అతల వితల సుతల..

 

-సత్యమూర్తి

~

కోతుల రాజ్యం పెద్దమంత్రి బవిరిగడ్డానికి కాలు ఒకచోట నిలవదు. ఆ జబ్బు వెనకటికి లంకలో ఓ కోతి పెంచిన తోకంత పెద్దదై చుట్టలు చుట్టేసుకుంది. చుట్టలు చుట్టేసుకుని కూర్చుంటే సమస్య లేకపోయేది. కానీ అది చుట్టలు విప్పుతూ మాటిమాటికి విదేశాలకు వెళ్తుండడంతో రాజ్య పరిస్థితీ, పాలనా సంక్షోభంలో పడ్డాయి.

పెద్దమంత్రి హోదాలో బవిరిగడ్డం వారానికి ఒక దేశానికి అన్ని అధికార, అనధికార లాంఛనాలతో పయనం కడుతోంది. కొండముచ్చుల రాజ్యం, కోనముచ్చుల రాజ్యం, బారెడు కోతుల రాజ్యం, మూరెడు కోతుల రాజ్యం, జానెడు కోతుల రాజ్యం, బెత్తెడు కోతుల రాజ్యం, వేలెడు కోతుల రాజ్యం వగైరా నానా వానరజాతుల రాజ్యాలన్నీ ఇప్పటికే ఒకసారి చుట్టేసింది. భూమ్మీద చూడాల్సిన రాజ్యాలన్నీ అయిపోవడంతో ఇదివరకు వెళ్లినచోటికే  రెండోసారీ, మూడోసారీ వెళ్తోంది. అయినా కొత్త ప్రదేశాలు తిరగాలనే కోరిక మాత్రం పోలేదు. ఆస్థాన శాస్త్రమర్కటాలను పిలిపించి.. అతల, వితల, సుతల, తలాతల, పాతాళ వంటి భూమికిందా, ఆకాశంలోని నానా లోకాలకు తాను వెళ్లేందుకు దారులు వెయ్యాలని ఆదేశించింది. అవి ఆ పనిలో గోతులు తవ్వుతూ, నింగికి నిచ్చెనలు వేస్తూ ఉండగా బవిరిగడ్డం తీరికనేదే లేకుండా భూమ్మీది దేశాలను దర్జాగా చుట్టబెడుతోంది. దానికి ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే.. చివరకు సముద్రాల మధ్యలో కంటికి కనిపించనట్టుండే ఐదారు కోతులుండే రాజ్యాలకు కూడా రెండుమూడుసార్లు వెళ్తోంది. ఆ రాజ్యాలు తమకు తొలి ప్రాధాన్య రాజ్యాలని, వాటితో బంధం బలోపేతం చేసుకుని సమస్త లోకాన్ని సుఖశాంతులతో ఓలలాడిస్తామని నమ్మకంగా చెబుతోంది.

ఓ పక్క అతల వితల సుతల అన్వేషణ ఖర్చులు, మరో పక్క విదేశీ ప్రయాణ ఖర్చులతో రాజ్య ఖజానా తరిగిపోతోంది. కోతిస్వామ్యం ప్రకారం కోతులకు కనీసావసరాలు తీర్చడానికి కేటాయించిన పళ్లను, గింజలను, నీళ్లను, చివరికి కోతిపిల్లలు నోటిదురదతో కొరుక్కునే చెట్లబెరళ్లనూ.. వేటినీ వదలకుండా బవిరిగడ్డం విదేశాలకు అమ్మేయించి ఆ వచ్చిన డబ్బుతో షికార్లు కొడుతోంది. ఒకపక్క తన వానరానీకం ఆకులు అలములు లేక ఆకలితో అల్లాడి చస్తోంటే, మరోపక్క అది విదేశీ చట్టసభల్లో, అంతర్జాతీయ వానరమహాసభల్లో  తన రాజ్య సుభిక్షం గురించి, తన కోతుల సుఖసంతోషాల గురించీ గొప్పగా సెలవిస్తోంది. పనిలో పనిగా తన గొప్పతనాన్ని చాటుకోవడానికి నానా కారుకూతలూ కూస్తోంది. అది పెద్దమంత్రి అయితే కావొచ్చు కాని, ఎంతైనా అది గణతంత్ర కోతిస్వామ్యం కనుక, అందులో చట్టసభ, రాజ్యపెద్దా, విపక్షమూ వగైరా తగలడి ఉన్నాయి కనుక పరిస్థితి చేయి దాటింది.

బవిరిగడ్డం పద్ధతేం బాగాలేదని విపక్షం కట్టగట్టుకుని రాజ్యపెద్దకు ఫిర్యాదు చేసింది. రాజ్యపెద్ద కోతి.. విషయమేంటో కనుక్కుందామని పెద్దమంత్రికి కబురు పంపింది. కానీ అది విదేశాల్లో ఉందని సమాధానం వచ్చింది. వారం పోయాక మళ్లీ కబురు పెట్టింది. పెద్దమంత్రి అప్పుడే కోతులులాగే బండిలో విదేశానికి బయల్దేరిందని జవాబు వచ్చింది. అలాంటి చాలా జవాబుల తర్వాత.. ఇక తప్పదన్నట్టు బవిరిగడ్డం ఒకరోజు చికాకు పడుతూ రాజ్యపెద్ద ఉంటున్న చెట్టపైకొచ్చి ఓ కొమ్మల మధ్య అకులపై మల్లెపూలు పరిపించుకుని దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చుంది.

ముసలి రాజ్యపెద్ద మొదలుపెట్టింది.

‘నాయనా, బవిరిగడ్డమూ! నీ పద్ధతేం బాగోలేదు సుమా. మితనిద్రా మితాహారో, మితవస్త్రపరిగ్రహః మితభాషణమేకైకం భూషణం బ్రహ్మచా.. వొద్దులే బావుండదు! నువ్వు పెళ్లయినవాడివేగా. ఆ సుభాషితం పక్కనపెడదాం కాని, మితవిదేశీ ప్రయాణాణి అనేదాన్నిమాత్రం నువ్వు బాగా ఒంటబట్టించుకోవాలి బాబు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతావు.. ఇప్పటికే అయ్యావనుకో.. ఓ పక్క కోతులు ఆకలితో చస్తున్నాయి..’

‘సొద ఆపి.. సూటిగా, సుత్తిలేకుండా చెప్పు! అటువైపు నేను విదేశీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. పట్టు అంగీపైన ఈసారి నా పేరు కాకుండా నా అందచందాల ముఖంబొమ్మను వజ్రాలతో పొదిగించుకోవాలి. ఆ కాళాకారకోతి ఎదురుచూస్తూ ఉంటుంది. నేను త్వరగా వెళ్లాలి. సూటిగా సుత్తిలేకుండా..’ కసిరింది పెద్దమంత్రి.

ముసలి కోతి ఎప్పట్లాగే నొచ్చుకుని మళ్లీ గొంతు సవరించుకుంది.

‘నేను చెప్పేది నువ్వెప్పుడు విన్నావు కనుక! అయినా తప్పదుకదా. విదేశీగమనాలను కాస్త తగ్గించుకో. నీ దండగమారి ఖర్చులతో కోతుల ఊసురు పోసుకుంటున్నావు. ఒళ్లూపై తెలియకుండా నానా చెత్తా వాగుతూ మన రాజ్య పరువును, మన కోతుల పరువును పోగొడుతున్నావు.. ఇప్పటికే బజారుకెక్కిన నీ పరువును కొత్తకొత్త బాజార్లకు కూడా ఈడ్చుకుంటున్నావు..’

బవిరిగడ్డం గడ్డాన్ని నిమురుకుంటూ చిద్విలాసంగా నవ్వింది.

‘నువ్వు చెప్పుడు మాటలు విని బాగా చెడిపొయ్యావు.. ఇంతకూ ఇదేనా నువ్వు చెప్పాల్సింది.. ’

‘ఇక నేను చెప్పాల్సిందేముందిలే నా బొంద..’ అంటూ కిందికి చూసి చప్పట్లు కొట్టింది. కింది కొమ్మ మీద కూర్చున్న గుమాస్తా కోతి నాలుగు తాటాకుల కట్టలు పట్టుకొచ్చింది.

‘మన ఘనతవహించిన దేశాల తిరుగుబోతు పెద్దమంత్రిగారిపై విపక్షం చేసిన ఆరోపణలేంటో చదివి వినిపించు.. ’ రాజ్యపెద్ద గుమాస్తాను ఆదేశించింది.

చచ్చాన్రా బగవంతుడా అనుకుంటూ బగవంతుడి సాయం కోసం పైకి చూసింది గుమాస్తా కోతి. సరిగ్గా అప్పుడే  చెట్టుపైనుంచి చిన్న పచ్చివెలక్కాయ దాని గొంతులో పడింది. దాన్ని కష్టమ్మీద బయటకు తీసేసుకుని భయంతో వొణుకుతూ తాటకుల కట్ట విప్పి, ఒక ఆకు తీసి చదవడం మొదలుపెట్టింది.

‘‘శ్రీశ్రీశ్రీ పెద్దమంత్రి బవిరిగడ్డంపై మేం మనవి చేసుకుంటున్న ఆరోపణలు.. బవిరిగడ్డం విదేశాల్లో మన పరువు ఎలా తీస్తోందో విన్నవించుకుంటున్నాం. అది విదేశాల్లో ఏం మాట్లాడిందో దాని మాటల్లోనే చెబుతున్నాం..

మన బవిరిగడ్డం జానెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అక్కడికి వలసవెళ్లిన కోతులను పోగుచేసి ఇలా అంది ప్రభూ..

‘మన రాజ్యం విశ్వగురువు, పరమపవిత్రం, పాపనాశనం. అంతటి పుణ్యభూమిలో పుట్టినందుకు మీరూ, నేనూ గర్వించాలి. నాలాగా రొమ్మువిరుచుకుని తిరగాలి.  ప్రపంచ వానరజాతులకు చెట్లెక్కడం, పళ్లు కొరుక్కు తినడం, పేలు చూసుకోవడం, గుర్రుమనడం, కిచకిచలాడ్డం, పిల్లలను కిందపడిపోకుండా పొట్టకు కరిపించుకుని చెట్లపైన తిరగడం, మలవిసర్జన తర్వాత ఆకులతో స్వచ్ఛంగా తుడుచుకోవడం(ఇది నేను నేర్పిన విద్య) వంటి సమస్త విద్యలన్నీ నేర్పించింది మన రాజ్యపు కోతులే. అంతటి ఘనమైన గడ్డపై పుట్టినందుకు ఇదివరకు మీరు సిగ్గుతో, అవమానంతో తోకను కాళ్లకింద నించి పైకి తెచ్చుకుని నోట్లో పెట్టుకునేవాళ్లు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి పారిపోదామా అనుకునేవాళ్లు. ఇప్పడు ఆ అవసరం లేదు. నేను పెద్దమంత్రినయ్యాక మన రాజ్యప్రభ మహాగా వెలిగిపోతోంది కనుక ఆ తోకలను నోట్లోంచి తీసేసి ముడ్డి వెనుక నిటారుగా ఎత్తి పెట్టుకోండి. వీలైతే నా పేరు చెక్కిన చిరుమువ్వలను వాటికి కట్టుకుని గలగల్లాడిస్తూ ఊరేగండి.. ’

మా ఆరోపణ.. మనది గొప్ప రాజ్యమంటూనే మన రాజ్యంలో పుట్టడం సిగ్గుచేటని చెప్పింది బవిరిగడ్డం. దీనికి సమాధానం చెప్పించాలి..’’ గుమాస్తా కోతి చదవడం  ఆపింది.

రాజ్యపెద్ద బవిరిగడ్డంవైపు జవాబు చెప్పమన్నట్టు చూసింది. బవిరిగడ్డం ఇరకాటంలో పడింది కానీ వెంటనే తేరుకుంది.

‘ఏదో నోటిదూలతో అలా అనేశాను. పైగా నేను చెప్పిందంతా పొల్లుపోకుండా అచ్చేసే పత్రికలు మన రాజ్యంలో బోలెడున్నాయిగా. నా వాగ్ధాటి ఏంటో అందరికీ తెలుస్తుందని అలా వాగాను. అయినా వానరాలకు సుబ్బరంగా ముడ్డి కడుక్కునే విద్యనేర్పానన్న మహత్తర సత్యాన్ని చెప్పినందుకు, మన దేశాన్ని అంత గొప్పగా పొగిడినందుకు కృతజ్ఞత చూపి, శభాష్ అనక ఉడుక్కుంటారెందుకు? ఆ ప్రశ్నకు ఇదే నా జవాబు.’

రాజ్యపెద్ద మళ్లీ సైగ చేసింది. గుమాస్తా కోతి మరో తాటాకు అందుకుంది.

‘‘బవిరిగడ్డం కొండముచ్చుల రాజ్యానికి వెళ్లినప్పుడు ఇలా అంది ప్రభూ..

‘మీ రాజ్యానికి రావడానికి ఇదివరకు మా రాజ్య పెద్దమంత్రులుగా పనిచేసినవాళ్లు ఇష్టపడలేదు. వాళ్లకు మీరంటే చులకన. కండకావరం. అసలు మీ దేశం ఏ దిక్కున ఉందో కూడా తెలియని అజ్ఞానులు. అందుకే భూమి పుట్టినప్పట్నుంచి మా రాజ్యనాయకులు ఎవరూ మీ రాజ్యానికి రాలేదు. రావడానికి పడవలున్నా, దారులున్నా, కాస్త కోతిమాంసం పడేస్తే ఎగరేసుకొచ్చే గద్దలున్నా మా రాజ్యనేతలెవరూ మీ రాజ్యానికి రాలేదు.  కానీ నేను మహాజ్ఞానిని. ఈ సమస్త విశ్వంలో నాకంటే ఎక్కువ తెలిసిన కోతి మరొకటి లేదు. ఈ లోకంలో నాకు తెలియనిదేదీ లేదు. అయినా నాకు మీరంటే మహాగౌరవం. మీరు నాకంటే గొప్పవాళ్లు. మీ రాజ్యమన్నా, మీ పాలకులన్నా కాళ్లపైన పడిపోతాను. అందుకే ఆగమేఘాలమీద దారులు వేయించుకుని మరీ వచ్చాను. మీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. మా కోతుల రాజ్యంలోని చెట్లు, పుట్టలు, పిట్టలు, చేపలు, కప్పలు.. ఏదీ కావాలన్నా రాసిస్తాను. మీరెంత మహానుభావులు! మీరే లేకుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా? మా రాజ్యసమస్యలపై మాకంటే మీకే ఎక్కువ అవగాహన. మా వాళ్లు దద్దమ్మలు, చవటలు, సన్నాసులు. మీరు పరమోత్తములు. మీరు లేందే మేం బతకలేం. దాసోహం.. దాసోహం..’

మా ఆరోపణ.. బవిరిగడ్డం అబద్ధాలకు ఇది పరాకాష్ట ప్రభూ. కొండముచ్చుల రాజ్యానికి మన రాజ్యపెద్దలు, పెద్దమంత్రులు బోలెడుసార్లు వెళ్లారు. వాళ్లు వెళ్లిన దార్లు ప్రయాణాల ధాటికి కుంగిపోతే, మళ్లీ మట్టిపోయించి ఎత్తుచేయించుకున్నాం కూడా. అందుకు సాక్ష్యంగా, ఆ దారుల ఛాయాచిత్రాలను, వాళ్లు కొండముచ్చుల రాజ్యం నాయకులతో దిగిన ఛాయాచిత్రాలను జతచేస్తున్నాం. బవిరిగడ్డం మనం అజ్ఞానులమంటూ తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ, మన పరువు తీస్తోంది. వాళ్లకు మన దేశసంపదను అప్పనంగా కట్టబెడతానంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా చెబుతోంది. దీనికి సమాధానం చెప్పించాలి’’ గుమాస్తా ఆపింది.

బవిరిగడ్డం పగలబడి నవ్వింది.

‘ఇదీ ఒక ఆరోపణే! ఇది నా అబద్ధాలకు కాకుండా నా చమత్కారానికి పరాకాష్ట అనుకుని హర్షించండి. కొండముచ్చులు మంచిగా ఆతిథ్యమిస్తాయని, నా గొప్పలు చెప్పుకోవడానికి అలా అంటే గమ్మత్తుగా ఉంటుందని అనేశాను. వాళ్ల ఆరోపణలకు ఇదే నా తమాషా జవాబు. కోతన్నాక కూసింత కళాపోసన ఉండాల.. హ్హహ్హహ్హ.. హ్హహ్హహ్హ.. ఊ తర్వాతి ఆరోపణ.. హ్హహ్హహ్హ..’

రాజ్యపెద్దా, గుమస్తా బిత్తరపోయాయి. రాజ్యపెద్దకు సర్వసత్తాక, గణతంత్ర, కోతిస్వామ్య విశేషణాలు గుర్తుకొచ్చి మళ్లీ గుమాస్తాకు సైగ చేసింది.

‘‘బవిరిగడ్డం బెత్తెడు కోతుల రాజ్యానికి వెళ్లినప్పుడు అధికార, అనధికార సమావేశాల్లో కోతిసంబంధాల గురించి ఇలా అంది ప్రభూ..

‘మీరందరూ సుఖంగా కాపరం చెయ్యాలి. భర్తకోతులు భార్యకోతులను బాగా ఏలుకోవాలి. భార్యకోతులు భర్తకోతులకు సేవలు చెయ్యాలి. మా రాజ్యంలోని వాళ్లకు ఎప్పుడూ ఇదే బోధిస్తుంటాను. పెళ్లిళ్లు స్వర్గంలో చేసినా కాపరం మాత్రం ఈ లోకంలోనే చెయ్యాలి కదా. నాతిచరామి అని అగ్నిసాక్షిగా పెళ్లాడిన పెళ్లాన్ని గాలికొదిలేయడం న్యాయమా?  ఇక అమ్మలను నిత్యం, అణుక్షణం క్షణక్షణం ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మా అమ్మ నానా కష్టాలూ పడి, కొండలెక్కి, లోయల్లోకి దిగి పళ్లుగిళ్లూ తెచ్చి నన్ను సాకింది. ఆమెను తల్చుగుంటే గన్నీళ్లు ధారాపాతంగా గారిపోతాయి. కాటికి కాళ్లుచాపుకున్న ఆమె అంటే నాకెంతో ప్రాణం. ఇప్పటికీ ఏడాది ఒక్కసారి మాత్రమే ఆమె ఇంటికెళ్లి కాళ్లు మొక్కి, ఆమె పెట్టే మిఠాయి తిని వస్తుంటా. మాతృదేవో భవ.. ఎవరు రాయగలరూ.. అమ్మా అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ.. ’

మా ఆరోపణ.. ఇది పూర్తిగా బవిరిగడ్డం వ్యక్తిగత విషయంగా కొట్టిపారేలేం ప్రభూ.. వ్యక్తిగత జీవితాలు మీమీ సొంతం.. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. బవిరిగడ్డం పెళ్లాన్ని వదిలేసి, పరాయి దేశాల్లో, మన దేశంలో సందు దొరికినప్పుడల్లా పెళ్లాలను ఏలుకోవాలని చెబుతోంది. అలా చెప్పే నైతిక అర్హత దీనికి లేదు. తన పెళ్లాం కాపరానికొస్తానని బతిమాలుతున్నా ఆమెను ఏలుకోనందుకు దీన్ని దండించాలి. అలాగే, ముసలి తల్లిని ఏడాదికోసారి చూస్తానంటూనే తల్లిని నిత్యం బాగా చూసుకోవాలని ఊకదంచింది బవిరిగడ్డం. తల్లిని గాలికి వదిలేసిన దీనికి అలా చెప్పే అర్హత లేదు. ముసలి తల్లిదండ్రులను సాకకపోతే శిక్షలు వేయాలని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. బవిరిగడ్డం దీన్నిపాటించనందుకు శిక్ష వేయాలి..’’ గుమాస్తా కంఠం వొణికింది.

బవిరిగడ్డం ముఖం ఎర్రబారింది. కాసేపు గమ్మునుండి మళ్లీ దూకుడు మొదలెట్టింది.

‘ఇదొక ఆరోపణా..? నేను పెళ్లాన్ని వదిలేశాను. అయితే ఏంటట? నాకు పెళ్లాంకంటే నా తళుకుబెళుకుల బట్టలు, నా ఊకదంపుడు, నా స్వీయఛాయాచిత్రాలంటేనే ఇష్టం. వీటికి అడ్డమొస్తుందని కాపరం చెయ్యడం లేదు. నాతో బలవంతంగా కాపరం చేయించలేరు కదా. కనుక నా హక్కునూ మీరు గౌరవించాలి. ఎంతైనా ఇది కోతిస్వామ్యం కదా. ఇక మా తల్లి సంగతి. లోకంలో తల్లిదండ్రులను వీధిన పడేసిన కోతులెన్నిలేవు? యథాప్రజా తథా రాజా. ముందు వాటిని శిక్షించాక, నన్ను శిక్షించండి.. ఇదే నా జవాబు.’

గుమాస్తా కోతి ఈసారి రాజ్యపెద్ద చెప్పకుండానే మరో తాటాకుల కట్ట అందుకుంది..

‘‘‘బవిరిగడ్డం మూరెడు కోతుల రాజ్యంలో వివేకం మరిచి మమ్మల్నిఇలా కించపరచింది ప్రభూ..

‘‘బవిరిగడ్డం వేలెడు కోతుల రాజ్యానికి వెళ్లి సోయి లేకుండా ఇలా..

‘‘బవిరిగడ్డం పొట్టితోక కోతుల రాజ్యానికి వెళ్లి బుద్ధిలేకుండా..

‘‘బవిరిగడ్డం పొడవుతోక కోతుల రాజ్యానికి వెళ్లి..

‘‘బవిరిగడ్డం ఎర్రమూతి కోతుల రాజ్యానికి..

‘‘బవిరిగడ్డం తెల్లమూతి కోతుల…’’

అన్ని ఆరోపణలకూ బవిరిగడ్డం తిరుగులేని జవాబులు చెబుతూ పోయింది. గుమాస్తా మరో కట్ట విప్పబోయింది.

బవిరిగడ్డానికి అటుపక్క విదేశీ ప్రయాణ గడియలు దగ్గర పడుతున్నాయి. అది పైకి లేచింది.

‘కట్ట విప్పకు. రాజ్యపెద్దా..! అలాంటి ఎన్నికట్టలున్నా ఒకటే జవాబు. నోటితో చెప్పను. కళ్లారా చూపిస్తా’ అంటూ తన రెండు కాళ్లూ పైకెత్తింది.

కాళ్లలోంచి నెమ్మదిగా లోహపు చక్రాలు బయటకొచ్చాయి. ఒక్కమారు కీచుమంటూ గిర్రున తిరిగాయి.

వాటికి పచ్చి నెత్తుటి మరకలు కూడా అంటుకుని ఉన్నాయి.

*

మీ మాటలు

  1. చందు - తులసి says:

    బవిరిగడ్డం కోతి …..
    కోతిస్వామ్యం…..
    విదేశీ యాత్రలు…
    రక్తపు మరకలు…
    ఈ కోతిని నేనెక్కడో చూసినట్లే అనిపిస్తోంది.
    మూర్తిగారూ మీ కలం పదును పెరుగుతోంది.

మీ మాటలు

*