అదే ప్రేమ!

 

-ఎండ్లూరి మానస

manasa endluri‘ఇది తీయని వెన్నెల రేయి…మది వెన్నెల కన్నా హాయి…నీ ఊహల జాబిలి రేఖలు మురిపించెను ప్రేమ లేఖలు…’

నేనూ అర్జున్, ఒకే ఇయర్ ఫోన్స్ లో ఏ వెయ్యో సారో వింటున్నాం ఈ పాట! మా తోట ఊయలలో…నా ఒళ్ళో అర్జున్!అతని గుండెల మీద నా చేతిని తన చేత్తో పెనవేసుకున్నాడు. తను కళ్ళు మూసుకుని పాటని ఆశ్వాదిస్తున్నాడు..నేను అర్జున్ స్పర్శలో కరిగిపోతున్నాను…ఊయలకి అల్లుకున్న సన్నజాజులు నా చెక్కిలిని ముద్దాడుతున్నాయి. ఈ రేయి…ఈ సన్నజాజులు పెట్టే గిలిగింతలు…ఈ ఊయల…ఈ పాట…నా అర్జున్!అబ్బ! ఎంత అదృష్టం! ఈ రాత్రి ఇంకా ఉండాలి.సూర్యుడు కాస్త మెల్లగా ఉదయిస్తే ఎంత బావుణ్ణు!ప్చ్!

అర్జున్ ని ఈ పాట ఎన్ని సార్లు పాడమన్నా నా కోసం పాడడు.ఇప్పుడైనా అడగాలి! చల్లగాలికి మల్లె రేకలు సీతాకోకచిలుక రెక్కల్లా రెపరెపలాడుతున్నాయి..కాస్తంత దూరంగా మరువం సువాసన వాతావరణాన్ని ఇంకాస్త మత్తెక్కిస్తోంది..వెన్నెల కాంతిలో అర్జున్ ముఖం మరింత మెరిసిపోతోంది!కోటేరు ముక్కు..చిన్ని నుదురు..అందమైన పెదవులు..వాటిపై తన మగసిరి చూపించే మీసం…అసలు అర్జున్ అందమంతా ఆ మీసంలోనే ఉంది!

మెల్లగా ఒంగి పెదాల చివరన ముత్యమంత ముద్దు పెట్టాను తన మీసానికి తగిలీ తగలకుండా!చిత్రం!!అర్జున్ లెగలేదే?!నిద్రలోకి జారుకున్నాడా ఏంటి?!అరె!పాట పాడమని అడుగుదామనుకున్నాను కదా!మీసం చివర నుంచి తన చెంపను స్ప్రుసిస్తూ చెవి వెనుక మృదువైన ఒక ముద్దు!కిందకి జారుతూ మెడ మీద ఒక ముద్దు!నా కోసం కట్టిన గుడిని పదిలపరిచిన తన గుండెకి ఒక చిన్న ముద్దు!నా ప్రేమనంతా కలబోసి తన అరచేతిలో ఒక సున్నితమైన ముద్దు!నా ప్రేమను అంగీకరించినందుకు నుదుటి మీద మరో ముద్దు! మూతలు పడ్డ కనురెప్పల మీద లేలేత ముద్దు!

అర్జున్ కి ఇంకా మెలకువ రావడం లేదే?నా తాకిడిలో జీవం లేదా?లేక ఆట పట్టిస్తున్నాడా?!

“అర్జున్!అర్జున్!” పిలుస్తున్నా లేవడం లేదే! ఇక లాభం లేదు!గట్టిగా తట్టాల్సిందే!

“అర్జున్ లే!” గట్టిగా ఊపుతూ కిందపద్దను!!

“డార్లింగ్!”

‘నడి రాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు…’

ఇయర్ ఫోన్స్ లో పాట…మంచం కింద నడ్డి విరిగి నేను!!

“ఛ!ఇదంతా కలా!?ఆఖర్లో ‘డార్లింగ్’ అని అర్జున్ నన్ను పిలిచినట్టు కూడా అనిపించిందే! దెబ్బకి మత్తు వదిలిపోయింది” అనుకుంటూ పైకి లేచాను.

ఫోన్ లో పాట ఆపేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి నీళ్ళు గొంతులో పోస్కోబోయి ఒళ్ళంతా తడుపుకున్నాను! స్వయక్రుతాపరాధానికి

తిట్టుకుంటూ తడంతా తుడుచుకుని వచ్చి బట్టలు మార్చుకుని ఈ సారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచినీళ్ళు తాగి మళ్ళీ మంచమెక్కాను.కళ్ళు మూసుకోగానే అర్జున్!ఎందుకు ఈ అబ్బాయి ఇలా నన్ను చిత్రవధ చేస్తున్నాడు!మనసులో మాట చెప్తే ఎలా తీసుకుంటాడో!ఏమనుకుంటాడో!ఆఫీస్ లో తన కంటే సీనియర్ ని!పైగా టీం లీడర్ ని!!చులకనై పోతానేమో అని ఒక బాధ!ఒక వేళ తనకీ నా లాంటి ఉద్దేశమే ఉంటే?!

అర్జున్ ఆఫీస్ లో చేరి పదకుండు నెలలవుతుంది.అంటే దాదాపు ఏడాది కాలంగా నా ప్రేమను నా లోనే దాచుకొని మధన పడుతున్నాను!రేపు ఎలాగోలా చెప్పేస్తాను!అసలే అందగాడు అందులోనూ మంచివాడు!ఇంకెవరైనా ఎగరేసుకుపోతారు! నిద్రపోదామని కళ్ళు మూశాను.కొంటెగా కన్ను గీటుతూ అర్జున్!చప్పున లేచి కూర్చుని సెల్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్ పిన్ కొట్టి అర్జున్ కి తెలియకుండా తీసిన తన ఫొటోస్ చూసుకున్నాను.

“ఎంత ముద్దుగా ఉన్నావు రా!కల్లో కూడా అచ్చం ఇలాగే ఉన్నావే!” నా పిచ్చి చేష్టలకి నేనే నవ్వుకుని ఫోన్ ఆఫ్ చేసి అర్జున్ తలపులతోనే నిద్రపోయాను.

రోజు పొద్దున్నే నిద్రలేచి తయారయి ఆఫీసుకి వెళ్ళడమంటే మహా విసుగ్గా ఉండేది అర్జున్ రాకముందు. కానీ ఇప్పుడు? పొద్దెప్పుడెక్కుతుందా అని, అప్పుడే అస్తమిస్తున్నవా అని సూర్యున్ని రోజుకి రెండు సార్లు తిట్టుకోవాల్సి వస్తుంది! ఆఫీసు టైం అయిపోతుంది అంటే నేను పడే బాధ స్కూల్ పిల్లలు కూడా పడరేమో!

***           ***             ***

ఆఫీసు పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేసి దిగుతూనే ఎదురయ్యాడు అర్జున్!వంగపండు రంగు చొక్కా, గోధుమ రంగు పాంటు…ఆ ఐదడుగుల పదంగుళాల ఎత్తూ…ఆ అందం ఆ మీసం…కొత్తావకాయ పచ్చడి లా ఊరించేస్తున్నాడు! అప్రయత్నంగా పలకరించేశాను!

“హాయ్ అర్జున్!వాట్సప్?”

“హాయ్ టీ యల్!కళ్ళెర్రగా ఉన్నాయండి!నిద్రపోలేదా సరిగ్గా?

‘నీ విరహాగ్నిలో నిద్రెక్కడ పడుతుంది?’ లోపల అనుకుని

“హా!లైట్ గా” అన్నాను పైకి

“ఓ ఐ సీ!ప్లీజ్ టేక్ కేర్ అఫ్ యువర్సెల్ఫ్”

“ష్యూర్” నా వలపులు పైకి కనబడకుండా జాగ్రత్త పడుతూ అన్నాను

“హేయ్!నైస్ గ్లాసెస్!ఎక్కడ తీస్కున్నారు?” అడిగాడు నా కొత్త కళ్ళజోడు చూస్తూ

“నచ్చాయా?ఉంచేసుకోండి!” అనేసాను మనసులోని మాట

“అరెరే!వద్దండి.నేనూ ఇలాంటి వాటి కోసమే వెతుకుతున్నాను.అందుకే అడిగాను.అయినా  మీవి పెట్టుకోడం బాగోదు!”

“ప్లీజ్!తీసుకోండి. మొహమాట పడొద్దు!నా గిఫ్ట్ అనుకోండి అర్జున్” బలవంతంగా అతని చేతిలో పెట్టేశాను.

“అదేంటండీ!అసలే నాకు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. టీం లీడర్ అయ్యుండి నా పనంతా మీరే చేసేస్తారు. పైగా ఇదొకటి!” చాలా సిగ్గుపడుతూ అన్నాడు. ఎంత ముద్దొచ్చేశాడో!

“నిన్న మీకు ‘బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అండి.నిన్నే చెప్దామనుకున్నా కానీ అందరూ మీ చుట్టే ఉండడం వల్ల చెప్పలేకపోయా!సారీ!రెండేళ్ళ

నుంచీ ఆ అవార్డు మీకే వస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా! మీ టీం మెంబెర్ అయినందుకు చాలా గర్వంగా ఉంది!”

అర్జున్ కళ్ళు మెరిసిపోతున్నాయి!తన మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. తన చూపులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు.

“సరె సరే!ఎక్కువ పొగిడేయకండి!థ్యాంక్ యు!మళ్ళీ కలుద్దాం!”

షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనసు సిద్ధంగా ఉంది కానీ ధైర్యం సరిపోలేదు!

‘ఏమనుకుంటాడో?’ అనే ఒక్క ప్రశ్న అన్నిటికీ అడ్డం పడుతోంది ముందుకి సాగనివ్వక!

***           ***             ***

మరుసటి రోజు కేఫటేరియాలో బాదంపాలు తాగుతూ కనిపించాడు అర్జున్. నా మనసంతా నిర్లిప్తంగా ఉంది. అర్జున్ని చూస్తుంటే నా మీద నాకే జాలి!సానుభూతి!చెప్పాలనుకున్న మాటలన్నీ పెదవి వెనుకే ఆగిపోతున్నాయి. ఈ జన్మకి చెప్పగలనా?చెప్పడానికి భయం కాదు!మొహమాటం లేదు!సంకోచం మాత్రమే.తరువాత జరిగేది ఊహకి అందడం లేదు!ఔనంటే నా అంత సంతోషించేవారు లేరు.కాదంటే?అదొక ఘోర అవమానం! కళ్ళల్లో నీళ్ళు రానివ్వకుండా ప్రయత్నిస్తున్నాను.

“మీ పెర్ ఫ్యూమ్ చాలా బావుంది టీ యల్!” చక్కటి చిరునవ్వుతో అన్నాడు అర్జున్.

“ఎందుకు విచిత్రంగా టీ యల్ అని పిలుస్తారు? అందరిలా పేరు పెట్టి ‘నువ్వూ’ అని మాట్లాడొచ్చుగా!నేనూ ఎవరితో ఇంత ఫార్మల్ గా మాట్లాడను. మీతోనే!”

“అంటే ఈ ‘గార్లు’, ‘బూర్లు’ మనిద్దరికే ప్రత్యేకం అన్నమాట!మంచిదేకదండీ!ఇందాక నేను మీకొక కంప్లిమెంట్ ఇచ్చాను!బదులు చెప్పనే లేదు!”

‘నాకు తెలుసు నీకిష్టమైన బ్రాండ్ అని!అందుకే కొనుకున్నాను’ మనసులో అనుకుని

“థ్యాంక్ యు!మీకు నచ్చినందుకు” ఏ ఆర్భాటం లేకుండా అన్నాను అర్జున్ తో

“మీకు ఏం ఆర్డర్ చెయ్యమంటారు?

“టీ”

“ఓ గుడ్.నేనైతే అస్సలు టీ కాఫీ తాగను టీ యల్” అంటూ లేచి వెళ్ళాడు.

ఏంటి?టీ కాఫీ తాగడా?అన్నీ తెలుసుకున్నాను కానీ ఈ విషయం తెలీదే నాకు!ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే అంత సులువా?!ఎన్నో ఏళ్ళు కాపురం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒకరి పట్ల ఒకరికి సరిగ్గా అవగాహన ఉండదు!నేనెంత!అర్జున్ తో మాట్లాడడానికి ఇదే అనువైన సమయం!అడిగేస్తాను!నేనంటే ఇష్టమో లేదో!

అర్జున్ టీ తీసుకువస్తున్నాడు.బ్లూ జీన్స్,బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ లో అదిరిపోయాడు ఇవ్వాళ!టీ తెచ్చి ఎంతసేపైనా తాగలేదు నేను.

“అదేంటి ఇంకా టీ తాగలేదు మీరు?” కప్పు లోకి తొంగి చూస్తూ అడిగాడు అర్జున్

“మీకిష్టo లేదుగా!” తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాను

“అదేంటి?నాకిష్టం లేకపోతే ఏం?” తటపటాయించాడు

“హహ్హహ!టీ బాలేదు అందుకే”

“అయ్యో!పోనీ కాఫీ తీసుకురానా?

“వద్దు బాదం పాలు ట్రై చేద్దామనుకుంటున్నా!”

“తెస్తాను టీ యల్!ఒక్క నిమిషం” లేవబోయాడు

“ఎందుకు?మీ చేతిలో ఉందిగా బాదంపాల టిన్!” ఎంత ఆపుకున్నా ముఖం లో సిగ్గు తొణికిసలాడుతూనే ఉంది నాకు.

“అదీ…అంటే నేను కొంచెం తాగాను.మీకు వేరేది తెస్తాను!”

“పర్లేదు!మీరు తాగాక ఆఖరిలో జస్ట్ టేస్ట్ చేస్తానంతే!”

అతడి ముఖంలో మార్పులు!కానీ స్పష్టత లేదు!!

***           ***             ***

“హ్యాపీ బర్త్ డే అర్జున్!”

“థ్యాంక్ యు టీ యల్.నాకు తెలుసు మొదటి కాల్ మీరే చేస్తారని!”

“అదెలా?”

“అదంతే!ఎలాగూ సండే కాబట్టి మీకో చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నాను.మీరు తప్పకుండా రావాలి!”

“అదేం వద్దు కానీ, మీ బర్త్ డే మా ఇంట్లోనే చేసుకోవచ్చు!మీరే రండి!పదకుండు గంటల కల్లా!”

“ఇంట్లో అంటే…మీ పేరెంట్స్ ఉంటారు కదా?పర్వాలేదా…?”

“ఏంటి మీకు తెలీదా?వాళ్ళు అమెరికాలో మా అక్క దగ్గర ఉంటున్నారు.ఇంట్లో నేను మాత్రమే ఉంటాను.వచ్చేయండి!బై”

ధైర్యం చేసి అర్జున్ ని పిలిచేశాను!అతనికి ఇష్టమైన కేక్ ఆర్డర్ చేశాను. ఇల్లంతా డెకరేట్ చేశాను. తనకి నచ్చే వంటలన్నీ స్వయంగా చేశాను.అన్నీ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళిన ఐదు నిమిషాలకి బెల్ మోగుతోంది!అయ్యో! అర్జున్ వచ్చేశాడే!ఇలాగే టవల్ లో వెళ్లి దర్శనమిస్తే?చిలిపిగా నవ్వుకుని క్షణాల్లో రెడీ అయి తలుపు తీశాను.

తలారా స్నానం,కొత్త బట్టలు,కొత్త సెంట్,కొత్త వాచ్…సరికొత్త అర్జున్!లోపలికి వస్తూనే డెకరేషన్ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

“ఎందుకు ఇదంతా?”గోముగా అన్నాడు అర్జున్

“ముందు ఇది కట్ చేయండి!” చాకు అందిస్తూ అన్నాను

“నాకు చాక్లెట్ కేక్ ఇష్టమని మీకెలా తెలుసు?” ప్రేమగా అడిగినట్టు అనిపించింది

“ఇంకా చాలా తెలుసు!” ఓరనవ్వు తో సమాధానమిచ్చాను

అర్జున్ కేక్ కట్ చేశాడు.ఆ తర్వాత కట్ చేసిన కేక్ నాకు తినిపిస్తాడనే తలపే నాకు ఊపిరాడకుండా చేస్తుంది!అతని ముని  వేళ్ళు నా పెదాలకి, మునిపంటికి తగిలాయి!గుండె ఝల్లుమంది!!చిరు చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా.అరచేతులు సన్నగా వణుకుతున్నాయి.తనకివ్వాల్సిన కానుక నా గుప్పిట్లో ఊపిరాడక అవస్థ పడుతోంది!అర్జున్ ఎదురుగా నిలబడి ఒక్కొక్క వేలూ తెరిచి కానుక చూపించాను.అతడి కళ్ళు చెమర్చాయి!అమితాశ్చర్యంగా దాన్ని అందుకున్నాడు.

“నాకా?” ఉవ్వెత్తున ఎగిసే ఆనందం నిండిన కళ్ళతో అడిగాడు అర్జున్.

అవునన్నట్లు తలూపాను.

“మీరే పెట్టండి”

ఆ బంగారపుటుంగరం మా బంగారు భవిష్యత్తుకి పునాది అని నా ఆలోచన. కానీ ఆ మాట బయటకు చెప్తేగా తనకీ తెలిసేది!అర్జున్ చేతుల్లోంచి ఉంగరం తీసుకుని తన కుడి చేతి ఉంగరపు వేలికి తొడిగాను. నా చేతులు చల్లగా, తడిగా…వణికిపోతున్నాయి!అర్జున్ చేతికి చాలా అందంగా ఉందా ఉంగరం. నాకు మాటలు రావడం కష్టంగా ఉంది.

“భోం చేద్దాం పదండి” అన్నాను. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.

డైనింగ్ టేబుల్ మీద పన్నీర్ కోఫ్తా,మటన్ ఫ్రై,చికెన్ బిర్యానీ,డబల్ కా మీఠా,అన్నం, పప్పు, గోంగూర పచ్చడి,ములక్కాడ జీడిపప్పు కూరలు చూసి అవాక్కయాడు!

“ఏంటండీ ఇవన్ని ఎవరితో చేయించారు?”

“ఎవరు చేస్తారు?నేనే” దొంగ కోపంతో అన్నాను.

“మీరా టీ యల్!నా కోసం మీరు చేశారా?నాకిష్టమైనవన్నీ నాకు తెలియకుండా కనుక్కుని ఇంత సర్ప్రైస్ ఇచ్చారు!నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు ఇది!మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. బహుశా బ్యాచిలర్ గా ఇదే నా ఆఖరి పుట్టినరోజు అనుకుంటా!”

కళ్ళకింద భూమి కంపించినట్టైంది నాకు! పెళ్ళా??అంటే అర్జున్ కి నా మీద ప్రత్యేకాభిమానం లేదనమాట! ఇంత తేలిగ్గా చెప్పేశాడేంటి?ఎంత దిగమింగడానికి ప్రయత్నించినా దుఃఖం,బాధ బొట్టు బొట్టుగా కళ్ళ వెంబడి కారుతూనే ఉన్నాయి…నా ఆవేదన దాచుకోడంలో విఫలమై అర్జున్ ముందు కన్నీటి పర్యంతమయ్యాను.అర్జున్ ఆందోళన పడుతున్నాడు.

“అరెరే!ఇప్పుడేమైందని?కళ్ళు తుడుచుకోండి ప్లీజ్!” తన జేబులోంచి రుమాలు తీసి నా కళ్ళు తుడవబోయాడు.

“ఏం లేదు సారీ!ఏదో గుర్తొచ్చి…సడన్ గా…అలా ఇమోషనల్ అయ్యాను.ఏం అనుకోకండి” ఏడుస్తూనే చెప్పాను.

అర్జున్ తన చేతుల్లోకి నా ముఖాన్ని తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను నమ్మలేని ప్రశ్న సూటిగా అడిగాడు!

“ఇంత పెద్ద అబద్ధం చెప్పినా నా మీదున్న ప్రేమని వ్యక్తపరచారా?”

నేను విన్నది నిజమేనా?కల కాదు కదా?వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అర్జున్ నోరు తెరిచి నన్ను అడిగాడా?!నిర్ధారించుకోడానికి మళ్ళీ చెప్పమని అడిగాను.

“మీరు విన్నది నిజమే!నేనంటే మీకిష్టం లేదూ?”

“అదీ…” నీళ్ళు నమిలాను

“నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం!కానీ పైకి చెప్పాలంటే సిగ్గు!మీరేమనుకుంటారోనని భయం!ఈ రోజు ఎలాగైనా చెప్పేద్దామని కంకణం కట్టుకున్నా!చెప్పేశా!అయినా మీ మనసులో ఏముందో తెలీదే!”

అర్జున్ ఆ మాటలు చెప్తున్నంత సేపూ నా గుండె వేగం పెరిగిపోయింది.నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.నా కల,నా ఆశ, నా అర్జున్…నిజమైన వేళ అది!

“నాకూ మీరంటే చాలా ఇష్టం!పిచ్చి!!” నిర్భయంగా చెప్పేశాను.

“ఈ మాట కోసం ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంటూ నాకు తెలియకుండానే నన్ను కౌగలించుకున్నాడు!అలాగే బెడ్ రూమ్ లోకి తీస్కెళ్ళాను.కౌగిలి బిగుసుకుంది.వచ్చీరాని ధైర్యం కూడగట్టుకుని తన బుగ్గ మీద నా మొదటి ముద్దు పెట్టాను!

‘అర్జున్…”

“మ్!చెప్పండి”

“ఇంకా అండి ఏంటి?పేరు పెట్టి పిలిచి మనస్పూర్తిగా ఏదైనా చెప్పొచ్చుగా!”

“గోపాల్…ఐ లవ్ యూ!”

“ఐ లవ్ యూ టూ అర్జున్!”

*

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. :)

  2. So nice.kasepu ala flash back ki vellanu

  3. akbar mohammad says:

    చాలా బావుంది…

  4. అర్ధం కాలేదు-ఇద్దరు మొగవాల్లెనా ఏంటి కొంపదీసి!?

  5. mercy margaret says:

    6 ఏళ్ళు కార్పోరేట్ కంపెనీల్లో పని చేయడం వళ్ళ ఇలాంటి వాళ్ళ అనుభవాలు నేను చూసాను .. I still remember a person whom I Used to call kishore anna when I used to work with Micro soft .. he is a transgender and yes every one in our team including with our Team leader knew that he had a crush on him .. నవ్వు కోడానికి బాగున్నా మీరు రాసిన ఆ వేదన ఆయన పడడం నేను కళ్ళారా చూసా .. I personally knew this kind of issues .. మొన్నామధ్య కుప్పిలి పద్మ గారు రాసిన కథ , ఇప్పుడు మీది .. చివరి వరకు ఆసక్తితో చదివించిన కథనం బాగుంది .. reviews apart and people who are well versed in that will talk about ..but I enjoyed reading it Manasa .

  6. Aranya Krishna says:

    మంచి కథ. మామూలు మనుషులం మనం ఆశ్చర్యపోతామ్ కానీ, అజ్ఞానంతో నవ్వుకుంటాం కానీ వాళ్ళూ మనుషులే కదా, వాళ్ళకుండేదీ మనసే కదా! భావోద్వేగాలకీ, అవసరాలకీ ఎవరూ అతీతులు కారు.

  7. Vanaja Tatineni says:

    అదే సున్నితత్వం అదే మొహమాటం .. :) అదే ప్రేమ . నాకు తెలిసిన ప్రేమ కథ గుర్తుకొచ్చింది . 65/25 ల ప్రేమ అది . ఆమోదించే సమాజం లేకున్నా అదే ప్రేమ వర్ధిల్లుతుంది .
    చాలా బాగా వ్రాసారు మానస. అభినందనలు .

  8. suvarchala chintalacheruvu says:

    మానసా! కొన్నింటిని జీర్ణమ్ చేసుకోలేం. ఇలాంటి వాళ్లని చూస్తే జాలి అనిపిస్తుంది. అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించేకొద్దీ బెంగేస్తుంది. ఇటువంటి కథ రాయటానికి ధైర్యం ఉండాలేమో! అక్కర్లేదంటారా? :) కథనం బాగుంది. కలవర పరిచింది.

  9. అద్బుతంగా ఉంది అసలు కథ లోని పత్రాలు అత్యద్బుతంగా ఉన్నాయి కథ చాల బాగుంది నాకు చాల చాల chalaaaaa నచ్చింది

  10. b.ramnarayana says:

    అసహజమైన సంబందాల్ని glorify చేస్తున్నారు.

  11. manasa yendluri says:

    kadha nachina vaallaki nachani vaallaki kruthagnyatalu. prakruti eppudu sahajame! asahajamane prasne ledu! kaaranam lekunda manam aamodinchananta varaku annii vichitrangane kanipistaayi! manalni heterosexuals ga undoddani evaruu force cheyalede! mari manamenduku vaarini homosexuals ga undoddani force chestunnam?? ilanti abbayilani balavantanga ammayilakicchi pelli chesi iddari jeevitalu nasanam chesi aa abbayini oka doshini cheste bavuntunda??

  12. అన్వీక్ష says:

    బాగుందండి కథ .. చివరికి మీరు పెట్టిన మెలిక చూసి కొంచెం అవాక్కయ్యా కాని ఇలాంటి జీవితాలు కూడా వున్నాయి వారు కూడా సమాజంలో భాగమే కదా .. కథనం నచ్చంది .. చివరి వరకు చదివించారు

  13. Sai Padma says:

    మీ కథ బావుంది మానసా.. కథనం బాగుంది , కానీ చివర్లోనే చెప్పించటం వల్ల షాక్ వేల్యూ ఉన్నా, ఇంకా ఏదో వెలితి అనిపించింది. ఇలాంటి భావోద్వేగాలు బయటపడటం కూడా అంత సులువుగా జరగదు. అర్జున్, మనస్తత్వం పెద్దగా చర్చించలేదు. ఇలాంటి ప్రపోజల్ ని, అతను వెంటనే అంగీకరించటం వెనుక , అతని ప్రిఫరెన్సులు ఏమిటో క్లియర్ గా లేదు. వైజాగ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ తో, రెండేళ్ళు పని చేసాను . అందువల్ల చెప్పా.. వేరేగా అనుకోకండి.
    మీ కథనం , మలచిన తీరు మాత్రం సహజంగా ఉంది…!

  14. srivasthava says:

    ఉహించ లేదు చాల కొత్త గా ఊంది

  15. మానస..!
    గోపాల్ చిరు చిరు ఫీలింగ్స్ ని కూడా చాలా బాగా రాశావ్..
    కాపోతే అతని ఫీలింగ్స్ అమ్మాయిల్లానే ఉంటాయా..?! కాస్త ఏమైనా డిఫరెంట్ images తో ఉంటాయా ?! అని కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను..
    అసలు ఈ సబ్జెక్టు తీసుకోడమే చాలా బాగుంది..
    కథలు విరివిగా రాయి రా..!

    • manasa yendluri says:

      అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే ప్రేమ!! అందరి ప్రేమ ఒకేలా ఉంటుందని చెప్పడమే లక్ష్యం అన్నయ్య. నచ్చినందుకు ధన్యవాదాలు :)

  16. buchi g reddy says:

    so. so. గా ఉంది
    ———————————————
    బుచ్చి రెడ్డి gangula

  17. p v vijay kumar says:

    చాలా బోల్డ్ సబ్జెక్ట్…:)
    misogynistic minds కు వెంటనే కనెక్ట్ అవ్వదు….:)
    smae sex relations లో – ఆడవాళ్లైనా , మగ వాళ్ళైనా – feminine role and masculine role ఎవరు ఎలా assume చేసుకుంటారు ? అన్నది ఆలోచించాల్సిందే !
    ఈ gay relations పై చాలా చర్చ జరగాల్సి ఉంది. Thanq for sharing

  18. ఇప్పటికే సినిమాలొచ్చాయి. చర్చ జరిగింది. కథలూ మొదలయ్యాయి. చర్చలు నడుస్తాయి. నేటి అసహజం రేపటి సహజం అవుతుందనుకుంటా. ఇవే సంబంధాలు పరివ్యాప్తమైతే.. ఆ సమాజాన్ని ఊహించుకుంటే.. మానస వద్ద జవాబు ఉండే ఉంటుంది.

  19. manasa yendluri says:

    అలాంటి సమాజం రావడం కోసమే కదా ఈ చర్చలు, కధలు, తాపత్రయాలు!మనకి నచ్చనిది ఈ సమాజంలో కనిపించకూడదు!!అది చరిత్ర లో ఉండదు!అది అసహజం!అది పాపం! ఇది ఈ రోజు కొత్తగా పుట్టినది కాదు! అమెరికా లో మొట్ట మొదటి గే వివాహం చేసుకున్న వారి వయసు 85, 82!! వారు 50 ఏళ్ళగా ఎదురు చూసారు పెళ్లి చేస్కోడానికి! మనల్ని ఒకళ్ళు ఆపనప్పుడు మనం ఎందుకు ఒకరిని ఆపుతున్నాం?

  20. శ్యామ్ కోల says:

    చెల్లీ చాలా బాగుంది కొంచం నాకూ అర్థం కావడానికిసమయం పట్టింది ,,కథ ఒక అనుభూతి లా చెప్పావు ,కథలు నేను ఎప్పుడూ చదవలేదు ఇది రెండు సార్లు చదివాను ,సూపర్

Leave a Reply to p v vijay kumar Cancel reply

*