ధనం లేని విటుడు

 

చింతామణి .. వేశ్య

శ్రీహరి .. ఆమె తల్లి

 

శ్రీహరి: నేను చెప్పే మాట చెవికి ఎక్కించుకోవేమిటి?

చింతా: ఏమాట?

శ్రీహరి: ఈ భవానీశంకరం గాణ్ణిక రావొద్దని చెప్పమన్నానా?

చింతా: అతనిదగ్గర అంత సొమ్ము లాగేసి వెంటనే పొమ్మని చెప్పలేకపోతున్నానమ్మా. అతను వచ్చిన నెలలోనే మాన్యాలు అమ్మించేశాను. నగలకని, బట్టలకని ఇల్లు అమ్మించేశాను. రోజువారీ ఖర్చులకని, హోటళ్ళకని చెప్పి పెళ్ళాం నగలు కర్పూరం చేయించాను. అన్ని వగలు చూపించి ఇప్పుడింతలోకే పొమ్మని ఎట్లా చెప్పేదమ్మా! అతను ఉస్సూరుమంటే అతని దగ్గర తీసుకున్న సొమ్ము మనకు దక్కుతుందా?

శ్రీహరి: ఇదిగో, ఈ శ్రీరంగనీతులే నిన్ను చెడగొడుతున్నాయి. నీకున్న అందచందాలకి, చదువుకి, తెలివితేటలకి ఈ ఒక్క లోటు లేకపోతే కోట్లు సంపాదించేదానివి. డబ్బున్నంతకాలం విటుణ్ణి కోరి నెత్తినెక్కించుకోవాలి. డబ్బు అయిపోగానే కుక్కను కొట్టినట్టు బయటికి కొట్టాలి.

చింతా: అమ్మా, నీకాలంలో నువ్వట్లాగే చేశావా?

శ్రీహరి: అనుమానమా? పరమ లోభి దగ్గర కూడా వందలు వేలు గుంజాను. పులివంటి వాళ్ళను కూడా కుక్కల్లాగా మార్చేసి వాకిట్లో కట్టేశాను. కోటీశ్వరుడైనా మన గుమ్మంలో కాలు పెట్టాడంటే పకీరుని చేసి వదిలాను. ఎంత పెద్ద ఆచారవంతుడి చేతనైనా ఎంగిలి తినిపించాను. డబ్బున్నంత వరకు ఎంత ప్రేమ కురిపించినా, వట్టి పోయిన వెంటనే మన్మధుడినైనా సరే, మెడ బట్టి బయటికి గెంటేశాను.

చింతా: నేను మాత్రం తీసిపోయిందేముంది? సరేగానమ్మా! నేను పెద్దయ్యేసరికి మన కొంపలో పెద్దమ్మ చిందేస్తోంది. సంపాదించినదంతా ఏం చేశావే?

శ్రీహరి: అదేనమ్మా నావల్ల జరిగిన పొరపాటు. ఒకసారి ఒక విటుడి దగ్గర డబ్బు లాగడం కోసం వాడికి తాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. వాడితో పాటు నేను కూడా తాగకపోతే ఒప్పు కొనేవాడు కాదు. వాడు వదిలాడు కానీ, తాగుడు వదల్లేదు. చివరకి సంపాదించిందంతా తాగుడికి ధార పొయ్యాలిసొచ్చింది.

చింతా: వయసులో ఎంత సంపాదించినా ముసలితనమొచ్చేసరికి కూడుగుడ్డలుండవని మన కులానికి శాపముందట. నిజమేనా?

శ్రీహరి: నిజమేగానీ, ఆ శాపమిప్పుడు అమల్లో లేదు. పూర్వం విటులు వయసుమళ్ళిన వేశ్యల్ని వాడిన పువ్వుల్ని చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు ఊరగాయ పెంకును చీకినట్టు చివరి దాకా వదలట్లేదు. అందువల్ల ఆ శాపానికి బలం తగ్గిపోయింది. అదిసరేగానీ, ఈ భవానీశంకరం గాడేమయ్యాడు?

చింతా: ఎవర్నో అప్పడిగాడట. వాళ్లీపూట తప్పకుండా ఇస్తామన్నారని వెళ్ళాడు.

శ్రీహరి: ఈ నగరంలో ఇంకా వీడికి అప్పిచ్చే వాడెవ్వడు? వట్టిది, నేన్నమ్మను. సెనగలు తిని చెయ్యి కడుక్కున్నట్టు ఇక వీణ్ణి సాతాళించి పంపెయ్యాల్సిందే! అయినా ఒక్కడితో ఇన్ని రోజులు సరస మేంటమ్మా? రోజుకొకడిని దివాలా తీయించి మరుసటి రోజు వేరే వాడికి అదే స్థానం యిచ్చి, నిన్నే ప్రేమిస్తున్నానని మరొకడికి చెప్పి ఇంకొకడికి వల పన్నగలిగిందే నెరజాణ. అలాంటి దానికే కులంలో కీర్తి. అంతేకాదు, వేశ్యకి వయసే ప్రాణం. వయసుముదిరి అందం తగ్గితే పీనుగును జూసినట్టు చూస్తారు. వయసుండగానే రెండు చేతులా సంపాదించుకోవాలి.

చింతా: ఈ చదువంతా నాకు చిన్నప్పుడే నూరి పోశావు గదమ్మా, ఇప్పుడు మళ్ళీ పారాయణ మొద లేశావెందుకు?

శ్రీహరి: ఎందుకంటే, నువ్వొట్టి వెర్రిబాగుల్దానివి కాబట్టి. నాకడుపున పుట్టినా నా గుణం ఒక్కటీ నీకు రాలేదు కాబట్టి. అందుకే నేను చచ్చేదాకా నీకోసం ఇట్లా రోజూ పాకులాడక తప్పదు. నా మాట విని వీడికింతటితో బుర్ర గోకుడు పెట్టి సాగనంపు. లేదా, నాకొదిలి పెట్టి నా తడాఖా చూడు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను.

చింతా: అమ్మా, నీశక్తి నాకు తెలియదా! నీకంత శ్రమ వద్దులే, నిదానంగా నేనే చెప్పి మాన్పిస్తాను.

*

 

మీ మాటలు

*