‘కాస్త దూరం జరగవూ?’

 

అది ఏ కాలమూ, ఏ సమయమూ అని పట్టించుకోవాలనిపించని సందర్భాలు కొన్ని ఉంటాయి. పక్కన నువ్వున్న స్పృహ తప్ప ఇంకేదీ తెలీని, అక్కర్లేని సందర్భాలవి!

అలసటతోనో, బద్దకంగానో చేరువలో ఒత్తిగిల్లి ముడుచుకుంటున్న నిన్ను చేతులు చాచి, తపనగా మెడవంపులో తలని దాచుకున్నప్పుడు… మాటలు అక్కర్లేని ఇష్టంతో అరచేతిలో ముద్దు పెట్టుకోవాలని వున్నప్పుడు, ఇంచుమించు అప్పుడే,

రాబోయే కలల సంకేతాలతో బరువెక్కిన కళ్ళని మెల్లగా తెరిచి నువ్వు నవ్విన చప్పుడు!

కేవలం అప్పుడు మాత్రమే, వెంట్రుకల్లోకి మృదువుగా వేళ్ళు జొనిపి  అపురూపంగా దూరం జరపాలనిపిస్తుంది! చేతుల మధ్యనున్న వసంతాన్ని పక్కన కూర్చోబెట్టుకుని నిశితంగా పరికించాలనిపిస్తుంది!

వెన్నెల తారట్లాడే ముఖాన్ని, దానిపై కదలాడే ఒక పసినవ్వునీ అప్పటికప్పుడు చూడకుండా ఉండలేని నిస్సహాయతతో వేడుకుంటుంటాను, ‘కాస్త దూరం జరగవూ?’

 

 

దూరం:

నీ తల ఒత్తిడి వల్ల దిండు మీద పడ్డ ఆకృతి ఇంకా అలానే ఉంది

తేమతో కూడిన నీ శరీరపు సువాసన దుప్పట్లో తేలియాడుతోంది
చేతుల్లో కదలాడుతున్న నీ మోము పరిమళం

నా నుదుటిపైన నీ పెదవుల కదలికలు

ఇంతలా దగ్గరైతే ఇక నిన్నెలా చూశేది?

కాస్తంత విడిపడ్డావనుకో నీ ముఖాన్ని చూడగలను!

Phaasala:

Takiye pe tere sar ka woh tippa hai, pada hai

Chaadar mein tere jism ki woh saundhi si khushbu

Haathon mein mehekta hai tere chehre ka ehsaas 

Maathe pe tere honto ki mohar lagi hai

 

Tu itni qareeb hai ki tujhe dekhun to kaise

Thodi si alag ho to tere chehre ko dekhun 

 

****************

gulzar

ఇంటినిండా సర్దినవీ, సర్దాల్సినవీ వస్తువులూ, పుస్తకాలూ, బట్టలూ… అన్నీ నీ చేత ఎంపిక చేయబడినవే! నువ్వూ, నీ వెంటే నీ ఊపిరీ కదిలెళ్ళిపోయాయి కానీ, నీ దేహపు జాడలింకా చుట్టూ ఉన్నట్లే ఉంది. పసుపు గులాబీ చెట్టు నాటుతూ, మధ్యలో ఆసరా కోసమనుకుంటా పక్కనే ఉన్న తెల్లగోడని పట్టుకున్నావు. పూచిన పూల వంక చూద్దామనే అనుకుంటాను కానీ, గోడ మీద మిగిలిన నీ చేతి మరకల నించి అస్సలు మళ్ళించలేను కళ్ళని!

నువ్వు వెళ్ళేరోజు విడిచివెళ్ళినవో, లేక వేసుకుందామని వదిలి వెళ్ళినవో మరి ఆ దుస్తులన్నీ ఉతికి శుభ్రం చేసి, తగిలిస్తుంటాను.. వాటి మీద దీపావళి రాత్రి అంటుకున్న నల్లటి చారిక మాత్రం అంతకంతకూ చిక్కబడుతోంది!

ఏ రోజు ఏ పూట అయినా నువ్వొచ్చి ‘ఇదేంటి ఇల్లంతా!?’ అని గదమాయిస్తావని ఏవో సర్దుదామనీ, అంతా శుభ్రం చేద్దామనీ అనుకుంటాను కానీ, బాల్కనీలో, మంచం మీదా, వంటింటి పాత్రల నిండా ఉన్న నిశ్శబ్దాన్ని మాత్రం తుడిచేయలేక పోతున్నాను.

మొత్తం కొల్లగొట్టబడింది… నా లోపలి నించో? ఇంటి లోపలి నించో?

 

 

బట్టలు:

నా బట్టల మధ్యలోనే తగిలించి ఉంటాయి నీ అందమైన రంగురంగుల బట్టలు

ఎప్పుడూ నేనే ఇంట్లో వాటిని ఉతికి, ఆరవేసి, ఆ తర్వాత

నా చేతులతో స్వయంగా ఇస్త్రీ చేస్తాను కానీ,

వాటి ముడుతలు ఎంత ఇస్త్రీ చేసినా పోనే పోవు

అదే కాదు, ఎంత ఉతికినా గతంనాటి మనోవేదనల మచ్చలు వదలనే వదలవు!

జీవితం ఎంత సులభమయ్యేదో కదా

ఒకవేళ ఈ బంధాలన్నీ దుస్తుల్లా ఉండి ఉంటే

షర్ట్ మార్చినట్టు ఎప్పటికప్పుడు మార్చుకోగలిగితే!

 

 

Libaas:

Mere kapdon mein taanga hain tera khushrang libas

Ghar pe dhota hun har bar main use, aur sukha ke phir se,

Apne haathon se use istrii kartaa hun magar,

Istrii karne se jaathii nahin shikne uskii,

Aur dhone se jile-shikvon ke chikatte nahin mitthe

Jindagii kis kadar aasaan hothii

Rishte gar hote libaas —

Aur badal lete kamiijon kii tarah!

——————

Artwork: Satya Sufi

మీ మాటలు

  1. అద్భుతమైన కవిత . బొమ్మెంత బాగుందో !!!

  2. విలాసాగరం రవీందర్ says:

    మంచి అనువాదాలు … కవితలు వివరణ బాగున్నాయి

  3. నిషిగంధ says:

    థాంక్యూ సో మచ్ భవానీ గారు, రవీందర్ గారు!

మీ మాటలు

*