దారులు వేద్దాం….

-కేక్యూబ్ వర్మ 
ఇప్పుడు మూసుకుపోతున్న దారులను
తెరచే పని చేయాలి
ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ
గోడలు కడుతున్నాడు వాడు
ఇప్పుడు నదీ ద్వారాలను స్వేచ్చగా
తెరచుకోనివ్వాలి
ఒక్కో పర్వతాన్నీ పిండి చేస్తూ వాడు
గుండెల్ని తవ్వి ఎత్తుకు పోతున్నాడు
పర్వత పాదాలతో పాటు శిఖరాన్ని
నిబ్బరంగా ఎదగనివ్వాలి
నిటారుగా దారు వృక్షాలతో కలకలలాడుతున్న
పచ్చని అడవిని నరుక్కుపోతున్నాడు వాడు
నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
అందుకునేలా పాతుకోనివ్వాలి
సాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
అలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు
గర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
తీరందాకా చేరనివ్వాలి
నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు
నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి.
*

మీ మాటలు

 1. చిక్కగా..చక్కగా..

 2. అజిత్ కుమార్ says:

  ఎలా తన్నగలవు ? అంత శక్తి నీకు ఉందా? లేదు గదా… ప్రస్తుతం నువ్వు వాడు చెప్పిన పని చేస్తున్నావు. ప్రస్తుతానికి చెయ్యనని చెప్పడానికి కూడా శక్తిలేదు నీకు. కనుక మొదట నీవు బలపడాలి. నీవు మీరుగా మారితేనే శక్తి . మొత్తానికి బకరాలను రెచ్చగొట్టే కవిత .

  • KCube Varma says:

   నిన్ను నువ్వు బకరను అనుకున్నంతకాలం వాడు నిన్ను పూర్తిగా మింగేస్తాడు తమ్ముడు. థాంక్యు స్పందించినందుకు.

 3. బాగుంది, వర్మా

 4. సహజవనరుల దోపిడీ అనేది చట్టబద్దంగా జరుగుతున్న దారుణం. ఈ భూమిపై పుట్టినందుకు సహజంగానే ఈ వనరులలో అందరకూ వాటా ఉంటుంది. ఒక రాష్ట్రంలో, ఒక చోట, నాలుగు ట్రిలియన్ డాలర్ల వనరుల్ని కాపటిలిస్టులకు కట్టబెట్టిన వైనం, వాటిని తరలించుకుపోవటాన్ని వ్యతిరేకించిన ఆదివాసీల్ని వేలసంఖ్యల్లో మట్టుపెట్టిన వైనాన్ని చదివాకా మనం ఒక జాతిగా ఎక్కడకు పోతున్నామో అర్ధం కాలేదు.
  పై కవిత నాకు కలిగిన ఆవేదనకు అక్షరరూపం గా భావిస్తున్నాను.
  కానీ ప్రస్తుతపరిస్థితులలో ఒక నిస్సహాయత అందరినీ ఆవరించింది. బతకటమే ఒక పోరాటంగా మారిపోయాకా, మనశక్తియుక్తులన్నీ బతకటానికే వెచ్చించాల్సిన పరిస్థితులలో, మనమేం చేయగలం అనే నిస్సహాయత అది. బహుసా అజిత్ కుమార్ గారి కామెంటు కూడా దానిగురించే అనుకొంటాను.
  ఈ గందరగోళ ఆలోచనలను నా విధ్యార్ధుల ముందు డిస్కషన్ కుపెట్టాను. (ఫైనల్ ఇయర్ డిగ్రీ విద్యార్ధులు). కొద్దిమంది శృతి, సాగర్ ల మార్గాన్ని సమర్ధించినా, వారి వాదనల్లో వాళ్ళ pov ని ఎక్కువదూరం తీసుకెళ్ళలేకపోయారు.
  నాకు సంతోషాన్ని, భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగించిన అంశం ఏమిటంటే….
  1. ఎక్కువమంది శ్రుతి, సాగర్ లు డెమొక్రటిక్ మార్గాల ద్వారా పోరాటం సాగించి ఉండాల్సిందనీ అంగీకరించటం
  2. ప్రలోభాలకు లోనవకుండా మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని వారు అభిప్రాయపడటం
  ఏది ఏమైనా కవిత బాగుంది. వాస్తవపరిస్థితిని, ఒక దృక్పధాన్ని తెలియచేస్తుంది. అభినందనలు.
  బొల్లోజు బాబా

  • నమస్తే సార్, మీరు తరగతి గదిలో నా కవితను చర్చకు పెట్టి సార్థకతను చేకుర్చినందుకు ధన్యవాదాలు సర్. వ్యవస్థను ఉన్నదున్నట్లుగా దిద్దుకోవడానికి దానిని మార్చేందుకు జరిగే ప్రయత్నానికి వ్యత్యాసముంది. వివేక్, శృతి, సాగర్ లు రెండో వైపుగా కృషి చేస్తూ అమరులయ్యారు. వారికి జోహార్లు.

 5. Srinivas Vuruputuri says:

  బాబా గారికి

  “ఒక రాష్ట్రంలో, ఒక చోట…” – ఏ రాష్ట్రం? ఏ చోటు? ఒడిషా, నియమగిరి అని అనుకున్నాను. కానీ వేలాది మంది ఆదివాసీలను మట్టుపెట్టిన వైనం గురించి ఏ లింకూ తగల్లేదు.

  వీలుంటే ఏమైనా రెఫరెన్సులు ఇవ్వగలరా?

  • sri. pl. go through arundhati roy interviews on youtube
   place chattisgarh
   According to an analysis of the news reports by the South Asia Terrorism Portal, 2111 Maoists, 2669 civilians, and 1695 armed forces’ personnel have lost their lives in the battle since 2005.[12]
   thank you

  • శ్రీనివాస్ గారు వేలాదిమంది ఆదివాసులను జైళ్లలో, కాన్సంట్రేషన్ కాంపులలో పెడుతున్నారు. ఇంకా వందలాదిమందిని ఊచకోత కోసిన సంఘటనలు అనేకం జరిగాయి. వారి ఆస్తి ప్రాణ నష్టాన్ని మీడియా కవరేజిక్కూడా రానీయరు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ మనుషులగానే గుర్తించని కార్పొరేట్ లోకమిది. సహజవనరుల దోపిడీకి వారి ఆవాసాలు ప్రాణాలు అడ్డుగా ఉన్నాయి. వారికి అండగా నిలిచే ఉద్యమాలను పచ్చ దానాన్ని వేటాడే పేరుతోనే సాగిస్తోంది రాజ్యం. వీటికోసం వెబ్సైటు లు వెతకనక్కర్లేదు. మనసు ఉంటే చాలు. ధన్యవాదాలు.

 6. m.viswanadhareddy says:

  నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
  అందుకునేలా పాతుకోనివ్వాలి
  నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
  ఎగిరి తన్ని తరిమేయాలి
  విద్వంసం లోపల కూరుకుపోయిన మనిషి పట్ల
  మీ కెంతటి విశ్వాసం

Leave a Reply to Srinivas Vuruputuri Cancel reply

*