అథో అన్నం వై గౌః

 

ఆక్రోశ్

~

అఖ్లాక్ నీ చేతిలో చావడమే మంచిదైంది

ఇప్పుడు స్వర్గంలో

కమ్మగా వండిన ఆవు మాంసాన్ని

లొట్టలేసుకుంటూ జంకూగొంకూ లేకుండా తింటున్నాడు..

బతికినప్పుడు నిండుగా తీర్చుకోలేని జిహ్వ రుచిని

చచ్చాకైనా నీ పుణ్యమాని

నీకు దక్కని స్వర్గంలోనే దర్జాగా ఆస్వాదిస్తున్నాడు..

ఇంద్రుడు, అగ్ని, మరుత్తులు ప్రేమతో కండలు వడ్డిస్తున్నారు

యాజ్ఞవల్క్యుడు భాండంలో ఏరిఏరి మరీ మెత్తని ముక్కలు అందిస్తున్నాడు..

అథో అన్నం వై గౌః

ఆవు నిశ్చయముగా ఆహారమే..

రుత్వికులు వేదాలు, ఉపనిషత్తులు వల్లిస్తున్నారు..

ఉత్తిపుణ్యానికి

అఖ్లాక్ ను గొడ్డళ్లతో, కొడవళ్లతో నరికి చంపిన నిన్ను

ఘోరాతిఘోరంగా శఠిస్తున్నారు..

అఖ్లాక్ హంతకః వినశ్యతు..

క్షయం ప్రాప్తిరస్తు

రోగం ప్రాప్తిరస్తు

నరకం ప్రాప్తిరస్తు..

 

అఖ్లాక్ ఇంట్లో దొరికిన మేకమాంసాన్నీ శఠిస్తున్నారు..

మేషః నశ్యతు, అజః నశ్యతు

గొర్రెలు చావాలి, మేకలు చావాలి

కుక్కుటః నశ్యతు, కుక్కుటా నశ్యతు

కోడిపుంజు చావాలి, కోడిపెట్ట చావాలి..

మత్స్యః నశ్యతు, కర్కటః నశ్యతు

చేపలు చావాలి, పీతలు చావాలి..

 

అథో అన్నం వై గౌః

ఆవే కమ్మని భోజనం..

అఖ్లాక్ దాన్ని ఇక్కడైనా కడుపారా భుజించనీ..

 

 

(ఉత్తరప్రదేశ్ లోని బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నాడనే అనుమానంతో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన అఖ్లాక్ వంటి మరెందరికో నివాళిగా..)

*

 

 

 

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  కిందోల్లని, ఎర్రిగొర్రెల్లని, పైనెక్కి స్వారీ చేస్తుండే బాసులు బలిపశువులు చేస్తారని ఆరోపిస్తూ ఆఫీసులో వాడుకునే జోకటి : అశ్వం నైవా, గజం నైవా, వ్రాఘ్యం నైవచా నైవచా, అజాపుత్రం బలీం తధ్యం !! ( గుర్రమొద్దు, ఏనుగొద్దు, పులిజోలికి పోనే పోవద్దు, ఎర్రిగొర్రెల్ల్ని మాత్రం తప్పక బలిద్దాం ).

  ఈద్ పండుగుల నాడు మాకు విందు భోయనవెట్టే మిత్రుడు యాసిన్, అది బీఫ్, మీకు నిషిద్దం, తినకూడదు అంటూ ప్రేమగా చెప్పేవాడు.

  కాని ఈ దేశపు సెంటిమెంట్, గోవుని మాతగా కొలిచే సంస్క్రతికి, అనాది ఆచారాలకి భంగం వాటిల్లకుండా కూడా చూడాలిగా. జంతు బలుల్ని వద్దన్న గౌతమ బుద్దుడి దేశమిది. తాగడానికి మేక నుండి పాలు పితుక్కున్నజాతిపిత బాపూజీ, ఆ మేకకు తల్లీ అని నమస్కరించిన ఆచారాలూ ఉన్నాయి. శాఖాహారంతో ప్రపంచ జనాభా పొట్టలు నింపలేమని తెలిసినా, మాంసాహారం వ్యక్తుల యిష్టా అయిష్టాలకు వదిలెయ్యాలని తెలిసినా కొన్ని సెంటిమెంట్స్ విషయంలో ఓ సామూహిక అంగీకారం, కట్టడి అవసరమేమో.

  గోమాంసం పేరుతో జరిగే మతోన్మాదుల దాడుల్ని తప్పక ఖండించాల్సిందే. ముక్త కంఠంతో ఖండించాల్సిందే.

  అభినందనలు ఆక్రోశ్ గారు ( గొర్రెలు, బర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలు, కాకులు, నెమళ్ళూ, చేపలూ, పీతలూ, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, జింకలు, పులులు, వన్య ప్రాణులు, క్రూర మృగాలు, అన్నీ అన్నీ వేరు. ఒక్క గోమాతని మాత్రం విక్షణారహితంగా చంపొద్దని చెప్పు మిత్రమా ).

 2. kurmanath says:

  ప్రజలకి తిండి పెట్టలేని ప్రభువులు, వాళ్ళు దొరికినదేదో, ఇష్టమైనదేదో తింటున్నారని హత్యలు చేస్తున్నారు. ఆగ్రహ ప్రకటన గొప్పగా వుంది.

 3. కె.కె. రామయ్య says:

  ఆక్రోశ్ గారు, కూర్మానాథ్ గారు,

  సాంప్రదాయము, సదాచారపు ఓల్డ్ బాగేజీలు మోసుకు తిరగని యువతరం,నవతరం ప్రగతిశీల శక్తుల ప్రతినిధులంతా మొన్న బెంగుళూరులోని టౌను హాలు వద్ద గుమికూడి మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన అఖ్లాక్ పట్ల తమ సంవేదనని తెలియజేస్తూ జరిగిన ఘాతుకానికి నిరసనగా ‘బీఫ్ కబాబ్’ లు పంచుకు తిన్నారు … మా తిండి, మాతిప్పలు మా ఇష్టం; ఆంక్షలు పెట్టడానికి మీరెవరు అంటూ ప్లై కార్డులు ప్రదర్శిస్తూ. మీరు రోజూ సేవించే గోమాత క్షీరం ఆ మాత రుధిరంలాంటిది మేము మానెయ్యమంటే మానేస్తారా; ముద్ద ముద్దకి నెయ్యి వడ్డించుకోకుండా ఉంటారా అంటూ గేలి చేసారు కూడా.

  గోహత్య, గోవధ, బీఫ్ తినటం వంటి కాంట్రవర్సీ విషయమై జమ్మూ కాశ్మీరు అసెంబ్లీలో ముస్లిం మతస్తుడైన ఓ M.L.A. పై హిందూ మతస్తుడైన మరో M.L.A. బహా బాహీ ముష్టియుధ్ధానికి దిగినట్లు టీవీ చానెళ్లు ప్రసారం చేసాయి.

  • ఆక్రోశ్ says:

   అవునండి. దాద్రీ ఘటన, కల్బర్గి హత్యకు నిరసనగా హిందీ, మలయాళ రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగిచ్చేసి నిరసన తెలిపారు. భావవిప్లవం, రాజకీయ విప్లవాలు తొలుత అప్పట్లో వంగభూమిలో, ఇప్పడు మలయాళ, కన్నడ సీమల్లో వస్తున్నాయి గాని తెలుగు సీమ మరీ భ్రష్టుపట్టిపోయింది. ఇలాంటి పత్రికల్లో, హాలు మీటింగుల్లో పిడికెడు మంది కంఠశోష తప్ప, లబ్ధప్రతిష్టులెవరూ గొంతువిప్పడం లేదు. గొంతు విప్పితే పదవులు పోతాయి, రాజ్యాన్నిధిక్కరిస్తే జైళ్లు, బేడీలు. పుణ్యభూమి.

 4. Sivakumara Sarma says:

  దాద్రీ ఘటన, కల్బర్గి హత్యల వంటి వాటి గూర్చి అంతటా నిరసనలు జరుగుతూనే వున్నాయి. వాటిల్లో (దాద్రీ ఘటన, కల్బర్గి హత్యల్లో) పాల్గొన్న వాళ్లు నిర్భయంగా మీడియా ముందు నిలబడి మేము ఈపని చేశాము అని చెబుతున్నారా? పోలీసులముందు గానీ, న్యాయస్థానలముందు గానీ, లేక పార్లమెంటులో వేదికలెక్కి గానీ రొమ్ములు చరుచుకుంటున్నారా? అలా చేస్తున్నా గానీ, పోలీసులూ, న్యాయస్థానాలూ వాళ్లని శిక్షించకుండా, పట్టించుకోకుండా ఊరుకుంటున్నారా? ఈ ప్రశ్న లన్నింటికీ “అవును” అని సాక్ష్యాధారాలతో చూపి చెప్పగల్గితే అప్పుడు దేశం భ్రష్టుపట్టి పోయిందని అనడం అర్థవంత మవుతుంది. “అవును” అని చెప్పలేనప్పుడు అది అక్కడక్కడా జరిగే సంఘటనలని భూతద్దం క్రింద చూపి వాటిని ప్రభుత్వ వైఫల్యంగా చూపడానికి చేసే ప్రయత్నమే అవుతుంది. ప్రభుత్వ అవార్డులని తిరస్కరించడం కూడా అలాంటిదే. దాన్ని గొప్ప విషయంగా చెప్పుకోవాల్సిన పని ఏ మాత్రం లేదు. వాటిని తిరస్కరిస్తున్నవాళ్లు 125 కోట్లమంది ప్రజలున్న దేశంలో జరిగిన ఒక హత్య వల్ల ఆ నిర్ణయానికి వస్తున్నారంటే మిగిలిన 124 కోట్ల, 99 లక్షల, 99 వేల,9 వందల తొంబై … .. మంది ప్రజలని దుర్మార్గులుగా ప్రకటిస్తున్నట్లే! అందుకని, అలాంటి తిరస్కారాల వల్ల ఆ సాహితీ అవార్డుని పొందిన వాళ్ల వివేకాన్నీ, వివేచననీ ప్రశ్నించాల్సి వుంటుంది. ఎందుకంటే, ఏ సమాజంలో గానీ, ప్రతీ మనిషికీ ఒక పోలీసుని నియమించడం అసాధ్యం. ఒక మనిషిని ఇంకొక మనిషిని గౌరవించడాన్ని నేర్పడం ఏ ప్రభుత్వపు బాధ్యతా గాదు. ప్రభుత్వాలు చెయ్యగల్గిన పనల్లా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, వాటిని సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాలకు వాడుకొనేటందుకు అంతటా సంఘర్షణలకి ఆజ్యం పొయ్యకుండా వుండేలా చూడడం. ఒక మనిషి తన పక్క మనిషిని గౌరవించలేనంతగా పరిస్థితులు దిగజారాయంటే – తిట్టడమే కాక చంపడానికి కూడా వెనుకాడకుండేలా వుండేలా – సంఘంలోని ప్రతీ వ్యక్తికీ అందులో బాధ్యతా వుందని గ్రహించాలి.
  ఇక, మీరు సంస్కృతం వాడారు గనుక, సంస్కృతంలోనే, మీకు పరిచయం అయ్యే వుంటాయనుకుంటున్న వేద వాక్యాలు –
  యే గ్రామ్యాః పశవో విశ్వ రూపాః
  యధాన శ్శమస ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మ్నిన్నాతురం
  ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మా భేర్మారోమో ఏషాం కిం చ నామమత్
  ఈ రెండింటినీ పఠించే వాళ్లు కోరుకునేది, తమనీ, తమ చుట్టుపక్కలవాళ్లనీ (రెండుకాళ్ల వాళ్లనీ, నాలుగు కాళ్ల జంతువులనీ కూడా), రోగాలకి దూరంగా వుంచమనీ, పుష్టిగా వుంచమనీ, భయపెట్టొద్దనీ, నశింపచెయ్యొద్దనీను!
  వీటిల్లో తప్పేదయినా వుందంటారా?
  అక్కడక్కడా జరిగే దుర్ఘటనలకి విప్లవాలు కావాలంటే విప్లవం అన్న పదానికి అర్థం లేకుండా పోతుంది. అలా కాక సమాజంలో ఆ విప్లవానికి కావలసిన పరిస్థితులు ఇప్పటికే వున్నాయని మీరు తలిస్తే, 125 కోట్లల్లో సింహభాగం ఆ విప్లవానికి దోహదం కలిగిస్తున్న పరిస్థితులని ఏర్పరుస్తున్నారని అర్థం. కొంపదీసి, బిజిపికి వోటు వేసిన వాళ్లందరూ ఆ పరిస్థితులని తెప్పిస్తున్నారని మీ అభిప్రాయమా?

 5. ఆక్రోశ్ says:

  స్పందించినందుకు శివకుమార శర్మ గారికి ధన్యవాదాలు.
  మీరు పాత విషయాలే చెప్పారు. దాద్రీ, కల్బుర్గి ఘటనలకు పాల్పడిన వాళ్ల బయటకు రాలేదు కానీ, వాళ్ల గాడ్ ఫాదర్లు బాగానే వచ్చారు.
  యోగి ఆదిత్యనాథ్, సాధ్వి ప్రాచీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, మహరాజ్, గిరిరాజ్ సింగ్, తొగాడియా, సింఘాల్.. వీళ్ల స్టేట్ మెంట్లన్నీ బహిరంగగా చేసినవే. కానీ వీళ్లను జైళ్లకు పంపే శక్తి మన లౌలిక రాజ్యానికి లేదు, కనీసం కేసులు పెట్టే ధైర్యమూ లేదు. దాద్రీ వరకు వస్తే.. అది ఓ ప్రమాదం వంటిదని, అఖ్లాక్ ను చంపిన వాళ్లు అక్కడే ఉన్న అతని కూతురి జోలికి పోలేదు కదా గొప్ప మానవతావాద ప్రకటన చేసిన కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ప్రకటన చూసే ఉంటారు. సాక్ష్యాలు కావాలంటే పత్రికలూ, యూట్యూబ్ వీడియోలూ చూడొచ్చు.

  ధబోల్కర్, పన్సారే, కల్బుర్గి హత్యలు, దళితులపై దాడులు, గ్రామబహిష్కాారాలు, ‘అక్కడక్కడా జరిగే సంఘటన’లా? కల్బుర్గి మాదిరే కేెఎస్ భగవాన్ కూడా కుక్కచావు చస్తాడని బజరంగీ ఉన్నాది చేసిన హెచ్చరిక అక్కడక్కడా లాంటి దేనా? ఆర్గనైజ్డ్ కానే కాదా?

  దుర్మర్గాలకు, అణచివేతకు జనం రకరకాలుగా నిరసన తెలుపుతారు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా టాగూరు నైట్ హుడ్ అవార్డును వదులుకోవడం.. ఆనాటి మన 33 కోట్ల 99 లక్షల… మందిని దుర్మార్గులుగా ప్రకటించినట్టా?

  ‘‘ప్రభుత్వాలు చెయ్యగల్గిన పనల్లా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, వాటిని సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాలకు వాడుకొనేటందుకు అంతటా సంఘర్షణలకి ఆజ్యం పొయ్యకుండా వుండేలా చూడడం’’ అని మీరు సెలవిచ్చారు. ఇది మీ అవగాహన. కానీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అసలు జరక్కుండా చూడ్డం ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని. లేకపోతే చేతులు కాలాక సామెతే.

  ఇక సంస్కృతం గురించి. నీతులు మానవులు మాట్లాడే భాషల్లో కూడా గంపెడున్నాయి. కానీ పాటిస్తున్నామా? పశువులు బలవాలని కోరుకున్న శ్లోకాల పక్కనే అథో అన్నం.. శ్లోకాలూ ఉన్నాయి. అవి నాటి ప్రజల పరిస్థితినిచెబుతాయి. ధర్మప్రభువైన రాముడి వేటలు, గోగ్రహణాలు.. ఇలాంటివేనన్న సంగతి మీకు తెలియందేమీ కాదు. ఒక జంతువు పవిత్రం అయిపోయి, మరో జంతువు వధించదగ్గ జంతువు ఎట్టా అవుతుంతో బుర్రపీక్కున్నా అర్థమై చావదు.
  నేను సంస్కృతంలో పండితుణ్ని కాదు. బట్లర్ ఇంగ్లిష్ అంటారే, అలా బట్లర్ సంస్కృతం(బట్లర్లకు క్షమాపణలతో).
  ఆ బట్లర్ సంస్కృతంతో ఒక మాట..
  ఓం హీం క్రీం ఫట్
  సనరేంద్ర తక్షకాయ స్వాహా..

 6. Sivakumara Sarma says:

  “జలియన్ వాలా బాగ్ మారణకాండకు నిరసనగా టాగూరు నైట్ హుడ్ అవార్డును వదులుకోవడం.. ఆనాటి మన 33 కోట్ల 99 లక్షల… మందిని దుర్మార్గులుగా ప్రకటించినట్టా?” ఆక్రోశ్ గారూ, మీరేం రాశారో ఒకసారి చదువుకున్నారా? ఠాగూర్ కి నైట్ హుడ్ బ్రిటిష్ ప్రభుత్వమిచ్చింది – అంటే పరాయి పాలకులు. ఈ రెంటికీ పొంతన నక్కకీ, నాగలోకానికీ ఉన్నటువంటిది. మీరు “33 కోట్ల 99 లక్షల… మందిని దుర్మార్గులుగా ప్రకటించినట్టా” అని ఎవరి గూర్చి అడిగారు? సాహిత్య అకాడెమీ అవార్డులని ఇప్పుడు వదులుకున్నామంటున్న వాళ్లకి ఇచ్చిన ప్రభుత్వం – భారత ప్రభుత్వం – మోదీ ప్రభుత్వం కూడా కాదు. కాంగ్రెసు ప్రభుత్వాలు. వాటిని తిరస్కరించి ఏం సందేశాన్ని పంపుతున్నా మనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి. ఎంతయినా సాహిత్యవేత్తలు గదా!
  మీరు, “చేసిన వాళ్ల గాడ్ ఫాదర్లు” అంటూ కొంతమందిని ఉదహరించారు. “కానీ వీళ్లను జైళ్లకు పంపే శక్తి మన లౌలిక రాజ్యానికి లేదు, కనీసం కేసులు పెట్టే ధైర్యమూ లేదు.” మీరు చిన్నవాళ్లో లేక మరిచిపోయారో నాకు తెలియదు గానీ, అధికారంలో వున్న పార్టీలకి ఇదేం కొత్తేమీ కాదు. కావాలంటే ఇందిరాగాంధీ మరణం తరువాత ఊచకోతలకి బలైన సిక్కుల నడగండి.
  నా “‘‘ప్రభుత్వాలు చెయ్యగల్గిన పనల్లా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, వాటిని సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాలకు వాడుకొనేటందుకు అంతటా సంఘర్షణలకి ఆజ్యం పొయ్యకుండా వుండేలా చూడడం’’ అన్న వాక్యాలకి మీరు “ఇది మీ అవగాహన.” అని జాలిపడ్డారు. పైగా, ప్రభుత్వాలు చెయ్యవలసిన దేమిటో “కానీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అసలు జరక్కుండా చూడ్డం ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని. లేకపోతే చేతులు కాలాక సామెతే.” అంటూ సెలవిచ్చారు. (ఈ “జరక్కుండా ఆపడం” గూర్చి మీరు అస్సలు ఆలోచించినట్లు లేదు.) అది ఎప్పుడు సాధ్య మవుతుందంటే, “thought police” లని నియమించి నప్పుడు. అంటే, ఎవడికన్నా దొంగతనం చెయ్యాలన్న ఆలోచన రాగానే వాణ్ణి బొక్కలో వెయ్యాలి. ఎవడికైనా ప్రభుత్వ రహస్యాలని బయటికి తెలియజేద్దామన్న ఆలోచన రాగానే వాణ్ణి కుళ్లబొడవాలి. ఇది బాగుంటుందా? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోకొంత ఇది అమలులో లేదా? రష్యాలో, చైనాలో, క్యూబాలో, అమెరికాలో, సౌదీ అరేబియాలో, ఇరాన్లో? అమెరికాలో ముస్లిమ్స్ కొంతమందిని టాప్ చేసి, వాళ్లకి సంఘ వ్యతిరేక పనులని జరిపే ఆలోచన లున్నాయని పసిగట్టి, వాటికి సాఫల్యతనివ్వడానికన్నట్టు ఆయుధాలని ప్రభుత్వాధికారులే సమకూరుస్తూ, అలా జరుగుతున్నప్పుడు ఫోటోలు, విడియోలూ తీసి అరెస్ట్ చేసిన సందర్భాలు పత్రికల్లో కనిపిస్తూనే వుంtటాయి. ఈ మధ్య, కొంతమంది ముస్లిం టీనేజర్లని ఫాలో అయ్యి, వాళ్లు ఎయిర్పోర్టుకు వెళ్లేదాకా ఆగి అక్కడ (ఇది అమెరికన్ ఎయిర్పోర్టో లేక ఇటాలియన్ ఎయిర్పోర్టో గుర్తులేదు) అరెస్ట్ చేసిన సంఘటనలూ వున్నాయి.
  ఆలోచించండి. మీకు అలాంటి థాట్ పోలీసులూ, అలాంటి ప్రభుత్వాలూ కావాలంటే చెప్పండి. నేను చెప్పిన లిస్టులోంచి కొన్ని దేశాలని మీకు రికమెండ్ చేస్తాను ఇండియా నుండీ పారిపోవడానికి.
  “ఒక జంతువు పవిత్రం అయిపోయి, మరో జంతువు వధించదగ్గ జంతువు ఎట్టా అవుతుంతో బుర్రపీక్కున్నా అర్థమై చావదు.” అన్నారు. నిజమేనండీ. కుక్కని పెంచుకుంటూ అదే కుక్కని ఎలా తింటారు? అని పాశ్చాత్య దేశాల వాళ్లు కుక్కలని తింటున్నవాళ్ల . మీద కోపగించుకుంటారు. మళ్లీ, వాళ్లే పెంచుకునే కోళ్లనీ, పందులనీ, ఆవులనీ (ఇండియాలో మేకలనీ) తినడానికి ఏమాత్రం వెనుకాడరు. అంటే, ప్రపంచ వ్యాప్తంగా కదిలే ఏ ప్రాణికీ ఎక్కడో ఒకక్కడ మానవుల చేతిలో మూడిందన్నమాటే. చైనాలో కుక్కలనీ, పిల్లులనే గాక పాముల్ని, కోతులనీ కూడా తింటారు. అలాగే, కొన్ని దేశాలకి నిషిద్ధ జంతువులుంటాయి. ఉదాహరణకి ముస్లిం దేశాల్లో పందిని తినడం గూర్చి; ఆ దేశాలకెళ్లి మీరుగానీ లేక ఒక లిబరల్ ముస్లిము గానీ (మీరు ముస్లిం కాదని అనుకుంటూ) ” నేను పంది మాంసం తింటాను, నా యిష్టం,” అనండి.
  మీరు రాముడి వేటలనీ, గోగ్రహణాలనీ ఎందుకు కలిపారో నాకు అర్థం కాలేదు. గోగ్రహణం అంటే గోవులని ఎత్తుకుపోవడం – వాటిని పాడిగా పరిగణించడంవల్ల మాత్రమే తప్ప చంపడానికి అని కాదు. రాముడు రాజు. వేటాడడం అతనికి తప్పు కాదు.
  హిందూ మతంలో మంచి వుందంటూ నేను కొన్ని వాక్యాలని చూపితే, “నీతులు మానవులు మాట్లాడే భాషల్లో కూడా గంపెడున్నాయి. కానీ పాటిస్తున్నామా? ” అని అన్నారు. వెరీ గుడ్. అంటే, మీరు మతాన్ని వేలెత్తి చూపించడంలేదు, వ్యక్తులని మాత్రమే తప్పు పడుతున్నాను అంటున్నారు. (అలాంటప్పుడు ఇంత పెద్ద ఆక్రోశం – అది కూడా, సంస్కృతంలో, వేదాలలోని వాక్యాలకి పారలల్ గా రాస్తూ – ఎందుకు సార్? దానివల్ల ఏం సాధిద్దా మనుకున్నారు?) అదే మీ అభిప్రాయమైతే, మీతో ఏకీభవిస్తాను. కానీ, మీ రచనా, దాని తరువాత మీ తిరుగు స్పందనలూ వ్యక్తులగూర్చి కాక, ఇండియాలో ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీ గూర్చి మాత్రమే అని స్పష్టపరుస్తున్నాయి. ప్రజాస్వామ్యమంటే అంతే సార్. నాలుగు దశాబ్దాలకి పైగా జరిగిన కాంగ్రెస్ పాలనలో వాళ్ల కార్యక్రమాలు అన్ని అందరికీ నచ్చేయ్యని మీరు అనుకుంటున్నారా? అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో క్రితం గవర్నర్ అబార్షన్ మీద విపరీతమయిన ఆంక్షలు విధించి అవి ఆ రాష్ట్రంలో దాదాపు జరగనీకుండా వుండేలా చేశాడు. తరువాతి ఎలక్షన్లో వేరే పార్టీ మనిషి గవర్న రయ్యాడు. ఆ ఆంక్షలని ఇప్పుడు దాదాపు బుట్టదాఖలు చేశారు. ఎన్నికలకి ఫలితా లుండకపోతే అసలు వాటితో పనేమిటి?
  మీరేమయినా నా గూర్చి పొరబడతారేమో – ఇండియాలో ఒక్కసారి గూడా వోటు చెయ్యలేదు. అక్కడి ఏ పార్టీతోనూ పొత్తులూ నాకు లేవు.
  మీ అసలు పేరు తెలపకపోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు గానీ, అది ఇలాంటి చర్చలకి, ముసుగు వెనక ఉన్నవాళ్ళతో మాట్లాడుతున్నట్లుంది గనుక, అది ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటె, నేను కూడా మొదటే నా స్పందనలో “శాంతి” అనో, “సహనం” అనో, “వేదం” అనో పేరు పెట్టుకుని వుంటే దానివల్ల ఏమాత్రం ప్రయోజనమయినా వుండి వుండేదంటారా?

  • ఆక్రోశ్ says:

   శివకుమార శర్మ గారు, మళ్లీ ధన్యవాదాలు.
   మీ వాదన చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలే కదా జరగాల్సింది అని. మీ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు వేరు. నేను మన స్థానిక విషయం లేవనెత్తితే మీరు అంతర్జాతీయ విషయాలు లేవనెత్తారు. వాటిపైనా చర్చ అవసరమే కాని, అందుకు ఇది సందర్భమూ కాదు, వేదికా కాదు.
   శునకాలను, వరాహాలను, మత్య్సాలను.. సమస్త జీవరాశినీ మానవుడు తింటున్నాడు. అఘోరాలు, నాగా సాధువులు మనుషులను(చచ్చినవాళ్లను) కూడా తింటున్నారు. స్థానిక వనరులు, కట్టుబాట్లు తిండిని నిర్ణయిస్తాయి. ఆ మాటకొస్తే మనం తినే వరి, పాలు, కూరగాయలు కూడా పవిత్రమైనవే కదా. వాటికీ ప్రాణంపైన ఆశ ఉంటుంది. అది వేరే చర్చ. పందులకు తినొద్దని దళితులను, గిరిజనులను ముస్లింలు ఆదేశించడం లేదు. అంటే ఆ మాటనూ ఖండించాల్సిందే.
   పోలీసుల్లో మంచీ, చెడ్డా జాతులు ఉన్నాయని మీకు అనిస్తోంది. సారాంశంలో నాకు అది ఒకటే జాతి. ఏ దేశమైనా సరే.
   రేపు కాంగ్రెస్ వాడు అధికారంలోకి వచ్చి ఆవును తినేవాడిని చంపేసినా నేను ఖండిస్తాను.
   చివరగా ఒక మాట.. పరాయి పాలకులు చంపితే ఖండించాల్సిందే, మన పాలకులు చంపితే మాత్రం ఖండించకూడదూ అని అంటున్నారా కొంపదీసి?

  • సాహితి says:

   //ఎన్నికలకి ఫలితా లుండకపోతే అసలు వాటితో పనేమిటి?//
   ఆహా! చాలా మంచి పలితాలు సాదిస్తున్నారు. ఇలాంటి పలితాల కోసమే ప్రజలు ఓట్లు వేస్తారా?

   • Sivakumara Sarma says:

    మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హత్యల వెనుక ప్రభుత్వ యంత్రాంగం వున్నదనీ, ప్రభుత్వం అలాంటి చట్టాలని చేసి నేరస్తులని నిర్భయంగా తిరగగలిగేలా చేసిందని నిరూపించ గల్గితే, అప్పుడు – దేశం భ్రష్టుపట్టి పోయిందనాలి. ప్రభుత్వం చేసే ప్రతీ ప్రయత్నమూ అందరికీ నచ్చుతుందని ఎక్కడా లేదు. వేతనాలు తీసుకునే వాళ్లు మాత్రమే ఇండియాలో తప్పకుండా టాక్సులని కడతారు. రైతులు కట్టడం గూర్చి నేనెక్కడా వినలేదు. ఏ ప్రభుత్వమైనా రైతులచేత కూడా టాక్సులని కట్టించేలా చట్టం చేస్తే అది పొరబాటున కూడా రైతులకి నచ్చదు. అలాంటి వాటిని గూర్చి నేను ఎన్నికలకి పరిణామాలు వుంటే అన్నది. అంతే తప్ప, అధికారంలో వున్న పార్టీ సభ్యుడెవడయినా అరాచకాని కొడిగడితే, వాడికి కూడా చట్టాన్ని వ్యక్తిపరంగా apply చెయ్యాలే తప్ప ఆ పార్టీ వాడు కదా అని అది ఆ పార్టీ తప్పని అనకూడదు. మీ పిల్లాడు బయట ఆడుకుంటుండగా బంతి పక్కింట్లో కెళ్లి అద్దం పగుల గొట్టిందనుకోండి, ఆ యింటివాళ్లు మీరు కావాలని మీ అబ్బాయి చేత వాళ్ల అద్దాన్ని పగులగొట్టించారన్న నిండని మీమీద వేస్తే మీరు అవాక్కవుతారా లేదా?

   • “మీ పిల్లాడు బయట ఆడుకుంటుండగా బంతి పక్కింట్లో కెళ్లి అద్దం పగుల గొట్టిందనుకోండి, ఆ యింటివాళ్లు మీరు కావాలని మీ అబ్బాయి చేత వాళ్ల అద్దాన్ని పగులగొట్టించారన్న నిండని మీమీద వేస్తే మీరు అవాక్కవుతారా లేదా?”

    శివకుమార్ గారు,

    మీరు చెప్పిన analogy తీసుకొంటే, తాము పనిగట్టుకొని చేయించకపోయినా, పిల్లవాడి చర్యని సమర్ధించని తల్లితండ్రులైతే, వచ్చి మీకు పిల్లవాడి తరఫున అపాలజీ చెప్పి, ఆ అద్దం రీప్లేస్ చేస్తారు. పిల్లవాడికి జాగ్రతలు చెప్తారు.

    మరి ఇక్కడ మీకు అధికారంలో ఉన్న పార్టీ ప్రవర్తన, పై ఉదాహరణ లో బాధ్యత గల తల్లితండ్రులు ప్రవర్తన లాగే ఉందా?

    నిజానికి మీ ఉదాహరణ సరిపోదు ఇక్కడ. పిల్లవాడు బంతి ఆడుకోవటానికి వెళ్లి అద్దం పగలకోట్టలేదు. అద్దం పగలకొట్టటానికె వెళ్లి అద్దం పగలకొట్టాడు.

   • శివకుమార్ గారు,

    పైన, నా కామెంట్ లో lఒక వాక్యం ఎగిరిపోయింది. తల్లితండ్రులు, పక్కిన్టివాల్లకు, మా పిల్లడు అద్దం పగలకొట్టాడు. అది చేయకూడని పని అని acknowledge చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు పక్కింటివాళ్ళు మన అద్దం వీళ్ళకు ఇష్టమయ్యే పగలకొట్టినట్టున్నాడు అనుకోటంలో అసహజం ఉందా?

   • Sivakumara Sarma says:

    పద్మ గారూ – నేను కామెంట్ ని సబ్మిట్ చెయ్యగానే నాకే తెలిసింది – దీనిమీద సందేహాలొస్తయ్యని. సరైన ఉదాహరణ నివ్వకపోవడం నా పొరపాటే.
    ఈ చర్చ మొత్తంలో నాకు అర్థమైనది ఏమిటంటే, దీనిలో పాల్గొన్న ఒక పక్షం, అధికారంలో వున్న పార్టీ ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణా కార్యక్రమాన్ని ఎలా సాగిస్తోంది అని కాకుండా, ఆ పార్టీకి చెందిన వాళ్లు, ప్రత్యేకించి కాషాయ వస్త్రధారులు (వీళ్లకంటూ ప్రత్యేకంగా అధికారాలు లేకపోయినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంలో ఏ మాత్రం భాగం లేకపోయినా), ఏం తప్పిదాలు చేసినా దాన్ని ప్రభుత్వం తన విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వుండడం వల్లేనని నిర్ధారిస్తున్నారు. (9/11, 26/11 జరగడం ప్రభుత్వ వైఫల్యంవల్ల అని ఎవరు అన్నా కాదు అనేవాళ్లుండరు. కానీ, వీధి చివర దొమ్మీ జరిగితే దానికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అంత సహేతుకమైన పని కాదు. కానీ, అవే దొమ్మీలు రోజూనో, ప్రతీ ఆదివారమో జరిగితే అప్పుడు వాటిని జరగకుండా ఆపకపోవడం ప్రభుత్వానిదే తప్పు. ఒకప్పుడు హైదరాబాద్ లో వినాయక చవితినాడూ, రంజాన్ నాడూ కొట్లాటలు జరిగేవి. ఇప్పుడు అలా జరక్కపోవడం ప్రభుత్వం సరిగ్గా పనిచెయ్యడంవల్ల అని భావించవచ్చు.) కాషాయ వస్త్రదారి అయినా ఇంకేరంగు వస్త్రదారి అయినా, ఆ వ్యక్తీ మొదట భారత పౌరుడు కనుక, భారత దేశపు చట్టాలు ఏమి ఉల్లంఘించబడ్డాయో దర్యాప్తు చేసి న్యాయస్థానంలో విచారణ చెయ్యవలసిన బాధ్యత local authorities ది. (వీళ్లు అధికారం పార్టీ చెప్పుచేతల్లో వుండరా అని అడక్కండి – ఏ పార్టీ అధికారంలో వున్నా పరిస్థితి ఇదే.) వేరేగా, ఒక పార్టీ సభ్యుడు పార్టీకి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడు అని మాత్రమే ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని విచారించి ఆ వ్యక్తిమీద ఆ పార్టీ డిసిప్లినరీ ఏక్షన్ ఏమయినా తీసుకోవాలా అన్నది ఆ పార్టీ హై కమాండ్ నిర్ణయించుకుంటుంది.
    అఘాయిత్యం చేసినవాళ్లు ఎవరో తెలియదు, చేయించిన వాళ్ల గూర్చి ఊహాగానాలున్నాయి. అవి నిజం కావచ్చు కూడా. కానీ, ఒకరిని దోషిగా న్యాయస్థానంలో నిలబెట్టాలంటే తిరుగులేని రుజువులని చూపెట్టాలి . “సారంగ”లో చర్చలో నాకు కనిపించింది మాత్రం ఎమోషనల్ పార్ట్ మాత్రమే. తప్పులని ముందు వ్యక్తీ తప్పులుగా గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించడం జరగాలి. దానికి బదులు ఆ కులంవాళ్లనీ, ఆ మతం వాళ్లనీ అందరినీ ఒకే తాటిపై కట్టి, వాళ్ల మత పుస్తకాలని దుయ్యబడుతూ, వాళ్లందరికీ అసలు మానవత్వం వుందా అని కూడా ప్రశ్నించడం మొదలుపెట్టడం, (ఏమన్నా మాట్లాడబోతే, “ముచ్చటేస్తోంది” అని condescending గా వ్యాఖ్యానం చెయ్యడం) సామాజిక పురోభివృధ్ధిని కుంటుపడేలా చెయ్యడం మాటటుంచి, అసలు చర్చ జరగడానికే తావివ్వకుండా చెయ్యడ మవుతుంది.

 7. సుజన says:

  మీరు చెప్పేది ఎలా ఉందంటే, చీకట్లో దొంగలా వచ్చి దొంగ దెబ్బ తీస్తాము. మేమే చంపామని బయటికి చెప్పం. చెప్పే ధైర్యం మాకు లేదు. మేము పిరికి పందలం అన్నట్టుగా ఉంది. అప్పుడప్పుడు జరిగే ఘటనలనీ, ఎవరినో ఒకరిని చంపారనీ మీరు అంటున్నారు. వీటిని బట్టి దేశం భ్రష్టుపట్టినదని ఎలా అంటారని మీ ప్రశ్న. గత పదిహేను నెలలుగా వరసపెట్టి జరుగుతున్న దారుణాలను, సంఘపరివార్ చేస్తున్న కవ్వింపు ప్రకటనల్ని అప్పుడప్పుడు జరిగేవని ఎలా అంటారు? వాటి వెనుక ఒక పథకం మీకు కనిపించడం లేదా? అవి దేశంలో సృష్టిస్తున్న భయవాతావరణం గురించి ఏమంటారు? ఎన్నికల ముందు ముజఫర్ నగర్ లో జరిగిన ఊచకోతలో ఎన్ని ప్రాణాలు పోయాయి? పూణేలో ఒక ముస్లిం యువకుడి హత్యతో మొదలు పెట్టి, ఢిల్లీలో చర్చిలపై దాడులు, దాద్రీ హత్యవరకూ జరిగినవి దేశంలో 15 శాతానికి పైగా ఉన్న మైనారిటీలలో ఎలాంటి అభద్రతాభావం కలిగిస్తుందో మీకు అర్థం కాదా? వీటివల్ల దేశం భ్రష్టు పట్టిందని అనలేమనీ, దానికి ప్రభుత్వాన్ని బాధ్యులు చేయలేమని అంటున్నారు. ఒకవేళ ఈ పదిహేను నెలల్లో ‘అప్పుడప్పుడు’ ‘అక్కడక్కడ’ హిందువులపైనే దాడులు, హత్యలు జరిగితే అప్పుడు కూడా మీకు దేశం భ్రష్టు పట్టినట్టు కనిపించదా? దానికి ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయరా? ఈ పదిహేను నెలల్లో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏ భగవద్గీతనో తగలబెట్టారనుకోండి. అప్పుడు కూడా మీరు అలాగే అంటారా? ఈ ప్రశ్నలకు మీరు ‘అవును’ అంటే మీకు పక్షపాతం లేదని అభినందిస్తారు. ఏమంటారు?

  • Sivakumara Sarma says:

   ఎవరయినా, పబ్లిగ్గా, నేను ఫలానా రోజున భగవద్గీతని గానీ, ఖురాన్ ని గానీ, బైబిల్ ని గానీ తగలబెడుతాను అని ప్రకటన నిస్తే,వాళ్లని ఆ సంఘ విద్రోహక చర్యని చేపట్టకుండా ఆపే బాధ్యత ప్రభుత్వాలది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న సామెత ఈ సమయంలో వర్తిస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వం తన విధిని నిర్వర్తించకపోతే ప్రభుత్వాన్ని దుయ్యబట్టే అధికారం ఎవరికయినా వుంటుంది. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఎన్నికల్లో వాళ్లని అధికారం నుండీ తొలగించే బాద్య కూడా పౌరులదే.
   సుజనగారు హఠాత్తుగా వారి ఇంటినుండీ బయటికొచ్చి భగవద్గీతని తగల బెడితే, ఆ కొన్ని సెకన్ల కాలంలోనూ స్పందించే సత్తా ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ వుండదు.

  • Sivakumara Sarma says:

   మీ అభినందనలు నాకేమొద్దుగానీ, ఈ క్రింది వివరణ మీ సహేతుకమైన ఆలోచనకి తోడ్పడుతుందనుకుంటాను:
   “ఈ పదిహేను నెలల్లో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏ భగవద్గీతనో తగలబెట్టారనుకోండి. అప్పుడు కూడా మీరు అలాగే అంటారా?” – నేను కొన్ని సెకన్లలో ఏ మాత్రం స్పందించలేని ప్రభుత్వాల నిస్సహాయాతని గూర్చి మీకు ఉదాహరణ నివ్వాలంటే – ఒక ఇల్లు తగులబడుతోందనుకోండి, ఫైర్ ఇంజన్లు అక్కడికి రావాలంటే ముందా విషయాన్ని ఫెయిర్ డిపార్ట్ మెంటుకు తెలియజెయ్యాలి. అవి పరుగెత్తుకుంటూ మంట స్థలానికి రావాలి. అమెరికాలో కూడా అలా రావడానికి కనీసం 5 నిముషాలు పడుతుంది. (ఇంక ఇండియా సంగతి చెప్పక్కర్లేదు.) అలా కాక, ప్రతీ సోమవారం నాడు ఒకళ్ళు పబ్లిక్ ప్లేసులో భగవద్గీతనీ, ఇంకొకళ్ళు ప్రతీ శుక్రవారంనాడు ఖురాన్నీ, ప్రతీ ఆదివారంనాడూ బైబిల్నీ తగులబెడతామని, ప్లేసు, టైములతో సహా వివరాలనిస్తే, వాటిని నిరోధించాల్సిన బాధ్యతా ప్రభుత్వాలది. ఇకపోతే, అక్కడక్కడా జరిగే బాంబుల విధ్వంసాల గూర్చి – ఇవికూడా సినిమాల్లో తప్పితే, చెప్పి జరగవు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం జరక్కుండా వుండడానికే గూఢచారులని ఉపయోగించి, ముందస్తుగా వినాయక చవితినాడూ, బక్రీదు పండగనాడూ, రిపబ్లిక్ డే నాడూ ఎక్కువ పహారా కాసేది. అమెరికాలో అయితే, 9/11 ప్రత్యేక యానివర్సారీలకి – ముఖ్యంగా 5వ, 10వ, వగైరాలకి ఎక్కువ పహారా కాసేది. అలాంటివి కాకుండా ఆపిన వివరాలు ప్రజల కళ్లముందుకీ, చెవుల్లోకీ రావు. ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే చెంపకి ఛెళ్లుమన్నట్టుగా తెలిసేవి.

 8. కె.కె. రామయ్య says:

  మూఢవిశ్వాసాలను ప్రశ్నించిన హేతువాదులు ఎం.ఎం. కలబుర్గి, గోవింద్‌ పన్సారే తదితరుల హత్యలకు నిరసనగా… గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ గ్రామంలో మహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనకు నిరసనగా …( దేశం తిరోగమనదిశలో పోతోందని; ప్రస్తుతం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని; సాంస్కృతిక భిన్నత్వం దెబ్బతింటూ దేశంలో ఒకే ఒక్క హిందూమతం దిశగా సాగుతోందని నిరసిస్తూ ) ప్రముఖ రచయిత్రి, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్‌, ఉదయ్‌ ప్రకాశ్‌ అనే హిందీ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. ఆరుగురు కన్నడ రచయితలు కన్నడ సాహిత్య పరిషత్‌కు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు.

  అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తున్నా, ప్రస్తుతం ఆ హక్కును హరించే ఘటనలు చోటుచేసుకుంటుండటంపై వారు విచారం వ్యక్తంచేశారు. ప్రజలు ఏది తినాలో, ఏది ధరించాలో, ఏది మాట్లాడాలో అన్న విషయాలను కూడా నిర్దేశించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా, ప్రజాస్వామిక హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలి అని వారు భావించారు.

  ‘సహనం, క్షమ, వైవిధ్యం, బహుళత్వం వంటివి నాగరిక ప్రస్థానంలోని మౌలిక విలువలు. వాటికి చెద పట్టనీయొద్దు’ అంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించిన దారిలోనే అందరం నడుద్దామని ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలిసారి బీహార్ ఎన్నికల ప్రచార సభలో స్పందించారు.

  అసాధ్యమైన విషయమేకాని, అవకాశమిస్తే, మన దేశాన్ని అఫ్ఘనిస్తాన్, సిరియా దేశాల దారిలో నడిపించటానికి సాయశక్తులా పాటుపడుతారు యీ నియో సూడో జాతీయవాదులు. ( గురువృధ్ధుడైన తమ నాయకుడొకరికి కూడా బీఫ్ తినడం ఇష్టమనే విషయాన్ని విస్మరిస్తారు ). హిందూ మతంలో కాని మరే మతంలో మంచిని కాని ప్రశ్నించటం లేదిక్కడ. మతం పేరుతో జరుగుతున్న ఘాతుకాలని ప్రతిఘటించాలనేదే ప్రతిపాదన. సహేతుకమైన చర్చను మొదలుపెట్టారని అనలేను కాని చర్చకు వీలుకల్పించిన శివకుమార శర్మ గారికి ధన్యవాదాలు. ఆక్రోశ్, సుజన గార్లు ఇచ్చిన వివరణలు సముచితంగా ఉన్నాయి.

 9. buchireddy gangula says:

  ఆక్రోష్ గారు
  సర్= చాల చక్కగా —జవాబు లు యిచ్చారు —
  salutes..సర్
  beef— international.. food. item—-వివధ దేశాల వాళ్ళు —- కుక్కలు –పిల్లులు — గుర్రాల మాసం ను తింటారు — so… what…
  తప్పు ఏముంది ???

  మనిషి బతకడానికి మతం — కులం అవసరమా ——
  మోడీ గారి రాకతో — మల్లి స్వాములు — పితాది పతులు — లేని పోనీ కూతలు కూస్తూ
  ( RSS..కూడా )—-
  I. STAND. IN. SOLIDARITY.WITH.WRITERS.-RETURNING.AWARDS—salman.రుశిదే
  గాంధిజీ పుట్టిన దేశం లో
  దళితులకు
  ముస్లింల కు
  పెదోల్లకు
  స్థానం లే దు
  స్వాతంత్రం లేదు
  స్వేఛ్చ లేదు ————–ఎందుకు ??? దేనికి ??
  యింకా ఎంతకాలం — యీ తిరు ???

  మతం — సంస్కృతి — సా 0 ప్రదాయెం — ముసుగులో మారనహొమాల్ని
  సృష్టిస్తున్నారు — bjp..ప్రబుత్వం
  తినడం — వ్యక్తి హక్కు ????
  ———————————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

  • Chandrika says:

   బుచ్చి రెడ్డి గంగుల గారు!! మీరు ఒక్క కామెంట్ లో చాలా విషయాలు మాట్లాడారు:
   beef— international.. food. item—-వివధ దేశాల వాళ్ళు —- కుక్కలు –పిల్లులు — గుర్రాల మాసం ను తింటారు — so… what…తప్పు ఏముంది ???
   అమెరికా లో కుక్కలన్నా , పిల్లులన్నా వాటిని పెంచుకునేవారికి మనిషి కంటే ప్రాణం . చైనా నుంచి అమెరికా వలస వచ్చిన వాడు ఇది డెమోక్రసీ so… what…తప్పు ఏముంది ??? అని వాటిని అమెరికా లో తినడం మొదలుపెట్టాడనుకోండి ప్రభుత్వం చూస్తూ కూర్చోదు కదా . ‘You have a Right to remain Silenett ‘ అని మొదలెడ్తుంది.

   గాంధిజీ పుట్టిన దేశం లో దళితులకు, ముస్లింల కు,,పెదోల్లకు,స్థానం లేదు,స్వాతంత్రం లేదు
   స్వేఛ్చ లేదు అన్నారు – మరి మీరు చెప్పేంత ధార్మికంగా ఉన్నదేశ మేదైనా ఉందా ప్రపంచం లో ? వేరే ప్రజాస్వామిక దేశం లో ఎప్పుడైనా మైనారిటీ లాగా వలస వెళ్తే తెలుస్తుంది భారత దేశపు విలువ. ప్రతి మైనారిటీ పండగ లకి సెలవులు ప్రకటిస్తుంది భారత దేశం. భారత దేశం లో ఒక ముస్లిం రాష్ట్రపతి అయ్యాడు, ఒక దళితుడు ప్రధాన మంత్రి అయ్యాడు, ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ముస్లిములు వారి చట్టం వారు అనుసరిస్తారు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు ఎంత మంది పిల్లల్ని కన్నా పరవాలేదు ఎవరికీ విడాకులిచ్చినా పరవాలేదు. భారత దేశం చట్టం వారిని, వారి చట్టంని గౌరవిస్తున్నట్లే కదా ? అన్ని వర్గాల కి రిజర్వేషన్ ఉన్నాయి. దాని వలన నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎంత బాధ పడ్తున్నారో మీకు తెల్సా? రిజర్వేషన్ అవసరమే. కాదనలేము. కానీ కొన్ని సార్లు రిజర్వేషన్ నిజంగా అవసరమా అన్పిస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒక ప్రభుత్యోగి ఉన్నాడు. ఆయన ఉద్యోగం రిజర్వేషన్ తో వచ్చినదే. ఆయనకి ముగ్గురు పిల్లలు. ముగ్గురికి అత్తెసరి మార్కులు. కానీ ముగ్గురు ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు. వారి కళాశాల ఫీజు , టెక్స్ట్ పుస్తకాలూ , నోట్ పుస్తకాలూ , సైంటిఫిక్ calculator తో సహా అన్నీ ఉచితం . ముగ్గురు ఇంజనీరింగ్ అత్తెసరి మార్కులతో పాస్ అవ్వటం ప్రభుత్వ ఉద్యోగాలు రావటం జరిగింది. వారితో చదివిన ఒకమ్మాయికి వాళ్ళ అమ్మాయికి కంటే ఎక్కువ మార్కులు వచ్చి సీట్ రాక రెండోసారి చదవాల్సి వచ్చింది. అగ్ర కులం లో పుట్టడం ఆ పిల్ల తప్పా మరి? వీరి ముగ్గురి పిల్లలు కూడా రిజర్వేషన్ తో సీట్ తెచ్చుకోడం ఖాయం. M.Tech మంచి మార్కుల తో పాస్ అయి AE గా పని చేస్తున్న వారి పై BTech అత్తెసరి మార్కులతో పాస్ అయిన DE లు పెత్తనం చేస్తున్నారు.మీకు ఈ విషయం ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు లోనో ఇరిగేషన్ డిపార్టుమెంటు లోనో అడిగితే చెప్తారు. ఎవరికి విలువ ఇవ్వలేదు గాంధిజీ పుట్టిన దేశం ? మీరు ఇవ్వట్లేదు గాంధిజీ పుట్టిన దేశానికి ఇవ్వాల్సిన విలువ.

   మోడీ గారి రాకతో — మల్లి స్వాములు — పితాది పతులు — లేని పోనీ కూతలు కూస్తూ – అన్నారు
   కొంత మంది ముస్లిం లు వారి ఇమాం గారు ఎవరు ఓటు వేయమంటే వారికీ వారు ఓటు వేస్తారు. అసలు ఇమాం గారికి దేశ రాజకీయాలతో ఏం పని? మీకు ఆ విషయం తెల్సి పీఠాధిపతుల గురించి మాట్లాడుతున్నారా ?

   అవార్డు గ్రహీతలు అవార్డు వెనక్కి తిరిగి ఇవ్వటం అంటారా – నాకు కనక వారిని ప్రశ్నించే అవకాశం వస్తే ఒకటే అడుగుతాను. మరి ఇటలీ లో పుట్టిన భారత దేశ వనిత సోనియా గాంధీ గారు, కేవలం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ధర్మ పత్ని అయినందుకు పదేళ్ళు భారత దేశం మీద పెత్తనం చెలాయించారు కదా !! 26/11 రోజున మనుషుల్ని పిట్టలు కాల్చినట్టు కాలిస్తే ఆ రోజు వీరందరి నిరసన ఏమయింది ? సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఆ రోజున ఏ రక్షణ వాగ్దానం చేసింది ? అవార్డు గ్రహీతలు అవార్డు వెనక్కి తిరిగి ఇవ్వటం ని ఆంగ్లం లో Political drama అంటారు .

   Moderator గారు – ఈ కామెంట్ మొత్తం మీరు పబ్లిష్ చేయకపోయినా పర్వాలేదు కానీ అందజేయ వలిసిన వారికీ అందజేయమని మనవి

 10. Chandrika says:

  ఆక్రోష్ గారు,
  అఖ్లాక్ ని అలా చంపటం నిజంగా శోచనీయం. కాదని ఎవరూ అనలేరు. తిన్నాడో తినలేదో గానీ అలా మనిషిని చంపటం నిజంగా దారుణం. కానీ మీరు మీకవిత ద్వారా ఆవుని తినచ్చు అన్న సందేశం ఇవ్వటం కూడా అంతే దారుణం గా ఉంది. ఆవు అనే జంతువుని జంతువుగా చూడరు. ఇంట్లో మనిషి అన్నట్లే. ఆవు రైతు కి ఆస్థి అంటే asset. పాడి పంట, పశు సంపద అని ఎందుకు అంటాము ? ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఆవుల్ని ఎగబడి తింటున్నారనే గోమాత అని చెప్పారు . ఆవు కోడిపెట్ట లాగా ఒకే సరి పది పిల్లల్ని కనదు. భారత దేశపు జనాభా కి ఆవుల్ని, గేదెల్ని తినడం మొదలు పెడితే పాలు కూడా దిగుమతి చేసుకోవాలి

  • సాహితి says:

   //అఖ్లాక్ ని అలా చంపటం నిజంగా శోచనీయం. కాదని ఎవరూ అనలేరు.//
   పరవా లేదండి మీకూ మానవత్వం ఉంది అనిపించు కున్నారు!

   • Sivakumara Sarma says:

    సాహితి గారూ, ఈ వ్యాఖ్యతో మీరేం సాధిద్దామనుకున్నారో తెలియజేస్తారా?

 11. buchi reddy says:

  రిజర్వేషన్స్ అవసరమే —
  బూములున్నవి ఎవరి కండి —రెడ్డి –veluma-కమ్మ — బాపన దొరలకు
  ఆర్థిక సమానత్వం కావాలి —
  రాష్ట్రాన్ని యింతకాలం పాలిచింది ఎవరు ?? ధలితులా or..దొరలా ??
  అసలు దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ఒక్క family–కాదా —దేశం లో ప్రజాసామ్యం ఉందా
  Chandrika గారు ???
  ఏమి లేని వాళ్ళు పయికి రావాలంటే రిజర్వేషన్స్ అవసరమే —
  నామ మాత్రానికి ప్రెసిడెంట్ లు గా ముస్లిమ్స్ –దళితులను చేసి — నడిపేది ?? నడిపించేది —
  ప్రధాన మంత్రి కాదా ???2 nd.time… కలాం గారి కి టికెట్ ఎందుకివ్వలే ధో — చెప్పండి

  muslims– అంటే మన చూపులో — మన కదలిక లో — మన నడవడి లో — బేధం దేనికి
  చంద్రిక గారు ??? వాళ్ళు మనలాగే మనుష్యులే — కాదా
  it.is. not..పొలిటికల్ drama—
  తినడం — తాగటం — వ్యక్తి యిష్టెం —ధానికిఅద్దు చెప్పడం దేనికి — చంపడం దేనికి ??

  కుల మత పట్టింపులు — ఇంకా ఎంతకాలం chandrikaji…
  జవాబు యివ్వగలను —- ఎన్ని అయినా —— సారంగ ప్రచురిస్తే

  ———————————————————————————– buchi.reddy.gangula—–

 12. కె.కె. రామయ్య says:

  “దేశంలో మతపరమైన రాజకీయాలు పెరిగినందుకు నిరసనగా ఇటీవల అనేక మంది రచయితలు జాతీయ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం తెలంగాణ రాష్ట్రం నుంచి కొమురం భీం సినిమా హీరో, రచయిత భూపాల్‌రెడ్డి తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. 2011లో భూపాల్‌రెడ్డి అకాడమీ నుంచి బాల సాహిత్య పురస్కార్‌ను అందుకున్నారు. ఇఖ్లాక్ హత్య దేశంలో మానవీయ విలువలు అడుగంటాయనటానికి నిదర్శనమని అన్నారు”.

  Read more at: http://telugu.oneindia.com/news/telangana/bhupal-returns-sahitya-akademi-award-165811.html

 13. “ఎవరిష్టమొచ్చింది వారు తినొచ్చు” ననే స్టేట్ మెంట్ మీద లోతైన చర్చ జరగాల్సిన అవసరముంది. ఆ ఇష్టం ఏయే నిబంధనలకి లోబడి? నిజంగా మన ఆహారపుటలవాట్లు అంత పూర్తి వ్యక్తిగతమా? మనం ఏ సమాజంలో నైతే పుట్టి పెరిగామో ఆ సమాజపు పాత్ర వాటిల్లో ఏమీ లేదా?

 14. “Reasoning against a prejudice is like fighting against a shadow; it exhausts the reasoner, without visibly affecting the prejudice. Argument cannot do the work of instruction any more than blows can take the place of sunlight.”
  ―Charles Arundell St. John-Mildmay

 15. buchi g reddy says:

  వ్యక్తి యిష్టాని కి సంకెళ్ళు దేనికి ?? తినడం –తాగడం వ్యక్తిగత విషయెం —
  హక్కు కూడా —-వివిధ దేశాల వాళ్ళు — అనేక రకం అయినా జంతువుల ను తినడం
  జరుగుతుంది — so..వాట్> ???

  వేదాలు చెప్పాయి — దేవుడు చెప్పాడు — బాబా లు చెప్పారు — అన్ని వొట్టి మాటలు
  మనిషి జీవించడానికి మతం –గోత్రం — కులం — అవసరమా — అవి లేకుంటే
  బతుక లేమా ??????????????????
  ————————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 16. కె.కె. రామయ్య says:

  “దేశంలో పెరుగుతున్న కలహాలు, మతోన్మాదానికి నిరసనగా ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌, మాలిక్యులర్‌ బయాలజీ వ్యవస్థాపకుడు పిఎం భార్గవ (87) గురువారం తన పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ( 29-Oct-2015) గురువారం నాడిక్కడ ప్రకటించారు. ఈ అసహన ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని, పాకిస్తాన్‌లాగా మతాధికారి పాలిత దేశంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి, విద్వేషపూరిత ధోరణులను వ్యతిరేకిస్తూ అనేక మంది రచయితలు, కవులు, సినీ రంగ ప్రముఖులు తమ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరికి మద్దతుగా 50 మందికిపైగా చరిత్రకారులు, వందమందికిపైగా శాస్త్రవేత్తలు చేరారు.”

  http://www.erramirchi.com/erramirchi/telugu/?p=130970

 17. కె.కె. రామయ్య says:

  ” బీఫ్ తిని వారికి బుద్ధి చెబుతా ~ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘బీఫ్’ వివాదంలోకి తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చేరారు. ఇప్పటివరకూ తాను గో మాంసాన్ని తినలేదని, అయితే బీజేపీ నాయకుల చర్యలను చూసి తాను ఇకనుంచి గోమాంసం తినాలని నిర్ణయించుకున్నట్లు బెంగళూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తిన్నవారిపై దాడులకు పాల్పడుతూ బీజేపీ నాయకులు అనాగరికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తింటే తప్పేంటి అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు. ఏ ఆహారం తీసుకోవాలన్నది వారి వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అందుకు గోమాంసం అతీతం కాదన్నారు. ప్రశ్నించడానికి బీజేపీ నేతలు ఎవరని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల చర్యలతో దేశంలో అభద్రతా భావం పెరుగుతోందన్నారు. ఇకనైనా కేంద్రం దేశ అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని సిద్ధరామయ్య హితవు పలికారు. “

మీ మాటలు

*