సూదిగాడికి వేడికోలు!

 P-154

-బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi అయ్యా! సూదిగాడుగారూ.. నమస్కారం!

ఎలావున్నారు? మీరు ఎక్కడవున్నా బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వున్నాను. మీరు ఇలా కనిపించి అలా మాయమైపోవడం గురించి మా పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు! పోలీసులు మిమ్మల్ని పట్టుకోలేరని, వాళ్ళ చేతకానితనాన్ని మీరు చక్కగా బయటపెడుతున్నారని పిరికి జనం భలే ధైర్యంగానే అంటున్నారు.

“నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా? నువ్వేనా.. నువ్వులావున్న యెవరోనా?” అని పల్లవించి “..యింతకీ నువ్వు ఒకడివా? వందవా? ..యెంతకీ నువ్వు యెవరికీ అందవా?” రాగం తీసి నయనతారలై కొందరు నీకు ‘సెల్యూట్’ కూడా చేస్తున్నారు. నిజమే, నువ్వు ఏకవచనం కాదు, బహు వచనం!

మూడొందలు యివ్వందే ముఖం కూడా చూడని డాక్టర్లు వున్న ఈ రోజుల్లో ముఖం చూడకుండా వత్తినే.. వత్తి పుణ్యానికే సూది గుచ్చి సూదిమందు యిస్తున్నావే.. నువ్వు నిజంగా గ్రేట్.. మరి ఆ చేత్తోనే మందులూ మాత్రలూ టానిక్కులూ యిస్తే యింకెంత బాగున్నో అని మా ముసిల్దాయీ మరికొంతమంది ఆశ పడుతున్నారు. నిజంగా నీకు యేవొక్క డాక్టరూ సాటి రాడు. నీలాంటి వాడు యింకెక్కడా లేడు.

వైద్యం అందుబాటులో లేని ఈ రోజుల్లో నువ్వు యెవరికి యెప్పుడు అందుబాటులోకి వస్తావో తెలీక మేము కొద్దిగ సతమవుతున్న మాట నిజం.  అయ్యయ్యో నేను నిన్ను తప్పు పట్టడంలా. నువ్వు మొబైల్.. అదే సంచార వైద్యం అందిస్తున్నోడివి.. నీ సేవా గుణం యెవరికీ రాదు గాక రాదు. అయ్యో రామ.. ఆడోల్లకి నువ్వు ఫస్ట్ ప్రిపరెన్సు యిచ్చినప్పుడే నువ్వు కరక్టు పర్సన్ వి  అని నేను డిసైడైపోయా..

కానీ డాక్టరుగారూ.. నిన్నే.. డాక్టరు కోర్సు చదివి శుభ్రంగా యింజెక్షన్ యివ్వడం రాని డాక్టర్లు మాకున్నారు. అలాంటిది యిన్ని యింజెక్షన్లు మూడోకంటికి తెలియకుండా యిచ్చిన నువ్వు డాక్టరువి కాకుండాపోతావా? నువ్వు డాక్టరువి కాదని అంటే నాకళ్ళు పేలిపోవూ? అంచేత నువ్వు డాక్టరువే!

డాక్టరుగారూ.. సూదిమందు యెవరికి యిస్తారు? రోగం వున్నోల్లకి కదా? లేనోల్లకి యివ్వడం వల్ల వృత్తి వృధా అయిపోదా? సేవ జావగారి పోదా? నీ సేవలు అందరికీ కావాలి. ముందు రోగులకి కావాలి. అర్జెంటుగా కావాలి. ఆఘమేఘాల మీద కావాలి. ఆదిశగా కాన్సంట్రేట్ చెయ్యాలని మా వినయపూర్వక విజ్ఞప్తి!

మన నోటికి యింత అన్నం అందించే రైతులు వొకరు కాదు, యిద్దరు కాదు పదిహేను వందలమంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. యింకా చేసుకుంటూనే వున్నారు. అమ్మానాయినలాగా చూడాల్సిన గవర్నమెంటుకి రోగం వొచ్చింది.. కాలూ చెయ్యి పడిపోయిందేమో యేమీ పట్టించుకోవడం లేదు. రైతులు చనిపోవడం కొత్తా అని తిరిగి బూకరించి నోటికి వొచ్చినట్టు పేలుతోంది. ఈ రోగ లక్షణాలను బట్టి మంచి సూదిమందు యివ్వు.. వ్యవసాయ శాఖా మంత్రులకీ యివ్వు.. మంత్రుల మాగదులైన అధికారులకీ యివ్వు.. ఆ సూది మందేదో యివ్వు.. నాకు తెలుసు నీకు తెలంగాణా ఆంధ్రా భేదం లేదు. అందుకే అటు పశ్చిమ గోదావరిలో ప్రారంభించి యిటు నల్గొండ దాక, హైదరాబాద్ తో కలిపి అన్ని ప్రాంతాలకు నీ సేవలు ఆల్రెడీ అందించావు. రోగులకు ప్రాంతీయ భేదం లేదు. డాక్టర్లకూ ప్రాంతీయ భేదం వుండదు.

లిక్కరు మీదే మన గవర్నమెంటు సత్య ప్రమానకంగా నడుస్తోందని నీకు వేరే చెప్పాలా? కలోల్లు కాస్ట్లీ సరుకు తాగితే లేనోళ్ళు కల్లుతో సరిపెట్టుకోరా? దాంట్లోనూ కల్తీయే. గవర్నమెంటుల వున్నోల్లే.. సపోర్టు వున్నోల్లే.. వాళ్ళ చుట్టాలూ బంధువులూ ఈ కల్తీ సరుకు అమ్మ బెట్టిరి. యిప్పుడు బందు పెట్టిరి. కల్లు దొరక్క దొరా కళ్ళు పేలిపోతున్నాయి. జనాలు రాలిపోతున్నారు. యెవరికి యిస్తే రోగం కుదురుతుందో యింకా నీకు చెప్పాలా డాక్టర్ సాబ్?

ముందు చెప్పాల్సింది మధ్యలో చెపుతున్నాననుకోకు.. రాజధానికోసం భూములు లాక్కున్న రోగులకి నీ సూది మందు పడాల్సిందే! పంట వేస్తే అరెస్టు చేస్తామన్న అగ్రికల్చర్ మినిస్టర్కీ అధికార్లకీ సూది గుచ్చడం మర్చిపోకు. మాటొచ్చింది కాబట్టి చెపుతున్నా, యెవడు యెప్పుడొచ్చి చెక్కా ముక్కా భూమి లాక్కుంటాడో తెలడం లేదు. అధిక దాహానికి మంచి సూది మందు యివ్వు బాబూ..

వ్యాపారాలూ యవ్వారాలూ చేసినన్నాళ్ళూ చేసి, రాష్ట్రం విడిపోగానే అన్నీ హైదరాబాదులో దొబ్బించు కున్నారని ఆల్లే అనేసుకొని, అన్యాయం అయిపొయింది మొర్రో అని- అన్నీ తీసుకువెళ్ళి అమరావతిలో పెట్టి మళ్ళీ అదే పని చేసి సర్కారుజిల్లాలవారికే సర్కారు అందుబాటులో వుండేలా చేసి- రేపటికి మళ్ళీ అసమానపు అగ్గి రాజుకోనేలా చేస్తూన్న  బుర్ర చెడిన ఆంధ్రా నాయకులకి పోలియో సూదిమందులాగా యే వొక్కల్నీ వొదలకుండా సూదిమందు యేస్తావని యెంతగానో ఆశపడుతున్నాను..

ఔనూ.. నువ్వు పల్సర్ బైక్ మీద రైయ్ మని వొచ్చి సూది యిచ్చి పోతున్నావు గదా.. నీకు పోటీ అన్నట్టు చైన్ స్నాచర్లు కూడా నీకు మల్లె పల్సర్ బైక్ మీద రైయ్ మని వొచ్చి చీమూ నెత్తురూ కూడబెట్టి కొనుక్కున్న మెళ్ళో తాళ్ళు తెంపుకు పోతున్నారు. సో.. నువ్వు నీ స్టైల్లో వాళ్లకి సూది మందు యివ్వ రాదా? ఈ మాట రాయమని మా ఆవిడ మరీ మరీ చెప్పింది..

కాలేజీల్లో కులగజ్జి పెరిగిపోయింది. ఒకేరకం గజ్జితో ఒళ్ళూ పయి మర్చిపోయి స్టూడెంట్లతో ప్రిన్సిపాలు డాన్సులు వేయడం చూసుంటావు. మాది మహారాజా గజ్జి అని జెండా యెగరేసి ఆడపిల్లల్ని ర్యాగింగు పేరుతో యేడిపించి యెదపోసుకొని కాటికి పంపిన కన్నింగ్ ఫెలోస్ కి గజ్జీ తామర తగ్గడానికి సూదిమందు యిస్తే యెంత బాగుంటుందో నువ్వే చెప్పు..

చదువంటే నూరుడూ రుబ్బుడూ తాగించుడూ యిదే యిక్కడి పిల్లలకి.. తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోపక్క గవర్నమెంటు బడులకీ కాలేజీలకీ గైనం యిప్పేసి.. ఆహా ఓహో అంటున్న నారాయణ చైతన్య.. చైనా వాళ్లకి నువ్వు సూదిమందు యెక్కడికక్కడ యిచ్చి పిల్లల బాధ వాళ్ళకీ తెలేసేలా చేస్తే బావుంటుందని మావాడూ వాడి ఫ్రెండ్స్  భాదితులుగా రాయమని వొప్పడంలేదు!

వుల్లిపాయ్ కందిపప్పు కొనడానికి లేదు, తినడానికి లేదు. ధరలు తగ్గిస్తామని మర్చిపోయారు పెద్దలు. వాళ్ళ మతిమరుపు తగ్గడానికి యివ్వరాదా సూదిమందు? మా అమ్మ అడుగుతోంది..

అలాగే తీసిన సినిమాలే సిగ్గులేకుండా తీస్తున్న సినిమా వోళ్లకి లేదా సూదిమందు? అని మాబాబాయి మీ కంట్లో వెయ్యమని చెప్తే రాస్తున్నా..

మరి చేతులకి దూలగొండాకు రాసుకున్నట్టు ఉద్యోగులు అస్తమాను బల్లకింద మానేసి బల్లమీదే గోక్కుంటున్నారు.. వాళ్ళ దురద తగ్గే సూదిమందు యివ్వరాదా చేతనయితే? అని మానాన్న సవాల్ విసురుతున్నారు..

లాకప్పు డెత్తులకు రుచిమరిగి.. అత్యాచారాలు చేసి అంగాలను చితకొట్టి ఎన్కౌంటర్లు చేసి.. మనుషుల్ని చంపడం మహా సరదాగా మారిన ఖాకీలకి మళ్ళీ మనుషుల్ని చేసే సూదిమందు యేదన్నా యివ్వరాదా? అని మా స్నేహితులంటున్నారు..

మా పక్కింటాయన నీకు వుత్తరం రాస్తున్నానని తెలిసి- భూ బకాసురులున్నారు.. కాంట్రాక్టర్లున్నారు.. వాళ్ళ ఆకలి తగ్గడానికి యివ్వరాదా సూదిమందు? అని అడుగుతున్నాడు..

ఏ రేట్లూ అందుబాటులో లేవు గాని కార్పోరేట్లను అందుబాటులోవుంచి, ఆలకి అన్నీ అందుబాటులోవుంచిన గవర్నమెంటుకి చాత్వారం పోయి.. దృష్టి దోషం పోయి.. ప్రజలు కూడా కంటికి కనపడేలా మంచి సూదిమందు మా మంత్రులకీ అధికారులకీ యిస్తే నీకు రుణపడి వుంటాం!

నీకు చాలామంది పేసెంట్లు వున్నారు.. నువ్వు చూడాలేగాని వాళ్ళు క్రానిక్ గా అంటే చాలా కాలంగా రోగాలతో దర్జాగా బతికేస్తున్నారు..

డాక్టరు దేవుడితో సమానమంటారు. కష్టాలు దేవుడికే కదా చెప్పుకుంటాం. అందుకే నీతో చెప్పుకోవడం.. నువ్వు మా పాలిట సూది’గాడ్’వి!

నువ్వు వీళ్ళందరికీ సూదిమందు యిచ్చి రోగాలు తగ్గిస్తే సాయిబాబాలకన్నా నీకే యెక్కువ పేరొస్తుంది.. మీడియాకి విడుదలచేసిన ఊహాచిత్రం లేమినేషను పటం కట్టించి మేమందరం యింట్లో పెట్టుకుంటాము.. మీడియా కూడా యివాళ తిట్టినా ఆ నోటితోనే నిన్ను రేపు హీరో అంటుంది.. జనం కూడా పోలీసులకి దొరక్కుండా నిన్ను తమ గుండెల్లో దాచుకుంటారు.. రేపటికి నువ్వే చరిత్రవుతావు..

నువ్వు నీ సూదిని యెటు తిప్పాలో అర్థమయింది కదా?

యిట్లు

మీ

విధేయుడు

 

Artwork: Srujan Raj

మీ మాటలు

 1. A good piece of writing indeed .
  Congrats Bammidi గారూ.

 2. kurmanath says:

  బాగుంది, బజరా.
  అయితే, సూదిగాడుకి తెలుసు ఆ సూది మనవైపు ఎక్కుపెట్టినంత సేపూ వాడికేమీ కాదని. మీరు చెప్పిన వాళ్లపైకి ఎక్కుపెట్టిన మరుక్షణం ఎన్కౌంటర్ అయిపోతాడు. అలా ఎక్కుపెట్టనంతవరకూ సూదిగాడు క్షేమం.
  అయినా, నగర ఆసుపత్రుల్లోని కొందరు సూదిగాల్లు సృష్టించిన fear psychosis వల్ల ఈ సూదిగాడంటే అంత భయం కలగడంలేదు.

 3. Delhi (Devarakonda) Subrahmanyam says:

  చాల బాగా రాసారు బజర గారూ . ఇప్పుడు సూదిమంది కావలసిన వాళ్ళు చాల మండే ఉన్నారు.మీ డిల్లి రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం

 4. sivalakshmi says:

  అందరి విన్నపాలూ సూదిగారికి చక్కగా అందజేశావు బజరా!చాలా బాగుంది!!

 5. రెడ్డి రామకృష్ణ says:

  సూది ‘గాడ్’ గారూ జిందబాద్, అయ్యా!సూది ‘గాడ్’గారూ ,మా బజరాగారు తమకి మనవిచేసిన పై కోరికలన్ని తీరిస్తే మావూళ్లో మీకు గుడికట్టి పూజించడానికి మేము సిద్ధంగవున్నాము…..
  ఏం సిమాతారలకు గుడికట్టినవాళ్లం,ఈమధ్య రాజకీయనాయకులకు గుడులు కడుతున్నవాళ్లం.నీకు అదే మీకు కట్టలేమా!సమాధులు కట్టాలంటే మాకు చేతకావడంలేదుకానీ,గుడులు కడతామని మీకు మొక్కుకుంటున్నాం.యిది గుడులసీజన్,కనుక ఉభయులకు లాభదాయకం.ఎలాగంటారా(మనలో మనమాట కేంద్రంలో ఉన్నది మనప్రభుత్వమే యిటుకలఖర్చు,విభూదిఖర్చు (అదే సిమెంట్ఖర్చు ) కలిసొస్తుందని నమ్ముతున్నాం .కనుక యికమీదే ఆలశ్యం స్వామీ

 6. విలాసాగరం రవీందర్ says:

  బాగుంది కథ గా సూది గాడ్ ని మా ఊరికి కూడా పంపండి

 7. kandula v n sarma says:

  మావు విస్సపట్నం లో ఉన్నపుడు నువ్వో మరోల్లో అష్ట వంకరల అవడాని గోరని ఉన్దెవొరు. అది నువ్వే కదా బావ్ ! ఈ మద్దె నువ్వెక్కడా అవుపించటం నే దు. బావున్నావా? , ఏటి ఆల్లందరికి సూది గుచ్చీమన్తావా . నీ కె ఇన్నోటి తెలివి తేట లుంటే ని తలతన్నే తాటిసేట్టునాగా ఎదిగి పొయినొల్లు ఆల్ల కి ఎన్నోటి ఉన్తాయ్ . నీ కేరికే నీకు తెలీ నట్టు ఉన్తావ్ అది నీ వాలకం . ఆ సిన్తాడ సిన్నోడు బావున్నాడా
  ఆ గుంటడు ఎప్పుడు నీ వాలకం గురిచి వేలా కోలం ఆడేవాడు

 8. Sadlapalle Chidambara Reddy says:

  అన్నన్నా కుచ్చాల్సినొళ్లు సూదులు గుచ్చేది మరసి పాయిరి. కుర్చీ ఎక్కినొళ్లు పరిపాలించేది మర్సిపాయిరి. ఇసుకూళ్లు సదువులు సెప్పేది మరసి పాయ . ఎవరి పన్లు వాళ్లు ఇడిసిపెట్ట్రి అంతా తల తిక్క యవ్వారం .బాగా సెప్పితివి అప్పయ్యా.

మీ మాటలు

*