ఎంత స్థానికత వుంటే అంత సార్వజనీనత!

 

కవి నందిని సిద్దారెడ్డి తో  కోడూరి విజయ కుమార్   సంభాషణ

ప్రశ్న:  ఇంత దూరం ప్రయాణించిన తరువాత, సాహిత్య రంగంలో ఇంకా చాలా పనులు చేసి వుండవలసింది అన్న అసంతృప్తి ఏమైనా వుందా ?

జవాబు: ఏ సృజనకారునికైనా తృప్తి అనేది ఉంటుందని అనుకోను. అందుకు సిద్దారెడ్డి కూడా మినహాయింపు కాదు. వాస్తవానికి, కవిత్వానికి సంబంధించినంతవరకూ నాకు లభించిన పేరు విషయంలో కొంత తృప్తి వుంది. అయితే, ఇంకా చాలా వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కథల విషయానికి వొస్తే, నేను వ్రాసిన కొన్ని కథల విషయంలో నవీన్, అల్లం రాజయ్య లాంటి మిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఆగిపోయాను. అయితే, ఒక్క భావజాలానికే పరిమితం కాకుండా వ్రాయవలసిన కథలు వున్నాయని అనిపిస్తుంది. ఉదాహరణకు, నా హీరో మా నాన్న గురించిన కథలు, అట్లానే నేను పుట్టి పెరిగిన మా ఊరు బందారం గురించిన కథలు కూడా వ్రాయాలని వుంది.  నేను పాటలు వ్రాయగలను. చాలా పాటలు  వ్రాసి వుండవలసింది అన్న ఒక అసంతృప్తి కూడా వుంది. కేవలం ఉద్యమకాలంలో వ్రాసిన పాటలనే కాదు. ఒక ఉదాహరణ చెబుతాను. ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం శంకర్ ఒక ప్రేమగీతం వ్రాయమని ఒత్తిడి చేసినపుడు ‘నేను ఇప్పుడు లవ్ సాంగ్ వ్రాయడం ఏందని’ చాలా వారించిన. చివరికి ఆ పాట ‘ ఒక పువ్వు – ఒక నవ్వు’ బయటికి వొచ్చింది. చాలా పాపులర్ కూడా అయ్యింది. అప్పుడు అనిపించింది … ‘జీవితం లోని చాలా అనుభూతులను నేను పాటలుగా వ్రాసి వుండవలసింది గదా’ అని. దీనికి కొనసాగింపుగా ఒక సంఘటన కూడా చెబుతాను. ఒకసారి అకినేపల్లి బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి కే సి ఆర్, రమణాచారిలతో పాటు నేను, దేశపతి వెళ్తున్నాము. మాటల మధ్యన ఈ పాట  ప్రస్తావన వొచ్చినపుడు  కే సి ఆర్ అన్నారు -‘ ఒక్క విప్లవ గేయాలకే పరిమితం కావడం వల్ల మిగతావి కోల్పోయిన అన్న బాధ ఏమి లేదానే’  అని. నేను ఏదో చెప్పబోతే ‘లేదే – నువ్వు రాయగలవు’ అన్నడు! ఒక్క కవిత్వం, కథలు, పాటలు అనే కాదు. ఒక నవల వ్రాయాలన్న కోరిక కూడా వున్నది.

ప్రశ్న: ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను నిజంగానే చిన్న చూపు చూసిందా ?

జవాబు: అవును. ఆధునిక తెలుగు కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది. అసలు పట్టించుకోవడం అంటే ఏమిటి? కవిత్వ విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు కవిత్వానికి తగిన చోటు ఇవ్వడమే కదా! ఆ కోణంలో చూసినపుడు ఆధునిక తెలుగు వచన కవిత్వం తెలంగాణ కవులను చిన్న చూపు చూసింది అన్న మాట నిజమే కదా! ‘చేరాతలు’ లాంటి విమర్శా వ్యాసాలలో తెలంగాణ కవులకు దక్కిన చోటెంత? తెలంగాణ లోని లబ్దప్రతిష్టులైన కవులకు సైతం చేకూరి రామారావు లాంటి విమర్శకులు వ్రాసిన వ్యాసాలలో చోటు దక్కలేదు. ఇక కడియాల రామ్మోహన రాయ్ లాంటి విమర్శకులైతే తెలంగాణ కవుల కవిత్వం గురించి వ్రాయడం మాట అటుంచి, తెలంగాణ ఉద్యమ కవిత్వం పట్ల కనీస సహ్రుదయతని కూడా చూపలేదు. ఇంతెందుకు? దళిత కవిత్వమే తీసుకుందాము. చాలా మంది కోస్తా దళిత కవుల కన్నా ముందుగా సలంద్ర ‘దళిత మ్యానిఫెస్టో’ కవిత వ్రాసాడు. మరి, దళిత కవిత్వం పైన వొచ్చిన వ్యాసాలలో సలంద్ర కు న్యాయంగా ఇవ్వవలసిన స్థానాన్ని యిచ్చారా ?

ప్రశ్న: తెలంగాణ కవిత్వం అంటే తెలంగాణ భాషలో వ్రాసింది మాత్రమే అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు చూసినపుడు తెలంగాణ భాష ఒకే రకంగా లేదు కదా! ఇందులోనూ, పల్లెల భాష – పట్టణ భాషలలో భేదాలు కనిపిస్తాయి కదా!

జవాబు: కేవలం క్రియా వాచకాలకు సంబంధించిన కొన్ని పదాలను వాడి, దానిని తెలంగాణ కవిత్వం అనడం సరికాదు. అదే సమయంలో, ఒక నేలకు సంబంధించిన వేదననూ, దుఃఖాన్నీ కవిత్వం చేస్తున్నపుడు, ఆ నేలకు చెందిన భాష, పదజాలం అనివార్యంగా ఆ కవిత్వంలోకి వొస్తుంది. అట్లా వొస్తేనే ఆ కవిత రక్త మాంసాలతో తొణికిసలాడుతుంది. సార్వజనీన వస్తువు, సార్వజనీన వేదన అంటూ వుండవు. ఉదాహరణకు భారత దేశం మొత్తాన్నీ రిప్రేసెంట్ చేసే రైతు ఉండడు. ఎందుకంటే, కోస్తా రైతు దుఃఖం, తెలంగాణ రైతు దుఃఖం ఒకటి కాదు. తెలంగాణ నేల పైన నిలబడి రైతు దుఃఖం గురించి కవిత్వం చెబుతున్నావంటే, ఆ రైతు తెలంగాణ రైతే ఐ వుండాలి. ఆ కవిత స్థానికతకు ఎంత దగ్గరగా వుంటే అంతగా సార్వజనీనం అవుతుంది.

ప్రశ్న: మీ కవిత్వంలో తొలినుండీ తెలంగాణ భాషకు సంబంధించిన పదాల వాడుక చాలా విరివిగా కనిపిస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా జరిగిందా?

జవాబు: లేదు. నాకు నేను పుట్టి పెరిగిన నేల మీది భాష అన్నా, ఆ మాటలు అన్నా ఒక ప్రేమ.  వ్యామోహం అనడం సమంజసమేమో! అందుకే, ఆ వేదనని కవిత్వం చేసినపుడు ఆ నేటివ్ మాటలు విరివిగా వాడడం వల్ల ఆయా కవితలకు ఒక గొప్ప శక్తి వొస్తుందని నమ్మి వ్రాసేవాడిని. అయితే, ఆ తరువాత అట్లా వాడడం పైన వొచ్చిన విమర్శల పైన కసితో ఆ మాటలని మరింత ఎక్కువగా ఉపయోగించాను.             

ప్రశ్న: తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కవిత్వమంతా ఉద్యమమే ఆక్రమించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ కవిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు మున్ముందు ఏముంటాయని ఊహిస్తున్నారు ?

జవాబు: సృజనకారుడైన కవికి ఉద్యమం అనేది ఒక భాగం మాత్రమే! సృజనకారుడు గడిపే జీవితం, అతని చుట్టూ వున్న వాళ్ళు గడిపే జీవితం అతడి నిరంతన సృజనకు దోహదపడుతాయని అనుకుంటున్నాను. ఉదాహరణకు, తెలంగాణలో ఇంకా సాహిత్య సృజన లోనికి తీసుకుని రావలసిన జీవితం చాలా వుంది. తెలంగాణ ఉద్యమం విషయమే తీసుకుంటే, ప్రజలు ఎన్నో కలలతో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. సహజంగానే రేపటి కాలంలో కవులు, రచయితలు ఈ కలల సాధన గురించిన రచనలు చేస్తారు. ఇవి ఒక్కటే కాదు. తెలంగాణలో చిద్రమౌతున్న మానవ సంబంధాల గురించీ, కనుమరుగవుతోన్న కుల వృత్తుల గురించీ కూడా విరివిగా రచనలు వస్తాయని అనుకుంటున్నాను.

 ప్రశ్న: తెలంగాణ రాష్ట్రంలో సాహిత్య పునరుజ్జీవనానికి ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించే అవకాశం వుంది? పైరవీలకు తావు లేని నిజమైన ప్రతిభకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లభిస్తుందని ఆశించవచ్చా ?

జవాబు: భారతదేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. కాబట్టి, పైరవీలకు తావు ఉండదని అనుకోవడం అత్యాశే! కాకపోతే, ఏది ఎట్లా వున్నా తెలంగాణ వాళ్ళకే గుర్తింపు లభిస్తుంది. ఇక తెలంగాణ లో సాహిత్య పునరుజ్జీవనానికి కార్యక్రమాలు అంటావా …. అట్లాంటిది జరగాలంటే, ముందుగా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సాహిత్య వికాసానికే అంకితమై వుండే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సాహిత్య అకాడెమీ ఏర్పాటు అని చెప్పలేను గానీ, అట్లాంటి ఒక వ్యవస్థ. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు వున్న రాష్ట్ర సాహిత్య అకాడెమి విషయంలో ఎన్ని ఫిర్యాదులు వున్నా, అది కొన్ని మంచి పనులు చేసింది. చాలా పుస్తకాలు ప్రచురించింది. తెలుగు నిఘంటువు కూడా ప్రచురించింది. ఇంతెందుకు? అప్పుడు రాష్ట్ర సాహిత్య అకాడెమి ఇచ్చే పురస్కారాలకు కూడా ఎంతో కొంత గౌరవం వుండేది. ఇప్పుడు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాలు ఇస్తున్నా వాటికి అప్పటి గౌరవం వుందా? పైగా, అది విశ్వావిద్యాలయం కావడం వలన, దానికి వున్న సవాలక్ష విధులలో సాహిత్య సేవ అనేది ఒకానొక విధిగా మాత్రమే మిగిలిపోతోంది. సాహిత్యానికి సంబంధించి పురస్కారాలు ఇవ్వడం వరకు మాత్రమే తెలుగు విశ్వవిద్యాలయం పాత్ర కుదించుకు పోయింది. అటువైపు కేరళ సాహిత్య అకాడెమీ, ఇటువైపు కర్ణాటక సాహిత్య అకాడెమీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు, ఆయా భాషలకు, సాహిత్యాలకూ అవి చేస్తోన్న సేవలనీ పరిశీలించినపుడు సాహిత్యానికే అంకితమైన ఒక వ్యవస్థ వుంటే ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో అర్థం అవుతాయి. అట్లాంటి వ్యవస్థ వున్నపుడు, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజల చేరువకు, మరీ ముఖ్యంగా యువతీ యువకుల చేరువకు తీసుకు వెళ్ళడం సాధ్యపడుతుంది.

ప్రశ్న: తెలంగాణ పల్లెలు పోలీసు క్యాంపుల్లా మారిన కాలంలో గానీ, మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో గానీ తెలంగాణ దుఃఖం పైన అక్షరం ముక్క కూడా వ్రాయని కవులు, రచయితలు ఇవాళ తెలంగాణ ఏర్పడిన తరువాత ఉన్నత పురస్కారాల కోసం, పదవుల కోసం ఎంపిక కాబడుతున్నారని కొందరు తెలంగాణ వాదుల ఫిర్యాదు. సిద్దారెడ్డి లాంటి కవులు ఎందుకు నోరు విప్పడం లేదని కూడా ఒక ఫిర్యాదు!

జవాబు: తమ రచనలనూ, సృజననూ నమ్ముకోవడం కన్నా ప్రచారం ద్వారా, పైరవీల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకునే కవులు, రచయితలూ అప్పటి రోజుల లోనూ వున్నారు. పెద్ద పురస్కారాల కోసం కవులనూ, రచయితలనూ నామినేట్ చేసే అధికార యంత్రాంగం ఒకటి వుంటుంది. సహజంగానే, ఆ యంత్రాంగం దగ్గరికి తమ సృజనను నమ్ముకుని తమ పని తాము చేసుకు పోయే వాళ్ళు ఎవరూ వెళ్ళరు. సిద్దారెడ్డి ప్రస్తుతం ఆ అధికార యంత్రాగం లో భాగం కాదు. అందువల్ల ఆ పేర్ల ఎంపిక కార్యక్రమం లో సిద్దారెడ్డి భాగం కాదు. ఇక కవి సిద్దారెడ్డిగా అంటావా …. ఇక్కడ మన సాహిత్య లోకంతో ఒక చిక్కు వున్నది. అర్హత లేని వాళ్ళ పేర్లు అత్యున్నత పురస్కారాలకు ప్రతిపాదించబడినపుడు ఏదైనా కామెంట్ చేస్తే, ‘ తన పేరు ప్రతిపాదించలేదు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నాడు’ అని బద్నాం చేస్తారు. అయితే, ఎంపికలో నా పాత్ర వున్నపుడు అర్హులకు పురస్కారాలు లభించేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను.

ప్రశ్న: మీరు కవిత్వం వ్రాయడం ఆరంభించిన కాలంతో పోల్చుకుని చూసినపుడు, ఇప్పటి కవిత్వ వాతావరణం ఎట్లా వుందని అనిపిస్తోంది?

జవాబు: నిజానికి చాలా మంది ప్రతిభావంతులు కనిపిస్తున్నారు. అయితే, అప్పటి తరం కవులు విపరీతంగా అధ్యయనం చేసేవారు. ఒక మంచి కవితల పుస్తకం పట్టుకుంటే, రోజుల తరబడి దాంట్లో మునిగిపోయి వుండే వాళ్ళు. అట్లాంటి వాతావరణం ఇప్పుడు లోపించినట్లుగా వుంది. అంతేకాదు- ఇదివరకు ఒక కవిత వ్రాసి చర్చకు పెడితే, అందరూ మొహమాటం లేకుండా అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడందరికీ మొహమాటాలు ఎక్కువయ్యాయి. కవులలో డిప్లమసీ ఎక్కువయ్యింది. నొప్పించే మాట ఏదైనా చెబితే ఈ సంబంధం ఏమైనా చెడిపోతుందేమో అన్న బెంగ కనిపిస్తోంది. నేను గమనించిన మరొక అంశం ఏమిటంటే, ఇప్పుడిప్పుడే వ్రాస్తోన్న వాళ్ళు కూడా తమ రచనలను ప్రమోట్ చేసుకోవడం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. సాటి కవులతో, రచయితలతో కలవడం, సంభాషించడం బాగా తగ్గిపోయింది. ఎక్కడైనా కలిసినా పేస్ బుక్ కోసమో, వాట్సాప్ కోసమే ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు.

ప్రశ్న:  పురస్కారాలకు వ్యతిరేకి ఐన సిద్దారెడ్డి ఈ పురస్కారం తీసుకోవడం ….. ?

జవాబు: ఒకట్రెండు సందర్భాలలో ఆయా పురస్కార ప్రదాతలతో నాకున్న ఆత్మీయ అనుబంధం వల్లనే ఒప్పుకున్నాను. ఉదాహరణకు ఈ పురస్కారం ఇస్తోన్న యాకూబ్ వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు. ఆర్నెళ్ళ కిందటే ‘అన్నా మీరు తప్పకుండా తీసుకోవాలే‘ అన్నడు. ఎట్ల కాదనటం ?

*

మీ మాటలు

 1. చందు - తులసి says:

  సిద్దారెడ్డి గారి సూచనలు కొత్త తరానికి ఉపయోగం. విజయ్ కుమార్ గారు ధన్యవాదాలు.

 2. విలాసాగరం రవీందర్ says:

  మంచి సూచనలు…కొత్త తరం కవులకు ఆదర్శనీయం

 3. వెల్దండి శ్రీధర్ says:

  డా. నందిని సిధారెడ్డి గారి హృదయాన్ని ఆవిష్కరించిన ఇంటర్వ్యూ ముందుగా కోడూరి విజయకుమార్ గారికి అభినందనలు. ఇవాళటి మా తరానికి ఎంతో విలువైన సూచనలను చేసిన డా. సిధారెడ్డి గారికి ధన్యవాదములు. సిధారెడ్డిగారు తన సమకాలీన కవుల కన్నా ఒకడుగు ముందే ఉన్నారు మొదటి నుండి. అయితే వారే అన్నట్లు రాయాల్సినంత రాయకపోవడం వలన తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా తెలంగాణ సాహిత్యానికి ఆ మేరకు నష్టం జరిగిందనే అనుకోవాలి. వరవరరావు, సిధారెడ్డి, జూకంటి మొదలైన వారు సృజనాత్మక వచనాన్ని రాయాల్సినంత రాయలేదు. గత రెండు దశాబ్దాలుగా తెలుగు సమాజం చాలా పెను మార్పులకు గురయింది. అంతేగాక అంతకు ముందున్న తెలుగు సమాజ స్థితిని ఇంకా రికార్డు చేయాల్సినంత మేరకు రికార్డు చేసుకోలేకపోయాం. ఈ రెండు పరిస్థితులను మా కన్న ముందు తరం రచయితలుగా వారు రికార్డు చేయాల్సిన బాధ్యత వుంది. ఇకనైనా ఆ దిశగా కలాల్ని కదిలిస్తారని ఆశిద్దాం! తెలుగు సాహిత్యానికి మరిన్ని మంచి రచనలు వీరి కలం నుండి జాలువారాలని కోరుకుందాం!

 4. buchi reddy gangula says:

  అల్లం రాజయ్య గారి —- Naveen గారి అబిప్రాయాలతో ఆగిపోయాను —-??అసలు
  అ opinions..ఏమిటో — తిరిగి అడుగవలిసి ఉండే

  ఎందుకు నోరు విప్పడం లేదు ???
  సమాధానం అంత క్లియర్ గ లేదు — అయినా అన్ని రకాల అవార్డ్స్ కు — పద్మ శ్రీ –భూషణ్
  అన్నింటికీ ఫై రవి ల తో నెగా — వచ్చేది — నాడు — నేడు –(ఎక్కువ శాతం )

  పాలన భాష — గా తెలుగు ఎందుకు లేదో —అడుగవలిసి ఉండే —ప్లస్
  ప్రాచిన భాష — గా — గుర్తింపు కోర్ట్ లో ఉంది ?? దానికి విముక్తి ఎప్పుడో
  అడుగవలిసి ఉండే
  నేటి వార్త ??? జియ్యెం గారు తెలుగు విశ్వవిద్యాలయానికి చా న్స్ ల ర గా — నియామకం అట ????????????? రాజుల పాలన -ధో ర ల పాలన—-కోటి రత్నాల వీణ లో —
  బిగ్ జోక్ ???
  యీ 16 నెలల లో బంగారు తెలంగాణా లో వచ్చిన మార్పులు ఏమిటో –(ముఖ్యమంత్రి గారితో ప్రయాణం — అ పరిచయెం తో ) అడుగవలిసి ఉండే —
  ఇంటర్వ్యూ –so…so..
  ———————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 5. Dorbala Balashekhara Sharma says:

  మంచి ఇంటర్వ్యూ. మంచి ప్రశ్నలకు మంచి జవాబులు ఇచ్చారు. సిధారెడ్డి గారు కథలు రాస్తే చదవాలని ఉంది. నవల ఐతే ఇంకా మంచిది.

మీ మాటలు

*