బతకల్ల  అంటే ఎదకల్లేమో !!

-సడ్లపల్లె చిదంబర రెడ్డి 
~
     కరంటు లేని కాలంలో పల్లి జనాల బతుకులు యట్లుండేవో ముందే రవ్వంత సెప్పినాను! అయినా ఇంగా కొంత లోతుగా——
     వానలు దండిగా కుర్సి ఏట్లో సదుము బాగా వుంటే, కాలువ కింద బూములుండే జనాలంతా ఏట్లో నడుముల్లోతు కాలువ తీసి ఎద్దుల్తో గోరి ఆడ ఊరిన నీట్ని నల్లేరు కాలువతో సేన్లకి తెస్తా వుండ్రి.అన్ని పొలాలకీ ఒగటే కాలువ. అందరూ మడకకి(కాడికి) ఇంత సేపు అని సరతలు(వంతులు) ఏసుకోని పంటలు పండిస్తా వుండ్రి. ఏటి సదుము తగ్గితే బాయినీళ్లే గతి. రెండు మూడు కుటుంబాలకి కలిసి ఒగ బాయి,వాళ్ళు ఉమ్మడి సేద్యం సేసుకొంటా యకరా అర్దము ఎకరా  పంట పెట్టుకోని నీళ్లకి సరతలు ఏసుకోని ఎద్దులు కట్టి కపిల తోలుకోని పంటలు పండిస్తా వుండ్రి.
     యపుడు కరెంటొచ్చినో అపుడు ఒగే బాయికి రెండు మూడు మోటార్లు బిగించ బట్రి. కస్టపడాల్సిన పనే లేదు! స్టాటర్ను ఏల్తో ఒత్తితే సాలు బుస్సు న నీళ్లు బాయిలో నుంచి పైకొచ్చేవి.
     అయిదారు నెల్లు కరెంటు నీళ్లని ఒంతులేసుకోని పదున్లు పారిస్తూనే జనాల బుద్దులు మారి పాయ. పశువులకు గడ్డీ గాదం పెరుగుతా వుండే బీడు బూముల్ని గూడా సాగు సేసేకి మొదలు  పెట్రి. ఒగే కాలువలో రెండు మూడు సరతల నీళ్లు పారిచ్చు కొంటా సరతలు మీరి పాయిరి. ఆరకంగా మాఊరి పొలాల్లో అన్నా దమ్ముల మాదిరీ వున్న కాపోళ్లకి కురువోళ్లకి కొట్లాట పది  బాగా కొట్టుకొన్రి. పోలీసు స్టేషను కానా పాయిరి. అది మర్సి పోకున్నట్లే మాకీ మా మామగారు వాల్ల బందూ బలగానికీ యాజ్యం మొదలాయ. దున్నిన మడి ఎండి నెర్రిలు పొయ్యింది అని ఒగ గంట సేపు ఎక్కువగా కాలువని వాడుకొంటాము అని ఒగరు, సెరుకు కన్నె తోట ఎండి సెదలు తిని పోతా  వుంది రెండు గంటలు ఎక్కువ సేపు కాలువ కావల్ల అని ఒగరు మాటా మాటా పెరిగి కొట్టుకొన్రి. మా నాయనకి, పెద్దన్నయ్యకి రెండు మూడు ఏట్లు పడ్నట్లు గుర్తు.
     కరెంటు నీల్లకి కొట్లాడిండారు అంటే వానలు తగ్గి ఏరు ఎండి కాలువ నీళ్లు రాలేదు అని అర్తం. ఈ నీళ్ల పీకులాట జరుపు కొంటా పంపు సెట్లతో తోడి పోస్తా వుంటే బాయిలన్నీ ఖాళీ అయ్యిపాయ.
     ఊర్లో అందరి కంటే ముందే ఎండేది మా బాయే!! యాలంటే పెన్నేరు దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతుంది. దక్షిణానికి ఎత్తు బూములు మావి. మా నీల్లు ఉరంతటికీ పారొచ్చు గాని,మా సేన్లకి ఎవరి నీళ్లూ వొచ్చే అవకాశమే లేదు. అందుకే బాయిలు ఎండుతూనే పచ్చగా వుండే సేన్లన్నీ అగ్గి తెగులు సోకిన వరి మళ్ల మాదిరీ ముదురుకు పాయ.
    *****     *****     *****     *****     ****     *****     *****     *****     *****
     మా నాయనకి బారతం సదివేది బాగ వొచ్చు. వానలు రాని దానికి పక్కూర్లకి పొయ్యి విరాట పర్వం సదివి అన్నో ఇన్నో రాగులూ, దుడ్లూ ఇంటికి తెస్తా వుండె. ఆయప్ప కంఠము శానా  పెద్దది.రాగము తీసి పద్యం పాడి అర్తం సెప్పితే మైలు దూరానికి ఇనిపిస్తా వుండె.
     నాయిన ఇంట్లో వుండాడు అంటే యంత లేదన్నా అయిదారు మంది జనాలు సేర్తా వుండ్రి. బారతం కతలు, రాజకీయము, పెండ్లిపెత్తనాలూ అన్నీ కలిసి పోతావుండె.
     ఒగ నాడు ఇట్లే మా ఇంటి ముందర జనాలంతా సేరిండారు. ఒగాయప్ప “ఏమి అనుమంతప్పన్నా!! వానలు ఇట్ల పనిచ్చె మనం బతికేది యట్లన్నా??” అనె.
    “ఏడిది తీయన్నా! తెలుగోళ్లంతా ఒగతావకి సేరి బాగా బతుక్కో వొచ్చు అని అరవ దేశం నుండి వారగ ఒస్తిమో!! ఇపుదు సూడు తప్పల్దారా పండెండేండ్లాయ!! అతీ లేదు గతీ లేదు. ఆడ బళ్లారి తావ తుంగ బద్రా నది మింద డాము కడితే మనకి నీళ్లు ఒస్తావని శానా ఆశ పడితిమి” అని మా నాయిన అంటా వున్నట్లే…
     “ఊను గదన్నా డ్యాము యట్ల కడ్తారో సూస్తాము అని నువ్వు సైకోలు మింద పొయ్యింటివి.(హిందూపురం నుంచి టి.బి. డ్యాముకు 276 కి,మీ. అక్కడికి వెళ్లొచ్చిన సంగతులు చాలా రోజులు కథలుగా చెప్పే వాడు) అది పూర్తీ అయితే  మన కరు తీరు తుంది,బాయిల్లో నీల్లు పొంగుకొస్తాయి అని సెప్పితివి గదా!! ఇంతకూ అది ఏమయ్యింది??” అనె ఒగాయప్ప.
     అపుడు మా నాయన” అంతా అయ్యిందప్పా. కానీ ఏమి లాబము?? ఈ రాజకీయం పెద్ద తలకాయలు   మనదంకా రానిస్తాయ? ఎత్తు కుర్చీల మింద కూకోనుండే వాళ్లూ, నూరారెకరాలు బూమి సంపాదన సేసిండే వాళ్లూ, రూకలు సల్లేవళ్లూ వాళ్లకి కావాల్సిన సోటుకు కాలువలు తీసి నీళ్లని  గద్దల మాదిరీ తన్నుకు పొయ్యిండారు. ఇంగ మన సేతికి సిప్పే గతి. ఈ కొంపల్ని ఇడిసి వేరే ఊర్లకి వలస పక్షుల మాదిరీ ఎగిరిపొయ్యి బతుక్కోవాల్సిందే” అనె.
     అపుడు ఇంగొగు ఆయప్ప”కాదు రెడ్డీ!! మాకంతూ సదువూ శాస్త్రం తెలీదు.నువ్వు అంతో ఇంతో సదివిండావు, దేశాలు తిరిగిండావు మాకి బతుక్కొనే ఉపాయమన్నా సెప్పగూడదే”అనె.
     అపుడు ‘బుద్ది బూమేలుదాము అంటే అద్రుష్టం గాడిదలు కాస్తాము  ‘అంటుందంట!! అనే సామెత సెప్పి బీడీ అంటిచ్చుకోని గుప్పున పొగ ఇడిసి జరిగిండే కతంతా సెప్పేకి మొదలు పెట్టె………
     మా తాత పేరు కొందయ్యంట. వాళ్లమ్మ పుట్నిల్లు పెనుగొండ దగ్గర బాపన పాల్లంట. అందుకే ఆయప్ప ఆ ఊర్లోనే పెరిగి పెద్దగాయనంట. దానికి దగ్గరోవుండే పందిపర్తి  అనే వూర్లో(1850 కి అటూ ఇటు) సదివి నంట. ఆయప్పని అందరూ బాపనపల్లి కొండయ్య అని పిలుస్తా వుండ్రంట. అదే టయానికి ఇంగిలీషోళ్లు గుంతకల్లు నుంచి బెంగుళూరుకు రైలు రోడ్దు పని మొదలు పెట్రంట.
     వాళ్లు రోడ్డు పని సేపించేకి జనాలని ఎదుక్కోని ఊర్లల్లోనికి ఒస్తే  ఆ కాలం అమాయకం జనాలు బయం పడి పరిగెత్తిపొయ్యి ఇండ్లల్లో దాక్కొంటా వుండ్రంట. మా తాత కొండయ్య శానా ధైర్యమయి నోడంట. అంతో ఇంతో సదివిండాడు గాబట్టి వాళ్లతో” ఏమి సారూ ఒచ్చింది?? మా నుండి మీకి ఏమి పని కావల్లో సెప్పండి శాతనయితే సేసి పెడతాను” అని వాళ్లతో మాట కలిపినంట.
మా నాయన

మా నాయన

    అపుడు వాళ్లు “మీ ఊరి పక్కంటీ పొగ బండి పొయ్యేదానికి రోడ్దు ఏయల్ల.దానికి కష్టం సేసే జనాలు కావల్ల. వాళ్లకి తిండి గింజకు కానీ, కూలికాసులు కానీ ఇస్తాము” అని సెప్పిరంట.
     అపుడు మా తాత” స్వామీ మాన్న బావులారా!! పిలిసి పనులిస్తాము అంటే సేయకుండా వుండే దుర్మార్గులు యా పల్లి లోనూ వుండరు. అయితే రెడ్డీ, కరణాలట్లా దగుల్బాజీలు అమాయికం జనాలకి ఆశలు పుట్టిచ్చో, బయాలు సెప్పో శరీరంలో వుండే రగతం ఇమిరి పొయ్యేదంకా,కండలు కరిగి పొయ్యేదంకా పనులు సేయించుకోని, కడాకి ఉత్త సేతుల్తో ఉసూరని ఇండ్లకి పంపిన దినాలుండాయి. రాజుల కాలము నుంచి ఈ దోపిడీ అలవాటయ్యింది. అందుకే మా జనాలు పెద్దోళ్లని నమ్మరు” అని సెప్పినంట.
     దానికి తెల్ల దొరలు ” అప్పయ్యా!! నువ్వు మంచోని మాదిరీ వుండావు.లేకుంటే జనాలకి జరిగే అన్యాయాలను సెప్పవు! అందుకే నిన్ను నమ్మ బుద్ది అయితావుంది. మీ ఇంటెలుపు దేవుని మింద మా ఏసు క్రీస్తూ ప్రబువును మింద ప్రమాణం సేసి సెబుతా వుండాము. నువ్వు దిన్నమూ జనాలని పనికి పిల్సుకురా తలకాయలు లెక్క బెట్టి ప్రతివారమూ నీకు కూలీలిస్తాము. నువ్వు వాళ్ల జతలో శాకిరీ సేయాల్సిన పని లేదు.పనికి ఒచ్చినోళ్లు మద్యలో ఎల్లి పోకుండా సూసుకో.వాళ్లకి మంచి మాట్లతో దైర్యం సెప్పి యా పని యట్ల సేయల్లో నేర్పిచ్చి మద్యలో తప్పిచ్చుకు పోకుండా సూసుకో. వాళ్లందర్కీ నువ్వే మేస్త్రీగా వుండు” అని సెప్పిరంట.
     అపుడు మా కొండయ్య తాత సుట్టూ పక్కల పల్లెలకి పొయ్యి కుర్ర పెయ్యలట్లా మగ మనుషుల్ని గుంపేసుకోని రోడ్దు పనులు సేపించేది మొదలు పెట్నంట.
     పొద్దున్నే ఈళ్లందరూ ఒగ పల్లి తాకి సేరితే లారీలోనో,రైల్లోనో పనులు సేసే సోటుకు పిల్సుకు పోతావుండ్రంట.అట్ల శాకిరీ వాళ్లు ఎక్కే సోటు ఒగ రైలు స్టేషను కట్రంట . ఆ శాకిరీ వారి పల్లే ఇపుడు శాకార్లపల్లెగా మిగిలింది.(హైదరాబాదు నుంచి బెంగుళూరు వెళ్లే దారిలో పెనుగొండ తరువాత “చాకార్లపల్లి” అనే రైల్వే స్టేషను మీరు గమనించవచ్చు) ఇపుడు మా తాత బాపనపల్లి కొండయ్య కాదు. కొండా మేస్త్రీ!!
     రోడ్దు పని ముగిసిపొయ్యి (1900 అటు ఇటు) రైలు తిరిగేది మొదలు పెడుతూనే– అంతకు ముందు పన్లు సేసిన వారి పిల్లోల్లు సదివింటే పిల్సి ఉద్యోగాలు ఇచ్చిరంట. మా నాయిన అనుమంతప్ప( హనుమంత రెడ్డి= మీసాల రెడ్డి) అంతో ఇంతో సదివినాడు గాబట్టి నెలకు అయిదు రూపాయల జీతంతో రైలు పనిలో సేరమని ఉత్తరం వొచ్చినంట.( మా నాయనకు సత్యనారాయణ రాజు అని వీది బడిలో సదువు సెప్పిన సారు. నాకు 20 సం. వయ్యస్సొచ్చె వరకూ మా ఇంటికొచ్చే వాడు. మా నాయిన అతనికి అన్నం పెట్టి డబ్బులిచ్చి కాళ్లకు మొక్కే వాడు)
     అది రైతుల కాలము. మాకి పదెకరాల ఏటిగట్టు బూమి. దిన్నమూ ఇద్దరు ముగ్గురు కూలిమనుషులు సేసినా పనులు సాగనంత యవ్వారము. అట్లాంటిది ఒగని కింద సేసే శాకిరీ ఎవరిక్కావల్ల!? అని మా నాయిన ఉద్యోగంలో సేరలేదంట.
     వానలు పడక కరువొచ్చినప్పుడంతా నాయన దీన్ని సెప్పుకోని అంగులారుస్తా వుండె. మా పెద్దన్నయ్య (ధనుంజయరెడ్డి) కూదా దీన్ని గుర్తు సేసుకొనే వాడు. యాలంటే 1960 కి ముందే యస్. యస్. యల్.సి. సదివి పని సిక్కక తిరుగుతా వుండె. ఆ కాలంల రైలు పనికి పరీచ్చలు గట్రా పెడ్తా వుండ్లేదంట!!అంతకు ముందు నమ్మకంగా ఎవరు రైలు శాఖలో పనులు సేస్తారో ఆ కుటుంబంలోని వాళ్లకే ఇస్తా వుండ్రంట. (నాకు కూడా రైల్వే డిపార్టుమెంట్లో ఉద్యోగం వస్తే ఎలా తప్పి పోయిందో మరలా చెబుతా)
    ఈ సేద్యాల్తో బతుకులు సాగేది లేదని మా నాయిన రొన్నాళ్లు పెయ్యల యాపారం సేసెనంట.  (అప్పుడు వ్యవసాయానికి ముఖ్యాధారం ఎద్దులు.మా ప్రాంతంలో పశు పోషణ చాలా తక్కువ. అందువల్ల కర్నాటకలోని మైసూరు ప్రాంతానికి పోయి కుర్రదూడలు మందలు మందలు కొని తెచ్చి మారకం చేసేవారు. ఈ వృత్తి 1980 ప్రాతంలో ట్రాక్టర్లు రంగ ప్రవేశం చేసే దాకా ఉండేది) దూరాబారం డబ్బులు తీసుకు పోవడము, దొంగల బయము, అమ్మకం కాక మిగిలిన వాటిని ఉంచుకొనే సోటు లేక దాన్ని వదిలేసి నంట.
     ఇది కాదని ఎనుములు మేపి పాలు అమ్మేది మంచిదని మొదలు పెట్టినంట. బెంగుళూరు ఇందూపురానికి దగ్గర(100 కి.మీ.) అయ్యిందానికి వాటి రేట్లు శానా అయిపాయనంట. అపుడు ఒగ దినం పేపర్లో అయిద్రాబాదు పక్క కరువొచ్చి ఎనుములు అగ్గువగా అమ్ముతా వుండారని రాసిండారంట.
    దేశాలు తిరిగే దాంట్లో మా నాయనది ఎత్తిన సెయ్యి. ఆ యప్ప కాళ్లకి శక్రాలు ఉండావని జాతకంలో రాసిండ్రంట. ఒగతావ పొందుతా వుండ్లేదు. మా ఇంట్లో ఒగ సైకోలుండె. అది ఇరవై నాలుగు ఇంచీల ఎత్తుది. 1977 నేను డిగ్రీ సదివే వొరుకూ వున్నట్ల గురుతు. దాని మింద మేడిన్ ఇంగ్లాడ్ అని రాసిండ్రి.దానికి శక్రాలకి నల్లగా ఉండే మిలిటరీ రిమ్ములుండె.
     మా యమ్మ పుట్తినిల్లు కర్నాటకంలోని కల్యాకన పల్లి అని ముందే సెప్పితిగదా. ఆడ రెండో ప్రపంచకం యుద్దం జరిగేతప్పుడు మిలిట్రీ క్యాంపులుండెనంట.(దీని గురించి మరలా చెబుతాను) వాళ్లు ఎల్లి పొయ్యేతప్పుడు సామాన్లు యాలము ఏసిరంట. అపుడు ఒగ మడత మంచము,సైకోలూ మా నాయిన కొనిన్నంట. ఆ సైకో లేసుకోని అయిదరాబాదుకు (450కి.మీ.) పొయ్యిన్నంట. ఆడ ముసల్మాన్ల దర్బార్లు,ఒగొగురు పదయిదు ఇరవై మంది ఆడోళ్లని పెండ్ళి సేసుకోనేది; వాళ్లు తెలుగు తురకము కలిపి మాట్లాడేదీ, నవాబు వంశమోళ్ళు ఎదురొస్తే తలమింద పేటా తీసి నడుముకు సుట్టుకోని కాళ్లకి మొక్కేదీ కతల మదిరీ సెప్పుతా వుండె.
    ఇట్ల దేశాలు తిరిగేకి దుడ్లు యాట్నుంచి ఒస్తాయి? అని మీరు అడగొచ్చు. ఆయప్పకి దుడ్లతో పనే లేదు. ఒగ బ్యాగులో బారతం బుక్కు,పచ్చడము( రెండు మూడు దుప్పట్లు కలిపినట్లు నేసిన తెల్లని కప్పడము. అప్పుడు మా ఊళ్లో మాల కులస్తులు మగ్గంపై నేసే వారు) సైకోలుకు తగిలించు కొని పోతావుండె. దావలో ఒగ పల్లిలో దిగి ఊరిముందర బారతం పద్యాలు సదివి అర్తం సెబుతా వున్నంట.
     అంతేనంట!! మా ఇంటి తావ సదువు మా ఇంటితావ సదువు– అని షావుకార్లు పిల్సుకు పోతా వుండ్రంట. అట్ల ఒగొగొ వూర్లో వారం పది రోజులు నిల్సి పోతావున్నంట. అంతో ఇంతో దుడ్లు గూడా గిట్టుబాటు అయితా వున్నంట. అయిదరాబాదు దగ్గర మహబూబు నగరం దగ్గర ఒగ పల్లెంట. వాళ్ళు గూడా మా కాపోళ్ల మాదిరీనే కుడికొంగు కాపులంట.(నా చిన్నప్పుడు కుడి కొంగు కాపులు- ఎడమ కొంగు కాపులు అని తేడాలుండేవి) మా నాయిన పద్యాల్ని ఇని శానా సంబరం పడిరంట నెల దినాలు ఆడే ఉంచుకొనిరంట.
     అపుడు మా నాయిన ” అయ్యా నేను గూడా సరి కాపోన్ని! మన్ను దున్ని గింజలు పండిచ్చే మట్టి జనానికి పుట్టినోడిని. మనుషుల బుద్దులు మారిండివి, కాలం మారింది. మా పక్క వానలు కురీకుండా అయ్యిండివి. కురిసినా పెన్నేరు పారకుండా మైసూరు స్టేటోల్లు సెరువులు అడ్డం కట్టిండారు. బుక్కితికి జరిగేది గగన మయ్యింది. ఇంటి నిండా గంపెడు బిడ్లు. ఏమన్నా సాయం సేస్తే మీ పేరు సెప్పుకోని బతుకుతాను” అన్నెంట.
     అపుడు ఆ ఊరి పటేలు జీత గాన్ని పిల్సి వూరి మందలో నుంచి మూడు ఎనుములు పట్టిచ్చినంట.  వాట్ని మాఊరికి సేర్సేకి ఒగ మనిషిని గూడా ఏర్పాటు సేసి నంట. మా నాయిన సైకోల్లో ఇల్లు సేరిన పదయిదు ఇరవై దినాలకి ఎనుములు ఒచ్చినంట. వాట్ని ఉద్దరగా తీసుకొనేకి ఇష్టం కాలేదంట. అపుడు ఎనుములు యాపారం సేసే దళ్లాలి గాళ్లను పిల్సి రేటు గట్టి నూటా యాబై రూపాయలు, తోలుకొచ్చిన మనిషికి దారి బత్తెమూ ఇచ్చి పంపెనంట.
    ఇదంతా గుర్తు సేసుకొన్నంక సింతల పల్లి నర్సయ్య అనే ఆయప్ప” అన్నా ఇదంతా జరిగి పొయ్యింది. మనము యన్ని సార్లు సెప్పుకొన్నా తిరిగి ఒచ్చెల్లేదు. ఇపుడు బతికే మార్గం ఆలోశన సేయన్నా” అనె.
     అపుడు మా నాయిన “అయితే ఒగ పని సేస్తాము. రేపు శుక్కురారుము మంచి దినము. పొద్దున్నే అయిదు గంటల్కే యల్ల బారుదాము. రవ్వంత ఆలస్సిమయినా బాపన ముసిలమ్మ దావకి అడ్డం కూకోనుంటుంది. ఆ తల్లి ఎదురు రాకున్నట్లే తుమకూరు దిక్కుకు పొయ్యి సెరువుల కింద అమ్మకానికి ఉండే బూముల్ని సూసొస్తాము” అనె. (మా ఊరి గుడికి పూజారి లేకుంటే కర్నాటకా నుండి ఒక బాపన కుటుంబాన్ని(సూబ్బప్పస్వామి) తెచ్చి పెట్టారు. అతని తల్లి వయస్సు దాదాపు 85సం. భర్త లేడు. భారీ కాయం,  చెవులు వినపడవు, ఆమె ఉదయం చీకటున్నట్లే రాగి చెంబుతో ఊరి వెనకాలకు వెళ్ళి కాల కృత్యాలు తీర్చుకొని బెంగళూరు రోడ్డులోని మోరీ మీద కూర్చొనేది. అక్కడామె ఉన్నదంటే ఎవరూ ఊల్లకు బయలు దేరేవారు కాదు. కొందరు పెద్ద పలుకుబడి గల రెడ్లు ప్రయాణమై వచ్చి గుడి ముందర నిలబడే వారు. పూజారి వాళ్లను గమనించి దేవుని పూజలు మాని మోరీ దగ్గరకు వెళ్లి ముసలామెను బలవంతంగా ఇంటికి పిల్చుకొచ్చేవారు!! మా ఇల్లు అక్కడకు దగ్గరే ఈ తతంగం నాకు ప్రతి రోజు విచిత్రంగా తోచేది)
    అనుకొన్నట్లే మా నాయినా వాళ్ళు శానా వూర్లు తిరగ బట్రి. యాడా సరి పోలేదు.
    కడాకి మా యమ్మ పుట్టినిల్లు కల్యాకనపల్లి లో ఏటిగడ్డ బూములు అమ్మకానికి పెట్టిండారని తెల్సి ఆసాముల్ని ఎదికేకి మొదలు పెట్రి. ఆ బూములు వేరే ఎవిరివీ కాదంట!! లేపాక్షి గవిరెడ్డి గారివంట. వాళ్ళు మాకి పాత సుట్టాలంట. బందుత్వాలు కలుపుకోని కరీదు గట్రి. సింతలపల్లి నర్సయ్యా వాళ్లుగూడా అదే ఊరితావ బూములు కొన్రి.
      సడ్లపల్లి తావ మా బూములు యగువపక్క ఉండే దానికి ఎవరూ కొనేకి ముందరికి రాలేదు. కడాకి బసనపల్లి వాళ్ల బాయి నీళ్ళు పారుతావని రామిరెడ్డి అనే ఆయప్ప కొనుక్కోనె.
     అట్ల మేము మా ఊరిడిసి నీటి జాడ ఎదుక్కోని ఎగువ సీమకి వలస పోతిమి.

మీ మాటలు

 1. అజిత్ కుమార్ says:

  మంచి చారిత్రక రచన. ఆసక్తికరంగా ఉంది

 2. చందు - తులసి says:

  ఔ..రెడ్డి గారూ. బతకల్లంటే ఎదక్క తప్పదు..బిట్రీసు వాళ్లు యాన్నుంచో బతకేదానికి రాలా … మీ నాయన మంచి కార్యవర్తి మాదిరి ఉన్నాడే..ఏ లోకాన ఉన్నాడో…మా రాజు.
  రాయలసీమలోని మాండలీకం సొగసులు మా బాగా సెప్పారు.

 3. p v vijay kumar says:

  యప్పో….మా ఉర్ల వొళ్ళు జెప్పినట్లనే జెప్తివి కదన్నా కతంత…..

 4. ప్రభాకర గురుమూర్తి says:

  రెడ్డిగారు, ఎడమపాపిటి, కుడిపాపిటోళ్లకి వ్యత్యాసమేమి?

  మా నానోళ్లు ఎడమపాపిటొళ్లు, అమ్మోళ్ల కుడిపాపిటోళ్లు. ఎప్పుడు ఒకర్నొక్రు తిట్కొంటానే ఉంటారు‌.

  మీ కధ బాగుంది, మా తాతోళ్లుకూడ తిరుప్తినుంచి యిట్లే బెంగళూరుకి వచ్రీ అనుకొంటా. (ఎడమపాపిటి).

  మా అమ్మొళ్ల తొట్టొళ్లు కూడా హోసూరు ప్రాంతానికి ఎప్పుడో వచ్చిండొచ్చు. యెప్పుడు, యెక్కడ్నుంచి వచ్రో తెలీదు. కుడిపాపిటోళ్లు. యింటి పేరు నాగినేని.

 5. Sadlapalle Chidambara Reddy says:

  ఆ పాపిట్లు కొంగుల సంగతి నాకు అంతగా తెలీదన్నా సిన్నవుడు నేను సూసిన్ది గుడ్డిగా రాస్తినంతే

 6. చాలా బావున్నాయి, మీ చిన్ననాటి ముచ్చట్లు, మీ ఊరి సంగతులు. ఇవన్నీ ఒక సంకలనం చేసే ఆలోచన ఏమైనా ఉందా రెడ్డి గారూ!

మీ మాటలు

*