నివేదన

mandira

-శ్రీకాంత్

అవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు – దారుల్లో వీధుల్లో ఎవరూ మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను వీధి మలుపు తిరగగానే, చేతులకీ నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు. నడుస్తూ నడుస్తూ తల ఎత్తితే, ఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి ఊస్తూ మూడు గుండీలు విప్పిన అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా ‘ఇస్కీ బెహెన్కి చోత్’, ‘మాధర్చోత్’ అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో గణగణగణమనే గంటలతో నుదుటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతనిని భయభ్రాంతుడని చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు.

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకుని, భార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా –

“వచ్చావా నాయనా – త్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు”

***

Painting: Mandira Bhaduri

మీ మాటలు

  1. దినదినం ఇవన్నీఅనుభవిస్తూ కూడా నీ sanity ని కాపాడుకువస్తున్నావా సోదరా, ఎలాగో మాకూ చెప్పు, నిజం గా పిచ్చెక్కి పోతుందేమో నని భయం వేస్తోంది

  2. చాలా బావుంది శ్రీకాంత్ గారూ,
    మైనారిటీల భయానికి అద్దం పట్టారు. ప్రతి సందూ రామమందిరమే కాదు, మసీదు, దర్గా, చర్చికూడా కావద్దని కోరుకుందాం. నిమజ్జనంలో ముఖ్యంగా హైదరాబాదులో సాధారణ ప్రయాణికుల కష్టాల గురించీ రాయాలి. పైన ఎవరో అన్నట్టు బక్క హిందువు భయం గురించీ రాయాలి. మొహర్రంలో పాతబస్తీలో హిందువుల భీతి గురించీ రాస్తే ఎవరికి అభ్యంతరం? మనం రాయం. ఎవరైనా రాస్తే గింజుకుచస్తాం.
    నేపాల్ సెక్యులర్ తీర్థం పుచ్చుకుంటే ఎందుకు అభ్యంతరం? అది ఏకైక హిందూ రాజ్యం అనే హోదా పోగొట్టుకుందని బెంగా? ఆ బెంగ అక్కర్లేదు మన లౌకిక భారతదేశం ఎలాగూ ప్రపంచంలో ఏకైక, అతి పెద్ద, అప్రకటిత హిందూ రాజ్యమే కదా. నేపాల్ లో రెండుకోట్ల మందే హిందువులు. మన దేశంలో 96 కోట్ల మంది కనుక 43 హిందూ నేపాల్ లు ఉన్నాయని సంబరపడకుండా దిగులెందుకు?

  3. లేని భయాలు సృష్టిస్తేనే కదా మేధావులు సర్ వైవ్ అయ్యేది. వారి నుంచి ఇంతకకు మించి ఎమి ఆశిస్తాం?

  4. buchi reddy gangula says:

    అసలు ముస్లిమ్స్ అంటే పరాయి వాళ్ళు —అనే ఆలోచనే మన నుండి పోవాలి —

    గుళ్ళు ఎందుకు ????ఆకలి ని ఆదుకోండి

    ముస్లిమ్స్ రక్తపు రంగు పచ్చ ఉంటుందా ???అవయవాలు అన్ని ఒకటే కదా ???మతం –నమ్మకం స్వంత విషయాలు — జోక్యం దేనికి ??? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిపోయినా — యింకా మనలో — బూజు తొలిగి పోలేదు — మారేది ఎన్నడు ?? ఎప్పుడు ??
    ఎంతకాలం కులాన్ని — మతాన్ని రాజకియెం చేస్తాం ????
    భారతీయులు అందరు నా సహోదరులు అంటూ — బళ్ళల్లో pledge…. చదువుకొని ???
    భాగుంది శ్రీకాంత గారు –కాని ముగింపు తొందరగా ???
    ———————————————————————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  5. srinivas sathiraju says:

    ఎవరొ మిత్రులు చెపితె చదువుదామని వచ్చా!!! సాహిత్యం ఇంతలా దిగజారిపోవడం నిజంగా బాధాకరంగా ఉంది . ఒక మంచి సాహిత్యం కమ్మని కధలు కరువవ్వడం నిజంగా విచారకరమయిన విషయం ఇంకా సారంగధరని సాహిత్యానికి కాక వెర్రితలలు వేస్తున్న సమాజపు దర్పణం అంటా నికృస్టాపు రచనల కాల కూటం అని తీర్మానిస్తున్నా

Leave a Reply to srinivas sathiraju Cancel reply

*