జలియన్ వాలా బాగ్ లో చంపేసుకుందాం..

 

-సత్యమూర్తి

 

వరంగల్ జిల్లాలో జరిగిన శ్రుతి ఎన్ కౌంటర్ పై ‘ఆ పిల్ల..’ పేరుతో రమాసుందరి గారు రాసిన భావోద్వేగ కవితపై కొందరి వ్యాఖ్యలు చూశాక కొన్ని అభిప్రాయాలు పంచుకోవాలనిపించింది. వ్యాఖ్యల్లో చెప్పాల్సిందంతా  వివరంగా చెప్పలేం కనుక విడిగా రాయాలనిపించింది.

శ్రుతి వంటి అమాయక పిల్లలకు మాయమాటలు చెప్పి సాయుధ పోరాటంలోకి పంపి ప్రాణాలు తీయిస్తున్నారని కొందరు కొందరిని పేర్లు ప్రస్తావించకుండా తిట్టారు. యువత ఏదైనా సాధించాలనుకుంటే అడవులకు వెళ్లకుండా, వీధుల్లోకి వచ్చి పోరాడాలని నిరాయుధ ఉద్యమ పిలుపు ఇచ్చారు. మావోయిస్టు ఉద్యమంపై వ్యతిరేకతను ఛిద్రమైన శ్రుతి శవం సాయంతో ముసుగులేకుండా వ్యక్తీకరించుకున్నారు. చరిత్ర సంఘర్షించేటప్పడు నిజానికి ఇలాంటి స్పష్టమైన అభిప్రాయాలే రావాలి.

ఎవరు ఎలా పోరాడాలన్నది ఒకరు చెబితే తేల్చుకోవాల్సిన విషయం కాదు. పోరాట రూపం ఎంపికలో వ్యక్తిగత చైతన్యమే కాకుండా సామూహిక చైతన్యం కూడా పనిచేస్తుంది. విప్లవోద్యమంలో పీడితులు, తాడితులు మాత్రమే పోరాడరని,  సమాజంలో మార్పును ఆశించే వాళ్లు కూడా పోరాడతారని చరిత్ర చెబుతోంది.  శ్రుతి దీనికి తాజా నెత్తుటి ఉదాహరణ. శ్రుతి ఎంచుకున్న మార్గం మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించుకునే ముందు ఆమెను కిరాతకంగా చంపడం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్నా వేసుకోవాలి. దీనికి వచ్చే జవాబును బట్టే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆమెకు ఆ పోరాటాన్ని మించినదేదో సాయుధపోరాటంలో ఉందనిపించి అటువైపు వెళ్లింది. తెలంగాణ కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా ప్రోత్సహించారు కూడా.  బహుశా ఆమె తెలంగాణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బలిదానం చేసుకుని ఉండుంటే కూడా అభ్యంతరం చెప్పకుండా ఆమె త్యాగంపై కవితలూ, పాటలూ రాసేవాళ్లు. ఇప్పుడు ఆమెను కిరాతంగా చంపేసిన ప్రభుత్వం ఆమె తెలంగాణ కోసం చట్టబద్ధంగా ప్రాణం తీసుకుని ఉంటే ఆమె కుటుంబానికి లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఆమె అడవులకెళ్లి  చచ్చిపోవడమే! ప్రాణాన్ని బట్టి కాకుండా చచ్చిన ప్రాంతాన్ని బట్టి చావుకు విలువ!

శ్రుతి విద్యావంతురాలు కనుక అడవులకెళ్లకుండా ఏ  గ్రూప్-1 పోస్టో కొట్టి, ప్రజల బాగు కోసం ప్రజాస్వామికంగా పోరాడి ఉంటే, సమాజానికి కూడా మేలు చేసే అవకాశముండేదని ‘అడవుల’ వ్యతిరేకులు అంటున్నారు. శ్రుతి పోలీసు అయ్యి నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేసి వ్యవస్థను భద్రంగా కాపాడుతూ ఉండుంటే వీళ్లకు మరింత సంతోషంగా ఉండేది కాబోలు!

ప్రభుత్వాలు, రాజ్యాంగాలు నిర్దేశించిన రూపాల్లోనే ఉద్యమిస్తూ ఉండుంటే శ్రుతి మన కళ్లముందరే తిరుగుతూ ఉండేది. కానీ ఆమెకు ఈ చక్కని మనుగడ కిటుకు తెలియదు. శ్రుతి ఆలోచనలేమిటో మనకు తెలియదు కాని, ఆమె మమేకమైన ఉద్యమం ఆలోచనలు ఆమెవి కూడా కనుక ఆమె ఎందుకు అడవులకు వెళ్లిందో వాటిద్వారా తెలుసుకోవచ్చు. దేశ స్వాతంత్ర్య పోరాటం ఎంత బలహీనంగా, అడ్డగోలుగా సాగినా, దానితోపాటు,  ‘కలసి వచ్చిన‘ రెండో ప్రపంచం యుద్ధం వంటివాటితో తెల్లదొరలను దేశం నుంచి వెళ్లగొట్టి, నల్లదొరలను గద్దె ఎక్కించాం. నల్లదొరలు మన నెత్తికెక్కి తెల్లదొరలను మించిపోయారు. తెల్లదొరల పాలనలో కనిపించని నల్లకుబేరులు ఇప్పుడు ఊరికి పదిమంది, వీధికొకరు  పుట్టుకొచ్చారు. స్వతంత్ర భారతంలో  ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరే ఒకే ఒక చట్టవిరుద్ధ ఉద్యమం కూడా నక్సల్స్ రూపంలో అవతరించింది. నల్లదొరలను గద్దెదింపి సమసమాజ స్థాపనకోసం పోరాడుతోంది. దాని పోరాట రూపంపై అభ్యంతరాలు ఉండడం తప్పేమీ కాదు. కాని బ్రిటిష్ వాళ్ల పాలనలో కూడా లేనంత ఘోరంగా, కిరాతకంగా ఉద్యమకారులను చంపడం మటుకు కచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఖండించకపోవడం, ఖండించక్కర్లేదని అనడం అమానుషం, అనాగరికం, అవకాశవాదం. ఆ చావుకు చచ్చిన వాళ్లదే బాధ్యత అని తెలివిగా మాట్లాడ్డం పోలీసుల భాష మాట్లాడ్డమే.

శ్రుతి చట్టబద్ధ హత్యను సమర్థిస్తున్న వాళ్లు అల్లూరి, భగత్సింగ్, కొమురం భీంల హత్యలను కూడా సమర్థించినట్లే అవుతుంది. ఎందుకంటే వాళ్లు కూడా శ్రుతి మాదిరే ‘చెప్పుడు మాటలు’ విని  ప్రభుత్వ ఆమోదిత రూపాల్లో పోరాడకుండా, అడవులూ, ఆయుధాల బాటలూ ఎంచుకుని అనవసరంగా చచ్చారు కనుక. ‘వాళ్లు పరాయి ప్రభుత్వాన్ని కూలదోయడానికి అలాంటి మార్గం ఎంచుకోవచ్చు. కానీ మనం చెమటోడ్చి ఓటేసి ఏర్పాటుచేసుకున్న మన ప్రభుత్వాలను కూలదోయడానికి మటుకు ఆ మార్గాన్ని కాకుండా బహిరంగ, ప్రజాస్వామ్య పోరాటాలు చేయాలి’ అని అని సెలవిస్తారా? అలా అయితే, అసలు ఆ పోరాటాలే అక్కర్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎటూ  ఐదేళ్లకు ఒకసారి మారిపోయి, కూలిపోయి.. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరింత బలం పుంజుకుని వచ్చే ప్రభుత్వాలను అనవసరంగా పనులు మానుకుని, వీధుల్లోకి వెళ్లి, గొంతులు చించుకుని కూలగొట్టడమెందుకు? లేదు లేదు, ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఉద్యమించి తీరాల్సిందే అని అంటారా? అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలని ‘చెప్పుడు మాటలు’ వినే జనానికి పిలుపిస్తూ కవితలు, వ్యాసాలు రాసి, సభలు పెడితే సరిపోతుంది. ఆ పార్టీలు ప్రగతి వ్యతిరేకం అనుకుంటే సీపీఐకో, సీపీఎంకో ఓటేయమనాలి. వాటికేయడం దండగ, అవి అధికారంలోకి రావు, వచ్చినా అవి కూడా బెంగాల్ లో మాదిరి జనాన్ని పీడిస్తాయి అని అంటారా? అయితే ఎంచక్కా ఏ ప్రభుత్వమూ రావడానికి వీల్లేని ‘నోటా’ ఉండనే ఉంది. వాళ్లకు, వీళ్లకు ఓటేయాలని ఇచ్చే పిలుపులు, సభలు కూడా ఉద్యమాలకిందికే వస్తాయి అని వాదిస్తారా? అయితే అవీ అక్కర్లేదు. పార్టీలు ఆ ఉద్యమాలను దాదాపు డెబ్బై ఏళ్లుగా కన్నులపండుగగా కదం తొక్కిస్తూ నిర్వహిస్తున్నాయి కనుక..

శ్రుతి హత్యపై కవితలు, పాటలు రాయొద్దంటే అల్లూరి, భగత్సింగులపైనా, ప్రజాస్వామికబద్ధంగా హత్యకు గురయ్యే హక్కుల కార్యకర్తలపైనా రాయొద్దు. ఇలాంటి కవితల వల్లే అడవులకు వెళ్తున్నారని అడవుల వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు కాని, నిజానికి వాళ్లది శుద్ధ అనసరమైన ఆందోళన. ‘మాకొద్దీ తెల్లదొరతనమూ..’, ‘పదండి ముందుకు, పదండి తోసుకు.. ’, ‘నీ త్యాగం ఉన్నతమైనది..’ వంటి పాటలు, కవితలు మనసును కదిలించి, ఆవేశం తెప్పిస్తాయంతే. నిజానికి వాటికి ఉద్యమబాట పట్టించే శక్తే ఉంటే బ్రిటిష్ వాడు 1910లలోనే మనకు స్వాతంత్ర్యం ఇచ్చిపోయుండేవాడు. 1940లలోనే ఇప్టా కళారూపాలతో ఒక్క నెత్తురుబొట్టూ చిందకుండానే దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వచ్చుండేది. 1970లలో నక్సలైట్ల రాజ్యం వచ్చుండేది.

కనుక ఈ కవితలు, పాటలు మీరనుకున్నంత ప్రమాదకరమేమీ కావు. నిశ్చింతగా ఉండండి. సందర్భం కనుక మరో మాట.. ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ దుస్థితిని గుండెకరిగేలా, తెలంగాణ కోసం రోడ్లపైకొచ్చేలా చేసిన ప్రసంగాలు విని, రాసిన కవితలు, పాటలు పాడి.. తమ చావుతో అయినా తెలంగాణ వస్తుందేమోనని బలిదానాలు చేసుకున్నారు కొందరు ‘చెప్పుడు మాటలు’ వినే యువకులు. పాపం.. ఆ అమాయకులు ఆ పాటలు వినకపోయుంటే ప్రత్యేక, సుభిక్ష తెలంగాణాలో నిక్షేపంగా బతికుండేవాళ్లు. వాళ్ల చావులకు ఆ పాటలు రాసిన కవులు, పాడిన గాయకులు ఇప్పుడు బాధ్యత వహించాలి..! అడవులకు పంపేవాళ్లతోపాటు వీళ్లనూ బోనెక్కించాలి..!

సందర్భం కనుక మరోమాట.. అడవుల్లో చనిపోయిన ఎంటెక్ శ్రుతిపై మనం కవితలు రాస్తాం, ఆమెను అడవులకు తీసుకెళ్లి చంపించేశారని వలపోస్తాం కాని, అడవుల్లో శ్రుతిలాగే చచ్చిపోతున్నగిరిజన యువతుల గురించి, పల్లెటూరి రైతుకూలీల గురించి రాయడానికి మన కలాలు కదలవు, మన గొంతులు పెగలవు. కలాల సంగతి పక్కన బెడితే.. అలాంటి వాళ్లు అడవుల్లో చచ్చినా ఫర్లేదు, శ్రుతి లాంటి వాళ్లు మాత్రం చావకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారా జాలిగుండెల అడవుల వ్యతిరేకులు?

ప్రజాస్వామిక పోరాటాలు ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించనంతవరకు ప్రమాదకరమేమీ కాదు. కానీ శ్రుతికి వాటిపై నమ్మకం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమెకు తెలంగాణ వచ్చాక కూడా అసంతృప్తి పోలేదు. తన కలలు కల్లలయ్యాయని భావించింది. అందుకే మరో మార్గం ఎంచుకుంది. ఆమె అడవులకెళ్లిందని తప్పుబడుతున్న మనం ఆమె అలా వెళ్లకుండా ఉండడానికి, మన మధ్యే ఉండి పోరాడడానికి ఆమెకు బహిరంగ ప్రజాస్వామ్య ఉద్యమాలపై గట్టి నమ్మకం కలిగించామా? రెండు రెండు నాలుగు అంటే జైళ్లు నోళ్లు తెరవడం కాదు.. కేసులు, హత్యల దాకా వెళ్లే మన ఘన ప్రజాస్వామ్యంలో చేస్తున్న రాజ్యాంగబద్ధ ఉద్యమాలు విజయం సాధించి తీరతాయని ఆమెకు గట్టి విశ్వాసం కలిగించామా? కలిగించడానికి ఏమన్నా చేశామా?

1969 నాటి ప్రత్యేక తెలంగాణ పోరులో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన 369 మంది, 1975నాటి ఎమర్జెన్సీలో జైళ్లలో చిత్రహింసలకు గురై కన్నుమూసి స్నేహలతారెడ్డి వంటి వాళ్ల నుంచి మొదలుకుని.. నిన్నమొన్నటి బషీర్ బాగ్ కాల్పుల్లో(2000) చచ్చిపోయిన ముగ్గురు, ఖమ్మం ముదిగొండ కాల్పుల్లో(2007) చనిపోయిన ఏడుగురు, సోంపేట కాల్పుల్లో(2010) చచ్చిపోయిన నలుగురు.. ఇంకా అనేకచోట్ల ప్రభుత్వం చట్టబద్ధంగా పొట్టనబెట్టుకున్న వాళ్లందరూ  ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడారు. వీళ్లలో ఎవరూ ఆయుధాలు పట్టుకోలేదు. వీళ్లెవరూ అడవుల్లో వాగు ఒడ్డున శ్రుతిలా నీళ్లు తాగుతూ.. ఢిల్లీ, హైదరాబాద్ లలోని ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించి వాళ్లు కాదు. కానీ.. శాంతిభద్రతలకు ‘భంగం’ కలిగించిన వీళ్లు, ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్టయి, జైళ్లలో ఉండాల్సిన వీళ్లు కూడా శ్రుతి మాదిరే రాజ్యాంగబద్ధంగా ఎన్ కౌంటర్ అయ్యారు. శ్రుతి ‘కాస్త తెలివైన’ పిల్ల కనుక అలా ఉత్తిపుణ్యానికి చావకుండా తన చావుపై కన్నీటి, గుండెతడి కవిత్వం, పాటలు రాయించుకోవడానికి అడవులకు వెళ్లింది!! ఆమెకు బషీర్ బాగ్, సోంపేట వంటి ప్రజాస్వామిక, చట్టబద్ధ, ప్రభుత్వామోదిత, ‘గెలుపు గ్యారంటీ’ ఉద్యమాలపై నమ్మకం కలిగించని మనం మాత్రం అడవులంటే జడుసుకుంటూ, మిగిలిన వాళ్లను జడిపిస్తూ బతుకుతున్నాం..

మనకు మన రాజ్యాంగాలు, చట్టాలు, ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు నిర్దేశించిన బాటలోనే ఒక్క అంగుళం, అటూ ఇటు కదలకుండా మనవైన ప్రెంచి, రష్యన్, చైనా మహా విప్లవాలు రావాలి. 1857లు, 1942 క్విట్ ఇండియాలు, 1946-51 తెలంగాణ రైతు పోరాటాలు.. చరిత్రను కుదిపిన అనేకానేక విప్లవాలు, పోరాటాలు అన్నీ ఒక్క నెత్తురు బొట్టు కూడా నేలరాలకుండా కొనసాగాలి. అన్యాయం, అక్రమాలపై మన నోళ్లు నిరంతరం నినదిస్తూనే ఉండాలి, మన పిడికిళ్లు బిగుస్తూనే ఉండాలి. అయితే అందుకు శక్తినిచ్చేందుకు మన చిన్ని బొజ్జలకు నిరంతరం శ్రీరామరక్ష కూడా కావాలి. దీనికి మరీ అంత తప్పనిసరైతే మన బిడ్డలు ప్రజాస్వామిక జలియన్ వాలా బాగ్ లలో చస్తే చావొచ్చు కానీ అడవులకెళ్లి మాత్రం చావకూడదు..!

*

 

 

 

 

మీ మాటలు

 1. చందు తులసి says:

  అవును సత్యమూర్తి గారూ….పోరాడకున్నా ఫరవాలేదు. త్యాగం చేసినవారిని గుర్తించకపోవడం విషాదం.. ప్రత్యేక తెలంగాణోద్యమంలో వెల్లువెత్తిన సృజన ఒక్కసారిగా ఇంకి పోవడం మహా విషాదం.

 2. Mandala ka kameswar rao raju says:

  తేలంగాణా మేధావులందరూ గళం కలపండి….
  ప్రగల్భాలు పలికిన రాజకీయనాయకుల్ని నిలదీయండి….

 3. అసలెలాంటి స్పందనా ఉండకూడదట….!

  • సత్యమూర్తి says:

   బుద్ధి, మనసు, గుండె, చర్మం, కళ్లు, చెవులు.. అన్నీ మొద్దుబారిపోయినపోయిన వాళ్లు అలానే అంటారండి రాఘవగారు..

 4. మంచి ప్రశ్నలు లేవనెత్తారు.

 5. శ్రీలంక యుద్ధం లో మిలిటరివాళ్లు ల్ట్టే మహిళా కార్యకర్తలను ఎంత దారుణంగా హింసించి చంపారో, అలాంటి దారుణం ఇక్కడా చూశాం, భయానకమైన వాతావారణం. మార్పు కోసం పోరాడిల్సివస్తే, పోరాట రూపం, మైదానమా, అడవా అన్న స్థల కాలాదులను పోరాటవాదులు పట్టించుకోరు, శ్వేత అదే చేసింది.బలిదానలు చేసి తెచ్చుకున్న రాజ్యంలో జరగాల్సింది ఇదేనా?

 6. శ్రీలంక యుద్ధం లో మిలిటరివాళ్లు ఎల్. టి. టి. ఈ. మహిళా కార్యకర్తలను ఎంత దారుణంగా హింసించి చంపారో, అలాంటి దారుణం ఇక్కడా చూశాం, భయానకమైన వాతావారణం. మార్పు కోసం పోరాడిల్సివస్తే, పోరాట రూపం, మైదానమా, అడవా అన్న స్థల కాలాదులను పోరాటవాదులు పట్టించుకోరు, శ్వేత అదే చేసింది.బలిదానలు చేసి తెచ్చుకున్న రాజ్యంలో జరగాల్సింది ఇదేనా?

 7. హరిహర says:

  స్వతంత్ర భారతంలో ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరే ఒకే ఒక చట్టవిరుద్ధ ఉద్యమం కూడా నక్సల్స్ రూపంలో అవతరించింది. నల్లదొరలను గద్దెదింపి సమసమాజ స్థాపనకోసం పోరాడుతోంది! ఇంతకీ మీరు నల్లగా వున్నారా తెల్లగా వున్నారా? సమసమాజం అంటే ఏమిటి? అది మీరు ఎలా సాధించగలము అని భావిస్తున్నారు? దానికోసం ఎందరు యువకులు మీకు కావాలి? ఓట్లు వేసి నాయకులిని గెలిపించుకునే జనాలకి మీరు ఏమి సందేశం ఇస్తారు? మీ ఉధ్యయం 50 సంవత్స్తారాలనుంది జరుగుతోంది కదా, మీరు ఏం సాధించారు? మీరు స్వచ్మైన మనుషులా? మీ స్వచ్చత శాస్వతమా? మీకు రాజ్యం ఇస్తే దానీలో అచ్చంగా స్వార్ధం జనిమ్చని నాయకులనే నిలపగాలరా? దానికి మీ దగ్గర ఏక్షన్ ప్లాన్ ఉందా? జనాలకి మీరంటే చాల భయం. మీ దాగ్గర తుపాకీలు వున్నాయని. మీకు ఆ విష్యం తెలుసా. రెండో ప్రపంచయుద్ధంలో మీరు రెండుసార్లు మాట మార్చారు. అచ్చంగా మన దేశానికి చెందినా లక్ష్యాలు మీ దాగార ఉన్నాయా. ఆవేశం కాకుండా మీ దగ్గరవున్న ప్రణాలికలు మా అందరికీ చెప్పండి. మాకూ నమ్మకం కలిగించండి. నియంతుత్రంగా కాకుండా నిదానంగా మమ్మల్ని ఒప్పించండి. ఎలక్షన్లో నిలబడండి. మీకే ఓటు వేస్తాం. దిల్లీలో గెలిచారుగా సాదా సీదా జనం అమ్ ఆద్మీ పేరుతో. రండి. మీరు మాతో ఒకటిగా వుండండి. అలాంటి ప్రభంజనం కోసం మేము చూస్తున్నాం. మాకోస వస్తామంటే ఎందుకు వద్దని అంటాం. ఉల్లిపాయలు కందిపప్పు కొనలేక చస్తున్నాం. మీరు వస్తే అవి రేటు తగ్గేలా చూస్తారా? మాకూ రేషన్ ఎంత ఇస్తారు? సమ సమాజంలో ఎవరి తెలివికి తగ్గా భవిష్యత్తు వారికి వున్దోచ్చాలేక అందరూ సమానంగా ఉండాలా. ముందర ఇవి మాకూ చెప్పండి. ఇంతకీ ……సర్లే . ముందు ఇవి చెప్పండి

 8. సత్యమూర్తి says:

  మీరు సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా స్పందించండి. నేనే కాదు, ఇండియా లోని వాళ్ళందరూ నల్లవాల్లె. నేను దొరను కాదు. maoist ఉద్యమ ప్రతినిదినీ కాను.ఇన్ని ప్రశ్నలు వేసిన మీకు సమసమాజం అంటే ఏమిటో తప్పక తెలిసే వుంటుంది. బూటకపు స్వాతంత్ర్యం తెచ్చుకోడానికే 200 ఏళ్ళు పట్టింది. నక్సలైట్ల రాజ్యం వస్తే పని చేసే అందరికీ ఉల్లిపాయలు, కందిపప్పే కాదు, చికెన్, మటన్, బీఫ్ అన్నీ అందుబాటులోకి వస్తాయి..

  • ఆరి సీతారామయ్య says:

   “నక్సలైట్ల రాజ్యం వస్తే పని చేసే అందరికీ ఉల్లిపాయలు, కందిపప్పే కాదు, చికెన్, మటన్, బీఫ్ అన్నీ అందుబాటులోకి వస్తాయి..”

   కొంచెం కాడా చరిత్ర తెలియక పోయినట్లయితే మీమాట నమ్మే వాడిని. కానీ ఇంతకు ముందు ఈ బాటన నడిచిన సోవియట్ యూనియన్, చైనా ప్రభుత్వాలు వాళ్ళ పౌరులకు కనీస సౌకర్యాలు అందించలేకే పతనమయ్యాయి. నక్సలైట్ల రాజ్యం మరోలా ఉంటుందని ఎలా నమ్మటం?

   ప్రజాస్వామ్యం అనేమాటను ఊతపదం లాగా వాడతారు ఎర్ర చొక్కాలేసుకునే వారు. ప్రజా స్వామ్యం అంటే ఎంటో తెలిస్తే పదహారు రకాల ఎం ఎల్ పార్టీలు ఎందుకు తయారవుతాయి? భిన్నాభిప్రాయాలకు చోటులేకేకదా? స్టాలిన్లూ మావోలు పోల్ పాట్లూ ఈ చెట్టుకు కాసిన కాయలే గదా?

   నాక్కూడా వీరి మీద సానుభూతి ఉంది. సానుభూతి కంటే ఎక్కువే ఉంది. కానీ ఎర్ర చొక్కాల వాళ్ళు ఎవ్వరూ చదువుతున్నట్లు లేదు. అన్నీ కాపిటల్లోనే ఉన్నాయష దగ్గర ఆగిపోయారు. దాన్ని కూడా చదువుతున్నట్లు లేదు. సిద్ధాంతం ఆచరణలో ఎందుకు సాధ్యం కావటంలేదు, ఎం మార్పులు రావాలి, అని అడుగుతున్నట్లు లేదు. బాలగోపాల్ గారి లాగా ఆలోచించిన మనుషులు వీళ్ళలో లేరు. కొత్త ఆలోచన వచ్చిందాకా తుపాకి పట్టుకోవటంవల్ల మంచి మనుషులు చావటం తప్ప మరేమీ జరగదు.

   ఇక మనం తెచ్చుకున్న తెలంగాణా ప్రభుత్వమే కాల్పులు జరిపిందా అని ఆశ్చర్యపోతున్న వామ పక్ష మేధావులను చూస్తుంటే జాలేస్తుంది నాకు. నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, కారణం నీకు అనవసరం అనే వాడితో నాకు పేచీ లేదు. వీళ్ళలో కనీస నిజాయితీ ఉంది. ఆంధ్రావాళ్ళు మా భాషను అవమానించారు, అందువల్ల మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే వారితోనూ పేచీ లేదు. వీరూ నిజాయితీ పరులే. తెలంగాణా వస్తే ప్రజాప్రభుత్వం వస్తుంది, అందువల్ల మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పిన మహాను భావులున్నారే – వీళ్ళను ఏమనాలో చెప్పమంటారా? వొద్దులేండి, మర్యాదగా ఉండదు. అమాయకులు అనుకుందాం.

   ముగించే ముందు మీ వ్యాసాన్ని చాలా బాగా రాసినందుకు అభినందనలు.

   ఆరి సీతారామయ్య

   • సత్యమూర్తి says:

    మీ స్పందనకు ధన్యవాదాలు సీతారామయ్యగారు.
    నేను చరిత్ర తెలియని ఎవరినో నమ్మించడానికి కాకుండా నా అభిప్రాయాలు పంచుకోడానికి ఇది రాశాను. సోవియట్, విప్లవ చైనా ప్రభుత్వాలు ఎందుకు పతనమయ్యాయన్నది అందరికీ తెలిసిందే. మన దేశంలో సార్వభౌమ, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర వ్యవస్థ పతనం అయినట్టే అవీ అయ్యాయి. దానికి ఆయా నాయకత్వాలను తప్పుబట్టాలి కాని, ఆయా సిద్ధాంతాలను, విలువలను తప్పుబట్టకూడదు.
    నక్సలైట్ల రాజ్యం ముందు రానివ్వండి. తర్వాత చూద్దాం అది ఎలా ఉంటుందో. నాకు సరిగ్గా తెలియదు కాని, జనతన సర్కార్ పై వచ్చిన పుస్తకాల్లో మీకు ఆ వివరాలు దొరకొచ్చు.
    ప్రజాస్వామ్యం ఎక్కువయ్యే ఎంఎల్ పార్టీలు అన్ని చీలికలయ్యాయి. నక్సలైట్లు ప్రజాస్వామికంగా ఉండరని ఆరోపించేవాళ్లు ఈ చీలికలను చూసి సంతోషపడాలిగాని, ఏడవడం ఎందుకు?
    దభోల్కర్, పన్సారే, కల్బుర్గి వంటి వ్యవస్థకు ప్రమాదరకరం కాని హేతువాదులకే రక్షణ లేని దేశం మనది. ఇక వ్యవస్థను కూల్చే బాలగోపాల్ వంటి వాళ్లు ఉద్భవిస్తే ఇంకేమైనా ఉందా? అయినా ఇలాంటి వాళ్లు ప్రజాస్వామికంగా హత్యకు గురవుతుంటే నోళ్లు విప్పని మనం తుపాకులు, విప్లవాలు, మావోలు, స్టాలిన్ల గురించి మాట్టాడుకోవడం దండగ.(వ్యక్తిగతంగా తీసుకోకండి.. ఈ పరిస్థితికి మనమందరం బాధ్యులమని నా ఆవేదన. అర్థం చేసుకుంటారనుకుంటాను)
    తెలంగాణపై మీ స్పందన బావుంది. టీపీపీ ఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో, వ్యవస్థను భద్రంగా కాపాడే ఉద్యోగాలు ఎలా కొట్టాలో చెబుతూ రోజూ సీమాంధ్ర పేపర్లలో బారెడుబారెడు వ్యాసాలు రాస్తున్న తెలంగాణ మేధావులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించే తీరికెక్కడిది?

 9. “శ్రుతి ఎంచుకున్న మార్గం మంచిదా, చెడ్డదా అని ప్రశ్నించుకునే ముందు ఆమెను కిరాతకంగా చంపడం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్నా వేసుకోవాలి. దీనికి వచ్చే జవాబును బట్టే ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలుస్తుంది. ” – చాలా నిఖార్సైన గీటురాయిని మా ముందు పెట్టారు. సత్యమూర్తి గారూ..ఇక ఎవరైనా సరే…ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే, చర్చల్లో ముందుకు కదలాలి, మనకు చెప్పక పోయినా కనీసం వారి ఆత్మసాక్షి వారిని నిలదీస్తుంది…తప్పించుకోలేరు….

 10. buchi reddy gangula says:

  సత్య మూర్తి గారు

  చాల బాగా రాశారు sir…. salutes…

  అసలు మన దేశం లో ప్రజా సామ్యం ఉందా —- దేశం లో — రాష్ట్రాల లో —family..పాలనలేగా ?–
  రాజుల పాలన — దొర — దొర సానుల పాలన —వారసత్వ రాజకీయాలు –పాలనలు ??
  మారింది ఎక్కడ ??
  నేటి కవులు — చెప్పేది — రాసేది ఒకటి —-నీతుల వరకే —- చేతల్లో తప్పుల తడకలు ??
  Warangal encounter….అన్యాయం — తెలంగాణా ప్రబుత్వం — చేసిన కిరాతక చర్య
  అంతా క్లుప్తంగా మూర్తి గారు రాశారు — యిక చెప్పేది అంటూ ????

  editorial..board.. కు మనవి
  ————————————————
  opinions… మారు పేర్లతో రాసినవి ప్రకటించడం దేనికి ?? స్వంత పేర్లతో రాయడం లో
  తప్పు ఏముంది —-మేధావులు –site. మిది — నిర్నయెం మిది ????
  ————————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 11. Bombardment on pseudo democrats .

 12. Well said, Satyamurthy garu.
  వీళ్ళందరికీ ఒక సులువు వుంది. పోలీసుల్ని, రాజ్యాన్ని, సంఘ్ పరివార్నిఏమీ అనక్కర్లేదు. అంటే, అనరు. అనలేరు.
  కానీ, శ్రుతిలాటి వాళ్ళని అనడం సులువు. అత్యంత సులభమైంది. మీరన్నట్టు, శ్రుతులు, సాగర్లు వెళ్లకపోయినా అడవుల్లో ప్రతియేటా మలేరియా బారిన పడి, నిశ్సబ్దంగా అంతరించి పోతున్న వేలాది మంది యువతీ, యువకులు, పిల్లలు, వృద్ధుల సంగతి వీళ్ళకి తెలీదు. వాళ్ళు ఎవ్వరి మాటా వినకపోయినా చచ్చిపోతున్నారు. కానీ, అలాటి వాళ్లకు కళ్ళూ, కాళ్ళూ, నోరూ అయి పోరాడే వివేక్, శ్రుతి, సాగర్లు — వాళ్లకు మద్దతిచ్చే వాళ్ళు మాత్రం పంటికింద రాయిలా తగులుతున్నారు.
  చీకటి రాజ్యం గురించి కవిత్వం ఉండదా — తప్పక వుంటుంది, చీకటి మీద ఉంటుందని బ్రెహ్ట్ అన్నాడు.
  రాయడమే కవుల, రచయితల బాధ్యత — ఎవ్వరికి కంటగింపు అయినా, నిద్రలు కోల్పోయినా, ఇబ్బందిగా వున్నా — చీకటి దిబ్బ రాజ్యపు హనన చరిత్రని కవులు రాస్తూనే వుంటారు.

 13. buchi reddy gangula says:

  నేడు — తెలంగాణా ఉద్యమ నేత — ప్రోఫెస్సేర్ కోదండ రామ్ గారు కూడా
  వరంగల్ ఎన్కౌంటర్ తప్పు — అన్యాయెం అని STATEMENT…యిచ్చారు

  చక్రవర్తి — ముఖ్యమంత్రి గారు — నేటికి ఎన్కౌంటర్ గురించి కాని రయితుల
  ఆత్మహత్యల గురించి కాని — కల్తి కళ్ళు తో చనిపోవదాల గురించి కాని స్పందించలేదు —

  ప్రజా తెలంగాణ — బంగారు telangana– బిగ్ జోక్
  ———————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 14. “తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆమెకు ఆ పోరాటాన్ని మించినదేదో సాయుధపోరాటంలో ఉందనిపించి అటువైపు వెళ్లింది.” సాయుధ పోరాట భావాల వలన తెలంగాణా ఉద్యమం లోకి వచ్చింది గాని ప్రత్యెక తెలంగాణా వల్ల అటు వెళ్ళ లేదు. – ప్రభాకర్

 15. m.viswanadhareddy says:

  “శ్రుతి వంటి అమాయక పిల్లలకు మాయమాటలు చెప్పి సాయుధ పోరాటంలోకి పంపి ప్రాణాలు తీయిస్తున్నారని కొందరు కొందరిని పేర్లు ప్రస్తావించకుండా తిట్టారు.”
  అంతా వంచనే తిట్ల రూపం కూడా వంచనా శిల్పాన్ని సమ కుర్చుకొంది. ఆరోపణలు ఎటు అసత్య రూపాలుగానే వుంటాయి వెనకటికి ఒక మంత్రి రైతు ఆత్మహత్యలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల జరుగుతాయని సెలవిచ్చాడు
  ఆ వెనకటికి ఒకాయన రైతులు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం కోసం చచ్చిపోతారు . మొరిగాడు . వర్గ బ్రష్ట బికారి గాలిమూక అందలాలు ఎక్కితే statements ఇలాగే అఘోరిస్తాయి

 16. delhi subrahmanyam says:

  చాలా మంచి విశ్లేషణ సత్యమూర్తి గారు. శ్రుతి నాన్న గారు, చెల్లెలూ చెప్పిన తర్వాత కూడా, శృతి మరణనానికి ఎవరో రాసిన కవితలే అనడం కేవలో మూర్ఖత్వమే కాక ఒక రకం గ ఈ హత్యలు చేస్తున్న రాజ్యాంగాన్ని బలపరచడమే అవుతుంది. ఇంతకన్నా దుర్మార్గమూ దౌర్ఘాగ్యమూ బహుశా ఇంకెక్కడా ఉండదేమో. ప్రజాస్వామికంగా పోరాడాలనే ఈ కుహనా మేధావులకి పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు 100 రోజులు గా చేస్తున్న ఆందోళన లో ప్రభుత్వం ఒక అంగుళం కూడా కదల లేదని తెలుసు. ఇప్పుడు ఇలాంటి కవితలను విమర్శించడం పెద్ద శారద అయిపొయింది..

మీ మాటలు

*