కవిత్వం : వెంటాడే జ్ఞాపకం

 

         -ఎ . కె . ప్రభాకర్

~

జీవితపు రహదారుల్లో

వేలాడుతున్న నాకు

ఇంత నమ్మకాన్ని పోయండి

దోసిళ్ళతో నన్ను నేను నింపుకొంటాను (శూన్య దేహం )

 జీవితం మన చేతుల్లో వుండదు. వేళ్ళ సందుల్లోంచి యెప్పుడు జారిపోయిందో తెలీదు. స్థలకాలాలు మన అధీనంలో వుండవు. కాళ్ళ కింది నేల  కాపాడుకోవాల్సిన కాలాలు మన ప్రమేయం లేకుండానే మాయమైపోతాయి. మన కలల్నీ కన్నీళ్ళనీ యెవడో శాసిస్తుంటాడు. మనం మనలా కాకుండా యెవరిలానో బతుకుతూ అదే నిజమనే భ్రమలో సైతం వుండిపోతాం. ముఖానికి తొడుక్కొన్న మాస్క్ లే అసలనుకొని మురిసిపోతాం మురిపింప జేస్తాం – నమ్ముతాం నమ్మబలుకుతాం. సమస్త జీవన పార్శ్వాలూ పరాయీకరణకు గురైనపుడు యెక్కడో వొక కవిత్వం తునక వొక వాక్యం వొక భావ శకలం వొక పద చిత్రం గుండెని తాకి నిద్రిస్తోన్న జ్ఞాపకాల తేనె తుట్టెని కదుపుతుంది. వుద్వేగాల్తో మనసు అనేక ప్రకంపనాలకు గురౌతుంది. కాళ్ళు తడబడతాయి. పట్టు దొరకదు.  కోల్పోయింది తెలుస్తుంది. పొందాల్సింది అందదు. ఆసరా కోసం దిక్కులు చూస్తాం. వొక ఆప్త వాక్యం కోసం అలమటిస్తాం.

అప్పుడు – సరిగ్గా అప్పుడే కవిత్వమో కథో భుజం కాస్తుంది. వొక ఆలంబనై నిలుస్తుంది – అండనిస్తుంది – వోదార్పౌతుంది. ‘వెలుపలి అరణ్యాల్నీ లోపలి మృగాల్నీ చీల్చుకుంటూ వెళ్లి అదృశ్యమైన మనిషిని ఆకులమధ్య ప్రత్యక్షం’ గావిస్తుంది.  అలా మిగలాల్సిన మనిషిని మన ముందు ఆవిష్కరింపజేసేదే బండ్ల మాధవరావు ‘అనుపమ’.

‘అనుపమ ఒక జ్ఞాపకాల చెట్టు’. జ్ఞాపకాలు యెప్పుడూ వుద్వేగ భరితంగనే వుంటాయి. సంఘటనలు కావొచ్చు వ్యక్తులు కావొచ్చు స్థలాలు కావొచ్చు వుద్వేగాలతో ముడివడి వున్నప్పుడే బలగా స్థిరంగా వుంటాయి. ప్రేమ వియోగం దు:ఖం క్రోధం భయం యేదో వొక సహజాతం తీవ్ర ప్రకంపనాలకు లోనైనపుడు అందుకు కారణమైన దృశ్యాదృశ్య శక్తులూ వాటి ప్రమేయాలు కూడా మనిషిని వెంటాడుతూనే వుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి వైయక్తికాలుగా గోచరిస్తాయి కానీ నిజానికి అవి సామాజికాలు. బతుకు దారిలో వేలాడే ప్రయాణికులకు దిక్సూచికలు. గత వర్తమానాల మధ్య కట్టిన వారధులు.

ఎవర్ని పలకరించినా

గతం నెమరువేస్తాడు

అప్రస్తుతం కాని

వర్తమానాన్నే

ప్రస్తుతించాలిపుడు…

వర్తమానంలోనే

బతుకును వెదుక్కోవాలిపుడు

కొన్ని సమష్టి నిన్నల పునాదుల మీదే

నేను ఈ రోజు నిలబడ్డాను

…   …   …   …

ఇప్పుడు ఇక్కడ ఇలా బతకడం

అన్నికాలాలకూ విస్తరించడమే

మొలకెత్తితేనే కదా విస్తరించేది… ( ఇప్పుడే , ఇక్కడే )

 

తలపోతల తవ్విపోత వలపోత  దానికదే కవిత్వం కాదు; కవి ప్రాపంచిక దృక్పథం దానిలో ప్రతిఫలించాలి. అది  పాఠకుడికి అందాలి. అలా అందినపుడు మాత్రమే కవిత్వ  ప్రయోజనం నెరవేరుతుంది.

మాగిన జ్ఞాపకాల్ని

ఒకటొకటిగా పేర్చుకొంటుంటే

కడుపులో దేవుతున్న బాధ ( మిత్తవ)

ఆ బాధ వొక్కరిదే కాదు; అందరిదీ. అందరిదీ చేయమే కవి కర్తవ్యం. సాహిత్యంలో ప్రతి అనుభూతి వ్యక్తీకరణకీ రాజకీయ ప్రమేయాల్ని ఆపాదించడం తప్పని కేవల కవిత్వ వాదులు అభిప్రాయపడినప్పటికీ స్వీయానుభవాల పరంపరని సామాజికం చేయడంలోనే – వొంటరి వెతల్ని  సామూహిక సంవేదనలుగా సొంత సంతోషాల్ని మంది ఆనందాలుగా   తర్జుమా చేయడంలోనే – వాటికొక తాత్త్వికతని సాధించడంలోనే కవి ప్రతిభ బయట పడుతుంది. అటువంటి ప్రతిభ మాధవరావులో నిండుగా వుందని అతని తొలి మలి కవిత్వ సంపుటులు (చెమట చిత్తడి నేల – 1998,స్పర్శ – 2005) నిరూపించినప్పటికీ అనుపమకి వచ్చేసరికి అది మరింత పదునెక్కింది. అందుకే వూరి చెరువూ , అందులో దిసెమొలతో యీతలూ , జలగలూ , పుస్తకాల్లో దాచుకొనే నెమలీకలూ వంటి  సాధారణమైన బాల్యస్మృతుల్ని మాయమైపోతున్న మనిషికీ మనిషితనానికీ అన్వయించి అసాధారణత్వాన్ని సాధించగలిగాడు.

167fa204c80c3f82202da95bc1c1f63c

ఊరి చెరువులో

దిగంబరంగా ఈదుతున్నప్పుడు

పట్టుకున్న జలగల్లో ఒకటైనవాడు

పుస్తకాల్లో దాచుకొనే నెమలీక కోసం

నెమళ్ళనే వేటాడిన వాడు

దొరక్కపోడు                (అనుపమ)

జీవిక కోసం ఉపాధిని వెతుక్కొంటూ నగరానికి చేరినా పల్లె యీ కవికి నీడలా వెన్నంటే వుంటుంది. ఊరూ వూళ్ళో నడయాడిన స్థలాలూ వూరి పరిసరాలూ చేనూ తోటా కొండా గుట్టా వ్యక్తులూ వారితో స్నేహ బాంధవ్యాలూ వ్యక్తులతో పంచుకొన్న ఆత్మీయానుబంధాలూ  గుండెనిండా కమ్ముకొని వుంటాయి. దూరమైన మూలాలపట్ల వీడని మమకారం – తన నేలకి దూరమైనందుకు పరివేదన –  నగరంలో కొత్త వాతాతావరణంలో యిమడలేనితనం – యాంత్రికంగా తయారైన జీవనవిధానంపట్ల అసహనం …  యివన్నీ వుక్కిరిబిక్కిరి చేస్తాయి. యిదంతా రూరల్ డయాస్పోరా. వొక వొదలని మానేద. కోల్పోయినదాన్ని పొందాలనే వెతుకులాట. వెనక్కి తిరిగి చూసుకొన్నప్పుడు చేజేతులా పోగొట్టుకొన్నాననే అపరాధభావన కూడా ఏదో మూల వెంటాడుతూనే వుంటుంది.

నిజానికి అక్కడ వూరు కూడా వూరిలా లేదు. సామాజికంగానే కాదు భౌగోళికంగా కూడా యెన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. అతని జ్ఞాపకాల్లోని వూరికీ కొత్త చలనాలకి వేదికైన వూరికీ పొంతనలేదు. స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి. వూళ్ళో మానవ సంబంధాల్లో కొత్త సంక్లిష్టతలు చోటుచేసుకోన్నాయి. మనుషులమధ్య కనపడని కొత్త కంచెలు లేచాయి.  పంట పొలాలు రియల్ ఎస్టేటు వ్యాపార దురాక్రమణకి గురౌతాయి. మింగుడుపడని యీ మార్పులు పరాయీకరణ కుట్రలు తెలీని ఆవేదనకి కారణమౌతాయి. నిరసన గళం విచ్చుకొంటుంది.

అనాది ఆక్రమణల్లోనే

నా దేహాన్ని కోల్పోతున్నాను…

నా శరీరం లోంచి

నన్ను తరిమేసి వేలం వేస్తున్నాడు

అన్నం ముద్ద లాగేసుకొని

అక్కడే ఇనుప తోటలు పెంచుతున్నాడు…

నగరం నడిబొడ్డు

నా ఊరి పోలిమేరల దాకా నడిచి వచ్చింది ( దురాక్రమణ )

 

బండ్ల 2006లో రాసిన యీ కవితకి యిప్పుడు ప్రాసంగికత మరింతగా పెరిగింది. ఇందులో పేర్కొన్న ‘నగరం’ ముందు ‘రాజధాని’ విశేషణం తగిలించుకోవాలి. దురాక్రమణ అర్థం మార్చుకొని సమీకరణ కాదంటే  సేకరణ అవుతుంది. చట్టబద్ధమౌతుంది. ఇప్పుడు వూరే మాయమైపోతోంది.  ‘దస్త్రాలు చుట్టేసుకొన్న రాజధాని /నా గుమ్మంలో అడుగుపెట్టింది’ . 2015 నాటికి చివరి పంక్తులు మారిపోయాయి. ప్రైవేటు వ్యక్తుల చేతికి స్వాదుఫలాల్ని పాలకులే కోసి యిస్తారు. దాని పేరు అభివృద్ధి.

విచ్చలవిడి నగరీకరణని మాధవ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నాడు. నగరం మనుషుల మధ్య అభేద్యమైన గోడలు కడుతుంది. స్వార్థం కాంక్రీట్ బలంగా స్తంభాలై లేస్తుంది. మానవారణ్యంలో పులులు పంజాలు విసురుతూ తిరుగాడుతుంటాయి.  సమూహంలో కూడా కవి వొంటరౌతాడు.

కొత్తగా మొలుస్తున్న నగరంలో

హఠాత్తుగా అంతెత్తున లేచిన

ఆకాశ హర్మ్యాలలోంచి

జన సంచారం లేని

ఇళ్ళ గుట్టల మధ్య

నేనొక్కడిని నిలిచి

విచ్చుకుంటున్న చేతుల కోసం

అన్వేషిస్తున్నాను… ( వలస పక్షుల గూళ్ళు )

అంటూ మానవీయ స్పర్శకోసం అలమటిస్తాడు. వొక స్నేహ హస్తం కోసం దిక్కులు చూస్తాడు.  లోపలి గదుల్లో మూసి వుంచిన అరల్లోని రహస్యాలు విప్పి చెప్పి కలబోసుకొనే పరిమళం కోసం వెతుకుతాడు. మాటల నిచ్చెనలతో మాటల వంతెనలతో  మాటల ప్రవాహాలతో మనుషులు కలవడాన్ని గురించి కలగంటాడు. కానీ నగరం అన్నిటినీ ధ్వంసం చేసుకొంటూ పెరుగుతుంది. అక్కడ  పచ్చి కట్టే పామై కరవడం చూసి విస్తుపోతాడు. ఇటుకమీద ఇటుక పేర్చినవాడే స్వార్థ ఆయుధాలతో నిలువునా కూల్చేయడంతో విభ్రాంతుడౌతాడు. నిర్మాణానికి రాళ్ళందించిన చేతులే పునాదుల్తో సహా పెళ్లగించివేయడాన్ని జీర్ణం చేసుకోలేడు. సుందర నిర్మాణ ఆకృతులు శిధిలాలై కూలిపోతే దిక్కు తోచక కుంగిపోతాడు.

మూడు కాలాల్లోనూ రక్షించాల్సిన ఇళ్లు

రూపాయల మారకాలయ్యాయి ( నగరం )

అని వాపోతాడు. అయితే అతను కేవలం తన దు:ఖాన్నే మనకు పంచడం లేదు. నిస్సహాయంగా నిరాశలో కూరుకుపోవడం లేదు. మనిషి కూలిన శిధిలాల్లోంచి లేచి నిలబడి శిఖరాల వైపు చేసే ప్రయాణాల గురించిన ఆశని ప్రోదిచేసుకొంటున్నాడు. రహదారుల్లో సేద తీర్చే చెలమలున్నాయని భరోసానిస్తున్నాడు. శోకాన్ని క్రోధంగా మల్చుకొని జరుగుతున్న విధ్వంసానికి జవాబివ్వడానికి బిగించిన పిడికిలౌతున్నాడు. నేలని ఉత్పత్తికి దూరంచేసి విపణి వస్తువుగా మార్చిన వాళ్లకి వ్యతిరేకంగా గొంతు విప్పిన ప్రజా శ్రేణులకి దన్నుగా తన కవిత్వాన్ని నిలబెడుతున్నాడు. దానికొక సామూహిక స్వరాన్నిస్తున్నాడు. పరాధీనపు సంకెళ్ళని తెంచే పనిముట్టుగా కవిత్వానికి సానబెడుతున్నాడు.

 

ఇప్పుడు

మట్టిలో గింజలకు బదులు

రాళ్ళు నాటుతున్నారు

పాతిన రాళ్ళ మధ్య నేల

తల్లి బందీ అవుతుంది

పరధీనమైన దానిని

స్వాధీనం చేసుకోడానికే

పిడికిళ్ళు బిగుస్తున్నాయి

చేతులు కలుస్తున్నాయి

గొంతులు కలిసి లేస్తున్నాయి. ( వామన పాదం )

ఇల్లూ వాకిలీ ముంగిలీ లోగిలీ వూరూ వూరి పొలిమేరా నగరం దాని ఔటర్ రింగురోడ్డూ దేశం దేశ సరిహద్దూ సర్వం అన్యాక్రాంతమయ్యే ప్రక్రియకు వొక ప్రణాళిక వుందనీ స్థానిక వ్యాపార ఆధిపత్య రాజకీయాలకీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శక్తులకీ విడదీయరాని సంబంధం వుందనీ బండ్లకి స్పష్టంగా తెలుసు. ఆ యెరుకలో నుంచే

ఎవడో

మట్టిని పణంగా పెట్టి

రాజ్యాల్ని కొంటున్నాడు

విశాల సామ్రాజ్యాల మీద కాలుమోపుతున్నాడు

ఆకలిని అవమానిస్తున్నాడు ( దు:ఖ ధూళి )

వంటి కవిత వెలువడింది. మాధవరావులో వున్న యీ రాజకీయ పార్శ్వాన్ని చూడగల్గినప్పుడే అనుపమలోని కవిత్వం యెంత స్థానీయమో అంత సార్వత్రికమనీ యెంత వ్యక్తిగతమో అంత సార్వజనీనమనీ అర్థం చేసుకోగలం. అస్తిత్వవాద సాహిత్యం వైయక్తిక తీరాల అంచుల్లోకి పయనించి అక్కడే విలవిల్లాడుతోన్న సందర్భంలో వ్యక్తి భూమిక మీద నిలబడి సమాజాన్ని ఆవాహన చేసుకోగలిగిన అవగాహన లేకుంటే అనుపమ కేవలం జ్ఞాపకాల చెట్టుగా మిగిలిపోతుంది. చెట్టు ఆకుల్నీ కొమ్మల్నీ మాత్రమే కాకుండా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయిన వేళ్ళని కూడా చూడగల్గినపుడే సారాన్ని గ్రహించగలం.

‘చేలను పంటలతోనూ

నేలను మనుషులతోనూ

నింపాలనుకొన్న నాకు

ఇప్పుడు వస్తువులెదురౌతున్నాయి

నా దేహాన్ని ఖాళీ చేసుకొని నన్ను

తిరిగి తిరిగి

వస్తువులతో నింపుకొంటున్నాను’ (శూన్య దేహం)

అన్నప్పటి పరాయీకరణ  ఖాళీతనపు సిండ్రోంతో  సహానుభూతిని పొందగలం. వ్యక్తులు అంగడి సరుకులౌతోన్న విషాద సందర్భాన్ని చీదరించుకోగలం. ‘నింపడం ఎప్పుడూ మరొక ఖాళీకి చిహ్నమే’ అన్న తాత్వికధారలో తడవగలం. అప్పుడు మాత్రమే వొక నేను అనేక నేనుల సమాహారం అవుతుంది. వైయక్తిక సామాజిక స్తరాల  మధ్య యేక కాలంలో ముందుకీ వెనక్కీ షటిల్ చేసే పుష్ అండ్ పుల్ టెక్నిక్ ద్వారా మాధవరావు తన కవిత్వంలో విమర్శనాత్మక సామాజిక వాస్తవికతని సాధించగలిగాడు. ‘అనంతారం’ దానికి పాదయిన అంశాన్ని దేవీప్రియ నిర్దిష్టంగా యెత్తిచూపినప్పటికీ అనంతారం ప్రపంచ పటంలో చిన్న చుక్కే అయినప్పటికీ అది విస్తృతార్థంలో అభివృద్ధి పరుగులో ముక్కలైన మూడో ప్రపంచమౌతుంది.

ముక్కలై రోడ్లు రోడ్లుగా విస్తరిస్తున్న  ‘ముచ్చబోడు’ కొండ మీది ‘జీవన ఉనికి కంకర యంత్రాల శబ్దాల మధ్య రాతి దుమ్ములో కలిసిపోయింది’ అని ఆర్తితో అన్నప్పుడు కేవల పర్యావరణ విధ్వంసాన్ని మాత్రమే మాధవరావు దృశ్యమానం చేయడం లేదు. అభివృద్ధి పేర్న జరిగే  విధ్వంసంలోని అమానవీయ కోణాన్ని సైతం ఆవిష్కరిస్తున్నాడు. ఇది యిలా జరక్కూడదని యెలుగెత్తి అరుస్తున్నాడు. ప్రకృతిలో అనివార్యంగా భాగమైన మనిషినీ మనిషితనాన్నీ కాపాడుకుందాం అని భుజమ్మీద చెయ్యేసి నచ్చచెబుతున్నాడు. మనిషిని యాంకరింగ్ పాయింట్ గా స్వీకరించిన అతని ప్రాపంచిక దృక్పథం  మో , నాగిరెడ్డి , చిన్నమ్మల మీద రాసిన ఎలిజీల్లో ఆర్ద్రంగా యెదను తాకుతుంది. ఆకురాలిన అడవి , ఆత్మహత్యల ఋతువు , కొరివికారం , దు:ఖధూళి , అంతరించిపోతున్న జాతి , బులెట్ , లేపనం  వంటి కవితల్లో అది  దూరాల్ని అధిగమించడానికి విశాలమైన రెక్కలు విప్పి  ఆకాశంలో యెగిరే పక్షవుతుంది. ఆ పక్షి ఫీనిక్స్. చావుల్నీ శిశిరాల్నీ దు:ఖాల్నీ కన్నీళ్ళనీ సమస్త పరాజయాల్నీ జయించే శక్తినిస్తుంది.

మొత్తంగా అనుపమలో ఉద్వేగ భరితమైన స్వీయ జ్ఞాపకాల్ని నెపం చేసుకొని బండ్ల మాధవ రావు దేన్ని గురించి మాట్టాడుతున్నాడో తెలుస్తుంది కదా! మనిషి గురించి మాట్టాడుతున్నాడు. మనిషి లోపలా బయటా జరుగుతున్న విధ్వంసం గురించి మాట్టాడుతున్నాడు. అందుకు కారణమౌతోన్న రాజకీయ శక్తుల గురించి హెచ్చరిస్తోన్నాడు. బహిరంగంగా విచారణ చేసి ఆ శక్తులకి బుద్ధి చెప్పమంటున్నాడు. అందుకు అవసరమైన ఆయుధాలు సమకూర్చుకోమంటున్నాడు. దిగుళ్ళకి వీడ్కోలు పల్కమంటున్నాడు.

బతకడాన్ని గూర్చి ప్రశ్నించినప్పుడల్లా

నాలుగు అన్నం ముద్దల్ని వాడు

అద్దంలో మన ముందుంచుతాడు

ఆయుధాలు మత్తుగా పడివున్నంతకాలం

కుప్పపోసిన జీవితం

కదలదు

మెదలదు.(అకాలం)

అని మేల్కొల్పు గీతం పాడుతున్నాడు. ప్రశాంతంగా కనిపించే యీ కవిలో యింత అగ్గి రాజుకొంటుందా అని మనం ఆశ్చర్యపోతాం. కేవలం జ్ఞాపకాల్లా కనిపించే కవితల వెనక యింత దు:ఖం వుందా యింత క్రోధం వుందా అని ఆలోచనలో పడతాం. మనం కూడా క్రియాశీలులం కావడానికి సమాయత్తమౌతాం. కవీ కవిత్వం కోరుకొనేది అదే కదా!

‘అక్షరమే దిక్కులు పిక్కటిల్లేలా పేలే ఆయుధం

పదం సమూహాన్ని చైతన్యపరిచే పాశుపతం

కవిత్వం అనన్య సాహసోపేత విన్యాసం

ఎప్పటికైనా సమస్త ఆయుధాల్నీ జయించే అంతిమ ఆయుధం

అక్షరమే’

ఆ అక్షరం పేరు అనుపమ. చదివాకా మనమే అక్షరం కాక తప్పదు.

*

 

 

మీ మాటలు

 1. చందు - తులసి says:

  ‘అక్షరమే దిక్కులు పిక్కటిల్లేలా పేలే ఆయుధం

  పదం సమూహాన్ని చైతన్యపరిచే పాశుపతం

  కవిత్వం అనన్య సాహసోపేత విన్యాసం

  ఎప్పటికైనా సమస్త ఆయుధాల్నీ జయించే అంతిమ ఆయుధం అక్షరమే’…..
  ఎఫెక్టివ్ కవిత్వం.
  మంచి విశ్లేషణ.

 2. డా .రాధేయ says:

  అనుపమ కవిత్వం పై చక్కటి విశ్లేషణ .సమూహంలో,నగరంలో ఒంటరవతున్నకవి దీనావస్తను కవి ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు .కవికీ .సమీక్షకునికీ
  నా అభినందనలు .

 3. mercy margaret says:

  అనుపమ కవిత్వం పై చక్కటి విశ్లేషణ చేశారు ప్రభాకర్ గారు .. ఇప్పటికే ఒక సారి చదివున్నాను పుస్తకం మరో సారి చదవమని ప్రోత్సహిస్తుంది మీ విశ్లేషణ .. thank you

 4. వనజ తాతినేని says:

  చాలా బావుందండి ! మీ విశ్లేషణ చూసాక మళ్ళీ ఇంకోసారి చదవాలనిపిస్తుంది . ధన్యవాదాలు .

 5. Veldandi Sridhar says:

  అక్షరం అంతరంగాన్ని తోడి పాఠకుడిని సాయుధం చేసే విశ్లేషణ. ఊరు, మనిషి పరాయీకరణ చెందుతున్న తీరును చాలా బలంగా చెప్పిన అనుపమను చాలా హృద్యంగా ఆవిష్కరించారు. ఒక కవిని, అతని అంతరంగ ఆవేదనను చూపెట్టడానికి అంతే పోయిటిక్ వాక్యం కావాలేమో! అందుకే విశ్లేషణ కూడా చాలా పోయిెటిక్ గా సాగింది. అనుపమను ఇప్పుడే చేతిలోకి తీసుకోవాలనిపిస్తోంది… డా. ఎ. కే. ప్రభాకర్ గారికి, కవి బండ్ల మాధవరావు గారికి అభినందనలు..

 6. ఎ.కె.ప్రభాకర్ says:

  థాంక్యూ శ్రీధర్!

మీ మాటలు

*