిజానికి అతనెప్పుడూ ఆ ప్రపంచానికి దూరంగా లేడు. ఇండియానాపొలిస్ అతనికి నచ్చింది. అక్కడ ఎంతోమంది వ్యాపారవేత్తలను, రాజకీయముఖ్యులను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళతో సంభాషణ అప్పుడప్పుడు విడాకుల చట్టం మీదికి మళ్లుతూ ఉండేది. ఇండియానా రాష్ట్రం ఆ చట్టంలో సవరణలు తెస్తోంది.

స్లీమన్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం యూనియన్ లో చేరింది. తను అమెరికా పౌరుణ్ణి అయ్యానని అతను చెప్పుకునేవాడు కానీ, అధికారికంగా పౌరసత్వం తీసుకోలేదు. భార్యకు విడాకులివ్వడానికి ఇండియానా చట్టం అనుకూలంగా ఉన్నట్టు కనిపించడంతో అక్కడి మిత్రుల సాయంతో పౌరసత్వం పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇండియానాపొలిస్ లో ఓ ఇల్లు కొనుక్కుని పిండి పదార్థాల వ్యాపారంలో ఆసక్తి చూపించాడు. ఎకతెరీనాతో తెగతెంపుల ప్రయత్నాలు అతనిలో ఆశాభావాన్నీ, ఉత్సాహాన్నీ నింపాయి. అమెరికా యాత్ర పొడవునా ఎంతో ఉల్లాసంగా గడిపాడు. ఓ రైల్వే అధికారిలా సర్వే చేస్తూ రైలు మార్గాలను చుట్టబెట్టడమే కాదు; ఎన్నో లాభసాటి పెట్టుబడులు పెట్టాడు. ప్రభుత్వంలో ముఖ్యులనుకున్న వాళ్లందరినీ కలసుకున్నాడు. మంచి తెలివీ, నిశితదృష్టీ ఉన్న ఈ వ్యాపారవేత్తను చూసి అంతా ముగ్ధులయ్యారు.

పైకి ఉల్లాసంగా ఉన్నా లోలోపల ఒంటరితనం కుంగదీస్తూనే ఉంది.  సెయింట్ పీటర్స్ బర్గ్ కూ, జర్మనీకీ అతను రాస్తున్న ఉత్తరాలు; తన డైరీ రాతల్లో వెల్లివిరిసే ఉత్సాహానికి భిన్నమైన చిత్రం చూపిస్తున్నాయి. ఎకతెరీనాకు విడాకులివ్వాలని అతను మనస్ఫూర్తిగా అనుకోడంలేదు. ఆమె తననా పరిస్థితికి నెడుతోందని అనుకుంటున్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులతోపాటు; తను తప్పులు చేశానని ఒప్పుకుంటూ, ఇకముందు నిన్ను నెత్తినపెట్టుకుంటానని హామీ ఇస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రష్యాలో క్రిస్టమస్ రోజైన జనవరి 6వ తేదీన వాషింగ్టన్ హోటల్ గదిలో ఒంటరిగా గడుపుతూ తన ముగ్గురు పిల్లల్నీ, క్రిస్టమస్ ట్రీనీ తలచుకున్నాడు. పిల్లలకి కానుకలిచ్చి వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం లేనందుకు కంట తడి పెట్టుకున్నాడు. తన మీద తనకే విసుగూ, కోపమూ ముంచెత్తాయి. పిల్లల సంతోషాన్ని పంచుకుంటూ వాళ్ళతో గడపడంలో పొందే ఆనందం ముందు లక్ష అమెరికన్ డాలర్లు కూడా దిగదుడుపే ననుకున్నాడు. పైగా ఆ మరునాడే తన 46వ పుట్టినరోజు కావడం అతని మనోవ్యధను మరింత పెంచింది. తన దుఃఖాన్ని వెళ్లబోసుకునేందుకు మనిషి కనిపించక ఒంటి నిండా ఒంటరి తనాన్ని కప్పుకుని ఆరోజంతా వాషింగ్టన్ వీధుల్లో దయ్యంలా తిరిగాడు.

ఓ మిత్రుడిచ్చిన పరిచయలేఖను తీసుకుని వాషింగ్టన్ లోని ప్రష్యా రాయబారి బేరన్ వన్ గెరోల్ట్ ను కలసుకున్నాడు. ఆయన సాదరంగా ఆహ్వానించి అతని వ్యాపారాల గురించి అడిగాడు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానని చెప్పి స్లీమన్ తన పారిస్ జీవితం గురించి, సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను గడించిన సంపద గురించీ చెప్పడం ప్రారంభించాడు. దాంతో ఉన్నట్టుండి ఆ రాయబారి కోపంతో కేకలు లంకించుకున్నాడు.”అలా అయితే ఫ్రెంచి రాయబారినో, రష్యన్ రాయబారినో కలవకపోయారా? ఇక్కడ అమెరికాలో రష్యన్లు ఎక్కువమంది లేరు. జర్మన్లు చాలామంది ఉన్నారు. మీతో మాట్లాడే తీరిక నాకు లేదు” అనేశాడు. తన్నుకొచ్చే కోపాన్ని దిగమింగుకుంటూ స్లీమన్ తక్షణమే బయటికి నడిచాడు. ఫిబ్రవరిలో న్యూయార్క్ లో ఫ్రాన్స్ కు వెళ్ళే ఓడ ఎక్కబోతూ తన చివరి ఉత్తరాన్ని ఆ ప్రష్యన్ రాయబారికే రాశాడు.  తను కలవడానికి వచ్చినప్పుడు ఎలా అవమానించిందీ, ఎలాంటి మాటలన్నదీ, తన ఆత్మాభిమానం ఎలా దెబ్బతిన్నదీ అందులో పూసగుచ్చినట్టు రాస్తూ తూలనాడాడు. చివరగా, “యువర్ ఎక్సెలెన్సీ, మీరు నాపట్ల చూపించిన దారుణ అమర్యాదే నా అమెరికా పర్యటన మొత్తంలో ఒక చేదుజ్ఞాపకంగా మిగిలిపోయిందని విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలోనూ సభ్యత, సంస్కారం, మర్యాద వెల్లివిరిసే దేశంగా అమెరికాను కలకాలం గుర్తుపెట్టుకుంటాను. కానీ, ఈ ప్రతి ఒక్కరిలోనూ మీరు మాత్రం ఉండరు” అని రాశాడు.

తిరిగి పారిస్ చేరుకున్నాడు. అప్పటికి ఫ్రాన్స్ క్షితిజాన్ని యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. భాషాశాస్త్ర అధ్యయనాన్ని పునఃప్రారంభించి ఎప్పటిలా సర్బాన్ యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లివస్తున్నాడు. థియేటర్ ను సందర్శిస్తున్నాడు. మరోవైపు మరిన్ని ఇళ్ళు కొంటూ ఇళ్ల యజమాని పాత్రనూ గొప్పగా రక్తి కట్టిస్తున్నాడు. గ్యాస్ బర్నర్లు, స్నానాల గదులు వగైరాల గురించిన తన అధ్యయన సమాచారంతో పేజీలకు పేజీలు నింపేస్తున్నాడు. అంతలోనే వీటన్నింటిపై విసుగు పుట్టింది. మరోసారి అతని జీవన దిక్సూచి చంచలించడం ప్రారంభించింది. తన జీవితమంతా కిరాయిదార్లకోసం మెరిసిపోయే స్నానాల తొట్టెలు, అద్దాలు కొనుగోలు చేయడంతో ముగిసిపోవలసిందేనా అనిపిస్తోంది.

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు. నీలాంటి ఓ అనుభవజ్ఞురాలితో కలసి ప్రపంచయాత్ర చేసే అవకాశాన్ని అదృష్టంగానే భావిస్తాను కానీ, ఒక సన్యాసినితో కలసి తిరగలేననీ, అంతకంటే దుర్భరస్థితి ఇంకొకటి ఉండదనీ, నీలాంటివాళ్లకు ఈ సువిశాల ప్రపంచం కన్నా ముక్కు మూసుకుని ఒక మూల కూర్చునే ఆశ్రమజీవితమే సరిపోతుందనీ నిష్టురమాడాడు.

సోఫీ స్లీమన్ కు ఆ ఉత్తరం చేరనేలేదు. సరిగ్గా అతనా ఉత్తరం రాసిన రోజునే ఆమె మరణించింది. ఆ కబురు తెలియగానే స్లీమన్ దుఃఖంలోనూ, పశ్చాత్తాపంలోనూ కూరుకుపోయాడు.

(సశేషం)

 

 

 

మీ మాటలు

  1. అజిత్ కుమార్ says:

    స్లీమన్ ఇంతగా ఉత్తమ గుణసంపన్నుడు కావడానికి ఆతని విద్య సహాయపడియుంటుంది. కేవలం ధనం మనిషికి గుణాన్ని ఇవ్వలేదు.స్లీమన్ జీవితం యువకులకు ఆదర్శం కావాలి.

మీ మాటలు

*