వోల్టేర్ నవల: కాండీడ్-1

KONICA MINOLTA DIGITAL CAMERA

1

వెస్ట్ ఫేలియా రాజ్యంలోని థండర్ టెన్ ట్రాంక్ జమీందారు కోటలో సద్గుణ సంపన్నుడైన యువకుడొకడు నివసిస్తుండేవాడు. మనిషి ఎలాంటి వాడో ముఖం చూస్తూనే తెలిసిపోతుంది. ఒట్టి వెర్రిబాగులవాడే కాని, తిరుగులేని నిర్ణయాలు తీసుకోవడంతో మటుకు దిట్ట. అందుకే అతనికి కాండీడ్(నిష్కపటి) అని పేరు పెట్టి ఉంటారనుకుంటాను. అతని పుట్టుపూర్వోత్తరాల గురించి పెద్దగా తెలియదు కాని, ఆ కోటలోని ముసలి నౌకర్లు మాత్రం అతడు జమీందారు సోదరికి, పొరుగూరి పెద్దమనిషి వల్ల పుట్టాడని చెప్పేవాళ్లు. సదరు పెద్దమనిషి ఒట్టి పెద్దమనిషే కాని, అతని వంశవృక్షంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న తరాలు తొంభై తొమ్మిదికి మించి లేకపోవడం వల్ల,  మిగతా వంశవృక్షం కాలమహిమకు సర్వనాశనం అయిపోవడం వల్ల జమీందారు సోదరి అతణ్ని పెళ్లాడ్డానికి నిరాకరించిదట.

జమీందారు ఆ రాజ్యంలోని శక్తిమంతులైన ప్రభువుల్లో ఒకడు. ఎందుకంటే అతని భవనానికి తలుపు మాత్రమే కాకుండా బోలెడన్ని కిటికీలతోపాటు హాల్లో గోడకు ఖరీదైన అల్లికలగుడ్డా వేలాడుతూ ఉంటుంది కనక. ఆయన దొడ్లోని కుక్కలు కూడా తక్కువేమీ కాదు. ఏదన్నా పని తగిలితే వేటకుక్కల్లా ఎగబడేవి. పాలేర్లే వేటగాళ్లు. ఊరి చర్చి అధికారి జమీందారుకు ఆస్థాన పురోహితుడు. ప్రజలు జమీందారును, ‘మా రాజు’ అని గౌరవంగా, ఇష్టంగా పిలుచుకునేవాళ్లు. అతని సొంత కథలకు, ఛలోక్తులకు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వేవాళ్లు.

ఇక జమీందారిణి సంగతి. మూడువందలా యాభై పౌండ్ల బరువు కారణంగా ఆమె కూడా ఏ మాత్రం విస్మరించరాని ప్రముఖురాలైపోయింది. ఇంటి సంప్రదాయాలను తూచ తప్పకుండా అమలు చేయిస్తూ బోలెడంత పరువుప్రతిష్ట మూటగట్టేసుకుంది. ఆమె కూతురు క్యూనెగొండ్. పదిహేడేళ్ల పడచుపిల్ల. లేత గులాబీ ఛాయ, కాస్త బొద్దుగా ఉండే ఒంపుసొంపుల ఒళ్లు, అందమైన ముఖంతో చూడముచ్చటగా, మతిపోగొట్టేలా ఉంటుంది. జమీందారు కొడుకు తండ్రికి తగ్గ తనయుడు. అతని గురువు పాంగ్లాస్. పాంగ్లాస్ మహామేధావి, పండితుడు, ఆ ఇంటికి జోస్యుడు. అతని మాటంటే ఇంట్లో అందరికీ గురి. పాంగ్లాస్ వయసు, వ్యక్తిత్వం, సర్వజ్ఞత్వాలపై గౌరవంతో కాండీడ్ అతని బోధనలను అచంచల విశ్వాసంతో వింటుంటేవాడు.

1chap1

పాంగ్లాస్ అధిభౌతిక-మతతాత్విక-విశ్వోద్భవ శాస్త్రాల విషయాలనేకం బోధిస్తుండేవాడు. ముఖ్యంగా కార్యకారణ సిద్ధాంతాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టు వివరించేవాడు. కారణం లేకుండా కార్యం ఉండదని, అన్ని స్థలకాలాల్లో తన యజమాని భవనం వంటి అందమైన, ఘనమైన భవనం లేనేలేదని, లోకంలోని యజమానురాళ్లందరిలో తన యజమానురాలే సర్వోత్తమురాలని రెండోమాటకు తావులేకుండా నిరూపించాడు.

‘వస్తువులు అవి ఉండాల్సిన తీరుగా భిన్నంగా ఉండవని ఏనాడో రుజువైంది. ఎందుకంటే ప్రతి ఒక్కటీ ఏదో ఒక అవసరం కోసం రూపొందుతోంది కనక, ప్రతి ఒక్కటీ ఏదో ఒక మంచిపని కోసమే సృష్టి అవుతోంది కనక. ఉదాహరణకు తీసుకోండి.. మన ముక్కులు కళ్లజోళ్లను మొయ్యడానికే రూపుదిద్దుకున్నాయి. అందుకే కళ్లజోళ్లు పెట్టుకుంటున్నాం. కాళ్లున్నది కచ్చితంగా లాగులు తొడుక్కోవడానికే. అందుకే లాగులు వేసుకుంటున్నాం. రాళ్లు అందంగా మలచడానికి, భవంతులు కట్టడానికి అవతరించాయి. అందుకే మన జమీందారుకు ఎంతో అందమైన భవంతి అమరింది. వెస్ట్ ఫేలియా ప్రభువుల్లోకెల్లా గొప్పవారైన ఆయనకు తన హోదాకు తగ్గట్టు గొప్ప భవనం ఉండాలిగా మరి. ఇక పందుల సంగతి.. అవి మనం తినడానికే అవతరించాయి. అందుకే మనం యాడాది పొడవునా ఎంచక్కా పందిమాంసం ఆరగిస్తున్నాం. అంతా మన మంచికే, ప్రతీదీ మనమంచికేనన్న వాదాన్ని అర్థరహితంగా కొట్టిపడేసేవాళ్లు ఇకనైనా దాన్ని ఒప్పుకుని తీరాలి..’ అని విడమరచి బోధిస్తుండేవాడు పాంగ్లాస్.

కాండీడ్ క్యూనెగొండ్ ను అతిలోకసుందరిగా తలపోయడం వల్ల, ఆ తలపోతకు బలమైన కారణమే ఉంటుందనుకుని పాంగ్లాస్ మాటలను వెర్రిమొగమేసుకుని చెవులు రిక్కించి వినేవాడు. అయితే ఆమె అందాల కుప్ప అన్న సంగతిని నేరుగా ఆమెతోనే చెప్పే ధైర్యం లేకపోయింది. థండర్ టెన్ ట్రాంక్ ప్రాంత జమీందారుగా పుట్టడం పెద్ద అదృష్టమని, ఆయన కూతురవడం రెండో పెద్ద  అదృష్టమని అతని భావన. ఆమెను రోజూ కళ్లారా చూడ్డం మూడో భాగ్యమని, తమ రాజ్యంలోనే కాకుండా యావత్ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త అయిన పాంగ్లాస్ ప్రబోధాలు వినడం నాలుగో భాగ్యమని అనుకునేవాడు.

1chap3

ఓ రోజు క్యూనెగొండ్ ఇంటి దగ్గర్లోని చిన్న ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆసక్తికరమైన దృశ్యం కంటబడింది. పూపొదల మాటున పాంగ్లాస్ పండితుడు తన తల్లిచెంత పనిచేసే అందమైన పడుచుపిల్లకు ప్రయోగపూర్వక తత్వశాస్త్రపాఠాన్ని నేర్పుతూ కనిపించాడు. క్యూనెగొండ్ కు శాస్త్రాలపై చెప్పలేనంత ఆసక్తి కనక, ఊపిరి సలపనంత మోహావేశంతో పునశ్చరణ చేస్తున్న ఆ ప్రయోగాలను కుతూహలంతో కన్నార్పకుండా చూసింది. పండితవర్యుల ‘సహేతుక కారణ’ బలాన్ని చక్కగా అర్థం చేసుకుని, కార్యకారణాలను బుర్రలోకి ఎక్కించుకుంది. వ్యాకుల చిత్తంతో తొట్రుపడుతూ ఇంటికి తిరుగుముఖం పట్టింది. పొదలచాటు వ్యవహారం ఆమెలో ఆలోచనల తుట్టెను కదిల్చి, అభ్యసన కాంక్షను రగిల్చింది. ఆ ప్రయోగాన్ని తాను కూడా కాండీడ్ తో కలసి చేస్తే బాగుంటుందనిపించింది. తాను అతనికి, అతడు తనకు తగిన కారణమని అనుకుంది.

ఇంటికి చేరువవుతుండగా కాండీడ్ కలిశాడు. ఆమె సిగ్గుపడింది. అతడూ సిగ్గుపడ్డాడు. తడబాటు గొంతుకతో ఆమె అతనికి శుభోదయం చెప్పి అభివాదం చేసింది. అతడూ తను చెబుతున్నదేంటో తనకే తెలియకుండా శుభోదయం చెప్పి ప్రత్యభివాదం చేశాడు. మర్నాడు మధ్యాహ్న భోజనాలు ముగించుకుని వెళ్తుండగా ఇద్దరూ ఓ తెరవెనక కలుసుకున్నారు. క్యూనెగొండ్ తన చేతి రుమాలును జారవిడిచింది. కాండీడ్ దాన్ని తీసి ఆమె చేతికందించాడు. ఆమె అమాయకంగా అతని చేయి పట్టుకుంది. అతడూ ఏమీ ఎరగనట్టే తన్మయంగా ఆమె చేతిని ముద్దాడాడు. పెద్దవులూ పెదవులూ పెనేవేసుకున్నాయి. కళ్లు తళుక్కుమని మెరిశాయి. కాళ్లు ఉద్వేగంతో కంపించాయి. చేతులు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఇంతలో జమీందారు ఆ తెరవెనకగా వచ్చాడు. కార్యకారణ సంబంధాలను పరిపూర్ణంగా గ్రహించి, కాండీడ్ ను చావుదెబ్బలతో సత్కరించి ఇంటి నుంచి గెంటేశాడు. క్యూనెగొండ్ మూర్ఛపోయింది. స్పృహలోకి రాగానే జమీందారిణి ఆమె చెవుల్ని సత్తువకొద్దీ మెలేసింది. ఆ విధంగా లోకంలోకెల్లా అందమైన, ఘనమైన ఆ భవనం నలుమూలలా భయాందోళనలు రాజ్యమేలాయి.

 

(వచ్చే గురువారం)

మీ మాటలు

 1. Very nice story, but ends shortly.. waiting for next Thursday.

 2. చందు - తులసి says:

  అన్నీ మన మంచికే….లాగుల కోసమే కాళ్లు రూపొందాయి. హ హ్హ హ్హ..ఒప్పుకుంటున్నా…
  ఆద్యంతం చదివించేలా ఉంది.

 3. శ్రీనివాస్, చందు తులసి గార్లకు ధన్యవాదాలు. పాంగ్లాస్ది అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష ధోరణి.

 4. mskkrishna jyothi says:

  కార్యా కారణ సంబంధం భలే తమాషాగా వుంది.

 5. అవునండి. ఈ సిద్ధాంతం, ఇంకా వెర్రి మొర్రి సిద్ధాంతాలు భలే తమాషాగా సాగుతూ చావు దెబ్బలు తింటాయి..

 6. కె.కె. రామయ్య says:

  కాండీడ్ మెదటి భాగమే ఆలోచనల తుట్టెను కదిల్చి, పఠనాకాంక్షను రగిల్చింది మోహన్ గారు. కార్యకారణ సిద్ధాంతాన్నిఅరటిపండు ఒలిచిపెట్టినట్టు వివరించే తత్వవేత్త, మహామేధావి, పండితుడు, ఇంటి జోస్యుడు పాంగ్లాస్ ను తల్చుకుంటే నవ్వు ఆగటంలేదు.

 7. ” ఆలోచనల తుట్టెను కదిల్చి, పఠనాకాంక్షను రగిల్చింది…. ” పంచ్ బాగా ఇచ్చారు :)

 8. వోల్టేర్ ‘క్యాండిడ్’ను తెలుగులోకి అనువదించడం మంచి ప్రయత్నమండీ. వోల్టేర్ తన అద్భుతైమన ఛలోక్తులతో లాజిక్ & రీజనింగ్ ను ఫిలసాఫికల్ గానూ, అద్భుతంగానూ చొప్పిస్తారు తన రచనల్లో. క్యాండిడ్ లోనూ అదే పని చేశారాయన. ఇక్కడ తెలుగులోకి అనువదించ పూనుకోవడం అభినందనీయం అండీ!! థాంక్యూ :)

మీ మాటలు

*