నైనతార – ఒక రెబెల్ తార

-కృష్ణ మోహన్ బాబు

~

mohanbabuసునామీలు, భూకంపాలూ వచ్చేటప్పుడు ప్రకృతిలో కొన్ని జీవులు వాటిని ముందుగానే పసిగడతాయి.  అలాగే మానవ సమాజం లో సామాజిక వుపద్రవాలు రాబోయే  ముందు బుద్ధిజీవులకు ముందుగానే తెలుస్తుంది, వాళ్ళు సమాజాన్ని అప్రమత్తం చేస్తారు.   88 యేళ్ళ నైనతార సెహగల్ తనకి 1986 లో వచ్చిన సాహిత్య అకాడెమీ అవార్డ్ ను తిరిగి ఇచ్చి వేయటం దేశంలో  తలెత్తుతున్న ఫాసిస్ట్ శక్తులను గుర్తించటం లో భాగంగా చేసిన హెచ్చరిక.

ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే చెప్పటం ఆవిడకి కొత్త కాదు.  1967-75 లో  ఇందిరాగాంధీ గురుంచి కూడా యిలాగే హెచ్చరించింది.  అందరూ ఇందిరని భుజాలకెత్తి మోస్తున్నపుడు యిది ప్రజాస్వామ్య పోకడ  కాదని, వ్యక్తి పూజ అని నెహ్రూ ఏర్పరచిన విలువల విధ్వంసం అని నైనతార తడువుకోకుండా, మొహమాటం  లేకుండా ఎంత గట్టిగా చెప్పాలో అంత గట్టిగా చెప్పింది.  ఇలా చెప్పడానికి ఆవిడ కున్న అర్హతని, సాధికారతని మనం తెల్సుకోవాలంటే ఆవిడ గురించి  తెల్సుకోవలసిందే.

నైనతార సెహగల్ భారత దేశం లో సుపరిచితమైన నెహ్రూ కుటుంబానికి చెందిన మనిషి.  నెహ్రూ – గాంధీ కాదు, నెహ్రూ కుటుంబం మాత్రమే.  ఈ విషయం ఆవిడ చాలా గట్టిగా నొక్కి చెపుతుంది.  మోతీలాల్  నెహ్రూ కూతురు, జవహర్ లాల్ చెల్లెలు అయిన విజయ లక్ష్మీపండిట్, రంజిత్ సీతారామ పండిత్ ల  రెండవ కూతురు, నైనతార.  10 మే 1927 జన్మదినం.  నెహ్రూ భావాలన్న, ఆలోచనలన్న, ప్రజాస్వామ్య విలువలన్న నైనతారకు విపరీతమైన గౌరవం.  ఆవిడ నమ్మిన విలువలు, సిద్ధాంతాలు అన్నిటికి ఈ రోజుకు కూడా నెహ్రూ భావజాలమే ఆధారం.  తల్లిదండ్రులు జైళ్ళ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఇందిరతో కల్సి ఆనంద భవన్ లోనే  వుండేది.  ఇద్దరూ కల్సి బోర్డింగ్ స్కూల్ కు వెళ్ళేవాళ్ళు.  వయసులో ఇందిర పెద్దదైనా యిద్దరి మధ్య చాలా మంచి స్నేహం వుండేది.  ‘ఇంది’ అని పిలిచే అంత చనువు.

జీవితం చాలా చిత్రమైనది.  1967 ప్రాంతం లో ఇందిర కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లో తీసుకునే ప్రయత్నాలలో వుంది.  అదే సమ యంలో గౌతమ్ సెహగల్ తో విడాకులు తర్వాత తప్పని పరిస్థుతులలో బతుకు తెరువు కోసం నైనతార ఢిల్లీ వచ్చి స్థిరపడింది.  ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ పత్రిక లో రాజకీయ వ్యాఖ్యాతగా వ్యాసాలు రాయటం మొదలు  పెట్టింది.  దేశంలోనే మొదటి మహిళా రాజకీయ వ్యాఖ్యాత అయింది.  అదే ఆవిడ జీవితంలో వచ్చిన పెద్ద మలుపు.  ఆర్ధిక అవసరాలు ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టి మరింత విస్తృతంగా రాసేలా చేశాయి.  సండే స్టాండర్డ్ కి ఆవిడ 14 యేళ్ళు ఏకధాటిగా కాలమ్ రాసింది.  ఇది కాక ఎమర్జెన్సీ ముందు అజిత్ భట్టాచార్జీ నిర్వహణ లో, జయ ప్రకాష్ నారాయణ్ ప్రచురించిన పత్రిక ‘ఎవ్విరి మెన్స్ వీక్లీ’ కి రచనలు చేసింది.  వీటితో పాటు ‘ది న్యూ రిపబ్లిక్’, ‘అట్లాంటిక్ మన్త్ లీ’, ‘లండన్ టైమ్స్’, ‘ది ఫార్ ఈస్ట్రన్ ఎకనామిక్ రివ్యూ’ లాంటి పేరొందిన పత్రికలకి కూడా విస్తృతంగా రాసింది. రాజకీయాల పట్ల ఆవిడకున్న అనురక్తితో పాటు, రాజకీయ రాజధానిగా ఢిల్లీ నైనతారకి సంఘటనలను దగ్గిర నుంచి చూసి, లోతైన విశ్లేషణ చేసే అవకాశాన్ని కల్పించింది.  ఇందిర నెహ్రూ విధానాలను వదిలేసి, వ్యక్తి స్వామ్యానికి ప్రతీకగా మారటం ఆవిడ గుర్తించింది. ఇదే విషయాన్ని ఆవిడ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది.  ఆ వ్యతిరేకత ఎంత వరకూ వెళ్ళిందంటే ఇందిరాగాంధీతో ఆవిడ సంబంధాలు మొహం మొహం చూసుకోలేనంతగా దిగజారి పోయాయి.  నైనతార తో పాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్, ఫ్రాంక్ మొరేస్, సండే  స్టాండర్డ్ ఎడిటర్, నందన్ కాగల్ గొంతు కలిపారు.    1969 నాటికి ఈ మాటల దాడి నైనతారకి ‘జర్నలిస్ట్’ గుర్తింపుకు కూడా అనర్హమైన దానిగా చేశాయి.  అదే సమయంలో ఇందిర పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ బలమైన శక్తిగా ఎదగటం మొదలు పెట్టింది.  బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటి పాపులిస్ట్ విధానాలను ప్రకటించింది.  అయితే నైనతార వీటన్నిటినీ వ్యతిరేకిస్తూనే వచ్చింది.  గ్రామీణ పరపతి వ్యవస్థని పటిష్టం చేయకుండా కొద్ది మంది పారిశ్రామిక వేత్తలకి రుణాలు యివ్వటం ఏవిధంగా సమంజసం అని ప్రశ్నించింది.  కాంగ్రెస్ పార్టీలోని ఒక

బలమైన వర్గం మిగతా వారి పట్ల ఎప్పుడూ లేనంత దురుసు ద న్నాన్ని ప్రదర్శించి ప్రజాస్వామ్య విలువలని కాల రాసింది అని తీర్మానించింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవటం, దాన్ని నిలబెట్టుకోవటానికి తప్పుడు దార్లు ఎంచుకోవటం ఇందిర చేస్తున్న పొరపాట్లు అంది.  ఒకప్పటి విలువలకు కాంగ్రెస్ తిలోదకాలు యిచ్చి, బేరసారాలలో కూరుకు పోయిందని రాసింది.  మరో పక్క  మతపరమైన తీవ్రవాద భావాలున్న జనసంఘ్(బి జె పి పూర్వ రూపం) ‘హిందీ – హిందూ –హిందూస్తాన్’ అనే ప్రమాద కరమైన నినాదాలను  ఎత్తు కుంటోందని కూడా గుర్తు చేసింది. పార్టీ లో విమర్శకు తావు లేదు.  ఓ పద్ధతిలో పెరిగిన వ్యక్తి పూజ ఏ విధమైన జవాబుదారీతనం లేకుండా చేసిందని భావించింది.  సొంత నియమ నిబంధనలను గౌరవించని పార్టీ, దేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించగలుగుతుందీ? అని ప్రశ్నించింది.  అదే సంవత్సరం డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ చీలి పోవటం ఆవిణ్ణి చాలా నిరాశపరచింది. బంగ్లాదేశ్ యుద్ధంతో ఇందిర విజయ పరంపరలు, అప్రతిహతం గా సాగడం, ఇందిర ఎవరికి అందనంత ఎత్తు ఎదగటం జరిగాయి.

బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిర విజయాన్ని గుర్తిస్తూ, విదేశీ వ్యవహారాలలో ఇందిర చూపుతున్న పరిపక్వతను మెచ్చు కుంటూనే, పెరుగుతున్న ధనిక, పేద అంతరాన్ని, నక్సలిజం పట్ల యువతలో పెరుగుతున్న అదరణని గుర్తుచేసింది.    1974 లో బీహార్ లో నిప్పు రవ్వలా మొదలైన విధ్యార్థుల ఉధ్యమం జయ ప్రకాష్ నారాయణ్ (J.P.) ఆధ్వర్యంలో ఇందిరను చుట్టుముట్టినపుడు నైనతార జె.పి. తో కల్సి పని చేసింది.  1975 లో దేశంలో ఎమెర్జెన్సీ విధించినపుడు నైనతారని అరెస్టైతే చేయలేదు గాని నోరెత్తకుండా చేయగలిగారు.   తర్వాత తర్వాత మంచికో చెడుకో రాజకీయాలలో జేరి, దశాబ్దం పాటు అనేక ఆటుపోట్లను ఎదురుకొంది. 1982 లో ఇటలీ అంబాసిడర్ గా ఖరారైన నియామకాన్ని ఇందిర పదవి లోనికి రాగానే రద్దు చేసింది.

ఇందిర తో తన సంబంధాలు దెబ్బ తినటం నైనతార ని చాలా భావోద్వేగాలకి గురి చేసింది.  ఒక దశలో ఈ వ్యాసాంగాన్ని ఆపేద్దామనుకొంది.  అయితే ఏ విలువలకైతే నెహ్రూ కట్టుబడ్డాడో ఆ విలువల్ని సొంత కూతురే కాల రాయటం నైనతార జీర్ణించుకో లేకపోయింది.  అందుకే ఇందిర చేసే ప్రతీ పని ఆవిడకి తప్పు గా తోచేది.  తర్వాత రోజుల్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తనకి ఆ రోజుల్లో పరిపక్వత లేకపోవడం వల్ల కొన్ని విషయాలను తప్పుగా అవగాహన చేసుకున్నాను అని ఒప్పుకుంది.  అందువల్ల వ్యక్తిగతం గా తను చాలా నష్ట పోయాను అని కూడా బాధ పడింది.

నైనతార 9 నవలలు రాసింది.  8 నాన్ ఫిక్షనల్ రచనలు చేసింది.  చిన్న కథల పుస్తకాలు వేసింది.  రాజకీయ, సాహిత్య వ్యాసాలు అనేకం రాసింది.  ఆవిడ రా సిన పుస్తకం ‘’ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ అండ్ స్టయిల్” 1977 లో ప్రచురించారు.  ఆ తర్వాత దీనిలోనే మరింత చేర్పులు చేసి “ఇందిరాగాంధి – హెర్ రోడ్ టు పవర్” గా మళ్ళీ వేశారు.  తన ప్రతి నవలలోను రాజకీయ వాతావరణాన్ని, నేపధ్యాన్ని ప్రతిబింబించిన ఏకైక ఇంగ్లీష్ రచయిత.  ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆంగ్లో ఇండియన్ రచయిత కూడా ఆవిడే.    సహచరుడు, మంగత్ రాయ్, నైనతార మధ్యన నడచిన ఉత్తరాల్ని 1994 లో “రిలేషన్ షిప్” పేరుతో పుస్తకం గా వేశారు.  అది చాలా సంచలనం రేపింది.     నైనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రితు మీనన్ రాసిన పుస్తకం, “ఔట్ ఆఫ్ లైన్ : ఎ లిటరరీ అండ్ పొలిటికల్ బైయోగ్రఫీ ఆఫ్ నైనతార సెహగల్” గత యేడాది విడుదలైంది.  1980 ల మధ్య లో నైనతార చాలా కాలం ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబెర్టీస్’ (PUCL) కి జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసింది.  సిక్కుల వూచకోత మీద సమగ్ర నివేదిక ఇవ్వటం లో ప్రముఖ పాత్ర వహించింది.  ఆవిడ రాసిన కొత్త  కథల సంపుటి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసిన, నైనతార చేసిన పని సమాజంలో ఒక అలజడిని సృష్టిస్తోంది.  మేధావి వర్గంలో ప్రకంపనలను సృష్టిస్తోంది.  నైనతార ఒక రెబెల్ తార.

*

 

మీ మాటలు

 1. చాలా బావుంది. సిక్కుల ఊచకోతప్పుడు ఎందుకు చెయ్యలేదు? అప్పుడెందుకు చెయ్యలేదు? ఇప్పుడెందుకు చెయ్యలేదు? అన్న మూర్ఖ – శుష్క ప్రశ్నలకి మొదటి వాక్యం లోనే మంచి సమాధానం దొరికింది. థాంక్స్.

  • pavan santhosh says:

   సమాధానమేమీ లేదే. ఆవిడ సిక్ఖు ఊచకోతలు జరిగిన వేడిలోనే, ‘‘వటవృక్షం కూలినప్పుడు భూమి కంపిస్తుందం’’టూ ఇందిర మరణానికి సిక్ఖుల ఊచకోతలు తప్పవన్న అర్థంతో మాట్లాడిన వ్యక్తి ప్రధానిగా ఉండగానే అవార్డు స్వీకరించారు. దానికే సమర్థనా కుదరదు.

 2. రాణీ రాజ సులోచనా దేవి says:

  అవును ఇలాంటి ధిక్కార స్వరాలే….ఇప్రుడు కావాల్సింది. మొత్తానికి ఈ దేశంలో బుద్ధి జీవులంటూ కొందరు మిగిలారని నయనతార గారు నిరూపించారు.

 3. buchi reddy says:

  యీ రోజు పేస్ బుక్ లో Wilson sudhakar.. గారు పోస్ట్ చేశారు

  1– N. వేణుగోపాలరావు గారికి ప్రబుత్వం నుండి భూమి యివ్వడం జరిగింది — ఎందుకు
  తిరిగి వఫాస్ యివ్వడం లే దు ???
  2- p.vanaja.. గారికి గోయింక award.. తిరిగి ఎందుకు రిటర్న్ చేయాలే దు

  3– పోలీస్ కేసు — ilaaiah.. గారి మిధ — విరసం ఎందుకు స్పందించడం లేదు అని
  అంతా సుధాకర్ గారి పోస్టింగ్ మాత్రమే —
  వీటి వివరాలు తెలియ చేస్తారా ఎవరు అయినా ??????????????????

  Krishna గారు మీ ఆర్టికల్ బాగుంది సర్
  —————————————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*