ఇదే మహాభారతం!

-జి ఎస్‌ రామ్మోహన్‌

~

 

rammohan

యవ్వన కాలపు పురాణ పఠనానుభవాన్ని రాస్తూ ఇంటలెక్చువల్‌ స్టిములేషన్‌, షీర్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌  అని రెండు పదాలు వాడారు అమర్త్య సేన్‌. వెటకారంగానైనా రెండోది మాత్రమే నిజం అనుకున్నట్టున్నారు  రంగనాయకమ్మ. అంత గాంభీర్యమేమీ అక్కర్లేదని తీర్మానించుకున్నారు.  మొగ్గా పువ్వూ లేని, కాయా పండూ లేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్దాల, కట్టుకథల పుక్కిటి పురాణాల పుట్ట! అని గుక్కతిప్పుకోకుండా శ్లోకం వలె చెప్పేశారు. భక్తి పూర్వకంగా ఎవరైనా అదాటున లోపలికి వెళ్లి ఆనక  చెంపలేసుకునే పరిస్థితి రాకుండా పుస్తకం ముఖచిత్రం మీదే అన్ని విశేషణాలూ అచ్చేశారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడడానికి భారతం రచయితలు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేశారో  అన్ని తీర్ల వారిని రంగనాయకమ్మ తిట్టిపోశారు.

‘కులాల గురించి నిర్భయంగా బరితెగించి చెప్పడమే ఈ రచనలో కనపడింది. బ్రాహ్మణులను పూజించండి! వేదాల్ని పూజించండి! అనే రెండు మాటలు తప్ప, ఆ మొత్తం కథల్లో మూడో మాట ఏదీ లేదు.! బ్రాహ్మణులను పూజించండి అన్న మాట బ్రాహ్మణులు చెప్పుకోవడమే కాదు, శూద్రులు కూడా అదే చెపుతారు! భారతంలో ఉన్న ప్రధానాంశం అంతా అదే” అని సారాంశాన్ని ముందుమాటలోనే ప్రకటించేశారు. ”నా వ్యాఖ్యానాలు నేను చేసుకున్నాను. కానీ కథలో వేలు పెట్టలేదు”. అని చెప్పారు. తన పద్ధతిలో పాటించారు కూడా. కాకపోతే మనం వాడే భాషలోనూ ధ్వనిలోనూ మన దృక్పథం ప్రతిఫలిస్తుంది. ఈ గ్రంధం రాయడం కోసం మూడు రకాల మూలాలను తీసుకున్నారు. మూడూ భక్తి సంప్రదాయంలోని వారు మౌలికమైనవిగా భావించేవే. నాస్తికులో హేతువాదులో రాసినవి కావు. ఒక రకంగా రంగనాయకమ్మ బండ చాకిరీ చేశారని చెప్పొచ్చు. దీనికోసమేనా ఇంత చాకిరీ చేసింది అనే విసుగులాంటి ధ్వని కూడా ఆమె వ్యాఖ్యానంలో ప్రతిఫలిస్తున్నదేమో అనిపిస్తుంది.

సావిత్రి తండ్రి ” కలిమికి సంతోషించనూ కూడదు, లేమికి విచారించనూ కూడదు” అన్నాడు అని రాసిన వెంటనే ‘అయితే కలిమీ-లేమి అని ఆ తేడాలెందుకు?’ అని వ్యాఖ్యానిస్తారు. సరైన తర్కాన్ని తిరస్కరించేంది ఏదైనా మూర్ఖత్వమే అని తర్క ప్రాధాన్యాన్ని ఒక చోట ఫుట్‌నోట్‌లో వివరించారు. తర్కం అన్ని వేళళా సరిపోతుందా అని అనుమానం.  విరాట పర్వంలోని   ఒక ఘట్టంలో పాండవులు  అజ్ఞాతవాసంలో ఎక్కడ తలదాచుకుని ఉండొచ్చు అని కౌరవులు చర్చిస్తా ఉంటారు. “ధర్మరాజు ఉన్న రాజ్యంలో పాడి సమృద్ధిగా ఉంటుంది. అన్ని దేశాలనూ పరిశీలిస్తే పాండవులు ఎక్కడ వున్నారో తెలిసిపోతుంది.” అని భీష్ముడు అన్న మాటను రాస్తారు. ఆ వెంటనే ”పాండవులు ధర్మాత్ములు అని ఒక పక్క చెపుతూనే ఫలానా రకంగా పరిశీలిస్తే పాండవులు దొరికిపోతారు అని ఇంకో పక్క చెపుతున్నాడు. రాజు చెప్పమన్నాడు కదా అని చెపుతున్నాను అంటున్నాడు. భీష్ముడు దుర్యోధనునికి జడవాలా..ఏం ఖర్మ” అంటూ వ్యాఖ్యానం చేస్తారు. భీష్ముడు అలా ప్రవర్తించడం న్యాయమని అనకపోయినా అలా ప్రవర్తించడాన్ని సమర్థించే రాజధర్మాలు అప్పటికే అక్కడ స్థిరపడి ఉన్నాయి. మొదటి పర్వాల్లోనే అది తేటతెల్లమైంది. మళ్లీ విరాట పర్వలోనూ ఆ ప్రశ్న వేస్తే అది సరైన తర్కం అవుతుందా!  ఆమె పాఠాన్ని అధ్యయనం చేసేటప్పుడు వ్యాఖ్యానించేటప్పుడు కాంటెక్ట్స్‌కి సరైన ప్రాధాన్యమిస్తారా అని అనుమానం. ”ఆవుల మందలను సుశర్మ తోలుకు రమ్మంటే తోలుకు పోవడం మొదలు పెట్టారు సైనికులు” అంటూ ఆ వెంటనే ‘రాజు ఏ పని చెయ్యమని చెప్తే ఆ పని ఉత్సాహంగా చేసేస్తారన్న మాట సైనికులు. సైనికుల అజ్ఞానమే శక్తి. రాజు శక్తి’ అని విసురు విసురుతారు. ఇది సరైన తర్కమేనా అని అనుమానం. అప్పుడైనా ఇప్పుడైనా రాజు లేదా ప్రభుత్వం మాట వినడం సైనికుల విధి. పాలిటిక్స్ ఇన్‌ కమాండ్‌ అని రంగనాయకమ్మగారికి మనం గుర్తుచేయనక్కర్లేదు.

samvedana logo copy(1)

“బౌద్ధమతమూ, జైనమతమూ వంటి మతాలు,హిందూ మతంలో ధర్మాల్నీ యాగాల్నీ వ్యతిరేకించాయనీ దాని వల్లనే హిందూ పండితులు తమ మతాన్ని దృఢతరం చేసుకోవడం కోసం ఈ భారతం రచనను ప్రారంభించి సాగించారనీ, హిందూ మతవాదులు చెపుతారు” అని రాశారు. రంగనాయకమ్మగారేనా ఇది రాసింది అని ఆశ్చర్యం కలిగించే మాట ఇది. ఆ రకమైన విశ్లేషణ చేసింది ప్రధానంగా ప్రజామేధావులు. హిందూ మతవాదులు కాదు. కోశాంబి అటువంటి వ్యాఖ్యానం చేశారు. ఆయన విశ్లేషణతో ఏకీభవిస్తూ అంబేద్కర్‌ మరికాస్త వివరించారు. ఇది వేర్వేరు రచయితల సృష్టి అని అంబేద్కర్‌ చెప్పారు. ప్రాచీనం అనే అమూర్త భావనను పూర్వపక్షం చేస్తూ ఇది గుప్తరాజైన బాలాదిత్య కాలంలో వచ్చిన గ్రంథంగా తేల్చారు. చాలామంది స్కాలర్ల మాదిరే ఆయన కూడా భగవద్గీత మీద ఎక్కువ దృష్టిపెట్టారు. బౌద్ధం తర్వాత ముఖ్యంగా అశోకుడి తర్వాత కుదేలైన హిందూమతం తదనంతర కాలంలో బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర కాలం నుంచి మళ్లీ తలెగరేసిందని ఆ పరిణామాల్లో భాగంగానే భగవద్గీత రూపొందిందని అంబేద్కర్‌ సాధికారంగా విశ్లేషించారు. భగవద్గీత హిందూ మతవాదుల ప్రతఘాత విప్లవపు తాత్విక సమర్థనా పత్రం  అని ఆయన తేల్చి చెప్పారు.

పేజీపేజీనా రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్యానాలతో విసుర్లతో పేచీపడాల్సిందేమీ లేదు. అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, శస్ర్తంతో ఛేదించబడదు అని ఆత్మభాషలో గంభీరంగా వినిపిస్తున్నపుడు పక్కనే ఎవరైనా అబ్బ ఛా అంటే బానే ఉంటుంది. కానీ అది సరిపోతుందా అని సందేహం. మహాభారతాన్ని ప్రత్యేకంగా భగవద్గీతను విశ్లేషించిన ప్రతి మేధావీ తన దృక్పథంలోంచి సీరియెస్‌గా విశ్లేషించే ప్రయత్నం చేశారు. గాంధీ అంబేద్కర్‌ ఇద్దరూ చెరోవైపున నిలబడి వ్యాఖ్యానం చేశారు. అంబేద్కర్‌ అందులో హింసను వర్ణాధిక్య సమర్థనను చూస్తే, గాంధీ తన భావజాలానికి అనువుగా అన్వయించుకుని సత్యానికి అహింసకు సంకేతంగా భాష్యం చెప్పారు. జంతుబలులకు వ్యతిరేకంగా దాన్ని నిర్వచించే ప్రయత్నం ఆశ్చర్యకరమైన రీతిలో చేశారు. అమర్త్యసేన్‌ దాన్ని విధికి-పర్యవసానాలకు మధ్య సంవాదంగా భావించారు. అణుబాంబు పితామహుడిగా చెప్పుకునే రాబర్ట్‌ ఆపెన్‌హైమర్‌కి అది వినాశనాన్ని తాత్వికంగా సమర్థించుకోవడానికి ఉపయోగపడే సంకేతంగా కనిపించింది. భగవద్గీత ప్రాచుర్యం దేశ సరిహద్దులు దాటి చాలాకాలమైంది. అదొక వ్యక్తిత్వ వికాస గ్రంథమని మేనేజ్‌ మెంట్‌ ఉద్గ్రంధమని ప్రచారంలో ఉంది. ఒక రకంగా గాంధీ కంటే ముందు విదేశాలకు భారత్‌ ఎగుమతి చేసిన అంశాల్లో యోగ-వాత్సాయన కామసూత్రాలతో పాటు భగవద్గీతను కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మన దృష్టిలో ఎలాగున్నా సమాజంలో దానికి అలాంటి ప్రాధాన్యమున్నపుడు దాన్ని విమర్శించే పద్ధతి ఎలా ఉండాలి?  రంగనాయకమ్మ ఎంచుకున్న టోన్‌ సరైనదేనా అని అనుమానం.

“భారతదేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మతగ్రంధాలు రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో ఉన్న నిజానిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి” అని చెప్పారు. ఇంకా “ఏ దేశం అయినా ఏయే తప్పుడు సంస్కృతుల్లో పీకలదాకా కూరుకుని ఉందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే వాళ్లు అదే రకం జీవితాల్లో ఉండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా ఉండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా ఉండలేరు.” అని తేల్చారు రంగనాయకమ్మ. కేవలం తర్కంతో చూస్తే ఎలా కనిపిస్తుందో కానీ ఇది కాస్త సంక్లిష్టమైన వ్యవహారం. మనుషుల ఆచరణలోని లోటుపాట్లకు జ్ఞానం ఉండడం లేకపోవడం అనేదే కారణమవుతుందా! అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాల పాత్ర, ఇంకా అనేకానేక అంశాల పాత్ర ఉండదా! తన గ్రంధ లక్ష్యాన్ని ఇంత భారీగా పెట్టుకోవడం అచారిత్రకమైన ఆశావాదమవదా!  కర్త కర్మ క్రియ అతడే, అతడి ఆజ్ఞలేనిది చీమైనా కదలలేదు అని చెపుతున్నవారికి మరి ఈ నేరాలు ఘోరాల మాటేమిటి? వాటికి కూడా ఆయనే బాధ్యుడు కదా? అనే ప్రాధమిక ప్రశ్నలు కూడా తలెత్తకుండా ఉంటాయని అనుకోగలమా! భక్తి విషయంలో మతం విషయంలో నిజానిజాల ప్రభావం ఎంత అనేది సంక్లిష్టమైన విషయం. అదలా ఉంచి, సాధారణ ప్రజలు అంటే తప్పుడు సంస్కృతుల్లో పీకలలోతు కూరుకుపోయిన ప్రజలు దీన్ని చదివి మారే అవకాశం ఎంత? అసలు మనిషి లోపలికి అడుగే పెట్టకుండా తలుపు దగ్గరే కాపు కాసి అంతపెద్ద విశేషాణాల సమ్మెటతో దెబ్బ వేశాక ఏ ధైర్యంతో వాళ్లు లోపలికి అడుగుపెట్టాలి? ఎక్కువలో ఎక్కువ అన్ని పురోగామి స్రవంతుల్లోని నాస్తికులే చదవాలి. అదొకరకంగా మోనోలాగ్‌ అవుతుంది. డీటైల్స్‌ మినహాయిస్తే వారైనా దీన్నుంచి కొత్తగా పొందే చైతన్యం ఏమిటి? కాబట్టి ఇది సరైన వ్యాఖ్యాన పద్దతే అవుతుందా అనేది ఆలోచించుకోవాల్సి ఉందేమో! వేరే ప్లేన్‌ ఎంచుకుని ఉండాల్సిందేమో!

ఈ అంశాలతో పాటు మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆ మధ్య కథా రచయితలు కొందరు కలిసినపుడు ఇపుడైతే రామాయణ విషవృక్షం సాధ్యమేనా అనే చర్చ వచ్చింది. హిందూత్వ ఉన్మాదం ఇంతగా పెచ్చుపెరిగిపోయి ప్రతీదీ వివాదమవుతున్న నేపధ్యంలో ఇపుడు అలాంటిది సాధ్యం కాదేమో అని అభిప్రాయం వెల్లడైంది. కానీ ఆ అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు. అలా నిరూపించినందుకు రంగనాయకమ్మకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్సులు.

*

 

మీ మాటలు

  1. rani siva sankara sarma says:

    వ్యాసం లో గంభీరమైన విశ్లేషణ ఉంది .రంగనాయకమ్మ రచనల పరిమితులని పట్టుకున్నారు.చివరి పేరా తర్కించ వలసిన విషయం.

  2. ranisiva sankara sarma says:

    గంభీరమైన విశ్లేషణ. రంగనాయకమ్మ పరిమితులని బాగా పట్టుకున్నారు.చివరి పేరా ప్రతేకంగా అలొచించతగినది.

  3. చాల చక్కగా చెప్పారు. నాకు బాగా నచ్హిన మాటలు ఇవి.

    “మనుషుల ఆచరణలోని లోటుపాట్లకు జ్ఞానం ఉండడం లేకపోవడం అనేదే కారణమవుతుందా! అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాల పాత్ర, ఇంకా అనేకానేక అంశాల పాత్ర ఉండదా! “

  4. G B Sastry says:

    శ్రీమతి రంగ నాయకమ్మ గారి లాంటి లబ్ధప్రతిస్టులు పనిగట్టుకుని వారి ఈనాటి ఆలోచనల ప్రకారం ఆనాటి గ్రంధాలను చీల్చి చెండాడడమ్ ఎంతవరకు సబబో నాకు అర్ధంకాదు.
    మన తీరులు,ఆలోచనలు,చేతలు ఎకాలానికి తగ్గట్టు ఆకాలంలో పాటించబడి అప్పటి అవసరాలను తీరుస్తాయి
    వాటికి అంతకు మించి విలువ ఇవ్వడం తర్కించడం వ్యర్ధమని నా ఉహ
    విష వృక్షాలు వమ్సవృక్షాలు తరిచేకన్న మంచిని( ఈకాలానికి ) హంసలా తీసుకుని చెడుని (ఈకాలానికి) వదులుకుని ముందుకు పోదాం మేలుగదా?

    • శాస్త్రి గారు శ్రీమతి అని మీరు రంగనాయకమ్మ గారిని అనటం సరి కాదు అవిడ రంగనాయకమ్మే

  5. Thirupalu says:

    మంచి విశ్లేషణ .
    //“మనుషుల ఆచరణలోని లోటుపాట్లకు జ్ఞానం ఉండడం లేకపోవడం అనేదే కారణమవుతుందా! అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాల పాత్ర, ఇంకా అనేకానేక అంశాల పాత్ర ఉండదా! “//
    ఇక్కడ ‘ జ్ఞానం’ అంటే చైతన్యం అని కదా అర్ధం? అది ఉన్నపుడు అలవాట్లు, అవసరాలు, ప్రయోజనాలు పాత్ర ముఖ్యత్వం మారుతుంది కదా?

  6. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    చక్కని విశ్లేషణ. మహా భారతం వంటి ఇతిహాసాలను విమర్శించాల్సి వచ్చినప్పుడు అవి రచించబడ్డ కాలాల్లో వాటి ప్రాధాన్యం, ప్రభావం ఏమిటనేది జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం. “ఒక రకంగా రంగనాయకమ్మ బండ చాకిరీ చేశారని చెప్పొచ్చు. దీనికోసమేనా ఇంత చాకిరీ చేసింది అనే విసుగులాంటి ధ్వని కూడా ఆమె వ్యాఖ్యానంలో ప్రతిఫలిస్తున్నదేమో అనిపిస్తుంది.” అని రామ్మోహన్ గారు చేసిన పరిశీలన రంగనాయకమ్మ గారి పుస్తకం చదివిన పాఠకుడికి కూడా కలుగుతుంది.
    గతంలో మహాభారతం పై పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అద్భుతమైన విమర్శన గ్రంధాలు వెలువరించారు. మహాభారత చరిత్రము, రాజసూయ రహస్యము అనే ఈ రెండు గ్రంధాలను విశాలాంధ్ర వారు ప్రచురించారు. ప్రాచీన ఇతిహాసాలను విమర్శించాలనుకొనే వారికి ఇవి మార్గదర్శన గ్రంధాలు. ఇలాంటివి చదవకుండా రంగనాయకమ్మ గారు ఇదండీ భారతం లాంటి ప్రయత్నం చేసుండాల్సింది కాదేమో ననిపిస్తోంది.
    రామ్మోహన్ గారి వ్యాసానికి మరోసారి అభినందనలు.

    • అవిడ మహాభారతం గురించి రాస్తారని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాము

  7. రామాయణ మహాభారతాలను రంగనాయకమ్మ చెండాడితే రంగనాయకమ్మ చెండాడిన విధాన్ని రామ్మోహనుడు చెండాడితే ఇలా చెండాడ్డానికి ఒక అంతుండదేమో అనిపిస్తోంది. ఈ లెక్కన మహాభారతం అలా ఉండటంలో తప్పేలేదు. తప్పులెంచడం అంటూ మొదలయ్యాక దానికో ఎండింగ్ అంటూ ఉండదని గ్రహించి ఇక్కడితో ఈ అంకగణితానికి ముగింపునిద్దాం.

  8. చందు తులసి says:

    రామ్మోహన్ సార్ ఎప్పటిలాగే ….లోతైన చర్చ చేశారు. కొత్త చర్చకు వేదిక సిద్ధం చేశారు.

    నాకు మొదట వచ్చే సందేహం ఏంటంటే ….ఇదండీ మహాభారతం రంగనాయకమ్మ గారు ఎప్పుడో రాయకుండా…ఇంతకాలం ఎందుకు వదిలేశారని. ఈ తరహా పుస్తకం ఓ ముప్పై ఏళ్లముందు వచ్చి ఉండాల్సింది.
    రామ్మోహన్ సార్ చెప్పినట్లు..ఇపుడైతే విషవృక్షం సాధ్యమా..? కాకపోవచ్చు.
    సాధ్యం కంటే కూడా అవసరం కాకపోవచ్చు..
    పుక్కిటి పురాణాల్ని……ఆదిమ యుగపు విలువలని… ఈనాటి విలువల కోణంలో పరీక్షిస్తే…ఫలితం దక్కదు. అసలు ప్రయత్నమే వృధా ప్రయాస. జీ.ఎస్. గారు చెప్పినట్లు గాడిద చాకిరి. రంగనాయకమ్మ గారే ఓ చోట అన్నట్లు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోక పోవడం.
    సమాజంలో మూఢనమ్మకాలు…..మొదలైన ప్రగతి నిరోధక భావజాలం అంతరించాల్సిందే..
    కానీ అందుకోసం ఈ మార్గం పనికిరాదు.
    బహుశా అందుకే విషవృక్షానికి వచ్చిన స్పందన రాలేదు. విషవృక్ష ఖండనలూ రాలేదు.
    లోకం చాలా మారింది. మనమూ మారదాం…

  9. Ramana Yadavalli says:

    ఒకప్పుడు ‘రామాయణ విషవృక్షం’ చాలా ఎంజాయ్ చేస్తూ చదివాను.
    ఈ పుస్తకం కొన్నాను గానీ.. చదవలేకపొయ్యాను.

  10. జె. యు. బి. వి. ప్రసాద్ says:

    ‘ఇదండీ మహా భారతం’ పుస్తకం మీద జి. ఎస్. రామమోహన్ చేసిన వ్యాఖ్యలు తర్క విరుద్ధంగా వున్నాయి.
    “‘తర్కం అన్ని వేళలా సరిపోతుందా’ అని అనుమానం” ప్రకటించారు. “అన్ని వేళలా తర్కించడం వల్లనే అన్ని వేళలా సత్యానికి చేరగలం” అని అర్థం చేసుకోవాలి. రామ్మోహన్ గారి వ్యాసంలో తర్క విరుద్ధాలు కొన్ని:

    1) మహా భారతాన్ని విమర్శించేటప్పుడు వెటకారం కూడదనీ, ‘గాంభీర్యం’ అవసరం అనీ, రామ్మోహన్ తీర్మానం. ప్రజలకి (స్వంత శ్రమ మీద జీవించే స్త్రీ, పురుషులందరికీ, కుల వివక్షతలతో బాధ పడేవారికీ) ఎందుకూ పనికిరాని గ్రంధాన్ని విమర్శించేటప్పుడు గాంభీర్యం ఏ మాత్రం పనికి రాదు. పరిహాసమే, వెటకారమే, సముచిత సత్కారం దానికి.

    2) “బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడడానికి భారతం రచయితలు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేశారో అన్ని తీర్ల వారిని రంగనాయకమ్మ తిట్టిపోశారు” అన్నారు రామ్మోహన్. మరి ఒక కులం ఆధిపత్యాన్ని కాపాడడానికి ఎన్ని తీర్లో ప్రయత్నించిన వారిని తిట్టిపోయాలా, నెత్తి మీద మోయాలా? గాంభీర్యంతో, “అయ్యో! వారు అలా రాయకుండా వుండ వలసింది. వర్ణ వ్యవస్థను కాపాడే ప్రయత్నం మంచిది కాదు సుమా!” అని గౌరవ పురస్కరంగా కైమోడ్పులతో, విమర్శించాలా?

    3) ‘మనం వాడే భాషలోనూ, ధ్వనిలోనూ మన దృక్పథం ప్రతిఫలిస్తుంది’ – అన్నారు రామ్మోహన్. వర్ణాశ్రమ ధర్మాల్ని నిర్లజ్జగా ప్రకటించిన భారతం వంటి దుర్మార్గ గ్రంధాన్ని ‘కొంత గాంభీర్యం’తో వెటకారం లేకుండా విమర్శించాలని చెపుతూ రామ్మోహన్ గారు వాడిన భాషలో ఆయన దృక్పథం చక్కగానే ప్రతిఫలిస్తోంది.

    4) భారతాన్ని విమర్శించడానికి, “ఒక రకంగా రంగనాయకమ్మ బండ చాకిరీ చేశారని చెప్పొచ్చు” అన్నారు రామ్మోహన్. అవును, వర్ణ వ్యవస్థనూ, వైదిక ధర్మాలనూ, సర్వ అసమానతలనూ ప్రచారం చేయడానికి వ్యాసుడూ, కవిత్రయమూ, వారికి వ్యాఖ్యానాలు రాసిన పండితులూ, వేల పేజీలతో బండ చాకిరీ చేసినప్పుడు, ప్రజలకు హాని చేసే గ్రంధాన్ని విమర్శించడానికి 500 పేజీల బండ చాకిరీ చాలా చిన్నదే. అవసరమైనదే! అది సారాంశంలో శ్రామిక జనాల ప్రయోజనాల కోసమే!

    5) రాజ ధర్మాల గురించి రంగనాయకమ్మ గారు ప్రశ్నిస్తే, ‘అది సరైన తర్కం అవుతుందా!’ అని ఆశ్చర్య పోతున్నారు. మొదటి పర్వాల్లోనే తేట తెల్లమై పోయిన రాజ ధర్మాల్ని, మళ్ళీ విరాట పర్వంలో కూడా భారతం కవి వాక్రుచ్చినప్పుడు, వాటిని మళ్ళీ ప్రశ్నించడం అవసరం కాదా? కవి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాడు?

    6) ‘సైనికుల అజ్ఞానమే రాజు శక్తి’ అని రంగనాయకమ్మ గారి ‘విసురు’ అంటూ, (అవును, విసురే. ఆమె ఒక వాస్తవాన్ని ‘విసిరారు’.) – ‘అది సర్వ కాలాల్లోనూ జరుగుతున్నదే కదా’ అంటున్నారు రామ్మోహన్. ఆ జరుగుతున్న ఆ దుర్మార్గ విషయాన్నే ఆమె స్పష్టం చేశారు.

    7) హిందూ మతాన్ని దృఢతరం చేసుకునేందుకు భారతం రచనను హిందూ పండితులు ప్రారంభించి సాగించారని రంగనాయకమ్మ గారు అనడం ఆశ్చర్యం కలిగిందనీ, అసలా విశ్లేషణ చేసింది ‘ప్రజా మేధావులు’ అనీ రామ్మోహన్ అంటున్నారు. ‘ఇదండీ మహా భారతం’లో 470వ పేజీలో, ఈ రకం విశ్లేషణం చేసింది, “తిరుపతి దేవస్థానం వారు” అని చాలా స్పష్టంగా వుంది. మరి, దేవస్థానం నియోగించిన పండితులు హిందూ పండితులా, ప్రజా పండితులా?

    8) ‘భారతం వేర్వేరు రచయితల సృష్టి అని అంబేద్కర్ చెప్పారు’ అని రామ్మోహన్ అన్నారు. భారతం గురించి ఎవరు ఎప్పుడు చెప్పారు – అనే వివరాల్లోకి వెళితే, చాలా చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకి, అంబేద్కర్‌కి ముందే పశ్చిమ దేశాల ఇండాలజిస్టులు చాలా చెప్పారు. పేర్లే కావాలంటే: హెర్మన్ ఓలైన్‌బెగ్‌, మోరిట్జ్ వింటర్‌నిట్జ్. ఎవరి పేర్ల ప్రస్తావనా లేకుండా (ఆ అవసరం లేదు కాబట్టి) ఇదే విషయాన్ని ‘ఇదండీ మహా భారతం’లో (471వ పేజీలో) చూడొచ్చు: “‘భారతం’ మీద, ఒక పరిశోధకుడి వ్యాఖ్య ఇలా వుంటుంది: ‘కవితా శక్తి లేని భక్తులూ, వంకర టింకరగా రాసే రచయితలూ (అన్‌పొయెటికల్ థియాలజిస్ట్స్ అండ్ క్లంజీ స్రైబ్స్) ఒకదానితో ఒకటి సంబంధం లేని కధనాల్ని విడివిడిగా ఒక వరసా వాయీ లేనిదానిగా, కుప్ప పోసినట్టు ఉంటుంది’ ఈ కావ్యం”.

    9) భారతం గుప్త రాజైన బాలాదిత్య కాలంలో వచ్చిందనీ, బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర కాలం నుంచీ హిందూ మతం మళ్ళీ తల ఎగరేసిందనీ, వగైరా వగైరా విషయాల్ని అంబేద్కర్ సాధికారంగా విశ్లేషించారని రామ్మోహన్ ప్రస్తావించారు. ‘ఇదండీ మహా భారతం’ ఉద్దేశం, ఏ రాజుల కాలంలో ఏ గ్రంధం వచ్చిందీ, హిందూ మతం ఎప్పుడు కుదేలైందీ, మళ్ళీ ఎప్పుడు తల ఎగరేసిందీ – అనేది తెలుసుకోమని చెప్పడం కాదు. పుస్తకం పేరు లోనే వుంది, భారతం ఎలా వుందో చూడమని! ఆ విషయాల మీదా, దాని విలువల మీదా చెప్పడమే దాని వుద్దేశం.

    10) “పేజీ పేజీనా రంగనాయకమ్మ చేసిన వ్యాఖ్యానాలతో విసుర్లతో పేచీ పడాల్సిందేమీ లేదు.” అంటున్నారు. ‘ఇదండీ మహా భారతం’ మీద పేచీయే లేకపోతే, దాని మీద ఈ వ్యతిరేకత ఎందుకూ? రామ్మోహన్‌కి భారతం పట్ల ఎలాంటి వైఖరి వున్నట్టు అనుకోవాలి?

    11) భగవద్గీతని “సీరియస్‌గా విశ్లేషించే ప్రయత్నం చేశారని” గాంధీనీ, అంబేద్కర్‌నీ ప్రస్తావించారు. ‘వర్ణ’ దృక్పధమే తప్ప, వర్గ దృక్పధం లేని ఆ విశ్లేషణలు ప్రజలకు చూపే దారి ఏమిటి? అవి సీరియస్ విశ్లేషణలా? ‘ఆ ఇద్దరూ తమ విశ్లేషణలు సీరియస్‌గానే చేసినా, మర్యాద గానే చేశారు. రంగనాయకమ్మ విశ్లేషణ అలా లేదు’ అని చెప్పడమే రామ్మోహన్ విశ్లేషణ. రంగనాయకమ్మది వర్గ దృష్టి! గాంధీకీ, అంబేద్కర్‌కీ లేని దృష్టి. అందుకే, “రంగనాయకమ్మ ఎంచుకున్న టోన్ సరైనదేనా” అనే అనుమానం వచ్చింది రామ్మోహన్‌కి. దుర్మార్గమైన విలువల్ని ప్రచారం చేసే గ్రంధ విషయంలో కూడా వ్యంగ్యమూ, వెటకారమూ అనే ‘టోన్’ లేని విమర్శనా పద్ధతిని పాటించాలనడం రామ్మోహన్ టోన్!

    12) “‘ఏ దేశం అయినా ఏయే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని ఉందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే వాళ్ళు అదే రకం జీవితాల్లో ఆనందంగా ఉండలేరు’ అని తేల్చారు రంగనాయకమ్మ. కేవలం తర్కంతో చూస్తే ఎలా కనిపిస్తుందో కానీ, ఇది కాస్త సంక్లిష్టమైన వ్యవహారం” అంటున్నారు రామ్మోహన్. విషయాల్ని వివరించడం ఇష్టం లేనప్పుడల్లా ‘సంక్లిష్టం’ అంటూ వుంటారు. (ఇటీజ్ నాట్ సో సింపుల్, యూ నో; ఇటీజ్ వెరీ కాంప్లెక్స్ – అనే మాటలు, వివరించడం చేతకానప్పుడల్లా ఇంగ్లీష్ మేధావుల్లోనూ చూడవచ్చు! తెలుగు మేధావుల్లో కొందరైతే, ‘శుద్ధ తర్కం అన్ని వేళలా పని చేయదు’ అంటారు, తర్కించడం చేతకానప్పుడల్లా!) కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి ప్రాధమిక ప్రశ్నలు కూడా తలెత్తకుండా వుంటాయా – అని ఆశ్చర్య పోతున్నారు రామ్మోహన్. ప్రాధమిక ప్రశ్నలైనా తలెత్తితే, తమకే ద్రోహం చేసే మత గ్రంధాలన్నిటికీ ప్రజలు అంతంత విలువలు ఎందుకు ఇస్తున్నారు? ఆ ప్రశ్నలు తలెత్తవు కనకనే, ఇలాంటి పుస్తకాల ద్వారా తలెత్తేలా చేయడం!

    13) సాధారణ ప్రజలు దీన్ని (‘ఇదండీ మహా భారతం’ పుస్తకాన్ని) చదివి మారే అవకాశం ఎంత? – అంటున్నారు. సాధారణ ప్రజల్ని సాంస్కృతిక రంగంలో చైతన్యవంతుల్ని చేయడానికి కృషి చేసే వ్యక్తులూ, బృందాలూ, సంస్థలూ, పూనుకుంటే మారే అవకాశం చాలా వుంది. ఈ రకం కృషి గతం నించీ జరగబట్టే కదా నాస్తికులూ, హేతువాదులూ, నవ్య మానవవాదులూ, కమ్యూనిస్టులూ అనే వాళ్ళు తయారైంది?

    14) పుస్తకం అట్ట మీదే పెద్ద విశేషణల సమ్మెటతో దెబ్బ వేశాక, ఇలాంటి పుస్తకం లోపలికి భక్తులు ఎలా అడుగు పెడతారు – అంటున్నారు. “శ్రీ మదాంధ్ర భారతము: ఒక వినమ్ర విమర్శనము” అని పేరు పెట్టాలా? ఒక భూస్వామిని భూస్వామి అనీ, ఒక పెట్టుబడిదారుణ్ణి పెట్టుబడిదారుడు అనీ అనక, ‘వ్యవసాయదారుడు’ అనీ, ‘పారిశ్రామికవేత్త’ అనీ అనడం వల్ల ప్రజలకు ఏమి నేర్పగలరు, ఎవరైనా?

    15) మహా అయితే నాస్తికులే ఈ పుస్తకం చదువుతారనీ, వాళ్ళు కొత్తగా పొందే చైతన్యం లేదనీ, కాబట్టి ఇది సరైన వ్యాఖ్యాన పద్ధతి కాదనీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు రామ్మోహన్. ఆ పద్ధతేమిటో ఆయన చెప్పలేదు. బండరాళ్ళ వంటి దుర్మార్గపు భావాల్ని (ఉదాహరణకి, పర పురుషుణ్ణి చూడగానే ప్రతీ ఆడదానికీ మదన భాగం ఏదో అవుతుందని చెప్పే నీచమైన భావాల్ని) క్రోధంతో, వ్యంగ్యంతో ఎదుర్కోవడం కాక, పూలు విసిరినట్టు వుండాలా వ్యాఖ్యాన పద్ధతి?

    16) ‘సీరియస్‌నెస్‌’ గురించీ, ‘టోన్’ గురించీ, ‘పెద్ద విశేషణాల’ గురించీ, రామ్మోహన్ గారి విమర్శలు చూశాక విమర్శనా పద్ధతి గురించి విమర్శకుల్లో వున్న ధోరణులు గుర్తు కొస్తాయి. విమర్శించ వల్సిందే గానీ, కొన్ని గ్రంధాల్నే, కొన్ని అంశాల్నే విమర్శించాలని కొందరూ, విమర్శ అంత తీవ్రంగా చేయకూడదని కొందరూ; ప్రశ్నించినా కొంత వరకే ప్రశ్నించాలని కొందరూ, పరిమితుల్ని ఆశిస్తారు. విమర్శనా పద్ధతినీ, పరిమితుల్నీ నిర్ణయించేది దేన్ని విమర్శిస్తున్నామో ఆ రచనకున్న స్వభావమే. అది దుర్మార్గమైతే తీవ్రంగానూ, తెలియని అమాయకత్వం అయితే ఓపిగ్గానూ, విమర్శలు వుండాలి.

    – జె. యు. బి. వి. ప్రసాద్

  11. rani siva sankara sarma says:

    హిట్లర్ దుర్మార్గాలపై పుస్తకం రాస్తే హిట్లర్ వెధవ అని పేరు పెట్టాలా? మార్క్సు అనుయాయి అని చెప్పుకునే రంగనాయకమ్మగారు మార్క్సు నుంచి పుస్తకాల పేర్లు పెట్టడం కుడా అలవారచుకోలేదు. చవకబారు సెన్సేషనల్ పధ్ధతి ఇది .సాధారణంగా చర్చకోసం కాక ఆవేశా కావేసాలని రెచ్చగొట్టడం కోసం హిందూ ఛాందసులు ఇటువంటి భాష వాడతారు. తిట్లు ఉపయోగించకుడదని కాదు.తిట్లు విస్లేషనగా పరిగణిచబడవు. .

  12. rani siva sankara sarma says:

    గ్రీకు పురాణాలు మానవజాతి బాల్యానికి చెందినవి గా మార్క్సు విశ్లేషించాడు. కాని అసంబద్ధతలని చూపుతూ తిట్టిపొయలెదు.బానిస వ్యవస్థని సమర్థించాడు కనుక అరిస్తాటిల్ని హేగెల్ని వెలి వేయాలని ఎవరూ అనలేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో రంగానాయకమ్మలు లేరు .ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండడం; సెక్సు ఆలోచనలని వ్యక్తం చేయడం తప్పు కాదు ఒప్పూ కాదు .ఆనాటి చారిత్రిక పరిస్తితి. భారతం చారిత్రిక పరిస్తితిని , బహుభర్త్రుత్వ పద్ధతిని అర్థం చేసుకోవడానికి హిమాల్యప్రంత ప్రజలని పరిశోధించాడు బైరప్ప. సజ్జలు తిని కాదు. కమ్యునిష్టు పడి కట్టు పదాలకి ఎవరూ డంగు అయిపోరు…

  13. @ చందు తులసి: >> బహుశా అందుకే విషవృక్షానికి వచ్చిన స్పందన రాలేదు. విషవృక్ష ఖండనలూ రాలేదు.>> అన్నారు మీరు.
    .
    ఇది వాస్తవం కాదు.
    .
    విషవృక్షంతో పోలిస్తే… అంత తీవ్రమైన విమర్శలూ, దుమారమూ ఈ పుస్తకానికి రాకపోవచ్చు. అంతమాత్రం చేత ఈ పుస్తకానికి స్పందన రాలేదనే అభిప్రాయం సరి కాదు. తెన్నేటి హేమలత అప్పట్లో విషవృక్షం ప్రతి భాగానికీ విమర్శ రాస్తానని ప్రకటించి, మొదటి భాగానికి మాత్రమే రాసి, ఊరుకున్నారు. ఆ అసంపూర్ణ ‘విషవృక్ష ఖండన’రచన వ్యక్తిగత విమర్శలతో నిండిన బలహీనమైన విమర్శ. ఇలాంటివో, మెరుగైనవో విమర్శలు ‘ఇదండీ మహాభారతం’పై కూడా వస్తాయేమో చూడాలి.
    .
    ఏ పుస్తకానికైనా ఆ పుస్తక విక్రయాలూ, పున: ప్రచురణలను పాఠకాదరణకు కొలమానంగా తీసుకోవచ్చు.
    .
    ‘రామాయణ విషవృక్షం’ మొదటి భాగం 1974లో వెలువడింది. 1000 కాపీలు అమ్ముడై రీ ప్రింట్ రావటానికి సంవత్సరం పట్టింది. దాంతో పోలిస్తే ‘ఇదండీ మహాభారతం’పుస్తకానికి పాఠకుల స్పందన మరెంతో ఎక్కువ లభించిందని చెప్పాలి. (1975, 1976లలో విషఃవృక్షం రెండు, మూడు భాగాలు వచ్చాయి.)
    .
    ‘ఇదండీ మహాభారతం’2014 డిసెంబరులో వెలువడింది. ఇంకా సంవత్సరం కాలేదు; ఇప్పటికి నాలుగు ముద్రణలు జరిగాయి. ఇప్పటివరకూ వేసిన కాపీలు 7,500. ఐదో ముద్రణ కొద్ది నెలల్లో రాబోతోంది. మొదటి ముద్రణ ప్రతులు 1500 విడుదలైన 15 రోజుల్లోనే అయిపోయాయి. రెండో ముద్రణ (జనవరి 2015) ప్రతులు కూడా అంతకంటే వేగంగా అయిపోయాయి. ఈ రెండో ముద్రణ నుంచీ 2,000 కాపీల చొప్పున వేస్తున్నారు.
    .
    ఆన్ లైన్ పాఠకులు కూడా ఎక్కువే చదివారీ పుస్తకాన్ని. నెలల తరబడి కినిగె టాప్ టెన్ జాబితాలో ఈ పుస్తకం ఉంటూ వచ్చింది,
    .
    విషవృక్షంతో పోలిస్తే ‘ఇదండీ మహాభారతం’ కొందరు పాఠకులకు అంత ఆసక్తికరంగా లేదనే అభిప్రాయం ఉంది. రామాయణం మొదటి నుంచీ చివరి వరకూ రాముడి గురించి చెప్పే కథ. మహాభారతంలో ఈ ఏకసూత్రత కనపడదు. వందలకొద్దీ ఉపాఖ్యానాలతో నడుస్తుంది. ఈ భేదం వల్ల కూడా ఆ పాఠకులకు ఇలా అనిపించివుండొచ్చు.
    .
    తర్కాన్నీ, చర్చనూ, విమర్శనూ స్వాగతించే పాఠకులు ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. లేకపోతే ఈ పుస్తకం ఇంత విజయవంతం అయివుండేది కాదు.

  14. చందు తులసి says:

    వేణు గారూ… నా ఉద్దేశం విషవృక్షం కాలం పరిస్థితులు వేరు..ఇవాళ్టి పరిస్థితులు వేరు అని.

    మీ లెక్క ప్రకారం ఐతే అవాళ జనాభాకి ….ఇవాళ జనాభాకి ఎంత తేడా ఉంది.
    ఆరోజు అక్షరాస్యుల కన్నా….. ఇవాళ చాలా పెరిగారు కదా….
    కాబట్టి ముద్రణల సంఖ్య కాదు…..ప్రభావం తక్కువ అనేది నా ఉద్దేశం.
    అంతే కానీ రచయితను తక్కువ చేయడం కాదు…

  15. rani siva sankara sarma says:

    పుస్తకాలు అమ్ముడు పోవడమే క్రయిటీరియానా ? అలాగయితే మార్క్సు కంటే రంగనాయకమ్మ రచనలు; అంతకంటే యండమూరి రచనలు బెస్ట్ సేల్లర్సు.

  16. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని సరిపుచ్చుకుంటే అందరికీ బావుంటుంది.
    కానీ ఒక మేము రామ రాజ్యం తెస్తాం, రాముడే మనకు ఈనాటికీ ఆదర్శం అంటే వచ్చే చిక్కువల్లే రంగనాయకమ్మ గారి రచన కూడా చదవదగ్గది.

  17. rani siva sankara sarma says:

    నేటి మతవాదాన్ని ఎదుర్కోవడానికి రంగనాయకమ్మగారి మొరటు తర్కం ఏమాత్రం పనికి రాదు.పైగా మతవాదులకిపరోక్షంగా ఉపకరిస్తుంది.తిట్ల దండకాలు కాదు. ఆలోచన పెంచే రచనలు కావాలి.

  18. @ rani siva sankara sarma : రచనలకు పేర్లు పెట్టటంలో ఒక్కో రచయితది ఒక్కో శైలి. కొంతమంది మార్మికంగా – అర్థం కాకుండా పెడతారు. కొంతమంది పుస్తక సారం స్పష్టంగా తెలిసేలా పెడతారు, ట్యాగ్ లైన్లు జోడించి.
    .
    మీ సంగతే చెప్పుకుంటే… ఓ తెలుగు పుస్తకం రాసి- పేరు మాత్రం ఆంగ్లంలో పెట్టేశారు. మరో పుస్తకానికి తెలుగు పేరు పెట్టినా ట్యాగ్ లైన్ ఇంగ్లిష్ లో పెట్టారు. ఇది ‘చవకబారు సెన్సేషనల్ పద్ధతి’ అంటే అది అన్యాయమైన విమర్శ అని మీకనిపిస్తుంది. అవునా?
    .
    పుస్తకాలకు పేర్లు పెట్టటంలో ఎవరి లెక్క వాళ్ళకి ఉంటుంది. ఎవరి పద్ధతి వారిది. (తెలుగు కథలకు రచయితలు సంస్కృతంలో, హిందీలో / ఉర్దూలో, ఆంగ్లంలో పేర్లు పెట్టటం ఎప్పటినుంచో ఉన్నదే.)
    .
    మీ మరో వ్యాఖ్య గురించి- పుస్తకాలు అమ్ముడుపోవటమే క్రైటీరియా అని నేను చెప్పలేదే? ‘ఇదండీ మహాభారతాని’కి స్పందన రాలేదనే అభిప్రాయం ఇక్కడ వచ్చింది కాబట్టి – ఆ వాదనను పూర్వపక్షం చేయటానికి పుస్తకాల అమ్మకాల తీరెలా ఉందో వివరంగా చెప్పాల్సివచ్చింది.

  19. rani siva sankara sarma says:

    పుస్తకాల పేర్లలో ఏభాష వాడినా ఒకటే. ఎటువంటి భాష వాడాలనేది మార్క్సు లాంటి మేధావుల నుంచి రంగనాయకమ్మ గారు నెర్చుకోవాలి. క్షణిక ఆవేశం కాదు ఆలోచన కలిగించాలి.

  20. పాపం ఈవిడ తర్కం రామాయణ, భారతాల వరకే పరిమితం చేసినట్లున్నారు. కాస్త ఓపిక చేసుకుని ఈవిడ ఖురాన్, బైబెల్ , బౌద్ధ, జైన , సిక్కు మతాల గ్రంధాలూ కూడా ఇదే దృష్టి తో రాస్తే చాలా బావుంటుంది కదా !! మత గురువులు చెప్పినవి ఇంత అందంగా ఉండవు కదా !! అందరం చాలా సంతోషిస్తాము :)

    • మహాభారతాన్ని ఏ దృష్టితో చూస్తే అలాగే కనపడుతుందని నన్నయగారే వ్రాశారు ఒక పద్యంలో. నాకు తెలిసి మహాభారతం ఎవరికీ ఏ సందేశాలూ ఇవ్వదు. అలాంటిది ఇస్తామని దాని రచయితలు కంకణం కట్టుకున్నట్లు కనిపించదు. అదో పెద్ద సాంస్కృతిక సంపుటం. నాానా కాలాలకీ, ప్రాంతాలకీ చెందిన కథలన్నీ ఒకచోట కూర్చారు. అంతే! 5000 సంవత్సరాల క్రితం ఇండియాలో ఒక పెద్ద యుద్ధమేదో జరిగింది రాజులందరి మధ్యా. ఆ కథని ఆధారంగా చేసుకొని దాని ద్వారా చెప్పదల్చుకున్నదంతా చెప్పారు రచయితలు.

      పార్టీలూ, ఐడియాలజీలూ తమ భావజాల వ్యాప్తి కోసం fence-sitters (దేబికీ చెందనివాళ్ళు) అనే బలహీన మనస్కులైన జనాభాని తమకేసి తిప్పుకోవడం కోసం కష్టపడుతూంటాయి.. ఎన్నికల్లో పార్టీల గెల్పోటముల్ని నిర్దేశించేది కూడా ఈ జనాభాయే. వీళ్ళని ఇంప్రెస్ చేస్తే చాలు. కరుడుగట్టిన మద్దతుదార్లు ఎలాగూ అనుకూలంగానే ఉంటారు. కరుడుగట్టిన వ్యతిరేకులేమో ఎలాగూ వ్యతిరేకంగానే ఉంటారు. మార్చుకోగలిగిందల్లా పైన చెప్పిన అజ్ఞాన జనాభానే.

      • ఆవిడ రామాయణ, భారతాలు చదవటమే ఎద్దేవా చేయడం కోసం!! అలాంటప్పుడు ఆవిడకి అందులో మంచి ఏం కన్పిస్తుంది. ఈవిడ రాసినది చదివి సగం అర్ధం చేసుకునే వాడు ధర్మరాజంతటి వాడు జూదం ఆడాడు నేను ఆడితే తప్పేముంది అనుకుని ఆడటం మొదలుపెడతాడు. మాములుగానే ఆడవార్ని ఏడిపించే వారైతే ఇంక వాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ నాస్తికత్వం పేరుతో సమాజానికి సేవ చేయకపోతే పోయారు ఇలా మనుషుల్ని రెచ్చకొట్టకుండా ఉండచ్చు కదా!! ఎవడైనా రామాయణ, భారతాల నుంచి కాస్త మంచి చెప్పగానే హిందూ గురువు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటారు ఇలాంటి వాళ్ళు .

    • చంద్రికగారన్నది బావుంది.

    • Dr. Rajendra Prasad Chimata. says:

      మీకు నిజంగా బైబుల్ ఖురాన్ ల మీద చదవాలని ఉంటే రిఛర్డ్ డాకిన్స్ ,విక్టర్ స్టెంజర్ ( God the failed Hypothesis, God delusion ) రాసిన పుస్తకాలు చదవండి. అవన్నీ కూడా ఎంత నాన్సెన్సో అర్థమౌతుంది !!

  21. ప్రభాకర్ says:

    రమణ యడవల్లి గారూ, మీతో ఏకీభవిస్తున్నాను. విష వృక్షం నాటికీ, ఇదీ భారతం నాటికీ రంగనాయకమ్మ గారి విమర్శ లో పదును తగ్గిందనిపించింది. అది భారతంలోని అనేక కోణాల వల్ల కావొచ్చేమో కూడా! కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మన అభిప్రాయాలు చెప్పినా కూడా రంగనాయకమ్మ గారి తరఫున తగాదాకి దిగేట్లు గా ఉన్నారు కొందరు! కవర్ పేజీ బాలేదంటే తగాదా, పేరు సరిగా పెట్టలేదంటే ఎదురు దాడి, విష వృక్షానికి వచ్చినంత స్పందన రాలేదంటే తగాదా, ఎన్ని ముద్రణలు పడ్డాయి, ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయాయో స్టాటిస్టిక్స్ ఇవ్వడం, ఇలా ఉంది!

    అమ్ముడు పోయిన పుస్తకాలన్నీ చదవాలని లేదు! విషవృక్షం ప్రభావంతోనే ఈ పుస్తకాన్ని కొన్న వారిలో చాలా మంది ఇలాగే భావించి ఉండొచ్చు. కొని, నచ్చక మూల పడేసిన పుస్తకాల జాబితాలో ఈ పుస్తకం ఉండదని హామీ లేదుగా !ఏదేమైనా విష వృక్షానికి వచ్చిన పాఠకుల స్పందన ఈ పుస్తకానికి రాలేదనేది సత్యం

    చంద్రిక గారు చెప్పిన పాయింట్ మీద ఈ తగాదాకి దిగే వారు మౌనంగా ఉంటారు.నోరు పెగల్దు

  22. జె. యు. బి. వి. ప్రసాద్
    OCTOBER 18, 2015 AT 8:40 PM
    Statement1).ప్రజలకి (స్వంత శ్రమ మీద జీవించే స్త్రీ, పురుషులందరికీ, కుల వివక్షతలతో బాధ పడేవారికీ) ఎందుకూ పనికిరాని గ్రంధాన్ని విమర్శించేటప్పుడు గాంభీర్యం ఏ మాత్రం పనికి రాదు. పరిహాసమే, వెటకారమే, సముచిత సత్కారం దానికి.
    Objection1). ఎందుకూ పనికిరానిది అయితే ఆవిడ పనిగట్టుకుని వెక్కిరించి వూడబొడిచేది ఏముంటుందండీ!హందువులు దాన్ని నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్నారు గాబట్టే కొన్ని వందల యేళ్ళ క్రితపు గ్రంధం తరాలకు తరాలు గుర్తు చేస్సుకుంటూ వస్తే ఇప్పటికీ నిలిచి ఉంది.దాన్ని అక్కణ్ణించి లాగేస్తే తప్ప హిందువుల్ని బలహీనపరచటం కుదరదు గనకనే అంత బందచాకిరీ చేసింది,కాదంటారా?
    Statement 2). విషయాల్ని వివరించడం ఇష్టం లేనప్పుడల్లా ‘సంక్లిష్టం’ అంటూ వుంటారు. (ఇటీజ్ నాట్ సో సింపుల్, యూ నో; ఇటీజ్ వెరీ కాంప్లెక్స్ – అనే మాటలు, వివరించడం చేతకానప్పుడల్లా ఇంగ్లీష్ మేధావుల్లోనూ చూడవచ్చు!
    Objection2). ఇప్పటికిప్పుడు,ఇక్కడికిక్కడ నాకు కమ్యునిష్టు మ్యానిఫెస్టో యొక్క సారం మొత్తాన్నీ నాలుగైదు ముక్కల్లో తేల్చి చెప్పమని మిమ్మల్నే చాలంజి చేస్తాను. అదే ముక్క మీరూ అనకుండా గతితార్కికభౌతికవాదం మొత్తానీ నాలుగైదు పేరాలకి కుదించి చెప్పగలరా?
    Statement3). వర్ణాశ్రమ ధర్మాల్ని నిర్లజ్జగా ప్రకటించిన భారతం వంటి దుర్మార్గ గ్రంధాన్ని ‘కొంత గాంభీర్యం’తో వెటకారం లేకుండా విమర్శించాలని చెపుతూ రామ్మోహన్ గారు వాడిన భాషలో ఆయన దృక్పథం చక్కగానే ప్రతిఫలిస్తోంది.
    Objection2). వర్ణాశ్రమ ధర్మాలు తప్పు అయితే మరి ఏది ఒప్పు అవుతుందో ఆవిడ ఇక్కడికి రాదు గానీ ఆవిణ్ణి సమర్ధిస్తున్న మీరి చెప్పగలరా?రష్యా, చైనా అనే రెండు కమ్యూనిష్టు దేశాల లోనూ రాజ్యం ఉంది!పై స్థాయిలో లెనిన్, స్టాలిన్,మావో మరొకరు ఉన్నారు,వారు కూడా ఇతర దేశాల మీద యుద్ధాలు చేశారు.విప్లవ ద్రోహులని పేరు పెట్టి తమ దేశపౌరుల్నే లక్షల సంఖ్యల్లో వధించాదు – ఎడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టినట్టు కాకుండా అంతకన్న ఉన్నతమైన దాన్ని ఏదయినా ప్రతిపాదించ్చి చూపించారా శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ గార్?ఒకదాన్ని తప్పుగా ఉందని అనేవాడికి తప్పనిసరిగా అంతకన్న గొప్పగా ఉండేదాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంది,ఉంటుంది,ఉండాలి!ఆవిడ రచనల్లో గానీ మీ వాదనలో గానీ ఆ బాధ్యత ఉందా?

  23. ఒఖప్పుడు మొగుళ్లని పొలాలకి సద్దికూడు తగలేసి పొలాలకి పంపించటం అయిపోయాక గుమ్మాల దగ్గిరా గోడల పక్కనా జేరి పక్కవీధిలో లేచిపోయిన కరణం గారమ్మాయి గురించీ మెరక వీధిలో రంకుతనం చేస్తున్న సుబ్బరాజు పెళ్ళాం గురించీ బుగ్గలు నొక్కుకుంటూ మెటికలు విరుస్తూ మాట్లాడుకునే ఆడంగులు అవి మాట్లాడుకునేటప్పుడు చాలా గంభీరంగా ఉంటారు,ఎంతో వుద్రేకపడిపోతారు,పైగా తమ కబుర్లవల్లే నీతి నిలబడుతున్నదని గాఢంగా నమ్ముతారు – కానీ వీళ్ళిలా మాట్లాడుకుంటున్నప్పుడూ తర్వాతా కూడా జరిగేవి జరుగుతూనే ఉంటాయి,ఒక్కోసారి పట్టుబడేవాళ్లలో వీళ్ళు కూడా ఉంటారు!ఆ రకం చవకబారు మనస్తత్వం ఉన్నవాళ్ళకి ఈవిడ రచనలు బావుంటాయి.చదివి నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాని ఈ చెత్త కబుర్లు మార్క్సిస్టు సిద్ధాంత ప్రభావితమైన సాహితీ విమర్శ అని ఎవ్వరూ పొరబడకుందురు గాక!

  24. కె.కె. రామయ్య says:

    రంగనాయకమ్మ గారి “ఇదండి మహాభారతం!” పుస్తక సమీక్ష చేసిన జి ఎస్‌ రామ్మోహన్‌ గారికి, రామ్మోహన్‌ గారి వ్యాఖ్యల్ని తర్కించిన
    జె. యు. బి. వి. ప్రసాద్ గారికి; …. తర్కాన్నీ, చర్చనూ, విమర్శనూ స్వాగతించే పాఠకులు ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు అని సహేతుకంగా వివరించిన వేణు గారికి ధన్యవాదాలు.

  25. chandolu chandrasekhar says:

    జి .ఎస్ రామ్మోహన్ , రంగనాయకమ్మ పుస్తకాన్ని సమీక్షా చేసారా ! నమ్మశక్యం కాని మాట .నేను ఆపుస్తకాన్ని కొని చదివాను ,జి .ఎస్ గారికి ఆమె పుస్తకమే అర్దం కాలేదు .ఆమె ఎస్ .కే గంగూలి ఇంగ్లీష్ ఎడిషన్ ,పురిపండ వారి వ్యావహారిక భరతం ,నన్నయ్య భరతం .చదివి దాని మిద కామెంట్స్ చేసుకుంటూ వెళ్లారు .పాపం ఈయన ఏమి సమిక్ష్ చేసేరో ,ఇదండి మహాభారతం చదిన వారికి ఈయన సమిక్ష్ వారికి భోధ పడుతుంది .ఈ మద్య పూరి అనే సినిమా దర్శకుడు ఆమె బాగా వుంది అన్నాడు .ఇక్కడ పురాణాలని విశ్లేషణ చేసే పద్దతులు రెండు వుంటై .ఒకటి డి .డి .కోశాంబి పద్దతి ఈ కథలకి మూల మేమిటి ,రెండో పద్దతి కథ నే తప్పు పట్టటం రంగనాయకమ్మ పద్దతి .ఉదాహరణ ;వరాల వల్లా పిల్లలెల పుడతారు. రెండోది , స్త్రీ కి మాత్రు త్య స్తానాన్ని ఇ వ్య టానికి అప్పటి పురుష ప్రపంచం ఒప్పుకోలేదు .స్త్రీ పురుడికి జన్మ ఇ వ్యటం అంటే ఆమె ఆధిపత్యాన్ని అంగీకారం తెలపడమే .ఇది లోతెయన చర్చ .రంగనాయకమ్మ లోతులోకి వెళ్ళకుండా ,అసలు కథనే తప్పు అని చెప్పదలసుకున్నారు .ఇంతఓపిక జి.ఎస్ గారిక లేక పాపం ఆమె మిద ఒక రాయి వేసారు , అది చూసి అందరు ఆమె మిద ఒక రాయి వేస్తున్నారు .కొండ ను తొవ్యి ఎలుక తోక కూడా పట్టు కోలేక పోయారు ,జి .ఎస్ .

  26. CHANDOLU CHANDRASEKHAR
    APRIL 27, 2016 AT 6:37 AM
    False Statement1.స్త్రీ కి మాత్రు త్య స్తానాన్ని ఇ వ్య టానికి అప్పటి పురుష ప్రపంచం ఒప్పుకోలేదు .
    False Statement2.స్త్రీ పురుడికి జన్మ ఇ వ్యటం అంటే ఆమె ఆధిపత్యాన్ని అంగీకారం తెలపడమే
    HARIBABU
    Sincere Answer1: పాండురాజుకి సంతాన యోగ్యత లేదు,కానీ సంతానం కావాలి!వరాలూ,దేవతలూ,సద్యోగర్భాలూ అందమైన కల్పనలుగా తీసుకుంటే పాండురాజు అనుమతితో వేరెవరితోనో సంతానాన్ని కన్నది.అనుమతి అనగానే మీరు పురుషుడు అధికుడు గాబట్టే అనుమతి తీసుకున్నాది అని అర్ధం పీకితే మీ సంస్కారానికి ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప నేను చెయ్యగలిగినది లేదు.పెళ్ళి అనేది మీకు అర్ధం అయినంతవరకు కామం తీర్చుకోవడమే కాబోలు!కానీ సంప్రదాయ ప్రకారం వివాహం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంతానం.ఆ అసంతానలేమిని పోగొట్టుకోవడానికి ఇవ్వాళ్తి వాళ్ళు సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ తిరుగుతూ లక్షలకి లక్షలు తగలెయ్యడం దగ్గిర్నుంచీ సర్రోగేట్ మదర్సుని వెతుక్కోవడం వరకూ పడరాని పాట్లు పడుతున్నట్టే వాల్ళు కూడా కొన్ని ఎడ్జస్తూమెంట్లు చేసుకున్నారు. మాంసం తింటున్నామని ఎముకలు మెదలో వేసుకు తిరగనట్టే సాహిత్యరూపం కాబట్టి కొన్ని కల్పనల్ని చేశారు.ఇవ్వాళ వేరే విధంగా పిల్లల్ని కన్నవాళ్ళు మేము ఫలానా సర్రోగేట్ మదర్ని వాడుకుని పిల్లల్ని కన్నాం అని డప్పు వేసుకోవటం లేదు,అవునా?ఇదంతా స్త్రీకి గర్భధారణ మీద ఉన్న అధికారానికి గౌరవం ఇవ్వటమే కదా!ఎవరితో కన్నా వాళ్ళు కౌంతేయులు అయ్యారు,పాండురాజ నందనులు అయ్యారు.ఇక్కడే బ్లాగుల్లో మరొకచోట ఒకాయన క్షేతర బీజ ప్రాధాన్యం అనే మాట్ వాడగానే బూతులకి కూడా లంకించుకున్నారు – ఇక్కడ కూడా అదే స్థాయిలో వాదించరని భావిస్తున్నాను.ధరం,అర్ధ,కామ,మోక్షమూలకు సంబంధిన యే కార్యాన్ని అయినా నా భాగస్వామితోనే చేస్తాను అనేది వివాహంలో స్త్రీ పురుషుఇద్దరూ చహేసే ప్రమాణం.అది వివాహ జీవితంలో ఉండాల్సిన పవిత్రతకి సంబంధించిన ముఖ్యమైన సూత్రం.ఎవరు తప్పినా తప్పే!సదలింపు కావాలంటే రెందవ భాగస్వామి అనుమతి తప్పనిసరి!సంతానానికి క్షేత్రమే ప్రధానం అంటే తల్లికే ప్రాధాన్యత ఇచ్చారు.చాలా? పిల్లలు లేనివాళ్ళు పిలల్ల కోసం పదే తాపత్రయాన్ని మనచుట్టూ చూస్తూ కూడా అలాంటి సన్నివేశాల చుట్టూ ద్వేషపాండిత్యాన్ని ప్రదర్శించటం నిజంగా క్రూరత్వమే!
    Sincere Query2: ఇది ధర్మశాస్త్రాలలో ఉన్నట్టు మీరు భావిస్తూ చెప్తున్నదా?మీ సొంత ప్రతిపాదనా?కొంచెం తిరకాసుగా ఉందీ ప్రతిపాదన!అసలు స్త్రీ పురుషుడి ద్వారా పిల్లల్ని కనడమే పురుషుడి అధిపత్యానికి లొంగినట్టు తీర్మానిస్తున్నట్టు గానూ కాదు,కేవలం పురుష సంతానాన్ని కనడమే బానిసత్వం అంటున్నట్టుగానూ గందరగోళంగా ఉంది ప్రతిపాదన.మీ భావం ఏమిటో కొంచెం స్పష్టంగ అచెప్పగలరా?

  27. జె. యు. బి. వి. ప్రసాద్
    OCTOBER 18, 2015 AT 8:40 PM
    6) ‘సైనికుల అజ్ఞానమే రాజు శక్తి’ అని రంగనాయకమ్మ గారి ‘విసురు’ అంటూ, (అవును, విసురే. ఆమె ఒక వాస్తవాన్ని ‘విసిరారు’.) – ‘అది సర్వ కాలాల్లోనూ జరుగుతున్నదే కదా’ అంటున్నారు రామ్మోహన్. ఆ జరుగుతున్న ఆ దుర్మార్గ విషయాన్నే ఆమె స్పష్టం చేశారు.
    HARIBABU
    సైన్యంలో చేరేవాళ్ళు అజ్ఞానులా?కనీసపు లోకజ్ఞానం ఉన్నవాడెవడయినా ఈమాట అనగలడా!ఇప్పటికిప్పుడు మీరో నేనో సైన్యంలో చేరగలమా?
    *
    ఎత్తు,బరువు,తెగువ కొలతలు కొలిచి చూస్తారే!అప్లికేషన్ పెట్టుకున్న ప్రతివాణ్ణీ వీడిలో అజ్ఞానం ఎంత ఎక్కువ ఉంది అని చూసి అజ్ఞానం మోతాదు అధారంగా సెలక్టు చేస్తారా?
    ఆయుధప్రయోగం అజ్ఞాని చెయ్యగలడా?దానికి జ్ఞానం అక్కర్లేదా?ఆదర్శం,దేశభక్తి,సరిహద్దుల రక్షణ లాంటి మీకు నచ్చని పిచ్చి పనులు అక్కడ ఉన్నాయి,నిజమే!కానీ, చంపడానికీ చావడానికీ సిద్ధపడి వెళ్ళేవాడు అజ్ఞానియా?అదీ రెండు మూడు రోజులు హాలిడే స్పాట్ చూసుకుని ఇలా వెళ్ళి అలా వచ్చినట్టు గాక ఒక జీవితకాలం ఆపని చెయ్యాలని తెలిసి కూడా వెళ్లేవాడు అజ్ఞానియా?
    *
    ఇప్పుదంటే రూల్సు మారాయి గానీ ఒకప్పుడు యుద్ధంలో గెలిస్తే రాజు ఖజానాని పట్టేవాడు,సైనికులు వూళ్ళ మీద పడేవాళ్ళు!రుద్రమదేవీ,కృష్ణదేవరాయలూ లాంటివాళ్ళు ఖజానా నుంచే సైనికులకి కొంత ఇచ్చి ఇటువంటివి ఎంకరేజ్ చెయ్యలేదని అంటారు.రాజుకి ఆ మంచితనం లేకపోతే జరిగే సైనికుల భీబత్సాలకి జడిసే అప్పటి పజలు తమ రాజే గెలవాలని కోరుకునేవాళ్ళు,రాజభక్తి కూడా దానినుంచే పుట్టింది,ఇది కూడా తెలియదా మీ అభిమాన్ రచయిత్రికి?మరీ ఇంత అజ్ఞానమా!
    *
    ఇటువంటి చెత్తమాటలకి టెంత్ క్లాస్ తర్వాత చరిత్ర చదవని మీలాంటివాళ్ళు చప్పట్లు కొట్టి పులకించి పొండి1కానీ, మాలాంటివాళ్ళకి మాత్రం చెవుల్లో పువ్వులు పెట్టటానికి ప్రయత్నించకండి!తప్పులు చెబుతుంటే రాళ్ళు విసరడమా?దేనిగురించీ ఏమీ తెలియకుండానే అన్నిటి గురించీ అన్నీ తెలిసినట్టు రాళ్ళు విసురుతున్నది ఎవరు?విసిరిన రాళ్ళు అన్నీ బూమరాంగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానపు సముద్రంలో ఈదులాడుతున్నది ఎవరు?
    *
    పదాతి స్థాయిలో చేరి దళపతి,చమూపతి ర్యాంకులు దాటుకుని సైన్యాధిపతి అయి రాజు అసమర్ధుడైతే లేపేసి తన పేరుతో కొత్త రాజవంశలని యేర్పరుచుకునే వీలున్న ఒక లాభసాటి ప్రొఫెషన్ అది అప్పట్లో!పిచ్చి కబుర్లు చెప్పేవాళ్ళకి చెక్క భజన్లు చేసేవాళు అభిమానులు – దొందూ దొందే:-)
    P.S: ఇటు అడాల్ఫ్ హిట్లరూ అటు జోసెఫ్ స్టాలినూ మిలిట్రీ యూనిఫారముల్లో ఎందుకు కనబడుతున్నారు నాయనా!అదేమైన అడృఅస్సు బాగుందని తొడుక్కున్న ముచ్చటా?

  28. విషవృక్షం కానివ్వండి, మహాభారతం కానివ్వండి ఆవిడ వ్రాసి మంచిపనే చేశారు. పాత పాట గుర్తుందా? “ఆ రాజుకు రాణులు ముగ్గురు కౌసల్యా… సుమిత్రా… కైకేయి..” అంటూ సాగుతుంది (దశరధుడి భార్యల సంఖ్య 353). ఆవిడ ఇలాంటి మరుగుపరచబడిన విషయాలను జనసామాన్యానికి పరిచయంచేసి, రామభక్తులను defenseలో పడేశారు. ఆవిడ చేసిన వ్యంగ్యం ఆవిడ స్థాయికి తగనిదైనా మంచి ప్రశ్నలే రేకెత్తించారు. వ్యంగ్యమెప్పుడూ తిరుగులేని ఆయుధం. ఒక సీరియస్ విమర్శ చెయ్యలేని పనిని satire చాలా సులభంగా మరియు ప్రభావవంతంగా చెయ్యగలదు. దానికి విషవృక్షమే ఋజువు.

    • వ్యంగ్యం చేయడానికి ఎలాంటి స్తాయి కావాలంటారు? నేనే మి రంగనాయకమ్మ గారి అభి మానినివకాదులేండి.

      • నేను కూడా కాదు (ఆ విషయం నా క్రిందటి వ్యాఖ్యలో పరోక్షంగా కనిపిస్తుంది). So what?నేను కూడా కాదు (ఆ విషయం నా క్రిందటి వ్యాఖ్యలో పరోక్షంగా కనిపిస్తుంది). So what?

  29. @Hari Babu

    సైనికులకుండాల్సిన అర్హత దేహ దారుఢ్యం, చెప్పిన ఆజ్ఞలను తు.చ. లు తప్పక పాటించగల ‘తనం’. తనకంటూ conscious ఉన్నవాడు మంచి సైనికుడు కాజాలడు. ఒకవేళ అలాంటిదేమైనా మిగిలుంటే దాన్ని పీక పిసికి చంపెయ్యడానికే Drils ఉంటాయి సైన్యంలో.

    “ఇప్పటికిప్పుడు మీరో నేనో సైన్యంలో చేరగలమా?”

    చేరలేం. కానీ మనిద్దరం పదీతరగతి తరువాత ప్రయత్నించుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేరుండేవాళ్ళం. ఇప్పుడు మనకు ఉండకూడనిది ఒకటుంది -knowledge, ఉండాల్సిందొకటి లేదు -fitness.

    The worst outcrop of herd life [is] the military system, which I abhor. That a man can take pleasure in marching in fours to the strains of a band is enough to make me despise him. He has only been given his big brain by mistake; unprotected spinal marrow was all he needed. This plague-spot of civilization ought to be abolished with all possible speed. Heroism on command, senseless violence, and all the loathsome nonsense that goes by the name of patriotism – how passionately I hate them! How vile and despicable war seems to me! I would rather be hacked in pieces than take part in such an abominable business.

    Albert Einstein (1879 – 1955)

  30. I
    APRIL 29, 2016 AT 5:45 PM
    Point1:
    సైనికులకుండాల్సిన అర్హత దేహ దారుఢ్యం, చెప్పిన ఆజ్ఞలను తు.చ. లు తప్పక పాటించగల ‘తనం’. తనకంటూ conscious ఉన్నవాడు మంచి సైనికుడు కాజాలడు. ఒకవేళ అలాంటిదేమైనా మిగిలుంటే దాన్ని పీక పిసికి చంపెయ్యడానికే Drils ఉంటాయి సైన్యంలో.
    “ఇప్పటికిప్పుడు మీరో నేనో సైన్యంలో చేరగలమా?”
    చేరలేం. కానీ మనిద్దరం పదీతరగతి తరువాత ప్రయత్నించుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేరుండేవాళ్ళం. ఇప్పుడు మనకు ఉండకూడనిది ఒకటుంది -knowledge, ఉండాల్సిందొకటి లేదు -fitness.
    HARIBABU
    మొత్తానికి సారు ఇంకా సైన్యం అనవసరం అనే పాయింటుమీదనే ఘాఠ్ఠిగా నిలబడ్డారు,గుడ్!ఫర్ సప్పోజ్ ఈ నాగరికత అంతా వొదిలేసి అడివిలోకి వెళ్ళిప్పెదాం,మీరిఒక చెట్టూ నేనొక చెట్టూ చూసుకుని కాపరముందాం,నా చెట్టు పళ్ళూ నేను తింటాను,నీ చెట్టు పళ్ళు నువ్వు తిను అని ఒప్పందం చేసుకుందాం.ఓకేనా?మిమ్మల్నెందుకు చెడ్డవాణ్ణి చెయ్యాలి,ఒకవేళ కొన్నాళ్లకి నాకు చెదుబుద్ధి పుట్టి మె చెట్టుపళ్ళని కూడా నేను తినేస్తున్నననుకోండి,అపుడు మీరేం చేస్తారు?

    సరే వ్య్క్తిగతంగా మనల్ని ఎందుకు చర్చలోకి ఇట్లా ఇన్వాలవ్ అవవ్టం ఆ ముక్క అన్న రచయిత్రి కమ్యునిష్టు భావ్జాలం కోసం కదా ఆ ముక్క అనింది!అందులో సాయుధ పోరాటం అని ఒక సూత్రీకరణ ఉంది,అవునా?దానికి ఆయుధాన్ని ప్రయోగించే జ్ఞానం ఉన్నవాదు అక్కర్లేదా?ఆయుధప్రయోగ జ్ఞానం ఉండి వ్యూహాత్మకంగా కదుల్తూ ఎదటివాళ్లని చంపటం యుద్ధం అ?కొంచెం శాస్త్రీయంగా వాదించండి సార్?!
    I
    APRIL 29, 2016 AT 5:45 PM
    Point2:
    (దశరధుడి భార్యల సంఖ్య 353). ఆవిడ ఇలాంటి మరుగుపరచబడిన విషయాలను జనసామాన్యానికి పరిచయంచేసి, రామభక్తులను defenseలో పడేశారు.
    HARINANU
    ఎలగెలగా!హిందువులు డిఫెన్సులో పడ్డారా?ఎప్పుడు?ఎక్కడ? సరిగ్గా ఇలాంటి దరిద్రపు పరిశొధనే శ్రీశ్రీ మీద మరొక ప్రముఖ కవి ఆరుద్ర చెయ్యబోతే అధర్మపత్నుల గురించిన పరిశోధన నీకెందుకయ్యా అని వెక్కిరిస్తే మూసుకోవాల్సిందేదో మూసుకున్నాడు. ఈవిడ ఇంత బందచాకిరీ చేసి పరిశోధించకముందు అవి చదివిన వాళ్లకి దశరధుడి భార్యల లెక్క తెలియదా?కావాలంటే ధృతరాష్టుడి నూరుగురు కొడుకుల పేర్లూ లిస్టు ఇస్తా,తమరికి అది అవసరమనుకుంటే! ఇంకా ఓపిక ఉంటే ఆ 353మంది పేర్లూ లిస్టు చూపించమను,ఏమవుతుంది? ఇప్పుడీవిడ పాడిన కొత్తపాట వల్ల కధ అనూహ్యంగా మారిపోతుందా?అప్పుడూ ఇప్పుడూ దశరధుడి క్యారెక్టరు అదే గదా,విసిరిన రాళ్ళు బూమరాంగు అవటం అంటే ఇదే:-)దెబ్బకి ఐడీలు మారుతున్నై,సారంగ అనానిముచ్చుల్ని ఎంకరేజి చెయ్యకపోవటం వల్ల కాబోలు:-(
    దశరధుడనే తండ్రి యొక్క బహుభార్యాత్వం వల్ల వాళ్ల మధ్య తమ కొడుకే రాజవ్వాలనే కుట్రల వల్ల ఇంత జరిగిందనే నీఎతి తెలియడానికి ముగ్గురయిన అమూడొందలమంది అయిన అఒకటే గదా – ఆమాత్రం కామన్సెన్సు కూడా లేకపోతే ఎట్లా?

  31. ఆనాటి రాజు లకు 353 ఏమికర్మ వెయ్యి మంది ఉన్నా ఆహశ్చర్య పడటానికి ఏముండదు. ఎందుకంటే కొంత మంది పాలెగాల్ల సైన్యాన్ని (ఇక్కడ ఐ గారు చెప్పిన సైన్య లక్షణాలు వర్తిస్తాయి.) తయారు చేసుకొని వంద ఇల్లు మీద పాడి దొరకినది దోచకొని కొంతమంది ని చంపగలిగి తే వాడొక రాజై పోయాడు. ఆతరువాత ఎంతమందైనా వాడికింద పడి ఉండాలసిందే. శ్రీ శ్రీ గారు ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయనత్వం’ అన్నది.

  32. As expected, హరిబాబు గారు emotioanl rhetoricతో topic diversionకే తెగబడ్డారు.

    సైన్యం అనవసరమన్నది నేనెక్కడా అనలేదు. అది మీరు ఊహించేసుకున్నారు ఎందుకంటే అది నామీద ad hominem attack చెయ్యడానికి మీకు బాగా పనొకొస్తుంది కనుక. నేను సైనికుల తెలివితేటల గురించి మాత్రమే వ్యాఖ్యానించాను. సైనికుడి పని అజ్ఞలను carry on చెయ్యడం మాత్రమే. మీరు చెప్పిన వ్యూహాలూ అవీ… సైనిక జనరళ్ళ పని. Even then, your highness the intelligence level of the most successful generals is still lower than that of an ordinary person (I could have said ‘you’ but then you are a genius sire!!). A rational person could never become a general.

    హిందువులు డిఫెన్సులో పడ్డారు అనడానికి నిదర్శనం వారి తరఫున మీరు డిఫెన్సులాయరు పాత్ర పోషించడమే. మీరు భలేగా sideline చేస్తారు మాస్టారూ… ఆవిడ పుస్తకం రాయకముందు దశరధుడికి కేవలం ముగ్గురు భార్యలే ఉండేవారు (నేనుదహరించిన పాటను ఏ హిందూ స్వామి ఖండించినట్లు నాకు తెలీదు. మీరు మేధావులు కాబట్టి మీరు చెప్పండి). ఆవిడ విషవృక్షం రాసిన తరువాత దశరధుడికి ఎందరు భార్యలో చెప్పి తీరవలసిన అగత్యం ప్రతి రామాయణ విశ్లేషకుదుకీ వచ్చింది. ఇదొక్కటే కాదు స్వామీ… ఆవిడ పుస్తకం మొత్తం రామాయణాన్నీ ‘debatability’ పరిధిలోకి తెచ్చింది. మీకలా అనిపించకపోతే అది మీ మేధావితనం గాక మరొకటికాదు.

  33. అన్నట్లు… మీల్లాంటి hard core హిందువులు ఎంత తీవ్రంగా (అవసరమైతే వేరుపేర్లతోకూడా) స్పందించగలరో తెలిసిననేను మిమ్మల్ని ‘సోదరా’ అని సంబోధిస్తున్నాను -ముందస్తుగా… ముందుజాగ్రత్తగా.

మీ మాటలు

*