చలో అమెరికా

 

 

Prajna-1“రెండు సార్లు వెళ్లొచ్చాము. చాలు శైలూ, నాకు బోర్ అక్కడ. కావాలంటే నువ్వు వెళ్ళిరా” కుమార్ పేపర్ తిరగేస్తూ గట్టిగా అని ‘చాకిరీ చెయ్యాలి వెళ్ళి, ఎవడు చేస్తాడు’ తనలో తనే గొణుక్కున్నాడు.

“పాపం పిల్లలు అడిగారండీ, వెళ్లొద్దాము. రెండే నెలలు” శైలజ అంది.

“ఎందుకు? పాచి పనులకా? నేను రాను బాబోయి. ఈ సారి నన్ను ఫోర్స్ చెయ్యద్దు శైలజ. నేను అక్కడ బ్రతకలేను. నిన్ను వెళ్లమంటున్నా కదా” అని అప్పుడే ఇంటికి వచ్చిన చెల్లెలిని పలకరించి సిగరెట్ తాగటానికి బయటకి వెళ్లిపోయాడు.

“ఏంటి వదినా, అన్నయ్య కోపంలో ఉన్నట్టున్నాడు? ఏం జరిగింది?” గాయత్రి పచ్చడి గిన్నె టేబుల్ మీద పెడుతూ అడిగింది.

“ఆకాష్ వాళ్ళు రమ్మన్నారు శాన్ ఫ్రాన్సిస్కో కి. ఈయన అక్కర్లేదు అంటున్నారు. రెండు సార్లకే అమెరికా అంటే మోజు పోయింది ఈయనకి” శైలజ వాపోయింది. కానీ కుమార్ నో అన్నందుకు ఆమెకి కూడా నిశ్చింతగా ఉంది.

“అదేంటి వదినా, ఒక్కగానొక్క కొడుకు, అమెరికా లో ఉంటున్నాడు. వాడి దగ్గరకి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు ట అన్నయ్య? ఇప్పుడు అయితే మా అల్లుడు వాళ్ళు ఇక్కడికొచ్చేశారు గాని, వాళ్ళు ‘న్యూ జెర్సీ’ లో ఉన్నప్పుడు మేము ఆరు సార్లు మాత్రమే వెళ్ళొచ్చాము అంతే! కాని మా వారికి మాత్రం రెండు సార్లకే బోర్ కొట్టేసింది. మగవాళ్ళకి తోచదు అక్కడ. నేను రేపు మళ్ళీ వచ్చి సర్ది చెప్తానులే అన్నయ్య కి” అని గాయత్రి హామీ ఇచ్చి వెళ్లిపోయింది.

రాత్రి భోజనం చేశాక,  టి‌వి చూస్తున్న కుమార్ దగ్గరకొచ్చి “కుమార్ గారూ” అని నవ్వింది శైలజ.

“మళ్ళీ మొదలెట్టకు. నాది ఫైనల్ డెసిషన్…” అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, శైలజ “నాకు కూడా వెళ్లాలని లేదండి” అని మెల్లిగా చెప్పింది.

“అదేంటి? నువ్వు హుషారుగా వెళ్దాము అంటున్నావు అని అనుకున్నానే నేను! కాదా? ఏమైంది?” కుమార్ టి‌వి ఆపేసి, భార్య వైపు చూస్తూ అడిగాడు.

“నాక్కూడా బోర్ అక్కడ. ఇక్కడే మన పనులు చేసుకుంటూ హాపీ గా ఉందాము. ఇకపై మన దగ్గరకే అప్పుడప్పుడు పిల్లలు వస్తారు” అని చెప్పేసి, లోపలకెళ్లి పడుకుంది.

ఈ హటాత్ పరిమాణానికి ఎలా స్పందించాలో తెలియక కుమార్ మళ్ళీ టి‌వి పెట్టుకొని చూశాడు.

పడుకున్నమాటే కానీ, నిద్ర పట్టడంలేదు. పొద్దున గాయత్రి మాటలు గుర్తు తెచ్చుకుంది. అమెరికా కి వెళ్ళడం ‘ఆరు సార్లు’ అన్నది ‘మాత్రమే’ నా అని ఆశ్చర్యపోయింది శైలజ. ఒకప్పుడు తాను కూడా ఇలాగే అమెరికా అమెరికా అని ఎగురుకుంటూ వెళ్లింది. మొదటి సారి బానే ఉంటుంది. అది కూడా బయటకి వెళ్తేనే. తర్వాత నుండి ఇంట్లోనే పడుంటూ ఎక్కడలేని డిప్రెషన్, కోపం, చిరాకులు మన వశమవుతాయి. అలా ఆలోచిస్తుండగా శైలజ తొలి అమెరికా ప్రయాణం, ఆ విషయాలు గుర్తుతెచ్చుకోవటం మొదలుపెట్టింది.

 

మూడేళ్ళ క్రితం, శాన్ ఫ్రాన్సిస్కో

“ఫ్లైట్ లాండ్ అయింది, లేవండి లేవండి బయలుదేరుదాము”, అంటూ అరుస్తూ కాబిన్ బాగేజ్ తీస్తూ శైలజ అంటోంది.

“ఇదేమి ఎర్ర బస్సు కాదు. ఆపిన వెంటనే రై రై మంటూ దిగిపోవడానికి. ఇప్పటిదాకా ఫ్లైట్ లో ఇది బాగుంది, అది బాగుంది అన్నావు. ఇప్పుడేమో ఎప్పుడు దిగిపోదామ అన్నట్టున్నావు. మరీ చిన్నపిల్లలగా చేస్తున్నావు శైలూ, అందరూ మనల్నే చూస్తున్నారు” చుట్టూరా చూస్తూ ఇబ్బందిపడుతూ కుమార్ అన్నాడు.

“ఎయిర్ బస్ అయినా, ఎర్ర బస్ అయినా ఒకటే నాకు. త్వరగా దిగండీ, ఆకాష్ వాళ్ళు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు” అంటూ హాండ్ బాగ్ ని భుజం మీద సర్దుకుంటూ శైలజ అంటోంది.

శైలజ ని కుర్చీలోకి లాగి, “ఆగుతావా, ఎందుకంత ఖంగారు, మెల్లిగా” అన్నాడు కుమార్.

ఇలా వీళ్ళ గిల్లికజ్జాలతో ఫ్లైట్ దిగటం, ఎయిర్ పోర్ట్ లో బాగేజ్ పికప్ జరిగి, మొత్తానికి అర్రైవల్స్ బయటకొచ్చారు. అక్కడ రోడ్ పక్కన కార్ ఆపి, షార్ట్స్ లో నించుని ఉన్న ఆకాష్ ని చూసి బాగ్ వదిలేసి శైలజ పరిగెత్తబోయింది. ఈ లోగా వేగంగా ఒక కార్ రావడం, శైలజ ని కుమార్ వెనక్కి లాగటం, కార్ వెళ్లిపోవడం అన్నీ ఒక క్షణంలో జరిగిపోయాయి. కొంచముండుంటే ఆ కార్ కింద పడుండేది శైలజ.

“వెధవ ఖంగారు నువ్వును” అని కుమార్ గట్టిగా అరిచాడు.

వాళ్ళ దగ్గరకొచ్చి, ఇద్దరినీ హగ్ చేసుకొని, “వాడేవాడో ఈ లేన్ లో తప్పుగా వచ్చాడు నాన్నా! అమ్మది తప్పు కాదు” ఆకాష్ అన్నాడు.

“చూసారా, అమెరికా నన్ను ఏమి చేయదు” అంటూ గొప్పగా చెప్పి, కొడుకుని ముద్దాడి, “ఏవిట్రా ఈ నిక్కర్, చక్కగా పాంట్ వేసుకొచ్చుగా” అని శైలజ అడిగింది.

“నిక్కరూ, లాగూ కాదమ్మా! షార్ట్స్ ఇవి. సమ్మర్ లో ఇవి కాకపోతే ఏం వేసుకుంటాము మరి, పద పద” అని అన్నాడు.

కార్ లో లగేజ్ సర్ది, కుమార్ ని ముందర కూర్చోమని చెప్పి, ఇంటికి బయలుదేరారు.

“ఇక్కడ సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి నాన్నా, లేదంటే కాప్స్ ఆపి టికెట్ ఇస్తారు”

“కాప్స్ అంటే?” బయట ఎత్తైన కట్టడాలు, భవనాలు చూసి మురిసిపోతూ శైలజ అడిగింది.

“పోలీసులు శైలూ, అందుకే ఆ సీరియళ్ళు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇంగ్లిష్ సినిమాలు చూడమనేది” కుమార్ అన్నాడు.

ఒక ఇరవై నిముషాల ప్రయాణం అయ్యాక ఇల్లు చేరుకున్నారు.

“ఒరేయి ఫొటోల్లో పెద్దగా ఉంది ఇల్లు, ఇప్పుడేంట్రా చిన్నగా కనిపిస్తోంది” అడిగింది శైలజ.

“అమ్మా, ఫోటోలో మొత్తం బిల్డింగ్ చూసావు. మనది ఒక అపార్ట్మెంట్ అంతే. రెండేళ్లలో పెద్ద ఇంట్లోకి మూవ్ అవుతాము” అంటూ లగేజ్ ని ఇంట్లోకి తీసుకొచ్చాడు.

“రండి అత్తయ్యా , రండి మావయ్యా… ఎలా ఉన్నారు ? ఎలా జరిగింది జర్నీ ?” అని వచ్చి ప్రియ ఆప్యాయంగా అడిగింది.

“బాగా జరిగిందమ్మా” అని కుమార్ అన్నాడు.

“యా. సూపర్. నాకు అమెరికా బాగా నచ్చేసింది. నువ్వు బాగున్నావా ప్రియా?” అనుకుంటూ వచ్చి కోడలిని హగ్ చేసుకుంది.

“కొంచం ఓవర్ గా లేదు? వచ్చి గంట కూడా అవ్వలేదు, అప్పుడే ఎలా నచ్చేసింది ఊరు?” కుమార్ విస్తుపోతూ అడిగాడు.

“మీరు ఊరుకోండి. నాకు నచ్చేసింది అంతే. ప్రియా పద, ఆకలి వేస్తోంది. ఏం వండావు?” అనుకుంటూ లోపలికి వెళ్లింది శైలజ.

“ఆకాష్, మీ అమ్మ తో జాగ్రత్తగా ఉండరా, ఇక్కడే ఉండిపోతా అంటుందేమో రేపే” అని వెటకారంగా కుమార్ అన్నాడు.

“ఏంటి నాన్న మీరు కూడా”

“నిజంగా రా. అమెరికా ప్రయాణం అనగానే చూడు ఎన్ని చూడిధార్ లు కొనుక్కుందో. ఇండియా లో వేసుకొమంటే ఛీ, థూ అనేది. ఇక్కడకి అనగానే వేసుకొచ్చేసింది”

“ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటారా నాన్నా, పదండి ఫ్రెష్ అవండి”

—-

ఆ రోజంతా ఇంట్లోనే గడిపారు. టి‌వి లో తెలుగు ఛానెల్స్ రావట్లేదు అని శైలజ తెగ ఫీల్ అవడంతో, మరునాడే ఆ ఏర్పాట్లు చేశాడు ఆకాష్.

“ఆ బాటిల్స్ ఏంట్రా ఫ్రీడ్జ్ మీద?” శైలజ ఆశ్చర్యంగా అడిగింది.

“విస్కీ, వోడ్కా అమ్మా” అని వాళ్ళ నాన్న వైపు తిరిగి ‘అమ్మ లేనపుడు తాగేసేయ్’ అన్నట్టు కన్నుకొట్టాడు.

“అన్నీ మందేనా? అన్నున్నాయి ఏంటి? ఏంట్రా తాగుబోతువి అయిపోయావా? ప్రియా ఏంటిది” అని ఖంగారుగా అడిగింది.

“లేదు అత్తయ్యా. నెలకి ఒక సారి అంతే, అది కూడా పార్టీ ఉంటేనే. డోంట్ వర్రీ” అని ప్రియ హామీ ఇచ్చింది.

పడుకునే ముందు, కుమార్ తో శైలజ “యేవండి, మీరు స్నానం చేశారా ఇందాక?” అని అడిగింది.

“యా చేశాను. ఏమి?”

“నేను సరిగ్గా చేయలేదు”

“అంటే?” కన్ఫ్యూషన్ లో అడిగాడు కుమార్.

“ఆ టబ్ లో నాకు చేయడం రాలేదు. ఏది తిప్పితే వేడి నీళ్లొస్తాయో తెలియలేదు. చల్లనీళ్ళతో కానిచ్చేశాను. పైగా ఆ టబ్ లో ఇరుకుగా ఉండింది”

“ఓహో మనం అగ్రహారం బాచ్ కదా. అందుకే అమెరికా అనగానే లగెత్తుకొని వచ్చేయటం కాదు. కొంచం రీసెర్చి చేయాలి. అయినా, ఇది నీ కొడుకు ఇల్లే కదా? ఒక కేక వేసి అడిగుండొచ్చు కదా?”

“ఏమో నండి. నాకు మొహమాటం. రేపు చూపిద్దురు”

“అలాగలాగే పడుకో. రేపు పొద్దునే లేచి గుడికి వెళ్ళాలి”

—-

మరునాడు ఆదివారం. ఉదయం వాళ్ళిద్దరినీ దగ్గరిలో ఉన్న గుడికి తీసుకువెళ్లాడు ఆకాష్. అన్ని దేవుడి విగ్రహాలు వరుసగా ఒక రూమ్ లో ఉన్నాయి.

“ఇది గుడెవిట్రా నా మొహం, ముక్కోటి దేవతలనీ ఒకే చోట ఉంచేస్తే గుడి అంటారా?” ఆశ్చర్యపోతూ అడిగింది శైలజ.

“ఇక్కడ గుళ్ళు ఇలాగే ఉంటాయమ్మ”

“ సైలెంట్ గా దణ్ణం పెట్టుకో శైలజ” అని కుమార్ కసురుకున్నాడు.

గుడి నుండి కార్లో బయలుదేరి, “ఇప్పుడు మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనే చోటకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది ప్లేస్, అక్కడకి ప్రియ డైరెక్ట్ గా వచ్చేస్తుంది” అని ఆకాష్ చెప్పాడు.

 

గోల్డెన్ గేట్ పార్క్ లో కాసేపు తిరిగేశాక లంచ్ కి అక్కడ దగ్గరలో ఉన్న పిజ్జా పాలస్ కి వెళ్లారు.

“ఏది పడితే అది ఆర్డర్ చేయకు అమ్మా. ప్రియ నీకు ఏది వెజిటేరియనో చెబుతుంది. చూసి తీసుకో. నేను, నాన్నా ఇప్పుడే వస్తాము” అని ఆకాష్ చెప్పేసి వెళ్లిపోయాడు.

“అత్తయ్య, ఇక్కడ చీజ్ పిజ్జా మాత్రమే ఉంది వెజిటేరియన్ లో. తెచ్చేయనా?” ప్రియ మెను చూస్తూ అడిగింది.

“అలాగే కానీ, వీడు సిగరెట్లు మానలేదా? ఎక్కడికి వెళ్లారు ఇద్దరూ?” శైలజ విసుగ్గా అడిగింది.

“అదేమీ లేదు అత్తయ్యా, అలా రెస్ట్ రూమ్ కి వెళ్లారు అంతే” ప్రియ కవర్ చేసింది.

 

శైలజ చుట్టూరా చూస్తోంది, స్వదేశీలు ఎవరైనా కనిపిస్తే ఇంకా ఎగా దిగా చూస్తోంది.

“ఎంటమ్మా అలా ఊరిదానిలాగా చూస్తున్నావు ? అలా చూడకూడదు” అని లో గొంతుకతో తిడుతున్నాడు ఆకాష్, అప్పుడే అక్కడకి వచ్చి.

“ఇదెక్కడి చోద్యం రా ? నా కళ్ళు నా ఇష్టం” అని గట్టిగా అరిస్తే, తెలుగు వాళ్ళయ్యుంటారు పక్కవారు, వాళ్ళు శైలజ వైపు వింతగా చూశారు.

“చూడు ఎలా చూస్తున్నారో అందరూ మన వైపు, ప్లీజ్ అమ్మా కొంచం జాగ్రత్తగా ఉండు” అని ఆకాష్ కోప్పడ్డాడు.

ఆ మాటల్ని అంతగా పట్టించుకోలేదు శైలజ. పిజ్జా రాగానే మొదటి ముక్క నోట్లో పడగానే బయటకి ఉమ్మేసి ఛీ అని అంది.

“ఏమైంది అత్తయ్యా?” ప్రియ అడిగింది.

“ఏంటిది, ఇంత చీజ్ ని ఎలా తింటారు ! నాకు నచ్చలేదు. నాకు వేరే ఏదైనా కావాలి” అని పిజ్జా ఉన్న ప్లేట్ ని పక్కకి తోసేస్తూ శైలజ చెప్పింది.

మిగితా ముగ్గురికి ఏం చెయ్యాలో అర్ధంకాలేదు. ఆకాష్ చెప్పగా, అందరూ పిజ్జా ని పడేసి కొంచం దూరంలో ఉన్న ఇండియన్ రెస్టారంట్ కి వెళ్లారు.

“ఏవిట్రా ఇది? మసాలా దోస కాదు ఇంకేదో ఇది” దోస చింపి తింటూ శైలజ ఆకాష్ తో అంటోంది.

ప్రియ, ఆకాష్ లు సైలెంట్ గా తినేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండియన్ రెస్టారంట్ కి వచ్చి చాలా కాలం అయింది.

“శైలూ, ప్రతిదానికి వంకలు పెట్టకు. ఇది ఇండియా కాదు కదా, ఇక్కడి వంటలు బాగుంటాయేమో ఎవరికి తెలుసు? ఇదైనా దొరికింది తినటానికి సంతోషించు” అని కుమార్ అన్నాడు.

“అమ్మా, నాన్నా మీరు అంత గట్టి, గట్టిగా మాట్లాడకండి. ఇక్కడ అది పద్ధతి కాదు. ప్లీజ్” అని ఆకాష్ అన్నాడు.

“ఏవిట్రా నువ్వు పద్ధతుల గురించి మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు ఏమయ్యాయి ఏంటి ఇవి?” అని కుమార్ అనగానే అందరూ నవ్వేశారు.

అందరూ తినేశాక “నాకు ఇయ్యి అమ్మా , నీ ప్లేట్ పడేస్తాను నేను” అని ఆకాష్ అన్నాడు.

“మనం పడేయటం ఏంటి? సర్వర్ వచ్చి క్లీన్ చేయడా?”

“లేదు. మనమే చేయాలి”

“ఎంత బాగుందో అమెరికా, అన్నీ మనమే చేసుకోవాలి” అని శైలజ అనగానే, ఆకాష్ తనలో తనే నవ్వుకున్నాడు.

 

మరునాడు సండే అవ్వడంతో అందరూ ఆలస్యంగా లేచారు. శైలజ తీసుకు వచ్చిన కొత్తవకాయ అండ్ అన్నం తో డైరెక్ట్ గా లంచ్ కానిచ్చేశారు. సాయంకాలం ఆకాష్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. కాసేపు కాలక్షేపం చేసేసి ఇంటికొచ్చారు.

“అమ్మా, నాన్నా – మీరు ఉంటున్న మూడు వారాల ప్లాన్ చెప్తాను వినండి. నేను, ప్రియ లాస్ట్ వారం లీవ్ పెట్టాము.  రేపటినుండి మీరు ఇక్కడ సిటి టూర్ కి వెళ్తారు. ముందుగా ప్లాన్ చేసినట్లుగానే సెకండ్ వీక్ హారిక వాళ్ళ ఊరు న్యూ జెర్సీ వెళ్ళండి, అక్కడ సిటి టూర్. లాస్ట్ వారం మాతో గడపండి. ఏం కావాలన్నా కొనుక్కోండి, నా క్రెడిట్ కార్డ్ తీసుకువెళ్ళండి”

“కార్డ్ ఏమి అక్కర్లేదు లే. ప్లాన్ మాత్రం బాగుంది రా. మేము ఎంజాయ్ చేస్తాములే” కుమార్ నవ్వుతూ చెప్పాడు.

ప్లాన్ ప్రకారమే మొదటి రెండు వారాలు శాన్ ఫ్రాన్సిస్కో లో నూ, హారిక, అంటే గాయత్రి కూతురు, ఉండే న్యూ జెర్సీ లోనూ గడిచిపోయాయి. అంటే పొద్దునే లేవటం, తినేసి బస్ ఎక్కటం, సిటి టూర్ బస్ వాడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడకి వెళ్ళడం, ఆ ప్రదేశాలు చూడటం, ఇంటికి రావటం, కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పటం, పడుకోవటం. ఇది రెండు వారాలు జరిగిన తంతు. శైలజ కి బయట తిండి నచ్చక రోజు ఇంట్లోనుండి డబ్బా పట్టుకెళ్ళేది. ఒక్క ఫుడ్ విషయంలో తప్పితే మిగితావి అన్నీ ఎంజాయ్ చేసింది శైలజ. అసలే పల్లెటూరి వాతావరణం లో పుట్టి పెరిగింది. అమెరికా అంటే మోజు. కుమార్ మాత్రం పెద్దగా ఎగ్జైట్ అయ్యేవాడు కాడు. ఎప్పటిలాగానే బాలన్సెడ్ గా ఉండేవాడు. ఇద్దరూ న్యూ జెర్సీ నుండి తిరిగివచ్చేశారు, ఆఖరి వారం రానే వచ్చింది.

 

“ఆకాష్, నేను కొన్ని కొన్నూక్కోవాలి. లిస్ట్ ఇస్తాను” అంటూ ఒక పెద్ద పేపర్ తీసి ఇచ్చింది శైలజ.

“అత్తయ్యా ఎలాగో మనం షాపింగ్ కి వెళ్తున్నాము. మీరు ఇండియా కి పట్టుకెళ్ళాల్సినవి ఇవాళే కొనుక్కోండి” ప్రియ చెప్పులు వేసుకుంటూ చెప్పింది.

“అవును. ప్రియ కి ఎక్కడ చీప్ గా ఉంటాయో తెలుసు అమ్మా. మీ ఊరి బాచ్ కి అవి ఇస్తే చాలు” లిస్ట్ తిరిగిచ్చేస్తూ అన్నాడు ఆకాష్.

“ఏంట్రా ఆ మాటలు? మా వాళ్ళకి నేనేం చీప్ వి తీసుకెళ్లను. మంచి ప్లేస్ కి తీసుకెళ్లమ్మా ప్రియా” అంటూ హాండ్ బాగ్ లో ఆ లిస్ట్ ని పెట్టేసుకుంది.

“ఇలాగే నా డబ్బులు అన్నీ ఖర్చుపెట్టేసేయ్” అని షూస్ వేసుకుంటూ అన్నాడు కుమార్.

“మీ తండ్రి కొడుకులు ఒకటే” అని మూతి తిప్పుకుంటూ చిరుకోపంతో శైలజ అంది.

“నేను ఉన్నాను కదా అత్తయ్యా మీతో. అన్నీ కొనుక్కోండి మంచివే” ప్రియ చెప్పడంతో శైలజ నవ్వింది.

 

వాల్ మార్ట్ కి వెళ్లారు. ‘ఎంత చవకో’ అని అంటూ ఆ రేట్స్ చూసి మురిసిపోయి, ఏది పడితే అది దొరికింది దొరికినట్లుగా షాపింగ్ కార్ట్ లో వేసేస్తోంది శైలజ. అయిదు వందల డాలర్లు బిల్లు చేసింది. ఆకాష్ ఏమి అనలేక చుప్ చాప్ బిల్లు కట్టేశాడు.

వారమంతా ఆకాష్, ప్రియలతో వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి, సినిమాలకి, మాల్స్ కి వెళ్ళి, ఎంతో ఎంజాయ్ చేశారు శైలజ, కుమార్ లు. రేపు ఇండియా ప్రయాణం అనగా ఇవాళ ఇంట్లో ఒక గెట్-టుగెదర్ ఏర్పాటు చేశారు ఇంట్లో. ఫ్యామిలి ఫ్రెండ్స్ , కలీగ్స్ ని పిలిచారు. ప్రియ, శైలజలు కలిపి ఎన్నో వంటలు చేశారు.

“అమ్మా, నాన్నా – ఇదిగో వీడే చరణ్, నాకు మంచి దోస్త్ ఇక్కడ” అని ఆకాష్ పరిచయం చేశాడు.

“బాగున్నావా బాబు, తాగటానికి ఏం తీసుకుంటావు?” అని శైలజ అడిగింది.

“ఏమి వద్దండి”

“బీర్ ఆర్ కోక్?” కుమార్ అడిగాడు.

“ఆహ వద్దండి, థాంక్స్”

“పోనీ కాఫీ, టీ?”

“అలవాటు లేవండి”

“మరి ఏం కావాలి బాబు?” శైలజ అడిగింది.

“హార్లిక్స్” అని చరణ్ అనగానే, చేతుల్లో విస్కీ గ్లాస్ పట్టుకొని ఉన్న కుమార్, ఆకాష్ ల  వైపు ‘చూసి నేర్చుకోండి’ అనే చూపు చూసింది శైలజ.

మెల్లిగా అందరూ తినడం మొదలుపెట్టారు. ప్రియ అమెరికన్ కలీగ్ కేటీ కి ఒక పాప ఉంది. ఇంకా నెలల పిల్ల. చంటిపిల్ల ముద్దుగా ఉంది కదా అని శైలజ ముద్దాడింది. అంతే, కేటీ కెవ్వున అరిచి, ఒక పేపర్ టవల్ తీసుకొచ్చి, చంటి పిల్ల బుగ్గని రుద్ది రుద్ది తుడిచింది. శైలజ కి ఏం అర్ధంకాలేదు, కాస్త భయపడింది కూడా ఆ అరుపుకి. కేటీ కి సారీ చెప్పింది ప్రియ. కేటీ సర్దుకొని ఇంక వెళ్లొస్తాను అని వెళ్లిపోయింది. మిగితా వాళ్ళు కూడా మెల్లిగా వెళ్ళడం మొదలుపెట్టారు. అందరూ వెళ్లిపోయాక ప్రియ ని శైలజ అడిగింది.

“ఏమైంది ప్రియా? నేనేదో అంటరానిదానిని అయినట్టు ఎందుకలా అరిచింది ఆవిడ?”

“ఇక్కడ పిల్లలకి అల్లెర్జీస్ ఈజీ గా వచ్చేస్తాయి అత్తయ్యా. పైగా ఇక్కడ అలా వేరే వాళ్ళ పిల్లల్ని ముద్దు చేయకూడదు, వాళ్ళు ఏడుస్తారు”

“ఎక్కడైనా పిల్లలు ఏడుస్తారుగా, అందులో ఏంటి విడ్డూరం?” శైలజ ముక్కున వేలేసుకొని అడిగింది.

“అంటే ఇక్కడ కాప్స్ ని పిలుస్తారు వెంటనే” ఆకాష్ చెప్పాడు.

“ఈ కాప్స్ ఏంట్రా ప్రతిదానికి, ఏవిటో వింత అమెరికా. అయినా నాకు బాగా నచ్చింది” అని అనేసి లోపలికెళ్లి పెట్టె ఆఖరి సారి సర్దేసి, మూసేసింది.

అలా వారి మొదటి అమెరికా ప్రయాణం పూర్తయింది.

 

మళ్ళీ రెండేళ్ళు అయ్యాక, లాస్ట్ ఇయర్ రెండో సారి ఆకాష్ ఇల్లు కొనుకున్నప్పుడు ఒక నెల కోసం వెళ్లారు. కానీ రెండవసారి ట్రిప్ చాలా బోరింగ్ గా జరిగింది. మొదటి వారం అంతా గృహప్రవేశం తో గడిచిపోయింది. చాలా పెద్ద ఇల్లు, అంతా సందడిగా జరిగిపోయింది.  ఆ వీకెండ్ సినిమాకి వెళ్లొచ్చారు.

 

ఇంటికి తిరిగివస్తూ, ఆకాష్ “అమ్మా, నాన్నా మళ్ళీ మనం వచ్చే శనివారం బయటకి వెళ్దాము. వీకెండ్ మాత్రమే కుదుర్తుంది ఈ వారంలో ప్రియ కి, నాక్కూడా బయటకి రావటానికి. ఒక అయిదు రోజులు మాత్రమే. మీరు ఇంట్లో ఉండవలసి వస్తుంది” అని అన్నాడు.

కుమార్, శైలజలు అయిదు రోజులే కదా అని అనుకున్నారు ముందు. కానీ అసలు సంగతి రోజులు గడుస్తున్న కొద్దీ అర్ధమయింది.  పొద్దునే పిల్లలిద్దరూ పని కి వెళ్లిపోవడం మళ్ళీ రాత్రేప్పుడో తిరిగిరావడం. కుమార్, శైలజలు అప్పుడప్పుడు అలా వీధిలో వాకింగ్ చేసి వచ్చేవారు. లేదంటే ఇంట్లోనే ఉండేవారు. శైలజ అప్పుడప్పుడు బట్టలు మడత పెట్టడం అలాంటి చిన్న పనులు చేసేది. ఇంక వంట గురించి చెప్పక్కర్లేదు, వంట అంతా తానే చేసేది.  అమ్మ చేతి కమ్మని వంట తిని లావు ఎక్కిపోతున్నాడు అని ప్రియ ఆకాష్ ని ఏడిపించింది. మళ్ళీ వీకెండ్ రానే వచ్చింది. ఎక్వేరియమ్ కి బయలుదేరారు అందరూ.

“హమ్మయ్య ఇంటి నుండి బయటకొచ్చాము” అని కుమార్ ఊపిరి పీల్చుకున్నాడు. కూపస్తమండూకం అయిపోయాడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు కుమార్.

“వాల్ మార్ట్ కి వెళ్దామా” అని శైలజ అడిగింది. ఇండియా నుండి వచ్చినప్పటి నుండి వంటింటికే పరిమితం అయిపోయింది. ఎన్నో కొనుక్కోవాలని ఆశతో ఉంది.

“అమ్మా ! క్రిందటి సారి అయితే ఫస్ట్ టైమ్ కదా, అందుకే ఏమి అనలేదు.  ఈ సారి ఖర్చులు ఎక్కువ వద్దమ్మా. నీకు, నాన్న కి మాత్రమే కొనుక్కోండి. ఊర్లో వాళ్ళందరికీ కొనద్దు” అని ఆకాష్ అనగానే శైలజ మొహం చిన్నది చేసుకుంది.

అది గమనించిన కుమార్ టాపిక్ మార్చటానికి “పదండి ఎక్వేరియమ్ చూడాలి నేను” అని అన్నాడు.

అలా ఆ రోజు కాస్త బయట తిరిగి ఇంటికొచ్చారు.

“మానవాడు కొంచం పిసినారి అయ్యాడు” అని శైలజ అంటే “పొదుపు గా ఉన్నాడు అంతే” అని కుమార్ సర్దిచెప్పాడు.

 

ఇంకొక వీకెండ్ అయిపోయింది. మళ్ళీ ఒక అయిదురోజులు ఇంట్లోనే ఉన్నారు శైలజ, కుమార్ లు. కుమార్ టి‌వి చూడటం, శైలజ పుస్తకం చదువుకుంటూ ఉండేది. రోజు ఆదే పని చేయాలన్నా బొరే కదా. లంకంత కొంపలో ఇద్దరూ బిక్కుబిక్కు మని ఉండేవారు.

 

శుక్రవారం రాత్రి ఆకాష్ “నాన్నా, ఈ ఇంట్లో లాన్ ఉంది కదా, నువ్వు గార్డెనింగ్ చెయ్యి. టైమ్ పాస్ అవుతుంది” అన్నాడు.  ఆదే రోజు రాత్రి, ప్రియ అలసిపోయిందని ఆకాష్ వంట చేద్దామనుకున్నాడు. కానీ శైలజ ఉండటంతో, “అమ్మా ఇవాళ బయట తిందామా, ప్రియ వంట చేయలేదు అంట” అన్నాడు “నువ్వే వంట చెయ్యి” అని డైరెక్ట్ గా చెప్పలేక.

శనివారం రాత్రి ఆకాష్, ప్రియలు ఒక పార్టీ కెళ్ళి వచ్చారు. ఆ రోజు అలసిపోవడం వల్ల, సండే అంతా ఇంట్లోనే. ఈ విధంగా ఆ వీకెండ్ కుమార్, శైలజలకు ఇంట్లోనే. కుమార్ కాస్త ఇబ్బంది పడ్డాడు. శైలజ చేత ‘పాటియో’ శుభ్రం చేయించడం,  వంట చేయించడం, గిన్నెలు తోమించడం, ఇల్లు దులపటం, గార్డెనింగ్- ఇవన్నీ కుమార్, శైలజల సహనాన్ని పరీక్షించాయి.

 

“ఇండియా లో ఉంటే మనం బండిలోనో, కాలినడకనో, ఆటొ లోనో బయటకి పోయేవాళ్లం. ఇప్పుడు చూడు, వీళ్ళు తీసుకు వెళ్తే కానీ పోలేము. పైగా వాళ్ళు అలసిపోయుంటారు, బయటకి వెళ్దామని అడగటానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ గార్డెనింగ్, ఇంట్లో వాషింగ్ మెషిన్, ఆ డిష్ వాషర్ మనకి అలవాటు లేవు. నాకైతే మనం ఇక్కడకి పనులు చేయటానికే వచ్చామన్న భావం పెరిగిపోతోంది రోజురోజుకి. ఈ వయసులో మనకి ఇది అవసరమా? చాలు ఇంక. వెళ్లిపోదాం” అన్నాడు కుమార్.

“వాడు ఫీల్ అవుతాడండి” అంది శైలజ. కానీ నిజానికి తనకి కూడా ఇక్కడ నచ్చడంలేదు ఇంట్లో ఉండటం. అసలే కొత్త ఇల్లు, చుట్టుపక్కలా ఇళ్లు చాలా తక్కువ.

“లేదు శైలూ. వాడికి మనం చెప్పేసి వెళ్లిపోదాం” అని ఖరాఖండిగా కుమార్ చెప్పాడు.

మరునాడు ఉదయం.

“ఆకాష్..నేను, అమ్మ ఇండియా కి బయలుదేరుతామురా. మాకు ఇక్కడ కొంచం బోర్ గా ఉంటోంది” కుమార్ పాయింట్ కి వచ్చేశాడు.

“అదేంటి సడన్ గా?”

“మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యేది ఇంకోటి”

“అంటే ? నేను కానీ ప్రియ కానీ ఏమైనా తప్పుగా అన్నామా?”

“అలాంటిదేమీ లేదు. మేము ఇద్దరం అమెరికా అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. కానీ కలలు వేరు నిజాలు వేరు. మేము రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కష్టపడుతున్నాము. నిజం చెప్పాలంటే అక్కడ మన ఇంటి పనోడు చేసే పనులు మేం ఇక్కడ చేస్తున్నాము”

“అదేంటి నాన్నా, మన ఇంటి పనులు మనం కాకపోతే ఎవరు చేసుకుంటారు?”

“అక్కడ పనులు చేసుకొని అలా బయటకి వెళ్లొచ్చు ఒకళ్ల మీద ఆధారపడకుండా. ఇక్కడ అలా కుదరదు.  ఈ ప్రపంచంలో మేము ఇమడలేము రా”

“అయితే అందరి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారా? మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంతో మంది ఇక్కడ ఆరు నెలల పాటు ఉంటారు”

“వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. మాకు ఇక్కడ నచ్చలేదు. మా మానాన మమ్మల్ని వదిలేయి”

“అలాగే నాన్నా, మీ ఇష్టం” ఇంక ఏమీ వాదనలు చేయకుండా ఓకే అనేశాడు ఆకాష్.

 

ఏంటి శైలూ నిద్ర పట్టట్లేదా అన్న కుమార్ మాటలతో వర్తమానం లోకి వచ్చింది శైలజ.

“అవునండి”

“అమెరికా ఎందుకు వద్దంటున్నావు?”

“అక్కడ బోర్. ఫస్ట్ ట్రిప్ లో అన్నీ ప్లేసెస్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసి, ఆ తరువాత నుండి కష్టాలు మొదలు.  ఒకప్పుడు నేను ఆహా ఓహో అనుకున్నవన్నీ ఇప్పుడు నాకు నచ్చడంలేదు. అన్నీ పనులు మనమే చేసుకోవాలి. పిల్లలు బిజీ ఉంటారు, మనల్ని బయట తిప్పలేక, ఇంట్లో కూర్చోబెట్టలేక సతమతమవుతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరమా మనకి? మనల్ని చూడాలనిపిస్తే వాళ్ళే వస్తారు. నాకు నిద్ర వస్తోంది. గుడ్ నైట్” అని ఏదో బరువు వదిలిపోయినట్లు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది.

 

—-

మరునాడు ఉదయం ఆకాష్ శైలజ సెల్ కి కాల్ చేశాడు.

“అమ్మా, నాన్న ఉన్నారా పక్కన?” ఆకాష్ ఉత్సాహంగా అరుస్తున్నాడు.

“ఉన్నారు ఉన్నారు ఎంటా అరుపు….. ఇస్తున్నా…. ఆగు”

“ఇయ్యకర్లేదు. స్పీకర్ ఆన్ చేయండి”

“స్పీకర్ ఆన్, చెప్పరా” అన్నాడు కుమార్.

“ప్రియ ప్రెగ్నంట్ యాహూ” అని ఆకాష్ అరిచాడు.

ఆకాష్ కి కంగ్రాట్స్ చెప్పేసి, ప్రియ కి జాగ్రత్తలు చెప్పి. శైలజ, కుమార్ లు ఒకళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. మూడవ సారి అమెరికా ప్రయాణం తధ్యం.

 

********************************************************************

మీ మాటలు

 1. వనజ తాతినేని says:

  :) ముంగింపు నచ్చింది . తల్లిదండ్రులంటే అంతే మరి .

 2. AMBALLA JANARDHAN says:

  కథ పరవాలేదు. ఏ మాత్రం కొత్తదనం లేదు. అమెరికాలోని పిల్లల పిల్లలకు వారు పుట్టక ముందునుంచే సపర్యలు చేయడానికి తల్లిదండ్రులు వెళ్ళడం ఇప్పుడు సర్వసాధారణమయింది. అక్కడ మనం చేసే పని పనివాలల పనా ? లేక మన పిల్లలకు సహాయం చేస్తున్నామా ? అనేది మనం అనుకోడం లోనే ఉంది. నాకు తెలిసిన ఓ ప్రబుద్ధుడు మొదటి ప్రసవం తల్లిగారింట్లో జరగాలి కాబట్టి, తన అత్తా మామలు స్వఖర్చుతో అమెరికా వచ్చి అక్కడి ఆస్పత్రి ఖర్చు కూడా వారే పెట్టుకోవాలని పట్టుపట్టాడు. అదే మన దేశం రమ్మంటే, ఆ అమ్మాయి ససేమిరా అంది. అక్కడి సిటిజన్ షిప్ కావాలి కాని, ఖర్చులు మాత్రం అత్తమామలు పెట్టుకోవాలి. విదేశీ సంబందం మోజులో పడ్డ పాపానికి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు, దేవుడా అని, తమ అమ్మాయి, అల్లుడి గొంతెమ్మ కోరికను తీర్చారు.

 3. నేను కూడా ఇలాంటి సంఘటనలనే ఆధారం చేసుకొని కథ ని కొంచం ఫన్నీ గ నడిపించాను. నా కథ చదివినందుకు ధన్యవాదాలు.

 4. విన్నకోట నరసింహారావు says:

  ఇదే తరహాకి చెందిన మరొకరి అనుభవం. ఈ పని చెయ్యడానికి విదేశాలకి వెళ్ళి వస్తుండడానికి నిరాకరించిన దంపతుల వైనం క్రింది లింక్ లో చదవచ్చు.
  http://www.themetrognome.in/grey-space/why-i-refused-to-take-care-of-my-grandkids

 5. విన్నకోట నరసింహారావు says:

  ఇందాకటి వ్యాఖ్యలో చెప్పడం మరచాను. “వాకిలి” అనే జాలపత్రిక ఆగస్ట్ 2013 సంచికలో శ్రీమతి సుజాత బెడదకోట గారు కూడా ఈ తరహా కథొకటి వ్రాసారు. అది క్రింది లింక్ లో చదవచ్చు.

  http://vaakili.com/patrika/?p=3559

  ఇటువంటి కథలు చాలానే ఉన్నాయి, కొత్తదనమేముంది అని కాదు ప్రశ్న. ఇది సమకాలీన సమస్య. అందువల్ల అనుభవాలు అవే అయినా ఈ సబ్జెక్ట్ మీద కథలు వస్తూనే ఉంటాయి.

  ఇప్పుడంటే తల్లిదండ్రులని పిలిపించుకోవడం సామాన్యమయిన విషయమయిపోయింది కానీ చాలా దశాబ్దాల క్రితమే (1950లు, 1960లు, 1970లు) విదేశాలకి వెళ్ళి స్ధిరపడిన వారు ఇటువంటి వ్యవహారాలని (అంటే భార్య కానుపు, పసిబిడ్డల పెంపకం) ఎలా చూసుకున్నారు అనే సందేహం నాకెప్పుడూ కలుగుతుంటుంది. బహుశా ఆ కాలంలో భార్య కూడా ఉద్యోగం చేస్తుండడం కొంచెం అరుదేమో?

  • నరసింహారావుగారు, ముందుగా నా కథ చదివి, స్పందించినందుకు ధన్యవాదాలు. నేను అమెరికా లోనే ఉంటున్నాను. నా చుట్టురా ఫ్రెండ్స్ ఇళ్ళలో కాని, నా కజిన్స్ ఇళ్ళలో కాని జరిగిన సంఘటనలు చూసి ఈ కథ రాయటం జరిగింది. మీరు అన్నట్లు ఇదొక కంటెంపరరి ఇష్యూ. కాని ఇది ఒక సమస్య గా చాలా మంది పిల్లలు కాని, తల్లి తండ్రులు కాని అనుకోవడంలేదు. నడిచినంత కాలం నడిపిద్దాం అనే దృష్టితోనే ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న నాక్కూడా కలిగింది. 90స్ లో అయితే ఉద్యోగం లేకపోయినా ఆడవారు ఏదొక చిన్న బిజినెస్ చేసేవారు. మరి అంతక ముందు సంగతి కనుక్కోవాలి.

మీ మాటలు

*