వోల్టేర్ హృదయ ప్రతిబింబం.. కాండీడ్

KONICA MINOLTA DIGITAL CAMERA

 

‘ఒక మనిషిని అతడు చెప్పే సమాధానాలను బట్టి కాకుండా అతడు వేసే ప్రశ్నలను బట్టి అంచనా కట్టు’ అని అంటాడు ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్(1694-1778). ప్రశ్న లేనిదే ప్రగతి లేదని అతని ప్రగాఢ విశ్వాసం. అందుకే అతడు ప్రతిదాన్నీ ప్రశ్నించాడు. మనిషిని, మతాన్ని, దేవుణ్ని, దెయ్యాన్ని, రాజును, రాజ్యాన్ని, యుద్ధాన్ని, న్యాయస్థానాన్ని.. దేన్నీ వదల్లేదు. ప్రతిదాన్నీ హేతువనే గీటురాయిపై రుద్ది మంచిచెడ్డలను విచారించాడు. మంచిని తలకెత్తుకున్నాడు. చెడ్డను నరికి పోగులు పెట్టాడు.

ప్రశ్నే ప్రాణంగా బతికిన వోల్టేర్ తన విశ్వాసాలపై ఎక్కడా రాజీపడలేదు. జైలుకు వెళ్లాడు, ప్రవాసానికి వెళ్లాడు. కానీ ప్రశ్నదీపాన్ని ఎన్నడూ కొడిగట్టించలేదు.  ‘నీ మాటతో నేను ఏకీభవించను. కానీ ఆ మాట చెప్పేందుకు నీకున్న హక్కు కోసం కడవరకు పోరాడతా ’నంటూ భావప్రకటన స్వేచ్ఛ కోసం వోల్టేర్ తాత్విక యుద్ధయంత్రంలా పనిచేశాడు. నిజానికి ఈ మాటలు అతడు ముక్కస్య ముక్కస్య అనకపోయినా.. అభిప్రాయాల కారణంగా నీ పొరుగువాడిని తగలబెట్టొద్దు అని అన్నాడన్నది మాత్రం నిజం.

 

తన భావవిప్లవంతో యూరప్ సమాజాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ ఉర్రూతలూగించిన వోల్టేర్ మనసుకు అతని సుప్రసిద్ధ వ్యంగ్య నవలిక ‘కాండీడ్’(1759) అద్దం పడుతుంది. మనిషి మేధను, శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేసే కర్మసిద్ధాంతం లాంటి నిరర్థక ఆశావాదాన్ని(Leibniz’s Optimism) వోల్టేర్ ఈ రచనతో చావుదెబ్బ తీశాడు. స్వేచ్ఛ కోసం అతడు పడ్డ తపనతోపాటు మతాల అసహనం, ఆధిపత్యం, హింస, ఆత్మలోకంలో దివాలా, కపటత్వం, దోపిడీ, పీడనలపై అతడు లేవదీసిన తిరుగుబాటు అన్నీ ఇందులో హాస్యబీభత్సంగా దర్శనమిస్తాయి. కత్తికంటే పదునైన వెటకారం నవలిక సాంతం అంతస్సూత్రంలా సాగుతూ మానవజాతి నానా అవలక్షణాలపై అడుగడుగునా ఉమ్మేస్తూ పోతుంది. అందుకే అచ్చయిన ఏడాదే ఫ్రెంచి పాలకులు నిషేధం వేటు వేశారు. 20వ శతాబ్ది తొలి దశకాల్లోనూ అమెరికా వంటి ఘన ప్రజాస్వామిక దేశాల్లో సైతం దీనిపై నిషేధం అమలైందంటే ఇది ఎంత ‘ప్రమాదకర’మో అర్థం చేసుకోవచ్చు. కాండీడ్ ను 20వ శతాబ్ది ఘోరాలకు, అసంబద్ధతకు అతికినట్టు అన్వయిస్తూ 1960లో వచ్చిన ఫ్రెంచి సినిమా ‘Candide ou l’optimisme au XXe siècle’ ఆ నవలికకు ఇప్పటికీ ఉన్న ప్రాంగికతకు నిదర్శనం. ‘వోల్టేర్ కాండీడ్ తో తన అన్ని రచనల సారాంశాన్ని మనముందుంచాడు.. అతడు నిజంగానే హాస్యమాడుతున్నాడా? లేదు.. ఆక్రోశిస్తున్నాడు.. ’ అని అంటాడు ఫ్రెంచి రచయిత ఫ్లాబర్.

వోల్టేర్ కాండీడ్ లో దునుమాడిన వికృతం, అన్యాయం, అసత్యం, అసంబద్ధత, కక్ష, కార్పణ్యం ఇప్పటికీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంతా మన మంచికేనన్న భ్రమలను పాలకులతోపాటు ‘మేధావులూ’ మరింత పెంచుతున్నారు. హేతువును, ప్రశ్నించే గొంతుకలను ఉత్తరిస్తున్నారు. ఇప్పకికే భ్రష్టుపట్టిపోయిన మతం, చరిత్ర, రాజకీయాలు, కళలు, సాహిత్యం.. వంటి అనేకానేక ఆవరణలను ’కన్నుగానని వస్తుతత్వం’తో మరింత కలుషితం చేస్తున్నారు.

తలకిందులుగా వేలాడుతున్న సమాజాన్ని సవ్యంగా నిలబెట్టేందుకు వర్తమానానికి ఒక వోల్టేర్ కాదు లక్ష మంది వోల్టేర్లు కావాలి. ఒక కాండీడ్ కాదు లక్ష కాండీడ్ లు కావాలి. ఇది అత్యాశే కావచ్చు కానీ అవసరమైన అత్యాశ. దానికి ఊపిరులూదడానికి కాండీడ్ ను ఒకసారి తిరగేద్దాం వచ్చేవారం నుంచి సారంగలో..

*

మీ మాటలు

 1. చందు - తులసి says:

  మోహన్ గారూ. మంచి పనికి పూనుకున్న మీకు అభినందలు. కాండిడ్ కోసం ఎదురుచూస్తూ…

 2. Thank you Tulasi garu.

 3. భాస్కరం కల్లూరి says:

  ఈ కాలానికి కూడా చాలా అత్యవసరమైన రచన. …మీ పరిచయమే చాలా ప్రభావవంతంగా ఉంది. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ… కాండీడ్ ను స్వాగతిస్తూ…

 4. కె.కె. రామయ్య says:

  ‘తన భావవిప్లవంతో యావత్ ప్రపంచాన్నీ ఉర్రూతలూగించిన ఫ్రెంచి తత్వవేత్త వోల్టేర్’ పరిచయమే చాలా ఉద్వేగవంతంగా ఉంది మోహన్ గారూ. ‘కాండీడ్’ నవలిక కోసం ఎదురుచూస్తూ …

 5. భాస్కరం గారికి, రామయ్య గారికి ధన్యవాదాలు.

  కాండీడ్ ను డిగ్రీ సిలబస్ లో పెడితే వందకు పదిమందైనా సవ్యంగా ఆలోచిస్తారు.

 6. అద్భుతమైన పని చేయబోతున్నందుకు అభినందనలు. మీ పరిచయం కూడా చాలా బాగుంది. నిజంగా యువత అందరిచేతా బైబిల్ లా చదివించాల్సిన పుస్తకం ఇది. పుస్తకానికి ఆయువుపట్టు, ఇప్పటికీ వందశాతం ఈ కాలానికి, ఈ సమాజానికి కూడా అన్వయించగలిగిన వాక్యం, నా దృష్టిలో “we must work without arguing, that is the only way to make life bearable..

 7. ధన్యవాదాలు హరిత గారూ..
  కాన్దీడ్ గురించి బాగా చెప్పారు. ఈ పుస్తకంలో ఎన్నో విలువైన మాటలున్నాయి.. ఓ ముసలమ్మ ఇలా అంటుంది..
  ” I have grown old in misery and disgrace, living with only
  one buttock, and having in perpetual remembrance that I am a Pope’s
  daughter. I have been a hundred times upon the point of killing myself,
  but still I was fond of life.”

మీ మాటలు

*