పిపీలక సోదరులారా… !

maxresdefault

-కళ్యాణి తాళ్ళూరి

~

kalyani“పాముల పుట్ట లోనికి పంపించి, వాళ్లు పాములు కరిచి చనిపోతే, ఆ దుఃఖం చూపించి మరి కొందరినీ పుట్ట లోకి పంపించే…”…  ఉద్యమాలంటూ ఈ మధ్య కొన్ని వాదాలు వింటున్నాం . అవి  పైకి హేతుబద్ధం గానూ, మానవతా దృక్పధం తోనూ ఉన్నట్టుగానే తోస్తాయి ! వాటిని నమ్మినట్టయితే,   ‘అదిగో అది- పాములపుట్ట; ఇదిగో ఇది నీ నాగరిక మానవ సమాజం! అదుగో అటు వెళ్ళకు- అది పాము, కరుస్తుంది, ఇదుగో ఇటు రా- ఇదీ మనందరం సంచరించే జాగా, ఇటు ఆ పాము రాదు, అది వచ్చినా… మనందరినీ చూసి పారిపోతుంది’… అని demarcate చేసుకుని బతికెయ్యవచ్చని మనకు సంబరం కలుగుతుంది.

నిజమేనే, అంత ప్రాణాపాయం కలిగించే పాముకి దూరం గా ఉంటే పోలా…సరే, మరి అలాటి విభజనరేఖ వాస్తవమేనా? ఆ పాములపుట్ట పుట్టు పూర్వోత్తరాలేమిటని ఒక్క క్షణం తరచిచూస్తే.. .దాని అసలు తత్వం తలకెక్కుతుంది.

పాముల పుట్ట గా వీరు భ్రమిస్తున్నది, దూరం గా ఎక్కడో లేదు, అది సాక్షాత్తూ మన ప్రపంచం- మనదే, మీలాటి, నాలాటి చీమలది!  దానిలో చొరబడి, మనల్ని మట్టుబెట్టాలని వచ్చే ఆ మహా సర్పం పేరు ‘దౌర్జన్యం’. దురదృష్టవశాత్తూ, పుట్టద్వారం దగ్గర చిక్కుకున్న చీమలు – ఆ సర్పాన్ని చూసి, గగ్గోలు పెడుతున్నాయి. వాటి అరుపులు వినగలిగిన కొన్ని చీమలు లోపలినుండి పరిగెత్తుకు వస్తున్నాయి.  “బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి … …” అని చెప్పిన సుమతీ శతకకారుణ్ణి తలుచుకుని లేని ధైర్యం తెచ్చుకుంటున్నాయి, ఎదురుతిరుగుతున్నాయి!

మరి మనం ఎక్కడున్నాం అంటారా? మన మధ్యతరగతి పిపీలకాలం … “అల వైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూల సౌధంబులో… ” అని అన్నట్టు, లోలోపలి గదుల్లో దూరి నిశ్చింత గా కూర్చున్నాం… పైగా, అడ్డగించి ఆ పాముకాటు తిని దుర్మరణం పొందుతున్న బడుగు చీమలను చూసి ‘పాముతో తలపడితే అంతేగా మరీ !’ అని నిట్టూరుస్తున్నాం!  మిగిలిన చీమల హాహాకారాలు విని ‘ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని, కేకలు మానెయ్యండి… పామువారికి కోపం వస్తే… మీ పని సఫా’ అని గుడ్లురుముతున్నాం!!

కానీ – మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే – ఆ పాము వారు మనల్నందరినీ పుట్టలోంచి తరమడానికే విచ్చేస్తున్నారు! మనం కేకలు వెయ్యకపోయినా, దారితొలిగి లోపలికి ఇరుక్కుపోయి గడుస్తనం చూపించినా  – వారి పని వారు నిశ్శేషంగా కానిచ్చే తీరతారు! మరేది దారి తండ్రీ మనకు…  పోరాటం కాక!?

అరే! పోరాడ వద్దనలేదమ్మా, వారి క్షేమం కోరే, వారి మార్గం మార్చుకొమ్మంటున్నాం, వారి దారి సరైనది కాదు, ఇలా గమ్యం చేరడం అసాధ్యం అని వాపోయే కొందరు హితైభిలాషులకు ఒక్క మాట! ‘పోరాట రూపాలు’
లోపరహితం గా లేవు, నిజమే, నిజాయితీ తో చేసిన విమర్శలను విశ్లేషించుకోవడం ప్రతీ ఉద్యమానికీ తప్పనిసరే! కొన్ని సద్విమర్శలు : ఇవిగో మచ్చుకి …
“1. భూస్వాముల్నివ్యక్తులిగా నిర్మూలిస్తే, భూస్వామ్య విధానం పోతుందని భ్రమింపజేసే వర్గశత్రునిర్మూలనా కార్యక్రమం…
2. సాహితీ, సాంస్కృతిక విప్లవకర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తోడ్పడే బదులు, సాంస్కృతిక రంగాన్ని వొదిలి విప్లవరాజకీయాల్లో పాల్గొనడాన్నే ప్రధాన కర్తవ్యం గా భావించడం… 

వంటివి సరికాదంటూ, తప్పొప్పులు విడమర్చి చెప్పడం – అభిలషణీయమే !!! దానితో పాటు విభిన్నసాయుధపోరాటాల చారిత్రక, భౌగోళిక విలక్షణతలను గురించి కూలంకషంగా పరిశీలించాలి,  లోతుగా విశ్లేషించాలి. మూలాన్ని పట్టుకోగలగాలి. అప్పటివరకూ, మార్గాంతరాలను అన్వేషించమని వారికి ఉపదేశించలేం.

ఉదాహరణకు, దండకారణ్యపు ఆదివాసీ అస్తిత్వపోరాటానికి ఇలా అర్ధం చెప్పుకోవచ్చు…అన్యాయంగా  తన్ని తగిలేస్తుంటే – నిస్సహాయులైన చిన్నపిల్లలు ఇల్లువదిలిపోలేక స్థంభం గట్టిగా పట్టుకుని మొరాయిస్తారే,
అలాటి resistance అది. మనలాంటి మధ్యతరగతిని, వారి గోడు విననీయకుండా చేసేందుకు …వారిని ఊచకోత కోస్తున్నమన శత్రువు వద్ద మనం ఊహించ లేనన్ని వనరులూ, వ్యూహాలూ ఉన్నాయి.

కనుక మేధావులమనుకునే వారందరికీ ఒక్క సూచన, మనం రాసే ప్రతీ అక్షరం – దెబ్బతింటున్న వాడికి చెయ్యూత నిస్తోందా, పోనీ ఓదార్పు నిస్తోందా… లేక అది దౌర్జన్యం చేసేవాడి పన్నాగాల్లో పడిపోతోందా అని తరచి తరచి చూసుకోవడం చాలా అవసరం.  అది లేకనేగా, జరుగుతున్నదురాగతాన్నిఖండించక పోడం … పైపెచ్చు సానుభూతిపరులే దానికి కారణమని నెపం వెయ్యడం. మధ్యతరగతి లోని యీ అతి తెలివిధోరణిని అలుసుగా తీసుకుని ‘దౌర్జన్యం’ మరింత నిర్భయంగా బుసలు కొడుతోంది  సాయుధపోరాటాల దాకా ఎందుకు, వీధిపోరాటాలను కూడా నిర్దాక్షిణ్యం గా అణచివేస్తానని సవాలు చేస్తోంది.

‘హింస ఒక్క అడవుల్లోని అన్నలమీదా , అక్కలమీదే కాదు జరిగేది ‘.  ‘ రైతుల ఆత్మ హత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యలు, ఆసుపత్రుల్లో పసిపాపల మరణాలు …ఇలాంటి ఎన్నో హత్యలు’ కూడా ఆ విష సర్పపు కాట్లే!  దాని వేటు స్వయంగా రుచి చూసిన నాడు మనం పెట్టే కేకలు – బాబూ!  … ‘ఉల్లిగడ్డల ధరలు అందుకోలేక కన్సూమర్ల కష్టాలు’ చూసి గొణుక్కున్నట్టూ mild గా ఉండవు!  ‘ఉల్లిగడ్డల ధరలు గిట్టక రైతులు ఆత్మహత్యలు’ చేసుకున్నట్టు wild గా ఉంటాయి… కనక పిపీలక సోదరులారా ! ఆ పాముకాటు తినే దుస్థితి కలక్కుండా జాగ్రత్త పడదాం…చీమలకు సహాయపడదాం…

మీ మాటలు

 1. Aranya Krishna says:

  రాజ్యానికి ప్రజా సంక్షేమ నిబద్ధత లేనప్పుడు, ప్రభుత్వం అంటే కొంతమంది ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజల సంక్షేమాన్ని బలిపెట్టే దోపిడీ స్వభావం కలిగిన రాజ్యం యొక్క సాధనం అయినప్పుడు రాజ్యం ప్రజల మీద పడి దొర్లే అనకొండ పామే ఖచ్చితంగా. దాని బుసల వేడిమికి బొబ్బలెక్కని జీవితాలుండవు. దాని మందపు చర్మానికి ప్రజాస్వామిక ఆర్జీలు ఏమీ అంటుకోవు. దాన్ని చంపే విధానంలో ఎవరికైనా విబేధాలుంటే తప్పేమీ లేదు. కానీ దాన్ని చంపాలనుకున్న వాళ్ళని శాపనార్ధాలు పెట్టేవాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయాలన్నదే చర్చనీయాంశం. దండకారణ్యానికి సంబంధించిన వాస్తవాలు చాలామందికి ఇప్పటికీ తెలియవు. పెట్టుబడిదార్లు తరలించుకుపోతున్న వనరుల వల్ల తమ అస్తిత్వానికి వస్తున్న ముప్పుకి ఎటువంటి ప్రజాస్వామిక మద్దతు దొరక్క ఆదివాసీలు మావోయిస్టులని ఆశ్రయిస్తున్నారని, వారిని మావోయిస్టులు తప్ప మరొకరెవరూ క్రియాశీలకంగా పట్టించుకోకపోవటం వల్లనే “గ్రీన్ హంట్” మొదలైందని, మావోయిస్టులతో యుద్ధం పేరుతో ఆదివాసీలను వెళ్ళగొట్టి దండకారుణ్య సహజవనరుల్ని పెట్టుబడిదారుల పరం చేసేందుకు ప్రభుత్వం ఎలా పన్నాగం పన్నుతుందో చాలామందికి తెలియదు. బహుశ ఇవన్ని అవసరమైనంత ప్రచారం పొందిన రోజు శృతి, సాగర్లు ఏ ఆవేదనతో, ఏ ఆవేశంతో మావోయిస్టులయ్యారో అర్ధం కావటమే కాక ప్రభుత్వం కూడా కొంత వెనుకడుగు వేసే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి ఏ ప్రజాస్వామిక పోరాటరూపం పట్ల, ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల కూడా గౌరవం లేకపోవటం కూడా యువత వేరే మార్గం తీసుకోవాల్సి వస్తుంది. ఎంతో తర్కబద్ధంగా కళ్యాణి గారు రాజ్యస్వభావాన్ని, అనివార్యమైన దాని హింసా స్వభావాన్ని అంతే అనివార్యమైన ప్రతిఘటన అవసరాన్ని ఇప్పటి చర్చల నేపధ్యంలో బలంగా చెప్పారు. ఇలాంటి వ్యాసాలు మరిన్ని, మరింత వివరంగా రావాల్సిన అవసరం వుంది.

 2. మనమంతా రాజ్యం సృష్టిస్తున్న హింసనే తింటున్నాము. తాగుతున్నాము. పీలుస్తున్నాము. గొప్ప హింసావరణంలో బతుకుతున్నాము. దాంతో పోలిస్తే ప్రతిఘటన హింస పేలవంగానే ఉంది. మంచి వ్యాసం కళ్యాణి గారు.

 3. ”మనం రాసే ప్రతీ అక్షరం – దెబ్బతింటున్న వాడికి చెయ్యూత నిస్తోందా, పోనీ ఓదార్పు నిస్తోందా… లేక అది దౌర్జన్యం చేసేవాడి పన్నాగాల్లో పడిపోతోందా అని తరచి తరచి చూసుకోవడం చాలా అవసరం..”
  చాలా విలువైన మాటలు చెప్పారు. రావిశాస్త్రి కూడా ఇలాగే అన్నాడు. కానీ చెవులకు దొంగ తాళాలు వేసుకున్న దొంగ మేధావులకు ఇవి ఎక్కవు కదా. రాజ్య స్వభావాన్ని, అనివార్య ప్రతిఘటనను చక్కడా చెప్పారు కళ్యాణి గారు. చర్చ ఘాటుగా సాగితేనే పొల్లూ నెల్లూ తేలుతుంది.

 4. ఇదీ వాస్తవం …

 5. ఎ కె ప్రభాకర్ says:

  మనం రాసే ప్రతీ అక్షరం – దెబ్బతింటున్న వాడికి చెయ్యూత నిస్తోందా, పోనీ ఓదార్పు నిస్తోందా… లేక అది దౌర్జన్యం చేసేవాడి పన్నాగాల్లో పడిపోతోందా అని తరచి తరచి చూసుకోవడం చాలా అవసరం. అది లేకనేగా, జరుగుతున్నదురాగతాన్నిఖండించక పోడం … పైపెచ్చు సానుభూతిపరులే దానికి కారణమని నెపం వెయ్యడం. మధ్యతరగతి లోని యీ అతి తెలివిధోరణిని అలుసుగా తీసుకుని ‘దౌర్జన్యం’ మరింత నిర్భయంగా బుసలు కొడుతోంది సాయుధపోరాటాల దాకా ఎందుకు, వీధిపోరాటాలను కూడా నిర్దాక్షిణ్యం గా అణచివేస్తానని సవాలు చేస్తోంది.
  సరైన సమయంలో సరైన సూచన.

 6. Delhi Subrahmanyam says:

  అరణ్యకృష్ణ గారు చెప్పినట్టు ” రాజ్యానికి ప్రజా సంక్షేమ నిబద్ధత లేనప్పుడు, ప్రభుత్వం అంటే కొంతమంది ప్రయోజనాల కోసం మెజారిటీ ప్రజల సంక్షేమాన్ని బలిపెట్టే దోపిడీ స్వభావం కలిగిన రాజ్యం యొక్క సాధనం అయినప్పుడు రాజ్యం ప్రజల మీద పడి దొర్లే అనకొండ పామే ఖచ్చితంగా. దాని బుసల వేడిమికి బొబ్బలెక్కని జీవితాలుండవు. దాని మందపు చర్మానికి ప్రజాస్వామిక ఆర్జీలు ఏమీ అంటుకోవు. దాన్ని చంపే విధానంలో ఎవరికైనా విబేధాలుంటే తప్పేమీ లేదు. కానీ దాన్ని చంపాలనుకున్న వాళ్ళని శాపనార్ధాలు పెట్టేవాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయాలన్నదే చర్చనీయాంశం. దండకారణ్యానికి సంబంధించిన వాస్తవాలు చాలామందికి ఇప్పటికీ తెలియవు. పెట్టుబడిదార్లు తరలించుకుపోతున్న వనరుల వల్ల తమ అస్తిత్వానికి వస్తున్న ముప్పుకి ఎటువంటి ప్రజాస్వామిక మద్దతు దొరక్క ఆదివాసీలు మావోయిస్టులని ఆశ్రయిస్తున్నారని, వారిని మావోయిస్టులు తప్ప మరొకరెవరూ క్రియాశీలకంగా పట్టించుకోకపోవటం వల్లనే “గ్రీన్ హంట్” మొదలైందని, మావోయిస్టులతో యుద్ధం పేరుతో ఆదివాసీలను వెళ్ళగొట్టి దండకారుణ్య సహజవనరుల్ని పెట్టుబడిదారుల పరం చేసేందుకు ప్రభుత్వం ఎలా పన్నాగం పన్నుతుందో చాలామందికి తెలియదు బహుశ ఇవన్ని అవసరమైనంత ప్రచారం పొందిన రోజు శృతి, సాగర్లు ఏ ఆవేదనతో, ఏ ఆవేశంతో మావోయిస్టులయ్యారో అర్ధం కావటమే కాక ప్రభుత్వం కూడా కొంత వెనుకడుగు వేసే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి ఏ ప్రజాస్వామిక పోరాటరూపం పట్ల, ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల కూడా గౌరవం లేకపోవటం కూడా యువత వేరే మార్గం తీసుకోవాల్సి వస్తుంది.” మంచి విస్లేషనతో ఈ వ్యాసం రాసిన కళ్యాణి గారు అభినందనీయురాలు. రావిశాస్త్రి గారు చెప్పినట్టు ప్రతీ రచయత కూడా తను రాసేది ఏ మంచికి హాని చేస్తుందో ఏ చెడును పెంచ్చుతుందో తప్పక ఆలోచించాలి.

  మొన్న హైదరాబాదు లో జరిగిన ఎన్నో ఆందోళనలు జరుగుతూనే ఉండాలి.

 7. Kurmanath says:

  Excellent piece.
  Those who are blaming the victim have failed to understand ది brutality in structural violence.

 8. కళాణి తాళ్ళూరి పిపిలక సోదరులారా రాజ్యస్వభావాన్ని ఆవిష్కరి౦చి౦ది.

 9. చందు - తులసి says:

  కళ్యాణి గారు. చాలా చక్కగా చెప్పారు. మన అక్షరం బాధితునికి సాంత్వన కలిగించకున్నా ఫర్లేదు….కానీ బలవంతుల దోపిడికి సాయ పడకుంటే చాలు.

 10. Dr. Rajendra Prasad Chimata. says:

  “చలో అసెంబ్లి” ని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచారో చూస్తే రాజ్య స్వభావం అర్థమౌతుంది. కానీ ఈ పాము చాలా గడుసైనది. పిపీలకాలలో గ్రూపులు తయారు చేసి వాటిని అవే చంపుకునేటట్లు చేస్తోంది. పాము కన్నా దాని పిపీలక ఏజెంట్లే ప్రమాదంగా తయారయ్యాయి.పిపీలకాలను అన్ని రకాల ఎరలతో బ్రెయిన్ వాష్ చేసి వాటి కళ్ళను వాటితోనే పొడిచేస్తున్నాయి.పాము భాష అవే మాట్లాడుతున్నాయి.

 11. శత్రువు ఎవరో తేట తెల్లంగా తెలిసినా తరతరాల భావాల తెరల పొరలల్లోంచి పోల్చుకోలీక పోతున్న వారికి చీమలబారులో చివరలో పాకటానికి కూడా తటపతాంచీ వారికి చిటికెన వేలు పట్టుకుని పోరు దారి లో నడిపించీలా రాసారు..చాలా బాగుంది ..

 12. ఈ జబ్బు ‘సారంగ’ పత్రికదా? ‘సారంగ’ రచయితలదా?

  ఇది రెండోసారి.

  ఎక్కడో చర్చ జరిగి వుంటుంది. లేదా జరుగుతూ వుంటుంది. ఆ చర్చను ఇక్కడికి తెస్తారు.

  ఓకే. అది సరైంది కాదు గాని, పెద్ద తప్పేం కాదు,

  అక్కడి నుంచి కొన్ని మాటల్ని, అభిప్రాయాల్ని ఉటంకిస్తారు. వాటి మీద చవకబారు వ్యంగ్యంతో దాడి చేస్తారు.

  ఆ రచయితను, ఆ రచనను పేర్కొనకపోవడం చవకబారు తనానికి పరకాష్ఠ.

  ఆ రచయిత మాటలతో తమ విబేధమేమిటో చెప్పి వూరుకోరు. రచయిత అనని మాటలెన్నో కలిపి, ఆ పైన ఆ రచయితకు లేని వర్గ స్వభావం తదితర గుణాల్ని అంటగట్టి ఎకసెక్కాలాడుకుంటారు.

  ఇదేమి జర్నలిజం? ఇదేమి ప్రజాస్వామ్యం?

  సిగ్గు ఎగ్గు వున్నదా మీకు?

  వ్యంగ్యమా ఇప్పుడు కావలసింది?

  ఇది చతుర్లాడుకునే సమయమా?

  ఇటీవల ముగ్గురు యువకులు మరణించారు. పసి వాళ్లు అంటే ఎవరికో ఏదో అబ్జెక్షన్ వున్నట్టుంది. పెద్దవాళ్లు అనడానికి నాకేం అభ్యంతరం లేదు. వాళ్లు వూరికే మరణించలేదు. శతృవు వాళ్ల శరీరాలతో హీనాతి హీనంగా ఆడుకున్నాడు. ఇంకా ఆడుకుంటాను అని సూచనలిస్తున్నాడు.

  దీన్ని ధిక్కరించడానికి ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు తెలుగు సమాజం మీద వేసిన ఇంపాక్ట్ అత్యల్పం. యాభై అరవయ్యేండ్ల ‘యుద్ధం’ తరువాత ఇదీ తెలుగు చేతన. ఇన్ని వేల మంది యువకుల్ని బలి పెట్టిన యుద్ధ తంత్రం ఈ స్థాయి చేతన కోసమేనా? ఇది అడిగితే, అలా అడిగినోళ్లంతా పాముల పక్షమా? ఎగ్గు సిగ్గు లేకుండా, సానుభూతి పేరిట, ఆ యుద్ధ తంత్రాన్ని సమర్థించే వాళ్లు, నిర్విమర్శక సమర్థన మీద నిలబడ కీర్తి పళ్లు కోసుకునే వాళ్లు మంచి మాళ్లా?

  పోగా సాంస్కృతిక, సాహిత్య కారులు యుధ్ధంలో లేకపోవడం అతి సహజమైనట్టు వూక దంపుడు ఉపన్యాసాలు.

  విబేధాలుంటే చెప్పొచ్చు గాని, విబేధాలు అంటే ఇవి, ఇవి కాకుండా ఇంకేం మాట్లాడినా శతృ పక్షమని రంకెలు. అమ్మా! మీకు ఏ విబేధాలున్నాయో, వుండినాయో అవి మాత్రమే పర్మిటెడా, వేరే వాటికి కుదరదా?

  మీరు కలాలు వూపుకుంటూ సాంస్కృతిక రంగంలో పని చేయాలని ఎవరు నిర్ణయించారు? మీరే నిర్ణయించారు. ఉద్యమం తన అవసరాల కోసం చేసిన నిర్ణయం కాదిది. మీరు సేఫ్ గా వుండాలని మీరే నిర్ణయించారు. సేఫ్ పొజిషన్స్ లోంచి ప్రమాద గీతాలు రాసి ప్రమాదాలకు మీరు కాకుండా మరొకరు ఎర అయ్యేట్టు మీరే నిర్ణయించారు.

  భారతంలో పది పద్యాలకు ఒక సారైనా బ్రాహ్మణులను పూజించాలనే మాట వస్తుంటుంది. అది ఎవరు నిర్ణయించారు. బ్రాహ్మణులే నిర్ణయించారు. (రాసింది బ్రాహ్మణులే). మీకూ వాళ్లకు తేడా నాకైతే కనిపించడం లేదు.

  ఇది వ్యగ్యం కాదు. సీరియస్గానే అంటున్నాను. మీ ఒక్కొక్కరి జన్మ కులాల గురించి నాకు తెలీదు. ఐ డోంట్ కేర్.

  కాని మీరు చేస్తున్నది ఇన్నాళ్లుగా శూద్రుల పట్ల బ్రాహ్మణులు చేసిన ఘన కార్యమే. కాదా?

  2-10-2015

  • Aranya Krishna says:

   హెచ్చార్కె గారూ! మీ భాషకి కూడా కొంచెం సిగ్గు ఎగ్గు వుంటే బాగుంటుంది కదా! భారతంలో బ్రాహ్మణులు చెప్పినదానికి ఇప్పడు మీతో విభేదించే వారి అభిప్రాయాలకు ఏమిటి సంబంధం? మోకాళ్ళకి బోడితలకి ముడిపెట్టడం దివాళా తీసిన మీ మేధసుకి నిదర్శనం. మీరిలా కులాల పేర్లు ఎత్తటం పరమ నీచంగా, దరిద్రంగా వుంది. జన్మ కులాలు తెలియటం పెద్ద పని ఏమీ కాదు. ఎంతో అనుభవజ్ఞులు కదా మీరు. ఇళ్ళపేర్లో, లేక మిమ్మల్ని విభేదించేవారితో మీకున్న గత పరిచయాల కారణంగానో మీకు తెలిసే వుండొచ్చు. ప్ల్లీజ్ గెట్ వెల్ సూన్. ఇలా రాయటానికి చాలా బాధగా వుంది. కానీ తప్పటం లేదు.

 13. mercy margaret says:

  వెల్ సేడ్ కళ్యాణి గారు .. -” మనం రాసే ప్రతీ అక్షరం – దెబ్బతింటున్న వాడికి చెయ్యూత నిస్తోందా, పోనీ ఓదార్పు నిస్తోందా… లేక అది దౌర్జన్యం చేసేవాడి పన్నాగాల్లో పడిపోతోందా అని తరచి తరచి చూసుకోవడం చాలా అవసరం. అది లేకనేగా, జరుగుతున్నదురాగతాన్నిఖండించక పోడం … పైపెచ్చు సానుభూతిపరులే దానికి కారణమని నెపం వెయ్యడం. మధ్యతరగతి లోని యీ అతి తెలివిధోరణిని అలుసుగా తీసుకుని ‘దౌర్జన్యం’ మరింత నిర్భయంగా బుసలు కొడుతోంది సాయుధపోరాటాల దాకా ఎందుకు, వీధిపోరాటాలను కూడా నిర్దాక్షిణ్యం గా అణచివేస్తానని సవాలు చేస్తోంది.” …..

 14. Are we again ending up with the same old saga of not looking at the problems bt staging blame game at its best? The questions raised by Heccharke sir are not illogical, either and actually created a lot of stir in FB circles, demanding answers for the scholar lot of communists, who remain passive at these encounters that state it self is responsible for. The killing are so brutal and this tyranny is unbearable, and concluding it as simple and escaping without answering it by calling it as going against the govt, raises so many questions on this govt. which came in to power, making a base on hundreds of such deaths nd bloodshed. So, who ever playing the fiddle when the state is in ruins, gotta state their stand clear. Its not time, to take sides nd protect their castes, when questions of Brahminic domination in the party are raised, but its time to rethink on what’s this hegemonic leadership that simply, conveniently getting confined to lamenting the deaths by writing poetry, prose on them..It is time for practical condemnation of these heinous acts.Its time to behave as leaders, not just writers.

 15. అరణ్య కృష్ణ!
  ఇలా రాయటానికి బాధగానో ఏది గానో వుందని రాశారు. అలాంటి దేమీ లేదు. ఇలా రాయడాన్ని మీరు ఎంజాయ్ చేశారు.
  సిగ్గు ఎగ్గు వుండాల్సింది భాషకు కాదు. మనస్తత్వాలకు. ముగ్గురు యువకుల దారుణ మరణాల సందర్భంగా జరిగే చర్చలో వ్యంగ్య రచన చేయాలనిపించింది, దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదా అని అడిగాను. ఇలాంటప్పుడు వ్యంగ్యం రాయడం సహజమేనని, మీకు అనిపిస్తున్నట్టయితే సో బి ఇట్.
  మీ అసందర్భ ఇండిగ్నేషన్ ను బట్టి మీరు బ్రాహ్మణులని నాకు ఇప్పుడే తెలిసింది. కాని, నేను ఎవరి వాదాన్ని కాదంటున్నానో వారిలో బ్రాహ్మణులున్నారని మాత్రం నాకు ముందే తెలుసు. మీరన్నట్టు చాల మందితో నాకు పరిచయం వుంది. అందుకే, అయ్యా, నేను మీ జన్మ కులాల గురించి మట్లాడడం లేదు అని ఒక రైడర్ రాశాను.
  భారతంలో ప్రతి పది పద్యాలకొక సారి ‘బ్రాహ్మణులను పూజించాల’ని రాసింది బ్రాహ్మణులే కనుక, ఆ మాటకు లెజిటిమసీ లేదు, అలాగే, ‘నేను సాహిత్య, సాంస్కృతిక కార్యకర్త’ను అని మీకు మీరు చెప్పుకుంటే దానికి ఎలాంటి లెజిటిమసీ లేదు. ఇది కాస్త ఆలోచిస్తే మీకు తట్టేది. తట్టకపోతే నన్ను ప్రశ్నించాల్సింది. నీచం, దరిద్రం… అది ఏం భాష?

  • Dr. Rajendra Prasad Chimata. says:

   తుపాకుల అహింసావాదం
   Updated :03-10-2015 00:47:11
   వరంగల్‌ జిల్లా, తాడ్వాయి మండలంలోని మొద్దుగుట్ట అటవీ ప్రాంతంలో చేసిన ఎన్‌కౌంటర్‌ గురించి, పోలీసు అధికారుల సంఘం చేసిన వాదనలు (ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 29) చదివిన సందర్భం ఇది.
   పోలీసు సంఘం, ఆ ఎన్‌కౌంటర్‌ చేసినట్టు అంగీకరించింది. ఆ ఇద్దరు వ్యక్తుల్నీ, ఎన్‌కౌంటర్‌కి ముందు ఎక్కడా తాకలేదనీ, గాయపర్చలేదనీ, తుపాకులు పేల్చడం ఒక్కటే చేశామనీ, ఆ సంఘం చెప్పుకుంది. ‘తుపాకులతో చంపదల్చిన వాళ్ళం, అంతకు ముందు వేరే గాయాలు ఎందుకు చేస్తాం?’ అని, ఆ సంఘం వాదించింది. అరెస్టుల్లో వున్న వాళ్ళు విప్లవకారులే అనే అనుమానం పోలీసులకు వుంటే, వాళ్ళని చంపివేసే వుద్దేశం వున్నప్పటికీ, వాళ్ళ నించి తమకు కావలసిన రహస్యాలు రాబట్టాలని, వాళ్ళ గోళ్ళల్లో సూదులు గుచ్చుతారనీ, కరెంటు షాకులు ఇస్తారనీ, లాఠీలతో బాదుతారనీ, సీ్త్రలపై అత్యాచారాలు చేస్తారనీ, ఇలాంటి చిత్రహింసల వార్తలు ఎన్నో విన్నాం, చదివాం.
   ‘మేము వాళ్ళకి ఏ గాయాలూ చెయ్యలేదు. మా తుపాకులు చూసి వాళ్ళు పరిగెత్తిపోతూ పడిపోతే ఆ విధంగా ఆ గాయా లు తగిలాయేమో! మేము బుద్ధిగా తుపాకులు పేల్చాం, అంతే’ అని పోలీసు సంఘం, తన ఉత్తమత్వాన్ని చెప్పుకుంది.
   ఆ ఉత్తమత్వం మీద నా ప్రశ్న: వాళ్ళు మీకు దొరికితే, వాళ్ళని నేరస్తులని మీరు నమ్మితే, అలా దొరికిన వాళ్ళని చంపేసే హక్కు వుందా మీకు? మీరు, చట్టాల ప్రకారం నడుస్తారేమో కదా! వాళ్ళని కోర్టులో పెట్టాలి. కోర్టే విచారించి, వాళ్ళ నేరాలు అంత పెద్దవి అయితే, కోర్టే మరణ శిక్షలు వేస్తుంది. మీరే ఎందుకు చంపాలి? పరిగెత్తి పోయే వాళ్ళని పట్టుకోవాలి గానీ, వాళ్ళు మీ మీదకి రాకుండా పరిగెత్తి పోతోంటే, వాళ్ళని ఎందుకు చంపాలి?
   ‘నక్సలైట్లు పోలీసుల్ని చంపడం లేదా’ అంటారు మీరు. వాళ్ళ దగ్గిరికి మీరే వెళ్తున్నారు. వాళ్ళు మీ దగ్గిరికి రావడం లేదు. మీరు, వాళ్ళని చంపడానికే వెళ్తున్నారు కాబట్టే, వాళ్ళు మిమ్మల్ని చంపుతున్నారు. వాళ్ళు, ఆదివాసులకు ఏదో చెప్పుకుంటున్నారు. అలాగే మీరు కూడా ఆదివాసులకు మీ పాఠాలు మీరు చెప్పుకోండి. అలాగాక వాళ్ళని చంపడానికి వెళ్తేనే కదా, మీరు వాళ్ళకి దొరికేది? ఆ మందు పాతర్లూ, వాళ్ళ ఆయుధాలూ, మీకు తగిలేది?

   ఆ హత్యలైన దేహాలు రెండూ ఛిద్రమై వున్నాయని పేపర్లూ రాశాయి టీవీలూ చెప్పాయి. కానీ, పోలీసు సంఘం, ‘డాక్టర్ల రిపోర్టు వినరా మీరు’ అంటోంది. ఆ రిపోర్టు ఏం చెప్పింది? ‘శరీరాలకు తుపాకీ గుళ్ళు తగలడం ద్వారా మరణించారు’ అని చెప్పింది. ఆ ముక్క చెప్పడానికి డాక్టర్లు కావాలా? డాక్టర్లు చెప్పకుండా అది అలా జరుగుతుందని ప్రజలకు తెలీదా? ఆ శరీరాల మీద ఇంకా ఎటువంటి చేష్టలైనా జరిగాయో లేదో డాక్టర్లు చెప్పాలి. ఆ మాట ఎత్తకపోతే, ఆ రిపోర్టు దండగ.

   మావోయిస్టులు, అమాయక యువతీ యువకుల్ని ఇళ్ళ నించి దూరం చేసి విప్లవం పేరుతో అడవుల్లోకి లాగుతున్నారని పోలీసు సంఘం అంటోంది. అడవుల్లోకి పోయిన వాళ్ళ మీద పోలీసు తుపాకీ కాల్పులు లేకపోతే, వాళ్ళు చెయ్యాలనుకున్నదేదో చేసి, తప్పకుండా ఇళ్ళకి తిరిగి వస్తారు. పోలీసులు వాళ్ళ దగ్గిరికి పోయి తుపాకులు పేలిస్తేనే వాళ్ళు తిరిగి ఇళ్ళకు రాలేరు.
   ‘కమ్యూనిస్టులు అడవుల్లో వుండి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ సమ సమాజాన్ని ఎలా సాధిస్తారు?’ అని ఆశ్చర్యపడుతోంది పోలీసు సంఘం. మరి, అలాగాక, సమ సమాజాన్ని ఎలా సాధించాలో మీరే వాళ్ళకి చెప్పండీ! వాళ్ళకి కావలసింది, సమ సమాజం. దానికి మార్గం మీరు చెపితే, వాళ్ళు తప్పకుండా వింటారు.
   ‘ప్రజలు తమ నిరసనలు తెల్పడానికి ప్రజాస్వామ్యంలో అనేక మార్గాలు వుండగా, ఆయుధాల్ని పట్టే హింసా మార్గం ఎందుకు? ప్రభుత్వం, గాంధీ మార్గంలో, అహింసాయుతంగా పేదల అవసరాలు తీరుస్తుంది’ అంటోంది పోలీసు సంఘం.
   ‘ప్రజాస్వామ్యం’ అని పోలీసులు చెప్పేది, భూస్వాములూ పెట్టుబడిదారులూ, వాళ్ళ దోపిడీలు వాళ్ళు చెయ్యడానికి కావలసిన చట్టాలతో నిండినదే. చేతుల్లో తుపాకులతో నించునే పోలీసు అధికారుల నోట, అహింసా సూక్తి! ముందు, మీ తుపాకులు కింద పెట్టండి! ప్రభుత్వానిది అహింసా సూక్తే అయితే, దానికి కుప్ప తెప్పల ఆయుధాలెందుకు వున్నాయి? ఆ ఆయుధాలతో వున్న ప్రభుత్వమే హింసావాది! విప్లవకారులు పట్టే ఆయుధాలు హింస కాదు. అది, వారికి, హింస నించి రక్షించే ఆత్మరక్షణ!
   ‘ప్రజాస్వామ్యం’లో, ప్రజలు తమ నిరసనలు తెల్పుకోడానికి అనేక మార్గాలా? అంధులూ, అంగవైకల్యాలతో నడవలేని వారూ, అంగన్‌వాడీ వర్కర్లూ, ఏదో చిన్న ధర్నా చేస్తే, వారి మీద కూడా లాఠీలూ, తూటాలూ, ఆడిన సందర్భాలే ప్రతీసారీ! నిరసనలు తెలిపే అనేక మార్గాలా!
   పోలీసు అధికారులూ! మీరు మీ చేతుల నిండా తుపాకీ గుళ్ళు పెట్టుకుని, ఎదటి వాళ్ళకి అహింసా సూత్రాలు చెపుతున్నారు! మీరు, ప్రభుత్వంలో, ఆస్తిపరుల ఆస్తుల్ని రక్షించి, పేదల్ని చంపుళ్ళు చేసే జీతాల వుద్యోగులు, ఉరులు తీసే ఉద్యోగుల్లాగ! అసలు, ఈ పేదా – ధనికా తేడాలు ఎందుకు వున్నాయో, చంపుళ్ళ వుద్యోగులు ఎవరి కోసం అవసర మవుతున్నారో, మీకు తెలిసినట్టు లేదు.
   భూస్వాముల ఆస్తిగా వున్న భూమి, వాళ్ళ శ్రమలతో వచ్చిం ది కాదనీ పెట్టుబడిదారుల ఉత్పత్తి సాధనాలు, వాళ్ళ శ్రమలతో తయారయ్యేవి కావనీ ఎన్నెన్నో వింతలు తెలుసుకోండి!
   ప్రభుత్వం, తన ఆయుధాల్ని కింద పెడితే విప్లవకారులు అడవుల్లో ఎందుకు వుంటారు? మానవులందరూ కలిసి సమ సమాజాన్ని నిర్మించుకునే చర్చల్లో మునిగి వుంటారు.
   -రంగనాయకమ్మ

 16. Delhi Subrahmanyam says:

  అరణ్యకృష్ణ గారూ హెచ్‌ఆర్‌కే గారి స్పందనకు మీ విమర్శ సరిగ్గా ఉంది. వారిని ఇవ్వాళ విమర్శించిన వారే ఇంతకుముందు రంగనాయకమ్మ కుట్ర ఆరోపణ సంధర్భం లో వారు ఆంధ్రజ్యోతి లో అర్ధరహితం గా వ్యాసానికి జేజేలు పలికినప్పుడు సరిగ్గానే ఉంది. ఇప్పుడు శృతి, సాగర్ల హత్య మీద వారు రాసిన చండాలానికి (ఇంకో మాట తట్ట లేదు) స్పందించి అది తప్పు అని రాస్తే పాపం చాలా బాధగా ఉంది వారికి.

  వారు మొన్న 30 న జరిగిన ఛలో అసెంబ్లి ఆందోళనకి .”దీన్ని ధిక్కరించడానికి ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు తెలుగు సమాజం మీద వేసిన ఇంపాక్ట్ అత్యల్పం” అని రాశారు. ఆ రోజు మొత్తం హ్య్దరబడు పోలీసుల మయమయిపోయింది. అవి అన్నీ టీవిల లో చూపించారు. అలాగే వివిధ జిల్లాల నుంచి వస్తున్న కొన్ని వేల మందిని అరెస్టు చేశారు. ఆయన విమర్శకి ఇవన్నీ అడ్డు కాబట్టి పాపమాయిన ఇవి చూడలేదు.

 17. వనజ తాతినేని says:

  ఆలోచింపజేసే వ్యాసం . ధన్యవాదాలండీ కల్యాణి గారు .

 18. kurmanath says:

  “”ఆ రచయిత మాటలతో తమ విబేధమేమిటో చెప్పి వూరుకోరు. రచయిత అనని మాటలెన్నో కలిపి, ఆ పైన ఆ రచయితకు లేని వర్గ స్వభావం తదితర గుణాల్ని అంటగట్టి ఎకసెక్కాలాడుకుంటారు.
  ఇదేమి జర్నలిజం? ఇదేమి ప్రజాస్వామ్యం?”
  జర్నలిజం గురించి, ప్రజాస్వామ్యం గురించి హెచ్చార్కె గారు ఇక్కడ (అంటే ఇప్పటి ఎన్కౌంటర్ల చర్చల సందర్భంలో) ప్రస్తావించడం చాలా గొప్పగా వుంది. వర్గ స్వభావం తదితర గుణాలు అంటగడుతున్నారని వాపోతున్నారు. మరి తనకు భిన్నమైన స్వరం వినిపిస్తున్న వాళ్ళను స్వార్ధపరులు, బ్రామ్మలు, పాములు, మత్తెక్కిస్తున్నవారు అని ప్రత్యెక గుణాలని అంటగట్టడం ఏ విధమైన ప్రజాస్వామ్యం, ఏ విధమైన జర్నలిజం?
  ఇక్కడి చర్చను మరో చోటికి (ఆంధ్రజ్యోతికి, ఫేస్ బుక్ కి ) తీసుకెళ్ళింది ఎవరు? ప్రజా ఉద్యమాల్ని నమ్మే వాళ్ళని, advocates గా ఉండటాన్ని, ఎలిజీస్ రాసిన వాళ్ళని వ్యంగ్యం చేసింది ఎవరు?
  ఇక చలో అసెంబ్లీ మీద చేసిన విమర్శ: అది చేసిన ప్రభావం ఎంత వుందో, ఎంత లేదో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో, ఆరోజు వున్న ప్రజలకు తెలుసు. పత్రికలు చూసిన వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే, పత్రికలు ఆరోజు సంఘటనలని కవర్ చెయ్యదలచుకోలేదు కాబట్టి. పదివేల మంది అరెస్ట్ అయ్యారు. ఓ ప్రజాస్వామిక డిమాండ్ కోసం వాళ్ళు ఆరోజు వీధి పోరాటం చెయ్యదలచుకుంటే ప్రభుత్వం పోలీసులు జరగనివ్వలేదు.
  PS : హెచ్చార్కె గారూ వ్యంగ్యం రాయడం, వ్యంగ్యం చెయ్యడం మీ ఒక్కరికే చేతనయిన విద్య కాదు. Not just your prerogative.

 19. అవి నావి కావు అని స్పష్టం గా తెలియడానికే వాక్యాలను quotes లో చూపించి రాసేది, అవి ఎవరివో ఉటంకించమంటే – తప్పకుండా ….మరేం అభ్యంతరం లేదు!
  >>పాముల పుట్ట లోనికి పంపించి, వాళ్లు పాములు కరిచి చనిపోతే,
  ఆ దుఃఖం చూపించి మరి కొందరినీ పుట్ట లోకి పంపించే…<>ఉల్లిగడ్డల ధరలు గిట్టక రైతుల ఆత్మహత్యలు<> ఉల్లిగడ్డల ధరలు అందుకోలేక కన్సూమర్ల కష్టాలు<>కానీ రైతుల ఆత్మ హత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యలు, ఆసుపత్రుల్లో పసిపాపల మరణాలు …ఇలాంటి ఎన్నో హత్యలు<> “1. భూస్వాముల్నివ్యక్తులిగా నిర్మూలిస్తే, భూస్వామ్య విధానం పోతుందని భ్రమింపజేసే వర్గశత్రునిర్మూలనా కార్యక్రమం…
  2. సాహితీ, సాంస్కృతిక విప్లవకర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి తోడ్పడే బదులు, సాంస్కృతిక రంగాన్ని వొదిలి విప్లవరాజకీయాల్లో పాల్గొనడాన్నే ప్రధాన కర్తవ్యం గా భావించడం… ”<< ఇది రంగనాయకమ్మ గారి మానవసమాజం పుస్తకం లో పేజి 270 నుండి.

 20. >కానీ రైతుల ఆత్మ హత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యలు, ఆసుపత్రుల్లో పసిపాపల మరణాలు …ఇలాంటి ఎన్నో హత్యలు>పాముల పుట్ట లోనికి పంపించి, వాళ్లు పాములు కరిచి చనిపోతే,
  ఆ దుఃఖం చూపించి మరి కొందరినీ పుట్ట లోకి పంపించే…ఉల్లిగడ్డల ధరలు గిట్టక రైతుల ఆత్మహత్యలు ఉల్లిగడ్డల ధరలు అందుకోలేక కన్సూమర్ల కష్టాలు< హెచ్చార్కె గారి write అప్ నుండి ఉటంకిఛినవి. ఇది కాక వారి విమర్శ లో నేను జవాబివ్వదగినది ఏదైనా ఉందా అని చూస్తే నాకేం కనపడలేదు.

 21. >>పాముల పుట్ట లోనికి పంపించి, వాళ్లు పాములు కరిచి చనిపోతే,
  ఆ దుఃఖం చూపించి మరి కొందరినీ పుట్ట లోకి పంపించే…ఉల్లిగడ్డల ధరలు గిట్టక రైతుల ఆత్మహత్యలు ఉల్లిగడ్డల ధరలు అందుకోలేక కన్సూమర్ల కష్టాలు< హెచ్చార్కె గారి write అప్ నుండి ఉటంకిఛినవి. ఇది కాక వారి విమర్శ లో నేను జవాబివ్వదగినది ఏదైనా ఉందా అని చూస్తే నాకేం కనపడలేదు.

 22. >కానీ రైతుల ఆత్మ హత్యలు, రోడ్డు యాక్సిడెంట్లు, కాలేజీల్లో పిల్లల ఆత్మహత్యలు, ఆసుపత్రుల్లో పసిపాపల మరణాలు …ఇలాంటి ఎన్నో హత్యలు- ఇది రమా సుందరి గారి వాక్యం

 23. ఒక వ్యక్తిని పట్టుకొని ఇంతమంది మాటల దాడి చేస్తున్నారంటే అనుమానాలు కలుగుతున్నాయి.

  “విజయం సుదూరంగానైనా కనిపించని మార్గంలోకి యువకులు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ విషయంపై సమాజం పునరాలోచించుకోవాలి” అని హెచ్చార్కె లేవనెత్తిన పాయింటుకు ఇంతవరకూ ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. వెటకారాలు, ఎకసెక్కాలు, తిట్లు శాపనార్ధాలతోనే వాదనలు చేస్తున్నారు.

  ఎందుకంటే ఆయన లేవనెత్తిన అంశం సామాన్యమైనది కాదు. చాలా మంది అస్థిత్వాన్ని ప్రశ్నించేది. ప్రయోజనాల్ని దెబ్బతీసేది. అందుకనే ఇంతగా దాడి జరుగుతుందనిపిస్తోంది.

  అదీ కాక ఒక సీమాంద్రకు చెందిన వ్యక్తిని పట్టుకొని ఇలా కారక్టర్ అస్సాసినేషన్ చేయటం కూడా నాకు మరో కోణంలో కూడా కన్పిస్తోంది.

 24. p v vijay kumar says:

  ఓ ! ఇంత గొడవ జరుగుతుందా ?! :)
  ఇక్కడందరూ ‘ బక్రీ ‘ ఈద్ బా జరుపుకుంటున్నారు….. :)

 25. Narendra Mohan says:

  చర్చను ఇంత గందరగోళంగానడపొచా ? కేవలం sentiments, నైతిక సమర్ధన ష్టాయీలో మిగిలితే సాధించేది ఏమి లేదు ? దాదాపు 50 సంవత్సరాల ఆచరణ సాధించింది ఏమిటి ? మారుమూల అడవిలో ఒక సమాంతర ప్రభుత్వం ? అది నగరాలను చుట్టుముట్టేది ఎన్నడు ? కనీసం చంద్రపూర్లో అలంటి ప్రభుత్వాన్ని ఊహించగలరా ? ఇక సాయుధ బలం , ప్రచార సాధనాలను, ఆర్ధిక బలం, కేంద్రంగా ఉన్న పట్టణాలు ఈ సాయుధ శ్రేణుల దాడులకు కూలిపోతాయ ?

 26. ​ఈ​ వాదనంతా పరికిస్తే – విభిన్న సిద్ధాంతాల, మార్గాల వాదనలా కనిపించడం లేదు. ఆ చనిపోయిన యువత గురించి మేమెక్కువ బాధపడుతున్నామంటే మేమెక్కువ బాధపడుతున్నాం అనిన్నూ, నీది దొంగ బాధంటే నీది దొంగ బాధ అంటున్నూ కొట్టుకుంటున్నట్టుగా ఉంది.

  ఎవరు ఎవరిని అవమానపరుస్తున్నారమ్మా! చిన్నపిల్లల్ని అడవుల్లోకి పంపుతున్నారని బాధపడితే, అది వాళ్ళ చావుల్ని (పోనీ “త్యాగాల్ని”) అవమానించడం అవుతోందా? మొన్న చనిపోయిన అబ్బాయికి పంతొమ్మిదేళ్ళంటే అతను చిన్నపిల్లాడు కాదూ? ఆ వయసులో పెళ్ళాడతానంటేనే నీకంత వయసు లేదూ అంటామే. అలాంటి వాడిని చావు వైపు తరిమి, మళ్లా అతనికి దాని తీవ్రత ఏమిటో తెలుసుకునే పరిణతి ఉన్నదీ అని వాదిస్తున్నారా. బహుశా ఈ వాదనలు చేసేవాళ్ళంతా తాము ఆ వయసులో అతి బీభత్స పరిణతితో అయినా అలరారుతూ ఉండాలి, లేదంటే ఆ వయసుకి ఎప్పుడూ రాకుండానే తిన్నగా ఎగిరి ఇక్కడకొచ్చి పడి ఉండాలి. అదీ కాదంటే – ఏళ్ళు వచ్చినా జీవితపు విలువ ఎరుగని బాధ్యతారహితులు అయి ఉండాలి. నాకు ఎందుకనో మరి ఈ చివరిదే సరి అయినది అనిపిస్తున్నాది.

  తెలంగాణ ఉద్యమ విజయం రాజకీయ ఫలితం కాదనీ, తాము వీధుల్లోనా యూనివర్శిటీ గోడల మధ్యనా చేసిన పోరాట ఫలితమే ననీ యువత నమ్ముతోంది. బహుశా ఆ విజయపు ప్రేరణతోనే దానికి కొనసాగింపుగానే అడవుల వైపు వెళుతున్నారు. కానీ, వీధుల్లో పోలీసుల అనుమతితో టీవీ కెమెరాల ముందు చేసే పోరాటం వేరనీ, అడవుల్లో కాలిబాటైనా లేని దారుల్లో ఆకాశం మీది రాబందులు తప్ప ప్రేక్షకులు లేని మసక చీకట్లలో జరిగే పోరాటం వేరనీ వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఈ లామకానూ సుందరయ్య విజ్ఞానకేంద్రాల్ని పట్టుకు వ్రేలాడే మేధావులకు ఉండాల్నా వద్దా?

  అలాగాక……….అది అనవసరమనీ, ఏ విప్లవమైనా త్యాగాల వల్లనే సాధ్యమవుతుందనీ, నిజానికి ఈ యువకుల చావు మరికొందరు ఇటు రావటాన్ని సూచిస్తోందనీ, అంటే విప్లవం బలపడుతోందనీ, కాబట్టి మరికొంతమంది ఈ మార్గానికి వచ్చినా ప్రోత్సహించి అడవుల్లోకి పంపించటమే సరైనదనీ మీరు నమ్ముతుంటే… అలా​ పంపే​ ముందు ఒక్కటి చేద్దాం. కనీసం ఇప్పటి చావుల పట్ల ప్రభుత్వం నుంచి ఎకౌంటబిలిటీని పిండగలమేమో​ చూద్దాం​. అది మొన్నటి ఎన్‌కౌంటర్లలో చేయలేకపోయారు. ఈసారైనా అది చేయలేకపోతే, అప్పుడైనా కాస్త ఆలోచించండి. ప్రభుత్వపు నిశ్శబ్దానికి అర్థం​ ఏమిటి? చంపుకుంటూ పోతామనే కదా. మరి​ అప్పుడు ఈ పద్ధతిని పునరాలోచించుకోవటం మంచిది కదా. ​

  మళ్ళీ వీళ్ళే చాలామంది “సాయుధ పోరాటంలో కొన్ని లోపాలున్న మాట నిజం”, “మన కార్యాచరణను కొంత పునర్విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం” అంటూ మాట్లాడుతున్నారు. అయ్యా… మీ “కొన్ని”లకూ, “కొంత”లకూ పూర్తి ప్రాణాలు పణంగా పెట్టడం సబబేనా? ఆ కొంత పునర్విమర్శ ఏదో చేసుకుని, ఆ కొన్ని లోపాలూ ఏవో చక్కదిద్దుకుని, ఆ తర్వాతే మీ దారిలో వెళ్ళవచ్చు కదా. ఎందుకంటే మీకున్న ఈ సందిగ్ధావస్థ మీ శత్రువైన “రాజ్యా”నికి లేదు. అది చంపాలని నిశ్చయం చేసుకుంది. అడవిలో కనపడితే చంపుతుంది. ప్రస్తుత “రాజ్యం” అయిన ఈ తెలంగాణ ప్రభుత్వానికి మీరు వీధి పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా తెలుసు, ఆ పోరాటాల్ని తమ రాజకీయ లబ్దికి ఎలా వాడుకోవాలో.

  ఏ విప్లవమైనా త్యాగాలు లేకుండా రాదు నిజమే. కానీ విప్లవం సాగుతున్న దిశ పట్లే మనకు అనుమానాలు ఉన్నప్పుడు ఈ త్యాగాలు ఏ రకముగా విప్లవానికి దోహదిస్తున్నట్టూ? ఆ త్యాగాలు వృథా అవుతున్నాయి అని ఒకరు ఎత్తి చూపిస్తే అవి చీకటి గదుల్లోంచి చేస్తున్న చీమల వాదనలా? మీవైపు విషాదమే సరి అనీ, మరొక వైపు నుంచి వ్యక్తమవుతున్న బాధ కేవలం మొసలికన్నీరనీ వెటకారాలు చేస్తారా? వారి వ్యక్తిత్వాల్నీ, దృక్పథాల్నీ, వేరే అసోసియేషన్లనీ, పుట్టుకతో వచ్చిన కులాల్నీ, ప్రాంతీయతలనీ పట్టుకులాగి ఎండగడతారా? నా గమనింపులో అర్థమవుతోన్నది ఏమంటే… ​ఇదంతా​ చేస్స్తున్నది కూడా ఒకటే బాచు. ఒక అడవి రాముడు, ఒక వరాహ నాథుడూ, ఒక బొంబాయి సుబ్రమణ్యం…… వీళ్ళతో ఇంకొంతమంది సుందరులూ, కళ్యాణులూ. వీళ్ళు ఏం రాసి అచ్చోసి వదిలినా ‘సారంగ’ సై అని అచ్చువేసుకుంటుంది కాబోలు.

  కానీ వీళ్ళ ఈ భావోద్వేగ ప్రకటనలకన్నా, మిథ్యా శత్రువుల వైపు ఎక్కుపెట్టిన శుష్క వెటకారాల కన్నా, కవిత్వం అనేది ఇసుమంత లేకపోయినా కేవలం ఎమోషనల్ ర్హెటోరిక్ ని పంక్తులుగా విరగ్గొట్టి రాస్తున్న కవిత “ల్లాంటి” రాతల కన్నా…… వీటన్నింటికన్నా కూడా, కాస్త పరిశీలనా శక్తి ఉన్నవారి చేత, ఆవేశానికతీతంగా వివేచించగల వారి చేత అడిగి వ్యాసాలు రాయించుకుని అవి ప్రచురిస్తే ఇంకా మంచిది కదా? పత్రిక ఏ పక్షపాతమ్ లేకుండా అన్ని అభిప్రాయాల్నీ సమాదరించడం మంచిదే. కానీ చర్చ అసలు విషయాన్ని వదిలేసి అహాల రాపిడిగా మారి పక్కదారి పడుతున్నప్పుడు ఆ పత్రికే ముందుకు పూనుకుని ఆ పని చేయగల సమర్థుల్ని సమీకరించడం కూడా చాల ముఖ్యము.

  ​మధ్యతరగతి మీద సెటైర్లు బానే ఉన్నాయి. అవును, జన్మనిచ్చిన పాపానికి పిల్లల్ని అడవులకు తోలేయకుండా, వాళ్ళకు ఆ బుద్ధి వచ్చేవరకూ రెక్కల కింద దాచుకోవడం మధ్యతరగతి పాపం అయితే, అది దోషియే అనుకోవాలి. అసలు ఇంకోటి మర్చిపోయారు, ఆర్థిక వత్యాసాన్ని బట్టి చేసే నిర్వచనాన్ని పక్కన పెట్టి స్వభావపరమైన నిర్వచనానికి సిద్ధపడితే, అసలు తెలుగుజాతి స్వభావమే మధ్యతరగతి స్వభావం. నిజానికి ఇక్కడ ఇవన్నీ రాస్తున్నవారూ ఆ స్వభావానికి అతీతులేమీ కారు. వచ్చిన ఆవేశాన్ని రాతల్లో చప్పున బాగానే చల్లార్చేసుకుంటారు. లేదంటే జీన్సు ఫాంటుల మీద​ కాటన్​ లాల్చీలు వేసుకొని,​ మొండేనికడ్డంగా స్ట్రాపు బాగుల్ని తగిలించుకుని , అసెంబ్లీ ముందు నినాదాలు చేస్తారు, అరెస్టుల్నీ తమ ఆవేశపూరితమైన ముఖాల్నీ సెల్ఫీలు తీసుకుని అప్ డేట్ చేస్తారు. అంతే, అక్కడితో ఖతం. ఎప్పటికో మళ్ళీ ఇంకో ఎన్‌కౌంటర్ అయ్యేదాకా.

  ముందు వెళ్తున్న దారి పట్ల అనుమానాలున్నపుడు అవి సవరించుకోండి. అవతల ఉన్నవి ప్రాణాలు. తర్వాత ఈ కబుర్లు చెప్పండి. ఇందాక​ ఎవరో అమ్మాయి మంచి సలహా ఇచ్చింది. అసలు ఈ ఊసుపోక రాసుకునే కవిత్వాలే ఉద్యమాలకు అడ్డొస్తున్నాయట. మరింకనేం, మీకు పుణ్యం ఉంటుంది, ఈలోగా ​వాటినvaట్లా విడిచిపెట్టండి.

 27. ‘ఇంకొంతమంది సుందరులూ, కళ్యాణులూ’… వద్దండి, సరే, అసలు వద్దు.
  ‘ఆ పని చేయగల సమర్థుల్ని సమీకరించడం’ – తప్పకుండా చేద్దాం! మీరడిగిన అన్ని specifications తోనూ ఒక అద్భుతమైన వస్తువు మా శక్తి కొలదీ ఇదుగో, ఈ రోజు పొద్దుటే కంటి ముందుకు వచ్చింది, వెంటనే మీకు సమర్పిస్తున్నాం.
  ‘వీటన్నింటికన్నా కూడా,కాస్త పరిశీలనా శక్తి ఉన్నవారి చేత, ఆవేశానికతీతంగా వివేచించగల వారి చేత అడిగి వ్యాసాలు’- ఎన్నో వద్దు, ఈ ఒక్కటీ పరిశీలించండి,

  “ప్రభుత్వం, తన ఆయుధాల్ని కింద పెడితే విప్లవకారులు అడవుల్లో ఎందుకు వుంటారు? మానవులందరూ కలిసి సమ సమాజాన్ని నిర్మించుకునే చర్చల్లో మునిగి వుంటారు.”-రంగనాయకమ్మ(మొత్తం వ్యాసం కొద్దిగా పైకి వెళ్తే … DR. RAJENDRA PRASAD CHIMATA. OCTOBER 2, 2015 AT 11:54 PM
  Updated :03-10-2015 00:47:11 ) తుపాకుల అహింసావాదం ఉంది చూడండి

  • మిత్రులకు:

   అభిప్రాయ స్వేచ్చని గౌరవించడం సారంగకి ఇష్టమైన ఆదర్శం. అభిప్రాయ స్వేచ్చ అనేది గొప్ప ఆదర్శమే కాని, నిజానికి ఆ స్వేచ్చలోని బాధ్యత తెలిసిన వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని సారంగకి మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. అసలు విషయం పక్కదోవన పట్టి, మరీ వ్యక్తిగత దూషణలు, కుల/మత పరమైన వ్యాఖ్యలు శృతి మించడంతో ఈ చర్చని ఇంతటితో ముగిస్తున్నాం.

 28. 1. ‘సారంగ’లో చర్చను అలా వూరికే ముగించి వుంటే బాగుండేది. ముగింపు వ్యాఖ్యలో నాతో సహా చర్చలో పాల్గొన్న వారి ప్రవర్తనను తప్పు పట్టడం అన్యాయం. ఇది జర్నలిస్టుగా అనుభవజ్ఞుడైన మితృడు అఫ్సర్ చెయ్యాల్సిన పని కాదు. ఇంతకు ముందు విక్టర్ విజయకుమార్, ఇప్పుడు కల్యాణి వ్యాసాల్లో….. పేరు పేర్కొనకుండా రిడిక్యూల్ చేయబడింది నేను. అది నేను గాక మరెవరైనా అనారోగ్య సంప్రదాయమే. జబ్బే. దాని గురించి ఒక్క మాటైనా లేకుండా, ఆ పైన ఏవో దోషాలు ఆరోపించి ముగించడం బాగోలేదు.
  2. మహాభారతం చదువుతున్నప్పుడు పది లేక ఇరవై పద్యాలకు ఒక్క సారైనా వచ్చే మాట….. గోవులను, బ్రాహ్మణులను పూజించడం ఉత్తమ గుణం అనేది. నేను సంస్కత భారతం చదువుకోలేదు, ఈ చర్చలో వున్న వారూ చదువుకోలేదనుకుంటాను. అందువల్ల, స్పెసిఫిక్ గా అనుకోక పోయినా మనం మాట్లాడుతున్నది ‘శ్రీమదాంధ్ర మహా భారతం’ గురించే. దాని రచయితలు నాకు తెలిసినంత వరకు బ్రాహ్మణులే. మీకు తెలిసిన విషయం వేరుగా వుంటే చెప్పండి. విప్లవోద్యమంలో సాంస్కృతిక, సాహిత్య రంగాల వంటి సేఫ్ జోన్ లోనే పని చేయాలని కొందరు తమను తాము నియమించుకోడం…. … భారత రచయితలుగా బ్రాహ్మణులు బ్రాహ్మణులను పూజించాలని రాయడం వంటిదేననీ… ఈ రెండింటికీ లెజిటిమసీ (న్యాయ బద్ధత) లేదని నేను చెప్పాను. నేను కులాల్ని కించ పరిచానని, లేని దాన్ని వున్నట్టు చూపించడం అన్యాయం. మనుషులు ఒక కులంలో, ఒక జెండర్ లో పుట్టడం యాక్సిడెంటు. బ్రాహ్మణ కులంలో పుట్టిన వారిలో ఎందరరో నాకు గొప్ప స్నేహితులున్నారు. అలాంటి వారు నన్ను అపార్థం చేసుకోవద్దనే కోరికతో ఇది కాస్త వివరంగా రాశాను.

మీ మాటలు

*