మారుమూల పల్లెలో కవిత్వానికో గూడు!

 

అది ఒక  మామూలు పల్లె. మారుమూల వాగు వొడిలో తలదాచుకున్న పల్లె. దాన్ని కవిత్వ పటం మీద స్ఫుటంగా నిలపాలని యాకూబ్ స్వప్నం. ఆ స్వప్న సాకారానికి కొన్ని రూపాలు: మూడు పురస్కారాలూ, ఒక కవిత్వ లైబ్రరీ. ప్రతి అక్టోబరు పదినా అక్కడ కవిత్వ ఉత్సవం. ఆ సందర్భంగా ఈ ప్రత్యేక విశేషాలు…

~

కవిత్వం ఒక సాంస్కృతిక సంభాషణ. భాషని ఆధిపత్యంలో ఉంచుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తి , సమూహం, ప్రాంతం పెరుగుదలే. కాని భాషని ఇవ్వడం, మరొకరితో పంచుకోవడం అంటే , చాలా ఉన్నతమైన భావన మాత్రమే కాక, ఒక మార్పుకు నాందీసూచన కూడా !

సమకాలిక కవిత్వం కవిని సమూహంతో కలిపే ప్రయత్నం చేయాలి. కవి ‘నేను మీలో ఒకడ్ని అంటే’ పాఠకుడు ‘నువ్వు నాలో ఒకడివి’ అన్న ప్రతిస్పందన రావాలి. కాని ఆధునికత పేరిట మనం మన వేర్లనుండి విడిపోతున్నాం. నానాటికి దూరంగా జరిగిపోతున్నాం.అలా జరిగిపోవడం గమనించినా ఏమీ చేయలేని అశక్తులుగా మిగిలిపోతున్నాం.
మనం గ్రామాల నుండి ఎంత దూరంగా వెళ్ళిపోతే వాటి జ్ఞాపకాలు మనని అంతే వెనక్కు సదా లాగుతుంటాయి .

yakub

ఇలా ఎన్నెన్నో ఙ్ఞాపకాల ఊట రొట్టమాకురేవులోని బుగ్గవాగులా సదా మదిలో నాలో పారుతూనే వుంది. ఈ చిన్నపాయ వివిధ రూపాల్లో ప్రత్యక్షమై వెంటాడుతూనేవుంది.

అలాంటి తరుణంలో కేరళ లో ‘తుంచన్’ అనే కవి స్మారకంగా నిర్మించిన “తుంచన్ మెమొరియల్ ట్రస్ట్ “, కుమారన్ ఆసన్ స్మారక కేంద్రం ; హైదరాబాద్ లోని “లమకాన్”, ‘గోల్డెన్ త్రెషొల్డ్’లను చూడ్డం జరిగింది. కేరళ, కర్ణాటక, ఉత్తర భారత ప్రాంతాలలోని మరికొన్ని గ్రామీణ సాహిత్య కేంద్రాలు చేస్తున్నపనులు ఆకర్షించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు సాహిత్య, సాంస్కృతిక కేంద్రాలుగా మారవలిసిన అవసరం వుందని అన్పించింది.
చిన్నప్పుడు ప్రతి ఉదయం పల్లెలలో తిరిగే బుర్రకధలవాళ్ళు, తంబురకధలవాళ్లు, బుడబుక్కలవాళ్లు, ఒగ్గు కథలవాళ్లు ఇలా ఎన్నెన్నో కళారూపాలను చూసిన కాలం గుర్తొచ్చింది. రొట్టమాకురేవులాంటి పల్లెటూర్లో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షకు ఈ ఎడతెగని ఆలోచనే ప్రేరణగా నిలిచింది . అందుకు వున్న కొద్దిపాటి వనరులతో , మిత్రుల సహకారంతో ఈ చిన్ని ప్రయత్నం, ప్రయోగం చేయడానికి సంకల్పించాం. భవిష్యత్తులో అదొక కల్చరల్,పొయెట్రీ సెంటర్ గా ఎదగాలని,ఈ ప్రయత్నం మరికొన్ని ప్రాంతాలకు స్ఫూర్తిగా మారాలని లోపల ఎక్కడో చిన్ని ఆశ.

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తుందని, అతి త్వరగా ఊపందుకుంటుందన్న భరోసా మాత్రం వుంది .
కవిత్వం అంటే కేవలం రాయడం ,చదవడంతో మాత్రమే సరిపోదు. కవిత్వ వాతావరణాన్ని కల్పించడంకూడా ముఖ్యం. పొయెట్రీ స్పేస్ కూడా ముఖ్యం. ఇతర భాషల కవిత్వం వినడం, కవులను కలవడం, మన కవులను కలపడం ఇదంతా జరగాలి. ఇదొక ప్రాసెస్ లో నిరంతరంగా జరగాలి. అప్పుడు మాత్రమే కవిత్వాన్ని గ్లోబల్ స్థాయికి చేర్చడం సాధ్యం.

ఇన్ని ఆలోచనలు, సంకల్పాలతో ఇలా మొదలైన ప్రయాణంలోని తొలి అడుగుగా – ప్రతి సంవత్సరం అక్టోబరు 10 న “షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్. నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారం “ను గుదిగుచ్చి “రొట్టమాకురేవు కవిత్వ అవార్డు “గా ఇవ్వడం . ఒక ఊరి పేరుతో అవార్డు నెలకొల్పి యివ్వడం ద్వారా పల్లెలు, స్ధానికత అనే అంశాలకు ప్రాధాన్యత పెరగాలని కాంక్షించాం.
నిజానికి 2010 లో ప్రారంభించాలనుకున్న ఈ అవార్డును 2014 లో మొదలుపెట్టాం.
గత సంవత్సరం(2010-2014) అవార్డు గ్రహీతలు సౌభాగ్య(సాభాగ్య కవిత) , అరుణ్ సాగర్ (మేల్ కొలుపు) ,షాజహానా(దర్దీ) ,నంద కిషోర్ (నీలాగే ఒకడుండేవాడు) లకు అవార్డులు ప్రదానం చేశాం.
2015 సంవత్సరం నందిని సిధారెడ్డి (ఇక్కడి చెట్ల గాలి) ,మోహన్ రుషి (జీరో డిగ్రీ) ,హిమజ (సంచీలో దీపం) అవార్డులు ప్రదానం చేస్తున్నాం.

ఇలా తొలి అడుగు పురస్కారాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొదించడం అయితే, ఆ అడుగుకు జోడుగా అందర్ని కలుపుతూ వెళ్ళే ప్రయత్నం, రొట్టమాకురేవులో లైబ్రరీని ఏర్పాటు చేయడం. దానికి కె.యల్. పుస్తకసంగమం గా పేరు పెట్టాం. లైబ్రరీ కేంద్రంగా చదవడం, రాయడం, చర్చించడం లాంటి విషయాలు కొంతైనా జరగాలని కోరిక.

లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణలో తొలుత గుంటూరు నుండి రావెల పురుషోత్తమరావు గారి పుస్తకాలతో శుభారంభం జరిగింది. పుస్తకాలు ఇవ్వడానికి ఇంకా ఎందరో మిత్రులు సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే, కవి దేశరాజు ఇచ్చిన 100కు పైగా పుస్తకాలను యింటికి వచ్చి మరీ వచ్చి యిచ్చి వెళ్ళారు.

రొట్టమాకురేవు గురించి ::

రొట్టమాకురేవు ఖమ్మం జిల్లాలో కారేపల్లికి అతి సమీపంలో వున్న అతి చిన్న పల్లెటూరు. పట్టుమని యాభై, అరవై ఇళ్లకు మించి వుండవు. పక్కనే పారే చిన్న బుగ్గవాగు. బుగ్గవాగు మీద రైలు వంతెన. డోర్నకల్ నుండి కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ,మణుగూరుకు వెళ్లే రైళ్లు ఆ పట్టాలమీంచే వెళ్తాయి. మరో పక్క మాధవరం డొలమైట్ ను రవాణా చేసేందుకు కారేపల్లి నుండి మాధవరం వరకు వేసిన రైల్వే ట్రాక్.

ఊరు మొత్తం నాలుగు ఇళ్లు తప్ప అన్నీ గిరిజన కుటుంబాలే. ఎక్కువగా రైతుకూలీలు. కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు. ఇంకొందరు రైతుల దగ్గర జీతానికి కుదిరినవాళ్లు. కొందరు పనికి ఆహారపథకం కోసం పనులకు పోయేవాళ్లే !
తరచూ ఇల్లందు, ఖమ్మం వెళ్లి వస్తుంటారు. కారేపల్లి/ సింగరేణి కి అయితే రోజుకు ఒకసారైనా వెళ్లాల్సిందే ! అంత దగ్గర.
పాలు అమ్మడానికో, చేను మందులు కొనడానికో, ఏమీ పనిలేకపోయినా ఉబుసుపోక కూడా వెళ్లిరావాల్సిందే.
ఇక ఖమ్మం నుంచి ఇల్లెందుకు రోడ్డు. ముప్పై కి.మీ. ప్రయాణించాక కారేపల్లి క్రాస్ రోడ్. అక్కడినుంచి అయిదు కి.మీ. కారేపల్లి. కారేపల్లి నుండి ఒకటిన్నర కి.మీ.రొట్టమాకురేవు. ఆటోలు అటూఇటూ తిరుగుతుంటాయి.

123.pmd

ఇక్కడ ఈ రొట్టమాకురేవులో కవిత్వ అవార్డు ప్రదానం. పైగా ఊరు పేరుమీద అవార్డు. ఇలానైనా పల్లెల ప్రామినెన్స్ పెరగాలని, కేవలం నగరాలకు , పట్టణాలకు పరిమితం అవుతున్న కవిత్వం/సాహిత్యం పల్లెలకు చేరాలని, పల్లెలు చూడాలని, తద్వారా క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వినూత్నమైన దిశగా పల్లెలు అడుగులు వేయాలని ఎక్కడో, ఏదో చిన్న ఆశ.

ఈ దిశలో ఇదివరకే అడుగులు వేసినవారు లేరనికాదు, కానీ ఇప్పుడు ఇది కొత్త సందర్భం. కాబట్టి స్ఫూర్తినింపే దిశగా ఈ ప్రయోగం కొంతైనా పనిచేయకపోదా అనే ఆకాంక్ష.
అదీ సంగతి !

రొట్టమాకురేవుకు చేరే మార్గం:
Rottamaku Revu Library &Poetryspace
(RRLP)
Rottamaku Revu
Karepalli, Khammam Dist.

మీ మాటలు

 1. చందు - తులసి says:

  యాకూబ్ గారి కృషి మరింత మందికి స్ఫూర్తినివ్వాలి.

 2. విలాసాగరం రవీందర్ says:

  జయహూ కవిత్వం యాకూబ్ సార్

 3. సోమవరపు రఘుబాబు says:

  ఆ ప్రాంత ప్రజల అదృష్టం ..
  గొప్పకవిని అందించిన పుడమికి ప్రతిఫలం..!
  జయహో తెలుగు కవిత్వం..!!

 4. Jayahoa kavitvam

 5. యాకూబ్ యా ఖూబ్ కంగ్రాట్స్ నీ ప్రయత్నానికి ఒక మంచి ప్రయత్నం

 6. Kcube Varma says:

  శుభాభినందనలు సర్

 7. Vijay Koganti says:

  Sir hearty congrats. I heard about this place and your efforts. Want to be there someday. Kudos and all best wishes!

 8. అవార్డు లో భాగంగా ఏమిస్తున్నారూ??
  అనేదముఖ్యం. అధమం ఓ రెండులక్షల నగదూ మంచి శాలూవా..అయిదువేల ఙ్ఞాపికా ఇలా ఇచ్చినపుడే కవిత్భం వర్దిల్లుతుంది !!

  • చక్రి says:

   అవార్డులో భాగంగా ఏమిస్తున్నారూ అనేది ముఖ్యం. అధమం ఓ రెండు లక్షల రూపాయలూ….వాడుకోదగిన శాలువా, అయుదారువేల జ్ఞాపికా ఇలాంటివి ఇచ్చినపుడే కవిత్వం వర్థిల్లుతుంది. !!

మీ మాటలు

*