బాపూరమణీయం@వైకుంఠం

 

-వై. వి.ఆర్.  శ్రీనివాస్ 

~

4saaranga (1)వైకుంఠంలో  బ్రహ్మ సరస్వతితో కలిసి తల్లితండ్రులతో కబుర్లు చెపుతున్నాడు. ఇంతలో జయవిజయుల అనౌన్స్-మెంటు “బాపూరమణలు తమ దర్శనానికి వచ్చారు ప్రభూ,” అంటూ. “వాళ్ళని త్వరగా తీసుకురండి, ఆలస్యమెందుకు?” అన్నట్టు లక్ష్మీనారాయణులు చూసిన చూపులకి బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది.

ఎవరీ బాపూరమణలు? రామలక్ష్మణులు, కృష్ణార్జునులు, జయవిజయులు, అశ్వనీ దేవతలు, నారద తుంబురులు, … లాగా బాపూరమణలనే ఈ కొత్త ద్వంద్వసమాసానికి కారకులెవరా అని నాలుగు ముఖాల్లో రెండే ప్రశ్నలు – బాపు ఎవరు? రమణ ఎవరు? – కదలాడుతూ చూసాడు. చదువులతల్లి మాత్రం పుట్టింటివాళ్ళని చూసిన భూలోకపు కోడల్లా సంబరపడుతోంది.

పరిస్థితి గమనించిన విష్ణుమూర్తి లక్ష్మి వైపు చూసి నవ్వాడు. “ఎంత గొప్ప స్నేహమో! రవఁణొచ్చి చాలా సేపే అయినా ఇద్దర్నీ ఒకేసారి చూడాలని మీ మావఁగారి ఉద్దేశం,”  అంది కోడల్తో. ఒదిగిఒదిగి వస్తున్న ఇద్దర్నీ చూసి వీళ్ళిద్దరి వినయం గురించి మనం విన్నది (వాళ్ళు వినాలా?) నిజ్ఝంగా నిజం సుమీ అనుకున్నారు లక్ష్మి శ్రీహరి. చిత్రకళలో శ్రీరాముడే తన  గురువని చూపిస్తూ వేసిన బొమ్మ – అదే, రాముడు సీత పాదాలకి పారాణి అద్దుతూ ఉంటే తను కుంచెలూ, రంగులూ పట్టుకుని రాముడి కందిస్తున్నట్టు గీసారూ, అదీ.

bapu ptgs

అందులో ఎంత ఆనందంగా ఉన్నారో అంతకన్నా ఆనందంగా చేతులు కట్టుకుని, అలవాటు ప్రకారం రమణగారికి కొంచెం వెనగ్గా నిలబడి ఆదిదంపతులని తదేకంగా చూస్తూ ఉన్నారు. గురువు మాట కాదని అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ అందించిన రామానుజుడి ఆవేశం, అద్వైతాన్ని అక్షరాలా అనుభవించిన శంకరుని జ్ఞానసౌందర్యం రమణగారిలో తొణికిసలాడుతున్నాయి. ఆయనలో  భక్తుడూ, సునిశిత పరిశీలకుడు, రచయితా, తత్త్వవేత్త ఒకేసారి కనబడుతున్నారు. స్వామివారికి ఇద్దరి సంగతీ తెలుసు కనక ధరహాసంతో, నిజభక్తులని  చూసిన సంతోషంతో అలాగే చూస్తూ ఉన్నాడు. అయ్యవారి సంతోషాన్ని చూస్తూ అమ్మవారూ అలా ఉండిపోయింది. బ్రహ్మ గారు మాత్రం నాలుగు చూపుడువేళ్ళు నాలుగు ముక్కుల మీదా వేసుకుని చోద్యం చూస్తున్నాడు. ఆయనకి రజోగుణం ఎక్కువ కనక ఒక్క క్షణం ఇదేమిటి ఈ మానవమాత్రుల  మీద ఈయనకింత ఆసక్తి అనుకున్నా అంతలో కృష్ణావాతారంలో గొల్లపిల్లల మీద ఈయన ప్రేమని తను పరీక్షించి మరీ భంగపడ్డ వైనం గుర్తొచ్చి సద్దుకున్నాడు. కలియుగంలో కూడా స్వామికి అలాంటి భక్తులున్నారనమాట అనుకున్నాడు. స్వామిని డిస్టర్బ్ చెయ్యకుండా గుసగుసగా అన్నాడు వాణితో, “సృష్టికర్తగా నేను టూ బిజీ కనక వీళ్ళెవరో తెలుసుకోలేదు కానీ నీకు తెలుసులా ఉందే? ఎవరు వీళ్ళు ఏమిటి కధ?” అన్నాడు. ఆవిడ మహానందంగా చెప్పింది “నా అంశలైన అరవైనాలుగు కళల్లో సాహిత్యం రమణగానూ, చిత్రలేఖనం బాపూగానూ అవతరించాయి” అని. “అవునా?! మరయితే వందలాది కళాకారులూ సాహితీవేత్తలూ ఉండగా వీళ్ళిద్దరే అని ఎలా చెబుతావు?” అన్నాడు. “ఎవరి విశిష్టత వాళ్ళదే. కానీ వీళ్ళిద్దరూ మూడు ప్రక్రియల్లో, అంటే సాహిత్యం, చిత్రలేఖనం, చలనచిత్రనిర్మాణ శైలీశిల్పాలలో జంటకవులు, కన్-జాయిన్డ్ ట్విన్స్. రమణ కధలు బాపు బొమ్మల్లోనూ, సినిమాల్లోనూ పొందిగ్గా ఒదిగిపోతాయి. వాటి గొప్పతనాన్ని బాపూరమణీయపు చవిచూసిన తెలుగువాళ్ళ ఆనందంతోనే కొలవగలం. అయినా మహా వినయసంపన్నులు. ఆధునిక పోతనలు. శ్రీరామునికి మహాభక్తులు. ఇంకేం ఋజువు కావాలి నా అంశ ఉన్నవాళ్ళనడానికి? ”

“నీ అంశలేనోయ్, సందేహమా? మరైతే చలనచిత్రాలన్నావ్, అవేంటి? కదిలే బొమ్మలా? వాటి గురించి వివరంగా చెప్పు”  అన్నాడు బ్రహ్మ దేవుడు.

“సాహిత్యం, నాటకం, ఛాయాచిత్రం, చిత్రలేఖనా ప్రావీణ్యం కలిపి వాటికి సంగీతనాట్యాలు జోడిస్తే చలనచిత్రం అని అరవై ఐదో కళ పుట్టింది. అందులో  నిష్ణాతులు వీళ్ళిద్దరూ”

“ఉట్టి కదిలే బొమ్మలే కాదు అవి మాటలు కూడా ఆడతాయి. చెట్లచుట్టూ, మంచు కొండల్లో డాన్సులు చేస్తూ పాటలు పాడతాయి. అంతే కాదు  అగ్నిపర్వతాల మధ్యా, ఎగిసి పడే కెరటాల మధ్యా నుంచుని ఏడుస్తూ కూడా పాడతాయి.”

“వింతగా ఉందే? ఇదీ నా సృష్టే?”

“ఈ కళ మానవ సృష్టి మహాత్మా! అయినా కళామతల్లిని నేనయితే, మీరు సృష్టించడం ఏమిటి?”

“సరే, సరే, సరే. చలనచిత్రాలలో వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటి?”

“మీకు ఘంటసాల వెంకటేశ్వరరావు గురించి గుర్తుందా?”

“వాణీ, వీణా పాణీ ! నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వే ఆయనెవరో, ఆయన గొప్పతనం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకో”

“ఇండియా, చైనా జనాభాలు మరీ అంత పెంచకండి, మీకు వర్క్-లోడ్ ఎక్కువైపోతుందని ఎన్నిసార్లు చెప్పాను? వింటేగా? మర్చిపోకూడని  విషయాలు మర్చిపోతున్నారు. మీ నోటిమాటతో ఎగిసిన గాన-సునామీని గుర్తించలేకున్నారు. యముడికి చిత్రగుప్తుడిలా మీకూ ఒక అసిస్టెంట్ ఉంటే బావుణ్ణు”

“ఏం చేస్తాం? యముడికి రెండు చేతులూ, ఒక తలే గదా! నాకు నాలుగు తలలు నాలుగు చేతులు ఉండడంతో అసిస్టెంట్ పోస్ట్ శాంక్షన్ అవ్వట్లేదు. అక్కడికీ తలరాతలన్నీ చాలామటుకు కాపీ, పేస్ట్ చేసేస్తున్నా, యాంత్రిక యుగానికి అంతకంటే కష్టపడ్డం ఎందుకని. అయినా తీరిక దొరకట్లేదు. అదలా వదిలేయ్. ఘంటసాల గురించి చెప్పు”

“ఒకప్పుడు మీ సభలో నారద,తుంబురుల సంగీత పోటీ జరిగినప్పుడు దేవతలందరూ కలిసి కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప గాయకుడో తేల్చలేకపోయారు.  చివరికి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగి పోట్లాట వరకూ వచ్చింది. అప్పుడు మీరు కోపించి మీరిద్దరూ కలిసి మానవలోకంలో ఓకే శరీరంలో పుట్టండి అని శపించారు. శాపవిమోచనగా లక్షలాది, కోట్లాది ఆంధ్రులని ఇద్దరి గానమాదుర్యంలో ఒకేసారి ముంచి తేల్చి తరతరాల పాటు గుర్తుండిపోయేలా చేసి  తిరిగి మీ మీ రూపాలు పొందుతారు అని మీరు సెలవిచ్చారు.  అంతట నారద తుంబురులు ఒక్కటై ఘంటసాల వెంకటేశ్వరరావుగా జన్మించి ఆంధ్రదేశాన్ని తన గాత్ర మాధుర్యంలో ముంచి వేశారు”

“అవునా? నా శాపం తెలుగు వాళ్లకంత ఆనందం కలిగించిందా? సంతోషం.”

“ఆయన పాడిన భగవద్గీత కృష్ణావతారంలో మావఁయ్యగారే పాడినట్టు ఉంటుంది”

“ఔనా! చాలా బావుంది. లోకకళ్యాణం చేసి వచ్చారన్నమాట దేవ, గంధర్వ గాయకులిద్దరూ”

“సరిగ్గా అలాంటి లోక కళ్యాణమే చేసి వచ్చారు ఈ బాపు రమణ ద్వయం. ఆంధ్ర జాతిని వాళ్ళ మూలాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సంస్కృతినీ, సాంప్రదాయాన్ని; బలాల్నీ, బలహీనతలని; వాళ్ళ నిత్యజీవితాల్లో ఉండే హాస్యాన్ని, సున్నితత్వాన్ని, గాంభీర్యతని, శృంగారాన్ని, అమాయకత్వాన్ని, అహంకారాన్ని, ఆమ్యామ్యాని, మామూలు మనుషుల్లా కనిపించే క్రూరులనీ, క్రూరంగా కనబడే మంచివాళ్ళనీ, … అందర్నీ, అన్నిటినీ, ‘వోలు మొత్తం’ తెలుగుదనపు విశ్వరూపాన్ని రచించి, చిత్రించి, చలనచిత్రీకరించి –

తెలుగుదనం అంటే తెలీనివాడికి దాన్ని కంటికికట్టే ఎన్-సైక్లోపీడియాలా;తెలుగుకీ, ఆ నేలకీ దూరమైనవాణ్ని క్షణంలో సొంతూరికి, తన మనుషుల మధ్యలోకి తీసుకెళ్ళిపోయేలా; తెలుగు మర్చిపోయిన వాడికి తెలుగు సంస్కృతి మనసంతా నిండిపోయేలా,…..చెయ్యగల ఓ మూడు గంటల చలనచిత్రం తయారు చెయ్యగలరు.  మానవనైజానికి, మానవత్వానికి తెలుగు వెర్షన్ లా ఉంటుంది అది”

“ఒక సంస్కృతి రూపు దిద్దుకోవడంలో తమ వంతు చేసారన్నమాట. బావుంది, ఇంకా చెప్పు”

“కొంచెం కవితాత్మకంగా చెప్తాను,  I am waxing lyrical.”

“గో ఎహెడ్!”

“తెలుగుదనం స్పష్టంగా మాట్లాడితే అది రమణ రాత అవుతుంది. రూపం ధరిస్తే బాపు బొమ్మౌతుంది”

“భలే!”

బాపు౫

“పులిహారా, గోంగూరా, మజ్జిగపులుసు, పనసపొట్టు కూరా, గుమ్మడికాయ వడియాలూ … …. లాంటివన్నీ ఉన్న తెలుగు మీల్

బంతిపూలు గుచ్చిన గొబ్బెమ్మలనీ, చుట్టూ పాడుతూఆడే ముద్దబంతిపూలని చూసినప్పుడు కలిగే తెలుగు జీల్

చిరు వేసవిలో, పరీక్షల సీజన్లో రామనవమి పందిట్లో పానకం వడపప్పుల్లో ఘుమ ఘుమలాడే తెలుగు ఫీల్

తెల్లవారకట్ట కుంపటిపై కాఫీ కాస్తూ కబుర్లు చెప్పుకునే అచ్చ తెలుగు కొత్తజంటలో, కష్టసుఖాలు కలబోసుకునే పాతజంటలో కనిపించే తెలుగు సౌల్ (soul) ఇవన్నీ ఒక బాపు బొమ్మలోనూ, ఒక రమణ కధలోనూ లేక ఇద్దరూ కలిసి తీసిన సినిమాలోనూ ఒకేసారి అనుభవించవచ్చు”

“అద్భుతః, ఇంకా..”

“రమణ మాట, బాపు బొమ్మ కలిసి కదిలితే -‘ముత్యాలముగ్గు’ల మధ్య ‘గోరంత దీపా’ల కొండంత వెలుగు ల్లో ‘అందాల రాముడి’తో ‘సీతాకళ్యాణం’  జరిగినంత అందంగా ఉంటుంది”.

“పరమాద్భుతః! వాణీ, వీణాపాణీ! నీ మాటలు వింటుంటే నాకిప్పుడే మరో లోకాన్ని సృష్టించి పూర్తిగా తెలుగువాళ్ళతో తెలుగుదనంతో  నింపెయ్యాలనిపిస్తోంది”

“విధాతా! కొంచెం ఓపిక పట్టండి. నేనంతా చెప్పలేదు”.

“చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ! చెప్పు మరీ!,” అది నాలుగు గొంతులతో ఒకేసారి మాట్లాడ్డం వలన వచ్చిన ఇకో ఎఫెక్ట్.  “పద్యాలు చదవకుండా ప్రబంధ నాయికలను పరిశోధించాలంటే ‘బాపు బొమ్మల్ని’ చూస్తే చాలు; ప్రపంచం, మనుషులు, దేవుడు సరిగ్గా అర్ధం కాకపొతే రవఁణ కధలన్నీ చదివేస్తే చాలు; బాపూరమణల సాంగత్యం మరిగితే ‘కలియుగ రావణాసురుడై’నా ‘కలాపోసన’ చెయ్యాల్సిందే; నరుల అనుభూతుల్ని, బలహీనతల్ని సానుభూతితో అర్ధం చేసుకోవాలంటే దేవతలంతా రవఁణ కధలు, డైలాగులు హాండ్ బుక్ గా వాడుకోవచ్చు; తెలుగుని, రసాత్మకతని, పెదవులు విడివడని చిరుహాసాన్ని చాలాకాలంపాటు మర్చిపోయినవాళ్ళు బాపు కుంచెనీ, రమణ కలాన్ని ఆశ్రయిస్తే చాలు; అప్పుల్లో, వాట్సప్పుల్లో మునిగిపోతున్న మనుషుల నుదుట ‘బుడుగు’, ‘రాధాగోపాళా’ల్ని చదువుతారు అని మీరు వ్రాస్తే వాళ్ళు కొంచెం సుఖపడతారు. ఓ వ్యక్తిలో మానవత్వం ఉందా లేదా అని డౌటొస్తే ‘కొంటె బొమ్మల బాపు’ అతని చేతిలో పెట్టండి, క్షణంలో వాడి ముఖంలో చిరునవ్వు కదలాడకపోతే  “వాడొఠ్ఠి నస్మరంతి” గాడని తెలుసుకోండి; మనిషి-దేవుడు రిలేషన్స్ ఎలావుండాలో తెల్సుకోవాలంటే మనుషులూ, దేవుళ్ళు కూడా బుద్ధిమంతుడులో మాధవయ్యా- మాధవుల బంధాన్ని చూస్తే  చాలు ; వీళ్ళ రచనలు, బొమ్మలు, కార్టూన్లు, సినిమాలు “శిక్ష”గా వేసేస్తే 50%  నరకవాసులు మంచివాళ్ళై పుట్టేస్తారు; వీళ్ళిద్దర్నీ స్వర్గంలో ఉండమంటే అక్కడికొచ్చిన పుణ్యాత్ములంతా స్వర్గ సుఖాలొదిలేసి ‘కోతికొమ్మచ్చి’ మొదలెడతారు”

“అమ్మో! అది కుదరదు. స్వర్గలోకం ఫంక్షన్స్ మార్చడానికి రూల్సొప్పుకోవు. వీళ్ళని వైకుంఠంలోనే వుంచుదాం”

ఆదిశేషుడు, గరుత్మంతుడూ కంగారుగా చూసారు. అక్కడే ఉన్న రామభక్త హనుమాన్ కి వాళ్ళ ఆదుర్దా చూసి రామావతారంనాటి ‘రాముడి ఆవలింతలకి  చిటికెలు’ ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది. తను మాత్రం ” శ్రీ రామ జయరామ. సీతా రామా కారుణ్యధామా కమనీయనామా…” హమ్ చేస్తూ ఆనంద భాష్పాలు కార్చసాగాడు.

“క్షమించండినాధా! ఇవన్నీ మీకు తెలియవని కాదు, కలియుగం మరీ భరించలేకుండా ఉంది నరులకి. వీళ్ళిద్దరి తత్వాన్ని, భావాల్ని కొత్తతరాల నుదుట  రాస్తే నరులు కొన్నాళ్ళైనా  సుఖపడతారని తల్లిగా నా….,” శారదాదేవి మాట పూర్తయేలోపు శ్రీదేవి గొంతు సవరింపుతో వాణీ-బ్రహ్మసంవాదం ఆగింది.

“నాధా! రాబోయే కల్పంలో మళ్ళీ రామాయణం ఉంటుందిగా?”

“తప్పదుగా మరి!”

“అయితే ఈసారి నార్త్ ఇండియాలో వద్దు, సౌత్ లో, ఆంధ్రాలోనే పుడదాం. మీరు సరయూనది మిస్సవకుండా గోదావరి ఉండనే ఉంది”

“సరే! కానీ ఇంకా ఏదో ఉంది నీ మనసులో”

“బాల, అయోధ్య కాండలు తెలుగు నేల మీద, తెలుగు వాళ్ళతో గడిపి,  …”

“గడిపి?”

“తెలుగు సాంప్రదాయాలు, పండగలు, రుచులూ,…ఆస్వాదించి…”

“ఆఁ! దించి…?”

“అరణ్యకాండ పూర్వంలాగే పాపికొండల మధ్య గోదావరి ఒడ్డునా …”

“ఓకే! తధా…”

“ఆగండాగండి. బాపుతో పంచవటి డిజైన్ చేయించి అందులో రమణ శైలిలో మాట్లాడుకుంటూ ….”

“స్తు”

“శేషా! కంగారు పడకు వీళ్ళని అరణ్యవాసానికి తీసుకెళ్ళం. లక్ష్మి అడిగినవన్నీ వీళ్ళతో తయారు చేయించి దగ్గర పెట్టుకో. ఎగ్జిక్యూషన్  అంతా పూర్వంలా నీదే” అని ఆదిశేషుడి అంతరంగం తెలిసిన స్వామి ఇలా అన్నాక శేషుడి ముఖం పడగలై విచ్చుకుంది. బాపూరమణలు “దారుణమైన” వినయంతో మరీమరీ ఒదిగి స్వామిని, శ్రీమాతని చూస్తూండిపోయారు.

“మహాలక్ష్మీ! అనుకున్నవన్నీ అడిగావా? ఇంకేమైనా మిగిలాయా?”

“మనం త్యాగరాజు ఇంటికి అతిధులుగా వెళ్ళాం గుర్తుందా? అప్పుడు నేను త్యాగయ్యగారితో నేననుకున్నవన్నీ సరిగ్గా చెప్పలేదు, మీరు ఏమంటారోనని. ఆ మాటలన్నీ బాపు-రమణ వాళ్ళ ‘త్యాగయ్య’ సినిమాలో సీత చెప్పేసింది”

“సో?”

“ఈసారి మళ్ళీ మన రామావతార కార్యక్రమంలో త్యాగరాజ స్వామి ఘట్టం కూడా పునరావృత్తం అవుతుందంటే…”

“అవుతుంది మరి. అహల్య, శబరి, హనుమయ్య, త్యాగయ్య లేని రామకధలో రసం ఉంటుందా?”

“ఐతే ‘త్యాగయ్య’లో ఇంటివిషయాలు పట్టించుకోని త్యాగయ్యతో వీళ్ళ సీతమ్మ ఎలా మాట్లాడిందో నేనూ అలాగే మాట్లాడాలనుకుంటున్నా”

“ఏఁవర్రా! అమ్మవారనుకున్నవన్నీ జరిపిద్దామా?” అన్నాడు స్వామి. బాపు యధాప్రకారం బిడియంగా నవ్వారు,అంతే. రమణగారు మెల్లిగా,”స్వామీ ! జనం పొగుడుతారండీ, వద్దులెండి”అనేసారు.

” భూమ్మీద మీకు ఎలాగో పొగడ్తలు తప్పవు, ఇప్పుడు కింద నరులకి పైనున్న సురలు తోడౌతారు. అంతేగా?” స్వామి నవ్వాడు.

బాపు౭

ముళ్ళపూడివారిని మొహమాటం, వినయం ముప్పిరిగొన్నా సాక్షాత్తూ దేవదేవుడు చెప్పాడు కదాని సద్దుకున్నారు.  బాపుగారు మాత్రం ఎప్పట్లాగే మౌనంతో, చిరునవ్వుతో మేనేజ్ చేసేద్దామనుకున్నారుగానీ, ఆపుకోలేకపోయారు. “మా బ్రహ్మ ఉన్నాడుగా, చేస్తాము  స్వామీ” అన్నారు. బ్రహ్మదేవుడు “అపార్ధం” చేసుకోకుండా సరస్వతి ఆయన  చెవిలో చెప్పింది, “బ్రహ్మ అంటే మీరే అనుకునేరు, రమణని బాపు బ్రహ్మ అంటాడు.” అప్పటికే అంతా అర్ధమైన బ్రహ్మదేవుడు సీరియస్ గా “బాపూ నీకు మరణం లేదయ్యా?” అన్నాడు. అందరూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసారు. బాపుగారయితే మరి నేనిక్కడికెలా వచ్చాను అన్నట్టు చూసారు. అయినా తనకి సహజాతి సహజమైన మౌనాన్నే ఆశ్రయించి రమణగారి వైపు చూశారు.

“నా రాతల్లో చిన్న టైపో దొర్లింది. మరణం అని రాయబోయి రమణం అని రాసేసాను. అందువల్ల నువ్వు జస్ట్ రమణించావు, అంతే!” అని బ్రహ్మ  వివరణ ఇవ్వడంతో వైకుంఠం ఆనందంతో – కాదు, ఆనందం అక్కడ ఎప్పుడూ ఉండేదేగా- నవ్వులతో మారు మోగుతుండగా “తండ్రీ! మీ టైపో ఎర్రర్ లోక కళ్యాణార్ధమే! ఈ మిత్రద్వయం చేసిన కళాసృష్టికి ఎంతమంది పరవశించిపోతూ ఉంటారో ఇప్పటికీను. అదంతా మీ టైపో వల్లే కదా!” అంటూ నారద  మహర్షి ప్రత్యక్షమయ్యాడు.

“కుమారా! ఎక్కడి నుండి రాక?”

“కైలాసం నుంచి. మహాదేవుడు సకుటుంబంగా వస్తున్నాడు”.

అంతలోనే ఫస్ట్ ఫామిలీ ఆఫ్ క్రియేషన్ అరుదెంచారు. వస్తూనే బాపుగారి అర్ధనారీశ్వరుడి చిత్రంలోలాగ గణపతి కుమారస్వాములని చెరో పక్క  ఉంచుకుని ఆది దంపతులు అర్ధనారీశ్వరరూపంలోకి మారిపోయారు. బాపురమణలు ప్రణమిల్లారు. శ్రీహరి తనని బాపు శివుడితో కలిపి చిత్రించిన బొమ్మ తలచుకున్నాడు, గ్రహించిన శివుడు హరిలో అర్ధభాగంగా కనబడ్డాడు. హరిహరనాధుడు ఆనందతాండవం చేసాడు. అప్పటి వరకూ ఆనంద పరవశుడై ఉన్న బ్రహ్మ శివవిష్ణువులకి ఒక ప్రపోజల్ సమర్పించాడు. అందులో ఉన్న వివరాలివి (నీకెలా తెలుసు అని అడక్కండి,  వాళ్ళు నాకు చూపించారు) – “ఈ బాపురమణ తమ సృజనాత్మకతతో ఆంధ్రజాతి లక్షణాలకి, సంస్కృతికి గొప్ప గుర్తింపునీ, అందమైన ఐడెంటిటీనీ సంపాదించిపెట్టారు. ఆంధ్రదేశంలో ఏ కాస్త రసజ్ఞ్జత ఉన్నవాడైనా వీరివల్ల ప్రభావితుడౌతాడు. అలాంటి ఆంధ్రదేశం ఇప్పుడు రాజకీయ కారణాలతో రెండు ముక్కలైంది.  రాజకీయ కారణాలు కనక ఆ మార్పుతప్పలేదు. అయినా సంస్కృతిపరంగా జాతి విడిపోయిందని బాధ పడేవాళ్ళందరి కోసం తెలుగు భాష, తెలుగు వాళ్ళు మాత్రమే ఉండేలా ప్రత్యేక గ్రహాన్ని సృష్టించాలని కోరుతున్నాను. ఈ తెలుగు భూగోళం సృష్టించడంలో, అక్కడి ప్రకృతి, సాహిత్యం, ఇతర కళలూ;  ముఖ్యంగా తెలుగు భాష, సాంప్రదాయాలకి సంబంధించి నాకు, సరస్వతికి సలహాదారులుగా టాంక్ బండ్ లలితకళాతోరణంలో ఉన్న తెలుగు వెలుగులందరి తరఫునా బాపురమణలని నియమించాలని ప్రార్ధిస్తున్నాను”

ప్రపోజల్ పరిశీలించిన శివకేశవులు తలలెత్తి చూసారు. మహాదేవుడు నవ్వుతూ, “అం..త్తేనా..?” అన్నాడు. మిత్రద్వయం ఒకరినొకరు చూసుకున్నారు  ఎక్కడో విన్నట్టుందే ఈ డైలాగ్ మాడ్యులేషన్ అనుకుంటూ. వెంటనే బ్రహ్మ అందుకున్నాడు, “అంతేనా అంటే మరొకటుందండి. ముందు దీన్సంగద్దేల్చండి మరి!” అంటూ. బాపురమణలు ఉలిక్కిపడ్డారు, ఈ  వాక్యమూ తెలిసినదే. హనుమంతుడు మెల్లిగా ఎవరికీ వినబడకుండా గుర్తు చేశాడు,”మీ ముత్యాలముగ్గు కాంట్రాక్టర్ డైలాగులయ్యా ఇవీ”  అని. ప్రాణమిత్రులిద్దరూ చేతులు కట్టుకుని త్రిమూర్తులని, త్రిమాతలని తన్మయంగా, తదేకంగా చూస్తుండిపోయారు.  శివుడు మళ్ళీ అడిగాడు, “బ్రహ్మదేవా! తెలుగు భూగోళం గ్రాంటెడ్. ఆ మరోటి ఏమిటో చెప్పు?”

“ఆదిదేవా! కొత్త తెలుగు గోళంలో రాజకీయనాయకులు మాత్రం పుట్టకూడదని ఓ శాపం, కాదు వరం, ఇవ్వండి”

“తధాస్తు”

(ఈ కధ విన్నవారు, చదివినవారు, వ్రాసినవారు బాపురమణీయస్ఫూర్తితో సృష్టించబడిన తెలుగు భూగోళంలో శాశ్వత స్థానము పొందనర్హులని  త్రిమూర్తులు వారి దేవేరులతో కలిసి దీవించిరి.)

*

మీ మాటలు

  1. Gummadi Prem Chand says:

    అద్భుతః, ఇంకా…

  2. శ్రీరామ్ వేలమూరి says:

    అద్భుతం గా రాసారు సార్… అభినందనలు

  3. వై.వి.ఆర్.శ్రీనివాస్ says:

    ప్రేమ్ చంద్ గారు, శ్రీరామ్ గారు థాంక్యూ! బాపురమణల గురించి నాకున్న పరిజ్ఞానం పరిమితం, బట్, బాపూరమణీయం(సినిమాలు, బొమ్మలు, కార్టూన్లు) నాక్కలిగించిన ఆనందం అపరిమితం. అదే ఇందులో రిఫ్లెక్ట్ చెయ్యాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం మీకు నచ్చడం నా అదృష్టం, నా సంతోషం. _/\_ :-)

  4. Nageswara Rao says:

    సార్. అద్భుతంగా రాసారు.. మీకున్న అభిప్రాయం కేవలం మీది కాదు.. ఎన్నో లక్షలమంది తెలుగువారిది.. వాళ్లలో నెట్ ఓపెన్ చేయడం ఇ (ఈ) మాగజైన్ చదవడం తెలియనివారు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు..
    — మంచి వ్యాసం రాసినందుకు అభినందనలు

  5. S Surya Narayana Murthy says:

    Dhanyavadalu Srinivas garu……
    Malleee okasari aa mithraswayaani thalachukuni …..anadam tho …. haasam tho….chemarchina kalla tho….vaalla gnapakala tho……. manasu a mayindi….
    Marosari Dhanyavadalu meeku…..
    Surya Narayana Murthy

  6. హరిబాబు సూరానేని says:

    రాజకీయ నాయకులు లేని తెలుగు భూగోళం – అస్తు!
    విదగొట్టిన వారికి గిట్టదేమో ఈ ప్రపోజల్ – వాట్టూడూ?

  7. G B Sastry says:

    అందంగా ఉంది. నా ఆనందంకోసం రాసుకున్నది మరోసారి మే అందరితో పంచుకుంటున్నాను
    అందాల ఆనందాలు,ఆలోచనల సులోచనాలు
    బొమ్మలు,

    బొమ్మలు,
    కమనీయాలు,
    రమణీయాలు,
    కమ్మనైన తెలుగుతనాల కలబోతలు,
    ముత్యాల ముగ్గులు,
    వినగలిగితే వేణునాదాలు.
    త్యగయ్య భక్తి,
    గొపన్న ఆర్తి,
    అన్నమయ్య అనురక్తి,
    జయదేవుని మధుర భక్తి,
    అన్నింటి కలగలిపి
    మనకు
    కలిగించు మైమరపు
    .

    ఆడపిల్లల పాదాలు చూసి వారి అందాలు
    అంచనావేసే వారమని ‘రమణ గారు’ తమ ఇద్దరి
    చిన్న నాటి చిలిపితనాల ముచ్చట్ల లో చెప్పారు,
    ఒక స్త్రీ కేశ ఖండిక ను చూసి ఆమె చిత్రాన్ని,
    దుస్తులలో దాగిన పుట్టు మచ్చలతో సహా చిత్రీకరించిన
    చిత్రకారుని కధ ‘చందమామ’ లొ చదివిన గుర్తు,
    ఆ రకం గా బాపుకి పాదాలు కనిపిస్తె,
    మూర్తి చిత్రణ వస్తుంది లావుంది.
    (‘లా వుంది’ అంటె లావుగా ఉంది అని కాదు,
    బొమ్మలలో లావు పాటి పక్కింటీ
    పిన్ని గారు కూడా వయ్యారం గా ఉంటారు!)
    అలాగని గారు
    మరీ గొప్ప చిత్రకారుడేమి కాదు,
    ఆయన తన చిత్రాలలో
    చిత్రించ లేనివి కూడ ఉన్నై
    బొమ్మలు
    చూపలేనివి కూడ ఉన్నై,
    ఉదాహరణకి ఆ బొమ్మలలో జుగుప్స,
    క్రోధం, అసహ్యం లాంటి భావాలు
    కనిపించనీరు,చూపించలేరు.
    వంటింట్లొ చమట చిరాకు,
    పని భారం,వంట వేడి,
    మొగుడి మీద కోపం లాంటి
    వాటి తో ఉన్న ఇల్లాలైన,
    ఎండలొ చమటోడుస్తూ
    రిక్షా తొక్కే మనిషైన
    బొమ్మ గా అమరితె,
    అంతె,
    వారి విసుగు,
    అలుపు,సొలుపు,
    తెలుపు, నలుపు
    అన్ని కూడ
    ఆ భంగిమలలోని
    అందాలు
    ఇంద్రధనస్సు లోని
    సప్త వర్ణాలతొ
    మై మరపిస్థాయి
    మురిపిస్థాయి ,
    అందాలే విరబూస్థాయి,
    ఆనందం లా అనిపిస్థాయి
    ఆనందాలే కనిపిస్థాయి.
    వ్యవస్థని కూల దోసి,
    నూతన సమాజాన్ని
    ఆవిష్కరించాలని
    ఆవేశం తొ ఉడికి పోతున్న
    మార్క్సిస్ట్టు, లెనినిస్త్తు,
    మాఓయిస్ట్టు లాంటి
    బెస్ట్ ,గ్రేటెస్ట్
    వంటి వారు కూడ వారి
    మోస్టు అందమైన
    కోణం లో నే
    బొమ్మల్లొ బుద్దిగా
    ఒదిగి పోతారు,
    నిజం గా సమాజం
    మారి పోతుందేమో?
    మంచి రోజులొస్థాఏమొ?
    అన్న భయం రొష్టు,
    మనకి పెట్టరు.
    గబ్బరు సింగు కూడా
    మనని గాబరా పెట్టలేని,
    పిల్లలని భయ పెట్టి
    పాలు తాగించలేని
    పేరు గలవాడిగా
    పేట్రేగి పొతాడు.

    , కధకు బొమ్మవేస్తె,
    ఎంతో కష్టపడి రాసిన కధలో
    చదివేందుకు
    ఏమి మిగల్చడని
    ‘చాత్రి బాబు,’ అని
    కధకుల నధోగతిలొ
    దిగజార్చు బొమ్మల
    పెత్తందారు తరహా పెత్తనాన్ని,
    కధల అందాలను దోచుకుని,
    కధకుల శ్రమ దోచుకొని,
    వారిని ఏమీ లేనివారిగా
    చేయు వంటి వారు
    లాంటి గొప్పవారు
    మరింత గొప్పవారయే
    ధనస్వామ్యపు దోపిడీని ,
    ఎత్తి చూపెందుకు
    అధో జగత్
    ‘కధో’ ధరుల
    తరఫున నుంచున్నారంటె
    అది నిక్కమైన నిజం
    మొక్కవోని సత్యం.
    ఎందుకంటె
    ‘రావి’ ‘చాత్రి బాబు’,
    ఎప్పుడూ అణగ దొక్క బడిన
    వారి కేసులే వాదిస్తారు,
    అన్యాయం కేసులు
    చేపట్టరు కనక !
    ఈ అన్యాయం
    తన ‘కార్ట్యునుల’లోనే మొదలెట్టాడు.
    కార్ట్యూనులలో బొమ్మ,
    బొమ్మతొ పాటు రాసిన
    వ్యక్తి చిత్రణ
    ‘ఇడ్లి కన్న చెట్ని బాగుందా?
    చెట్ని కన్న ఇడ్లి బాగుందా’?
    అని చెప్పలేని
    వివాదాలకి తెర తీసింది.
    తన గీత రాతల
    జుగల్ బందీతొ
    మనలనుక్కిరిబిక్కిరి చేసి
    ఒక చక్కని ప్రక్రియకి
    శ్రీ కారం చుట్టారు
    మనకు చక్కిలిగింతలు పెట్టారు.
    రచయిత పేరు చూసికాక
    బొమ్మచూసి,
    బొమ్మ కోసం
    కధ చదివే పరిణామానికి
    అంకురార్పణ చేసింది.
    రాజా రవి వర్మ మనకోసం
    రూప ప్రతిష్ట చేసిన
    దేవతా రూపాలకి,
    తంజావూరు చిత్రకారులు
    ఆవిష్కరించిన కళారూపాలకి,
    రేఖా చిత్రపు రూపునిచ్చి,
    భాషను వ్యవహార భాషా,
    ఉద్యమకారులందరూ కలిసి,
    ‘గిడుగు’ వారు పట్టిన
    గొడుగు తొ సహా,
    వాడుక భాషను వేడుకగా
    రచనలలో వాడుకునే భాష గా
    భషాకోవిదులను,
    వి శ్వనాధ సత్యనారాయన గారిని
    ఏమార్చి మార్చినపని,
    తానొంటరిగా, కుంచె చేత్తొ
    దేవతలందరిని,
    రామాయణం నుంచి,
    దేవేంద్రుని గోడ దాట్ల వరకు
    చక్కని రెఖా చిత్రాలుగ
    మన నట్టింట నిలబెట్టి,
    ‘గొప్ప’వారికి పరిమితమై,
    కేలడరు బొమ్మలు గానే
    ‘గొప్ప లేని’ వారికి
    అందిన దేముళ్ళని,
    గ్రీటింగులనించి
    వాల్ హంగింగులవరకు
    మము బోట్లకు
    అందు బాటులో
    అనుపమాన సౌందార్య రాసులు
    దేవతా రూపాల నట్టింట
    రాసులు రాసులుగా
    పోసారు .

    ‘కొంటె బొమ్మల ,
    కొన్ని తరముల సేపు,
    గుండె నూయల నూపు,
    ఓ కునలమ్మ’

    అన్నరని,
    ఆరుద్ర గారిని,
    తరాల ‘సేపు ‘ ఎమిషోయ్?
    గంట ‘సేపు ‘
    అరగంట ‘సేపు ‘ లా అని,
    ‘లా’ పాయంటు లేవనెత్తారు,
    అగ్నిహోత్రావధానులై పోయారు
    చాలా మంది ‘భాషావధానులు ‘.
    అంత్య ప్రాసాంతకుడు ‘ఆరుద్రు’డు,
    ‘అదంతే’ అని ఊరుకున్నాడు కాని,
    ఎవరినీ ఊరడించ లేదు,
    నిజానికి ఆ పద్యం లొ
    తప్పు పట్టాల్సింది,
    ‘తరాల సేపు’,
    ఊపు, ఆపు, కాపుకి కాదు
    ‘ ని, కొంటె బొమ్మల ‘అని
    ఆయన బొమ్మలని
    ‘కొంటె’ కోణానికే
    కట్టి పెట్టి నందుకు.

    ‘తెలుగు వారి’ లో లేని ఐక్యత,
    గారి బొమ్మలలో
    ‘తెలుగు తనం’
    ఉందని ఒక్క మాట గా
    ముక్త కంఠంతొ
    ఒప్పుకోడం అనే
    ఒక్కదానిలో కనిపించడం
    గీతలలో కనిపించె
    ‘సింప్లిసిటీ’ కి వారి
    గీతల్లొ రాతల్లొ కనబడే
    ‘ఆర్డర్లీ డిస్ ఆర్డర్లినెస్స్ర్’ కి
    (ఏదైనా విషయాన్ని, గట్టి గా చెప్పాలంటె ఆంగ్లాన్ని ఆశ్రయించడం‘తెలుగు తనం’,ఆ తెలుగు తనాన్నిపలచబడనీయ కూడదని ‘మెకాలె’ గారి భిక్షని యధేచ్చ గా వాడుకుని నా తెలుగు తనాన్ని
    నిలబెట్టుకున్నాను)
    తెలుగు వారిచిన ‘రేర్ ‘
    నీరాజనం, ‘రేర్ ‘
    ఎందుకంటె, రమణలే
    గిరీశం పాత్ర నోటి తొ చెప్పించారు
    ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ,
    వెదకి కుందేటి కొమ్ము…..
    వరస లొ ‘తెలుగు వారి లో
    ఐకమత్యమాసించ రాదు’ అని,
    (తెలుగు వారి ఐక్యత విషయం లొ గిరీశం పాత్ర చెప్పింది ఖచ్చితం గా రమణల అభిప్రాయమే అని వాళ్ళ అబ్బాయి బుడుగు ఝటకా తోలుతు చెప్పాడు – ర)

    అందుకని ఈ ఒక్క విషయం లొ
    ఐకమత్యం తొ ఒక్క గొంతు తొ
    ‘ బొమ్మలు
    తెలుగు తనానికి న ‘కళ్ళు’
    ( బొమ్మల ఒళ్ళు , కళ్ళు గా భావించ రాదు-ర.)
    అని అన్నది వారికి
    తెలుగు వారి గా మన మిచ్చు కొన్న
    ‘రేరెస్ట్ ఆఫ్ దె రేరెస్ట్ ‘గౌరవం
    అని అనక తప్పదు,
    గా రి ని ఎప్పుడూ
    అంటి పెట్టుకునుండె
    ‘ఖొపం’ వచ్చినా సరే,
    గారు కూడ
    ఒప్పుకోక తప్పదు .

  8. వై.వి.ఆర్.శ్రీనివాస్ says:

    నాగేశ్వరరావుగారు,మూర్తిగారు, శాస్త్రిగారు
    మీరు బాపురమణ లని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆనందించడంలో నిమిత్తమాత్రు ణ్ణి అయినందుకు మహా సంతోషంగా వుంది. మీ భావాలే నా పాలిటి బాపురమణ ల ఆసీస్సులు అనుకుంటాను._/\\_ 😊

  9. వై. వి.ఆర్. శ్రీనివాస్ says:

    బ్రహ్మ ప్రపోజల్ కి సాక్షాత్తూ శ్రీహరి అస్తు అన్నాక విడగొట్టినవాళ్ళేం చెయ్యగలరండీ? _/\\_ :-)

  10. శ్రీనివాస్ గారూ! నిఝ్ఝంగా అద్భుతః. విషయాలన్నీ చక్కహా గుది గుచ్చారు. తెలుగు భూగోళం ఆశపెట్టారు. దానితో ‘హర్మ్యం’ కట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. దాని మీద గాలి పన్నులూ గట్రా వేసేరు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళూ కలిసి. మీనుండి ఇలాంటివి మరిన్ని ఆశిస్తూ…
    రాజా.

  11. వై. వి.ఆర్. శ్రీనివాస్ says:

    GKS రాజాగారూ, నెనరులు _/\_

    వాళ్ళు గాలిపనులు చేసి గాలిపన్నులు చేసే పన్నాగాలు పన్నకుండా ఉండడానికే కదండీ వాళ్ళక్కడ పుట్టకుండా శాపం,(మనకి వరం) ఇప్పించేశాను :-) మీరు హాయిగా ఆకాశహర్మ్యాలు కట్టేసుకోవడమే తరువాయి.
    Thanks for your encouragement, Sir!

Leave a Reply to G K S Raja Cancel reply

*