ఫియర్‌లెస్

-అరుణ్‌సాగర్
 ~
arunఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. ఇది సినిమా కాదు. సంభాషణల రచయిత రాసే రొటీను మాటా కాదు. ఎందుకో భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే. అక్కడ గాఢ కల్బూరిక్ ఆమ్‌లవాయుగోళాలైనా ఇక్కడ ద్రోహముద్రలు వేసే తూటాలైనా. భయమైతున్నది ప్రభూ మాట్లాడాలంటే, నడవాలంటే, తల ఎత్తాలంటే, నినదించాలంటే. వాగర్ధాం వివ సంతృప్తం, వాగార్ధ ప్రతిపత్తయే. ప్రతిపత్తి. అభివ్యక్తి. భిన్నాభిప్రాయమిప్పుడు ప్రమాదసంకేతం. సర్వము నీవే ప్రభూ. సర్వాధికారము నీదే. వాక్కు. మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది ఇపుడేమున్నది. చెట్టుకు వేలాడే శవాలు తప్ప నినదించు శరీరమొక్కటైనను ఎక్కడ మొలకెత్తును. ఎక్కడ మేల్కాంచును. బాంచెనని కాల్మొక్కెటోళ్లము. వేడుకొనగలము. నినుజేరి నీ దివ్యసముఖమున కష్టమూ సుఖమూ చెప్పుకుని విప్పుకుని. వినరా దొరా కనీసము. దేవా నిను ప్రార్ధించనీ, ఒక ప్లకార్డు, ఒక విన్నపము, కేవల అభిప్రాయమైనను. ఒక్క గుంజుడు గుంజి, డిసియం వ్యాన్‌లో విసిరేసి, గోషామహల్ స్టేషన్ కాంపౌండ్‌వాల్‌లో పడేస్తే….భక్తా! నిన్నేరా తుకారాం. మైడియర్ రెబల్‌స్టార్. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకున్నావా. లక్కీ ఫెలో యు ఆర్! మా దేవుడిని నిందాస్తోత్రమైననూ చేయలేని పిరికిపందలము మేము. కలికాలము. ప్రభూ, భయమైతున్నది ప్రభూ. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్లు మూసుకుని ఈ మూకలను `కానిండుమని ఆనతినిస్తివా`. నిటారుగా నడవాలన్నా గొంతు విప్పాలన్నా పాటలు పాడాలన్నా భయమైతున్నది. ఈ చిరుగు చొక్కాలకు ఒక నిరసన బ్యాడ్జ్ తగిలించుకుని నలుగురం పోగయి ఒక్క బక్క కర్రకు గుడ్డజెండా కట్టుకుని చౌరస్తాలో నిలబడాలంటే భయమైతున్నది. ఎంత భయమైతున్నదంటే మేమంటే మాకే భయమైతున్నది. భయపడి భయపడి చచ్చిపోతమేమోనన్నంత భయమైపోతున్నది. భయాన్ని జయించలేక శునకమరణము పాలగుదుమేమోనని భయమైతున్నది. గుండెల్లో దాచిపెట్టుకున్న జెండాలు జఠరికలూ కర్ణికలను పేల్చి పైకి లేచి ఆకాశాన్ని మట్టుపెడతయేమోనని భయము నిలువెల్లా వణికిస్తున్నది. గొంతులు పోయి, వెన్నులు విరిగి, మెదళ్లు బూజుపట్టి కాలానికి కలానికి కాగితానికి తెలియకుండా మరుగైపోయే బోడిబతుకు బస్టాండగునేమోనని భయకంపితమవుతున్నది. కానీ ప్రభూ, కొన్ని భయములు జయించని ఎడల మరణమునూ జయించలేమేమోననే శంక కూడా పీడిస్తున్నది. ఇక అందుకే ఆ పరమేశ్వరుని ప్రార్ధించుచున్నాము. లార్డ్ శివా అండ్ మదర్ పార్వతి, హూ ఆర్ ఇన్‌సెపరబుల్ యాజ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్ టూ గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్. మాకు వాక్కు నిమ్ము. ఉక్కుముక్కల వంటి వాక్యముల నిమ్ము. వాగర్ధం వివ సంతృప్తం! నీ భయం కంటే మా భయం పెద్దదయితున్నది ప్రభూ. నోరు పడిపోతే, కాలూచేయి పడిపోయి పక్షవాతమొస్తే. పగోడికి కూడా వద్దు. ఆయినెవరో అన్నడు కదా ‘నీ అభిప్రాయంతోని నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కాపాడడానికి నేను ప్రాణాన్నయినా ఒదులుకుంటా’నని! నీవంటే భయమైతుల్లే ప్రభూ. ఒక్కసారి ఆలోచించుకుంటే మా బలహీనత చూసే మాకు మిక్కిలి భయమైతున్నది. ఏమండీ నాకెందుకో భయంగా ఉందండీ. లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. వాక్యాలకూ వాక్యాలకూ మధ్య `ఎంటర్` కొట్టకపోయినంత మాత్రాన అది కవిత్వం కాకపోదురొరేయ్. భయం ఈజ్ నాట్ ఎటర్నల్. మాకు తెలుసు యు ఆర్ స్టేట్. యూ డోంట్ టాలరేట్. ఇక్కడ విషయమేమంటే: వియ్ ఆర్ పీపుల్. వియ్ ద పీపుల్. మైండిట్ మాణిక్యం!
*
Painting: Akbar

మీ మాటలు

 1. సాయి పద్మ says:

  హ్మ్మ్.. అంత ఘోరం.. నిజంగానే భయమవుతోంది.. మురికివాగుల్లో కొట్టుకుపోయే పిల్లలూ.. రాజ్యపు పందికొక్కులు తినేస్తున్న శిశువులూ , కనబడని జైళ్ళల్లో మగ్గుతున్న జర్నలిస్టులూ.. దెయ్యాలు వల్లిస్తున్న వక్రీకరించిన వేదాలూ.. నిజంగా భయమవుతోంది..

 2. చందు - తులసి says:

  అవును సార్ భయమవుతున్నది…
  శునకమరణం పాలవుతామని…..
  కానీ శునకం కూడా ప్రతిఘటించునన్న సంగతి మరచి….
  గుంట నక్కల్లా గోతుల్లో దాచుకుని బతకాల్సి వస్తుందోనని ……..భయం భయం…..

 3. బ్రెయిన్ డెడ్ says:

  యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు. భయమైపోతున్నది. రాజ్యము బలమూ మదమూ నీవే నీవే. మరియూ మతమూ నీవే. టూ బీ వెరీ క్లియర్ బోత్ రెండూ నీవే.
  ఈ ఒక్క లైన్ చాలు కదూ మన బ్రతుకు కూపాలలో జీవితం ఎంత మిగిలిఉందొ చెప్పడానికి .
  భయపీడిత ప్రాణాల మధ్య మీగుండెల్లో మిగిలిఉన్న ఆ కాస్త ధైర్యాన్ని మాకందించినందుకు ఒకపెద్ద హార్టీ హాగ్ Arun Sagar జీ . ఈవాక్యాలు చదివాకా ఇంకో వందమంది కవులు వంద సార్లు సొసైటీ ని మోసం చేసినా సౌ ఖూన్ మాఫ్ చేసేంత ఉపశమనం .

 4. “లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” – ఇది రాయకుండా ముగిస్తారేమో నని భయపడి చచ్చాను, అమ్మయ్య, భయం దెయ్యం వదిలించే మార్గం చూపించారు,

 5. శ్రీనివాసుగద్దపాటి says:

  భయమైతున్నది ప్రభూ. యోనుల్లో బాయొనెట్లూ చితికి రక్తం చిమ్ముతున్న పురుషాంగాలు. హత శరీరాలపై హెచ్చరికలు స్రవిస్తున్న క్రూరఘోరకర్కశగాయాలు.

 6. Aranya Krishna says:

  ఆది యందు కవి వాక్యము భయప్రేలాపితమైనుండెను. అంతమునందు కవి వాక్కు ఫిరంగిధ్వానము వలే పేలుచున్నది. “లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” ఇప్పుడు భయపడ్డ మార్జాలం నేత్రాలు యుద్ధ టాంకుల వలే మెరయుచున్నవి. అసహ్యకరమైన శతృవా! ఏదో ఒకనాటికి నీకు శునకమరణము తప్పదని ఈనాటి ఘటనలు ఏదో ఒక మేరకు హామీ ఇచ్చుచున్నవిలే.

 7. bhayapadaalannadi vaari aim kaavatchu.. kaani bhayam taatkaalikam and vjm saswatam

 8. ఇన్ కంటిన్యుయేషన్ భయమేస్తోంది బతుకును చించేస్తున్న శునక రాజములను చొచ్చొ అనడానిక్కూడా భయమేస్తున్నది ఇది నరకానికి దారి అని తెలిసీ బయటికి చెప్పడానికి బయమేస్తున్నది రాజ్యం హస్తినలోనే వుంటుందనే భైరవ రాగాన్ని కాదనాలనినచో రోడ్డు మీద దాని చొక్కా పట్టి నిలదీయాలనినచో చాల భయమేస్తున్నది నాకేవేవో ఎరలేసే టీవీ ఛానల్లో రాజ్యముందేమో కుంచెం మేజా బల్ల కింద చీకట్లో చూస్తాన్రా ఫ్యాషన్ నిపుణ ధురీణా అని అడగడానికి అడిగి బల్ల మీద బట్ట కాస్త పైకెత్తి అక్కడి నెత్తుటి మరకలు ఏ నాగరికతా దురాక్రమిత అడవులవో అడివి జనులవోనని అనుమానించడానికి కూడా చాలంజాల భయమేస్తున్నది మేల్కొల్పడం కష్టమే నిదుర నటనా సమర్థులను పసి గట్టి ఎదిరిందాలంటే భయం లేనోళ్ల మధ్య చేరిన వున్నోడి పార్శ్వాలను పసి గట్టినా నా లేనోడి పిరికితనాన్ని దాటి హెచ్చరించాలంటే చాల చాల చాలంజాల భయమేస్తున్నది ఎన్నో సీసా ఎన్నో పెగ్గులో రాలి పడిన నిష్క్రయాశ్రుకణమిది యని నన్ను నేను అడగడానికి భయమేస్తున్నది వదలండిరా పిల్లల్ని వాళ్లేం చేయాలో వాళ్లను యోచించుకోనివ్వండని అటు ఇటు ఒకే సారి చెప్పడానికి చెప్పి చెప్పిన చోట నిలబడడానికి భయంకరమైన భయమేస్తున్నది భయమేస్తున్నది ఇళ్ల నిండా వీదులు నిండా వార్తల నిండా వార్తా చిత్రాల నిండా కొట్టివేయబడుతున్న చెట్ల కొమ్మల నిండా మనిషిని కాపాడాల్సిన అక్షరాల నిండా పరుచుకుంటున్న హిపోక్రిటికల్ ఎగ్జోర్ఠేషన్లంటే ఇవాళెందుకో భూగోళమంత భయమేస్తోంది

 9. అరుణ్, చాలా గొప్పగా వుంది, ఈ ఆగ్రహ ప్రకటన.
  భయమో, ఖేదమో, నిరాశో కలగడం లేదిది చదువుతుంటే. ఈ వ్యాక్యాలు భయం గురించి కాదని, భయపడడం గురించి కాదని తెలుస్తూనే వుంది. మా అందరి, మన అందరి pent up క్రోధాల గురించి.
  వేల తల్లుల, తండ్రుల, తమ్ముళ్ళ, చెల్లెళ్ల, అక్కల హృదయాలను రగులుస్తున్న, మెదళ్ళను తొలుస్తున్న శ్రుతీ, సాగర్ల రక్తమోడుతున్న చిత్తరువులు వెంటాడుతున్నాయి.

 10. మా యొక్క వాక్కు. మా యొక్క హక్కు. ఆదియందు ఉండెడిదది-వాక్కు నుండి వాడును పుట్టియున్నాడు. వాక్కు లేక వాడు లేడు. వాడొక వదరు బోతని తెలిసీ, ఆ అమ్బోతుని ఊల్లొకి విడిచి, అది కుమ్ముతోందని ఈ రోజు వగచీ-ననుబ్రోవ రావే శ్రీ రఘువర! వద్దొద్దు మల్ల రాజకీయం-పరమేశ్వరా అనే అను. కొండల్లో, మంచు బండల్లో తిరిగేటి వాడు – వీడింకా రాజకీయ రంగ ప్రవేశం చెయ్యలే! బిడ్డలు గల్లోడు. తప్పక వింటాడు. వింటాడా? సంతాన భక్షక కధలు తీసేసి – నువ్వు మా తండ్రివి మేము మీ బిడ్డలమని దేహిమ్చే చేతుల ఆపేసి – ! ఇంతకీ బలయుతులకు దుర్భలులకు బలమెవ్వడు?!

 11. . లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది. …a uni laagi okkati peekadam nerchukovaali vidhigaa nerpinchaali.

 12. మనకాలం వీరులు రశ్యా నవల మల్లి చదువలనిపిస్తోంది

 13. Shivarathri Sudhakar says:

  ఆది యందు కవి వాక్యము భయప్రేలాపితమైనుండెను. అంతమునందు కవి వాక్కు ఫిరంగిధ్వానము వలే పేలుచున్నది. “లాగి ఒక్కటి పీకితే భయం దెయ్యం వదిలినట్టు వదుల్తది.. భయం ఈజ్ నాట్ ఎటర్నల్.” ఇప్పుడు భయపడ్డ మార్జాలం నేత్రాలు యుద్ధ టాంకుల వలే మెరయుచున్నవి. అసహ్యకరమైన శతృవా! ఏదో ఒకనాటికి నీకు శునకమరణము తప్పదని ఈనాటి ఘటనలు ఏదో ఒక మేరకు హామీ ఇచ్చుచున్నవిలే.

మీ మాటలు

*