దిగజారిన విటుడు  

 

చింతామణి .. వేశ్య

భవానీశంకరం: పాత విటుడు

 

భవానీ:         ఈ పూట పూర్తిగా ముస్తాబయ్యావు, ఏంటి కథ?

చింతా: కొత్తబేరం తగిలింది, తెలిసిందా?

భవానీ:         అంత కోపమెందుకు?

చింతా: లేకపోతే ఏంటి? ఎవరో డబ్బిస్తామన్నారని చెప్పి వెళితే, తెస్తావు కదా అని ముస్తాబై ఎదురు చూస్తూ కూర్చున్నాను. అదేం పాపమోగానీ, మగవాళ్ళకు ఆడవాళ్ళ మీద అనుమానం తప్ప నమ్మకం ఉండదు.

భవానీ:         నిన్ను నమ్మని వాడు నాశనమై పోతాడు. చతురుకన్న మాటకు అంత కోపమెందుకు?

చింతా: చతురుకైనా హద్దుండాలి. ఒళ్ళు మండే చతురా?

భవానీ: పోనీలే, పొరపాటైంది. సరే గానీ సుబ్బిశెట్టెందు కొచ్చాడు?

చింతా: అదుగో, ఇంకేం? మనసులో ఏదో కుళ్ళు ఉండనే ఉంది. అయితే, ఆ సంగతి మీకెవరు చెప్పారు?

భవానీ:         నేను చూశాను. వీథి గుమ్మంలోంచి వస్తే, మీ అమ్మ చూస్తుందని పెరటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి, తటాలున తలుపు తీసి అతగాడు బయటి కొచ్చాడు. నన్ను చూసి అతడు, అతన్ని చూసి నేనూ తెల్లబోయాం. అతని కనుమానం రాకుండా కబుర్లు చెప్తూ కొంత దూరం వెంట వెళ్లాను.

చింతా: (తనలో) అతని రాకను గురించి ఇతను అడిగే ఉంటాడు. సుబ్బిశెట్టి కోమటి బిడ్డ. కోసినా నిజం చెప్పడు. కానీ అతడేం చెప్పాడో తెలియకుండా నేనేం చెప్పినా చిక్కే! సరే, ఒక బాణం వేసి చూద్దాం! (పైకి) ఎందుకొచ్చావని అతన్నే అడక్క పోయారా?

భవానీ:         అడిగాను. మేళం కావాల్సి వచ్చానన్నాడు.

చింతా: కదా, ఇంకా మీ సందేహమేంటి?

భవానీ:         చెప్తే కోపగించుకోవు గదా?

చింతా: కోపమెందుకు? నాలో ఏ తప్పూ లేనప్పుడు?

భవానీ:         సరే అయితే చెప్పేస్తున్నాను. మేళం కోసం వచ్చినవాడు చక్కగా వీథి గుమ్మంలోనుంచి పోక బెదుర్తూ పెరటి తోవన పోవడమెందుకూ అని నా సందేహం. అదుగో మొహం చిట్లిస్తున్నావు. అప్పుడే వచ్చేసింది కోపం.

చింతా: మేళం కోసం వచ్చినవాడికి మర్యాద చేయాలి కాబట్టి కూర్చోబెట్టి తాంబూలమిస్తే, వాడు వంకర మాటలు మొదలెట్టాడు. నాకు చిరాకు పుట్టి లోపలికి వెళ్ళిపోయాను. మా అమ్మ అది గ్రహించి తోట చూపించే మిష మీద అతన్ని దొడ్లోకి తీసుకు పోయి ఆ దారినే బయటికి పంపింది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిందిది.

భవానీ:         నమ్మక పోవడమేమిటి? నువ్వు నాతో నలుసంత అబద్ధం కూడా ఆడవనే నానమ్మకం.

చింతా: మీతోనే కాదు, ఎవ్వరితోనూ నేను అబద్ధమాడను. చింతామణి వేశ్య కులంలో పుట్టాల్సింది కాదని చిన్నా పెద్దా అందరూ నన్ను మెచ్చుకొనేదందుకే!

భవానీ:         నిజమే, మన వూళ్ళో వేశ్యలెంతో మంది ఉన్నారు. అందరూ దొంగమాటలు చెప్పి వందలూ వేలూ గుంజే వాళ్ళే గానీ నీకు లాగా మంచీ చెడ్డా విచారించే వాళ్ళు లేరు సుమీ!

చింతా: ఏమి లాభం లెండి? వేశ్య అనగానే అందరికీ చులకనే! వెలయాలి మంచితనం, ఊరి కరణం మంచితనం ఒక్కళ్ళూ మెచ్చుకోరు. సరేగానీ, మీరెళ్ళిన పనేమైంది?

భవానీ:         రెండు మూడు రోజుల్లో తప్పకుండా అవుతుంది.

చింతా: ఎప్పుడూ చెప్పే మాటే! ఇదివరకు రేపు, రేపు అనేవారు. ఇప్పుడా రేపుకు మరో రెండు తోపులు కూడా తగిలాయి.

భవానీ:         ఏం చెయ్యను? ఇప్పటిదాకా ఇదిగో అదిగో అని తిప్పినవాడు ఈపూట తొంటిచెయ్యి చూపించాడు.

చింతా: మీరా తొంటి చేతులు తెచ్చి నా యింటికి తోరణం కడతారు. అంతేనా?

భవానీ:         మాట సాంతం విను.

చింతా: ఇప్పటికి ఇరవై రోజుల్నుంచి విని విని ప్రాణం విసిగి పోయింది. ఇంకేమి వినేది? ప్రతి రోజు మా అమ్మ పోరు పడలేక చస్తున్నాను. ఇంకా పడలేను. ఇంతటితో మీదారి మీది, నాదారి నాది.

భవానీ:         నువ్వా మాటంటే నేను బతకలేను. నీకోసం బంధువుల్ని, ప్రాణస్నేహితుల్ని, తాళికట్టినభార్యనీ వదిలేశాను. ఇల్లూ వాకిలీ, సిగ్గూ ఎగ్గూ అన్నీ నీకోసం వదిలేశాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే నేనిక ప్రాణం వది లెయ్యడం తప్ప మరో మార్గం లేదు.

చింతా: నన్ను మాత్రం ఏమి చెయ్యమంటారు? ఈ నెలలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?

భవానీ:         ఎక్కడా అప్పు పుట్టక పోతే నేను మాత్రం ఏమి చేసేది? ఉన్నప్పుడు ఏమైనా వెనకాడానా? తాతలనాటి భూములన్నీ తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి పోశాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదుల కమ్మి సొమ్ములు చేయించాను. అత్తగారిచ్చిన అంటుమామిడి తోట నీకే రాసిచ్చాను. పెళ్ళాం నగలు తాళిబొట్టుతో సహా నీకే తెచ్చి పెట్టాను. కులపు వాళ్ళందరూ నీకిది తగదని చెప్పినా విన లేదు. పెళ్ళాం నూతికీ గోతికీ పరుగెత్తినా లెక్క చేయకుండా నీ ఇంటికి కుక్కలాగా కాపలా కాస్తున్నాను.

చింతా: సరే, నేనేమన్నా లోటు చేశానా? తనకున్నదంతా నాకు ధార పోసిన సీతాపతిని రాకుండా మాన్పించేశాను. ముచ్చటగా మేడ కట్టించి యిచ్చిన పోలిశెట్టిని మొహం చూపించొద్దన్నాను. నిమిషంలో మాన్యం రాసిచ్చిన ఆదిరెడ్డిని వెళ్ళగొట్టాను. కోరితే బంగారపు కొండనైనా తెచ్చిచ్చే పెద్దిశెట్టికి మంగళం పాడేశాను. కొత్త కొత్త సరసులు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వాళ్ళను చూపించి మా అమ్మ రోజూ నన్ను కసురుతూనే ఉంది. అయినా మీకే లోబడి ఉన్నాను గానీ, నీతి తప్పలేదే!

భవానీ:         నువ్వు లోటు చేశావని నేనన్నానా? మీ అమ్మైనా నన్ను పల్లెత్తుమాట అన్న పాపాన పోలేదు. పరిస్థితి కొంచెం తారుమారైనప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎంతటి వాళ్ళకైనా ఉండేవే! కానీ, పడిన గోడలు పడినట్టే ఉండవు. అందుకే దేవుడు నాకతన్ని చూపించాడు.

చింతా: ఎవర్ని చూపించాడు?

భవానీ:         ఇందాకదే చెబుతూంటే నా మాట సాంతం వినలేదు నువ్వు. ఆ కనబడిన వాడి పేరు బిల్వ మంగళుడు. ఏటి కవతల కర్మాగారాలు కట్టి కోట్ల మీద వ్యాపారం చేస్తున్న వాసుదేవమూర్తి గారి కొడుకు. నాకు బాల్యస్నేహితుడు.

చింతా: బిల్వమంగళుడు గారంటే ఎర్రగా పుష్టిగా పొడుగ్గా ఉంటారు. ఆయనేనా?

భవానీ:         ఆయనే, ఆయన్ని నువ్వెప్పుడు చూశావు?

చింతా: ఒకసారి గోపాలస్వామివారి కోవెలలో కళ్యాణాలప్పుడు చూశాను. వారు చాలా భాగ్యవంతులని వినికిడి. ఏమాత్రం ఉంటుందేంటి?

భవానీ:         కోట్లలో ఉంటుంది.

చింతా: ఆయన్నొక్కసారి మనింటికి తీసుకొస్తారా?

భవానీ:         ఎందుకు?

చింతా: ఆ వివరం నన్నిప్పుడడగొద్దు. నా నీతి తప్పనని మాత్రం నమ్మండి.

భవానీ:         నువ్వు నీతి గలిగిన దానివనే విషయంలో నాకేమాత్రం అనుమానం లేదు. కానీ అతన్నిక్కడికి తీసుకురావడం మాత్రం సాధ్యమయ్యే పనికాదు.

చింతా: ఎందుకని?

భవానీ:         మహా పండితుడు….

చింతా: వ్యాసుడి కంటేనా?

భవానీ:         నిష్టాగరిష్టుడు…….

చింతా: విశ్వామిత్రుడికంటేనా?

భవానీ:         బహు నీతిమంతుడు………

చింతా: విప్రనారాయణుడి కంటేనా?

భవానీ:         పరస్త్రీ పరాజ్ఞ్ముఖుడు.

చింతా: ఋష్యశృంగుడి కంటేనా? ఎందుకీ లక్క గేదె బేరాలు? మగవాళ్ళెన్ని బింకాలు పోయినా, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆడది తారసపడేవరకే! ఒక్కసారి ఆడదాని ఓరచూపుల వేడి తగిల్తే ఎంతటి మగవాడైనా వెన్నలాగా కరగాల్సిందే!

భవానీ:         నిజమే కానీ, అతని భార్య భూలోక రంభ.

చింతా: పిచ్చోడా, సానులదగ్గరికి పోయేవాళ్ళు పెళ్ళాలు అందంగా లేక పోతున్నారనుకుంటున్నావా? ఎవరో ఎందుకు? మీఆవిడ సంగతి చెప్పు. బంగారబ్బొమ్మ కదా, అట్లాంటి అందగత్తెను వదలి నువ్విప్పటి కెన్ని కొంపలు దూరావు చెప్పు?

భవానీ:         నీ కెవరూ సమాధానం చెప్పలేరు.

చింతా: అవసరం లేదు. నేను చెప్పినట్టు ఆయన్నిక్కడికి తీసుకొచ్చే బాధ్యత మీది. ఆయన్ని ఆక ర్షించి మనింట్లో కట్టి పడేసే భారం నాది. ఆపైన ఆయనకున్న ఆస్తిలో సగం మీది, సగంనాది.

భవానీ:         పిచ్చిదానా, నీదేంటి, నాదేంటి? నాకేమీ అభ్యంతరం లేదు. నన్ను గంగలో దూకమన్నా కళ్ళు మూసుకు దూకుతాను.

చింతా: సరే, పోయి ఆ పని చూడండి.

 

మీ మాటలు

*