వావి వరుసలు లేని ….!

చింతామణి .. వేశ్య
శ్రీహరి .. ఆమె తల్లి
చిత్ర .. ఆమె సేవకురాలు
సుబ్బిశెట్టి: కొత్త విటుడు

శ్రీహరి: అమ్మాయీ, పెద్దిశెట్టి కొడుకు మన వీథిలో యీ పూట మూడు నాలుగు సార్లు తారట్లాడాడు. ప్రతిసారి అతని కన్ను మన ఇంటి మీదే ఉంది.
చింతా: అతనెందుకు వచ్చాడోలే అమ్మా!
శ్రీహరి: అదేంటే అట్లాగంటావు? వలపు తిమ్మిరి పుట్టకపోతే సానివాడకే రాడు. వచ్చినా సానుల కొంపల వైపు కన్నెత్తి చూడడు. చూశాడూ అంటే వాడిక మన కొంపలో బంటే ననుకో! అదీ గాక, ఈమధ్య తండ్రి కంట్లో కారం చల్లి డబ్బెత్తుకొచ్చి తెగ ఖర్చుపెడుతున్నాడని విన్నాను. రంగనాయకికి పట్టిన నడమంత్రపు సిరంతా వీడి పుణ్యమే నని చెప్పుకుంటున్నారు.
చింతా: ఆ సంగతి తెలిసే మొన్న మేజువాణీలో నాకతను వసూలు తాంబూలమిస్తున్నప్పుడు కాస్త గోకాను. ఈ తారులాట అందుకేనేమో!
శ్రీహరి: శభాష్! అందుకే సాని మేళాలు మాన కూడదని నేను నెత్తీ నోరూ కొట్టుకు చెప్పేది. ఊరూరూ తిరుగుతుంటే పదిమంది కంట్లో పడొచ్చు. చక్కగా ముస్తాబు చేసుకుంటే కాస్త వయసు మళ్ళినా కుర్ర పిల్లలా కనిపించొచ్చు. చతురాడో, చెంగు తాకించో కొత్త వాళ్లకు రంధి పుట్టిం చొచ్చు. ఉంచుకున్నవాడు ఆసమయంలో పక్కనుండడు కాబట్టి, భయం లేకుండా సంపా దించుకోవచ్చు. కాస్త తెలివితేటలుండాలే గానీ, దేవుడి నైనా వెనక కుక్కలా తిప్పు కోవచ్చు.
చింతా: నువ్వు చెప్పింది నిజమేనమ్మా! అదీగాక ఇప్పుడు మొగ్గల బేరమొకటి మోపుగా ఉంది. ఈ సుబ్బిసెట్టి మొన్న అరగంటలో నాకు ఆరు వందలిచ్చాడు.
శ్రీహరి: ఐతే రుచి తగిలిందన్నమాటే! ఈసారి ఇటు వచ్చినప్పుడు నిన్ను కేకేస్తా. డాబాపైనుంచి ఒక సారి వాడికి కనబడు. ఊరికే కనబట్టం కాదు, ఓర చూపులు చూసి, చిరునవ్వు నవ్వి, అతను చూడగానే కాస్త చాటుకు పోయి వాడికి పిచ్చెక్కించాలి.
చింతా: ఏంటమ్మా, కొత్తగా వచ్చిన వాళ్లకు చెప్పినట్టు చెప్తావు? సరేగానీ, వాళ్ళ నాన్న మనింటికి వస్తా డని అతనికి తెలిసే ఉంటుందేమో!
శ్రీహరి: ఏం తెలిస్తే? మనకలాంటి భేదం ఉండకూడదు. ఆ ఎగ్గు సిగ్గు లిప్పుడు మనతో పాటు మన ఇళ్ళకు వచ్చే వాళ్లకు కూడా పోయాయి.
చిత్ర: (ప్రవేశించి) అమ్మా, ఎవరో సుబ్బిశెట్టి గారంట, పెద్దిశెట్టి గారి కొడుకంట, లోపలికొచ్చి, అక్కయ్యేం చేస్తోందని అడిగాడు. మేడమీదుందని చెప్పాను.
శ్రీహరి: అమ్మాయీ, పట్టుకోవాలనుకున్న చేప పైకే తేలింది. చిత్రా, నువ్వెళ్ళి… కాదు, కాదు, నువ్వుండు, నేనే పోయి తీసుకొస్తా!
చింతా: చిత్రా, వసారాలోని కుర్చీలు రెండు తెచ్చి ఇక్కడ వెయ్యి. ఆకులు పోకలు పళ్ళెంలో వేసి, అత్తరుదానుతో బల్లమీద పెట్టు. అలమారలోంచి నాలుగు అగరుబత్తీలు తీసి వెండి చెట్టుకు గుచ్చి వెలిగించు.
చిత్ర: సరేనమ్మా! (ఆపని మీద వెళ్ళింది. చింతామణి నిలువుటద్దం ముందు నిల్చొని పాపట దిద్దు కొని, పావడ సవరించు కొని, సెంటు పూసుకొని, గుమ్మానికి ఒక పక్కగా సిగ్గు నభినయిస్తూ నిలుచుంది. శ్రీహరి, సుబ్బిశెట్టి లోపలి కొచ్చారు)
శ్రీహరి: అమ్మాయ్, సుబ్బిశెట్టి గారు, సుబ్బిశెట్టి గారని అదే పనిగా కలవరించావు. ఇదిగో నీ సుబ్బి శెట్టిగారు. బాబూ, ఏం చెప్పమంటారు? మొన్న మేజువాణీ కచ్చేరీలో మిమ్మల్ని చూసిందట. అక్కడినుంచి రేయింబగళ్ళు మీ జపమే!
సుబ్బి: (లేకి నవ్వుతో) అబ్బో, అబ్బో, నిజంగా! నాతోడే?
శ్రీహరి: మీతోడండి. పెద్దముండని, మీతో ఫెడేల్ మని అబద్ధమాడతానా? అయినా మీకా అనుమాన మెందుకు? మీ అందం, చందం, ఐశ్వర్యం, చతురత, దానగుణం చూసిన ఆడది మిమ్మల్ని ప్రేమించకుండా ఉంటుందా?
సుబ్బి: అబ్బో, అబ్బో నేను ఇంట్లోంచి బయల్దేరిన వేళ మంచిది. తోక లొటలొట లాడిస్తూ ఊరకుక్కె దురొచ్చింది. కుక్క మాటెందుకు? ఇవ్వాళ మంచం దిగుతూ మా అత్తప్ప మొహం చూశాను. యదవదైనా దాని మొహం చూస్తే, ఏదో లాభం తగిలిందన్నమాటే!
శ్రీహరి: మీ మాటకేంగానీ, మాయమ్మి మాత్రం ఈ పొద్దు మంచి మొహమే చూసింది. అందుకే మీరు వెతుక్కుంటూ వచ్చారు. లోపలికి రమ్మనవేమే, ఇన్నాళ్ళకు వచ్చారని కోపమా ఏంటి?
చింతా: నాకేం కోపం? రంగనాయకి ఇల్లొదిలి రమ్మంటే మాత్రం ఆయన వస్తారా ఏంటి?
శ్రీహరి: ఛీ, ఛీ…. అదేంటే అట్లాగంటావు? రూపానికి మన్మధుడు, సంపదకి కుబేరుడు, దానానికి కర్ణుడు, ఆయనకీ రంగనాయకి కొంపకి పొయ్యే ఖర్మేంటే! ఏం బాబూ, అంతేనా?
సుబ్బి: అంతే, అంతే అమ్మతోడు! అబద్ధమెందుకు? యెవరో యీడ్చికెల్తే ఏడెనిమిది సార్లు కావో సెల్లేను. అయితే అత్తప్పా, తెలవకడుగుతాను, దానింటి కెల్లడం తప్పే అంటావా?
శ్రీహరి: తప్పా, తప్పున్నారా? మీ దర్జా ఎక్కడ, మీ షోకెక్కడ? రాలుగాయిముండ రంగనాయకి ఎక్కడ? మీవంటి వారు అటువంటి దాని గుమ్మం తొక్కవచ్చునా!
చింతా: అమ్మా, నీకు వెర్రా ఏంటే? రంగనాయకిని వదిలి క్షణం ఉండ గలడా ఆయన?
సుబ్బి: ఇదిగో, ఈ మాటిను! ఇహ దాని గుమ్మం తొక్కినట్టు తెలిస్తే, కాండ్రించి కళాపు లాగా మొహా నుయ్యి. సరేనా?
శ్రీహరి: అబ్బా, ఎందుకంత మాట? అయితే బాబూ, మనకు నల్లమందు వ్యాపారమేమన్నా ఉందా?
సుబ్బి: మనకు లేదు కానీ, మనత్తోరికుంది. ఏవైనా కావాలా ఏంటి?
శ్రీహరి: అయ్యో, కావాలా అని మెల్లగా అడుగుతారేంటి? పూటకు తులం పూర్తిగా కావాలి.
సుబ్బి: అయితే ఈ రేతిరి జేగర్త పెట్టి రేపు తాటికాయంత ముద్డంపుతాను. సలివిడి మింగినట్టు సల్లగా దిగమింగు.
శ్రీహరి: మంచిది బాబూ, మంచిది. జేబులో సుట్టముక్కున్నదా?
సుబ్బి: నాకు సుట్టబ్బేసం లేదు, చిల్లరిస్తా కొనుక్కో!
శ్రీహరి: వద్దుబాబూ, వద్దు! మీ రత్నాల చేత్తో రాగి డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు.
సుబ్బి: పోనీ రూపాయిస్తా పుచ్చుకో! (యిచ్చును)
శ్రీహరి: అమ్మీ, చూశావా అయ్య దర్జా! బాబూ, పడుచు వాళ్ళ మధ్య నేనెందుకు? శలవు! (వెళ్ళును)
చింతా: మా అమ్మ ఉందని బిడియపడి ఊరుకుంటే, అక్కడి నుంచి అడుగు ముందుకు వెయ్య రేంటి? (చెయ్యి పట్టి లాగును)
సుబ్బి: (పారవశ్యంతో తనలో) వావ్వా, వావ్వా, యేవిసుకం, యేవిసుకం… ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళోసుకున్నట్టు కళ్ళు మూసుకుపోతున్నాయ్! ఓరయ్యల్లో, యిది సుకాల పుట్ట గానీ, సామాన్నెం సాని గాదర్రో!

*

మీ మాటలు

*