కొంచెం చేదు..కొంచెం కారం…ఇంకొంచెం తీపి!

namkeen

 

-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

sp dattamalaయండమూరి వీరేంధ్రనాథ్  “నిశ్శబ్దం నీకు నాకు మధ్య” అనే  నవల్లో  “One Flew Over the Cuckoo’s Nest” అనే ఇంగ్లీష్ సినిమాను ఉద్దేశించి “అది మంచి సినిమా కాబట్టి జనం అట్టే లేరు “అంటారు. గుల్జార్ దర్శకత్వం వహించిన సినిమాలకూ  ఈ మాట  వర్తిస్తుంది. ఎన్నో అవార్డ్స్ వరించినా కమర్షియల్  సక్సెస్ రాలేదు.అలాంటిదే “నమ్కీన్ ” …గుల్జార్  దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా. బెంగాలీ రచయిత సమరేష్ బాబు వ్రాసిన  “అకాల్ బసంత్ “కథ  ఆధారంగా తీసిన సినిమా.

సమరేష్ బాబు కథలు కొన్ని సినిమాలుగా వచ్చాయి. నేను కొన్ని చూసాను. గౌతం ఘోష్ తీసిన పార్, గుల్జార్ తీసిన కితాబ్ ,నమ్కీన్. తపన్ సిన్హా, మృణాల్ సేన్, బసు చటర్జీ   మొదలైన  వారందరు సమరేష్ బాబు కథలను సినిమాలుగా తీసారు.ఇక ” నమ్కీన్” సినిమా విషయానికి వస్తే దీనికి దర్శకత్వం , స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,పాటలు  అన్ని గుల్జారే. నటీ నటులు   అందరు ఉద్దండులె.సంజీవ్  కుమార్,వహీదా రెహమాన్, షర్మిల టాగోర్ ,షబానా అజ్మి,కిరణ్ వైరాలె. ఎవరికెవరు తీసిపోరు అన్నట్టు   నటించారు.

కొండప్రాంతంలో నివసించే  తల్లి,ముగ్గురు కూతుర్లు వారి ఇంట్లో కొద్ది నెలలు అద్దెకు ఉండే  బాటసారి కథ ఇది. ఇల్లు గడవడానికి తమ వంతుగా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారు.గుల్జార్ ఒక రైటర్ కాబట్టి ఆ కోణం నుంచి చూసానో లేక సన్నివేశాల చిత్రీకరణ వల్లనో   … పుస్తకం చదివినట్టు అనిపించింది.కాలక్షేపానికి సినిమా  చూసినపుడు రాని డౌట్స్ రాసేప్పుడు వచ్చాయి. ఉదాహరణకి .. చిత్రంలో షర్మిల టాగోర్ (పెద్ద కూతురు ,పేరు నిమ్కి ) రోజు రాత్రి బావి గట్టు దగ్గర స్నానం చేస్తుంది. ఇలా రెండు మూడు సందర్భాల్లో వస్తుంది ఆ ప్రస్తావన. రాత్రి పూటే ఎందుకు చేస్తుంది అనుకున్నాను. రోజంతా పని వత్తిడో   లేక  పగలు స్నానం చేసే వసతి(చాటు ) ఇంట్లో లేదేమో, రాత్రి అయితే చీకట్లో ఎవరికీ కనిపించదు అందుకే చేస్తుందేమో అనుకున్నాను. అలా అయితే ఇంట్లోని  అందరూ  రాత్రే చెయ్యాలి. అలా కాకుండా తను మట్టుకే ఎందుకు చేస్తుంది అని.పుస్తకములో అయితే వివరణ ఉంటుంది. కాని సినిమా కాబట్టి మనమే రాబట్టుకోవాలి,  కుతూహలం ఉంటె, లేదా వదిలెయ్యొచ్చు.  మళ్ళీ చూసాను ఒక్క సీన్ ,డైలాగ్ మిస్ అవ్వకుండ…ఒకసారి  తల్లి గొణుగుతుంది పెద్ద కూతురి గురించి “ఏదో ఒకరోజు  బావిలో పడి చస్తుంది”…అప్పుడర్దమయ్యింది  రాత్రిపూట బావి దగ్గర స్నానం చెయ్యడం తనకు సరదా అని. ఎలా అంటే “నీ సరదా ఎప్పుడో కొంప ముంచుతుంది” అంటూ మన సన్నిహితులు చనువుగా హెచ్చరించడం వింటూనే ఉంటాము.

సినిమా  హీరో సంజీవ్ కుమార్(గేరులాల్). మామూలు  సగటు మనిషి .పెద్దగా గొప్పదనాన్ని ఆపాదించలేము.  ట్రక్ డ్రైవర్. కష్టాల్లో ఉన్న హీరోయిన్  షర్మిల టాగోర్ కుటుంబానికి  ఎలాంటి చెప్పుకోదగ్గ ఆసరా ఇవ్వడు.దర్శకులు గుల్జార్ ఈ స్పృహ మనకు ఎప్పుడు  కలిగిస్తారు అంటే సినిమా ఆఖరులో షర్మిల టాగోర్ చిన్న చెల్లెలుగా నటించిన  కిరణ్ వైరాలే ( చింకి )తో చెప్పిస్తారు.”మా కోసం ఏమి చేసావని ?ఇంటికి కావాల్సిన  పప్పు ,బియ్యం, కూరగాయలు తేవడం తప్ప ఇంకేమి  చేసావు?మా అక్కను పెళ్లి  చేసుకోమన్నాను.  చేసుకున్నావా ?” అంటూ నిష్టూరాలాడుతుంది . అప్పుడు గాని మనకు అనిపించదు ఏమి చెయ్యలేదని. ఆ మాట కొస్తే చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. హీరో అనగానే అందర్నీ ఉద్దరించాలంటే ఎలా? వర్తమాన విషయాల మీద  కూడా సరయిన అవగాహన ఉండదు. ఉదాహరణకు : డబ్బులు మనీ ఆర్డర్ చెయ్యకుండా కవర్ లో పెట్టి పంపిస్తాడు.

వహీదా రెహమాన్ తల్లిగా నటించింది.పేరు జ్యోతి. పూర్వాశ్రమంలో జుగ్ని పేరుతో నాటకాల్లో నర్తిస్తుంది. అక్కడ సారంగి వాయించే వాడిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అవుతుంది. అలసిపోతుంది.తన పిల్లలు అలా బ్రతకకూడదని,భర్త నుంచి దూరంగా వచ్చి బ్రతుకుతుంది.వీళ్ళు వంటల్లో వేసే మసాల పొడులు తయారు చేసి ఆ ఊర్లోనే ఉన్న దుకాణాదారుడుకి అమ్మి జీవితం సాగిస్తారు.  ఈ దుకాణాదారుడి పేరు దనీరాం. ఈ కుటుంబ ఆర్ధిక పరిస్థితి చూసి, సరైన వసతులు లేకపోయినా తన మాట చాకచక్యం,హాస్య చతురతతో  గేరులాల్ కి వీళ్ళింట్లో, అద్దెకు ఉండే ఏర్పాటు చేస్తాడు. ఈ కాలంలో  ఇదొక వ్యాపారం. ఏజెంట్స్ ఇరు పార్టీల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. కాని ఒకప్పుడు  ఎలాంటి ధనాపేక్ష లేకుండ సహాయం చేసి,వారి  తిట్లు కూడా భరించేవారు.అందరి గురించి ఆరాలు తియ్యడం,సానుభూతి చూపించడం, ఆడవాళ్ళని అవహేళన చెయ్యడం,  ఆడవాళ్ళ పోట్లాటలు, ఇలా ఊరంటే ఎలా ఉంటుంది అనే సమగ్ర చిత్రీకరణకు సంబంధించిన   సన్నివేశాలను  ఏది వదలలేదు గుల్జార్.

ఈ చిత్రంలో వహీదా రెహమాన్ నటన తారాస్థాయికి చేరింది.వృద్దాప్యం వల్ల మతిమరుపుతో జనాలను గుర్తుపట్టక పోవడం, గుర్తు పట్టిన వెంటనే దేనికో తిట్టడం, అవసరాన్ని బట్టి తెలివిగా మాట్లాడ్డం,పిల్లల్ని అదుపులో పెట్టడం ఇలా బహుముఖ పాత్రలు… అతి సహజంగా పోషించింది .మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది.అవసరం లౌక్యాన్ని  నేర్పుతుందేమో .  ఇంటికి అద్దెకు వచ్చిన గేరులాల్ ని అడుగుతుంది. భోజనము ఎక్కడ చేస్తావని, ఎక్కడో బయట హోటల్ లో తినేబదులు, ఆ డబ్బేదో తమకే ఇస్తే ఇల్లు గడుస్తుందని.మర్నాడు సంజీవ్ కుమార్ ని చూసి “ఎవరు నువ్వు? నా ఇంట్లో ఎందుకున్నావు?” అని గద్దిస్తుంది.గుర్తుకొచ్చాక వెంటనే, ఏమైనా తిన్నావా ? అని తల్లి లా అడుగుతుంది.”లేదు ” అంటే “తినేసి వెళ్ళు ఖాళికడుపుతో వెళ్ళకూడదు” అంటుంది . “సరే ” అనగానే వెంటనే, “ఇక్కడ ఏది ఉచితంగా దొరకదు,డబ్బు  పెట్టి వెళ్ళు ” అంటుంది. మళ్ళీ  వెంటనే “నా దగ్గర ఉంటె నీకు ఊరికే పెట్టేదాన్ని ఏమి అనుకోకు” అంటుంది .ఇలా వెంట వెంటనే రకరకాల హావభావాలతో , “అపరిచితుడు”లో  విక్రం గుర్తొస్తాడు.

షర్మిలా  టాగోర్ నటన అందరికి తెలిసిందే.ఆ మాట తీరు,పొందిక ఎవరికి రాదు. మాటలతో మెత్తగా కొడుతుంది. తిరిగి ఎదురు చెప్పకుండా అలా అని పోట్లాడినట్టూ ఉండదు. పాపం గేరులాల్ కి  వీళ్ళింట్లో సరైన వసతులు ఉండవు. పాడుపడిన ఇల్లు, కొత్త ఊరిలో దొరకాల్సిన స్వాగతం , స్నేహం లేక మొదటి రోజు ఆ కోపం,తిక్క వీళ్ళ మీద చూపిస్తాడు.కాని రెండో రోజుకి నెమ్మదిస్తాడు. “ఇష్టం లేకపోతే ఇచ్చిన అద్దె తీసుకొని వెళ్ళిపో” అంటుంది నిమ్కి. “ఎదో మొదటి రోజు కదా అందుకే అలా చేశాను ” అంటాడు . అప్పుడు  “మాకు కూడా నీతో మొదటి రోజే కదా.” అంటుంది.

తర్వాత చెప్పుకోవాల్సింది షబానా ఆజ్మి గురించి(మిట్టు). రెండో కూతురు.చాల తెలివయినది. సంజీవ్ కుమార్ని  ప్రేమిస్తుంది. అది  హీరోకి ,ప్రేక్షకులకు తెలిసేది ఎలా?మిగతా సినిమాల్లా  అద్దం ముందు నిల్చొని తనలో తానూ  లేదా తన ఆత్మతో మాట్లాడడం లాంటి సీన్స్ లేకుండ ఇంకోలా చూపిస్తారు గుల్జార్. ఇంటికి  ఒక ఉత్తరం రాస్తూ,తనకి పెద్ద కూతురైన నిమ్కి నచ్చిందంటూ రాసి , ఉత్తరం అక్కడే మర్చిపోతాడు. మళ్ళి వచ్చి చూస్తే నిమ్కి స్థానం లో మిట్టు అని రాసి  ఉంటుంది. మిట్టు తనని ప్రేమిస్తుంది అని  గర్వంగా నవ్వుకుంటాడు. తర్వాత  గదిలోకి ఎవరు వచ్చారని? నీకు మాటలు రావా? అని మిట్టుని గద్దించి అడుగుతాడు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మనకూ ఇప్పుడే  తెలుస్తుంది మిట్టు మూగదని.ఆశ్చర్యం వేస్తుంది .అంతవరకు మనకు అస్సలు అనుమానం రాదు.అక్క, చెల్లెలు గురించి  చెప్తూ  “ఏది చేసినా ఎక్కువే చేస్తుంది. నవ్వు,కోపం,సంతోషం ఇలా అన్ని ఉన్నాయ్ ఒక్క పిచ్చి తప్పించి” అంటుంది. యే అశుభ గడియలో అంటుందో కాని, పాపం పిచ్చితోనే ఆత్మహత్య చేసుకుంటుంది.  మిట్టు కవితలు రాస్తుంది అని కూడా తెలుస్తుంది.

మిట్టు రాసిన  కవితే సినిమాలో ఒక పాట. మంచి ఆణిముత్యం. ఆర్డీ బర్మన్ సంగీతము. ఆశా భోంస్లే  గళంలోంచి జారిన అమృతధార అని చెప్పొచ్చు. ఇదీ గుల్జార్ విరచితమే కొన్ని కొన్ని గుల్జార్ వల్లే అవుతాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా చూడకుండ పాట వింటే అర్ధం ఒకలా తోస్తుంది.అదే సినిమా చూసి, పాట వింటే అర్ధం ఇంకోలా ఉంటుంది.యే విధంగా విన్నా బాగుంటుంది.  ఈ సం(గీతం)  ప్రేక్షకులకు వీనులవిందు అని చెప్పొచ్చు.

సరదా,సంతోషాలు  డబ్బుతో వచ్చేవి  కావు,  చుట్టూ నలుగురు ఉంటె చాలేమో అనిపిస్తుంది ఒక సీన్ చూస్తే. వాకిట్లో కళ్ళాపి పచ్చిగా ఉండడంతో నలుగురు అందులో  జారిపడి కాస్సేపు సరదాగా నవ్వుకునే సన్నివేశాలు ఉంటాయి.

అదేంటో ఏది ఎక్కువసేపు ఉండదు సినిమాలో , జీవితంలా    …సంజీవ్ కుమార్, ట్రక్ డ్రైవర్ కాబట్టి ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది. తన ప్రేమ విషయం బయట పెడతాడు నిమ్కి దగ్గర. ఇక్కడ తెలుస్తుంది ఉత్తరంలో నిమ్కి బదులు మిట్టు అని మార్చింది నిమ్కి అని. చెల్లెల్ని(మిట్టు) చేసుకోమంటే  ఒప్పుకోడు. తన అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రోడ్డు మీదే రోజులు గడుస్తాయి అనే అర్ధం వచ్చే పాట ఒకటి ఉంటుంది. బండి అన్నాక ఎక్కడో ఒకచోట ఆపాల్సిందే. వినోదం చూడాల్సిందే. వినోదం కాస్త విషాదం అవుతుంది. చిన్న చెల్లెలు చింకి నాటకంలో గంతులేస్తూ కనిపిస్తుంది.  తల్లి ఏదైతే తన పిల్లలు కాకూడదు అనుకుంటుందో అదే అవుతుంది.  గుండె ఆగినంత పనవుతుంది. తిడదామని వెళ్తే తానే మాటలు పడాల్సివస్తుంది. తిరిగి అనడానికి ఏమి ఉండదు.మళ్ళీ ఆ ఊరు వెళతాడు.ఇంకో విషాదం మూటగట్టుకోడానికి. రెండో చెల్లెలు మిట్టు మతి చెడి,  కొండపైనుంచి దూకి చనిపోతుందని  తెలుస్తుంది .

Shakespeare,  Mid Summer Night’s Dream లో  Thesues అనే ఒక పాత్ర ద్వారా “The lunatic, the lover, and the poet are of imagination all compact”. అని చెప్పిస్తారు.పిచ్చివాడు, ప్రేమికుడు,కవి ….వీరందరు వారి వారి ఊహాజనితమైన లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇక మిట్టు అంటే షబానా అజ్మి విషయానికి వస్తే కవితలు రాస్తుంది. తర్వాత ఆమెలో ప్రేమ జనిస్తుంది. ఆఖరికి పిచ్చిదవుతుంది. పైన పేర్కొన్న ముగ్గురు ఈమెలో ఉన్నారు.ఒకటి ఉంటేనే తట్టుకోవడం కష్టం మరి మూడంటే …మూడినట్టే కదా!  సంజీవ్ కుమార్ ని ప్రేమించిందని,దాని వల్లే పిచ్చిది  అయ్యిందని  ఇంట్లో ఎవరికీ తెలియదు, చూసే మనకు తప్ప. తల్లి మంచం పట్టి కొద్దిరోజులకు చనిపోతుంది.ఇల్లు విడిచిన చిన్నచెల్లెలు ఎప్పుడైనా రాకపోతుందా అని నిమ్కి ఒక్కతే ఆ పాడుపడిన ఇంట్లో ఉంటుంది.ఆఖరుకి  గేరులాల్ ,నిమ్కి ఒక్కటవుతారు. పెళ్లి వయసు దాటిన తర్వాత ఒక్కటయ్యారు కాబట్టి “అకాల్ బసంత్ “అని కథకు  పేరు పెట్టి ఉంటారు సమరేష్ బాబు.

ఒకే విషయాన్ని ఎన్ని కోణాల నుంచైనా చూడొచ్చు.ఉప్పు,తీపి ,కారం వగైరా రుచులతో చేసే ఒక రకమైన పలహారాన్ని నమ్కీన్ అంటారు. ఇంకా చెప్పాలంటే చుడువ, కార, ఇలా చాలా  పేర్లు ఉన్నాయ్.ముగ్గురు అక్కాచెల్లెళ్ళ స్వభావాలకు తగ్గట్టు పేర్లు  అంటే   నిమ్కి అంటే ఉప్పు ,మిట్టు అంటే తీపి, చింకి అంటే కారం…మొత్తం కలిపితే “నమ్కీన్ “, ఇదే గుల్జార్  సినిమా కథ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. manjari lakshmi says:

    మీరు సినిమా గురించి చెప్పటం బాగుంది. ఈ సినిమా చూడాలి.

  2. కథ కళ్ళకు కట్టినట్టుగా విశ్లేషించారు దత్తమాలగారు. చాలా బాగుంది.

  3. Krishna Veni Chari says:

    మీ రివ్వ్యూ ఎంత బాగుందంటే.. ఆన్లైన్‍‌లో వెతుక్కుని ఇప్పుడే చూడాలనిపిస్తోంది దత్తమాలగారూ.

  4. Dattamala says:

    థాంక్స్ అండి:). కొద్దిమందైనా చూడలనే నా తాపత్రయం

  5. suvarchala chintalacheruvu says:

    నిజం! ఈ కథలో జీవమ్ ఉంది. జీవితమూ ఉంది. అసలు బెంగాలీ కథల తీరు తెన్నులే వేరు. మీకు సమగ్రమైన అవగాహనతో బాటు, పరిశీలనా పటిమ ఎక్కువ. అందుకు అభినందనలు మీరు రాసిన శైలి కథను వివరించటమే కాదు, పిక్చరైజ్ చేసినట్లు ఉంది.

  6. suvarchala chintalacheruvu says:

    గుల్జార్ గురించి ఇక నేను చెప్పేదేముంది ? ఈ మీ వ్యాసమే చెప్పేసింది.

  7. Dattamala says:

    మీ కామెంట్స్ నా ఆర్టికల్ కి వన్నె తీసుకొచ్చాయి :)థాంక్స్

  8. సినిమాని చూసి అందరూ రివ్యూ రాస్తారు. కాని ఆ సినిమాని ఫీల్ అయ్యి, సమీక్షించే వాళ్ళు కొందరే ఉంటారు. శ్రీమతి దత్తమాల గారు రెండవ కోవకు చెందుతారు. సమీక్ష చదివినంత సేపూ సినిమా చూసినట్లుగా అనిపించింది. నేను ఆ సినిమా చూడనప్పటికీ తప్పనిసరిగా చూసి తీరాలనే కుతూహలాన్ని రేకెత్తించారు. మీకు అభినందనలు.

    • Dattamala says:

      మూవీ లింక్ నా టైం లైన్ లో ఉండండి .థాంక్స్ :)

  9. Mohan vamseedhar says:

    Good analysis. Well written.

  10. బావుంది దత్తమాల గారూ…. చదివితే సినిమా చూడాలనిపించేట్లు రాయడం గొప్ప విషయం, అభినందనీయం దత్తమాలగారూ…

  11. Dattamala says:

    థాంక్స్ అండి

  12. నిషిగంధ says:

    చాలా బావుందండీ మీ సమీక్ష!
    ఈ సినిమా పాటతోనే నాకు గుల్జార్ పరిచయం ఎక్కువ అయింది, ‘ఫిర్ సె ఆయియో..’ పాట అంటే ప్రాణం నాకు!
    కాకపోతే, నమ్కీన్ అన్న పేరు ఎందుకో నచ్చలేదు నాకు. ఏదో కామెడీ మూవీకి పెట్టిన పేరులా ఉందనిపిస్తుంది. :-)

  13. Mythili Abbaraju says:

    నాకూ చూడాలనిపిస్తోంది…యూ ట్యూబ్ లో వెతికి పట్టుకుంటాను. బాగా రాసారు , థాంక్ యూ :)

  14. నీను ఎ సినిమా చూడలేదు.. మీరు రాసింది చదివాక చూడాలని ఉంది.. కళ్ళకి కట్టినట్టు చాల బాగా రాసారు.. మే అభినం అర్థం ఐయ్యిన్ది..

Leave a Reply to Dattamala Cancel reply

*