కొత్త అస్తిత్వాల వాయిస్ చైతన్య కథలు!

 

-కత్తి మహేష్ 

దృక్కోణాలు వాదాలుగా మారి, వాదాలు అస్తిత్వాలుగా ఎదిగి, అస్తిత్వవాదాలు దృక్పధాలుగా స్థిరపడుతున్నాయని కొందరు, డిఫ్యూజ్ అయ్యాయని మరికొందరు అనుకుంటున్న తరుణంలో, తెలుగు కథలో కొన్ని కొత్త గొంతుకలు వినిపిస్తున్నాయి. సామాజిక స్పృహ. అస్తిత్వాల చైతన్యం. ఉద్యమాల స్ఫూర్తితో పాటూ జీవితాన్ని నిశితంగా తరచిచూసే దృష్టితోపాటూ భావుకత తాలూకు ‘టింజ్ ‘ ని కోల్పోకుండా వాక్యాలతో అనుభవాలని, ఆలోచనలని, భావాలనీ కథలుగా విస్తరించి వినిపించే వాయిస్ చైతన్య పింగళిది.

“మనసులో వెన్నెల” తన మొదటి కథా సంకలనం. ఏడు కథల సమాహారం. తనమాటల్లోనే చెప్పాలంటే, ‘ఇంధ్రధనస్సులోని ఏడు రంగుల్లా’ ఏడు కథలు. అన్నీ స్త్రీల కథలే. ఒకటి స్త్రీ మనసుకలిగిన థర్డ్ జెండర్ కథ. ఆధునిక పట్టణాలనుంచీ, అధోలోకాల జీవితాలవరకూ. పల్లెల్లో రైతు కుటుంబాల కష్టాలనుంచీ కన్నతల్లి హృదయంవరకూ ఒక విస్తృతమైన రేంజ్ కలిగిన సంకలనం ఇది.

మార్పుకోసం ఉద్యమాలో, విప్లవాలో అవసరం లేదు. ఒక చిన్న నిరసన చర్య చాలు. సాంత్వన కలిగించే మాట చాలు. మద్దత్తు తెలిపే సూచన చాలు. నమ్మకం కలిగించే శరీర భాష చాలని చెప్పే కథ “ఆశ”. ఒక చిన్న నాటి ఙ్జాపకం రేకెత్తించిన ఆలోచనలు. అప్పట్లో అవగాహన లేక చెయ్యలేకపోయిన పనిని, అలాంటి మరో పరిస్థితికి స్పందించడం ద్వారా పరిహారంగా చెయ్యడం ఈ కథలోని మూలం. రిగ్రెట్ నుంచీ రిడమ్షన్ వరకూ జరిగే ఒక పర్సనల్ ఎమోషనల్ జర్నీకన్నా విప్లవం మరొకటి అవసరం లేదు. ముఖ్యంగా ముగింపువాక్యంలోని హోప్…ఈ కథకి ప్రాణవాయువు.

ఒక ఆత్మహత్య చేసుకున్న రైతు వితంతువు తన పిల్లల భవిష్యత్తుకోసం తీసుకునే నిర్ణయం కథ “గౌరవం”. రైతే రాజ్యానికి వెన్నెముక. అన్నదాత రైతన్న. రైతే రాజు లాంటి రొమాంటిసిజం వెనకున్న హార్డ్ కోర్ నిజాన్ని ఎత్తిచూపే కథ ఇది. కొడుకు రైతు కాకూడదనుకుని మనసారా కోరుకుని ప్రార్థించే రైతు ఒక నిజం. రైతు గొప్పతనం గురించి గ్లోరిఫైడ్ మాటలు చెబుతూ, రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా పట్టించుకోని సమాజంలో మనం భాగమవడమూ ఒక పచ్చి నిజం. ఈ నిజాల్ని అంతే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా చెబుతూనే ఒక షాకింగ్ ముగింపుతో మన చెంప చెళ్ళుమనిపించే కథ ఇది. కొసమెరుపుగా ఒక సెటైర్ చురుక్కుమనేలా తగిలించే కథ ఇది.

mahesh

కేవలం ఉదయిస్తున్న సూర్యుడిని చూడటానికి పొద్దున్నే లేచే భావుకత. మగ తోడు లేకున్నా జీవితంలో స్థిరత్వాన్ని నింపుకున్న వ్యక్తిత్వం. బలహీనమైనవాళ్ళకి ఇన్సెక్యూరిటీని, పరిచయమున్నవాళ్ళకు స్ఫూర్తిని కలిగించే జీవితం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి రేర్ స్త్రీ కథ “తనదే ఆకాశం ” ఈ సంకలనంలో ఇది నా ఫేవరెట్ కథ. ఫెమినిజం మీద అపోహలని థియరిటికల్ సమాధానంతో కాకుండా ఆచరణయోగ్యమైన చిట్కాగా మలిచిన తీరు ఈ కథలో ‘టేక్ హోం మెసేజ్’ లా అనిపిస్తుంది. ప్రేమ- ఆరాధనల్ని, ముద్దు లాంటి భౌతిక ప్రేమ చర్యల్ని సెక్సువల్ కోణం నుంచి మాత్రమే చూసేవాళ్ళకి మరో పార్శ్వాన్ని సేం సెక్స్ అభిమానపు ఎక్స్ ప్రెషన్ గా క్యాజువల్ గా రాయడం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది.

మతం మారినా కులం వీడని సమాజంలో, ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగున్నామని చెప్పుకునేవాళ్ళ రిగ్రెసివ్ మనస్తత్వాల కథ “నామాలు”.  ఒక దళిత స్త్రీ, శ్రీవైష్ణవ సాంప్రదాయం ఉన్న ఇంట్లో అనుభవించే వివక్ష, హింస ఈ కథ నేపధ్యం. ఒక స్త్రీగా, ఒక దళిత స్త్రీగా రెండురకాలుగానూ వివక్ష అనుభవించడం కథ విసృతిని పెంచగలిగిందిగానీ, ఘాఢతని కుదించిందనిపిస్తుంది. ఇంతవరకూ తెలుగు కథలో రాని ఒక కోణం, ఒక నేపధ్యం ఆవిష్కరించడం ఈ కథను ఇంపార్టెంట్ కథగా మిగులుస్తుంది.

పని ఒత్తిడి – కుటుంబ భారం రెండూ వర్కింగ్ ఉమన్ చేసే క్రిటికల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ కి రెండువైపులు. అలాంటి ఒక లేడీ లెక్కల టీచర్ సమస్యని, అందరికీ అర్థమయ్యేలా లెక్కల పజిల్స్ తో చెప్పే ప్రిన్సిపల్ కథ “జీవితపు లెక్కలు”. కథలోని పాత్రల్లాగే ఎటువెళుతోందో తెలీకుండా కథ మొదలైనా, చివరికి విషయం అర్థమయ్యి మనమూ ఎంపతీ చూపించడంతో కథ ఉద్దేశం నెరవేరుతుంది. కానీ, చాలా వరకు నీతి కథల్లొ చేసే ‘లాస్ట్ పేరా లెక్చర్” ఈ కథలోనూ కనిపించి కథ కాస్త చిన్నబుచ్చుతుంది.

chaitanya1

మెరిటల్ రేప్ మన సమాజంలో ఎంత సాధారణమో చెబుతూనే, ఎంత సీరియస్ విషయమో తెలియజెప్పే కథ “ఏమో”. అందమైన అనుభూతి, ఇష్తంలేని ‘పని ‘ గా, అసహ్యమైన అనుభవంగా ఎలా మారుతుందో సజెస్ట్ చేస్తూ, సమాధానం లేని ప్రశ్నగా వదిలేసి, మన ముందు పెద్ద ప్రశ్నని లేవనెత్తే కథ ఇది. శైలి, శిల్పం పరంగా కథలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, లేవనెత్తిన అంశం కారణంగా ఈ కథ గుర్తుండిపోతుంది.

మగ శరీరంలో ట్రాప్ అయిన ఒక స్త్రీ మనస్కుడి కథ “నేనూ ఆడదాన్నే”. విటుల కోసం వెయిట్ చేస్తున్న ఒక హిజ్రా వేశ్య దగ్గర మొదలైన కథ, ఒక లైఫ్ స్కెచ్ ని ఆవిష్కరిస్తుంది. ఎందరో థర్డ్ జెండర్ జీవితాల్ని, వాళ్ళ విఫల ప్రేమల్ని, అర్థవంతంగా కాకుండా ఆగిపోతున్న జీవితాల్ని గుర్తుతెస్తుంది. ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ గా రికార్డ్ చేస్తుంది. అందుకే ఈ కథ ముఖ్యం.

“పచ్చగోళీ” కథ ఒక మాతృహృదయపు ప్రేమ, ఆతృత, ఆదరణ, నిరాదరణ కథ. నిరాదరణకు గురైనా నిరంతరం ప్రేమించే తల్లి కథ. బిడ్డల సుఖం కోసం, తన దుఖాన్ని దిగమింగుకునే సహజమైన బాధకథ. కథ చదివాక మనసు బరువెక్కక మానదు.

కథా రచయిత్రిగా ఇవన్నీ దాదాపు మొదటి ప్రయత్నాలే కాబట్టి క్రాఫ్ట్ పరమైన సమస్యలు. అప్పుడప్పుడూ ఫోకస్ కోల్పోయే కథనరీతులు. శైలి పరంగా ఇంకా రాని పరిణితి. శిల్పంపరంగా ఉన్న లోటుపాట్లూ భూతద్దంతో చూస్తే చాలా కనిపించినా, కథల్లోని విషయవస్తువుల బలం, ఎప్పుడూ వినని, ఎక్స్ ప్లోర్ చెయ్యని కోణాల ఆవిష్కరణ ఈ కథల్ని నోటిస్ చేసేలా చేస్తాయి. కొన్నింటిని చర్చించేలా, మరికొన్నింటిని పదిలంగా జ్ఞాపకం ఉంచుకునేలా చేస్తాయి.

ఇలాంటి డైవర్సిఫైడ్ గొంతుక అవసరం. ఇలాంటి కథలు అవసరం.

*

 

మీ మాటలు

  1. చందు తులసి says:

    నిజం మహేశ్ గారూ….పదేళ్ళ క్రితమే చైతన్య గారు విజయవిహారంలో అద్భుతంగా రాసే వారు.
    చైతన్య గారు మంచి రచయిత అవుతారని ఊహించా . ఆ పత్రిక ఆగిపోయాక ఎక్కడా కనపడలేదు. మళ్ళీ సారంగలో నే ఆకాశం కథతో కనిపించారు. విభిన్న వస్తువుతో కథలు రాస్తారు. ముఖ్యంగా వాక్యం అందంగా ఉంటుంది..
    భవిష్యత్తులో మంచి కథకురాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచి రివ్యూ రాసిన మహేశ్ గారికి అభినందనలు. సాహితీ మిత్రులంతా చైతన్య గారిని ఆశీర్వదించండి.

  2. కొత్త అస్తిత్వాలు…పాత అస్తిత్వాలు …కొంగొత్త దేవుళ్ళు లాగా…ఆహా ….ఏమి సుందర చైతన్యం …

  3. “అస్తిత్వాల కొత్తవాయిస్ ” అనే అర్థంలో చదువుకుంటే ఓకే అనుకుంటాను. కొత్త అస్తిత్వాల ప్రస్తావన కూడా ఉంది కథల్లో, అందుకే ఈ శ్లేష. కానీ మీ శ్లేష కూడా అర్థమయింది.

  4. థాంక్స్ మహేష్! చాలా అవసరమైన సమీక్ష!నా అభిమాన రచయితలలో చైతన్య కు కుడా ఇందాకే కుర్చీ వేసేసా.. :)

  5. మంచి సమీక్ష మహేష్ గారూ! ఇప్పుడున్న సమస్యలని యువత అర్థం చేసుకుని కథలుగా మలచాలి. చైతన్యకి నా ఆశీస్సులు

  6. Jayashree Naidu says:

    రివ్యూ బాగుంది

  7. నీహారిక says:

    కేవలం ఉదయిస్తున్న సూర్యుడిని చూడటానికి పొద్దున్నే లేచే భావుకత

    ప్రొద్దున్నే లేవడమే భావుకతా ? మొన్న ఆదివారం ఈనాడులో ప్రొద్దున్నే నిద్రలేచే ప్రముఖుల గురించి గొప్పగా వ్రాసారు.ప్రొద్దున్నే నిద్రలేచే అలవాటున్న వారంతా భావుకత ఉన్నట్లు కాదు.కొంతమందికి నిద్రపట్టదు.అదొక రోగం.ప్రొద్దున్నే లేస్తారు కాబట్టి చాలా పనులు అయిపోతాయి.క్రమశిక్షణ అలవాటవుతుంది.ప్లానింగ్ ఉంటే ప్రొద్దున్న లేవకపోయినా పనులు చేసుకోవచ్చు.ప్రపంచంలో జరిగిన యుద్ధవీరుల జీవితచరిత్రలు చదివితే నిద్రపట్టక వారు చేసిన ఆలోచనల పర్యవసానాలే కనిపిస్తాయి.ప్రొద్దున్నే లేచి భాగస్వామిని చూస్తే భావుకత అని చెప్పాలి.

  8. కె.కె. రామయ్య says:

    ” చైతన్య పింగళి లాంటి డైవర్సిఫైడ్ గొంతుక అవసరం. ఇలాంటి కథలు అవసరం” అని ఆ తరం రచయిత పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారి నుండి నేటి యువరచయిత ‘బుడ్డగిత్త రంకె’ పుట్టాపెంచల్దాసు వరకూ ( గొరుసు జగదీశ్వర రెడ్డి గారి నుండి రమాసుందరి వరకూ ) ఎందరెందరో ముక్తకంఠతో శ్లాఘించారని మళ్లీ వక్కాణిస్తున్నా. “తనదే ఆకాశం” చాలా మంది ఫేవరెట్ కథ అయ్యింది. సాహితీ మిత్రులు, పాఠకులు చైతన్య గారి మీద పెద్ద ఆశలే పెట్టుకుంటున్నారు.

  9. చాలా కాలం తరువాత అంటే 4 సం వత్సరాలు శాంతివనం ఒక ఫిలాసఫీ నీ ఏర్పరచుకుని మళ్ళీ సాహిత్య లోకం లోకి ఆడుగిడుతున్న.అంటే గాఢనిద్ర కాదు.సరికొత్త ఆలోచనా విధానము తో.అందుకే సారంగనుక ఇన్ని రొజులు చూడ లేక పోయా.సారంగ ను విజయవంతం గా నడుపుతున్నందుకు అఫ్సర్ కాంగ్రతులషన్స్.

  10. మంచి కథల సంపుటి . చైతన్య కథలు కొత్త కోణంలో రచన విధానం బావుంది. అల్ ది బెస్ట్. చైతు .

Leave a Reply to aparna Cancel reply

*