ఆమె ఎందుకు వెళ్ళిపోయింది …

సత్యా గోపి 
~
 DSC_0007
ఆమెనొకసారి మళ్ళీ ఒంపుకున్నపుడు
ప్రవహించడం నావంతుగా జరుగుతూంటుందెపుడూ
1
నిర్లిప్తంగా ఒదిగిపోయే జ్ఞాపకం కదామె !
2
వచ్చినా వెళ్ళినా భావోద్వేగాల కెరటమొకటి
మేఘాలదాకా పరుచుకున్నట్టుగానో
ఊపిరాగిన క్షణమొకటి హఠాత్తుగా ఉబుకినట్టుగానో
దేహానికి పచ్చితిత్తొకటి బిగించినట్టుగానో
3
లోపలివైపెక్కడో ఖాళీరహదారిమీద దిగులొకటి కనపడుతూ వుంటుందెందుకో…
4
దుఃఖాల్లోకి నవ్వులు ప్రసరించినంత ధీర్ఘంగా వచ్చినపుడు
మాటల్లోని భావం ప్రయాణించినంత సుధీర్ఘంగా వచ్చినపుడు
కలిసి నడిచిన సమయాన్నంతా సునిశితంగా దాచుకోలేదెందుకనో..
పగలుగానో..రాత్రిగానో..ఋతువులాగానో
నిష్క్రమణ జరిగిపోతుంది
5
ఆమె ఎందుకు వెళ్ళిపోయింది
దృశ్యం మీదనుంచి దృశ్యం మీదకు చూపు వెళ్ళిపోయినంత సునాయాసంగా
నిన్నటిలోంచి ఇవాళ్టిలోకి వచ్చినంత సులభంగా వెళ్ళిపోయింది
ఆమె ఎందుకు వెళ్ళిపోయిందనేదే పరమావధి
6
వెళ్ళిపోవడం ఒక శూన్యం
శూన్యంలోంచి శూన్యంలోకి వెళ్ళిన చప్పుడు ఆమెది…

 

మీ మాటలు

 1. lasya priya says:

  ఆమెనొకసారి మళ్ళీ ఒంపుకున్నపుడు
  ప్రవహించడం నావంతుగా జరుగుతూంటుందెపుడూ

  ఆవేదనా పూరితమైన ఎత్తుగడ .

  వెళ్ళిపోవడం ఒక శూన్యం
  శూన్యంలోంచి శూన్యంలోకి వెళ్ళిన చప్పుడు ఆమెది…

  .ఆలోచనాపూరితమైన ముగింపు…
  అద్భుతంగా ఉంది గోపి …సారంగలో నీ కవిత చూడగానే భలే ఆనందంగా ఉంది. సూపర్బ్

  • SatyaGopi says:

   థ్యాంక్స్ లాస్య గారు…నీ మాటలెపుడూ ప్రోత్సాహాన్నిస్తాయి

 2. చాలా బాగుంది గోపి గారు

 3. కవిత బాగుందండీ

Leave a Reply to SatyaGopi Cancel reply

*